కర్మయోగి-7

0
10

[dropcap]హై[/dropcap]దరాబాద్‌లో మురళీ ఇంట్లోనే వున్నారు శశిరేఖా ఆమె తల్లీదండ్రీ. మురళీ కూడా శెలవు పెట్టి తల్లిని హాస్పిటల్‌కు తిప్పుతున్నాడు.

‘వీళ్లంతా ఎన్నాళ్లుంటారో ఏమిటో? అసలే నీళ్లకు కరువుగా వున్నది’ అనుకున్నది మురళీ భార్య. ఆపరేషన్ అయిపోయి హాస్పటల్ నుండి మురళీ ఇంటికి వచ్చేశారు అందరూ. తన తల్లికి కాస్త నెమ్మదించాక ఆమె నక్కడే వదిలేసి శశిరేఖా, ఆమె తండ్రీ సత్తెనపల్లి వచ్చేద్దామనుకున్నారు. ఎందుకంటే ఆమెకు చెకప్ లవీ వుంటాయి కనుక. ఆ తర్వాత కీమోథెరపీ కూడా ఇవ్వాల్సి రావచ్చన్నారు. అటూ ఇటూ మాటి మాటికీ తిరగటం కష్టం గనుక ఆమెను కొడుక్కు, కోడలికీ అప్పగించి వీళ్లు తిరిగి వచ్చారు. మరలా కొద్దిరోజులున్నాక నరసింహరావు హైదరాబాదు వస్తానని చెప్పి వచ్చాడు.

సత్తెనపల్లిలో నరసింహరావును కూడా తమతోపాటే వుండమని రామారావూ, సత్యవతీ చెప్పారు. కాని ఒప్పుకోలేదు. కనీసం రెండు పూట్లా వచ్చి భోజనమైనా చేయమని చెప్పారు. దానికీ ఒప్పుకోలేదు.

“నేను వచ్చి వండిపెట్టటానికి ఇంట్లో పిల్లలకు ఇబ్బంది అవుతుంది నాన్నా. నువ్వే వస్తే బాగుంటుంది.” అన్నది శశిరేఖ.

“ఫర్వాలేదమ్మా. నేను హోటల్లో తినేస్తాను. నా గురించి ఆలోచించవద్దు” అని చెప్పాడు.

అదే మాట అత్తగారితో చెప్పింది శశిరేఖ.

“హోటల్లో తినటమెందుకు? ఆరోగ్యం పాడవుతుంది. నువ్వే రెండు పూట్లా కారియర్ పంపు” అన్నది.

“అలాగే అత్తయ్యా.”

“పూట పూటా సర్ది పంపితే మాత్రం ఈ ఇంటి తిండి తిన్నట్లు కాదా? రావటానికి భేషజమొకటి” అంటూ సుధారాణి సణుక్కుంది.

వంటా వార్పు చూసే వరలక్ష్మి మాత్రం “పోన్లెండి అమ్మా! భార్యకు బాగోక ఇబ్బందుల్లో వున్నారు. లేకపోతే ఏనాడూ మన ఇంటి తిండికి ఆశపడరు. వచ్చి తిష్ట వేయాలనీ అనుకోరు. శశిరేఖ కూడా పుట్టింటికేదో దోచి పెట్టాలనుకనే మనిషి కాదులే” అని సానుభూతి చూపింది.

“ఆ… ఆ… పైకి అలాగే అంటారు. అలాగే వుంటారు కూడా. ఇప్పడే కాన్సర్ హాస్పిటల్లో, ఆపరేషన్ చేయించారు. ఏ లక్షో, లక్షన్నరో అయ్యివుంటుంది. అంత డబ్బు ఖర్చు పెట్టుకునే స్థితిలో వాళ్లున్నారా? బావగారి నడిగి తీసుకుని వుంటుంది ఈ శశిరేఖమ్మ” అంది అక్కసుగా.

ఆ మాటలకు వరలక్ష్మి ఏం బదులివ్వలేదు. అసలే సుధారాణమ్మ కోపంగా వున్నది. ఆ కోపంలో ఏ మంచి మాట చెప్పినా అపార్థం చేసుకుంటుందని ఆవిడకు బాగా అనుభవం. ఇంతలో, ఎవరో వస్తున్న అలికిడి విని సుధారాణి అక్కడ్నుంచి వెళ్లిపోయింది.

ఆ రాత్రి భోజనాల దగ్గర అందరూ కూర్చున్నారు. ఇవ్వాళ జగత్ మోహన్ కాస్త పెందలాడే ఇంటికి వాచ్చాడు. తమ వ్యాపారాలను గురించి కాసేపు మాట్లాడుకున్నారు. ఆయిల్ మిల్‌తో సహా అన్నీ సంతృప్తికరంగానే వున్నాయనుకున్నారు.

“రైల్వేవారికి ఇద్దామనుకున్న గోడవున్స్ కాంట్రాక్ట్ ఇంకా ఏం తేలలేదు. రాబోయే ఎలక్షన్స్‌లో యమ్.ఎల్.ఎ.గా మనింట్లో వాళ్లు పోటీ చేస్తే బాగుంటుందనుకుంటున్నాను. సత్యానికెలాగు పాలిటిక్స్‌లో ఆసక్తి లేదు. మీకేమైనా పోటీ చేసే ఉద్దేశముందా నాన్నా?”

“అలాంటి ఉద్దేశం నాకేం లేదు పెదబాబూ. ఏదో ఒక టరమ్ పోటీ చేశాను. గెలిచాను. నా నియోజక వర్గంలోని ప్రజలకు నాకు చేతనయిన సేవ చేశాను. కాస్తో, కూస్తో మంచి పేరు తెచ్చుకున్నాను. వ్యతిరేకించే వాళ్లు వుంటారు. అందర్నీ మెప్పించలేం కదా? అంతటితో నాకు చాలనిపించింది. నిశ్శబ్దంగా వుండిపోయాను.”

“మీ ఇష్టం నాన్నా. కాని మీ వారసత్వం పోకుండా ఈ సారి ఎలక్షన్స్‌లో నేను పోటీ చేయాలనుకుంటున్నాను. దాని కోసమే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. నాకు టికెట్ ఇస్తారనే, అనుకుంటున్నాను.”

“అప్పటికీ, ఇప్పటికీ రాజకీయాలు చాలా మారిపోయాయి. ఎక్కువ మంది మాట మీద నిలబడే స్థితిలో లేరు. ఎవరికి వారే యమునాతీరే లాగుంటున్నారు. పోటీ చెయ్యాలనుకోవటం తేలికే. పడే శ్రమంతా ఆ తర్వాతే పడాలి. డబ్బుకు, డబ్బూ బాగా ఖర్చవుతుంది. పొరపాటున గెలవకపోతే పెట్టిన డబ్బూ, పడ్డ శ్రమా అంతా వృథా అవుతాయి. అన్నీ ఆలోచించుకుని బరిలోకి దిగు.”

ఆ మాటలకు ఎవరూ ఏం మాట్లాడలేదు.

“నాన్నగారు చెప్పేది శ్రద్ధగా విను పెదబాబూ. కాస్త ఆలోచించుకునే పూర్తిగా రాజకీయలలోకి దిగు. ఇంతలో పోయిదేమీ లేదు” అన్నది సత్యవతి.

సత్యం, శశిరేఖా మెదలకుండా ఊరుకున్నారు.

అటూ ఇటూ దిక్కులు చూడటం ఆపి, సుధారాణి నోరు విప్పింది.

“మీరనే మాట నేనూ అంటాను అత్తయ్యా. పోటీ చేయటం అనవసరమని. మామయ్యగారు మానుకున్నారు. ఇప్పుడు బావగారు మాత్రం బాగా ఉత్సాహపడుతున్నారు. గెలిస్తే మంచిదే. అట్లా కాకుండా ఓడిపోతే ఎంత నష్టపోతామో అనేదే నా బాధ. మనది ఉమ్మడి కుటుంబం. ఎవరికే నష్టం కలిగినా అది కుటుంబ మంతటికీ చుట్టుకుంటుంది.”

ఆ మాటలు విన్న రామారావు అవాక్కయ్యాడు. చిన్న కోడలు తమ సమక్షంలో పెద్దవాళ్లని కూడా చూడకండా ఇలా మాట్లాడటం బాధనిపించింది. చప్పున సత్యం అందుకున్నాడు.

“సుధా! ఏంటా మాటలు? మాట్లడటం రాకపోతే నోర్మూసుకునుండు. దేనికి ఖర్చు పెట్టుకోవాలో, దేనికి మానుకోవాలో మాకు తెలుసు. అది మేం చూసుకుంటాం. ఖర్చు  అవుతుంది. అది మా డబ్బే. ఎవర్నీ అడిగి తీసుకుని ఖర్చు చెయటం లేదు” అన్నాడు కోపంగా.

“ఖర్చు చేయ్యటం తేలికే. కాని రోజు రోజుకూ పిల్లలు పెద్ద వాళ్లవుతున్నారు. వాళ్ల పెరిగేటప్పటికి ఆస్తులేమీ మిగలవేమోనని నాకు భయం.”

“నీకా భయమేమీ అక్కర్లేదమ్మా సుధా. మా ఏర్పాట్లు మాకున్నాయి” అన్నాడు రామారావు.

“మీరెన్ని చెప్పినా ఖర్చు చేసేది ఉమ్మడి ఆస్తిలో నుంచి తీసేదేగదా మామయ్యా. తీసి వాడటం తేలికే. మీరెన్నేళ్లు శ్రమ పడితే, ఎంత కష్టపడితేనో ఈ నాటికిలా వుంది. కాని ఖర్చుబెట్టింది పూడ్చాలంటే ఎవరి వల్లవుతుంది? ఎన్నాళ్ల కది సాధ్యపడుతుంది?” అంటూ ముక్కు చీదుకుంటూ అక్కడ్నుంచి లేచి వెళ్లింది.

ఇక ఆ తర్వాత ఎవరూ సరిగా భోజనం చేయలేకపోయారు. ఎవరి గదుల్లోకి వాళ్లు వెళ్లిపోయారు. రామారావుయితే మరీ అలజడి పడ్డాడు. పెద్ద కోడలికీ, చిన్నకోడలికీ స్వభావంలో చాలా తేడా వుందని తనకీ తెలుసు. కాని సుధ ఇంత కుండబద్దలు కొట్టినట్లుగా మాట్లాడుతుందని అస్సలు ఊహించలేదు. ‘సుధారాణి మాటలతో ఆమె ఆలోచనలు స్పష్టంగా తెలుస్తున్నా, వాళ్ల దేంటో వాళ్లకు పంచి ఇచ్చి జగత్ మోహన్ వాటాలోదే ఎలక్షన్స్‌కు ఖర్చు పెట్టాలని సుధారాణి వాదన. మాట ఎలాగూ అనేసింది. ఇక తనే ఆలోచించుకోవాలి’ అనుకున్నాడు.

“సుధా! నోటికెంత తోస్తే అంత మాట్లాడమేనా?  నాన్న పెద్దవారు. ఆయనన్నీ ఆలోచిస్తారు. అన్నయ్యా వున్నాడు. అసలీ ఆస్తి అంతా సంపాదించింది నాన్న. ఏం చేయటానికైనా ఆయనకు హక్కు వున్నది. అన్నయ్య కూడా బాగా తెలివిగలవాడు. ఇద్దరూ కూడా దుబారా మనుషులు కాదు. అనవసరంగా నువ్వు తొందర పడ్డావు. అలా మాట్లాడి వుండాల్సింది కాదు. అమ్మ, వదిన ఎంత బాధ పడ్డారో!”  అన్నాడు సత్యం.

“మీరు కూడా అలా అంటారేమిటి? మన పెళ్లి నాటికి మీరుద్యోగం చేస్తున్నారు. అదీ వద్దని ఇంటికి తీసుకొచ్చేసారు. వ్యాపారం చెయ్యమన్నారు. చేస్తున్నారు. సర్దుకున్నాను. పెళ్లయి ఇన్నాళ్లైనా మన చేత వేరు కాపురమంటూ పెట్టించలేదు. అత్తగారిదే పెత్తమంతా. దమ్మడీ కట్నం తీసుకురాని ఆ శశిరేఖను, నన్నూ ఒకే లాగా చూస్తారు. ఇంకా మాట్లాడితే పెద్ద కోడలంటూ నెత్తిన పెట్టుకుంటారు. ఇప్పుడేమో ఎలక్షన్స్ అంటూ, పోటీలంటూ దిగబోతున్నారు. ఉన్న డబ్బంతా ఊడ్చేస్తారు. రేపు యమ్.ఎల్.ఎ.గా గెలిస్తే ఆయన పెళ్లానికి గొప్ప. యమ్.ఎల్.ఎగా ఉండి కుటుంబానికి ఏమన్నా సంపాదించి ఇస్తాడా? తన పెళ్లాం పిల్లలకు పెట్టుకుంటాడు. అలా కాకుండా అస్సలు ఎలక్షన్స్‌లో ఓడిపోతే? ఈ పెట్టిన ఖర్చంతా తిరిగి వెనక్కు ఎలా వస్తుంది? ఆయన స్వంతానికి పెట్టుకనే ఖర్చులు మనమెందుకు వాటా కలవాలి? రేపు నష్టమొస్తే ఎందుకు భరించాలి?  మీరు ఆలోచించండి” అంటూ వాదనకు దిగింది.

“సుధా! ఇన్నాళ్లూ ఒకటిగా వున్నాం. అన్నయ్య, నేను వేరు వేరు కాదు. వ్యాపారాలన్నీ కలిసే చేస్తున్నాం. అమ్మా, నాన్నా మనందర్నీ ఒకే కుటుంబంలాగా వుంచటానికే తాపత్రయ పడుతున్నారు. నువ్విలా వేరు చేసి మాట్లాడటం మంచిది కాదు. లేనిపోని అపార్థాలు వస్తాయి. అమ్మానాన్నా, అన్నయ్యా అందరూ చాలా బాధపడతారు. నా మనసుకూ చాలా కష్టంగా వుంటుంది. ఇంకెప్పుడూ ఇలా మాట్లాడకు సుధా.”

“ఆస్తి దుబారా అవుతుంటే నా మనసుకు చాలా కష్టంగా వుంటుందడీ. మీ నాన్న ఎంతో ఆస్తిని మన వాటాకు పంచి ఇస్తారనే ఉద్దేశంతో మా వాళ్లు మీకిచ్చి చేశారు. అటు ఉద్యోగమూ లేక ఇటు ఆస్తీ పంచి ఇవ్వక రేపు మన పిల్లలు ఏమైపోతారండీ?  మీరిలా కళ్లు మూసుకు కూర్చుంటే మన రామ్‌కూ, కృష్ణకూ ఏం మిగలదు. మీరూరుకున్నా, నేనూరుకోను, ఏదో ఒకటి తేల్చుకునే తీరతాను” అన్నది పట్టుదలగా.

“ఇంట్లో వాళ్లకు మనశ్శాంతి లేకుండా చెయ్యకు. నాన్న మనకు అన్నాయం చేసే మనిషి కాదు. అన్నయ్య ఇవ్వాళ ఖర్చు బెట్టినా అదంతా నాన్న గమనిస్తారు. కళ్లు మూసుకుని ఏం ఊరుకోరు. నువ్వు రాద్ధాంతం చెయ్యటం అనవసరం.  ఈ విషయం ఇంతటితో వదిలిపెట్టు” అంటూ, అటు దిరిగి పడుకున్నాడు.

***

రామారావు తనకున్న పరిచయాలను ఉపయోగించాడు. అటు జగత్ మోహన్ హైద్రాబాద్‌లో కూర్చుని తన ప్రయత్నాలు ముమ్మరం చేసుకుంటున్నాడు. ప్రయత్నాలు ఫలించాయి. యమ్.ఎల్.ఏ. గా పోటీ చేయటానికి టికెట్ వచ్చింది.

సుధారాణి తన పూట్టింటి వాళ్లకు కబురు పెట్టింది. వచ్చి మామగారితో మాట్లాడమన్నది. తాడో, పేడో తేల్చుకోమన్నది. సుధారాణి తండ్రి మరో ఇద్దరు మాటకారి బంధువులను తీసుకుని, వచ్చాడు. అందరూ కాఫీలు తాగి కూర్చున్నారు. సుధారాణి తండ్రి రంగంలోకి దిగాడు.

“బావగారూ! మీకు బయటి పన్లుంటాయేమో? మేము వచ్చిందీ ముఖ్యమైన పని మీదే. ముసుగులో గుద్దులాట ఎందుకు? తిన్నగా విషయానికే వస్తాను. మా సుధకు ఇస్తామన్న కట్నం అణా పైసలతో అప్పజెప్పాను. మా అమ్మాయి పేరుతోనే జాగ్రత్త చేశామనుకోండి. మీరూ అలాగే మీ కొడుకులకు అప్పజేప్తే బాగుంటుంది. ఇన్నాళ్లు మీరే ఆ పని చేస్తారని అనుకున్నాం. ఎన్నాళ్లైన్నా మీ దగ్గర నుండి ఆ మాటే రావటం లేదు. మనమంతా ఆరోగ్యంగా వుండగానే రాత కోతలు పూర్తి చేసుకుంటే బాగుటుంది. ఇప్పటికైనా మించి పోయింది ఏమీ లేదు. ఆ పనులేవో చేసేస్తే పిల్లలూ సంతోషిస్తారు” అన్నాడు.

“అవును రామారావుగారూ! మీ వియ్యంకుడు చెప్పింది నిజమే. పనుల్ని పెండింగ్ పెట్టకోకుండా అంతా బాగున్నప్పుడే అంటే మా ఉద్దేశం అందరూ కలిసి మెలిసి సామరస్యంగా వున్నప్పుడే పంపకాలు చేసుకుంటే బాగుంటుంది. పేచీలు పడి ఎడ మొహం, పెడ మొహాలు వచ్చినప్పుడు పంచుకునే దాని కన్నా ఇలా చేస్తే బాగుంటుంది” అని వచ్చిన బంధువులిద్దరూ వంత పాడారు.

“చూడండి సార్!  ఇంటికి  వచ్చిన పెద్ద వాళ్లను కించపరచటం మాకలవాటు లేదు. మా నాన్నగారు ఒకళ్ల చేత చెప్పించుకునే మనిషి కాదు. ఎప్పుడు పంచి పెట్టాలో, ఎలా పంచి పెట్టాలో ఆయనకెవరూ చెప్పనక్కర లేదు.  ఆయనకు నిండా అరవై ఏళ్లు రాలేదు. ఆరోగ్యంగా వుండగానే పంచిస్తే బాగుంటుందని మీరు పదే పదే అంటున్నారు. అలా అనకండి. మా అన్నదమ్ముల మధ్య ఇంత వరకూ ఏ తేడా రాలేదు. మీరు మమ్మల్ని వేరు వేరుగా చూడకండి. మా ఇద్దరిదీ ఒకటే మాట. మా ఇద్దరకీ మా నాన్నగారెంత చెపితే అంత. మీరు అనవసరంగా శ్రమ తీసుకుంటున్నారు” అన్నాడు జగత్.

“నాకంటే మా అన్నయ్య పెద్దవాడు. తనకి ముందు పెళ్లైంది. వాళ్ల అత్తగారు ఈ ఊరే. వాళ్ల మామగారు వచ్చి ఇంత వరకూ ఆస్తి పంపకాల విషయం మాట్లాడనే లేదు. మీరు కూడా  అడక్కుండా వుంటే బాగుండేది.  సుధకేదో చిన్నతనం. తెలిసో, తెలియకో తానేదైనా అంటే మీరు సర్ది చెప్పాల్సింది పోయి మీరూ అలాగే మాట్లాడటం ఏమి బాగాలేదు” అన్నాడు సత్యం.

“నీకు చిన్నతనం బాబూ. దీపం వుండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని మన పెద్ద వాళ్లు చెప్పారు. ఇప్పడు రాజకీయాలలోకి దిగి మీ అన్నయ్య పోటీ చెయ్యాలనుకుంటున్నాడు. ఈ రోజుల్లో అసెంబ్లీ ఎలక్షన్స్‌కు పోటీ అంటే మాటలా? ఖర్చుల లక్షలు దాటి కోట్లలో అవుతుంది. అదంతా ఉమ్మడి ఆస్తిలు నుంచే తీసి ఖర్చుబెట్టాలి. మరలా రేపు తన వాటా తను పంచుకుంటాడు. నష్టపోయేది ఎవరు? నువ్వూ, నీ కుటుంబమేగా? మేమనటం కాదు. మీరంతా ఆలోచించండి. ఇది న్యాయం అవునో కాదో మీకే తెలుస్తుంది” అని ఎంతగనో నచ్చ చెప్పాలని చూసారు వాళ్లు.

“మీరంతా చాలా శ్రమపడి వచ్చారు. ఏం చెయ్యాలో, ఎలా చెయ్యాలో మాకు తెలుసు, మా పిల్లలు అన్నట్లుగా మేం ఒకళ్ల చేత చెప్పించుకునే స్థితిలో లేం. నా కుటుంబమంతా కలిసి మెలిసి వుంటుంది. నష్టమైనా, కష్టమైనా అంతా కలిసి భరిస్తాం. మీరొచ్చి అడిగినంత మాత్రాన మమ్మల్ని మేం విడగొట్టుకోలేం” అన్నాడు రామారావు..

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here