కర్మయోగి-3

0
7

[dropcap]జ[/dropcap]గత్ మోహన్ తమ్ముడు సత్యవర్ధన్. ఇతనూ, దేవసేన కవల పిల్లలు. సత్యవర్ధన్‌ను ఇంట్లో అందరూ ‘సత్యం’ అని పిలుస్తారు. అతనూ బి.టెక్. చేశాడు. ఆ తరువాత ఇంటరెస్ట్ లేదన్నాడు. దేవసేన మాత్రం యమ్.టెక్ పూర్తి చేసింది. ఆమె పెళ్ళి రాజేష్‌తో జరిగింది. కోదాడలో డా. రాజేష్ కుటుంబం మంచి స్థితిపరమైనది. రాజేష్ కూడా గాస్ట్రోఎంటరాలజీలో పి.జి. పూర్తి చేశాడు. తను చదివిన రంగరాయ మెడికల్ కాలేజ్ లోనే అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా చేరాడు.

దేవసేన కూడా యం.టెక్ పూర్తయితే గాని పెళ్ళి చేసుకోనన్నది. ఆ తర్వాత రామారావూ, సత్యవతీ అన్ని విధాలా విచారించి, తమకనుకూలమైన సంబంధమని భావించారు. దేవసేన కూడా ఒప్పుకున్నాకా డా. రాజేష్‌తో దేవసేన పెండ్లి నిశ్చయం చేశారు.

“నువ్వు డాక్టరువు. డాక్టర్ చదివిన అమ్మాయినే పెండ్లి చేసుకుంటే బాగుంటుంది” అని తల్లిదండ్రులన్నా రాజేష్ పెద్దగా పట్టించుకోలేదు.

“ఫర్వాలేదు. నా భార్య డాక్టరే అయివుండాలన్న నియమం ఏం లేదు. బాగా చదువుకుని మంచి సంస్కారవంతురాలైతే చాలు” అని ఈ సంబంధానికొప్పుకున్నాడు.

“మీరు సొంతంగా ప్రాక్టీసు పెట్టుకోండి అల్లుడుగారూ. మేం చేయగలిగిన సాయం చేస్తాము” అన్నాడు రామారావు.

“అవసరం లేదండీ. ప్రస్తుతం స్వంత ప్రాక్టీసు ఆలోచన  ఏం లేదు. తర్వాతెప్పుడన్నా నా ఉద్దేశం మారితే సాయంకాలం పూట ఓ రెండు గంటలు ఓ.పి. మాత్రమే చూసే పని పెట్టుకుంటాను. అప్పుడైనా బీదా బిక్కికి తక్కువ ఫీజు తీసుకుని నా వంతు సాయం నేను చేస్తాను. దాని కోసం ఒక చిన్న క్లినిక్ సరిపోతుంది” అంటూ మామగారి ప్రతిపాదనను సున్నితంగా తోసిపుచ్చాడు.

“నువ్వు చదువుకున్న కాలేజీలోనే ఉద్యోగం చేస్తున్నావు. అదే చాలని సరిపెట్టుకోవటం ఏమంత మంచి పని కాదు. అటు విదేశాలకూ పోనంటున్నావు. ఇటు స్వంత ప్రాక్టీసూ పెట్టనంటావు. నీకు డబ్బు ఎక్కడ నుండి పోగవుతుంది. ఇంత చదువూ చదివి ఇలా వుండటం మాకేం నచ్చటం లేదు” అని తరచుగా రాజేష్ తల్లీ దండ్రీ అనేవాళ్లు.

రాజేష్ నవ్వి వూరుకునేవాడు.

“ఏమోయ్ కృష్ణయ్యా. మనోడు వున్నాడు కదా అని కాకినాడ వెళ్లి వైద్యం చేయించుకున్నాను. కాలేజిలో కదా వైద్యం ఎలా వుంటుందో అని భయపడ్డాను. వైద్యమూ బాగుంది. చాలా తక్కువ ఖర్చుతో అయిపోయింది. మనవాడిని పట్టి బాగా శ్రద్ధగా వైద్యం చేసిపంపారు. మనవాడి కక్కడ మాంచి పేరుందనుకో” అని తెలిసిన వాళ్లూ, చుట్టాలూ చెప్తూ వుండే వాళ్లు. ఇంకా పైగా “నువ్వు మంచి కొడుకును కన్నావు. అదృష్టవంతుడివి. మావాడు వున్నాడు డాలర్ల కోసమని, సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తూ అమెరికాలో కూర్చున్నాడు. ఏ మంచీకీ, చెడుకూ, దేనికీ అక్కరకు రాడు. ఇక్కడ మన వాళ్లకు నలుగురికీ ఉపయోగపడేటట్లుగా వుండాలి గానీ, ఎవరికీ కనపడకుండా, మాట వినపడనంత దూరంగా పోయి కూర్చుంటే ఒరిగేదేముంది? వాళ్లంతే. మేమింతే. ఫోనులో నయినా నాలుగు మాటలు విందామని వళ్లంతా చెవులు చేసుకుని వుంటాం. అదీ ఎప్పుడో కాని చేయడు. నిజంగా నువ్వదృష్ణవంతుడివి. కాకితో కబురు చేస్తే కొడుకు వచ్చి మీ దగ్గర వాల్తాడు. ఈ వయస్సులో ఇంకా ఇంతకన్నా ఏం కావాలి!” అని వాళ్లందరూ అంటుంటే రాజేష్ తల్లితండ్రులు సంతోషంలో మునిగిపోయ్యేవాళ్లు.

‘నిజంగా అంతే కదా? రాజేష్ తీసుకున్న నిర్ణయమే మంచిది. తాము ఇన్నాళ్లు అనవసరంగా బాధపడ్డారు’ అనుకున్నారు.

అటు రామారావు వాళ్లకు కూడా కాస్త అసంతృప్తి వున్నా ‘కూతురూ, అల్లురూ వాళ్లే ఆలోచించుకుని, మంచి నిర్ణయాలు తీసుకుంటారులే. మనం మరీ గట్టిగా చెప్తూ జోక్యమూ చేసుకోకూడదు’ అనుకున్నారు.

***

చదువు అయిపోగానే కొన్నాళ్లు ఉద్యోగం చేయాలనుకున్నాడు సత్యం. తండ్రీ, అన్నలగా రాజకీయాలలో ఆసక్తి లేదు. బిజినెస్ లన్నా కూడా పెద్దగా ఇష్టం లేదు. నాలుగైదు ఉద్యోగాలకు ప్రయత్నించాడు. మర్చంట్ నేవీలో మెరైన్ ఇంజనీర్‌గా ఉద్యోగమొచ్చింది. తల్లి అస్సలు ఇష్టపడలేదు. తండ్రి కూడా పెద్ద సుముఖత కన్పబరచలేదు.

“ఇదొద్దు. ఇంకేదైనా ప్రయత్నం చెయ్యి.” అంటూ వారించాలని చూశాడు.

“ఇదీ ఒక అనుభవమే నాన్నా. బాగానే వుంటుంది. కొన్నాళైనా చెయ్యనియ్యండి” అంటూ వెళ్లి చేరిపోయాడు. ముంబై బ్రాంచ్‌లో పని చేస్తున్నాడు.

సత్యానికీ పెళ్లి చేసెయ్యాలని భావించారు. “మెరైన్ ఇంజనీరు. ఇతనెప్పుడూ నౌకల్లో పడి తిరుగుతూ వుంటాడు. నేల మీద వుండేదెప్పుడు” అని పెళ్లికూతురి తరుపు వాళ్లు వాదించేవాళ్ళు. అలా కొన్ని సంబంధాలు తప్పిపోయాయి. సత్యవతి ఒకటే గోల పెట్టింది. రామరావు కూడా ఆలోచనలో పడ్డాడు. రామారావు స్నేహితుడు వెంకటసుబ్బయ్య గుడివాడలో వుంటున్నాడు. అతడి తమ్ముడి కూతురే సుధారాణి. బాగా ఆస్తిపాస్తులున్న కుటుంబమే. సత్యానికి సుధారాణి నిచ్చి చెయ్యాలన్న వుద్దేశమయితే వున్నది. కాని సత్యవర్ధన్ మెరైన్ ఇంజనీరయ్యాడు. ‘అతను ఉద్యోగానికి పోతే మా అమ్మాయి ఒక్కతే ఒంటరిగా వుండాల్సి వస్తుంది’ అని ఈ సంబంధాన్ని వదులు కోదల్చుకున్నారు. ఆ మాటే వెంకటసుబ్బయ్యకు చెప్పారు.

“నాకు తెలిసినంత వరకూ ఎక్కువ రోజులేం కొడుకు చేత ఆ ఉద్యోగం చెయ్యనివ్వడు రామారావు. కొడుకును వెనక్కు పిలిపించి ఏదో ఒక వ్యాపారంలో పెట్టేస్తాడు. నేను రామారావుతోనే మాట్లాడతాను” అని ఫోన్ చేశాడు.

“నిజమే, వెంకటసుబ్బయ్యా, నాకయితే అలాగే వున్నది. కొద్ది రోజులు పోయిన సత్యానికి నచ్చచెప్తాను. వాడికే బిజినెస్ చెయ్యటం ఇష్టమో కనుక్కుని దాంట్లో పెట్టేస్తాను. నా కొడుకు మరీ మూర్ఖుడేం కాదు. వింటాడని నాకు గట్టి నమ్మకం వున్నది”  అని చెప్పాడు రామారావు.

నెల తర్వాత సత్యం శెలవు మీద ఇంటికొచ్చాడు. పెండ్లి సంగతులు మాట్లాడుకున్నారు. అవతల గుడివాడ వాళ్లు అర్థం చేసుకున్నారు. సుధారాణి కూడా పెద్దగా అభ్యంతరం చెప్పలేదు.

పెళ్లిలో పెట్టటానికని సుధారాణికి అత్తగారి తరువు నుంచి డైమండ్ నగలు చేయించారు. పనిలో పనిగా శశిరేఖకూ చేయించారు. శశిరేఖ ఎంతగానో మురిసిపోయింది. ఆడపడుచు లాంఛనాల కింది ప్రియంవదకూ, దేవసేనకూ అలాంటి నగలే చేయించి ఇవ్వమని సత్యవతి భర్తకు చెప్పంది. ఆ సంగతి విన్న దేవసేన “అక్క యు.ఎస్. నుంచి ఎలాగూ పెళ్లి కొస్తుందిగా. తను వచ్చిన తర్వాత ఇద్దరమూ కొనుక్కుంటాములే” అన్నది.

గుడివాడలో పెండ్లి, సత్తెనపల్లిలో రిసెప్షన్ రెండూ అది భారీగా, అంగరంగ వైభవంగా జరిగాయి. ప్రియంవద అమెరికా నుండి రాలేకపోయింది. పెండ్లి అయిన కొద్దిరోజులకే సత్యం సుధారాణులు ముంబైలో కాపురం పెట్టారు. రవాణా నౌకలకు ఏదైనా సాంకేతిక సమస్య వస్తే వాటిని సరి చేస్తూ సత్యం, నౌకలోనే తిరుగుతూ వుంటాడు.

రామారావు వీళ్లను చూడటానికి ముంబై వచ్చాడు. కోడలు ఒంటరిగా ప్లాట్‌లో వున్నది. “మీ అబ్బాయి ఇంటికి రావటానికి ఒక్కోసారి నెలరోజులు కూడా పడుతోంది మావయ్యగారూ” అని చెప్పింది.

“ఇదివరకంటే ఒంటరివాడు. ఎప్పటికి తిరిగొచ్చినా ఇబ్బంది వుండదు. ఇప్పుడు భార్య వున్నది. ఆమెనింట్లో ఒంటరిగా వదిలేసి వెళ్తున్నాడు. ఇది నాకేం నచ్చలేదమ్మా” అన్నాడు రామారావు.

“త్వరలో మీ అబ్బాయిని హంకాంగ్ పంపిస్తామంటున్నారట. అప్పుడుయితే ఏకంగా ఇంటి కొచ్చేసరికి ఏ రెండు నెలలో పట్టొచ్చునట. మొన్న ఫోన్‌లో చెప్పారు” అన్నది.

“మన భాష కాదు. మన మనుషులు వుండరు. నువ్వొక్కదానివీ ఇబ్బందులు పడలేవు. నిన్నిలా ఒంటరిగా వదిలేసి వెళ్తుంటే మేం చూస్తూ వూరుకోలేం. మీ అమ్మా నాన్నల దగ్గర నేను తలదించుకోలేను. నువ్వు వాడిని ఆట్టే ప్రోత్సహించకు” అంటూ వెంటనే కొడుక్కు ఫోన్ చేశాడు.

“సత్యం, నువ్వు చేసే ఉద్యోగం చెడ్డదని నేను అనను. కాని మనకంత కష్టపడి రాత్రింబగళ్లు నెలల తరబడి ఇల్లు పట్టకుండా తిరగాల్సిన అవసరం లేదు. మెరైన్ ఇంజనీర్లకు జీతాలు ఎక్కువ ఇస్తే ఇవ్వొచ్చు. ఎక్కువ కాలం సర్వీస్ చేసే అవకాశం కూడా వుంటుందనీ తెలుసు. కాని మనకు ఈ రెండూ అవసరం లేదు. హాంకాంగ్ వెళ్లే ఉద్దేశం అస్సలు పెట్టుకోవద్దు. ఈ  ట్రిప్ పూర్తి కాగానే నువ్వు ఇంటి కొచ్చేసే ప్లాన్ చేసుకో. మన సత్తెనపల్లిలో వుండి ఏదైనా బిజినెస్ చేసుకో. లేదా నీ ఇష్టం వచ్చిన బిజినెస్ చేసుకోవటానికి ప్లాన్ చేసుకో. మాకూ, మీ అత్తమామలకు కూడా బాగుంటుంది.” అని గట్టిగానే వార్నింగ్ ఇచ్చాడు.

“అమ్మాయ్ సుధారాణీ, ఇంకెక్కడికీ వెళ్లటానికి నువ్వొప్పుకోకు. సరాసరి మీరు మనింటికే వచ్చేద్దురు గాని. సత్యం ఎప్పుడు తిరిగొస్తే అప్పుడు మనూరి ప్రయాణం పెట్టుకోండి” అని మరీ మరీ చెప్పి వచ్చాడు.

సుదారాణి తల్లిదండ్రులకు కావలసింది ఇదే. ఇలా అందరి ఒత్తిడితో ముంబై నుండి సత్యం జాబ్ మానేసి సత్తెనపల్లి వచ్చేశాడు. మరెక్కడో ఎందుకని – తవుడు నుండి నూనె తీసే మిషనరీని తెప్పించాడు. అధునాతన టెక్నాలజీతో ఆయిల్ మిల్ రన్నింగులో కొచ్చింది. రామారావు, సత్యం పూర్తిగా వ్యాపారాల్లో మునిగిపోయారు. రామారావు తన రాజకీయ వారసత్వాన్ని పెద్ద కొడుకు జగత్‌ మోహన్ కిచ్చేశాడు. జగత్‌ మోహన్ రాజకీయాల్లో తిరగటమే కాకుండా తన పలుకుబడితో తమ వ్యాపారాలకు కావలసిన పర్మిట్లూ, వనరులూ సమకూర్చుకోగలుగుతున్నాడు.

సత్యం మామగారికి విజయవాడలో భూములున్నాయి. ఆ భూముల్లో కాని, గవర్నమెంట్ భూమి గాని లీజుకు తీసుకుని పెద్ద పెద్ద గోడవున్స్ కట్టాలన్న ఆలోచనతో వున్నారు. ఆ గోడవున్స్‌ను రైల్వేవారికి అద్దెకిస్తే కోట్లలో ఆదాయమొస్తుందని జగత్‌ మోహన్ ఆలోచన. ఆ కాంట్రాక్ట్‌ను దక్కింటుకోవలని హైదరాబాద్ చుట్టూ, ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నాడు.

***

సత్యం సుధారాణుల పిల్లలు రామ్, క్రిష్ణలూ, జగత్‌ మోహన్ శశిరేఖల పిల్లలు శశాంక్, శైలజలు – నలుగురూ ఒకే స్కూల్లో చదువుతారు. వీళ్లు పొద్దున్నే స్కూల్‌కు బయలుదేరే సమయానికి మగాళ్లు  ఇంట్లో ఒకో రోజు వుంటారు. ఒకో రోజు వుండరు. నాయనమ్మకి మాత్రం బై చెప్పందే స్కూల్‌కు బయల్దేరరు. మందు రోజు రాత్రే రేపటి రోజున తమకు లంచ్ బాక్సుల్లోకి ఏం కావాలో సాయంకాలం స్నాక్స్‌కి ఏం కావాలో లిస్టు చెప్తారు. సాధ్యమైనంత వరకు ఆ ప్రకారమే సిద్ధం చేయిస్తుంది సత్యవతి. సాయంత్రం మరలా స్కూల్ నుండి రాగానే నాయనమ్మా అంటూ చుట్టేసుకుపోతారు. రామారావు అన్నట్లుగా ఎంతమంది కుంటుందీ అదృష్టం! అనుకుంటుంది సత్యవతి. నలుగురి పిల్లల్నీ కూర్చో పెట్టుకుని సాధారణంగా శశిరేఖే రోజూ హామ్ వర్క్ చేయిచటం, ఆ తర్వాత చదివించటం చేస్తుంది. సుధారాణికి బద్ధకమూ, ఆస్తిపరురాలనన్న అంహంకారమూ వున్నాయి. ఇంత కట్నం తెచ్చిన తననూ, చేతులూపుకుంటూ వచ్చిన శశిరేఖనూ అత్తమామలు ఒకే లాగా చూడటం సుధారాణికి మింగుడుపడటం లేదు. ఆ విషయం శశిరేఖకు అర్థమయింది. కాని ఏమాత్రం బయటపడకుండా గుంభనంగా వుంటూ నెట్టుకొస్తున్నది. అది గమనించి సత్యవతి సుధారాణితో “అక్కనడుగు. నీ అంతటి నువ్వు చెయ్యటం కాదు” అని అనసాగింది, దాంతో సుధారాణికి మరీ కంటగింపుగా వున్నది. సాధ్యమైనంత వరకు సత్యవతి భర్త దాకా తీసుకెళ్లకుండానే ఇంటి సమస్యల్ని దూరం చేయాలనే చూస్తుంది.

“నీ పుట్టింటి వాళ్లు కలిగిన వాళ్లు కాబట్టి వాళ్ళివ్వగలిగింది నీకు కానుగ్గా ఇచ్చారు. ఆ రోజుల్లో నేను ఏమీ కట్నంగా తేలేదు. మొదట్లో మీ మావయ్యగారికి కొద్ది సంపాదనే వుండేది. ఏదో పిల్లల అదృష్టం బాగుండి ఈనాడు ఈ స్థితిలో వున్నాం. దానికి మనం పొంగిపోవటం కాని మన కంటే తక్కువలో వున్న వాళ్లను చిన్న చూపు చూడటం కాని మంచిది కాదు సుధా” అంటూ నచ్చ చెప్పే ధోరణిలో మాట్లాడుతుంది సత్యవతి.

అత్తగారెన్ని సుద్దులు చెప్పినా సుధారాణి అభిప్రాయాల్లో మార్పేం రాలేదు. కాని ఒకరికొకరు తోడ్పాటు అందిచుకోకపోతే ఈ కాంపిటీషన్ రోజుల్లో డెవలప్ కావటం కష్టమన్న విషయం అన్నదమ్ములిద్దరికీ తెలుసు. ప్రత్యక్షంగా పరోక్షం గానూ ఇద్దరూ ఒకరి పట్ల ఒకరు అభిమానంగానూ ప్రేమగానూ వుంటారు. సత్యానికి అన్నంటే భక్తి. అన్నకు తమ్ముడంటే అనురక్తి.

దేవసేన పిల్లల్ని తీసుకుని పండగకు సత్తెనపల్లి వచ్చింది. ఆరుగురు పిల్లలూ కలిసి కాలికొందికీ పరిగెత్తుతూ కేరింతలు కొడుతూ ఆడసాగారు. ఆ సాయంత్రమే సుధారాణి తన పిల్లల్తో గుడివాడ వెళ్లబోతున్నది.

“సంక్రాంతికి రమ్మని అమ్మవాళ్లు మరీ మరీ చెప్పారు. ఈ పండుగకు అందరూ పుట్టింటికి పరుగెత్తుకు వెళతారు. ఎక్కడో కొద్ది మందిని మాత్రం పిలుచుకుపోరు” అంది శశిరేఖ వంక చూస్తూ.

“మా నాన్నగారొచ్చి నన్ను పిలిచి వెళ్లారు సుధా. కాని దేవసేన వదిన పిల్లల్ని తీసుకు వచ్చారుగా. అందరం కలసి వుందామని నేనే వెళ్లాలనుకోవటం లేదు” అన్నది నెమ్మదిగా.

“నువ్వైతే మీ పుట్టింట్లో వుండగలుగుతావు కాని పిల్లలు అక్కడ వుండలేరు అక్కా. ఎక్కడ వాళ్లకు మనింట్లో జరిగినట్లు జరగదుగా అక్కా.”

“ఆ మాత్రం కడుపు నిండా తిండి పెట్టగలరులే సుధా” అంటూ ఇంకా మాటలు పొడిగించటం ఇష్టం లేక అక్కడ నుంచి వెళ్లిపోయింది శశిరేఖ.

పిల్లల నందరినీ తీసుకుని రామారావు బజారుకి వెళ్లాడు. ఎవరిక్కావలసిన బొమ్మల్ని వాళ్ళు కొనుక్కున్నారు. ఎవరి కిష్టమైన బిస్కట్లు చాక్లెట్లు వెతికి వెతికి తెచ్చుకున్నారు. కారు నిండా సరంజామాను మోసుకుని వచ్చారు.

“సుధా బొట్టు పెట్టించుకుని ఈ కెంపుల గాజుల జత తీసుకో. మామయ్యగారు మీ ముగ్గిరికీ తెచ్చారు. అక్కకీ, దేవసేనకూ పండగ రోజిస్తాను. ఊరికెళ్లబోతున్నావు కనుక నువ్విప్పుడు తీసుకో.”

“మా చేతికి డబ్బిస్తే నచ్చినవి కొనుక్కుంటాము గదా అత్తయ్యా. ఎప్పుడూ ఇలాగే చేస్తారు”

“డబ్బిచ్చే కన్నా వస్తువులిస్తే సంతోషంగా వుంటుంది. పిల్లల బట్టల కవర్లు కూడా సర్దుకో.”

ఇంట్లో వున్న నలుగురు పిల్లలూ బాగా సందడి చేస్తున్నారు. ఆ పూట స్కైప్‌లో ప్రియంవదతో, అల్లుడితో, పిల్లలతో అందరూ మాట్లాడారు. ఎంత నవ్వుతూ మాట్లాడుతున్నా ప్రియంవద ముఖం చిన్నబోయే వున్నది. పుట్టింటికి సంక్రాతి కంటూ తనూ తన కుటుంబంతో కలిసి ఇప్పటికిప్పుడు వెళ్లగలిగితే ఎంత బాగుంటుంది? కుదరదు గదా అని నిట్టూర్చింది.

అమ్మ ఎప్పుటూ అంటుంది “మీకు డాలర్లే ముఖ్యం. మాకేమో మీరంతా కళ్లకు కనపడటమే ముఖ్యం. నీకిద్దరూ ఆడపిల్లలు ప్రియంవదా. దేశం కాని దేశంలో ఆ పిల్లలు పెరిగి పెద్ద వాళ్లవుతున్నారు. ముందు మందు సమస్యలు రావచ్చు. పిల్లలకు పదేళ్లు వచ్చాయి. ఆ తర్వాత వాళ్లు ఆ దేశం వదిలి రానంటారు. ఆక్కడంతా శుభ్రంగా భూలోక స్వర్గం లాగుందంటావు. మనం ఎక్కడ సంతృప్తిగా వుండే అక్కడే స్వర్గముంటుందమ్మా. నువ్వు, అల్లుడుగారూ ఆలోచించిచుకుని ఇండియా వచ్చేయండి. ఇప్పటికి మీరు కూడబెట్టుకున్న సొమ్ము చాలు. ఇక్కడ సత్తెనప్లలిలోనూ, అటు దొండపాడులోనూ మీ నాన్నగారు, మీ మామగారు కొన్న పొలాలూ, స్థలాలు మీకు చాలా ఏర్పడ్డాయి. అమ్మదంతా చాదస్తం అని నువ్వునుకున్నా సరే” అని.

చదువుకునేటప్పటి నుండి తను అమెరికా రావాలని నుకున్నది. తన కోరికకు దగ్గట్టే అమెరికాలో వుండే రవిచంద్ర తన భర్తగా వచ్చాడు. తన కూతుళ్లు సోహన, మోహనలు. తనేం చేసినా రవిచంద్ర అడ్డు చెప్పడు. పిల్లలకిక్కడ తను నాట్యం, సంగీతం అన్నీ నేర్పిస్తున్నది. కాని ఏదో లోపిస్తున్నట్లుగా అన్పిస్తుంది. అందేటో తన కర్థం కావటం లేదు.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here