కర్మయోగి-17

0
7

[అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయి. జమ్మలమడుగు ఎం.ఎల్.ఎ. తమ ప్రాంతంలోని గండికోట గురించి వివరించి, పర్యాటక పరంగా అభివృద్ధి చేయాల్సిన అవసరం గురించి మాట్లాడుతాడు. పర్యాటక శాఖా మంత్రిగా సమధానం ఇస్తూ – రాష్ట్రంలోని అన్ని పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేయాలనే తమ ప్రణాళికలు వివరిస్తాడు జగత్ మోహన్. అదే సమయంలో రేపల్లె నియోజకవర్గ ఎమ్.ఎల్.ఏ. లేచి నిలబడి భట్టిప్రోలు బౌద్ధ స్తూపం గురించి, దాని అభివృద్ధి గురించి ప్రస్తావిస్తాడు. అందుకు తగిన సమాధానం చెప్తాడు జగత్ మోహన్. రాజేష్‌కు మెడికల్ కాలేజీలో పని ఒత్తిడి ఎక్కువగా వుంటుంది. అయినా, పేదవారికి వైద్య సేవలు అందించేందుకు ‘జీర్ణకోశ వ్యాధుల క్లినిక్’ పేరుతో క్లినిక్ పెడతాడు. ఒకరోజు ఆరోగ్య సమస్యతో గాంధీజీ సేవాసమితిని నడిపే మాతాజీ ఆ క్లినిక్ వస్తారు. మందులు రాసి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పి పంపుతాడు రాజేష్. కొన్ని రోజుల తరువాత మళ్ళీ వస్తుందావిడ. ‘రాజేశ్వరి’ గురించి అడుగుదామనుకుని కూడా, అడగడు రాజేష్. – ఇక చదవండి]

[dropcap]సు[/dropcap]జాత భర్త సత్యనారాయణకు ఫోన్ చేశాడు.

“సార్! మనం ఎక్కడయినా కలుసుకుందాం. మీతో కొంచెం మాట్లాడాలి! నా స్థలం కాగితాలు తీసుకున్న అతన్ని కూడా రమ్మంటాను. మన ముగ్గరం కూర్చుని మాట్లాడుకోవటం చాలా అవసరం” అన్నాడు ప్రాధేయపూర్వకంగా.

‘ఇప్పుడు తాను మధ్యవర్తిగా వుండి మాట్లాడి తమ పాతికలక్షలు కూడా వసూలు చేసుకోవాలి’ అనుకుంటూ “పెట్రోలు బంక్ ఆఫీస్‌లో కూర్చుందాం రండి” అన్నాడు.

ముగ్గురూ కూర్చున్నారు. “నేను వడ్డీ కోసమే అప్పు ఇచ్చానండీ. ఇందులో ఇక మాట్లాడటానికీ, తగ్గించి ఇవ్వటానికి కుదరదు. నేను మరో మాట మాట్లాడను” అంటూ గట్టి పట్టు మీదే వున్నాడు.

“మీరు మూడు రూపాయల వడ్డీ కాదు లెండి షావూకారు గారూ. వాళ్లూ మన పిల్లల్లాంటి వారే. ఇంకో మాట చెప్పండి” సత్యనారాయణ అడుగుతున్నాడు.

“ఏంటండీ ఈ బేరాలు! ఆ స్థలమేదో అమ్ముకుని నా తంటాలు నేను పడతాను”అంటూ లేచి నిలబడ్డాడు.

“నేనూ వ్యాపారస్థుడ్నే, నా మాటైనా కాస్త వినండి” అంటూ బలవంతం చేసి కూర్చోబెట్టాడు. “ఎంత తగ్గిస్తారో చెప్పండి” అంటూ మళ్లీ అడిగాడు సత్యనారాయణ.

“ఒక పదిపైసలు తగ్గంచగలను.”

“మరీ పది పైసలేంటండీ, బాగుండలేదు.”

“పోనీ ఒక పావలా తగ్గంచుకోండి. అంతకన్నా తగ్గేది లేదు.”

“సేఠ్ గారూ! అలా కాదు లెండి. ఈసారికి రెండు రూపాయల వడ్డీ తీసుకోండి. నాకు మీరు ఊరికే అప్పు ఇచ్చినట్లుగా సంతోషపడతాను” అన్నాడు సుజాత భర్త.

“ఇంకా నయం. రూపాయకే ఇవ్వమనలేదు. ఇలాంటి బేరాలయితే ఇక నేను వ్యాపారం మానుకోవాల్సిందే.” అంటూ మరలా లేచి నుంచున్నాడు.

“షాపుకారు గారూ నేను చెప్తా. వినండి 2 రూపాయల 5 పైసల మీద పరిష్కారం చెయ్యండి. మీ కంత ఇబ్బందేం వుండదులెండి” అంటూ సత్యానారాయణ మరో ప్రతిపాదన చేశాడు.

“సరే కానివ్వండి. బాగా మొహమాటం పెట్టేస్తున్నారు. ఇంతకీ స్థలం కొనే వాళ్లెవ్వరు? వాళ్లను, నా దగ్గరకు తీసుకు రండి. నాకు నమ్మకం కల్గితేనే కాగితాలు ఇస్తాను” అంటూ వెళ్లిపోయాడు.

సత్యనారాయణే స్థలాల బ్రోకరును పట్టుకుని స్థలం బేరం పెట్టించాడు. గజం 5 వేలు చొప్పున 1000 గజాల చోటు అమ్మితే బ్రోకరు కమీషను పోను 49న్నర లక్షలే వస్తున్నాయి. వడ్డీ 15 లక్షలయింది. ఆయనకు మొత్తం 40 లక్షలు పోతే సుధారాణి అప్పుకు సరిపోవు. కూతురు చేసిన పనికి సత్యనారాయణకు బాగా విసుగొచ్చింది. ఏం చేద్దామన్నట్లుగా సత్యనారాయణ సుజాత భర్త వంక చూశాడు.

“సరే సత్యనారాయణగారూ, మిగిలే తొమ్మిది లక్షలూ చెల్లేసుకోండి. ఆ దగ్గర్లో కోటికలపూడి స్థలం వున్నది. ఇది కూడా అమ్మించండి. మీ డబ్బు మీరు తీసుకోవచ్చు” అన్నాడు. నెలలోపే బేరం వచ్చింది. ఇది గజం నాలుగవేలే. 500 గజాల స్థలం వున్నది. వడ్డీ రేటు తగ్గించి తీసుకున్నాడు సత్యనారాయణ. మొత్తానికి సుజాత భర్త మాట నిలబెట్టుకున్నాడు.

డబ్బు తీసుకుని ఇంటి కెళ్లి కూతుర్ని బాగా కేకలేశాడు. “అతను మంచివాడు కాబట్టి స్థలం అమ్మి సర్దుబాటు చేశాడు. ఇంకెప్పుడూ ఇలాంటి వెధవ పన్లు చేయకు” అంటూ డబ్బిచ్చాడు.

సుధారాణికి కంట్లో నీళ్లు తిరిగాయి. పాపం! సత్యానికొక మాటా తెలియనివ్వలేదు అనుకున్నది.

సుధారాణి ఫ్రెండ్స్ అంతా కలసి కేరళ ట్రిప్పేద్దామనుకుంటున్నారు. “వెళ్లబోయే ప్లేసెస్ లోని హోటల్స్, రిసార్టుల నంబర్లు తీసుకుని ఆన్‌లైన్‍లో బుక్ చేసుకుంటే మన పని తేలిగ్గా వుంటుంది” అన్నది ఒకామె.

“దక్షిణ భారత దేశపు స్వర్గం అంటారుగా కేరళను. ఎప్పుటి నుంచో చూడాలనుకుంటున్నాను. మా వదిన వెళ్లొచ్చి అక్కడి వివరాలన్నీ చెప్పింది. కేరళ టూరిజం డెవలప్‌మెంట్ కార్పోరేషన్ వాళ్ల గెస్ట్ హవుస్‌లు వుంటాయి. అందులో దిగి మున్నార్, మీన్‌ముట్టి జలపాతం, కోవలం బీచ్, తిరువనంతపురం, వెంబనాడు సరస్సు మొదలగు వన్నీ చూశామని వాటి గురించి వర్ణించి చెప్పింది. బోట్ హవుస్‍లో షికార్లు ఊరిస్తూ చెప్పింది. మనమూ పోదాం” అంటూ మరొకామె తీర్మానం చేసింది. సుధారాణికీ మాటలన్నీ తెగ నచ్చాయి. సత్యం పనులు ఎంతవరకొచ్చాయో ఏం పట్టించుకోదు. పిల్లల చదువులు అసలే పట్టదు. ఇంట్లో పనుల మీద మొదలే శ్రద్ధ లేదు. ఇదంతా చూసి సత్యానికి చాలా అసంతృప్తిగా వున్నది. అటు వంటి స్థితిలో కేరళ ట్రిప్ సంగతి ఎలా చెప్పాలా అని మథన పడసాగింది. పోనీ వదినను కూడా రమ్మని చెప్తే తన సపోర్ట్ నాకు దొరుకుతుందని ఆలోచించింది. వాళ్ల వదినకు ఫోన్ చేసింది. “ముందు అత్తయ్య మనల్ని సపోర్ట్ చెయ్యాలి. అత్తయ్య ఒప్పుకుంటే తనే అందర్నీ ఒప్పించి మనల్ని పంపిస్తుంది.” అని ఒక సూచన చేసింది.

అలాగే అమ్మను ఒప్పించుకోవాలనుకున్నది సుధారాణి.

ముందు సత్యంతో చెప్పింది.

“చూస్తున్నావుగా సుధా! నేనూ మీ అన్నయ్య ఎంత ఒత్తిడి పనిలో వున్నామో. మనమంతా ఫ్రీ అయ్యాక, మన రెండు ఫ్యామిలీలు కలిసి వెళ్దాం. ఇప్పుడొద్దు” అన్నాడు.

“మీ ఇద్దరికీ కుదిరితే ఏ కాశ్మీరుకో పోదాం. ఇప్పుడు నేను వెళ్తాను. కాదనకండి.”

“నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో” అన్నాడు కోపంగా.

సుధారాణి తన తల్లినీ ఒప్పించింది. “అన్నయ్యకూ, నాన్నకూ చెప్పు. ఒక పది రోజులు పిల్లల్ని చూసుకో. నా పిల్లల్ని తులసి బాగానే చూస్తుందిలే” అంటూ తన వదినతో సహా కేరళ ట్రిప్‌కు బయలుదేరింది.

తులసి గుడివాడ నుంచి విజయవాడకు వచ్చిన తర్వాత నాజూకు తేలింది. తన కింద ఒక పనిమనిషి వుంటుంది. ఆ పనిమనిషి సహాయంతో సుధారాణి ఇల్లంతా తులసే చక్కబెడుతుంది. సుధారాణి ఏది పట్టించుకోదు. సత్యం బాగా సర్దుకుపోతాడు. పిల్లలే కాస్త పెంకితనం చూపిస్తారు. అయినా విసుక్కోకుండా ఓపిగ్గా పిల్లల పనులు చూస్తూ వాళ్లక్కావలసినవన్నీ అమర్చతుంది. ఏ నెలకానెల జీతం గుడివాడ పంపేస్తున్నది. అప్పుడప్పుడూ గుడివాడ వెళ్లి పిల్లల్ని చూసొస్తుంది. అప్పుడల్లా సుధారాణి పళ్లూ, బిక్కట్లూ, చాక్లెట్సూ ఇచ్చి పంపుతుంది. ఏదో బాగానే జరిగిపోతుంది అని ఆలోచించుకుంటూ తులసి పనులు చేసుకుంటున్నది. రాత్రి పూట నైటీలు వేసుకోవటం అలవాటు చేసుకున్నది. వేసవి కాలం మొదలైంది. ‘చిరాగ్గా వుంది’ అనుకుంటూ స్నానం చేసి నైటీ వేసుకున్నది. మెడ చుట్టూ వత్తుగా పౌడర్ చల్లుకున్నది. పిల్లల్ని తీసుకెళ్లి A.C. ఆన్ చేసి పడుకోబెట్టింది. వాళ్ల గది తలుపులు చేరవేసి వచ్చింది. సత్యం బాబు ఎప్పటికొస్తాడో అనుకునేలోగానే వచ్చాడు. రాగానే స్నానం చేసి భోజనం చేశాడు. హాల్లో కూర్చుని టీ.వీలో న్యూస్ ఛానల్ చూస్తూ కూర్చున్నాడు. తులసి తను కూడా అన్నం తినేసి వంటిల్లు సర్దుకుంటుంది. వంటింటి వాకిట్లో ఏదో అలకిడి అయితే తలెత్తి చూసింది. చేతిలో ఖాళీ వాటర్ బాటిల్‌తో సత్యం నిలబడి వున్నాడు. మంచి నీళ్లు పెట్టటం తను మర్చిపోయింది. “కూలింగ్ వాటరొద్దు. మామూలు వాటర్ ఇవ్వు తులసి” అన్నాడు.

వాటర్ కూలర్ నుంచి వంగి నీళ్లు పడుతూ కిందకు వంగిన తులసి గుండెల దగ్గర ఎత్తు పల్లాలు ఎదురుగా నుంచున్న సత్యానికి లైట్ వెలుతుర్లో బాగా కనపడ్డాయి. తులసి ఒంటి నుంచి మైసూర్ శాండిల్ సబ్బు వాసనా, మెడ చుట్టూ అద్దుకున్న పౌడర్ వాసనా రెండూ కలగలిపి సత్యం ముక్కు పుటాల్ని తాకాయి. లైట్ల వెలుతుర్లో బాగా నునుపు తేలిన తులసి చాలా అందంగా కనపడింది. ఒక్క క్షణం తనేం చేస్తున్నాడో తెలియని సత్యం నీళ్లసీసా చేతిలో పట్టుకున్న తులసి భుజాల చుట్టూ చేతులు వేశాడు.

“సత్యం బాబూ!” అని మాత్రం అంటూ ఉలిక్కిపడి చేతిలోని మంచి నీళ్ల సీసా గచ్చు మీద వదిలేసింది. నీళ్లు గచ్చు మీద పడి కిందంతా ఆక్రమించుకోసాగాయి. సత్యం ఏం మాట్లాడకుండా తులసిని అలాగే పట్టుకుని రెండో బెడ్ రూమ్‌కు నడిపించాడు. తన భుజాల చుట్టూ వున్న చేతులను తీసెయ్యాలనిపించలేదు తులసికి. సత్యం మంచితనానికి, వాళ్ల ఉప్పు తింటున్నాననే భావనకూ తలొగ్గింది. ఒక అరగంట గడిచాక సత్యం పిల్లల బెడ్ రూమ్ లోకి నడిచాడు. వెనకాలే వచ్చిన తులసి మంచినీళ్ల సీసా అక్కడపెట్టి సత్యం ముఖం వంక చూసింది. అతని ముఖంలో చాలా సంతృప్తి కనపడింది. చాలా రోజుల తర్వాత ఆ రాత్రి సత్యానికి కమ్మని నిద్ర పట్టింది. తన గదిలోకి వెళ్లిన తులసికి మాత్రం నిద్ర కరువైంది. ‘తనేం చేసింది! ఇది సుధమ్మకు అన్యాయం చేసినట్లేమో! సత్యంబాబును తనెందుకు వారించలేకపోయంది? సుధమ్మకు తెలిస్తే గొడవలవుతాయేమో? తనను ఇంట్లో నుంచి వెళ్లగొడ్తుందేమో? బతుకుతెరుపు పోతుంది’ అన్న ఆలోచనలతో ఆ రాత్రి నిద్రకు దూరమయ్యింది. పని చెయ్యటానికి వచ్చిన పనమ్మాయి “ఏంటి తులసక్కా బడలికగా కనిపిస్తున్నావు” అనగానే ఉలిక్కిపడింది. “ఎందుకో పాత సంగతులు గుర్తుకొచ్చి నిద్ర పోలేకపోయాను” అన్నది.

ఆ రోజు రాత్రి నుంచీ సత్యానికి ప్రతి రాత్రీ పది రోజుల పాటు హాయిగా నిద్రపట్టింది. తులసికి కూడా మొదటి రెండు రోజులు వున్న జంకు తర్వాత తగ్గింది.

మధ్యలో సుధ అమ్మనాన్నలు కొడుకు పిల్లలనిద్దరినీ తీసుకుని ఆదివారం పూట విజయవాడ వచ్చి వెళ్లారు. వాళ్లకే మాత్రం అనుమానం రాలేదు. రామ్, కృష్ణ ఇద్దరూ తల్లిని తలవకపోవటం వాళ్లకు కొంత ఆశ్చర్యం వేసింది. “తులసి ఎలా చూస్తున్నది” అని పిల్లల్ని అమ్మమ్మ అడిగితే “బాగా చూస్తుంది. డాడీ పెందలాడే ఇంటికి వచ్చి మా హోమ్ వర్క్‌లూ, పడుకునేటప్పుడు మాకు కథలు చెప్తున్నారు” అని సంతోషంగా చెప్పారు. “రోజూ ఉదయం కూడా మాకు హెల్ప్ చేస్తూ, మా స్కూల్ బస్ కూడా ఎక్కిస్తున్నారమ్మామ్మా” అన్నారు.

సుధ బద్ధకస్తురాలయినా తులసి బాగా చూసుకుంటుందిలే అనుకున్నారు.

సుధ ఊరి నుండి తిరిగి వచ్చింది. ఇంటిల్లిపాదికీ బహుమతులు పట్టుకొచ్చింది. పిల్లలయితే వాటిని చూసి సంబరపడ్డారు. తులకిసి, తులసి పిల్లలక్కూడా తెచ్చింది. ఆ రోజు రాత్రి సత్యం వచ్చేటప్పటికి ప్రయాణపు బడలికతో సుధ పెందలాడే నిద్రపోయింది. మధ్య రాత్రి మెలుకవ వచ్చి పక్కన సత్యం వున్నాడనుకుని దగ్గరకు జరిగింది. ఖాళీగా అన్పించి లేచి చూసింది. బాత్ రూమ్ కెళ్లివుంటాడనుకుని బాత్ రూమ్ వంక చూస్తే అది బయటి నుంటే గడియ పెట్టి వున్నది. మంచి నీళ్ల కోసం వెళ్లాడా అనిచూస్తే మంచి నీళ్ల సీసా కూడా కనపడింది. నెమ్మదిగా బెడ్ రూమ్ తలుపు తెరిచి హాల్లోకి వచ్చింది. హాల్లో ఒక పక్కగా వున్న తులసి రూమ్‍లో నుంచి సన్నగా మాటలు వినిపించాయి. తులసి ఏదో అంటున్నది. ఆ తర్వాత మాటలేం వినపడలేదు. సత్యం అలా ఈ టైమ్‌లో తులసి గదిలోకి వెళ్లాడంటే నమ్మశక్యంగా అనిపించలేదు. కొన్ని క్షణాలపాటు సుధారాణి గుండె గబగబా కొట్టుకున్నది. కళ్లు తిరిగి పోతున్నాయి. తనిప్పుడేం చెయ్యాలి అనుకుంటూ మంచి నీళ్ల సీసా ఎత్తి గటగటా తాగింది. నిద్ర మత్తంతా పోయింది. వాళ్లకిలా అవకాశం కల్పించంది తనేనా? తల్లిదండ్రులకు చెప్పబోయినా ‘సత్యం చాలా మంచివాడు. నీ మూలానే అలా తయారయ్యా’డంటారు. తులసిని ఇక్కడి నుంచి పంపిచి వేస్తే? ఇలాంటి మనిషి తనకు మళ్లీ దొరకదు. సత్యన్ని నిలదీసినా లాభం లేదు. నా ఇష్టం అంటాడు. ఏం చెయ్యాలి? అనుకుంటూ దుప్పటి తీసి కప్పుకున్నది. సత్యం లోపలికొచ్చాడు. బెడ్ లైట్ వెలుతుర్లో సుధ వంకకు చూశాడు. ఇందాక లేని దుప్పటి ఇప్పుడు కప్పుకున్నది. వేసవి పెరిగేటప్పుడు సుధారాణి ఎప్పుడూ అలా కప్పుకోదు. మెలకువ వచ్చి వుంటుంది. తన సంగతి గ్రహించి వుంటుంది. తెలిస్తే తెలిసిందిలే అని నిర్లక్ష్యంగా అనుకుని తన మానాన తను పడుకున్నాడు.

సుధారాణికి ఉక్రోషంతో కళ్ల వెంట నీళ్లు కారిపోతున్నాయి. సత్యాన్ని, గుంజివేసి నిలెయ్యనా? తులసిని లాక్కొచ్చి చెంపలు పగలగొట్టనా? ఏం చేస్తే తన ఈ ఉద్రేకం తగ్గుతుంది? అర్థరాత్రి గొడవంతా ప్రక్క ప్లాట్స్ లోని వాళ్లు వింటారు. అనుకుని తన్ను తానే కంట్రోల్ చేసుకున్నది.

విజయవాడలో కట్టించే రైల్వే గోడవున్లూ, అద్దెల కిచ్చే షాపులూ అన్నీ పూర్తయ్యాయి. షాపుల్లో ఒక దాన్ని బాగా పెద్దగా వుంచి ఫినిషింగ్ చేయించారు. దాంట్లో మిల్ స్టోర్స్ పెట్టాలన్న ప్లాన్‍తో వున్నారు. సత్యామూ, బావమరిది కలిసి ఆ షాపు చూసుకునేట్టుగా అనుకున్నారు. కానీ ఆ బావమరిదికి షాపులో కాలు నిలవదు. ఆ సంగతి సత్యానికీ తెలుసు. ఇప్పుడా షాపులోకి కావలసిన మెటీరియల్ అంతా చెన్నై వెళ్లి చూసుకుని ఆర్డర్ పెట్టిరావాలి. చెన్నై కూడా సత్యమే వెళ్లాడు. హోటల్ రూమ్ తీసుకున్నాడు. ప్రక్క రూమ్‌లో నుంచి విజయవాడలో తెలిసిన వ్యక్తి బయటకొచ్చి కనుపించాడు.

“హలో ఏంటి ఇలా వచ్చారు” అంటూ పలకరించాడు.

“మిల్ స్టోర్స్ క్కావలసిన మెషీన్లు, స్పేర్ పార్ట్స్ అన్నీ చూసుకుని ఆర్డర్ పెట్టి వెళ్లాలని వచ్చాను” అన్నాడు.

“అవునా? మిల్ స్టోర్స్ బిజినెస్ బాగా సాగుతుంది. చుట్టు పక్కల చాలా రైస్ మిల్లులు వున్నాయి. వాటి క్కావలసిన స్పేర్ పార్ట్స్ అన్నీ దొరికేటట్లు ఒక పెద్ద మిల్లు స్టోర్స్ పెడితే పెట్టుబడికి ఢోకా వుండదు. సాయంత్రం అలా బయటకికెడదాం వస్తారా” అన్నాడు.

“అలాగే వెళ్దాం” అన్నాడు సత్యం.

పగలంతా సత్యంతో పాటు అతనూ తోడుగా వచ్చాడు. సాయంకాలమైంది. ఎదురుగా బార్ కనుపిస్తున్నది.

“రండి” అంటూ అతను దారితీశాడు.

“వద్దు. వద్దు. నాకలవాటు లేదు.”

“ఊరికే నాకు కంపెనీ ఇద్దరుగాని. ఇష్టం లేకపోతే ఓ కూల్ డ్రింక్ తెప్పించుకుని తాగండి” అంటూ నవ్వుతూ సత్యం చేయి పట్టకుని లోపలికి తీసుకెళ్లాడు. ఖాళీగా వున్న టేబుల్ ముందు కూర్చున్నారు. అతను తనక్కావలసినవి ఆర్డర్ చెప్పాడు.

“మీకో బీరు చెప్పేదా? అదైతే హాట్ డ్రింక్ కిందికి రాదు. అయినా మరీ ఇంత సత్తెకాలం మనిషల్లే వుంటే ఎలాగండీ” అంటూ ఒక బీరు తెమ్మని చెప్పాడు.

సత్యం చుట్టూ చూశాడు. అందరూ నింపాదిగా తాగుతున్నారు. ఎవరూ అతిగా వాగటం లేదు. తూలటం లేదు. తనూ తాగి చూస్తే అనిపించింది. సత్యం భావాన్ని పసిగట్టినట్లుగా బ్యాగ్ పైపర్ నింపిన ఒక చిన్న గ్లాసును అతను సత్యం ముందుకు నెట్టాడు.

ఒక గుక్కతాగి చూశాడు. వెగటుగా, వికారంగా అన్పించింది. మరో గుక్క తాగాడు. ఆ తర్వాత మరో గుక్క తాగాడు. ఫర్వాలేదనిపించింది. ఎదురుగా వున్న తను ఈలోగా బాటిల్ ఖాళీ చేశాడు. కారులో ఇద్దరూ హోటల్ రూమ్‌లకు వెళ్లారు. సత్యం బూట్లు విప్పాడు. మేజోళ్లు తీసే ఓపికలేక అలాగే పడుకున్నాడు. మగతగా అన్పించింది. ఆ రాత్రి హాయిగా నిద్ర పట్టింది. చెన్నై నుండి విజయవాడ వెళ్లేటప్పుడు సత్యం సూట్‌కేస్‌లు బ్యాగ్ పైపర్ బాటిల్స్ వున్నాయి. ఇప్పుడు దాని రుచి రోజూ కావాలనుకుంటున్నాడు సత్యం.

“ఇదేం అలవాటు” అని సుధారాణి బాటిల్‌ను, గ్లాసును లాగేయబోతుంటే – “దాన్నక్కడే వుంచు సుధా. నువ్వు వద్దని చెప్పినా నేను వినను. నువ్వు కోరుకునే హైక్లాస్ వాళ్లు చేసే పని ఇది. ఇలా చేయటం కూడా గొప్పే మరి. పిల్లలు వినేటట్లుగా గొడవ చేయకు వెళ్లు” అంటూ బాటిల్‌నూ గ్లాసునూ కప్ బోర్డ్‌లో వెనగ్గా పెట్టేశాడు. తులసి విషయమే నిలదీద్దామనుకుంటే సత్యం తాగుడుతోనూ కనపడుతున్నాడు. తులసి నడిగితే ‘నా తప్పేమీ లేదమ్మా సత్యం బాబే నన్ను బలవంతపెడుతున్నా’డంటున్నది.

సుధారాణికి ఏం చెయ్యాలో ఈ సమస్య ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాలేదు. ఎవరికైనా చెప్తే తన ఇంటి గుట్టును తనే అల్లరి చేసుకున్నట్లు అవుతుందేమోనని భయపడుతున్నది.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here