కర్మయోగి-22

0
7

[మల్లికార్జున జైల్లో ఉన్నప్పుడు అతని మిత్రుడు తరచూ వచ్చి పలకరించేవాడు. రామారావు కూడా వీలున్నప్పుడల్లా వెళ్ళి ధైర్యం చెప్పేవాడు. పిల్లల ఫోటోలు చూపించేవాడు. తన పిల్లల్ని అన్నయ్య పిల్లలుగానే పెంచమంటాడు మల్లికార్జున. జైల్లో ఉండగా మల్లికార్జున మనసు భక్తిమార్గంపైకి మళ్లుతుంది. తోటి ఖైదీ సహాయంతో భగవద్గీతను అధ్యయనం చేస్తాడు. విడుదలయ్యాకా ఏర్పేడు వ్యాసాశ్రమంలో స్థానం సంపాదించుకుంటాడు. ఆనందస్వామిగా మారి ఏర్పేడు నివాసి అవుతాడు. లక్ష్మణ్ కుటుంబాన్ని కలిసి తాను నిరపరాధినని చెప్పినా, వాళ్ళు నమ్మక ఈసడించుకుంటారు. ఇక ఆ ప్రయత్నాన్ని విడిచిపెడతాడు ఆనందస్వామి. వ్యసనాలకి అలవాటుపడిన సత్యం మరింత దిగజారుతుంటాడు. కాకినాడలో రాజేష్ ఆ డాక్టరు గారి అబ్బాయితో స్నేహం పెంచుకుంటాడు. ఒకరోజు మాతాజీ, రాజేశ్వరి రాజేష్ క్లినిక్‌కి వస్తారు. ఆత్మీయంగా రాజేష్‌ను చూస్తుంది రాజేశ్వరి. మాతాజీకి చెప్పిన విషయాలనే టూకీగా రాజేష్‌కీ చెబుతుంది. తన భర్త కూడా ఆయన నీడ పిల్లల మీద పడకుండా జాగ్రత్తలు తీసుకునే వుంటారని అంటుంది. సేవాసమితికి వచ్చేసాకా, భర్తను పిల్లలను తలచుకుంటుంది రాజేశ్వరి. సత్యం పతనాన్ని భార్య సుధ, అత్తమామలు గుర్తించి, హెచ్చరించినా, వారి మాటలు పట్టించుకోడు. ఇంటి పనులని పట్టించుకుంటూ, సత్యం వ్యవహారాలను స్వయంగా చూసుకోమని సుధ తల్లి సుధకి జాగ్రత్తలు చెబుతుంది. – ఇక చదవండి]

[dropcap]కా[/dropcap]కినాడ డాక్టరుగారబ్బాయి కౌశిక్‌కు రాయచూర్ జిల్లాలో యస్.పి.గా పోస్టు ఇచ్చారని తెలియగానే రాజేష్‌లో కొన్ని ఆలోచనలు రేకెత్తాయి. కౌశిక్ ప్రవృత్తి రీత్యా మంచి స్వభావం కలవాడు. వృత్తి రీత్యా పోలీస్ అధికారి అయ్యాడు. రాజేశ్వరి పాలు తాగి పెరిగాడు. ఆ విశ్వాసం అతనికి తప్పకుండా వుంటుందని రాజేష్ నమ్మకం. ఆ నమ్మకంతోనే అతను కౌశిక్‌కు రాజేశ్వరీ, మల్లికార్జునల విషయమంతా చెప్పాడు. “జరగాల్సిన అనర్థం ఎలాగూ జరిపోయింది. కనీసం వాళ్లు నిరపరాధులని తెలిస్తే ఇప్పుడన్నా తలెత్తుకుని సమాజంలోకి వస్తారు. వాళ్ల పిల్లలకు తల్లిదండ్రులమని చెప్తారు. జరిగిన విషయాన్ని అందరూ తెలుసుకుంటే బాగుంటుదని భావిస్తున్నాను” అని చెప్పాడు.

విషమంతా విని కౌశిక్ బాగా స్పందించాడు. తను కొత్తగా రాయచూర్ జిల్లా కొచ్చాడు. సింధనూర్ తాలూకాలో ఒకప్పుడున్న మండవ క్యాంప్ గుంరిచి తెలుసుకుంటానన్నాడు. అప్పటి వృద్ధులు కానీ, వాళ్ల తాలూకు పిల్లలు గాని వుంటే ఎంక్వైరీ చేయిస్తానన్నాడు. ఆ హెగ్డే తాలూకు, రంగప్ప తాలూకా మనుషుల గురించీ తెలుసుకోవాలన్నాడు. ముఖ్యంగా 1985 నాటి రికార్డులు కావాలి. తన స్టాఫ్ సహాయంతో శ్రమపడి వెతికించాలి అంటూ ప్లాన్ వేసుకున్నాడు. ఒక రోజు తీరిక కల్పించుకుని వెళ్లి 1985, 1986 సంవత్సరాల నాటి రికార్జులను బయటకు తీయించాడు. లక్ష్మణ్ హత్య, రంగప్ప, మల్లికార్జున హంతకులుగా రికార్డుల్లో వున్నది. అప్పటి సాక్షులెవరూ, ఇప్పుడు లేరు. అప్పుడు పని చేసిన పోలీసు స్టాఫ్, జైలర్ ఎక్కడున్నారో తెలుసుకోవాలి. దాదాపు అందరూ రిటైరైపోయి వుంటారు. వాళ్లను వెతికించే పనిలో వున్నాడు.

రాయచూరు జిల్లా పోలీసుస్టేషన్‌లో అప్పుడు పని చేసిన ఒక కానిస్టేబుల్ పేరు కరియప్ప. అతనిప్పుడు దావణగిరిలో వున్న బాపుజీ డెంటల్ కాలేజీలో సెక్యూరిటీ విభాగంలో పని చేస్తున్నట్లు తెలిసింది. కౌశికే స్వయంగా అక్కడికెళ్లాడు. S.P. జీపు చూడటంతోనే సెక్యూరిటీ ఎలర్ట్ అయ్యారు. ఆఫీస్‌కు మెసేజ్ వెళ్లింది. ప్రిన్సిపాల్ స్వయంగా ఎదురొచ్చి తీసుకెళ్లారు. కరియప్పను పిలిపించారు. అతనొచ్చాడు. ఆరోగ్యంగా దృఢంగా వున్నాడు. కౌశిక్‌ను చూడగా పాత అలవాటు ప్రకారం పోలీస్ సెల్యూట్ చేశాడు. కుశల ప్రశ్నల అనంతరం కౌశిక్ నేరుగా విషయంలోకి వచ్చాడు.

“1985, 86 ప్రాతంలో మీరు రాయచూరు పోలీసు స్టేషన్లో పని చేసినట్లు రికార్డుల్లో వున్నది. ఆ సమయంలో ఆంధ్రాకు చెందిన మల్లికార్జున, కర్ణాటకకు చెందిన రంగప్పల మీద హత్యా నేరం పెట్టారు. హతుడు ఆంధ్రాకు చెందిన లక్ష్మణ్. దాని తాలూకు వివరాలు నాకు కావాలి. నా పర్సనల్. మీరు సహకరించాలి” అన్నాడు.

“ఆ కేసు నాకు బాగా గుర్తున్నది. మీకో విషయం చెప్పనా! చనిపోయిన లక్ష్మణ్ గారి కొడుకు ఇక్కడి మెడికల్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు సార్. ఆయప్ప ఎంతో కష్టపడి ఎందర్నో కలిశాడంట సార్. అసలు విషయం తెలుసుకోవాలని తపించిపోయాడు సార్. నా సంగతి తెలుసుకని ఎన్నో మారులు అడిగాడు. నన్ను వెంటేసుకుని ఇక్కడి క్యాంప్ లన్నీ తిరిగాడు. ఆ మల్లికార్జున్ స్నేహితుడు ఇంకా ఇక్కడే వున్నాడు. మంచి స్థితిపరుడయ్యాడు. స్నేహితుడంటే ఆయనికిప్పటికీ ఆపేక్షే. ఈ డాక్టరుబాబు అడిగిన వాటి కల్లా సమాధానాలు ఓపిగ్గా చెప్పేవాడు.”

“ఇంతకీ విషయమేంటి కరియప్పగారూ?”

“మీకు తెలియందేముంది సారూ? నిజాయితీ ఎవరికి పడుతుంది? పోలీసులకీ, కోర్టులకీ, జైలర్లకూ, ఎవరు సాక్ష్యాలు పుట్టిస్తే వాళ్లకే కదా న్యాయం దొరికేది? ఇక్కడా అదే జరిగింది. రంగప్ప చేత తప్పుడు సాక్ష్యం చెప్పించారు. హత్యా నేరం తన మీద వేసుకుని తను జైల్లో వుంటాడు. తన కుటుంబమంతా తను తప్పుడు సాక్ష్యం చెప్పనందుకు ఇచ్చిన డబ్బుతో సుఖంగా వుంటుందని భావించాడు.”

“మల్లికార్జున మీద ఎవరికింత పగ వున్నది?”

“భూములకు న్యాయమైన రేట్లు ఇస్తున్నాడని, కల్తీ సారాకు అడ్డపడుతున్నడని హెగ్డేగారికి చాడీలు చెప్పి అతని అడ్డు తొలగించుకోవాలని పథకం వేశారు. హెగ్డే తలాడించాడు. మధ్యలో లక్ష్మణ్ అనే ఆయన్ను కూడా బలితీసుకున్నారు. హెగ్డే మా చెడ్డ మనిషండీ. దుర్మార్గపు పనులకు కొమ్ము కాసేవాడు. ఎంత మంది జీవితాలో బజార్న పడ్డాయని విని ఈ డాక్టరుగారు కూడా చాలా బాధపడ్డారండీ. లక్ష్మణ్ హత్య జరిగింది. నేను సర్వీసులో చేరిన కొత్తలోనండీ. ఆ తర్వాత నేను చాలా స్టేషన్లు మారాను. రిటైరయ్యాక స్వంత ఊరికి వచ్చి ఇలా చేరాను.”

“చాలా విషయాలు చెప్పారు కరియప్పగారూ. కాని సమయం మించిపోయింది. ఆనాడే మీలాంటి వారెవరయినా ముందుకు వచ్చి నిజం చెప్తే ఎంతో మంది జీవితాలు బలైపోకుండా వుండేవి. కనీసం మల్లికార్జున గారి కుటుంబమైనా. సరే అసిస్టెంట్ ప్రొఫెసర్ గారెక్కడున్నారు? ఆయన పేరేంటి?”

ఇప్పుడే తీసుకొస్తానంటూ ఒక అరగంటలోపే వారిని తీసుకుని మరీ వచ్చాడు కరియప్ప.

“నా పేరు జయప్రకాష్ అండీ. ఇదే క్యాంపస్‌లో పని చేస్తున్నాను. డెంటల్, మెడికల్ రెండూ వున్నాయి గదా ఇక్కడ” అంటూ తన్ను పరిచయం చేసుకున్నాడు. “కరియప్పగారు విషయం చెప్పారు. మా నాన్నగారి హత్యకు సంబంధించిన వివరాల కోసం వచ్చారట కదా? నేనూ, కరియప్పగారూ సేకరించిన విషయాలను బట్టే మల్లికార్జున గారు నిర్దోషి అని మాకర్థమయింది. ఈ విషయం వెంటనే మా అమ్మకు చెప్పాను. తనూ చాలా బధపడింది. మల్లికార్జున ఎంత మొత్తుకున్న అప్పట్లో మేం అతని మాటలు పట్టింటుకోలేదు. నిందించి పంపించాం అన్నది.”

“అప్పుట్లో మా నాన్న చనిపోయే సరికి నాయనమ్మా, తాతయ్యా, అమ్మా అందరూ చాలా కష్టపడి నన్నూ, చెల్లినీ పెంచారు. చెల్లీ, బావా ఆంధ్రాలో వుంటారు. నేను ఇదే కాలేజీలో చదువుకున్నాను. ఇక్కడే ఫ్యాకల్టీగా చేరాను. నేనిక్కడ చేరిన దగ్గర నుండీ అమ్మకొకటే కంగారు. కర్నాటక పోవద్దంటే వినవు, పైగా అక్కడే ఉద్యోగానికీ చేరుతున్నావు. మానుకో నాయనా అని మరీ మరీ చెప్పేది. ఇక్కడ పని చేయటం వలనే కరియప్పగారి సాయంతో అసలు నిజం తెలిసికోగలిగాను. కరియప్పగారు ఈ మధ్యనే ఇక్కడ చేరారు. సరే కాని యస్.పి. గారూ! ఇన్నేళ్ల తర్వాత మీరీ విషయాలన్నీ ఇప్పుడేందుకు ఆరా తీస్తున్నారు! దీని వలన ఇప్పుడు ఉపయోగమేముంటుంది?” అన్నాడు.

“కాకినాడలో తెలిసిన మిత్రులొకరు ఈ వివరాలు కావాలని కోరారు. కనీసం మల్లికార్జున గారి భార్యా పిల్లలకైనా విషయం తెలియాలిగా? ఈ విషయం తెలియక ఆ కుటుంబమంతా మనస్తాపం చెంది, తలోక చోటా వుంటున్నారు. ఇప్పటికైనా ఆ కుటుంబాన్ని ఒక చోట చేర్చితే బాగుంటుందని వారి దగ్గరి బంధువు ఆలోచన. అలాగే మీకూ నిజం తెలిస్తే మీ మనసులకూ మల్లికార్జునగారు నిర్దోషి అని తెల్సుతుందిగా. ఇన్నాళ్లూ మీ పెద్ద వాళ్లూ మల్లికార్జునే హంతకుడన్న అభిప్రాయంలో వున్నారు. కనీసం మీ పిల్లకైనా ఆ అభిప్రాయం తొలగించుకుంటే కలత బారిన మనసులకు ఊరట కలుగుతుందన్న చిన్న ఆశ. ఇప్పుడు చట్టపరంగా ఏదో చేద్దామని కాదు. కోర్టు ఏం తేల్చకుండా కేసును పెండింగ్‌లో వుంచితే మరో రకంగా వుండేది. అప్పటి వాళ్లెవరూ ఇప్పుడు పదవుల్లో లేరు. కోర్టును తప్పుపడుతూ పెడితే మల్లికార్జున గారే కేసు పెట్టాలి. దానికీ మరలా సాక్షులు గావాలి. మల్లికార్జున గారి స్నేహితులు, కరియప్పగారే వున్నారు. మల్లికార్జున గారికప్పుడే ఆసక్తి లేకుండా పోయింది. జీవితంలో ఇన్ని అధ్యాయాలు గడిచిన తర్వాత వారు మరలా కోర్టుకెళతారని నేననుకోను. కేవలం ఆ కుటుంబ సభ్యులనందరినీ ఒక చోట చేర్చుదామన్న కోరికతోనే ఇదంతా చేశామనుకోవాలి.”

కరియప్పగారి దగ్గరా, జయప్రకాష్ గారి దగ్గరా శెలవు తీసుకుని కౌశిక్ తిరిగి వచ్చేసాడు. ఈ కేసు విషయాలు తేలిగ్గా దొరుకుతాయా అని తను ఎంతగానో ఆలోచించాడు. తన డిపార్ట్‌మెంట్ ఆ రోజుల్లో తప్పుడు సాక్ష్యాలకి సహకరిస్తే కోర్టు ఒక నిరపరాధిని శిక్షించిందనీ బాధపడ్డాడు. తనీ విషయాలు ఎప్పుడూ మర్చిపోగూడదు. నేరస్థులంటూ ముద్ర వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వుండాలనుకున్నాడు.

కౌశిక్ వెంటనే ఈ విషయాలన్నింటినీ డాక్టర్ రాజేష్‌కు మెయిల్ పెట్టాడు.

తన అంచనాలు కరెక్ట్ అయినందుకు రాజేష్‌కు చాలా సంతోషం కలిగింది. కాని మల్లికార్జున, రాజేశ్వరుల సంతానమని తెలిస్తే, దేవసేన, సత్యం ఇద్దరూ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. ఇన్నాళ్లూ రామారావూ, సత్యవతుల సంతానంగా పెరిగిన వాళ్లు ఒక్కసారిగా విషయం తెలిసే సరికి, వాళ్ల మనోభావాలు ఎలా వుంటాయో తెలియదు. అత్తయ్య, మామయ్యలకు ముందుగా ఈ విషయం చెప్తే, బాగుండుందేమో. వాళ్లకు తెలియనిదల్లా రాజేశ్వరి ఇక్కడే వున్నదని. అసలే సత్యం భార్య, అతని తల్లిదండ్రులు కాస్త పేచీ మనుషులు. ఈ మధ్య సత్యం పెడతోవ పట్టాడని తెలుస్తున్నది. దాంతో పాటు ఇదీ బయటకు వస్తే ఏదో నేరం చేసి దాచి పెట్టారని సత్తెనపల్లి వచ్చి నానా యాగీ చేసినా చేస్తారు. తనంటే విషయమంతా విని వున్నాడు. దేవసేననూ మాసికంగా సిద్ధం చేయగలడు. ఆమె పట్ల తన ప్రేమ ఏం మారదు. సత్యం కాపురం విషయంలోనే తనకు అనుమానంతా. వాళ్ల కాపురంలో మరో చిచ్చు పెట్టిన వాడిని అవుతానా? అని ఆలోచించసాగాడు. కాని రాజేశ్వరిగారు ఇక్కడ కాకినాడలోని మహాత్మా గాంధీ సేవాసమితిలో వున్న విషయం తెలియజేయటం తన బాధ్యత అనుకున్నాడు.

“మామయ్యగారూ! బావున్నారా! నేను రాజేష్‌ను మాట్లాడుతున్నాను. మీరు నిదానంగా వినండి. ఆవేశపడవద్దు. దేవసేన మీ కన్న కూతురు కాదన్న విషయం నాకు తెలిసింది. ఆమె తల్లిని కూడా నేను చూశాను.”

ఆ మాటలన్ని రామారావు ఒక్క క్షణం నిశ్చేష్టుడయ్యాడు.

“బాబూ! రాజేష్! ఏం మాట్లాడుతున్నావు నువ్వు?”

“అవునండీ. దేవసేన తల్లి రాజేశ్వరి. మీరంతా లక్ష్మి అని పిలిచిన ఆమెను నేను చూశాను. మాట్లాడాను.”

“నిజంగా! ఎక్కడ? ఎక్కడ మాట్లాడావు?”

“ఇక్కడే కాకినాడలో.”

“బాబూ! రాజేష్! బాబూ! పిల్లలు నలుగుర్నీ నా కన్న బిడ్డల్లాగే పెంచి పెద్ద చేశాను. వాళ్లనేనాడు మా కడుపున, పుట్టలేదని మేమనుకోలేదు. అదే ఉద్దేశంతోనే ఈ విషయం ఎవరికీ చెప్పలేదు. అసలు విషయం దాచి మీతో పెళ్లి జరిపిద్దామన్న దురుద్దేశమూ లేదు. మమ్మల్ని అర్థం చేసుకో. మా మీద దయవుంచి దేవసేనను చిన్న చూపు చూడవద్దు. నా తమ్ముడు నిర్దోషి. వాడే పాపం ఎరగడు. విధి వాడి మీద పగబట్టింది. ఆ విధికి వాడూ వాడి బార్యా తలొంచారు. అంతకు మించి దేవసేనా, సత్యం పుట్టకలోనూ మా పెంపకంలోనూ మరే దోషమూ లేదు. దేవసేనకీ విషయం చెప్పావా బాబూ? ఇంతకీ రాజేశ్వరి ఎలా వున్నది? నీకెక్కడ కనిపించింది? వెంటనే నేనూ, మీ అత్తయ్యగారూ బయలుదేరి వస్తాం.”

“అలాగే రండి. మీరే వివరంగా దేవసేనతో మాట్లాడుదురు గాని. వుంటాను.”

రామారావూ, సత్యవతీ కాకినాడ బయలుదేరి వచ్చారు. వచ్చిన రోజు సాయంత్రమే రామారావు, సత్యవతీ రాజేష్‌తో కలిసి సేవాసమితికి వెళ్లారు. అక్కడ వాళ్లను చూసి రాజేశ్వరి నిరుత్తరురాలయ్యింది. ఆ తర్వాత సత్యవతిని పట్టుకొని పొగిలిపొగిలి ఏడ్చింది.

“మీ మీద నా పిల్లల భారం పడేసి దొంగలాగా పారిపోయి వచ్చానక్కా. నన్ను క్షమించండి బావగారూ” అంటూ కాళ్లు పట్టుకోవటానికి వంగింది.

“పురిట్లో పిల్లలను వదిలి ఎలా వుండగలిగావు లక్ష్మీ? అంతగా మనుసు రాయి చేసుకున్నావా?”

“కట్టుకున్న వాడు జైలు పాలవగానే నేను బండబారిపోయాను. ఎన్ని జన్మ లెత్తినా మీ ఋణం తీర్చుకోలేనక్కా” అంటూ ఏడుపు ఆపుకోవటానికి ప్రయత్నం చేయిసాగింది.

“నేను మాతాజీతో మాట్లాడతాను. మీరు ఇంటికి కొచ్చెయండి” అన్నడు రాజేష్.

“ఇప్పుడు మాతాజీకి నా అవసరం వున్నది. నన్నిక్కడే వుండనివ్వండి. ఇన్నాళ్లూ నన్ను పోషించి, నాకు ఆశ్రయం కల్పించిన సంస్థ ఇది. నేనెక్కడికీ రాను. ఇంతకీ దేవసేనకీ విషయం తెలుసా?”

“ఒకేసారి నిన్ను ఇంటికి తీసుకెళ్లి అమ్మగా పరిచయం చేద్దామని చెప్పలేదు. ఇది రాజేష్ కోరిక. కన్న కూతురయి వుండి దేవసేన అర్థం చేసుకోలేదా? నువ్వాలోచనలేం పెట్టుకోకు. నీ కందరం అండగా వుంటాం” అన్నది సత్యవతి.

అందరూ కలిసి మాతాజీ దగ్గరకి వెళ్లారు. ఆమె చాలా సంతోషించింది.

“ఆ పరమాత్ముని లీలులు ఎంత విచిత్రంగా వుంటాయి? ఎక్కడెక్కడి వాళ్లను ఎంత చిత్రంగా కలిపాడు? కౌశిక్ శ్రద్ధ పెట్టి ఇదంతా వివరంగా కనుక్కున్నాడా? ఏది ఏమైనా డా. రాజేష్ గారూ! మీ శ్రద్ధాసక్తుల వలనే ఇప్పటికైనా విషయం తెలిసింది., ఇక మీదట రాజేశ్వరి ఎలా చేసినా నాకు సమ్మతమే. తర్వాత దేవసేనను కూడా ఒకసారి తీసుకురండి. రామారావుగారూ, సత్యవతిగారూ! ఈ రోజల్లో మీలాంటి వాళ్లు అండగా వున్నారంటే అది రాజేశ్వరి చేసుకున్న పుణ్యమే. నీకు చేతులెత్తి మొక్కాలి తల్లీ!” అన్నది సత్యవతి తలపై చేయి వేసి నిమురుతూ.

“అమ్మా! మేం మా కుటుంబానికే అండగా వున్నాం. మీరు ఎంతో మంది వృద్ధుల పాలిట దేవతలాగా వుంటున్నారు. మీదమ్మా మాతృహృదయమంటే, నేను మా కుటుంబం తరుపు నుండి పది లక్షల రూపాయల్ని ఈ సేవా సమితికి ఇస్తాను ” అన్నాడు రామారావు.

అందరూ మాతాజీ దగ్గర శెలవు తీకున్నారు. రాజేశ్వరి మనసు ఉద్విగ్నతతో ఎగిసి పడుతున్నది “అక్కా! మీ మరిదిగారు ఎలావున్నారు?” అన్నది నెమ్మదిగా.

“ఏర్పేడు వ్యాసాశ్రమంలో ఆనందస్వామిగా వుంటున్నాడు. కబురు పెడదాం. నువ్వు కనిపించావన్న మాట వినగానే రెక్కలు కట్టుకుని రావాలి. మల్లికార్జున వచ్చిన తర్వాత మళ్లీ వస్తాం.”

“దేవసేనా! నీకో విషయం చెప్పాలి. అది విని నువ్వేం కంగారు పడవద్దు. నిన్ను కన్న తల్లి వేరే వున్నదమ్మా. ఇక్కడే ఈ వూళ్లోనే వుంటున్నది.”

“అమ్మా ఏమైంది మీకూ! నాన్నా, అకస్మాత్తుగా కాకినాడ రావటమే నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది. పైగా ఇప్పడీ మాటలు” అన్నది బిత్తరపోతూ.

“ఇలా కూర్చో అమ్మా!” అంటూ దేవసేనను కూర్చో బెట్టి విషయమంతా చెప్పింది సత్యవతి.

“అమ్మా! నేను మీ కూతుర్నేనమ్మా. దాన్ని కాదనుకోలేను” అన్నది కళ్లనీళ్ల పర్యంతమౌతూ.

“పిచ్చి పిల్లా! నువ్వూ, రాజేష్ మా కుతురూ అల్లుడే. రాజేష్ బాగా అర్థం చేసుకున్నాడు. వాళ్ల తల్లిదండ్రులక్కూడా నెమ్మదిగా చెప్తాడు. మీ విషయంలో మాకు భయమేం లేదు. సత్యం సంగతే ఆలోచించాలి.” అంటూ సత్యవతి తన ఒళ్లో తల పెట్టి పడుకున్న దేవసేన తల నిమురసాగింది.

తమ కళ్లతో చూసి, మాట్లాడారు కాబట్టి విషయం రూఢీ అయిన తర్వాత రాజేశ్వరి సంగతి మల్లికార్జునకు ఫోన్ చేసి చెప్పారు.

“మన రాజేశ్వరి అదే మన లక్ష్మి ఇక్కడే కాకినాడలో వున్నది. మహాత్మా గాంధీ సమితిలో వుంటున్నది. భగవంతుడి దయవలన మంచి నీడలో ఆశ్రయం పొందింది. నువ్వు వెంటనే కాకినాడ బయలుదేరిరా. మేం కూడా ఇక్కడే వున్నాం.” అని రామారావు, సత్యవతులు మల్లికార్జునకు ఫోన్ చేశారు.

మల్లికార్జునకు తను వింటున్నది కలో, నిజమో అర్థం కాదు. ఏర్పేడులో చక్కబెట్ట వలసిన అర్జంటు పనుల్ని పూర్తి చేశాడు. ఆ తర్వాత వెంటనే కాకినాడ బయలుదేరి వచ్చాడు. వస్తూ వస్తూ ఆలోచించుకున్నాడు. ‘మళ్లీ నేను సంసార సాగరంలో చిక్కుకుంటానా? ఇప్పుడు నా ప్రయాణమంతా భావసాగరం వైపుకే వున్నది. గీతను ఆరాధించి నేను పొందింది అదే’ అనుకున్నాడు.

తన ఇంట కాలు పెట్టిన ఆనందస్వామిని చూసింది దేవసేన. అప్పుడప్పుడూ తన పుట్టింటిలో లోగడే చూసింది. తమ దూరపు బంధువెవరో ఆశ్రమంలో వుంటూ తమ ఇంటికి వచ్చేవాడని మా పిల్లలంతా అనుకునే వాళ్లం కదా అని గుర్తు చేసుకున్నది. ఈయనిప్పుడు తన తండ్రి. ఊహు నాన్నంటే రామారావే. అమ్మంటే సత్యవతే. తనకు తెలియకుండా తన జీవితంలో ఇంత పెద్ద సంఘటన నివురుగప్పిన నిప్పులాగా దాగున్నదనుకున్నది. ఆ నిప్పును తన భర్తే వెలికి తీయించాడనుకున్నది.

మల్లికార్జునకు వెనుకటి సంగతులన్నీ గుర్తుకొచ్చాయి. తన లక్ష్మి ఇప్పుడెలా వున్నదో? తన కంటి ముందుకు ఆనాటి లక్ష్మి రూపమే వస్తున్నది. సీమంతం జరిపించుకోమని చెప్పి హడావిడిగా వదినకప్పగించి తను కర్ణాటక వచ్చేశాడు. రావటం రావటం జైలుపాలయ్యాడు. తను జైల్లో వుండగా చిక్కశల్యమై లక్ష్మి అన్నయ్యతో కలసి వచ్చింది. ఆ చూడటమే ఆఖరి చూపు. ఊహించని పెను మార్పులు. తమ జీవితాలను అల్లకల్లోలం చేసి తమ కుటుంబాన్ని తలో దిక్కకు విసిరేశాయి. విధి వ్రాత. తప్పించుకోలేం అనుకున్నాడు.

మహాత్మా గాంధీ సేవా సమితికి తానే వెళ్లగలనన్నాడు ఆనందస్వామి. మాతాజీకి ఫోన్ చేసి రాజేష్ చెప్పాడు. ఆనందస్వామి వెళ్లి ముందుగా మాతాజీని కలిశాడు. ఏర్పేడు ఆశ్రమ విషయాలు కొద్దిగా మాతాజీతో ముచ్చటించాడు. ఆమె తమ సేవా సమితి కార్యకలాపాలు వివరించింది. రాజేశ్వరిని కంటికి రెప్పలా చూసుకన్నందుకు ధన్యవాదాలు చెప్పాడు. అప్పుడు మాతాజీ చేతుల్లో కూడా భగవద్గీత వున్నది. “తన ప్రతి సందేహానికీ ఈ గీతా మాతే సమాధానం ఇచ్చేదన్న గాంధీజీ మాటల ప్రకారం నేను కూడా మీ విషయంలో ఏం చెయ్యాలా? నేను చేయగల పరిష్కారం ఏమైనా వున్నదా అని ఆలోచిస్తున్నాను. రాజేశ్వరి, మీరు ఆలోచించండి. బాగా ఆలోచించిన తర్వాతే ఒక నిర్ణయానికి రండి అది ఎలాంటి నిర్ణయమైనా నా అభ్యంతరం ఏమీ వుండదు.” అన్నది మాతాజీ, ఆనంద స్వామితో. ఆ తర్వాత రాజేశ్వరి కోసం కబురు పంపింది. రాజేశ్వరి రాగానే తాను మరొక గదిలోకి వెళ్లింది. ఖద్దరు చీరె. నుదికి కుంకుమ బొట్టుతో ప్రసాంతంగా నడిచి వచ్చిన స్త్రీ మూర్తిలో తన లక్ష్మి పోలికల కోసం, ఆనాటి రూపం కోసం వెదుక్కున్నాడు ఆనందస్వామి.

బారాటి గడ్డంతో, ఎక్కువ భాగం తెల్లబడ్డ జుట్టుతో వంటిన కాషాయం రంగు దుస్తులు వేసుకుని వున్న ఆనందస్వామిలో తన భర్త మల్లికార్జున ఆకారాన్ని చూడాలని ఆరాటంగా చూసింది రాజేశ్వరి. కన్నులనిండా నీళ్లే వుండటంతో ఆనందస్వామి రూపం మసకమసగ్గా అనిపించింది.

“ఎలా వున్నావు లక్ష్మీ! నిన్ను క్షమించమని అడగటానికి కూడా నోరు పెగలటం లేదు. నన్ను పెళ్లి చేసుకున్నందు వలనే నీ జీవితం ఇలా అయింది. నిన్ను కష్టపెట్టాను. పిల్లలక్కాకుండా చేశాను. ఆ పాపమంతా నాదే.” అన్నాడు ఆనందస్వామి బాధగా.

“మీరెందుకు క్షమాపణలు అడగాలి? కలిసివున్న కొద్ది నెలలు నాకు స్వర్గాన్ని చూపించారు. చిన్నప్పటి నుంచి ప్రేమకు కరువైన నాకు అమృతాన్ని పంచి ఇచ్చారు. నా దురదృష్ణ జాతకమే దీనికంతటికీ కారణం. మన పెళ్లి కాకుండా వుంటే మీకీ శిక్ష వుండేది కాదేమో? మీరే నన్ను క్షమించాలి. నా దురదృష్టమే మిమ్మల్ని జైలు పాలు చేసింది” అన్నది ఏడుస్తూ.

“ఎవరి కర్మకెవరు బాధ్యులు లక్ష్మీ. ఆ భగవంతుడు మన నుదిటిన అలా వ్రాశాడు. ఇప్పటికి మన పాపం తీరిందేమో? ఒక విధంగా మనకు శాపవిమోచనం కలిగినట్లే. మన పట్ల భగవంతుని అపారమైన కరుణ వుండ బట్టే ప్రశాంతమైన చోట్లలో వుండగలిగాం. భక్తీ, ప్రేమా, సేవా, కరుణా పంచే సంస్థల్లో జీవింపగలగాం. మనకీ జీవితాలు అందించిన కాంతితోనే మనం ముందు జీవితాన్ని గూడా గడుపుదాం. మనం కూడా ఈ సమాజంలో ఏ కొద్దిమందికైనా ఉపయోగపడేటట్లే జీవిస్తే, మన జన్మలు సార్థకమవుతాయి” అన్నాడు ఆనందస్వామి లక్ష్మి తల మీద చేయి వేసి నిమురుతూ.

***

“సత్యం ఒకసారి సత్తెనపల్లి రా. చాలా అవసరం. నీ కోసం ఎదురు చూస్తాం” అని రామారావు ఫోన్ చేశాడు.

‘తనకు బుద్ధులు గరపటానికయి వుంటుంద’ని సత్యం రాలేదు.

“వెంటనే బయలుదేరిరా” అని సత్యవతి కూడా ఫోన్ చేసింది. బయలుదేరి వచ్చాడు.

మనిషి రంగు తగ్గి కళ్ల కింద ఉబ్బుగా వున్న సత్యాన్ని చూసి సత్యవతి ఊసూరుమన్నది. సత్యంలో వున్న ఉత్సాహం, చలాకీతనం ఏమైపోయాయో అనుకున్నది.

“నీ వ్యసనాల పట్ల పెద్దవాళ్లకు సంజాయిషీ ఇవ్వాలి. మాకే కాదు, నీ కన్న తల్లిదండ్రులకు కూడా సమాధానం ఇవ్వాల్సి వుంటుంది” అన్నాడు రామారావు.

తనేమన్నా పరధ్యానంగా విన్నాడా ఏంటి అనుకుంటూ “ఏమన్నారు నాన్నా” అన్నాడు.

“అవును. నీకన్న తల్లిదండ్లులు వేరే వున్నారు. నా కొడుకు ఇలా ఎందుకు తయారయ్యాడని వాళ్లు నిలదీస్తే, నేనేం సమాధానం చెప్పాలి?”

“నాన్నా! కాస్త వివరంగా చెప్పండి. నాకు తల తిరుగుతోంది” అన్నాడు ఆరాటంగా.

బావ రాజేష్ చొరవతో బయటి కొచ్చిన విషయమంతా చెప్పాడు రామారావు.

“నా దృష్టిలో అమ్మా, నాన్నా అంటే మీరిద్దరే నాన్నా. వాళ్లెవరో కని వదిలేసిపోయినంత మాత్రాన, ఈ వయసులో వెళ్లి వాళ్లను అమ్మా, నాన్నా అనటం అసాధ్యం. నాకు మీరు చాలు.”

“వాస్తవం నీకు చెప్పాల్సిన బాధ్యతున్నది. నెమ్మదిగా సుధకు చెప్పు. మీ మాగారికీ, బావమరిదికీ తెలుస్తుంది. విషయం దాచి, మోసం చేసి పెళ్లి చేశామంటారు. నేను సమాధానం చెప్తాను. మీ అందరి అంగీకారంతో వాళ్లను ఇంటికి తీసుకొచ్చి, నిన్నూ, దేవసేననూ అప్పగించి ఆస్తుల వివరాలు మల్లికార్జునకు చెప్తాను. ”

“ఏం చెప్తారు నాన్నా! కన్న తల్లిదండ్రులు కంటే ఎక్కువగా కడుపులో పెట్టుకుని పెంచారు. వ్యాపారాలన్నీ మీ స్వయం కృషి. ఎవరికీ ఏ లెక్కలు చెప్పాల్సిన పని లేదు. మా మామగారు ఏమీ అడగరు. అడిగినా నేనూరుకోను. నా తల్లిదండ్రులు తప్పు చేశారని నేను అనను. ఎవరి ఖర్మకెవరు బాధ్యులు అనుకుంటాను.”

“కాకినాడ వెళ్లి మీ అమ్మను చూసి రా. దేవసేనతోనూ మాట్లాడు. మీ అమ్మైనా నిన్ను చూడాలని తబతహలాడుతూ వుంటుంది. నువ్వు సుధా కలిసి వెడితే లక్ష్మి చాలా సంతోషిస్తుంది. నెమ్మదిగా పిల్లల్నీ చూపిద్దాం.”

“అలాగే నాన్నా మీరింతగా చెప్తున్నారు కాబట్టి నేనూ సుధా వెళ్తాం” అంటూ విజయవాడ వెళ్లి “సుధా. మనం దేవసేనా వాళ్ళింటికి కాకినాడ వెళ్దాం” అనగానే ఒప్పుకున్నది.

సత్యాన్ని ఎంత వీలైతే అంత ఇక్కడ్నుంచి దూరంగా తీసుకెళ్లటం మంచిదన్న అభిప్రాయంలో వున్నది ఇప్పుడు సుధ. తన తల్లీదండ్రీ – కొడుకునూ, కోడల్నీ తన దగ్గరే వుంచుకుని కూతుర్ని మాత్రం వేరుగా విజయవాడ తీసుకొచ్చారన్న జ్ఞానం ఇప్పుడు కలిగింది సుధకు. అత్తామామలు తమను, వెనక్కు వచ్చేయమన్నా సంతోషంగా సత్తెనపల్లి వెళ్లాలన్న నిర్ణయానికొచ్చింది. వాళ్ల పెద్దరికం, వాళ్ల మంచితనం తను కెంత రక్షణగా వుంటాయో సుధకిప్పుడు బాగా తెలిసి వచ్చింది.

సత్యం సుధా కాకినాడ వెళ్లారు. విషయమంతా నెమ్మదిగా సుధకు చెప్పాడు సత్యం. సుధ అర్థం చేసుకున్నది.

సత్యం సుధా, దేవసేనలు కలిసి రాజేశ్వరి దగ్గరకెళ్లారు.

రాజేశ్వరి సత్యాన్నీ, దేవసేననూ పట్టుకుని ఏడ్చింది. సుధను ఆశీర్వదించింది.

“అత్తయ్యా! జరిగిందేదో జరిగిపోయింది. మీరూ మల్లికార్జున మామయ్య సత్తెనపల్లి వచ్చెయ్యండి. మేమూ పిల్లల్ని తీసుకుని విజయవాడ నుంచి వచ్చేస్తాం. ఈ సంగతి సత్యవతి అత్తయ్యక్కూడా చెప్తాను” అన్నది సుధ. అలాగే చెప్పింది. ఆ మాటలకు సత్యవతీ, శశిరేఖా నివ్వెరపోయారు. రామరావు, సుధ ఎందుకలా అన్నదో గ్రహించాడు. సత్యానికీ బాగా అర్థమయింది. అతనికీ విజయవాడ జీవితం విసుకొచ్చేసింది. తరచూ ఫోన్ చేసి దేవసేననూ సముదాయిస్తున్నాడు.

ఇన్నాళ్లు లేనిది రాజేశ్వరి కోసం ఎవరో ఒకరు రావడం, ఈవిడ ఏడవటం, అక్కడి వాళ్ళకు ఆశ్చర్యంగా వున్నది. సగం అర్థమయ్యి, సగం అర్థం కాకుండాను వున్నది.

మల్లికార్జున తరచూ రామారావుతో మాట్లాడుతున్నాడు. తాను ఆనందస్వామిగానే వుండి కొన్ని పన్లు చేయాలనుకుంటున్నానని చెప్తున్నాడు. సత్తెనపల్లిలోని పొలంలో ఓ రెండెకరాలు తనకు కావాలన్నాడు. నివాసయోగ్యమైన షెడ్లు లాంటివి వేసిమ్మని రామారావు నడిగాడు. షెడ్లు, కొన్ని వసతి గృహాలు తయారయినవి. ‘అశక్త వృద్ధాశ్రమం’ అన్న పేరుతో వున్న బోర్డు వ్రాయించారు. రకరకాల శరణాలయాలు, సంరక్షణాలయాలు వున్నవి. కాని జైలు జీవితం గడిపి వచ్చిన వారిని నమ్మి ఎవరూ పనులు ఇవ్వటం లేదు. యవ్వనమంతా జైల్లో గడిపి వృద్ధావస్థలో అశక్తులుగా గడిపేవారిని అక్కున జేర్చుకుని, ఆదరించే సంస్థ ఎక్కడా లేదు. అలాంటి వారికి మానసిక ధైర్యం. తగిన ఉపాధి కల్పించాలి. నిరపరాధులైన వారు కూడా శిక్ష అనుభవిస్తున్నారు. వారి మనస్సు చెదిరిపోకుండా సరియైన దారిలో నడిచేటట్లు చూడాలి. ఈ పని చేస్తానని ఏర్పేడు వ్యాసాశ్రామ పీఠాధిపతికి తెలియజేస్తే వారు ఆశీర్వదించిచారు. కొంత ఆర్థికసాయం కూడా అందిస్తామన్నారు. చేసే పని మంచిదైనప్పుడు సమాజంలోని వ్యక్తులు తప్పకుండా స్పందిస్తారు. తమ శేషజీవితాలు ఇలా ఆపన్నుల సేవలో గడిచిపోవాలని ఆనందస్వామి కోరుకున్నాడు. రాజేశ్వరీ ఒప్పుకున్నది. జగత్ మోహన్ పదవీకాలం ముగియబోతుంది. ఏమైనా అవకాశముంటే సాయం చేస్తానన్నాడు. జైలు జీవితం గడిపి పశ్చాత్తపంతో దహించుకుపోయే వారి సేవలో పునీతులు కావటం మంచిదేనన్నాడు.

విజయవాడులో వ్యాపారాలు తన అన్నకూ, తండ్రికీ అప్పగించి సత్యాన్ని సత్తెనపల్లి పోదామని సుధారాణి పోరుకులాడింది. మల్లికార్జున మామయ్య చేసే పనులకు చేదోడువాదోడుగా ఉందామన్నది. మొత్తానికి మకాం సత్తెనపల్లికి మార్చేలా చేసింది సుధ.

“మన అదృష్టం మనకిద్దరు అత్తామామలు వున్నారు. బావగారూ ఇక రాజకీయాలలోనే వుంటారు. మన యింట్లో వుండి పెద్దవాళ్ళను కని పెట్టుకుని వుండాలి” అంది సుధ భర్తతో.

శశాంక్ శైలజల్లాగా మీరు బాగా చదవాలి అని పిల్లలకూ చెప్తున్నది. “వాళ్లేం చదువుతున్నారో కాస్త పట్టించుకో అక్కా, వంట పని నేను చూస్తానులే” అని శశిరేఖతో అంటున్నది.

గూడు వదిలిన పక్షులు ఎక్కడో తిరిగి మరలా గూడు వెతుక్కుంటూ వచ్చినట్లున్నదని రామారావూ, సత్యవతీ అనుకున్నారు.

ఉమ్మడి కుటుంబం విలువా, పెద్ద వాళ్ల ఆప్యాయతల మధ్య వుండే ప్రేమా, భద్రతా, సుధకు బాగా తెలిసొచ్చినట్లుంది. తనకే కాదు, నాకు పట్టిన గ్రహణమూ వదలాలనుకున్నాడు సత్యం.

(సమాప్తం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here