కర్మయోగి-2

0
10

[dropcap]“మీ[/dropcap] వ్యాపారాలన్నీ ఏం చేసి వస్తానంటారు? వీలైతే అక్కడుండే ఆరు నెలల్లో కూడా ఏదైనా వ్యాపారం చెయ్యటానికి వీలవుతుందా అని ఆలోచిస్తారు. మీ సంగతి నాకు తెలియదా!” అన్నది నవ్వుతూ.

“అవును సత్యవతి. రియల్ ఎస్టేట్, కన్‌స్ట్రక్షన్‍లతో పాటు ఆయిల్ మిల్ కూడా రన్ చేస్తున్నాం కదా! హోటల్‍ని మాత్రం లీజు కిచ్చేశాంగా”.

“లీజ్ కివ్వక ఏం చేస్తారు? హోటల్ మన కింద వున్నప్పుడెప్పుడైనా ఏనాడైనా అక్కడ భోజనం చేసి ఎరుగుదురా! ఏ స్నేహితుడైనా, చుట్టమైనా మిమ్మల్ని కలవాలని హోటల్ దగ్గర కొచ్చినా, వాళ్ళని ఇంటికే భోజనానికి తీసుకొచ్చేవారు కాని హోటల్‍లో ఏనాడు భోజనం పెట్టించి ఎరుగరు. ఒకవేళ హోటల్‌లో భోజనం చేయవలసి వస్తే మిగతా వాళ్ళ లానే మీరూ బిల్లు చెల్లించేవారు. మొదట్లో చుట్టాలు, స్నేహితులు అది చూసి చాలా అపార్థం చేసుకునేవాళ్లు. ‘మేం మరోసారి భోజనం చేయకుండా వుండాలనా రామారావు ఇలా చేస్తున్నాడు’ అనుకునేవాళ్ళు. గుర్తుందా?”

“అవును గుర్తుంది. ఎవరేమనుకున్నా నా సిద్ధాంతాలు నాకున్నాయి. నేనొకసారి నా స్నేహితుని కంటి వైద్యం కోసం హైదరాబాదులోని ఎల్.వి. ప్రసాద్ కంటి ఆసుపత్రికి వెళ్ళాను. అది ఎంత గొప్ప హాస్పిటలో నీకూ తెలుసు.  అక్కడకు ఎంత పెద్దవారొచ్చినా వరుస ప్రకారం వైద్యం జరగాల్సిందే. చివరికి ఎల్.వి. ప్రసాద్ గారితో సహా అందరూ ఫీజు కట్టి వైద్యం చేయించుకుంటారన్న విషయాలు తెలిసినవి. ఆ విషయాలు నాకెంతో నచ్చినవి. దాంతో నేనూ అదే నియమం పెట్టుకున్నాను. ఏ బంధువొచ్చినా, స్నేహితుడొచ్చినా ఇంటికి తీసుకొచ్చి నాతో భోజనం పెట్టించేవాడిని. హోటల్లోనే తినాల్సివస్తే బిల్లు కట్టేవాడిని. అర్థం చేసుకునేవాళ్ళు మెచ్చుకుంటారు. అర్థం చేసుకోలేనివాళ్లు అపార్థం చేసుకుంటారు. నేను చేసేది మంచి పని అయినప్పుడు నా పద్ధతి మార్చుకోవాల్సిన అవసరమే లేదు. మనకు హోటల్ రన్ చేసే అవకాశం లేదు కనుక లీజ్ కిచ్చాం. ఇప్పుడు, ఈ రఘురామ్‌నగర్ అంతా మన బిల్డింగులే. మన బిల్డింగ్‌ల్లోనే చాలా బట్టల షాపులు, మెడికల్ షాపులూ, హాస్టల్స్ వున్నాయి. ఆ మధ్య సత్యం ఏదో జిన్నింగ్ మిల్ కూడా తీసుకోవాలనుకున్నాడు.”

“ఈ చుట్టుపక్కల పత్తి బాగా దొరుకుతుంది కదా! ఆ పని ఎప్పుడో చేయాల్సింది. చుట్టు పక్కల చాలా జిన్నింగ్ మిల్లులున్నాయి. అయినా మన మింకోటి పెట్టుకున్నా బాగానే రన్ అవుతుంది.”

“నీకూ వ్యాపారాల పట్ల అవగాహన పెరుగుతున్నది సత్యవతీ” అనే రామారావు అనేలోగానే కింద నుంచి మరోసారి కారు చప్పుడయింది.

‘పెద్దబ్బాయి జగత్ వచ్చినట్లున్నాడు’ అనుకున్నారు.

జగత్ వస్తూ వస్తూ గేట్లకు తాళాలు వేసి వచ్చాడు. కిందంతా సెల్లార్‌ను పార్కింగ్‌కూ, లిఫ్ట్‌కూ వదిలేశారు. మొదటి అంతస్తులో హాలు, రెండు బెడ్ రూములు, కిచెన్, డైనింగ్ రూమూ వున్నాయి. రెండో అంతస్తులో హాలుతో పాటు మూడు బెడ్ రూమ్‍లున్నాయి.  జగత్, సత్యము తమ పిల్లలతో సహా రెండో అంతస్తులోని బెడ్‍ రూము‍లు ఉపయోగించుకుంటారు. మూడో అంతస్తులోని హాలూ, బెడ్ రూమ్‍లూ అతిథుల కోసం వుంచుతారు. మొదటి అంతస్తులో రామారావు, సత్యవతీ వుంటారు.

శశాంక్ కాని, శైలజ కాని, రామ్, కృష్ణలలో ఎవరైనా తాతగారి దగ్గరో, నాయనమ్మ దగ్గరో పడుకుంటామని ఒక్కోరోజు అడుగుతారు. ఆ రాత్రి కక్కడే కథలు చెప్పించుకుంటూ, నిద్రపోతారు.

పిల్లల భోజనాలు అయిపోయాకా, పెద్దవాళ్ళంతా భోజనాలకి కూర్చున్నారు. రామారావు పక్కన సత్యవతీ, తర్వాత జగత్, శశిరేఖలూ, ఆ తర్వాత సత్యమూ, సుధారాణులు రోజూ లాగే కూర్చున్నారు. అలా కూర్చుని భోజనాలు చెయ్యాలని రామారావు దంపతుల కోరిక. భర్తా, బిడ్డలు లేని వరలక్ష్మి వీళ్ళ ఇంట్లోనే వుంటూ, వంటా వార్పూ, వడ్డనా అంతా చూసుకుంటుంది. ఉదయం టిఫినూ, రాత్రి భోజనాలు మాత్రం కుటుంబం మొత్తం కలిసి కూర్చుని చేయాల్సిందే. కొడుకుల్నీ, కోడళ్ళనీ, వాళ్ళ సంతానాన్నీ రోజూ అలా చూసుకోవటంతో రామారావుకీ, సత్యవతికీ సగం కడుపు నిండిపోయేది. “కోడళ్ళు చిన్నవాళ్ళు. వాళ్లు తెలిసో తెలియకో, ఏదైనా పొరపాటుగా మాట్లాడినా, పొరపాటు పనులు చేసినా నువ్వే సర్దుకుపోవాలి సత్యవతీ. ఈ మాట బాగా గుర్తు పెట్టుకో. అందరం ఇలా కలిసి ఉండడం, కలిసి భోం చేయటం ప్రతీ రోజూ పండుగలానే వుంటుంది మన ఇంట్లో. దాన్ని మనం దూరం చేసుకోకూడదు” అని రామారావు తరచూ సత్యవతితో అనేవాడు.

“నా గురించి మీకు తెలియదా? అందరం కలిసి మెలిసి వుండే ఆనందాన్ని నేను మాత్రం దూరం చేసుకుంటానా? తప్పుకుండా నేనే సర్దుకుపోతాను” అని సత్యవతి బదులిచ్చేది.

***

శశిరేఖ నిన్నా మొన్న కాపురానికి వచ్చిన పిల్లలాగా ఇప్పటికీ ఒదిగొదిగి వుంటుంది. ఆమెదీ ఊరే. వాళ్ళ నాన్న నరసింహారావు కృష్ణా నర్సింగ్ హోమ్‍లో సీనియర్ కాంపౌండరుగా పని చేస్తాడు. మురళీ, శశిరేఖలిద్దరూ ఆయన పిల్లలు. శశిరేఖ మునిసిపల్ హైస్కూల్‍లో చదివేది. శశిరేఖకు సీనియర్ జగత్ మోహన్. అతని పెద్ద చెల్లెలు ప్రియంవద. ప్రియంవదా, శశిరేఖలు ఒకే తరగతి చదువుతూ, చాలా స్నేహంగా వుండేవాళ్ళు. బాగా తెలివి గల పిల్ల కావడం వలన శశిరేఖ ఉపాధ్యాయులందరి అభిమానం సంపాదించింది. దానికి తగ్గట్టు గానే ఆ సంవత్సరం టెన్త్ క్లాస్ పరీక్షలు వ్రాసి స్కూల్ ఫస్ట్ వచ్చింది. ప్రియంవదతో పాటు అప్పుడప్పుడు ఇంటికి వచ్చే శశిరేఖ పట్ల జగత్ మోహన్‌కు ఇష్టం కలిగింది. అదే స్కూల్లో జూనియర్ కాలేజీ కూడా వున్నది. యమ్.పి.సి. గ్రూపు తీసుకుని శశిరేఖ ఇంటర్‍లో చేరిపోయింది. గుంటూరు ‘వికాస్’ రెసిడెన్షియల్ కాలేజీలో జగత్  మోహన్ అప్పటికే ఇంటర్ పూర్తి చేశాడు. ప్రియంవద కూడా అక్కడే ఇంటర్‌లో చేరింది. జగత్ మోహన్‍ని బిటెక్, ఆ తరువాత యమ్.బిఎ. చేయించాలని రామారావుకు బాగా కోరిక. జగత్ మోహన్‌ బి.టెక్ మూడో సంవత్సరానికొచ్చాడు. ప్రియంవద కూడా బి.టెక్‍లో చేరింది. ఆమెకు బి.టెక్ కాగానే యమ్మెస్ చేయడానికి అమెరికా వెళ్ళాలని గట్టి పట్టుదల వున్నది.

జగత్ మోహన్‌కు బి.టెక్ అయిపోయింది. అప్పటికి రామారావు ఆర్థికంగా బాగా నిలదొక్కుకున్నాడు. కొడుకును యమ్.బి.ఎ. చేయించాలనీ, ప్రియంవదకు మంచి సంబంధం అందులోనూ, అమెరికాలో వున్న అతన్ని చూడాలన్న కోరికతో ప్రయత్నాలు చేస్తున్నాడు. ప్రయత్నాలు ఫలించాయి. ప్రియంవదకి కాబోయే పెళ్ళికొడుకుది దొండపాడు. అమెరికాలో వుంటూ సాఫ్ట్‌వేర్ ఇంజనీరుగా పనిచేస్తున్నాడు. ప్రియంవద షాపింగ్‍లకు తిరిగేటప్పుడు ఒక్కోసారి శశిరేఖకూ కబురు చేసి, తోడు తీసుకెళ్ళేది.

జగత్‍ మోహనే కార్లో తీసుకెళ్ళి, దింపుతూ వుండేవాడు. అతనికి శశిరేఖ పట్ల ప్రేమ రోజు రోజుకూ పెరగసాగింది. ప్రియంవద పెళ్ళి ఇక్కడ కాలేజ్ గ్రౌండ్ లోనే అంగరంగ వైభవంగా జరిగింది. దొండపాడు చుట్టాలకు బాగా మర్యాదలు చేసి భారీగా కట్నకానుకులు ముట్టజెప్పారు. ఆ తర్వాత కొద్ది రోజులకే ప్రియంవద అమెరికా వెళ్ళిపోయింది. జగత్ మోహన్ యమ్.బి.ఎ. మొదటి సంవత్సరం పూర్తయ్యింది. సత్యం, దేవసేనలున్నారు కాబట్టి వెంటనే జగత్ మోహన్‍ పెళ్ళి చేస్తే బాగుంటుందని సత్యవతి సలహా ఇచ్చింది.

శశిరేఖ బి.కాం పూర్తి చేసింది. ఉద్యోగ ప్రయత్నాలతో వున్నది. శశిరేఖ తమ్ముడు మురళి. మురళి కూడా బాగా తెలివి గలవాడు. ఖాళీగా వుండడం ఎందుకని శశిరేఖ తను చదివిన కాలేజ్ లోనే అకౌంటెంట్‍గా చేరింది.

తన పెళ్ళి ప్రయత్నాల మాత్ర విని జగత్ మోహన్‍ తన కోరికను తల్లితో చెప్పేయాలనుకున్నాడు.

“అమ్మా! కృష్ణా నర్సింగ్ హోమ్‍లో పనిచేసే నరసింహారావు గారు తెలుసుగా! ఆయన చాలా మంచివాడు. వాళ్ళమ్మాయి శశిరేఖ. మన ప్రియ కోసం వస్తూ వుండేది. చాలా మంచిదని నువ్వూ అనే దానివి. తను మన ఇంటి పెద్ద కోడలయితే నా కోరిక తీరుతుంది. మన బిజినెస్ ఎకౌంట్‍లనీ చూడగలదు. మనంత స్థితిపరులు కాకపోయినా పద్ధతి గల కుటుంబం. ఆ అమ్మాయి మనింటి కోడలయితే మనమంతా చాలా సంతోషంగా వుంటామన్న నమ్మకం వున్నది. నువ్వు అర్థం చేసుకో. నాన్నగారిని కూడా ఒప్పించు.” అన్నాడు.

“శశిరేఖా? నాకు గుర్తున్నది. బాగా ఒద్దిక గల పిల్ల. నాన్నగారేమంటారో చూడాలి. ఆలోచిద్దాం లే.”

“ఆలోచించటం కాదమ్మా. నువ్వే ఎలాగైనా పూనుకుని నా పెళ్ళి జరిగేటట్లు చూడాలి. ప్లీజ్ అమ్మా.”

జగత్ శశిరేఖను బాగా ఇష్టపడుతున్నాడని సత్యవతి కర్థమయింది. తన స్థితిగతులను పెంచుకున్నట్లే రాజకీయంగా కూడా ఎదగాలని రామారావు అన్ని ప్రయత్నాలూ చేసుకుంటున్నాడు. పెద్ద పెద్ద వాళ్లను కలిసి వస్తున్నాడు. దొండపాడు వియ్యంకుడు రాజకీయంగా పలుకుబడి కలిగిన వ్యక్తి. దాంతో ఆయన్ను కలుపుకుని వెళ్ళి హైదరాబాదు వైస్రాయి హోటల్‍లో మకాం పెడుతున్నాడు. వియ్యంకుడు చెప్పిన రాజకీయ పండితులను కలిసి మాట్లాడి వస్తున్నాడు. రామారావు ప్రయత్నాలు ఫలించి యమ్.యల్.ఎ.గా పోటీ చేయటానికి టికెట్ ఇచ్చారు. సత్తెనపల్లి నియోజకవర్గం నుంచే పోటీ చేసి గెలవాలనే పట్టుదలతో, పట్టరాని సంతోషంతో హైదరాబాదు నుంచి ఇంటికొచ్చాడు. నియోజకవర్గంలో తిరిగి ప్రచారం చేసుకుని యమ్.ఎల్.ఎ. కావాలన్న ప్రయత్నాలలో ఉన్న మనిషితో, ఈ పెళ్ళి మాటలు ఎలా చెప్పాలా అని సత్యవతి మథనపడసాగింది. శశిరేఖకు ఇంట్లో పెళ్ళి ప్రయత్నాలు జరుగుతున్నాయి కాబట్టి మనం తొందర పడాలని జగత్ వాదన.

“అమ్మా! ఎలక్షన్స్‌కి ఇంకా టైమున్నది. ఈలోగా నా పెళ్లి జరిగితే  బాగుంటుంది” అన్నాడు జగత్.

అతడి ఆదుర్దా గమనించి తనే భర్తతో మాట్లాడాలని నిర్ణయించుకున్నది సత్యవతి.

“నేను ఎలక్షన్స్‌లో పోటీ చెయ్యాలనుకుంటున్నప్పుడు ఈ మాటలేంటి సత్యవతీ? కొన్నాళ్లు పెదబాబును ఆగమని చెప్పు. యం.ఎల్.ఎ. హోదాలో నా స్థితికి తగ్గ సంబంధం చెయ్యాలనుకుంటున్నాను. నువ్వైనా ఈ సంబంధం మనకు తగదని చెప్పకపోయావా? పోయి పోయి కాంపౌండర్ కూతురితో తన పెళ్ళేంటి సత్యవతీ?”

“చూడండీ. మీరెంత ఒత్తిడి పనుల్లో వున్నారో నాకు తెలియంది కాదు. ఈ సంబంధం మాట వినగానే నాకూ అంత సమ్మతంగా లేదు. కానీ జగత్ బాగా ఇష్టపడుతున్నాడు. ఆ అమ్మాయిని నేను చాలాసార్లు చూశాను. లక్షణమైన పిల్ల. మన ప్రియ స్నేహితురాలే. మన స్థితికి తగినవారు కాదు కానీ, కుటుంబ పరంగా మంచివారు. ఏ వంకా పెట్టటానికి లేదు. మీరూ ఒకసారి ఆలోచించండి.”

“వాడికీ ఆలోచన ఎలా వచ్చిందసలు? నేననుకున్నదేమిటీ? జరిగేదేమిటి? నువ్వు వాడికి నచ్చజెప్పకుండా నా దగ్గరకు రాయబారం మోసుకొచ్చావు. వాడేం చిన్న వాడు కాదుగా? ఈ టైంలో పెళ్ళి చేసుకోవాలన్న ఆలోచన చేయటమేంటీ? నాకెంతో సపోర్ట్‌గా వుండాల్సిన వాడు. పెళ్ళి కావాలంటూ తొందరపడుతున్నాడు. ఇప్పుడు పెళ్ళి లేదు, ఏం లేదు” అన్నాడు విసుగ్గా.

“నేనొకటి చెప్పనా? మీరెలాగూ పోటీ చేయబోతున్నారు. ఈ టైమ్‌లో మీరే పెళ్ళి జరిపిస్తే ఆదర్శంగా ఉంటుంది. సత్తెనపల్లీ, ఆ చుట్టుపక్కల ఊళ్ళవాళ్ళంతా దీన్ని మెచ్చుకుంటారు. ఆస్తిపాస్తులు చూడకుండా బీదింటి పిల్లను కోడలిగా చేసుకున్నారనీ, నలుగురికీ ఆదర్శంగా నిలిచారనీ అనుకోవటం మాత్రం ఖాయం. మీ పట్ల వాళ్ళు అభిమానం పెంచుకుంటారని నాకు గట్టిగా అనిపిస్తున్నది. అటు పెదబాబు కోరికా తీరుతుంది, ఇటు ప్రజాభిమానమూ దక్కుతుంది.”

“నన్ను ఒప్పించడానికి, తల్లీ కొడుకులూ బాగానే గట్టిగా నిర్ణయించుకున్నారు. నన్ను నీ మాటల్తో సరేననిపించడానికి చూస్తున్నావు. ఆలోచిస్తానులే.” అన్నాడు కాస్త మెత్తబడిన గొంతుతో.

ఆ మాటే కొడుకుతో చెప్పింది సత్యవతి.

ఎలెక్షన్స్ గెలిచి యమ్.ఎల్.ఎ. అయితే నాన్న అస్సలు ఒప్పుకోకపోవచ్చు. ఇప్పుడే తను ప్రయత్నించి చూడాలని పించింది జగత్‍ మోహన్‌కు. తన స్నేహితుడి తండ్రిని మాట్లాడి రమ్మని నరసింహారావు గారి దగ్గరకు పంపించాడు.

“రామారావు గారి పెద్దబ్బాయి జగత్ మోహన్‍కు మీ శశిరేఖ నిచ్చి పెండ్లి చేస్తే బాగుంటుంది. వాళ్ళు డబ్బు మనుషులు కారు.  మీరూ, మీ అమ్మాయి ఒప్పుకుంటే మనం రామారావు గారింటికి వెళ్ళి మాట్లాడి వద్దాం. ఈ సంబంధం అన్ని విధాల మంచిది. పిల్లలిద్దరి ఈడూ-జోడూ బాగుంటుంది. నా సలహా ఏంటంటే – మీరు మీనమేషాలు లెక్కపెట్టకుండా ముందు కడుగు వేయండి. మంచి కుటుంబమూ, అణుకువ కలిగిన పిల్ల అయితే చాలు, కట్న కానుకల ప్రసక్తి లేదని తెలిసి నేను మీ దగ్గరకొచ్చాను. పైగా ఎలక్షన్స్ ముందే కొడుకు పెళ్ళి చేయాలన్న ఉద్దేశంతో వున్నారని తెలిసి నేను ఇలా వచ్చాను. మీరేం సందేహించవద్దు” అంటూ నచ్చ చెప్పి నరసింహారావును తన వెంట రామారావు గారింటికి తీసుకుని వెళ్ళి ఇరు పక్షాలలో తానే మధ్యవర్తిగా వుండి పెళ్ళి ఖాయం చేశాడు.

నెల లోపునే పెండ్లి జరిగిపోయింది. శశిరేఖను మనస్ఫూరిగానే రామారావూ, సత్యవతులు, తమ కుటుంబంలోకి ఆహ్వానించారు. శశిరేఖ తొలిసారి పండుగకని అత్తింటి నుంచి పుట్టింటికి వెళ్ళబోయే ముందు పళ్ళూ, స్వీట్లూ తనే తెప్పించి సత్యవతి కారులో పెట్టించింది. “ఎక్కువ రోజులు వుండకు శశిరేఖా. మళ్ళీ ఇక్కడ నాకేమీ తోచదు. ఇదిగో ఈ డబ్బు తీసుకో. నీకేమైనా అవసరమనిపిస్తే, ఈ డబ్బుతో కొనుక్కో” అని కొంత డబ్బు కూడా చేతిలో పెట్టింది.

అత్తగారి మంచితనానికి శశిరేఖ కరిగిపోయింది. ఊర్లోనే కాబట్టి పండుగపూట భోజనానికి మాత్రం వచ్చి వెళ్ళాడు జగత్ మోహన్. ఆ మాత్రం దానికే శశిరేఖ తల్లిదండ్రులు సంబరపడ్డారు.

ఇటు జగత్ మోహన్ యమ్.బి.ఎ. పూర్తయ్యింది, అటు రామారావు ఎం.ఎల్.ఎ. అయ్యాడు. ఊర్లో అతని హోదా పెరిగింది. ఆ ఐదేళ్ళూ హైదరాబాద్‌కూ, సత్తెనపల్లికీ తిరిగాడు. సత్యానికింకా చదువు పూర్తికాలేదు. జగత్ మోహనే తండ్రి వ్యాపారాలన్నీ చూడసాగాడు. పుట్టింటి నుంచి తమ ఇంటికి రిక్షాలో తిరిగొచ్చేది శశిరేఖ.

“అట్లా రిక్షాలో రావద్దు. మీ పుట్టింట్లో రెండు రోజులుండు. ఆ తర్వాత నేనే కారిచ్చి డ్రైవర్‌ను పంపిస్తాను” అనేది సత్యవతి.

“అలాగే అత్తయ్యా. డ్రైవర్‍ని వెంటనే పంపండి. నాకు మీ దగ్గరే బాగుంటుంది. వచ్చేస్తాను”

“పిచ్చిపిల్లా! కన్న తల్లిదండ్రుల దగ్గర, నీ తోడబుట్టిన వాడితోనూ పుట్టింట్లో అప్పుడప్పుడూ వుండాలి. జగత్‍ని కూడా అక్కడ రెండు రోజులుండమని నేను చెప్తానులే” అనేది సత్యవతి.

ఆ తర్వాత శశాంక్, శైలజ పుట్టారు. పురుళ్లు రెండూ పోసుకుని వెంటనే అత్తగారింటి కొచ్చేసేది. శశిరేఖకు తోడుగా వాళ్ళ నాయనమ్మ వచ్చి రెండేసి నెలలుండి వెళ్ళేది.

“పుట్టింటినీ, మమ్మల్నీ పూర్తిగా మరిచిపోతున్నారు. మీ అత్తమామలకు మా ఇంట్లో నిన్ను సరిగా చూసుకోలేమన్న భయం. మరీ అంత కూటికి లేనివాళ్ళం కాదులే” అనేది శశిరేఖ తల్లి.

“అదేం కాదమ్మా. వాళ్లు చాలా మంచివాళ్లు. అనవసరంగా మీరు ఇబ్బంది పడతారని అత్తయ్యా వాళ్ళ ఉద్దేశం. ఆ ఉద్దేశంతోనే పాలు కొని తాగమని, పండ్లవీ తినమని డబ్బు ఇచ్చి పంపిస్తుంది అత్తయ్య. మీకని పళ్ళూ, స్వీట్లూ నాకిచ్చి పంపుతుంది” అంటూ సర్దిచెప్పేది శశిరేఖ. శశిరేఖకు, జగత్ మోహన్‍కూ నిత్యనూతనంగానూ; సత్యవతీ వాళ్ళకు మనుమడితో, మనుమరాలితో మంచి కాలక్షేపంగానూ రోజులు సాఫీగా గడుస్తున్నాయి.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here