కర్మయోగి-21

0
9

[కోర్టులో కేసు వాదోపవాదాలు జరిగినప్పుడు దొంగ సాక్ష్యాలు చెప్పించడం వల్ల మల్లికార్జునకి శిక్ష పడుతుంది. అన్న రామారావు చూడడానికి వస్తే తనని తన మానాన వదిలేసి, తన భార్యకి తోడుగా ఉండమని అడుగుతాడు. లక్ష్మణ్ కుటుంబం మల్లికార్జునని అసహ్యించుకుంటుంది. లక్ష్మికి ప్రసవమయి ఒకే కాన్పులో పాప, బాబు పుడతారు. పిల్లల్ని స్నానం చేయింఛటానికి తోడికోడలు, నర్సు వెళ్ళినప్పుడు లక్ష్మి అక్కడ్నించి పారిపోతుంది. పిల్లల్ని రామారావు దంపతులు తీసుకువెళ్తారు. లక్ష్మి కాకినాడ చేరి మహాత్మా గాంధీ సేవా సమితిలో రాజేశ్వరి పేరుతో ఆశ్రయం పొందుతుంది. అక్కడి డాక్టరు గారి పిల్లాడికి తల్లి పాలు లేకపోతే, తన పాలిస్తుంది. ఇవన్నీ మాతాజీ తండ్రి గారి హయాంలో జరిగిన సంగతులని చెప్తుంది రాజేశ్వరి. రాజేశ్వరి గతాన్ని మాతాజీ డా. రాజేష్‌కి ఫోన్ చేసి చెబుతుంది. రాజేశ్వరి పాలిచ్చిన ఆ పిల్లవాడు పెరిగి పెద్దవాడై కాలక్రమంలో గొప్ప పోలీస్ అధికారి అవుతాడు. కర్నాటకలో పోస్టింగ్ వస్తుంది. వెళ్ళేముందు ఆ బాబుని సేవా సమితికి తీసుకువస్తారు డాక్టరు గారు. ఆ బాబుని ఆత్మీయంగా దగ్గరకు తీసుకుంటుంది రాజేశ్వరి. రాయచూరు ప్రాంతంలో పోస్టింగ్ అంటే వెళ్ళవద్దంటుంది. అక్కడే ఉన్న రాజేష్‌కి ఎన్నో అనుమానాలు కలుగుతాయి. – ఇక చదవండి]

[dropcap]మా[/dropcap]తాజీకి బయటి భోజనం సరిపడటం లేదు గనుక బయల్దేరదామనుకున్నారు. రాజేష్ మాత్రం డాక్టరుగారి అబ్బాయితో పరిచయం చేసుకుని మాట్లాడుతూ కూర్చున్నాడు.

***

మల్లికార్జున జైల్లో వున్నప్పుడు, ఆ చిక్కమగళూర్ జిల్లా జైలుకు రామారావు వీలు కుదిరినప్పుడల్లా వెళ్లి చూసి వచ్చేవాడు. మల్లికార్జున స్నేహితుడు మాత్రం తరచూ వెళ్లేవాడు. వచ్చినప్పుడు అక్కడి వూర్లోవీ, మండవ క్యాంప్ కబుర్లూ చెప్పేవాడు. క్యాంప్ లోకి కొత్త వాళ్లెవరూ రావటం లేదనీ, పాత వాళ్లే ఎలాగోలా కాలం గడుపుతున్నరనీ అన్నాడు. పాత వాళ్లు కూడా, ఇద్దరు ముగ్గురు తమ ఇల్లూ పొలమూ అమ్మేసుకుని వేరే క్యాంపులకు పోతున్నారట. ఆ పొలాలూ, హెగ్డేగారే కొన్నారట. మరి కొంత మంది పూర్తిగా ఇక్కడుండడం మానేసి ఆంధ్రా తిరిగి వెళ్లిపోయారు. ‘నా వలన అపాయం లేదనుకున్నాడేమో హెగ్డేగారు నా జోలి ఏం పట్టించుకోవటం లేద’న్నాడు. నీ విషయంలో భయపడి ఎవరూ సారా కాని, కల్లు గాని అమ్మే విషయంలోనూ, కాంట్రాక్టుల విషయంలోనూ, జోక్యం చేసుకోవటం లేదు. కల్తీ సారా, కల్తీ కల్లు వాళ్లు యథేచ్ఛగా అమ్ముకుంటున్నారు. ఆ శివయ్య వీళ్ళ పాపాలని ఎప్పుడు బద్దలు చేస్తాడో అని సాధారణ జనం ఎదురు చూస్తున్నారు. నువ్వు జైల్లో నుంచి బయటకు రాగానే మనిద్దరం కలిసి వీళ్ల అంతు చూద్దాం. నా కొక్కడికీ ధైర్యం చాలదు. ‘నువ్వు పక్కనుంటే ఎంత పనైనా చేస్తాన’నేవాడు.

రామారావు వచ్చినప్పుడు తమ్ముడికి ధైర్యం చెప్పేవాడు. “నీ విడుదల కోసం ఎదురు చూస్తున్నాం. లక్ష్మి జాడ ఏం తెలియలేదు. నువ్వు కూడా మరే ఆలోచన పెట్టుకోక సరాసరి ఇంటికొద్దువుగాని మన బిజినెస్ పెరుగుతున్నది. నువ్వూ నాతో పాటు వుంటూ పిల్లల్ని చూసుకోవచ్చు” అనేవాడు.

“అంతా నా వలనే అన్నయ్యా. హంతకుడి భార్యగా బతకటం ఇష్టం లేక వెళ్లిపోయింది. లక్ష్మి తెలివిగలది. కడుపున పుట్టిన బిడ్డల్ని వదినకప్పగించి, గౌరవంగా బతికించమంటూ తాను తప్పుకున్నది. అంతా నా ప్రారబ్ధం” అని బాధపడేవాడు.

పిల్లల ఫోటోలు తీసుకొచ్చి రామారావు చూపించాడు.

“వాళ్లని, మీ చల్లని నీడలోనే మీ బిడ్డలలాగానే పెరగనివ్వన్నయ్యా, నా నీడ కూడా వాళ్ల మీద పడనివ్వొద్దు. లక్ష్మి కోరుకున్నది కూడా అదే గదా. మీ ఇద్దరి పెంపకంలో నా బిడ్డలు యోగ్యులవుతారన్న నమ్మకం నాకున్నది” అనేవాడు మల్లికార్జున.

“అలా అనొద్దు. నువ్వు ఏ తప్పూ చేయలేదు. కాలం కాటేసింది అంతే. నువ్వింక కర్ణాకట వెళ్లి వుండే ఉద్దేశం పెట్టుకోవద్దు. ఏ క్యాంప్ విషయాల జోలికీ నువ్వెళ్లొద్దు. ఎవరి మీదైనా ప్రతీకారం తీర్చుకోవాలన్న ఉద్దేశమూ నీకొద్దు. నిన్నింక కర్ణాటకలో వుంచే వుద్దేశం లేకనే నువ్వు కొనుకున్న పొలమంతా అమ్మించాను. నువ్వు చదువుకున్న వాడివి. మన వ్యాపారంలో వుండటం ఇష్టం లేకపోతే నీకు నచ్చిన పని ఏదైనా చేసుకుందువుగాని మీ వదిన కూడా, చెబుతున్నది” అంటూ వచ్చినప్పుడల్లా చెప్పేవాడు.

మల్లికార్జున జైల్లో తన తోటి ఖైదీతో బాగా పరిచయమైంది. అతను తరచూ ఆధ్యాత్మిక విషయాలు మాట్లాడతూ వుండేవాడు. ఎక్కువగా భగవద్గీత చదివేవాడు. భగవద్గీత మళయాళస్వాములవారు వ్రాసిన వ్యాఖ్యానమూ, ‘శ్రీవిద్యా ప్రకాశానంద గిరి’ స్వామిజీ వ్రాసిన ‘గీతా మకరందం’, చివరకు వినోభాభావే వ్రాసిన గీతా ప్రవచనాలు ఇలా అన్నీ చదువుతూ వుండేవాడు. సందర్భమొచ్చినప్పుడల్లా గీతా శ్లోకాలు ఉదహరిస్తూ మాట్లాడుతూ వుండేవాడు. ఆ మాటలు వింటుండం వల్ల మల్లికార్జునకు ఎంతో ప్రశాంతంగా మనసుకు హాయిగా వున్నట్లు అనిపించేది. తను కూడా గీతా శ్లోకాలు, చదవుకోవటం వాటిని వల్లించటం చేస్తున్నాడు. గీత ప్రభావం మల్లికార్జున మీద కూడా బాగా పడింది. దాని వలనే మనసుకు ఉద్రేకమనేది కలక్కుండా సంయమనంగా వుండగలుగుతున్నాడు.

పని ఒత్తిడి వలన రామారావు మల్లికార్జున విడుదల నాటికి చిక్కమగళూరు రాలేక పోయ్యాడు. అంతకు ముందే రెండు ఉత్తరాలు వ్రాశాడు. “జైలు జీవితం నీలో చాలా మార్పు తెచ్చింది. అది ఇంకా మంచికే అనుకుందాం. విడుదల కాగానే సరాసరి మన ఇంటికి సత్తెనపల్లి వచ్చేయ్. వేరే విధమైన ఆలోచనలు చేయవని నమ్ముతున్నాను. ఈ అన్నయ్య మాటలు వింటావని కూడా నమ్మకం పెట్టుకున్నాను” అని వ్రాశాడు.

తోటి ఖైదీతో చేసిన ఆధ్యాత్మిక ప్రసంగాలూ, చదివిన గీతా ప్రవచనాలూ, మల్లికార్జున మనసులో కలిగిన మార్పు అన్ని కలిసి అతణ్ణి ‘ఏర్పేడు వ్యాసాశ్రమం’ వైపుకు నడిపించాయి. అక్కడ ప్రవేశం లభించకపోతే శ్రీకాళహస్తిలోని శ్రీశుక బ్రహ్మశ్రమానికైనా వెళ్ళి ఆశ్రయం పొందలానుకున్నాడు. ఎందుకంటే భగవద్గీత నందలి విషయాలకు మల్లికార్జున మనసు అంతగా స్పందించింది కాబట్టి. మళయాళ స్వాముల వారే కాక గాంధీజీ, తిలక్, వినోభా, వివేకానందుని వంటి వారు కూడా గీతను మించిన గ్రంథం లేదని గీత మానవుల జీవితాలకు దిక్సుచి వంటిదని నొక్కి చెప్పారు. ప్రపంచంలోని భాషలన్నింటికి గీతను అనువాదం చేసుకుని ప్రపంచంలో కోట్ల మంది ప్రజలు ఈ గీతా జ్ఞానాన్ని పొంది తమ తమ జీవితాలను శాంతిమయం చేసుకుంటున్నరని అంటున్నారు.

‘గీతా రక్షిత రక్షితా’. ఎవరు సంసార సముద్రాన్ని దాటటానికి గీత అనే నౌకను ఆశ్రయిస్తారో, వారు భవసాగారాన్ని తప్పకుండా దాటగలరని తోటి ఖైదీ పదే పదే చెప్పిన మాటలు మల్లికార్జున చెవుల్లో గింగురు మంటున్నాయి. తోటి ప్రాణుల పట్ల దయ, కరుణా, చూసినపుడే మనకు గీతలో చెప్పబడిన యోగ, ధ్యాన, భక్తి, జ్ఞానములు అభివృద్ధి పొందుతాయి. అలాంటి వారే నన్ను పొందుతారని శ్రీకృష్ణ భగవానుడు స్పష్టం చేసి వున్నాడు. ఇప్పుడు నువ్వూ, నేనూ ఇదే పాటించాలి అని అతడు పదే పదే చెప్పిన మాటలు మల్లికార్జున మనసుపై చెదరని ముద్ర వేశాయి.

“ఇన్ని తెలిసిన మీరు ఎందుకు నేరం చేశారు? లేదా నా వలనే చేయని నేరానికి బలైపోయారా?” అని అడిగాడు అతణ్ణి.

“ఒకసారి రైల్లో ప్రయాణం చేస్తున్నాను. తోటి ప్రయాణీకురాలి మెడలో నగలు కాజేసే దొంగను అటకాయించాను. అతను నా మీద దాడికి తెగబడ్డాడు. తోశేసాను. రైలు వేగానికి బయటకు పడ్డాడు. కాళ్లు రెండూ తెగిపోయి చనిపోయాడు. నేనే తోసేశానని తోటి వారు సాక్ష్యం చెప్పారు. దాంతో నాకు శిక్ష పడింది. అప్పుడప్పుడు జైలుకు వచ్చి నన్ను చూసి వెళ్లే ఆమె ఆ రోజు రైల్లో నేను కాపాడిన వ్యక్తి. అలా ఆమె నాకు దేముడిచ్చిన తోబుట్టువైంది. జైలు శిక్షననుభవిస్తూ కాస్తో కూస్తో జ్ఞానాన్ని సంపాదించాను. గీత గొప్పతనం తెలుసుకున్నాను. ఈ శిక్షే లేకపోతే నాకీ జ్ఞానం అబ్బేది కాదు. గీతామృతాన్ని తనివితీరా తాగుతున్నాను. ఈ అమృత భాండాన్ని వదిలి మరే విషయం మీద ఆలోచించాలని లేదు” అనేవాడు తన్మయంగా.

ఆ ప్రభావం మల్లికార్జన మీద కూడా బాగా పడింది. ఆ ఆలోచనతోనే ఏర్పేడు వ్యాసాశ్రమంలో స్థానం సంపాదించుకున్నాడు. సాధారణ భక్తుడుగా వెళ్లి తన విషయం చెప్పుకున్నాడు. కాస్త చోటు కల్పించుకుని ప్రార్థించాడు. మిగతా భక్తుల మీద ఈ ప్రబావం పడుతుందేమోనని కొంతమంది అభ్యంతరం పెట్టారు. స్వామీజీ నచ్చజెప్పారు. ‘అతడు నిరపరాధి. చేయని నేరానికి శిక్ష అనుభవించాడు. అయినా కూడా ప్రతీకారేచ్ఛతో రగిలిపోకుండా గీతా మాత ఒడిలో సేద దీరాలనుకుంటున్నాడు. అంతకు మించిన పరిపక్వత ఇంకేం కావాల’ని స్వామీజీ అభయిమిచ్చారు. ‘ఆనంద స్వామి’ అని నామకరణం చేశారు. అలా మల్లికార్జున ఆనందేస్వామిగా మారి ఏర్పేడు నివాసి అయ్యాడు.

రెండు సార్లు లక్ష్మణ్ కుటంబాన్ని వెదుక్కుంటూ వెళ్లాడు. విషయమంతా వివరించబోయినా ఇదో కొత్త నాటకమా అంటూ ఈసడించుకున్నారు. జీవితంలో ఇంకెప్పుడూ తమ కుటుంబాన్ని కలవటానికి గానీ, మాట్లాడటానికి కానీ రావద్దని శాసించారు.

“నేను హత్య చేయిలేదు తల్లీ. భగవద్గీత సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేనసలు ఆ రోజు ఇంట్లోనే లేను. నిజం మీరంతా తెలుసుకునే రోజు రావాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తాను” అంటూ మరోసారి నమస్కరించి తిరిగి వచ్చాడు.

ఏర్పేడు పీఠాధిపతే తన స్వామీజీగా, భగవద్గీతే తనకు దిక్సూచిగా భావిస్తూ పరమ సాత్వికమూర్తిగా, స్వామీజీ ప్రధాన అనుచరునిగా కాలం వెళ్లదీస్తున్నాడు ఆనందస్వామి.

అప్పుడప్పుడు మల్లికార్జునగా మారి ‘తన లక్ష్మి ఎక్కడో బతికే వున్నది. ఏప్పటికైనా తనను కలుసుకుంటుందన్న నమ్మకముంది’ అనుకుంటూ వుంటాడు.

***

చెన్నైలో కలిసిన విజయవాడ స్నేహితుడు సత్యాన్ని తరుచు కలుస్తున్నాడు. మరోసారి చెన్నై వెళ్దాం, రమ్మన్నాడు. “మీకు మరోక మిత్రుణ్ణి పరిచయం చేస్తాను” అంటే సరేనని చెన్నై వెళ్లాడు సత్యం. పోయినసారి దిగిన హోటల్ కెళ్లాడు. మిత్రుడు అక్కడ కలుస్తానన్నాడు.

“నా మిత్రుడిక్కడ చెన్నైలోనే వున్నాడు. పెద్ద వ్యాపారవేత్త. కోట్లలో వ్యాపారముంటుంది. ఎప్పుడూ చెన్నై వస్తూనే వుంటాడు. ఈ సారి హోటల్‍లో వుండక్కర్లేదు. అతడికిక్కడ రెండు మూడు బంగళాలున్నాయి. ఒకటెప్పుడూ అతని కిందే వుంటుంది. చాలా పెద్దది. మనమూ వుండొచ్చు. పోదాం పదండి”

“అతనింట్లోనా?” అంటూ సత్యం మోహమాట పడ్డాడు.

“ఏం ఫర్వాలేదు. మీకు కొన్ని కొత్త విషయాలు కూడా అర్థమవుతాయి” అన్నాడు.

ఆ సాయంకాలం అతనింటికి వెళ్లారు. సాయంకాలం, రాత్రయింది. వాకిట్లో కారు దిగింది. ముఖానికి చుట్టుకున్న చున్నీని ఊడదీస్తూ ఒకామె లోపలికొచ్చింది. సత్యం ఆమెను పరీక్షగా చూశాడు. సినిమాల్లో సైడ్ హీరోయిన్‌గా వేసే ఆవిడ. ఆవిడ లోపలకు రాగానే సరాసరి లోపలి గదిలోకి ఎంతో పరిచయమున్న దానిలాగా వెళ్లింది. ఆమె వెనకాలే ఆ యింటి యజమాని విస్కీబాటిల్‌తో వెళ్లాడు.

“రేపుదయం ఐదింటిదాకా ఆ గది తలుపులు తెరుచుకోవు. ఈలోగా మన కాలక్షేపం మనది. మావాడి కిదంతా మామూలే. ఎక్స్‌ట్రా వేషాలు వేసేవాళ్లు లేకపోతే ఇలాంటి బాపతే మరి కొందరుంటారు. కావలిస్తే మనమూ ఎవర్నైనా పిలిపించుకోవచ్చు. అరెంజ్ చేసే మనిషి పానకం నా దగ్గరున్నది. మీరూ ఏమైనా” అంటూ కన్ను గీటాడు అతను.

“లేదు. లేదు అలాంటి ఉద్దేశమే లేదు” అని ఆనాటికన్నాడు గాని మరునాడు ఆ మాట మీద నిలబడలేకపోయ్యాడు. చుడీదార్ వేసుకుని పెదాలకు ఎర్రని రంగు పూసుకుని మత్తుగా చూస్తూ చేయి పట్టుకున్న ఆమెతో కలిసి లోపలి గదిలోకెళ్లాడు సత్యం. ఆనాటితో మరో మెట్టు కిందికి జారాడు సత్యం. ఇప్పుడు తప్పు, ఒప్పుల విచక్షణ లేదు. మనసులో వున్న అసంతృప్తి, అసహనం ఇలాంటి పనుల మాటునబడిపోతున్నాయి. తనను తీసుకొచ్చిన స్నేహితుడికి కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. తాగుడు కన్నా ఇలాంటి అనుభవం ఎక్కువ కిక్కు ఇస్తున్నదనుకున్నాడు.

‘థాంక్స్ సుధా. థాంక్ యూ’ అని కూడా అనుకున్నాడు.

విజయవాడ తిరిగొచ్చాడు. అతనిలో ఒక తెగింపు, ఒక మొండితనం చోటు చేసుకుంటున్నాయి. రామ్, కృష్ణ సరిగా చదవటం లేదన్న బెంగా లేదు. ఎప్పుడో ఒకప్పుడు వాళ్లే చదువుతారులేన్న భావం కలుగుతుంది.

పవిత్ర దేవాలయానికెళ్లినట్లుగా అప్పుడప్పుడూ సత్తెనపల్లి వెళ్లివస్తాడు. అమ్నానాన్నలు దేవతలు అనుకుంటాడు.

బ్యాంక్ బ్యాలన్స్ అంతా అయిపోయింది. షాపుల అద్దెల తన వాటా తను వసులూ చేసుకుంటున్నాడు. సుధ ఎంత డబ్బు అడిగితే అంతా మాట్లాడకుండా ఇస్తాడు. సత్తెనపల్లి బిజినెస్ తాలూకు వచ్చే లీజ్‌ల డబ్బంతా ఖర్చయిపోతున్నది.

ఉబ్బిన కళ్లూ, నల్లగా పగుళ్లబారిన పడ్డ పెదాలూ, ఎఱ్ఱని కళ్లూ సత్యం వాలకం సత్యవతికి కాస్త అనుమానంగానే వుంది. అడిగేది. “ఏం లేదమ్మా. వేడి చేసింది. నీ చేత్తో తలకు నూనె” అంటూ మాట మార్చేవాడు.

***

రాజేష్ కాకినాడ డాక్టరుగారి అబ్బాయికి ఫోన్ చేశాడు.

“మీకు మరోసారి అభినందనలు. సాయంత్రం ‘టీ’కి రండి. ఫ్యామిలీతో వస్తే మరీ సంతోషం” అన్నాడు.

“థాంక్స్. డాక్టరుగారూ! కొంచెం ప్రయాణపుటేర్పాట్లలో వున్నాను. మరోసారి వస్తాను, అమ్మకయితే నన్ను వదిలాలని లేదు. ఆమె కలాగే వుంటుందిలెండి. ఇక్కడ టెన్త్ వరకే వున్నాను. ఆ తర్వాత ఇంటర్ విజయవాడ, ఫార్మసీ అంతా మణిపాల్. ఆ తర్వాత జాబ్ బెంగళూర్, ఇలా ఎక్కవ భాగం బయటే గడిపాను.”

“జాబ్ చేస్తూ మరలా ఐ.పి.యస్.కు సెలక్టవటం చాలా గ్రేట్. ఐ ఎప్రిషేయేట్ యు.”

“థ్యాంక్ యూ.”

 “నా కిద్దరు చిన్న పిల్లలు. వాళ్ల అమ్మే అన్నీ చూసుకుంటుంది. నాకు ఎంతో సపోర్ట్‌గా వుంటుంది. కాబట్టే నేనిప్పుడు సెలెక్ట్ కాగలిగాను. రేపే నా ప్రయాణం. ఈ సారి వచ్చినప్పుడు మిమ్మల్ని తప్పక కలుస్తాను” అన్నాడు.

“అయితే మీ శ్రీమతి గారు చాలా అభినందనీయులు. మరోసారి కలుద్దాం వుంటా” అంటూ ఫోన్ పెట్టేశాడు.

‘ఇతను కర్ణాటక పోలీసు ఆఫీసరు. ఇతనితో బాగా టచ్‌లో వుండాలి’ అనుకున్నాడు రాజేష్.

ఆ రోజు రాత్రి ఎనిమిది గంటల సమయంలో మాతాజీ, రాజేశ్వరులు డా. రాజేష్ క్లినిక్‌కు వచ్చారు. కేసులన్నీ పూర్తయ్యిన రాజేష్ వీళ్లను లోపలి రూమ్ లోకి పిలిచాడు.

“ఏమ్మా ఎలా వున్నారు?” అంటూ పలకరించాడు రాజేష్.

కళ్లు విప్పార్చుకుని ఆత్మీయంగా రాజేష్‌ను చూడసాగింది రాజేశ్వరి. మాతాజీకి చెప్పిన విషయాలనే టూకీగా మరలా రాజేష్ తోనూ అన్నది.

“ఆ తర్వాత మీకు మల్లికార్జునగారు కాని, మిగతా కుటుంబ సభ్యులు గాని ఎవరూ ఎప్పుడూ కనపడలేదా అమ్మా” అనడిగాడు.

“నేనూహించనట్లుగానే ఆయన కూడా తన నీడ పిల్లల మీద పడకుండా జాగ్రత్తలు తీసుకునే వుంటారు. మా బావగారూ, అక్కా దేవతలు. ఆ సంగతి ఈ పాటికి మీకు అర్థమయే వుంటుందిగా డాక్టరుగారూ. వాళ్లంతా ఎంత మంచివాళ్లు. భగవంతుడు మా మీద ఎందుకో పగబట్టాడు. మేమే ఇలా అయిపోయాం” అన్నది బాధను అదిమి పెడతూ.

“మా పిల్లల జీవితాలైనా ఏ మచ్చా లేకుండా గౌరవంగా గడిచిపోవాలన్న ఉద్దేశంతోనే నేనీ పని చేశాను. ఆ క్షణంలో ఎంత క్షోభపడ్డానో ఆ భగవంతుడికే తెలుసు. ఆ తర్వాత మావారు నాకెప్పుడూ కనుపించలేదు” అంది రాజేశ్వరి.

మళ్ళీ తనే మాట్లాడుతూ “మాతాజీ! మీకు గుర్తుందా! చాలా సంవత్సరాల క్రిందట మన సేవా సమితిలో వున్న వారి తాలూకు బంధువులది సత్తెనపల్లి, అక్కడ భారీ ఎత్తున చండీయాగం చేస్తున్నాం అని అదే పనిగా మనల్ని ఆహ్వానిస్తే మనిద్దరం వెళ్లాం. నన్నెవరూ ఎక్కడా గుర్తు పట్టకూడదని చీర చెంగుతో ముఖాన్ని పూర్తిగా కప్పేసుకునే దాన్ని. అప్పుడే కాదు, మీతో ఎక్కడికి వచ్చినా నా ముఖాన్ని అలాగే దాచుకునే దానిని. మీరు సాధారణ ఖద్దరు చీరెతోనే వచ్చేవారు. చండీయాగపు పూర్ణాహుతి రోజున మనం వెళ్లాం. చండీయగం కొరకు విరాళాలనిచ్చిన గ్రామ పెద్దల్ని స్వాములు ఆశీర్వచనం ఇవ్వటం కోసం వరుసగా నిలబెట్టారు. వారిలో అక్కా, బావగారూ వున్నారు. వారిని చూడటంతోనే నా గుండె ఝల్లుమన్నది. చూడకూడదనుకుంటూనే మరోసారి చూశాను. వారి ముందు నలుగురు పిల్లలు నిలబడి వున్నారు. ఒకసారి వెళ్లి వాళ్లను ముద్దాడాలని మనసు కొట్టుకున్నది. ఉద్వేగాన్ని అతి కష్టం మీద నిభాయించుకున్నాను. పిల్లలు నలుగురూ ముచ్చటగా వున్నారు. ఆడిపిల్లలు పట్టులంగాలతో, మెడలో గొలుసులతో మెరిసిపోతున్నారు. అక్క పెద్ద పట్టుచీరెలో కళకళాలాడుతున్నది. అక్కా వాళ్లూ ఇప్పుడు సత్తెనపల్లిలో వుంటున్నారన్నమాట అనుకున్నాను. వెంటనే దడదడలాడే గుండెతో మిమ్మల్ని మరొకరికి అప్పగించి, ముఖం మీద మసుగును మరింత ముందుకు లాక్కుని మన బసకొచ్చేశాను.”

“అవును ఇప్పుడు నాకు గుర్తొస్తున్నది. స్వాములు నాకు ఆశీర్వచనం ఇచ్చారు. అక్కడి పెద్దలకు నన్ను పరిచయం చేశారు. కొంత మంది స్వచ్ఛందంగా మన సేవా కార్యక్రమాలకు కొంత ఆర్థిక సహాయం కూడా చేశారు.” అన్నది మాతాజీ.

“నీనా విషయం మీకు చెప్పలేదు, మాతాజీ. నా ఉనికి బయటపడకూడదనే నా ఉద్దేశం.”

“మాట మాత్రం బయటపెట్టకుండా ఎంత గుట్టుగా వున్నావు రాజేశ్వరీ!” అన్నది మాతాజీ.

“మీరు రాయచూరు నుండి వచ్చేసిన తేదీ గుర్తున్నదా మీకు?” అనడిగాడు రాజేష్.

“1985 జనవరిలో వెంగళాయపాలెం వచ్చాము. ఏప్రియల్ చివర్లో గుంటూరులోని కుర్గర్ హాస్పటల్లో పిల్లలు పుట్టారు.”

“మాతాజీ ప్రొద్దుపోయింది. మీరిక బయల్దేరండి. రాజేశ్వరిగారూ మీరు నిశ్చింతగా వుండండి. మల్లికార్జునగారి సంగతీ తెలుసుకుందాం” అన్నాడు రాజేష్.

‘డాక్టరుగారితో లోపల ఏం మాట్లాడుతున్నారు వీళ్లు? వాళ్ల సంస్థకు డబ్బు సర్దుమని అడుగుతున్నారా?’ అని అనుకున్నారు సిస్టర్, మెడికల్ షాపు అతనూ కలసి. అంతా కలసి బయటకొచ్చేశారు.

ఆ రోజు రాత్రి ప్రొద్దు పోయేదాకా రాజేష్ ఆలోచిస్తూనే వున్నాడు. తల తిప్పి నిద్రపోతున్న దేవసేన వంక రెండు మూడు సార్లు పరీక్షగా చూశాడు. ఎంత దగ్గరగా వున్నాయి పోలికలు! పాపం రాజేశ్వరిగారు అనుకున్నాడు.

ఆ రాత్రి రాజేశ్వరికి కంటి మీద కునుకు లేదు. వట్టి నేల మీద వెల్లకిలా పడుకుని పైకి చూస్తూ ఆడపిల్లతో పాటు పుట్టిన మగ పిల్లవాడి పేరేంటో? ఏం చేస్తున్నాడో, అతనికీ భార్యా పిల్లలూ, దేవసేనకూ పిల్లలు. అంతా సవ్యంగా వుంటే ఎంత ఆనందించాల్సిన రోజులు. ‘అయ్యో భగవంతుడా’ అంటూ నిట్టూర్చింది.

***

సత్యం వాలకం సుధారాణికి రోజు రోజుకూ అంతుబట్టకుండా పోతున్నది. అప్పటి సత్యానికి, ఇప్పటి సత్యానికీ పోలికలేదు. ఆదాయం బాగానే వస్తున్నది. కాని డబ్బు ఏం మిగలటం లేదు. సత్యం చీటికీ, మాటికీ హైద్రాబాదో, చెన్నైనో పోవటం సత్యనారాయణకు కంటగింపుగా తయారయ్యి అల్లుడ్ని నిలేశాడు.

“మీ అమ్మాయి విహార యాత్రలు చేయ్యటానికి పోతునప్పుడు వద్దని చెప్పలేదే? మీ కొడుకు చీట్లపేకా, రేసులూ ఆడకుండా చూసుకోండి. నాకేం చెప్పొద్దు. నేను వినను” అన్నాడు విసురుగా.

“బంగారం లాంటి వాడి సత్తెనపల్లి నుండి కదిలించాను” అనుకున్నాడు సత్యనారాయణా.

‘స్వంత ఇంటి కల ఎప్పటికి తీరేను? పిల్లలకు మంచి చదువులు చెప్పించగలమా లేదా?’ అని సుధారాణికి దిగులు పట్టుకున్నది.

తులసిని పంపించి వేసి మరో మనిషిని పెట్టుకోవాలని ప్రయత్నం చేస్తున్నది కాని కుదరటం లేదు. అంత బాగా పని చేసే మనిషిని పంపాలనుకోవటం తెలివితక్కువ అంటున్నారు ఫ్రెండ్స్ అంతా.

సత్తెనపల్లిలో తమంట్లో వరలక్ష్మి ఎన్నో ఏళ్ల బట్టి వుంటున్నది. మామయ్యగారు ఏనాడూ ఆమె పట్ల, అనుచితంగా ప్రవర్తించి వుండరు అనుకుంది.

ఇక్కడా ఆదాయం నాలుగు రకాలా వస్తున్నది. ఏమవుతుందో తెలియటం లేదు. మెషిన్ రిపేర్లు, వర్కర్స్ జీతాలూ, అంటూ ఖర్చే కనపడుతూంది కాని నిల్వ కనపడ్డం లేదు. సత్తెనపల్లిలోని తమ ఇంట్లో డబ్బే డబ్బు. బ్యాగ్ నిండుగా పెట్టి బ్యాంక్‌లో జమ చేస్తూ వుండేవాళ్లు.

వ్యసనాల బారిన పడిన సత్యాన్ని చూసి వియ్యంకుడి ముందు తల దించుకోవాల్సిన పరిస్థితి వస్తుందేమోనని సత్యనారాయణ ఆలోచిస్తున్నాడు. “సుధా! మొగుడ్ని అదుపులో పెట్టుకో. తెలివిగా వుండు. నీ పాటికి నువ్వుంటే అతను మరీ చెయ్యి దాటిపోతాడు. మీ అన్నొక వ్యసనపరుడు. మీ ఆయనొక రకం వ్యవసనపరుడు అయ్యాడు. మీ అమ్మ ఇదంతా తలుచుకుని కృంగిపోతున్నది. ఈ వయస్సులో మాకు మనశ్శాంతి లేకుండా పోతున్నది. వ్యాపారాల వరకు అన్నీ బాగానే వున్నాయి. వచ్చిన ఆదాయమే మాయమయిపోతున్నది.” అన్నాడు.

“నాకిచ్చిన కట్నం తాలుకు డబ్బైనా తీసి ఒక ప్లాట్ కొనుక్కోవలనుంది నాన్నా. నా స్నేహితులందరి ముందు తలవంపులుగా వున్నది. ప్లాట్ అద్దేమో ఏడాది కేడాది పెంచేస్తున్నారు. ఓనర్స్ ఇక్కడుండరు. ఏం రిపేరు వచ్చినా మేమే చేయించుతున్నాం. అద్దెలో మినహాయించటానికి ఒప్పుకోరు. కిందటి నెలలో లిఫ్ట్ రిపేర్ వస్తే తలా పది వేలు ఖర్చు వేశారు. ఓనర్స్‌కు ఫోన్ చేస్తే మీరే ఇచ్చుకోండి. ఇవ్వకపోతే లిఫ్ట్‌లో తిరగటం మానెయ్యండి అన్నదావిడ.”

“అపార్ట్‌మెంట్‌లో అంతే. ఎవరి పొరపాటైనా ఖర్చు అందరూ భరించాలి. నీ డబ్బు తీసి ఖర్చు చేయటమెందుకు? వాటినైనా అలా వుంచు. అల్లుడిలో కాస్త మార్పు వస్తే చాలు. ఆరు నెలల్లో కాత్త ప్లాట్ కొనుక్కోవచ్చు.”

సుధారాణి వాళ్లమ్మ పిండివంటలు చేయించి తెచ్చింది. “ఎందుకమ్మా! నూనె సరుకు పిల్లలు సరిగ్గా తినరు. ఆ తులసి రోజూ ఏదో ఒకటి వండి పడేస్తునే వున్నది.”

“ఏదో నా అలవాటు నాకు” అంటూ ఇల్లంతా కలయదిరిగి చూసింది.

“కూర్చో అమ్మా! ఎలాగూ వచ్చావుగా, ఈసారైనా నాలుగు రోజులుండి వెళ్లు” అన్నది సుధారాణి.

పిల్లలూ, సత్యం అందరూ తులసీ, తులసీ అనే కేకలు పెడుతున్నారు. కావాల్సినవి అడుగుతున్నారు. కూతురు ఎందుకో బాధపడుతున్నది. ఇంట్లో పెత్తనం అంతా తులసిది. పేరుకు యజమానురాలు తన కూతురు. కాని తులసే దర్జాగా వుంటూ, తిరుగుతూ అందరి మీద అజమాయిషీ చేస్తున్నది.

“సుధా! ఊరికే దిగులుగా వుండటం కాదు. పిల్లల పనులూ, మీ ఆయన పనులూ నువ్వే చేసుకో. మొదట్లో నీకు పనులు అలవాటు కాకపోవచ్చు, నెమ్మదిగా అలవాటు పడాలి. తులసి తొండ ముందిరి ఊసరవెల్లి అవుతుంది. అంతా నీ చేతకానితనమే” అన్నది గట్టిగా.

“నాకూ, తులసిని పంపించెయ్యాలనే వున్నది. జీతం కూడా నన్ను అడగకుండా ఆయన్నే అడుగుతుంది. ఎంత తీసుకుంటుందో తెలియదు. ఇక్కడే ఒక మనిషి కోసం చూస్తున్నాను. కుదిరితే పంపేస్తాను.”

“ఆస్తులెన్ని వున్నా జాగ్రత్త చేసుకోవటం తెలియాలి. కాపురాన్ని భద్రంగా చూసుకోవాలి. ఇక్కడ కొచ్చినువ్వు ఒక్క నగా కొనుక్కోకపోతివి. అక్కడ మీ అత్తగారే బోలెడు కొని అమర్చేది. ఆ యిల్లే సిరిసంపదలతో వుండేది. ఇక్కడిదేదో సత్రం లాగుంది. డబ్బు మంచి నీళ్లలాగా వాడేస్తున్నారు. ప్రాణం వుసూరుమంటున్నది. మీ అన్న పేకాటలోనూ, గుర్రపందాలలోనూ గెలిచే వస్తాడని నా అనుమానం. ఓడిపోయి వస్తే మీ వదిన రాగాలు తియ్యకపోయిందా? ఏది ఏమైనా అవీ తప్పుడు పన్లే. ఎలాంటి అల్లుడు ఎలా మారిపోయాడు? ఎవరన్నా లెక్క లేకుండా విచ్చలవిడిగా అయిపోయాడు. ఇదేం ప్రారబ్ధం? నీ సంసారం ఎట్లా బాగుపుడుతుంది?” అన్నది లబలబలాడుతూ.

వాళ్ల ద్వారా, వీళ్ల ద్వారా రామారావుక్కూడా సత్యం పోకిళ్ళు తెలిసి వచ్చాయి. వినగానే బాగా ఆశ్చర్యం, ఆ తర్వాత కోపం, బాధా అన్నీ వచ్చాయి. అందరూ కలిసి తీసుకెళ్లి ఇలాంటివి నేర్పేరన్న మాట అనుకున్నాడు. వెంటనే సత్యానికి ఫోన్ చేశాడు. “నిన్ను గురించి వినకూడని మాటలు వింటున్నాను. మంచి వ్యాపారవేత్తగా వుండు. దివాలాకోరుతనం అంటించుకోకు. మంచి మనిషిగానూ బతుకు. ఇల్లూ, ఒళ్లూ గుల్ల చేసుకోకు. నేను నా పిల్లలకు ఆదర్శంగా నిలిచాను. నువ్వు నీ పిల్లల్ని దృష్టిలో పెట్టుకో. ఒకసారి సత్తెనపల్లి రా మాట్లాడాలి. వుంటా.” అన్నాడు.

‘ఊబిలో క్రమేణా కూరుక్కుపోతున్నాను నాన్నా. దిగబడిపోవడమే కాని పైకి కాలేను నాన్నా. నన్ను క్షమించండి’ అంటూ మూగగా రోదించాడు.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here