కరనాగభూతం కథలు – 6 వాసన లేని మురుగు

0
8

[box type=’note’ fontsize=’16’] బేతాళ పంచవింశతి లాగే కొత్త థీమ్‌తో కరనాగభూతం అనే శీర్షికతో వసుంధర సృజించిన పిల్లల కథలను అందిస్తున్నాము. [/box]

[dropcap]అ[/dropcap]ర్ధరాత్రి కాగానే రాజు పింగపాంగుడు పక్కమీంచి లేచి జిట్టీభనాథుడి ప్రార్థనా మందిరంలో ప్రవేశించాడు. అక్కడ అతడి కోసం ఎదురుచూస్తున్న కొండచిలువ వెంటనే నిలువెత్తున లేచి, “రాజా! పదవిలో ఉన్నవారికి ఆరోగ్య సమస్యలుంటే కావాలనుకున్నా జనాలకి సాయపడలేరు. అది గ్రహించిన మల్లన్న అనే సామాన్య రైతు, ఓ అధికారి స్వస్థత కోసం స్వసుఖాన్నే త్యాగం చేశాడు. నీ పౌరులకు అలాంటి అగత్యం పట్టకూడదన్న ఉద్దేశంతో, ఇప్పుడు నీకా కథ చెబుతున్నాను” అంటూ కథ చెప్పసాగింది.

అనగనగా మసకదేశం. అందులో పరిమళ గ్రామం. ఆ గ్రామంలో మల్లన్న అనే సన్నకారు రైతు. అతడి భార్య అవంతి అనుకూలవతి. కొడుకులు రాము, సోము బుద్ధిమంతులు. వాళ్లకి పొరుగునే ఉంటున్న శేషాద్రిదీ అలాంటి కుటుంబమే. శేషాద్రి ఇంట్లో వాళ్లంతా స్నేహపాత్రులు కావడంతో- రోజులు సుఖంగా వెళ్లిపోతున్నాయి మల్లన్నకి.

ఒకసారి ఊళ్లో పెద్దగా వాన పడి ఊరంతా జలమయమైంది. నీరు తగ్గేక చూస్తే ఊళ్లో బాటలన్నీ పాడయ్యాయి. వీధిలో ఇళ్ల ముందున్న మురుగుకాలువలకు పైకప్పు కొట్టుకుపోయి వీధంతా దుర్గంధమయమైంది.

గ్రామాధికారి పేర్రాజు వెంటనే రంగంలోకి దిగి ఊళ్లో తనకీ, తన బంధుమిత్రులకీ అవసరపడే బాటలు కొన్ని మరమ్మతు చేయించాడు. అంతటితో ఉన్న నిధులు ఐపోయాయనీ, కొత్తగా నిధులు సమకూరితేనే మిగతా మరమ్మతులు చేయిస్తాననీ అన్నాడు పేర్రాజు. చేసేదిలేక మిగతావాళ్లంతా అలాగే సద్దుకుపోతున్నారు.

ఐతే మల్లన్న వీధిలో వాళ్ల పరిస్థితి వేరు. మురుగుకాల్వకు కప్పు లేకపోవడంవల్ల బయటకొచ్చే దుర్గంధం భరించడం కష్టంగా ఉంది. అందుకని వీధివాళ్లంతా కలిసి, చందాలు వేసుకుని ఆ డబ్బుతో మురుగుకాల్వ కప్పు మూయిద్దామనుకున్నారు. కానీ ఆ మురుగుకాల్వ గ్రామానికి చెందినదనీ, దాని మరమ్మతు విషయంలో ఇతరులు జోక్యం చేసుకోరాదనీ పేర్రాజు శాసించాడు.

వాసన భరించలేక ఆ వీధిలోవాళ్లు పగలంతా పొలం పనుల్లో గడుపుతున్నారు. పిల్లలు తిండి తినడానికి తప్ప మిగతా సమయాల్లో బయటే ఉంటున్నారు. ఆడవాళ్లు ఇంటికి నలువైపులా తలుపులు బిగించి ఇంటిపనీ వంటపనీ చేస్తున్నారు. రాత్రిళ్లు ఇంటిల్లపాదీ తలుపులన్నీ మూసేసి, ఉక్కని భరిస్తూ పడుకునేవారు.

అలా కొన్నాళ్లు జరిగేక, వీధివాళ్లంతా శేషాద్రిని కలుసుకుని, ఈ సమస్యకు పరిష్కారం చూడమని కోరారు. అప్పుడు శేషాద్రికి, రాజధానిలో రాజు కొలువులో పని చేస్తున్న తన బంధువు సునందుడు గుర్తుకొచ్చాడు. వెంటనే ఊరిబాటల మరమ్మతుకు జరుగుతున్న జాప్యం గురించి ఓ లేఖవ్రాసి అతడికి పంపాడు. సునందుడా లేఖని ఆ వ్యవహారం చూసే నికాముడు అనే అధికారికి అందజేశాడు. దాంతో నికాముడు పరిమళ గ్రామానికి వెళ్లి, పేర్రాజు ఇంట బస చేశాడు. ఊరంతా తిరిగి పరిస్థితి చూశాడు. మల్లన్న వీధిలో ఇంటింటికీ వెళ్లాడు. ఐతే పేర్రాజు ఆయన్ని ఎవరితోనూ మాట్లాడనివ్వలేదు. తనే పరిస్థితిని వివరించాడు. ఎక్కడెక్కడ మరమ్మతులు అవసరమో, తనే జాబితా వేసి ఆయనకు చూపాడు. నికాముడాయనకు తగిన నిధులు మంజూరు చేసి తిరిగి రాజధానికి వెళ్లాడు.

వెంటనే ఊళ్లో మరమ్మతుల పని మొదలైంది. ఇంకా పని జరుగుతుండగానే, మల్లన్న శేషాద్రిని తెగ పొగిడి, “ఆ పేర్రాజుకి బదులు నువ్వు గ్రామాధికారివైతే ఈ పని ఎప్పుడో జరిగుండేది” అన్నాడు. అంతే- ఆ నోటా ఈ నోటా ఆ విషయం పేర్రాజుని చేరింది. ఆయనకి కోపమొచ్చి, ఒక్క మల్లన్న ఇంటిముందు మురుగుకాల్వకి మాత్రం కప్పు మూయించలేదు. అదేమంటే నిధులు ఐపోయాయనీ, మళ్లీ కొత్త నిధులు వచ్చేకనే ఆ కాస్త పనీ చేయిస్తాననీ అన్నాడు.

తనని పొగిడినందుకు పేర్రాజు మల్లన్నమీద పగ తీర్చుకున్నాడని గ్రహించిన శేషాద్రి మళ్లీ సునందుడికి కబురంపాడు. ఆ వెంటనే నికాముడు పరిమళ గ్రామానికొచ్చి పేర్రాజుని కలుసుకుని సంజాయిషీ అడిగాడు. దానికి పేర్రాజు, “ఆ మల్లన్న పేచీకోరు మనిషి. తన ఇంటిముందు మురుగు కాల్వ కప్పు మూయించలేదని ఉక్రోషపడి, నీకు ఫిర్యాదు పంపాడు కానీ, దానివల్ల అతడొకొచ్చిన నష్టమేం లేదు. అది వాసన లేని మురుగు. అతడింటికి వెడితే ఆ విషయం నీకే స్పష్టమౌతుంది” అని చెప్పాడు.

నికాముడు పేర్రాజుతో ఊరంతా తిరిగి, మరమ్మతుల పని సక్రమంగా చేసినందుకు మెచ్చుకున్నాడు. తర్వాత పేర్రాజు ఆయన్ని మల్లన్న ఇంటికి పంపుతూ, “మల్లన్న నోరు విప్పాడంటే అవాకులూ, చెవాకులూను. నువ్వతణ్ణి నోరెత్తనివ్వకుండా ఆ ఇంట్లో కాసేపు తిరిగి వెనక్కి వచ్చేసేయ్” అని చెప్పాడు. నికాముడు సరేనని మల్లన్న ఇంటికెళ్లి కాసేపున్నాడు. ఉన్నంతసేపూ మల్లన్నని నోరు విప్పనివ్వలేదు. వెళ్లేటప్పుడు ఆయన, “నీ ఫిర్యాదులో పస లేదు. మళ్లీ ఇలాంటి తప్పుడు ఫిర్యాదులు చేస్తే నీకు శిక్ష పడుతుంది” అని హెచ్చరించాడు.

ఊరి మొత్తానికి తనొక్కడి ఇంటిముందే మురుగుకాల్వకు కప్పు లేదు. ఆపైన తనా కాల్వ స్వంతంగా మరమ్మతు చేయించరాదని పేర్రాజు శాసనం. దాంతో మల్లన్నకి ఉక్రోషమొచ్చి, పెరట్లో విసురుగా నడవడంలో జారిపడ్డాడు. కాలు నొప్పి చేసింది. కుంటుకుంటూ ఇంట్లోకొచ్చాడు. బెణుకే కదా కాసేపటికి తగ్గిపోదా అనుకుంటే మర్నాటికి కాలు వాచింది.

అవంతి కొడుకుని వైద్యుడింటికి పంపింది. కానీ వైద్యుడు సకుటుంబంగా యాత్రలకి వెళ్లేడనీ, తిరిగి రావడానికి నెలపైనే పట్టొచ్చుననీ తెలిసింది. చేసేదిలేక శేషాద్రిని సలహా అడిగాడు. ఆయన మాత్రం చెయ్యగలిగిందేముంది? “వైద్యుడొచ్చి చికిత్స మొదలెట్టేదాకా ఇల్లు కదలకు. నీకేదైనా అవసరమైతే ఆ పనులు నేను చేస్తాలే” అన్నాడు.

మల్లన్న సమస్య పనులు కాదు. అవి కొడుకులు చూడగలరు. ఒకటి కాలి నొప్పి భరించడం. రెండు – కాలు కదుపలేని తను రోజంతా ఇంట్లోనే ఉండాలి. తలుపు తీస్తే వాసన. మూస్తే ఉక్క. ఇలా ఎన్నాళ్లు? “దేవుడా, ఏదో అద్భుతం జరిగి, నా కాలు వెంటనే బాగుపడేలా చెయ్యి” అని అతడు దేవుణ్ణి ప్రార్థించాడు.

మర్నాడే ఆ ఊరికి ఓ సాధువు వచ్చాడు. ఆయన సామాన్యుడు కాదనీ, ఆయనవద్ద ఎన్నో మహిమలున్నాయనీ ఊళ్లో చెప్పుకుంటుంటే, శేషాద్రి వెళ్లి సాధువుని మల్లన్న ఇంటికి తీసుకొచ్చాడు.

మల్లన్న సాధువుకి తన సమస్య చెప్పుకున్నాడు. ఆయన కాసేపాలోచించి, “నావద్ద ఒక మూలిక ఉన్నది. అది తీసుకుంటే ఏ వ్యాధి ఐనా ఇట్టే నయమౌతుంది. ఐతే అది ఒక్కరికే, అదీ పరోపకారులకు మాత్రమే పనిచేస్తుంది. పదిమందికి సాయపడే పదవిలో ఉన్న నికాముడనే ఓ రాజాధికారికి కొన్ని ఆరోగ్య సమస్యలున్నాయి. గాలి మార్పుకోసం వైద్యుల సలహామీద ఆయన రేపీ ఊరొస్తున్నాడు. పరోపకారులకి సాయపడ్డం నాకిష్టం కాబట్టి, ఆయనకోసం ఈ మూలికను సేకరించి ఈ ఊరొచ్చాను. కానీ నీ పరిస్థితి చూసి జాలిపుట్టి, ఈ మూలికను నీకిస్తున్నాను. నీకే వాడుకుంటావో, నికాముడికిస్తావో అది నీ ఇష్టం. బాగా ఆలోచించుకో” అన్నాడు.

మల్లన్న ఆలోచించాడు. నిజానికి నికాముడికివల్ల ఊరికి మేలు జరిగింది. తనకు అన్యాయం జరిగినా, ఆ తప్పు పేర్రాజుదే కానీ ఆయనది కాదు. ఇలా ఆలోచించి, “స్వామీ! ఈ మూలిక నికాముడికివ్వడమే న్యాయం. ఐతే నాదొక్క మనవి. రేపు తమరు నికాముణ్ణి కలిసి ఈ మూలికను మా ఇంటికొచ్చి నానుండి తీసుకోమని చెప్పండి” అన్నాడు మల్లన్న.

సాధువు నవ్వి, “నీ నిర్ణయంలో పరోపకారమే కాదు. తెలివి కూడా ఉంది” అని మెచ్చుకుని వెళ్లాడు. తర్వాత అంతా మల్లన్న కోరినట్లే తెలిసింది. మర్నాడు సాధువు, నికాముణ్ణి వెంటబెట్టుకుని మల్లన్న ఇంటికెళ్లాడు. నికాముడు మల్లన్నతో, “అప్పుడలా ఎందుకు చేశావో తెలీదు కానీ- నువ్వు నిస్వార్థపరుడివనీ, పరోపకారివనీ ఇప్పుడనిపిస్తోంది. నాకు వ్యాధి నయమైతే నీవు కోరినదిస్తాను” అన్నాడు.

మల్లన్న అతడికి మూలికనిచ్చాడు. ఆయన దాన్ని నమిలి మింగాడు. అంతే కొద్ది క్షణాల్లో అతడు చటుక్కున అక్కణ్ణించి పరుగుతీశాడు. మల్లన్న తెల్లబోయి చూస్తుంటే, “నాయనా! నీ కాలి నొప్పికి కారణం, మామూలు బెణుకే! ఇన్న్నాళ్ల విశ్రాంతి తర్వాత అది తగ్గిపోయుండాలి. ప్రయత్నించి లేచి వెళ్లి నికాముణ్ణి కలుసుకో. ఆయన నీకిచ్చిన మాట నిలబెట్టుకుంటాడు” అన్నాడు సాధువు.

మల్లన్న లేచి నిలబడితే, కాలుకి ఏ నొప్పీలేదు. సాధువు మాట నిజమైనందుకు అబ్బురపడుతూ బయటికెడితే – నికాముడు ఇంటిబయట అల్లంత దూరాన ఆగి మల్లన్నకోసం ఎదురుచూస్తున్నాడు.

ఆ తర్వాత మల్లన్న ఇంటిముందు మురుగుకాల్వకి కప్పు పడింది. మల్లన్నకి నూరు వరహాల కానుక కూడా లభించింది. గ్రామాధికారికి పదవి పోయింది. ఆ పదవి శేషాద్రికి లభించింది.

కొండచిలువ ఈ కథ చెప్పి, “స్వయంగా వెళ్లి చూసినా మల్లన్న సమస్యని పట్టించుకోని నికాముడు పరోపకారి ఎలా అయ్యాడు? తన కాలినొప్పిని కాదని, మల్లన్న నికాముడికి మూలిక ఎందుకిచ్చాడు? మూలిక నమిలిన నికాముడు సాధువుకీ, మల్లన్నకీ వెంటనే కృతజ్ఞతలు తెలపడానికి బదులు అక్కణ్ణించి పారిపోయాడెందుకు? అసలు నికాముడికి ఆరోగ్యసమస్య ఉందా, లేదా? ఉంటే – ఎవరూ చెప్పనిదే, ఆ సమస్య గురించి సాధువుకెలా తెలిసింది? ఇంతకీ మూలిక నికాముడి వ్యాధికా, మనసు మార్చడానికా? తెలిస్తే నా ఈ సందేహాలకి సరైన సమాధానం చెప్పి నా ఆకలి చల్లార్చు. లేదా నగరంలోకి వెళ్లి నీ పౌరుల్ని తిని నా ఆకలి తీర్చుకుంటాను” అంది.

దీనికి పింగపాంగుడు ఏమాత్రం తడుముకోకుండా ఇలా బదులిచ్చాడు: “నికాముడు పరోపకారి. అందుకే గ్రామానికి వెంటనే ధనం మంజూరు చేశాడు. బహుశా ఆయనకు వాసన తెలియని జబ్బుండాలి. అందుకే మల్లన్న ఇంటికెళ్లి కూడా లోపలికొచ్చే దుర్గంధ సమస్యని గుర్తించలేదని సాధువుకి అర్థమయింది. పదిమందికి సాయపడే పదవిలో ఉన్నవాడికి అలాంటి సమస్య ఉండకూడదనే సాధువు ఆయనకోసం మూలిక తెచ్చాడని మల్లన్నకీ అర్థమైంది. తన కాలినొప్పి తగ్గితే తనకొక్కడికే ప్రయోజనం. నికాముడికున్న జబ్బు నయమైతే తనలాంటి ఎందరికో ప్రయోజనం – అని గ్రహించి మల్లన్న మూలికని నికాముడికిచ్చాడు. ఆ మూలిక నమలగానే నికాముడికి వాసన తెలియడం మొదలైంది. వాసన భరించలేకనే ఇంట్లోంచి పరుగెత్తాడు. ఆ తర్వాత ఏం జరగాలో అదే జరిగింది” అన్నాడు.

అది సరియైన సమాధానం కావడంతో కొండచిలువ నేలకు వ్రాలి చుట్టలు చుట్టుకుని నిద్రకు పడింది. రాజు తన అంతఃపురానికి తిరిగి వెళ్లాడు.

(వచ్చే ‘సంచిక’లో కరనాగభూతం 7వ కథ)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here