కర్మయోగి-15

0
10

[పిల్లలతో సత్తెనపల్లి వస్తుంది సుధ. అప్పుడే స్కూలు నుంచి వచ్చిన శశాంక్, శైలజలు – రామ్‌, కృష్ణలను పలకరిస్తారు. రామ్, కృష్ణలు తమ కొత్త స్కూలు గురించి, తాము ఆడే గేమ్స్ గురించి గొప్పగా చెబుతారు. ఇక ఇక్కడికి రారా అని పిల్లలు అడిగితే, రామని చెబుతుంది సుధారాణి. తిరిగి విజయవాడ వచ్చేస్తుంది సుధారాణి. అక్కడ తమ వాళ్ళ గురించి అడుగుతాడు సత్యం. అన్నయ్య మంచి పేరు తెచ్చుకుంటున్నాడని సత్యం సంతోషపడితే, ఆ సంతోషాన్ని కాస్త దాచుకోమంటుంది సుధారాణి. సుధ పాతిక లక్షలు అప్పుగా ఇచ్చి, అవసరానికి చేతిలో డబ్బు లేకుండా చేసుకుందని సత్యనారాయణకి తెలుస్తుంది. అప్పు తీసుకున్న సుజాత ఇంటికి కూతురుతో కలిసి వెళ్తాడు. సుజాత భర్త తలుపుతీస్తాడు. కాస్త వాదన జరుగుతుంది. – ఇక చదవండి]

[dropcap]“మే[/dropcap]ము రెండు మూడు లాకర్లు వాడాతామండీ. ఏ లాకర్లో వున్నాయో వెతకాలండీ.”

“ఏమండీ! నేనూ బిజనెస్‌మాన్‌నే. ఏ వస్తువు ఎక్కడ పెట్టామో గుర్తుగా నోట్ చేసుకోకుండా ఎలా వుంటాం? వ్వవహారం సరీగా వుంటే నేను సరిగానే వుంటాను. అడ్డం తిరిగిన వాళ్ల అంతు చూస్తాను. మీరు అడ్డం తిరగొద్దు” అన్నాడు కరుగ్గా.

“ఆ స్థలం సుజాత పేరు మీద వున్నది. డబ్బు అవసరమయ్యి ఆ స్థలం కాగితాలు పెట్టి తెలిసిన వాళ్ల దగ్గర అప్పు తీసుకున్నాం. ఇప్పుడా కాగితాలు మా దగ్గర లేవు. అయితే మేం తీసుకున్న దాని కన్నా స్థలం విలువ చాలా ఎక్కువ. అందుకని త్వరగా బాకీ తీర్చేసి కాగితాలు తీసుకుందామనుకుంటున్నాం.”

“స్థలం విలువ ఎక్కువంటున్నారు కాబట్టి వెంటనే అమ్మేయండి. అటు వాళ్ల బాకీ, ఇటు మా బాకీ కూడా తీరిపోతాయి.”

“అప్పులు పెంచుకుని లేనిపోని తలనొప్పులు తెచ్చుకోకూడదు. నేను అదే అనుకుంటున్నాను.”

“సరే అయితే, వాళ్ల దగ్గరకే బయలుదేరండి. సుధారాణిని ఇంట్లో దింపేద్దాం. మనం వాళ్ల దగ్గర కెళ్లి ఆ కాగితాలు తీసుకుని జిరాక్సులు తీయించుదాం. జిరాక్సులు నేను తీసుకుంటాను. స్థలం బేరం పెడదాం. నాకు తెలిసిన బ్రోకరల్లు గట్టి వాళ్లే వున్నారు.”

ఇక తప్పదనుకుని అతను లేచి బయల్దేరి వచ్చాడు. తను అప్పు తీసుకున్న వాళ్ల ఇంటికి తీసుకెళ్లాడు. “ఒక్కసారి ఆ కాగితాలు ఇస్తే జిరాక్సులు తీయించుకుని ఇచ్చేస్తాం” అన్నారు.

“మీరు జిరాక్సులు తీసుకోకుండానే నాకు ఒరిజినల్స్ ఇచ్చేశారా? అయినా సేల్ డీల్ అని వ్రాయించుకున్నాం. సుజాతగారు సంతకం పెట్టేశారు కదా. నాకు వడ్డీతో సహా అప్పు కట్టి మీ కాగితాలు తీసుకోండి. సేల్ డీల్ అని వ్రాసిన వాటిని బయటికెలా ఇస్తాను?”

“నేను ఆ స్థలాన్ని కొనటమో, అమ్మించటమో చేస్తాను. అమ్మాలన్నా, కొనాలన్నా డాక్యుమెంట్సు కావాలిగా. అందుకే వచ్చాను” అన్నాడు సత్యనారాయణ.

“నేనిచ్చిన పాతిక లక్షలకు మూడురూపాయలు వడ్డీ చొప్పున లెక్కకడితే ఆ స్థలం రేటు సరిపోతుందా? అసలింకెంత మిగులుతుందని? అమ్ముకుంటే సేల్ డీల్ అని వ్రాయించుకున్న నేనమ్మకోవాలిగాని ఆయనెలా అమ్ముతాడు?” అంటూ ప్రశ్నించాడు.

వ్యవహారం క్లిష్టంగా వుందని సత్యనారాయణ కర్థమయింది. సత్యనారాయణ తనకు సపోర్టుగా వుంటాడని సుజాత భర్తకు ధైర్యమొచ్చింది.

“చూడండి సార్. మూడు రూపాయల వడ్డీ అంటే చాలా ఎక్కువ. సేల్ డీల్ అని మీరు వ్రాయించి వుంటారు. సుజాతకు తెలియక ఇంత వడ్డీకి, సేల్ డీల్ అని వ్రాస్తేనూ సంతకం పెట్టింది. నేనప్పుడేదో కోర్టు పనుల్లో మునిగిపోయి వున్నాను. నాకు సాయంగా వుందామని సుజాత ఇలా చేసింది. అంత వడ్డీ ఇవ్వలేను.”

“ఇవ్వలేనంటే వచ్చిన దారినే వెళ్లండి. ఆ స్థలమోదో నేను అమ్ముకుంటాను” అంటూ అతను లేచి నిలబడ్డాడు.

“చూడండి, మీరు కోర్టు కెళ్లినా అంత వడ్డీ ఇప్పించరు. పైగా చాలా సమయం పడుతుంది. కాబట్టి ఏదో ఒక విదంగా పరిష్కారం చేసుకుంటే మంచిదని నా ఉద్దేశం” అన్నాడు సత్యనారాయణ.

“ఇందులో ఆలోచించటానికి ఏమీ లేదండీ. వడ్డీ కోసమే గదా మేం అప్పులు ఇచ్చేది. ఇస్తారా సరే. లేకపోతే స్థలం అమ్ముకుని బాకీ కట్టుకుంటాను. కోర్టు, గీర్టు నాకేం కొత్తకాదు. ఇలాంటి మొండి బాకీలు వసూలు చేసుకోవటం నాకలవాటే.”

“చూడండీ, సుజాతగారు మాజీ యమ్.పి.గారి మేనకోడలు. ఈయన తల్లిదండ్రులు విజయవాడలో పేరున్నవాళ్లే. కృష్టాజిల్లా పెట్రోలు బంకుల యూనియన్ ప్రెసిడెంట్‌గా పని చేశారని చెప్తున్నారు. ఇలా రెండు ఫామిలీల పెద్దలు రంగంలోకి దిగితే అసలులో కూడా కోత పెట్టిస్తారు. మీరే కాదు, నా కూతురూ వీళ్లకు అప్పు పెట్టింది. ఈయన అప్పు తీర్చటానికి సిద్ధంగానే వున్నాడు. కాకపోతే నిజాయితీగా స్థలమమ్మి అస్తానంటున్నాడు. ఆలోచించుకోండి” అంటూ లేచి వచ్చేశారు.

సుజాత ఎంత పని చేసిందని లోపల్లోపల రగిలిపోతున్నాడు సత్యనారాయణ. వాళ్ల ఇబ్బందులేంటో తనకు తెలీదు. తన కూతురు తెలివితక్కువగా పాతిక లక్షలు తీసి ఇచ్చింది. అది వసులు చేసుకోనే మార్గం చూసుకోవాలి. రభస చేసుకుంటే లాభం లేదు. నిదానంగానే వుండి డబ్బు రాబట్టుకోవాలనుకున్నాడు. సుజాత వాళ్లింటి ముందు కారు ఆపించాడు.

అతను కారు దిగిపోతూ “సత్యనారాయణగారూ! నేనూ మాట మీద నిలబడే వాణ్ణే. మీ వ్యవహారశైలి నాకు బాగా నచ్చింది. ఏదో మాకు కాలం కలిసిరాక బిజినెస్‌లో నష్టాలు వచ్చాయి. దాని మూలానా అప్పులు చేయవలసి వచ్చింది. అయినా మీ పాతిక లక్షలు ఎక్కడికీ పోవు. ఇంకా కొన్ని స్థలాలున్నాయి. ఏదో ఒకదాన్ని మీకు బదలాయిస్తాను. మా పెద్దవాళ్లతో ఈ విషయాలన్నీ చెప్పి వాళ్లను కూడా బాధపెట్టలేను. మీరు నాకు కాస్త తోడుగా వుండండి. ఈ విషయాలు సెటిల్ చేసుకుంటాను. మూడురూపాయల వడ్డీకి, నేనైతే ఒప్పుకునే వాణ్ణికాను. సుజాత తొందరపడింది. నాకేదో మేలు చేద్దామనుకున్నది. నా ఇబ్బందులు చూడలేక తనూ ఇలా అప్పులు చేసింది. మరలా నేను మీకు ఫోన్ చేస్తాను. రెండు బాకీలు తీరిపోయేటట్లు చూస్తాను. మీరన్నట్లు వడ్డీలు పెంచుకుంటూపోయి లేనిపోని తలనొప్పులు తెచ్చుకోను. మీరు నాకు తోడుంటారుగా. త్వరగానే తీర్చేసుకుందాం” అన్నాడు ప్రాధేయపడుతూ.

“తప్పకుండా, మళ్లీ వస్తాను. నాకు సుధారాణి ఎంతో, సుజాత కూడా అంతే. ఒక్కోసారి బిజినెస్‌లో ఎదురు దెబ్బలు తగులుతాయి. ధైర్యంగా వుండండి” అంటూ సత్యనారాయణ కారు బయిల్దేరింది.

సుజాత భర్త అప్పు తీరుస్తాడన్న నమ్మకం సత్యనారాయణకు కలిగింది. కాని ఆలస్యం చేయనీయకూడదు. ఇనుము వేడెక్కినప్పుడే సాగగొట్టాలి కదా. తీర్చాలన్న మూడ్ వాళ్లకున్నప్పుడే వెంటబడాలి. ‘ఈ అప్పు వసులు చేసుకోలేకపోతే సుధారాణి నిర్వాకం బయటపడుతుంది. వేరు కాపురం పెట్టి బోర్లా పడిందనుకుంటారు’ అని ఆలోచించాడు.

సుధారాణి మనసు చికాకుగా వున్నది. సుజాత కంటికి కనబడుటం లేదు. వాకింగ్ చేయటానికి కూడా రావటం లేదు. మిగతా వాళ్లు నడిగితే తెలియదన్నారు. తను ఫోన్ చేస్తే ఎత్తదు. తండ్రికి చెప్పింది కాబట్టి ఆయనే ఏదో తిప్పలు పడతాడని తన మనసుకు ధైర్యం చెప్పుకోసాగింది. ఇంకెప్పుడూ ఇలాంటి వాటిల్లో వేలు పెట్టకూడదని ఒట్టు పెట్టుకున్నది.

రామ్‌కృష్ణలు స్కూల్ కెళ్లి వస్తున్నారు. ట్యూషన్ మాస్టారుగారు వచ్చి ట్యూషన్ చెప్పి వెడుతున్నారు. కాని మార్కులు మాత్రం ‘C’ గ్రేడ్ లోనో, ‘D’ గ్రేడ్ లోనో వుంటున్నారు. సత్తెనపల్లిలో వుండగా ‘A’, ‘B’ గ్రేడుల్లో వుండేవాళ్లు. పిల్లల ప్రోగ్రెసు కార్టు చూసి సత్యానికి బాధేసింది. ఇద్దరు బాగా చదవటం లేదు. రాను రాను చదువు మీద శ్రద్ధ తగ్గిపోతున్నది. ఎప్పుడు చూసినా చేతుల్లో ఫోన్ కనపడుతున్నది. లేకపోతే టీ.వి ముందు కనపడుతున్నారు. “వాళ్లను కాస్త చదివించు సుధా! నేను ఇంటికి వచ్చేటప్పటికి బాగా రాత్రయిపోతుంది. అప్పటికి వాళ్లు పడుకుండిపోతున్నారు” అంటున్నాడు సత్యం.

“సత్తెనపల్లిలో వున్నప్పుడు వీళ్లు చదివింది చిన్న క్లాసు. బాగా పాత స్కూల్, పాత చదువు. దానికి తోడు స్టేట్ సిలబస్. ఇప్పుడు చదివేది సెంట్రల్ సిలబస్. కష్టంగానే వుంటుంది. రోజులు గడిచే కొందికీ వాళ్లకీ తెలుసుకుంటారు. బాగా చదువుతారులే” అంటుంది, కాని పిల్లల్ని చదివిస్తానని మాత్రం అనదు.

తులసి మీద పనులన్నీ పడేసి తాను టీ.వీ చుసుకుంటూనో, ఫోన్‌లో ఫ్రెండ్స్ తోనో, పుట్టింటికో ఫోన్ చేసి మాట్లాడటం బాగా అలవాటయ్యింది సుధారాణికి.

“సుధా! ఒకసారి దేవసేననూ, పిల్లల్నీ, బావగారినీ విజయవాడ రమ్మని ఫోన్ చేస్తాను. మనం విజయవాడ వచ్చిన తర్వాత మనింటికి ఎవరూ రాలేదు” అన్నాడు సత్యం,

“సందర్భమేమీ లేకుండా ఇప్పుడెందుకు? మనమే ఇల్లు కట్టుకున్నప్పుడు పిలుద్దాం. బట్టలవీ పెట్టి పంపించొచ్చు. దేవసేన కాలేజ్ కెళ్లే మనిషి. పిల్లలకు స్కూళ్లుంటాయి. వాళ్లకు రావటానికి ఎక్కడ కుదురుతుంది?” అనేసింది.

“ఇంటికెవరన్నా వస్తే సంతోషంగా వుంటుంది. మీకేమో మరో మనిషి పొడే గిట్టదు. మా ఇంటికెపుడూ ఎవరో ఒకరు బంధువులు వస్తూనే వుంటారు. అమ్మ నాన్నాలు ఏనాడూ విసుక్కునే వాళ్లు కాదు. సంతోషంగా మర్యాదలు చేసి పంపేవారు. చిన్నప్పుడు మా ఇంట్లో ఇద్దరు పనివాళ్ల జంట వుండేవాళ్లు. వాళ్ల ఇంటికి కూడా ఎప్పుడూ ఎవర్నో ఒకర్ని రమ్మని పిలుస్తూనే వుండేవాళ్లు. వాళ్లకిద్దరు పిల్లలు. ఆ పిల్లల పుట్టినరోజులకూ, చివరికి రాఖీ పౌర్ణమికి కూడా బంధువులొచ్చేవారు. అతడేమో తన ఆడపడుచుల్ని అందర్నీ పిలిచి రాఖీ కట్టించుకునే వాడు. ఆవిడేమో తన అన్నదమ్ములనందరినీ పిలిచి రాఖీ కట్టేది. వచ్చే బంధువులు కుటుంబాలతో సహా వచ్చేవాళ్లు. మరో సంవత్సరం రాఖీలు కట్టటానికి వీళ్లు వెళ్లేవాళ్లు. ఇలా తరుచూ అందరూ కలుసుకుంటూ వుండేవాళ్లు. కావటానికి వాళ్లంతా కూలి పనులు చేసుకుని బ్రతికేవాళ్లే. వినటానికి, చూడటానికి చాలా బాగుండేది.”

“చుట్టాలందరినీ పిలిచి ఏంచేసి పెట్టావు?” అని అమ్మ అడిగేది.

“రెండు పాల పాకెట్లు కొన్నాను. దాంట్లో ఎక్కువగానే నీళ్లుపోసి సగ్గుబియ్యం పంచదార వేసి పల్చగా కాచాను. అదే తలా కాస్తా గ్లాసుల్లో పోసుకున్నారు. రెండు కిలోలు మాంసం, ఒక కిలో బంగాళదుంపలు వేసి పులుసు పెట్టాను. నాలుగు కిలోల బియ్యం వండాను. ఉడికిన అన్నంలో ఈ పులుసు పోసి కలిపాను. అన్నాన్ని ఒక డేగిసాకు వేశాను. అందరూ వుంటిరి. తలా ఓ ముక్కో, రెండు ముక్కలో వచ్చాయి. దాన్నే పళ్లాల్లో పెట్టుకుని తిని పోయారు. మీరంతా ఇచ్చిన రవికెల బట్టలు వున్నాయి. ఆడపడుచులకు, బావ కూతుళ్లకు, మనుమరాళ్ళకు అందరికీ తలా ఒక రవికెల బట్టా, ఓ యాభై రూపాయలు ఇచ్చి గాజులు వేయించుకోమన్నాను. అంతకంటే మా అసుమంట్లోళ్లం ఇంకేం పెట్టగలమమ్మా! పాపం వాళ్లే ఛార్జీలు పెట్టుకుని వచ్చారు. మరి కొంత మంది బైకు వేసుకుని వచ్చారు” అని చెప్పింది.

“నాకా మాటలు బాగా గుర్తున్నాయి సుధా. ఎన్ని రకాలతో తిన్నామా అని కాదు. ఎంత ఆనందంగా గడిపామా అన్నది ముఖ్యం., బంధువుల మధ్య సంబంధాలు దూరం కాకుండా వుండటానికి మన పెద్దవాళ్లు పండుగలూ, పబ్బాలు జరుపుకుంటూ నలుగుర్నీ పిలుచుకునే వాళ్లు అని నాకన్పిస్తుంది.”

“ఇదివరికటి రోజుల్లో ఖాళీగా వుండే వాళ్లు కాబట్టి అవన్నీ సాధ్యపడేవి. ఇప్పుడెవరికి తీరుబాటు వున్నది కనుక? ఏదో ఫోన్‌లో మాట్లాడుకుంటున్నాం. కష్టసుఖాలు చెప్పుకుంటున్నాం. అయినా మనమెవరి ఇళ్లకైనా వెళ్లి తిష్ఠ వేస్తున్నామా? మన ఇంటికెవరూ రాలేదు అనుకోవటం అనవసరం. నాకలాంటి ఇంట్రెస్టు లేనే లేదు. మీకుంటే మీరు పిలుచుకోండి. తులసి చేత కొన్ని రకాలు చేయించండి. మరికొన్ని రకాలు బయటి నుండి తెప్పించుకోండి. అన్ని కలిపి తులసి డైనింగ్ టేబుల్ మీద సర్దుతుంది. అంతే కాని నాకింట్రెస్టు లేని పనులు నేను చెయ్యను” అని తెగేసి చెప్పింది.

“నీకింట్రెస్టు వుండే పని మంచిదొకటీ లేదులే” అన్నాడు.

“మీరే మనుకున్నా నాకేం బాధలేదు.”

“పనులన్నీ తులసి మీదే వదిలేశావు. పిల్లలు కూడా నిన్ను ఏదైనా కావాలని అడగటం మానేసి తులసీ, తులసీ అనే అంటున్నారు. మరో పనిమనిషినీ పెట్టావు. ఇల్లు కట్టుకుంటేనే ఇంటి ఆడపడుచును రమ్మని పిలవాలా! అక్క ఎలాగూ అమెరికాలో వున్నది. తనేం చీటికీ మాటీకీ రాలేదు.”

“మీకంతగా పిలవానుంటే పిలవండి. దానికింత వాదన అనవసరం.”

సుధకిష్టం లేని పని చేస్తే దాని పర్యవసానమేమిటో సత్యానికి బాగా తెలుసు కాబట్టి దేవసేనను రమ్మని పిలిచే ఆలోచన మానుకున్నాడు. ఎప్పుడైనా చికాకనిపిస్తే వెంటనే సత్తెనపల్లి వెళ్లి అక్కడ ఓ రోజో, రెండు రోజులో వుంటాడు. ఉక్కపోత నుంచి పైరగాలిలోకి వెళ్లినట్లుగా సేదదీరి వస్తాడు. పెత్తనం చెలాయించే మామగారు, అంతా నాకే తెలుసు అని విర్రవీగే బావమరిది అన్నా లోలోపల వెగటు పుడుతున్నది. సధారాణికి ఇవేం పట్టవు. తండ్రీ, అన్నా కలసి సత్యానికి డబ్బు సంపాదించే, ఉపాయాలన్నీ నేర్పిస్తారు. కుప్పలు తెప్పలుగా డబ్బు రాశులతో త్వరలో తమ ఇల్లు నిండిపోతున్న ఆలోచనలు వున్నది. సత్యం ఇన్ని రోజులు సత్తెనపల్లిలో చేసిన బిజినెస్‌లు తన దృష్టిలో బిజినెస్‌లే కావు. వారం వారం బ్యూటీ పార్లర్‌కు వెళ్లి అందాలను తీర్చిదిద్దుకునే పనిలో వున్నది. సినిమాలు, షికార్లు, కొత్త కొత్త వాళ్లతో పరిచయాలు చేసుకోవటంతో తీరిక లేకుండా గడిపేస్తున్నది. తులసి అన్ని వడ్డించి పళ్లెం చేతికిస్తే తినటం అలవాటు చేసుకున్నది.

“వంటేం చేయమంటారమ్మా” అనడిగితే “ఎవరేం ఇష్టంగా తింటారో నీకిపాటికి తెలిసే వుంటుంది. నువ్వే ఆలోచించి వండెయ్. నాకు ప్రమీలగారింట్లో పార్టీ వున్నది. రెడీ అవ్వాలి” అంటూ అక్కడినుంచి వెళ్లిపోయేది.

సుధారాణి అన్నయ్యకు ఆరాటమెక్కువ. ఎక్కడా కాలు నిలకడగా ఒక చోట వుండదు. ఒకేసారి పది పనుల్ని వాటేసుకుని పూర్తి చేద్దామనుకుంటాడు. గోడవున్స్ కట్టటం కోసం ఇంజనీర్ చేత ప్లాన్ గీయించాడు. వర్కర్స్‌ను మాట్లాడాడు. మెటీరియల్ షాపులకు ఫోన్ చేసి మెటీరియల్ పంపమని చెప్పాడు. అంతే తన బాధ్యత అయిపోయిందనుకున్నాడు. సత్యమే దగ్గరుండి అంతా చూసుకుంటున్నాడు. ఎప్పుడైనా ఫోన్ చేసి పనెలా సాగుతుంది? అని మాత్రం అడుగుతాడు.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here