కర్మయోగి-11

0
9

[అమెరికా ఫోన్ చేసి మనవరాళ్లతో మాట్లాడి, వాళ్ళ ప్రతిభను మెచ్చుకుంటారు సత్యవతీ, రామారావు. కూతురితో కూడా మాట్లాడి, అల్లుడిని ఒకసారి ఫోన్ చేయమని చెప్తారు. వరలక్ష్మి చెల్లెలి కొడుక్కు కాస్త డబ్బు సాయం చేస్తే సుధ రుసరుసలాడుతుంది. సుల్తానాబాద్‍లో అఖిలాంధ్ర సాధు పరిషత్ మహాసభలు విజయవంతంగా పూర్తవుతాయి. మాతాజీ, రాజేశ్వరి తిరిగి కాకినాడ చేరుతారు. ఆస్తి పంపకాల గురించి, సుధ ప్రవర్తన గురించి శశిరేఖ, జగత్‍మోహన్ మాట్లాడుకుంటారు. అదే సమయంలో ఆస్తులు పంచి ఇచ్చేసి, కుటుంబాన్ని నిలుపుకుందామని భర్తని ఒప్పించడానికి ప్రయత్నిస్తుంది సత్యవతి. తానెందుకు తాత్సారం చేస్తున్నాడో వివరిస్తాడు రామారావు. – ఇక చదవండి]

[dropcap]“మీ[/dropcap]రు మరీ బాధపడి మీ ఆరోగ్యం పాడు చేసుకోవద్దు. సత్యం పరిస్థితి కూడా ఆలోచించండి. వాడు ఎంతగానే కుంగిపోతున్నాడు. మనకు ముఖం చూపటానికే సిగ్గుపడిపోతున్నాడు. వాడినలా చూడలేకపోతున్నాను. సుధ ఇక మారదు. రాను రాను మొండి పట్టుపట్టు ఎక్కువయిపోతున్నది. ఆ మొండితనమే రామ్‌కూ, కృష్ణకూ వచ్చింది. మనలో మనం బాధపడుతూ కూర్చుంటే పనులు జరగవండీ. నా మాట వినండి. వీలైనంత త్వరలో ఆస్తి పంపకాలు చెయ్యండి. మన పిల్లలు వాళ్లంతట వాళ్లు నోరు తెరచి మా వాటా మాకివ్వండి అని అడగరు. లోకంతో పాటే మనమూను. ఇప్పటి వరకు అందరం కలిసి మెలిసి వున్నాం. సంతోషంగా వున్నాం. తగాదాలు మరీ పెంచుకుని ఒకళ్ల ముఖం ఒకళ్లు చూసుకోనంతగా అయిపోయి ఆ తర్వాత విడిపోవటం ఎవరికీ మంచిది కాదు. రోజులన్నీ మన ఇష్టమొచ్చినట్లు జరగవు. కాలానికీ కొంత వదిలెయ్యాలి. ఇప్పటికే చాలా బరువు బాధ్యతలు మోశాం. ఇక ముందు కూడా ప్రశాంతంగా కృష్ణా! రామా! అనుకుంటూ ప్రశాంతంగా, ఆనందంగా వుందాం. వీలైనంత త్వరగా ఈ పంపకాలను పూర్తి చెయ్యండి. ఇవ్వాల్టికి పొద్దుపోయింది, టాబ్లెట్ వేసుకుని పడుకోండి” అంటూ లేచి మంచి నీళ్లు తాగి మరో గ్లాసు నీళ్లు రామారావుకూ అందించింది. రామారావుకూ, సత్యవతికీ నిద్ర రావటంలేదు. భర్తకు నచ్చచెప్పింది కాని ఇప్పుడు సత్వవతి మనసు మనసులో లేదు. ఇంటిని కూడా విడగొట్టకోవాలా! తన భర్త అన్నట్లుగానే సుధా వాళ్లు సత్యాన్ని ఇక్కణ్ణుంచి తీసుకుని వెళ్లిపోతారా? అట్ల వెళ్తే ఇల్లూ, తనమ మనసులు కూడా వెలితి అయిపోతాయి. ఇన్నాళ్లు ఒక్క మాటగా వున్న జగత్ మోహన్, సత్యంలు ఇక ముందు ఎలా వుంటారు? కలిసి వ్యాపారాలు చేయటానికి సత్యాన్ని ఈ ఊళ్లో వుంచితే గదా? పెద్ద బాబు పూర్తిగా రాజకీయాలలో మునిగిపోయాడు. సత్యం కూడా ఇక్కడి నుండి వెళ్లిపోతే ఇక్కడ తమ వ్యాపారాలన్నీ ఏమవుతాయి? ఇన్నాళ్లూ తన భర్త కష్టపడి కూడబెట్టిన వ్యాపారాలు, ఇక మందగించిపోతాయా? అన్న అలోచలతోనే సత్యవతికి తెల్లవారింది. రామారావు అంతకంటే ఎక్కువగా ఆలోచిస్తున్నాడు. ఒక్కటొక్కటిగా తను పేర్చుకున్న వ్యాపారాలు తన కళ్ల ముందే సన్నగిల్లిపోతాయా? ఇక ముందు సజావుగా సాగవు కాబోలు అన్న బాధ మనసులో సుళ్లు తిరుగుతున్నది. ఇలాంటి ఆలోచనలలో పడి ఏ తెల్లవారుఝాముకో నిద్రపోయాడు.

దేముడి మీద భారం వేసి రామారావు లాయర్ తోనూ, ఆడిటర్ తోనూ మాట్లాడుతున్నాడు. తన స్థిరాస్తుల విలువ కట్టిస్తున్నాడు.

“మీరెలా చేసినా నా కిష్టమే నాన్నా.” అని జగత్ మోహన్ తేల్చి చెప్పాడు. అంతే కాదు ఈ పంపకాల్లో తానేమీ వేలు పెట్టనని కూడా చెప్పాడు.

ఇదంతా సత్యం మనసుకు చాలా కష్టంగా వున్నది. ఇప్పుడు నాన్నతో తానేమీ మాట్లాడినా నాన్న వినరు. అందుకే నాన్నను అన్నయ్యను తప్పుకుని తిరుగుతున్నాడు. సుధారాణితో గట్టిగా చెప్పాడు.

“నువ్వు చేసిన రభస వలనే నాన్న ఈ పని చేస్తున్నారు. ఇప్పటికే ఆయన ఎంతో బాధపడుతున్నారు. నువ్వు ఇంకేం వాగకు. అది కావాలి, ఇది కావాలి అని పేచీలు పెట్టకు. మీ పుట్టింటి వాళ్ల చేత రాయబారాలు చేయించకు. నాన్న అన్నీ ఆలోచించి చేస్తారు. మనకన్యాయం ఎప్పటికీ చేయరు. నువ్వు ఏ పుల్లవిరుపు మాటా మాట్లాడి వారినింకా మనస్తాపానికి గురి చెయ్యకు.” అంటూ కాస్త గట్టిగానే చెప్పాడు.

తనేమైనా కుంటిసాకులు చెప్పబోతే మావయ్యకు కోపమొచ్చి అసలు పంపకాలే మానేస్తే రేపేమవుతుందోనని సుధారాణి సాధ్యమైనంత వరకూ మౌనంగా వుందామని నిర్ణయించుకున్నది. కాని తమ వాటాకు ఏం పంచుతారో, అత్తగారు వెండీ, బంగారం తన కెంత ఇస్తుందో అన్న ఆలోచనలు సుధారాణిని ఒక్క చోట నిలబడనీయటం లేదు. కూర్చోనివ్వటం లేదు.

కోడళ్లు కాపురానికి వచ్చిన తర్వాత వాళ్లకు తెలియకుండా ఒక్క తులం వెండి కానీ, ఒక్క గ్రాము బంగారం కానీ అత్తగారు చాటుగా ఏం కొనలేదు. ఏం తీసుకున్నా కుటుంబంకిందే తీసుకున్నారు. అందుకే వున్న వెండినీ, బంగారాన్ని మూడు వాటాలు చేసి తనకూ తన కూతుళ్లకూ కలిపి ఒక వాటా వుంచి మిగతా రెండు వాటాలు కోడళ్లిద్దరకూ చెరో వాటా అని చెప్పేసింది. ఇచ్చీ ఇవ్వటంతోనే సుధ తీసుకెళ్లి రూంలో దాచుకున్నది. శశిరేఖ మాత్రం “మీ దగ్గరే వుంచండత్తయ్యా తర్వాత తీసుకుంటాలే” అన్నది.

“మళ్లీ తర్వాతెందుకు? తీసుకో. తీసుకుని జాగ్రత్త చేసుకో” అన్నది సత్యవతి.

సత్యవతి ముందు జాగ్రత్తగా ప్రతి బంగారు వస్తువూ రెండు రెండుగా చేయించి జిప్ లాక్ కవర్లలో వుంచి రబ్బరు బాండ్‌లు వేసి లాకర్లలో పెట్టించింది. ఇప్పుడు లాకర్లలో వుంచిన వాటిని తెప్పించింది. కోడళ్ల ముందే సగ భాగాలు చేసి తన నిర్ణయాన్ని చెప్పింది. బంగారు ఉగ్గు గిన్నెలు తీసి కోడళ్లకు చెరొకటి ఇస్తుంటే సత్యవతి కళ్లు నీళ్లు నిండాయి. అ నీళ్లు నిండిన కళ్లతోనే బంగారు కుంకుమ భరిణెలు, బంగారు బాలకృష్ణుని విగ్రహాలతో సహా అన్నీ పంచి ఇచ్చింది. అవి తీసుకుని జాగ్రత్త చేసుకుంటూ ‘డైనింగ్ టోబుల్ మీదకు సరిపడా వెండి ప్లేట్లు, గ్లాసులు, కప్పులూ అన్నీ వున్నాయిలే. ఇంకేం కొనక్కర్లేద’నుకున్నది సుధారాణి.

ట్రాన్స్‌పోర్ట్ వ్యాపారాన్ని ఒక కొడుక్కు, రైస్ మిల్లు ఒక కొడుకుకి, రియల్ ఎస్టేట్, కన్‌స్ట్రక్షన్ పన్లు ఇద్దరూ కలిసి చూసుకుంటే బాగుంటుందన్నాడు. ఆ ఆయిల్ మిల్ హోటల్ లాంటి లీజుకిచ్చి వున్నా వాటిని కూడా సమానం చేశాడు. హైద్రాబాద్‌లో వున్న భూములు, సత్తెనపల్లిలో వున్న భూములు కొడుకులిద్దరికీ సమానంగా పంచాడు. ఇంకా అక్కడక్కడా కొన్న స్థలాలు కొన్ని కొడుకులకిచ్చి మరి కొన్ని తన పేరనే వుంచుకొన్నాడు. ఆడిటర్‌తో లెక్కలు వేయించాడు. లాయర్ సలహాతో వీలునామా రాసి దాన్ని రిజిస్టర్ చేయిస్తానన్నాడు. తనుండే ఇల్లు తనకు కొడుకులకూ సమాన వాటాలు చేయించాడు. తనకంటూ తీసిన భాగంలోని ఆస్తులన్నీ కూతుర్ల సంతానం అందరికీ సమానంగా చెందేటట్లు వీలునామాలో ఉదహరించాలన్నాడు. అప్పుడు తనకూ సంతృప్తిగా వుంటుందనుకున్నాడు. అనుకున్న ప్రకారం వీలునామా వ్రాశాడు. రిజిస్ట్రేషన్ కూడా అయింది.

సుధారాణి ఇక్కడ విషయాలన్నీ పుట్టింటి వాళ్లకు చేరేస్తున్నది.

“ముసలాయన వాటాలు న్యాయంగానే వేశాడు. ఆ మాత్రం ఆస్తిని తన చేతుల్లో వుంచుకోవాలి. ఇంక నువ్వేం గొడవలు పడకు. ఈ సంవత్సరం పిల్లలు పరీక్షలయ్యే దాకా సత్తెనపల్లిలోనే వుండు. ఆ తర్వాత విజయవాడ వచ్చేద్దురు కాని. మీరు విజయవాడ వచ్చే లోపు సత్యం చేత ఏ వ్యాపారం చేయిస్తే బాగుంటుందో నేనూ, అన్నయ్యా ఆలోచిస్తాం. నీ కుటుంబానికి ఆసరాగా మేమున్నాం. మీకేం భయం లేదు. ఉంటాను” అని అంటూ ఫోన్ పెట్టేశాడు సుధారాణి తండ్రి.

రామారావు ఇంట్లో ఇప్పుడు డైనింగ్ టెబుల్ దగ్గర సందడే లేదు. ఒక చోట చేరి అంతా భోజనాలకు కూర్చున్నా ఎవరికీ మాటలు సాఫీగా పెగలటం లేదు. రామారావే కలగజేసుకుని సత్యాన్ని వ్యాపార విషయాలు, జగత్ మోహన్‌ని రాజకీయ విషయాలు కనుక్కుంటున్నాడు.

“పెద్ద బాబూ! నీ వ్యాపారపు పనుల గురించి కూడా కాస్త శ్రద్ధ పెట్టు. రాజకీయాలు రాజకీయలే. వ్యాపారంలో అనుభవమున్న వాడివే కదా? వాటి మీదా దృష్టి పెట్టాలి. నీకు కుదరకపోతే నీ తరపున ఎవరైనా నమ్మకమున్న వారిని చూసి అప్పగించు. తమ్ముడు ఒక్కడే ఎన్నాళ్లని చూస్తాడు? శశిరేఖ బాగా చురుగ్గా వుంటుంది. తనకు కొన్ని బాధ్యతలు అప్పగించు.”

“నేను అదే అనుకుంటున్నాను నాన్నా. ఇప్పట్నుంచే ఒక్కొక్కటిగా శశిరేఖకు వివరంగా చెప్తాను. మీ సహాయం ఎలాగూ వుంటుంది కదా?”

ఇవన్నీ వింటున్న సత్యం మనసు చాలా కష్టపెట్టుకుంటున్నాడు. అతణ్ణి రామారావు, సత్యవతులే ఓదారుస్తున్నారు. “నువ్విదితంతా మనసులో పెట్టుకోకుండా నీ పనులు నువ్వు చూసుకో” అన్నారు.

సత్యాన్ని ఓదారుస్తున్నారు కాని వాళ్ల మనసుల్ని వాళ్లు సమాధాన పరుచుకోలేకపోతున్నారు. తమ కళ్ల ముందే తమ ఆలోచనల ప్రపంచం కరిగిపోతున్నట్లుగా వున్నది.

సుధారాణికి వాళ్లమ్మ ఫోన్ చేసింది “పంచి ఇచ్చాక మీరు మళ్లీ అదే పాత ప్రకారం వుండటం, తినటం ఎందుకు? నీక్కావలసింది నువ్వు వండుకో. మీ వాటాలో మీరు తినండి” అని చెప్పింది.

“వద్దులేమ్మ. ఎలాగు కొద్దిరోజుల్లో విజయవాడ కొచ్చేస్తాంగా. ఇంతలోకే వేరు కాపురం అంటూ పెట్టి నానా చాకిరీ ఎందుకు చెయ్యటం చెప్పు. వరలక్ష్మీ, శశిరేఖా వండి పడేస్తారులే.”

“నీకసలే పని బద్ధకం ఎక్కువ. మొదటి నుంచీ అంతే. ఏం మారలేదు. పంచుకుని కూడా ఇంకా కలిసి తినటం నాకు నచ్చలేదు.”

“సరే అమ్మా, మా వరలక్ష్మినే అడిగి చూస్తాను. నాక్కూడా విడిగా వండి పెట్టమని. కాదంటే వేరే వాళ్లను అడుగుతాను.” అంది సుధ.

“వరలక్ష్మీ! పై అంతస్తులో నేను వంట పెట్టుకుంటాను. మాక్కూడా వండి పెడతావా?” అనడిగింది సుధ.

“అదేంటి? సుధమ్మా! మళ్లీ అక్కడ వేరే వంట ఎందుకు?” అన్నది వరలక్ష్మి.

“ఆస్తులు పంచుకుని కూడా ఇక్కడే పడి తింటున్నామన్న మాట మేమందుకు పడాలి? మా వంట నేనే వండుకోవాలనుకుంటున్నాను. ముందు నిన్నొక మాట అడుగుతున్నాను. వీలైతే చెయ్యి కాదంటే వేరే వాళ్లను చూసుకుంటాను.”

అక్కడే వున్న శశిరేఖ, సత్యవతీ మొహమొహాలు చూసుకున్నారు. ఏం మాట్లాడతే సుధ ఏం పెడర్థాలు తీస్తుందోనని వాళ్లిద్దరేం మాట్లాడలేదు.

బజారుకెళ్లి సుధారాణి కొంత సామాగ్రి కొనుక్కొచ్చింది. ఇంట్లో వున్న వంట పాత్రలను కొన్నింటిని తీసి విడిగా పెట్టుకున్నది. సుధ పని సంగతీ, వంట సంగతీ ఇంట్లో అందరికీ తెలుసు. అనవసరంగా రామ్‌నూ, కృష్ణనూ, సత్యాన్నీ అందరినీ మాడ్చి చంపుతుంది.

“సుధా! నువ్వంతగా వండుకోవాలనుకుంటే అన్నం వండుకో, పెరుగు తోడు పెట్టుకో. టిఫిన్ ఇక్కడే చేయండి. కూరలు కూడా కింది నుంచే తీసుకెళ్లు” అన్నది సత్యవతి.

తెగేదాకా లాగకూడదని “సరేనత్తయ్యా, నేనూ ఒక మనిషిని చూసుకుంటానులే” అన్నది.

ఆ రాత్రి పిల్లలకు పైనే భోజనం పెట్టింది. సత్యం స్నానం చేసి కిందకు భోజనానికి వెళ్లబోయాడు.

“ఈవేల్టి నుండి మన భోజనాలు ఇక్కడే. కిందికి వెళ్లఖ్ఖర్లేదు. మన కోసం ఒక పని మనిషిని కూడా మాట్లాడతాను. రేపోమాపో వంట మనిషినీ పెట్టుకుందాం. ఆ… అన్నట్లు ఏ కారు ఖాళీగా వుంటే ఆ కారు వేసుకుని తిరగటం కాదు. మనకంటూ పంచి ఇచ్చిన స్విఫ్ట్‌నే తీసుకోండి. నెమ్మదిగా పిల్లలకూ, నాకూ కలిపి ఇంకోటి తీసుకుందాం” అన్నది.

ఆ రాత్రి కింద భోజనాల గదిలో సత్యం సుధల కుర్చీలు ఖాళీగా కనపడే సరికి రామారావుకీ, సత్యవతికీ మనస్సు కలుక్కుమన్నది. దేని కోసమైతే తాము భయపడ్డారో అదే జరిగింది. నెమ్మది నెమ్మదిగా తామిద్దరే మిగిలిపోయినా ఆశ్చర్యపడక్కర్లేదు. ఈ రాత్రికి సత్యం పైన భోజనం చేసివుంటాడా? లేక మనసు కష్టపెట్టుకుని వుంటాడా అనుకున్నారు.

మాటలు పెంచితే సుధ గొడవచేయటం ఖాయం అనుకున్న సత్యం ఒక గ్లాసు మంచి నీళ్లు మాత్రం తాగి వెళ్లి పడుకున్నాడు.

“శశిరేఖా, నువ్వూ వేరుగా వండుకోవాలనుకుంటే వండుకో, నిన్నుకాని, జగత్ మోహన్‌ను కాని మేం అడ్డుపెట్టం” అన్నది సత్యవతి.

“లేదత్తయ్యా! నాకా కోరిక లేదు. మీ అబ్బాయికీ ఆ కోరిక వున్నట్లు నాకనిపించదు. మాకు మీతో వుండటమే ఇష్టం.”

“నీ ఇష్టం” అంటూ సత్యవతి నిట్టూర్చింది.

రామ్‌నూ, కృష్ణనూ పిలిచి కింద శశాంక్ వాళ్లతో కలిసి చదువుకోమని చెప్పింది శశిరేఖ. కాని సుధారాణి పంపించటం లేదు. “హోమ్ వర్క్ చేసుకుని ఆ తర్వాత టీ.వీ చూడండి. లేదా ఫోన్‌లో ఆడుకోండి. ఎక్కడికీ వెళ్లఖ్ఖర్లేదు” అన్నది పిల్లలతో.

పిల్లల చదువులు పాడయిపోతున్నాయని శశిరేఖ బాధపడింది కాని ఏం చేయలేక మెదలకుండా ఊరుకున్నది.

ఇంట్లో ఖాళీగా వుంటే లేని పోని ఆలోచనలు వస్తాయనిపించింది రామారావుకు. ఇదివరకటి లాగే ఉదయం పదిగంటలకల్లా బయటికెళ్లటం చేస్తున్నాడు. తను వ్యాపార విషయాల పట్ల చురుగ్గా వుంటున్నాడు.

***

సత్తెనపల్లి నియోజక వర్గపు యమ్.ఎల్.ఎ సీటు జగత్ మోహన్‍కే ఖరారైంది. నామినేషన్లూ అయ్యాయి. జగత్ మోహన్ ప్రచారం అంటూ, మీటింగులంటూ తిరగటం ఎక్కువయింది. రామారావు ఇంకా పని బాధ్యతలు పెంచుకుంటున్నాడు. సత్యమూ ఊరుకోకుండా అన్నీ పట్టించుకుంటున్నాడు. అది సుధారాణి కిష్టంగా లేదు. ‘ఇక్కడుంటే ఇంతే సత్యం చేత వీళ్లంతా కలిసి నానా చాకిరీ చేయింస్తారు. వాళ్లేమో అందలాలు ఎక్కుతారు’ అంటూ రుసరుసలాడుతుంది. ‘ఇక్కణ్ణుంచి పోతేగాని ఈ దరిద్రం వదలదు. ఈ మనిషి కెంత చెప్పినా అర్థంకాదు’ అంటూ బాహాటంగానే సణగటం ఎక్కవ చేసింది.

శశిరేఖ వీలున్నప్పుడల్లా మామగారి దగ్గర కూర్చుని ఒక్కో విషయమూ అడిగి తెలుసుకుంటున్నది. అకౌంట్స్ అన్నీ తిరగేస్తున్నది. సత్యాన్ని కూడా మిల్లుల్లోని ప్రొడక్షన్ గురించి అడుగుతున్నది. తానే స్వయంగా వెళ్లి చూసుకోవటం అలవాటు చేసుకుంటున్నది శశిరేఖ.

ఎలక్షన్స్ దగ్గర పడ్డాయి. జగత్ మోహన్ ఇంటికెప్పుడొస్తున్నాడో, ఎప్పుడు వెడుతున్నాడో తెలియటం లేదు. ఖర్చు రోజు రోజుకూ పెరిగిపోతున్నది. తండ్రి పంచి ఇచ్చిన డబ్బంతా అయిపోయింది. తన స్థిరాస్తి కాగితాలను బ్యాంక్‌లో తనఖా పెట్టాడు. వచ్చినంత లోన్ తీసుకున్నాడు. వేరే ఫైనాన్స్ వాళ్ల దగ్గర కూడా కొంత అప్పు చేసాడని సత్యానికి తెలిసింది. ఇంటి కొచ్చి మాట్లాడే వారి మాటల వలన సుధారాణి ఈ విషయాలు పసికట్టింది.

“నేను చెప్పానా? ఇలా జరుగుతుందని నాకు ముందే తెలుసు. రాజకీయాల్లోకి దిగటమంటే ఆస్తులు కరిగించుకోవటమే. నేను జాగ్రత్త పడకపోతే మన వాటా డబ్బూ, దస్కమూ కూడా కరిగిపోయేవి. మన ఆస్తూలూ తాకట్టుకెళ్లేవి” అన్నది భర్తతో సుధారాణి.

“నువ్వెన్నయినా చెప్పు సుధా, అవసరమైన సమయంలో అన్నయ్యకు తోడు లేకుండా ఇవతలికి వచ్చినందుకు నేను చాలా సిగ్గు పడుతున్నాను. నాన్నగారెంత బాధపడుతున్నరో?”

“అంత బాధవుంటే ఆయన ఆస్తి కూడా తాకట్టు పెట్టి ఇస్తారు. ఆ తర్వాత తీర్చగలిగితే తీరుస్తారు. లేకపోతే అప్పిచ్చిన వాళ్లు స్వాధీనపరుచుకుంటారు. మీరు మాత్రం నాకు తెలియకుండా ఒక్క రూపాయి కూడా ఇవ్వటానికి వీల్లేదు” అంటూ శాసించినట్లు చెప్పింది.

“నేనిస్తానన్నా అన్నయ్య తీసుకోడు. నీ నోటి సంగతి తెలుసులే” అంటూ సత్యం అక్కణ్ణుంచి చిరాగ్గా వెళ్లాడు.

ఓ రోజు సత్యానికి మామగారి దగ్గర్నుంచి ఫోనొచ్చింది. “విజయవాడలోని మా స్థలాల్లో గోడవున్లు కట్టాలని లోగడ అనుకున్నాం కదా? పర్మిషన్ల కోసమూ ప్రయత్నించారు. ప్రయత్నం చేసి మానుకోవటమెందుకు? మళ్లా ఆ పని మీద దృష్టి పెట్టండి. ఇక్కడికొచ్చేసి దగ్గరుండి గోడవున్లు కట్టిద్దురుగాని. మా అబ్బాయి తోడుంటాడు. మీ షాపులతో పాటు మిగతావి కూడా లీజులకిచ్చెయ్యండి. అద్దెలు ఎక్కడున్నా వస్తాయి. మీ అన్యయ్య వాటా కొచ్చిన జిన్నింగ్ మిల్‌ను చూచుకుంటారా? వాళ్లు లీజ్ కిచ్చేస్తారా? విజయవాడలో వుంటే కన్‌స్ట్రక్షన్ బిజినెస్ బాగా డెవలప్ అవుతుంది. బోలెడన్ని కాంట్రాక్టులు తీసుకోవచ్చు. ఇల్లు చూసి వుంచుతాను. పిల్లల పరీక్షలు కాగానే వచ్చెయ్యండి. వాళ్లకిక్కడ చదువు బాగుంటుంది. అప్పటికప్పుడు ఎడ్మిషన్స్ దొరకవు. ముందే ఎంట్రన్స్ వ్రాయించాలి. దాని కోసం మీరు విజయవాడ ఎంత త్వరగా వస్తే అంత మంచిది. నా మిల్లు, నా బిజినెస్ అంటూ అక్కడే వుండిపోకండి. మీరు వెంటనే వచ్చినా, రాకపోయినా సుధనూ, పిల్లల్నీ మాత్రం వెంటనే తీసుకొచ్చేస్తాం” అన్నాడు అంతా నిర్ణయించేసినట్లుగా.

“సుధకూ ఇలాగే చెప్పి తన మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఇక్కడ మాకు వ్యాపారాలు లేవా? సంపాదన లేదా? మా పిల్లలకు చదువులేవా? ఉన్న పళంగా ఇవన్నీ వదిలేసుకుని నన్నెక్కడికి రమ్మంటారు! సత్తెనపల్లి వదిలి నాకు రావాలని లేదు. నన్ను ఇబ్బంది పెట్టవద్దు” అన్నాడు సత్యం.

“మీకక్కడ కన్నా ఇక్కడ ఎంతో బావుంటుంది. పిల్లల చదువులతో సహా, వ్యాపారాలు కూడా ఎంతో బాగుంటాయి. బిడ్డనిచ్చుకున్న వాణ్ణి, నాకంటే ఎక్కువగా ఎవరాలోచిస్తారు. మీ గురించి? అక్కడ మీకు ఎదుగుబొదుగు లేదు. అవన్నీ ఆలోచించి మిమ్మల్ని విజయవాడ తీసుకొద్దామన్న ఆలోచన వచ్చింది. సుధ పిల్లల్ని తీసుకుని విజయవాడ రావటం ఖాయం. బాధ్యతగా మీరు వస్తారో, భార్యా పిల్లల్ని వాళ్ల మానాన వాళ్లను ఒంటిరిగా వదిలేస్తారో మీ ఇష్టం. ఒకసారి ఇటు దృష్టి పెట్టండి. విజయవాడ మార్కెట్‌కూ, సత్తెనపల్లి మార్కెట్‌కూ బేరీజు వెయ్యిండి. మిమ్మల్నేం ఆస్తులు అమ్ముకుని రమ్మనటం లేదు. వున్న పెట్టుబడితో మరింత మంచి బిజినెస్‌లు చేసుకోమనే చెప్తున్నాను. నా మాట వింటే బాగుపడతారు. వినకపోతే బావిలో కప్పలాగే ఉండిపోతారు, ఆలోచించుకోండి. మీ ఇష్టం.” అంటూ ఫోన్ పెట్టేశాడు.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here