కర్మయోగి

6
9

[శ్రీయుతులు కొండూరి కాశీ విశ్వేశ్వరరావు, రావులపల్లి ఉమామహేశ్వరరావు సంయుక్తంగా రచించిన ‘కర్మయోగి’ అనే కథని అందిస్తున్నాము.]

[dropcap]వి[/dropcap]నోద్ రామ్ సునంద దంపతులకు ఇద్దరు పిల్లలు. అమ్మాయి మనీష చదువు పూర్తి చేసుకొని ఉద్యోగం చేస్తోంది. కొడుకు జిపిన్ ఇంకా డిగ్రీ చదువుతున్నాడు. “మనీష పెళ్ళి అయిన తరువాత మంచి సంబంధం చూసి వీడి పెళ్ళి కూడా చేస్తే మన బాధ్యతలు తీరిపోతాయి. అప్పుడు మనం సొంత ఇల్లు కట్టుకోవచ్చు” అనుకునేవారా దంపతులు.

తమ చదువు కోసం, పెళ్లిళ్లు చేయటం కోసం, అమ్మా నాన్నలు బాగా కష్టపడుతున్నారని గ్రహించింది మనీష.

మనీష పనిచేసే కంపెనీలోనే రోషన్ కూడా పనిచేస్తున్నాడు. బుద్ధిగా ఉద్యోగం చేసుకుంటున్న ఉత్తముడు. అతను అందగాడైనా, అమ్మాయిల వైపు అసలు చూడనే చూడడు. అదే మనీషకు బాగా నచ్చింది. అది కాస్తా అలా.. చూస్తూ.. చూస్తూ.. ప్రేమగా మారిపోయింది.

ఒక రోజు మనీష రోషన్ ఇంటికి వెళ్లింది భయంతోనే. రోషన్ తండ్రి రాజ్ పాల్ చాలా గంభీరంగా ఉండే స్వభావం గలవాడు. తమకు బాగా ఆస్తి, డబ్బు ఉందనే గర్వం అతని గోల్డ్ ఫ్రే కళ్లద్దాల నుండీ చూస్తున్నప్పుడు ఎవరికైనా ఇట్టే అర్థమైపోతుంది.

ఏకంగా మనీషయే ఇంటికి వచ్చి పెళ్లి విషయాలు చర్చించటం, రోషన్ తండ్రి రాజ్ పాల్‌కి ఏ మాత్రం నచ్చలేదు. “మీ ఇంట్లో పెద్దవాళ్లు ఎవరూ లేరా! నీ పెళ్ళి గురించి నువ్వే వచ్చి మాట్లాడతావా?” అంటూ మనీషను కోపగించుకున్నాడు. కానీ మనీష మాత్రం భయపడకుండానే, నిగ్రహంగా ఉంది. ఇంతలో కాబోయే అత్తగారు వచ్చి, భర్తకు సర్థి చెప్పింది. ఇంటికి వచ్చిన వారితో మాట్లాడే పద్ధతి అది కాదని ఆవిడ చెప్పటంతో, రాజ్ పాల్ కొద్దిగా శాంతించాడు.

ఆ తరవాత ఒక మంచిరోజు చూసుకొని, భార్యతో కాబోయే వియ్యంకుడు వినోద్ రామ్ ఇంటికి వెళ్ళారు. వినోద్ రామ్ ఇంకా అద్దె ఇంట్లో ఉండటం చూసి – ఆస్తి, అంతస్తులు కూడా తక్కువేనన్న భావన రాజ్ పాల్‌లో కలిగింది. అక్కడ కేవలం కాఫీలు మాత్రమే తాగారు. టిఫిన్లు అవీ తినకూడదని భార్యతో ముందుగానే గట్టిగా చెప్పేశాడు రాజ్ పాల్. ఆవిడ మాత్రం ఏం చేస్తుంది? ఆయన గారి మాటలు వినటం తప్ప! ఎలా అయినా ఈ సంబంధం కుదరాలని వేయి దేవుళ్లకు మొక్కుకుంది.

ఇక పెళ్లి కట్న కానుకలు, ఇచ్చి పుచ్చుకోవటాలు, పాటించవలసిన సాంప్రదాయాల గురించి ఉభయులూ చాలానే చర్చించుకున్నారు. మొత్తానికి తన పట్టుదలను వీడి, ఒక మెట్టు కిందకు దిగి, కొడుకు రోషన్‌తో మనీష వివాహానికి ఒప్పుకున్నాడు రాజ్ పాల్.

***

మనీషను ఎంత గారాబంగా పెంచినా, ఇంట్లో అన్ని పనులూ చేయడం నేర్పించారు. ఇంకా వారం రోజుల్లో కూతురు మనీష అత్తారింటికి వెళ్ళిపోతే, ఇల్లంతా బోసిపోతుంది కదూ అని భార్య సునందతో చెపుతూ కన్నీళ్లు పెట్టుకున్నాడు వినోద్ రామ్. కానీ ఆమె మాత్రం ఎలాంటి విషయంలోనూ, తన బాధను బయటకు వ్యక్తపర్చదు. బాధలను గుండెల్లోకి దిగమింగ గల్గిన శక్తి గలదే స్త్రీ స్వరూపం.

బావమరిది జనార్దన్‌కు ఏ పని చెప్పినా, వెంటనే చేసేస్తాడు, కానీ కమీషన్లు మాత్రం ఎక్కువ మొత్తాల్లో నొక్కేస్తాడు జనార్ధన్. అందుకోసమే కదా! కూతురు పెళ్లి పనులన్నీ సాధ్యమైనంతవరకూ తానే స్వయంగా చేసుకుంటున్నాడు వినోద్ రామ్. ఆ విషయాన్ని గ్రహించాడేమో జనార్దన్!

“ఓ బావా నువ్వు ఈ మధ్య నాకు పనులే చెప్పటం లేదు. ఎందుకు?” అని ఒక వెకిలి నవ్వు పారేశాడు బావమరిది జనార్ధన్! బావమరిది చిలిపి ప్రశ్నకు ఓ చిరునవ్వు నవ్వాడు వినోద్ రామ్.

“ఈ బాధలు మనకు ఎప్పుడూ ఉండేవేనండీ! ఇది మన అమ్మాయి పెళ్ళి శుభసమయం. మీరు ఇంకా హుషారుగా ఉండాలి, అర్థమయ్యిందా!” అని భార్య చెప్పిన ప్రోత్సాహపు మాటలు వినోద్ రామ్‌కి టానిక్‌లా పనిచేశాయి. దాంతో పెళ్ళి పనుల్లో చలాకీగా దూసుకుపోతున్నాడు.

పెళ్ళి మండపం ఫోకస్ లైట్ల కాంతితో ధఘధఘా మెరిసిపోతోంది. పురోహితులు వేదమంత్రాలను చదువుతూన్నారు! అక్షితలతో కూడిన మంగళసూత్రం గల పళ్లెంను పెళ్ళివారి దగ్గరకు తీసుకువెళుతున్నారు. ఒక ప్రక్క సన్నాయి మేళం, మరొక ప్రక్క పురోహితుల శాస్త్ర యుక్త మంత్రోచ్చారణతో కళకళలాడుతోంది మనీష రోషన్‍ల కళ్యాణ మహోత్సవం.

పెళ్ళి సుమూహర్తం దగ్గరపడుతోంది. పట్టు చీరలు, ఓణీలు, పంచె కండువాలతో మరింత మెరిసిపోతున్నారు పెళ్లివారంతా. అతిథులు సంతోషంగా కళ్యాణవేదికపై జరుగుతున్న పెళ్లిని తిలకిస్తున్నారు. అక్కడ ఒకరి మాటలు ఇంకొకరికి వినపడటం లేదు. ఎవరైనా గట్టిగా అరిస్తేగానీ ఎదుటివాళ్లకు వినిపించటం లేదు. ఒకవేళ ఎవరైనా తుమ్మినా, అది కాబోయే వివాహానికి అడ్డంకిగా మారి, పెళ్లి ఆగిపోయే ప్రమాదం ఉంది. అందుకేనేమో పెళ్లి ముహుర్తానికి గట్టి మేళం వాయిస్తారు. పురోహితుల మంత్రోచ్చారణ.. “అయోధ్యా మథురా మాయా కాశీ కాంచీ అవంతికా! వైశాలి ద్వారకా ధ్యేయ పురీ తక్షశిలా గయా!!”

ఈ సాంప్రదాయాలన్నీమన పూర్వీకులు ఎన్నో ఆలోచించి నిర్ణయించారు కాబట్టే, మన వివాహ వ్యవస్థ నిర్విఘ్నంగా ముందుకు సాగిపోతోంది.

రాజ్ పాల్ దగ్గరకు పురోహితుడు మంగళసూత్రం గల అక్షింతల పళ్ళెంతో వచ్చాడు. కానీ రాజ్ పాల్ ఆ సమయంలో ఎంతో కోపంగా ఉన్నాడు. అతని ముఖం కందగడ్డలా ఎర్రగా మారిపోయింది. “మీకు ఇవ్వవలసిన కట్నం డబ్బు ఇంకా చేతికి రాలేదు. అలాగే రెండు బంగారు ఆభరాణాలు కూడా సమయానికి ఇవ్వలేకపోతున్నాను” అని కాబోయే వియ్యంకుడిని క్షమించమని ప్రాధేయపడ్డాడు వినోద్ రామ్.

అయినా రాజ్ పాల్ మాత్రం అతని మాటలను ఏ మాత్రం పట్టించుకోవటం లేదు. ససేమీరా ఒప్పుకోలేదు. “బావగారూ, మీరు ఇప్పుడు కట్నం డబ్బు, రెండు బంగారు ఆభరణాలు ఇస్తేనే, మా అబ్బాయి మీ అమ్మయి మెళ్లో తాళి కడతాడు. లేకుంటే పెళ్ళి కాన్సిల్” అని కర్కశంగా అన్నాడు.

ఇప్పుడు తక్షణమే చేయవలసిన కర్తవ్యం ఏమిటి? అని వినోద్ రామ్ ఏ ఒక్కరికీ మనోవేదనతో చెప్పలేనంత బాధపడుతున్నాడు. ఆ సమయంలో అతనికి గుండెల్లో నెప్పిగా అన్పిస్తే, ఒక ప్రక్కగా వెళ్ళి అక్కడ కూలబడి పోయాడు. అయ్యో! తన స్నేహితుడికి ఏదో ఐపోతుందని కంగారుగా వచ్చిన మహేష్, వినోద్ రామ్ ఛాతీపై గట్టిగా రుద్దసాగాడు. “మహేష్ నాకు ఏమీ కాలేదు కానీ, రాజ్ పాల్ ప్రవర్తన నన్ను మానసికంగా కృంగదీసింది.” అని అతను కట్నం డబ్బు గురించీ, రెండు ఆభరణాల గురించీ కఠినంగా మాట్లాడిన తీరును తన ప్రాణస్నేహితుడైన మహేష్‌కి చెప్పాడు. అప్పుడు అతని గుండెల్లోని బాధ, నెప్పి తగ్గుముఖం పడుతున్నట్లనిపించింది.

తన స్నేహితుడి మనోవేదనను అర్థం చేసుకున్నాడు మహేష్. రాజ్ పాల్ అమానుష ప్రవర్తనతో మహేష్‌కి కోపం తారాస్థాయికి చేరింది. ఎట్టి పరిస్థితులలోనూ ఈ పెళ్లి ఆగిపోకూడదు. ఇలాంటి ఆపద సమయంలో తన స్నేహితునికి తగిన సహాయాన్ని చేసి తీరాలని నిర్ణయించుకున్నాడు. అప్పుడు వెంటనే రాజ్ పాల్ దగ్గరకు వెళ్లి ఒక ‘బ్లాంక్ చెక్’ ఇచ్చి “నీకు ఎంత డబ్బు కావాలో అంత రాసుకో! కానీ రెండు కుటుంబాల సంగమాన్ని విషపూరితం చెయ్యకు, అర్థమయ్యిందా!” అని కోపంతో అనగానే రాజ్ పాల్ సిగ్గుతో తల వంచుకున్నాడు.

వినోద్ రామ్‌తో తన స్నేహం గురించి మహేష్ రాజ్ పాల్‌కి చెప్పసాగాడు. “వినోద్ రామ్ బీహార్ స్టేట్ నుండీ, నేను ఆంధ్రప్రదేశ్ నుండీ ఆర్మీలో సెలెక్ట్ అయ్యాం. అలాగే మా ఇద్దరికీ ఒకే రెజిమెంట్లో పోస్టింగ్ వచ్చింది. కొత్తలో స్నేహంగా ఉన్నా, అప్పుడప్పుడూ మా మధ్య చిన్న చిన్న గొడవలు కూడా జరుగుతూనే ఉండేవి. మా ఇద్దరికీ కూడా కోపం చాలా ఎక్కువ. నేను గొప్ప అంటే నేనే గొప్ప అని రోజూ వాదించుకునేవాళ్లం.

క్రమేపీ మా ఇద్దరి మద్య జరుగుతున్న నిరంతర తగాదాలను అదుపు చేయలేని మా కమాండర్, పై అధికారులకు మా మీద కంప్లైంట్ చేయటం తప్పనిసరి అయ్యింది. వినోద్ రామ్‌కి ధైర్యసాహసాలు చాలా ఎక్కువ అందువల్ల, కాశ్మీర్‌లో గల అవంతిపుర ప్రాంతానికి తనతోపాటు తీసుకెళ్లాడు మా ఆర్మీ కమాండర్.

ఆ రోజు ఆగష్టు 14వ తేదీ, మన దేశ స్వాతంత్ర్య దినోత్సవం కోసం కొన్ని వస్తవులు, సామాగ్రి కొనటానికి ఒక జీప్‌లో వినోద్ రామ్‌తో కలసి మరో నలుగురు ఒక దేశభక్తి గేయాన్ని అమితానందంతో పాడుకుంటూ వెళుతున్నారు.

ఆ సమయంలో అనూహ్యంగా చాటుగా మాటు వేసి ఉన్న ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. అందరూ జీప్‌లో ఉండటంవలన, జీపు వేగంగా ముందుకు దూసుకుపోవటంతో, కేవలం ఇద్దరు సైనికులు అక్కడికక్కడే హఠాత్తుగా మరణించారు.

కానీ వీరుడైన వినోద్ రామ్ మాత్రం ధైర్యంతో ఉగ్రవాదులపై ఉగ్రనరసింహుడై తిరిగి కాల్పులు జరిపాడు. ఆ కాల్పుల్లో వినోద్ రామ్ చేతికీ, కాలుకీ ఇంకా తలకీ బలమైన బుల్లెట్ గాయాలయ్యాయి. అప్పటికే అతను నీరసించిపోతున్నాడు. అయినా తన డ్యూటీని మరచిపోకుండా, ‘జై భారత్ మాతా!’ అంటూ శక్తిని కూడదీసుకొని, హెడ్ క్వార్టర్స్‌కి ఫోన్ చేసి జరిగిన అటాక్ గురించి చెప్పేశాడు.

ఉగ్రవాదుల దాడిలో తీవ్రంగా గాయపడిన ముగ్గురినీ హెలికాఫ్టర్‌లో న్యూఢిల్లీ ఆర్మీ హాస్పటల్‌కి తీసుకెళ్లి వైద్యం చేయసాగారు ఆర్మీ అధికారులు.

ఇప్పుడు చెప్పండి రాజ్ పాల్ గారు! వినోద్ రామ్ మీరు అనుకుంటున్నట్టు డబ్బు మనిషా? లేక ఎదుటివారు కష్టాల్లో ఉన్నప్పుడు తగిన సహాయం చేసే మానవత్వం గల మనిషా?” అని మహేష్ తమ ఆర్మీ సర్వీసులో జరిగిన కథను కొంత వరకూ చెప్పటం పూర్తి చేశాడు. వెంటనే మహేష్ ఇచ్చిన బ్లాంక్ చెక్‌ను తిరిగిచ్చేస్తూ “అయామ్ సారీ మహేష్, నేనే మీ స్నేహితుడిని తక్కువ అంచనా వేశాను” అని తన తప్పును ఒప్పుకున్నాడు.

“మీలాంటి గొప్ప వ్యక్తులతోనా నాకు బంధుత్వం ఏర్పడబోతోంది” అని కన్నీళ్లు పెట్టుకున్నాడు రాజ్ పాల్. “మహేష్ నన్నుక్షమించండి. వియ్యంకుడు గారూ మీరు కూడా పెద్ద మనసుతో నన్ను క్షమించాలి” అన్నాడు. ముగ్గురు కలిసి కళ్యాణమండంపైకి రాగానే ‘జీలకర్రా బెల్లం’ ముహూర్తానికి, మంగళసూత్రధారణకు గట్టి మేళం మ్రోగింది.

మనీష మెడలో తాళిబొట్టు కట్టేశాడు రోషన్. అంతటితో ఒక్కసారిగా అక్షతల వర్షం కురిసింది నూతన వధూవరులపైన. ఆ తరువాత వచ్చిన బంధువులూ, స్నేహితులు కొత్త జంటకు శుభాకాంక్షలు తెలియజేశారు.

తదనంతరం కట్నాలు, కానుకల పర్వం హడావిడిగా కొనసాగింది. ఎటు చూసినా ఆనందాల హేల. పెళ్లి భోజనాలలో కొంతమంది మధురమైన పాటలు పాడారు. అందుకనే అంటారు పెద్దలు ‘పెళ్లిళ్లు స్వర్గంలో జరుగుతాయ’ని. కొడుకు పెళ్లి ఇంత ఘనంగా జరిగినా, రాజ్ పాల్ మనసులో మాత్రం తాను ఏదో తప్పు చేశాను అన్న బాధ ఇంకా అలాగే ఉండిపోయింది. దాంతో, “చూడండి మహేష్ గారు ఆ తర్వాత ఏమైయ్యిందో కూడా మీరు చెప్పితే నేను ఓపిగ్గా వింటాను. కానీ ఇప్పుడు మనమంతా పెళ్లి హడావిడిలో ఉన్నాం కాబట్టి, మరోసారి తప్పకుండా సెకండ్ హాఫ్ స్టోరీని మీరు చెపితే నేను తప్పనిసరిగా వింటాను” అని తన పనుల్లో నిమగ్నమైపోయాడు రాజ్ పాల్.

***

మళ్లీ మహేష్‌ను కలసి మిగతా సెకండ్ హాఫ్ కథను చెప్పమని అడిగాడు రాజ్ పాల్.

“కొన్ని రోజుల తర్వాత.. వినోద్ రామ్ కోలుకున్నాడని తెలుసుకున్న నేను అతన్ని కలవటానికి వెళ్ళాను. చాలా కాలం తరువాత నన్ను చూచి ఎంతగానో ఆనందపడిపోయాడు. అతని ఆరోగ్యం మళ్ళీ మామూలు స్థితికి రావటానికి ఆరు నెలలు పట్టింది. వినోద్ రామ్ మళ్లీ తన డ్యూటీలో చేరాడు. వెంటనే అతనికి పెద్ద పనులు చెప్పకుండా, ఆఫీస్ వర్క్‌ని ఇచ్చారు అధికారులు. ఒక నెల రోజులు ఆఫీసులో పనిచేసిన తర్వాత రోటీన్ పనులతో అతను విసిగిపోయాడు. ‘సార్ నాకు ఈ ఆఫీసు పని వద్దు, నన్ను మళ్లీ ఫీల్డ్ కి పంపించి వేయండి. అక్కడ గర్వంగా గన్ను పట్టుకొని శత్రు సేనలు, ఉగ్రవాదులూ మన భూభాగంలోకి అడుగుపెట్టకుండా మన దేశానికి రక్షణ కవచంలా ఉంటాను’ అని చెప్పాడు.

అతని కోరిక మేరకు వినోద్ రామ్‌ని మళ్ళీ ఫీల్డ్ వర్క్ చేయమని ఆదేశించారు. అతని ధైర్యాన్ని ప్రసంశించారు ఆర్మీ అధికారులు. అప్పటి నుండీ నేనూ, వినోద్ రామ్‌లు తిరిగి మంచి స్నేహితులుగా ఉంటున్నాం. ఆ సమయంలో ఉక్కరి బిక్కిరైన ఆనందంతో అతనితో ఇలా చెప్పాను.. ‘చూడు వినోద్ రామ్! నువ్వు ప్రదర్శించిన ధైర్య సాహసాలకు మన భారత ప్రభుత్వం ప్రమోషన్‌తో పాటు ఘనమైన అవార్డునూ, సత్కారాన్ని కూడా ఇచ్చి గౌరవించింది. ఇలాంటి స్థితిలో నువ్వు ‘వాలంటరీ రిటైర్ మెంట్’ తీసుకొని, మీ ఇంటికి వెళ్లిపోయి ప్రశాంతంగా, నీ కుటుంబంతో గడపవచ్చును కదా! పైగా ప్రభుత్వం నీకు అన్ని సదుపాయాలూ కూడా కల్పించింది’ అని నేను అన్నప్పుడు, వెంటనే వినోద్ రామ్ రోమాలు దేశభక్తితో నిక్కబొడుచుకున్నాయి.

‘నేను బ్రతికున్నంతకాలం నా జీవితం ‘భారతమాత’కు అంకితం. ఇలా నాకిచ్చిన బాధ్యత గల ఉద్యోగాన్ని వదిలేసి వెళ్లటం భావ్యం కాదు. అదే ఇక్కడ ఉంటే నేను, నా దేశానికి సేవ చేస్తున్నాననే సంతృప్తి నాకు సంపూర్ణంగా ఉంటుంది’ అని చెప్పాడు.”

వినోద్ రామ్ గురించి మహేష్ దేశభక్తి భావనతో చెప్పిన అమృతవచనాలను విన్న రాజ్ పాల్‌కి కన్నీళ్లు బొటబొటా ప్రవహించాయి. అతనిలో మళ్లీ మానవత్వం ప్రవేశించింది.

“ఒకప్పుడు నాకు గర్వం చాలా ఉండేది. కానీ మీ స్నేహితుడు మహేష్ చెప్పిన మీ రియల్ స్టోరీ విన్న తరువాత, నాలోని అహంకారం పూర్తిగా నశించిపోయింది బావగారూ!” అంటూ వినోద్ రామ్‌ని ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నాడు రాజ్ పాల్.

అందుకే మనం సంపాదించిన డబ్బు మనతో రాదని తెలుసుకోవాలి. మనం చేసిన పుణ్యమే కర్మఫలంగా నిర్ణయించబడుతుందని గ్రహించాలి. దీనికి నిదర్శనమే మన కర్మయోగి వినోద్ రామ్ జీవితం.

జైహింద్

రచన: కొండూరి కాశీ విశ్వేశ్వరరావు, రావులపల్లి ఉమామహేశ్వరరావు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here