కర్మయోగి-9

0
6

[సుధారాణి బంధువుల ఒత్తిడికి తలొగ్గి, ఆస్తులు పంచే విషయంలో లాయరుని సంప్రదిస్తానంటాడు రామారావు. సత్యవతి శశిరేఖ దిగులుపడతారు. జగత్, సత్యంలు చిన్నబుచ్చుకుంటారు. ఇంట్లో ఓ రకమైన అశాంతి నెలకొంటుంది. రామారావుకి మైల్డ్ హార్ట్ ఎటాక్ వస్తుంది. కాకినాడ నుంచి రాజేష్, దేవసేనా; అమెరికా నుంచి ప్రియంవద వస్తారు. రాజేష్ ‘రాజేశ్వరి’ గురించి వివరాలు కనుక్కునే ప్రయత్నాలు మానడు. ఆమె గురించి ప్రియంవద కూడా తనకి తెలియదంటుంది. సత్యం ఇంట్లో అన్యమనస్కంగా మసలుతుంటే రామారావు ఓదారుస్తాడు. సత్యవతి సుధారాణికి నచ్చజెప్పాలని ప్రయత్నిస్తే, ఆస్తులు పంచిస్తే వేరింటి కాపురం పెడతామని చెబుతుంది. – ఇక చదవండి]

[dropcap]“ఎ[/dropcap]వరికీ ఏ భయమూ అఖ్ఖర్లేదు. మా నాన్నా, అన్నయ్యా మనకేదో ద్రోహం చేస్తారని ఎలా అనుకుంటున్నారు? అన్నయ్య ఖచ్చితంగా గెలుస్తాడు. మన కుటుంబానికి పరపతి ఇంకా పెరుగుతుంది. నాన్నగారు ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. తనకు చేతనైనంతగా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఆ పనులన్నీ ఇక్కడి ప్రజలకు ఇంకా గుర్తున్నాయి. ఆయన కొడుకూ అదే దారిలో నడుస్తాడని జనానికి తెలుసు. మీ తండ్రీ కూతుళ్లవి అనవసర భయాలు. అసెంబ్లీకి పోటీ చెయ్యాలంటే కొంత ఖర్చుపెట్టాలి. అన్నయ్యే కనక గెలిస్తే మన వ్యాపారాలను ఇంకా పెంచుకోవచ్చు. కొంత మంది ఎన్.ఆర్.ఐ.లతో కలిసి ఒక మెడికల్ అకాడమీ పెట్టాలని అన్నయ్య వాళ్లు చూస్తున్నారు. నీకివ్వన్నీ తెలియవు. ఎంత సేపటకీ విడిపోదాం, పంచుకుపోదాం అన్న ధ్యాసలో పడి కొట్టుకుపోతున్నావు. మనం ఒంటరిగా ఏం చేయలేం. నాన్నా, అన్నయ్యల సపోర్ట్‌తో మనమూ ఎదగొచ్చు. నా మాట విని వేరుపడే విషయం మర్చిపో.”

“మీ అన్నయ్య ఏం చేస్తే నాకేం ఒరుగుతుంది? మా నాన్న విజయవాడ సిద్ధార్థ అకాడమీలో మెంబరు. అట్లాగే మీరూ దేంట్లోనైనా మెంబరుగానో, ప్రెసిడెంట్ గానో వుంటే నాకు గొప్ప. అయినా, వ్యాపారాలు కాని, మరొకటి కాని పెద్ద టౌన్స్‌లో వుండి చేస్తే డెవలప్ అవుతాం. ఇక్కడ సత్తెనపల్లిలో ఈ మూల పడి వుండి మనం సాధించేదేమిటి? మన పిల్లలు ఇక్కడే వుండి ఈ అరకొర చదువులు చదవటం నాకు అస్సలు నచ్చటం లేదు. మీ వదినకు పుట్టింట్లో కంటే ఇక్కడ దివ్యంగా గడిచిపోతుంది, కాబట్టి తను ఏం మాట్లాడదు. మీరంతా తనకీ, నాకూ పోలిక పెట్టకండి. నా మాటా, మా నాన్న చెప్పినట్లుగానూ వింటే బాగుపడతాం” అంటూ అటు తిరిగి పడుకున్నది.

***

తలుపు చప్పుడైతే వరలక్ష్మి వెళ్లి తలుపు తీసింది. ఈ వేళప్పుడు ఎవరొచ్చారబ్బా అనుకున్నది సత్యవతి. ఆనందస్వామి లోపలికొచ్చాడు.

వచ్చీ రావటంతోనే కాళ్లు చేతులూ కడుక్కుని వచ్చి హాల్లో కూర్చున్నాడు. వరలక్ష్మి మజ్జిగ కలిపే పనిలో వున్నది. ఆనందస్వామి రాగానే మజ్జిగ తాగుతాడు. ఈ రోజు అలాగే మజ్జిగ తాగేసి, రామరావు గదిలోకెళ్లాడు.

“రా. కూర్చో. నాకు బాగానే వుందని ఫోన్‌లో చెప్పానుగా. హడావుడిగా వచ్చినట్లున్నావు” అన్నాడు.

“నీ అనారోగ్యం తెలిసిన తర్వాత రాకుండా వుండలేకపోయాను. శ్రీకృష్ణ నారాయణాశ్రమంలో పని వుండి తుళ్లూరు, అలాగే గుంటూరులోని నిర్వికల్పానందగిరి స్వామీజీని కలిసి వస్తున్నాను.”

“తుళ్లూరులో స్కందదేవానందగిరి స్వామీజీయే కదా? వారి గీతా ప్రవచనాలు ఒకసారి విన్నాను. మనసుకు హత్తుకున్నాయి” అన్నాడు రామారావు. “నీకు ఏర్పేడు ఆశ్రమంలో అంతా బాగానే జరిగిపోతున్నది గదా?”

“మహర్షి సద్గురు మళయాళస్వామిజీ అనుగ్రహంతో నాకే కొరతా లేదు. దయగల హృదయమే భగవన్నిలయమని వారే సెలవిచ్చారు. అలాంటి భగవంతుడి లాంటి దయామూర్తివి నువ్వుండగా నాకు అంతా బాగుకాక ఏముంటుంది” అన్నాడు కళ్లు అరమోడ్చి.

“ఎంత బాగానో చదువుకున్నావు. చివరికి నువ్విలా ఆశ్రమాలు పట్టుకుని తిరుగుతావని మేమెవ్వరం కలలో గూడా ఊహించలేదు.”

“పురాకృత సుకృతం. ఆ ఫలితాన్ని దైవప్రసాదంగా స్వీకరిస్తున్నాను. జరిగేదేదో జరక్కమానదు. నువ్వు కూడా ఈ వయసులో అనవసర ఆందోళన లేవీ పెట్టుకోవద్దు. ఆందోళన, వేగిరపాటు అన్ని అనర్థాలకు మూలం. ఇదే అనారోగ్యానికీ దారితీస్తుందని భగవద్గీత కూడా చెప్తున్నది. మన చిరంజీవులందరూ బాగున్నట్లేగా?”

“రాత్రి వరకూ నువ్వుంటే అందరూ కనపడతారు.”

“ఇక్కడ వున్న ఆశ్రమంలో కూడా నాకు పని వున్నది. ఆ పని అయిపోతే వెంటనే బయల్దేరతాను. లేకుంటే ఈ రాత్రికి ఇక్కడే వుండాల్సి రావచ్చు. ఇప్పుడిక బయల్దేరుతాను.”

ఆనందస్వామి మరలా రాత్రికి వచ్చాడు. తన పని పూర్తయేసరికి అకాలం అయినందు వలన ఆగిపోవాల్సి వచ్చిందని చెప్పాడు.

“గడ్డం తాతయ్య మళ్లీ వచ్చాడు.” అన్నాడు శశాంక్. పోయినసారి వచ్చినపుడు ఆనందస్వామికి, గడ్డం తాతయ్య అని పేరు పెట్టాడు. దాంతో పిల్లలు నలుగురూ గడ్డం తాతయ్యేనుకోసాగురు.

జగత్మోహన్ దంపతులకూ, సత్యం దంపతులకూ, ఆశీస్సులందించాడు. వాళ్లను కలుసుకున్న సంతోషం ఆనందస్వామి కళ్లలో కనపడతున్నది. “ప్రియంవదమ్మ కుటుంబమూ, దేవసేనమ్మ కుటుంబమూ చల్లగా వున్నాయనుకుంటున్నాను. వాళ్లకీ, వాళ్ల పిల్లలకీ నా ఆశీస్సులెప్పుడూ వుంటాయి. రేపు వేకువ జామునే నేను బయల్దేరుతాను. మరలా ఎప్పుడో అవకాశం చూసుకుని వస్తాను” అంటూ ఆ పూటకు పాలు తాగి తనకు కేటాయించిన గదిలోకి వెళ్లిపోయాడు.

మర్నాడు తెల్లవారు జామునే ఆనందస్వామి పనులున్నాయంటూ బయల్దేరాడు. నిజానికి ప్రస్తుతం అతను పెద్ద పని మీదే తిరుగుతున్నాడు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా అఖిలాంధ్ర సాధుపరిషత్ మహా సభలు దిగ్విజయంగా జరపాలి. దాని కోసం అఖిలాంధ్ర సాధు పుంగవులందరూ బయల్దేరి రావాలి. వచ్చిన వారంతా భక్తులను ఉద్దేశించి ప్రవచనాలు చెప్పాలి. ఎంతో మంది ఉన్నారు కాబట్టి అందర్నీ ఆహ్వానించాలి. వారి రాకపోకలకు వీలుగా సమయాన్ని కేటాయించుకోవాలి. ఎవరే సమయంలో ప్రవచనాలు చెప్తారో తెలుసుకోవాలి. ఆ ప్రవచనాలు భక్తులను ఆకట్టుకునేటట్లుగా వుండాలి. మహాసభల్లో పాల్గోనే భక్తులకు అందుబాటులో ఆధ్యాత్మిక సాహిత్యాన్ని అందించే ఏర్పాట్లు చెయ్యాలి. ఆశ్రమాల వారు ఏవైనా ఆయుర్వేద ఉత్పత్తులు తయారు చేస్తుంటే వాటిని తెచ్చి విక్రయించుకోవచ్చు. వీటన్నింటికీ వీలుగా విశాల ప్రాంగణమూ, సాధువులు బస చేయటానికి అనువుగా వున్న వసతి భవనాలనూ ఏర్పాటు చేసుకోవాలి. ఈ సంవత్సరం జరగబోయే మహాసభ 51వది. ఈ మహా సభల్ని ఈ సంవత్సరం సుల్తానాబాద్‌లోని రామకృష్ణ మనోహర ఆశ్రమంలో జరపటానికి నిర్ణయం జరిగింది. ఆ విషయమే అఖిలాంధ్ర సాధుపుంగవులకు చెప్పి అందర్నీ ఆహ్వానిస్తున్నాడు ఆనందస్వామి.

***

ఆరోజు ఆదివారం. రాజేష్ మహాత్మా గాంధీ సేవాసమతి కని బయల్దేరాడు. అంతా నిశ్శబ్దంగా, వున్నది. ఎప్పట్లాగే వృద్ధులు అటూ ఇటూ తిరుగుతున్నారు. మాతాజీని కలవాలన్నాడు.

“మాతాజీ లేరండీ. పని మీద పొరుగూరు వెళ్లారు” అని చెప్పారు.

“పోనీ రాజేశ్వరిగారనే ఆమెనైనా పిలుస్తారా?” అడిగాడు.

ఇన్నేళ్లలో రాజేశ్వరిగారి కోసం ఎవరూ రాలేదు. ఈమధ్య ఈయనెవరో వస్తున్నాడనుకున్నారు.

“రాజేశ్వరి గారు కూడా లేరండీ. సుల్తానాబాద్‌లో పని వుండి వెళ్లారు. అక్కడ అఖిలాంధ్ర సాధుపరిషత్ మహాసభలు జరుగుతున్నాయని తెలిసింది. ఏర్పేడు సాములవారి అనుగ్రహ భాషణం వుందని తెలిసిందట. ఒక్కసారి విని వస్తామని అక్కడే ఆగిపోయ్యారండీ. మాతాజీ ఎక్కువగా తన వెంట రాజేశ్వరిగారిని కూడా తీసుకువెళ్తారండీ. ఈసారి ఎప్పుడొస్తారో తెలియదండీ.” అని చెప్పారు.

“మీ ఫోన్ నంబరు ఇస్తారా? ఎప్పుడైనా మీకు ఫోన్ చేస్తే, వారు ఇక్కడవున్నదీ, లేనిదీ చెప్పగలరా? నేనొక డాక్టర్‌ని. రాజేశ్వరిగారితో కాస్త పనుంది. మాట్లాడాలి.”

“కుదరదండీ. మాతాజీ అనుమతి లేకుండా మేమేం చెప్పలేం. శ్రమ అనుకోకుండా మీరు, మరొకసారి రండి.” అంటూ తన పని మీద వెళ్లాడు.

చేసేదేం లేక రాజేష్ తిరిగొచ్చాడు. కొంచెం చికాకనిపించింది. ఈ రాజేశ్వరి గారు తనెన్ని సార్లు ప్రయత్నించినా ఆమె తటస్థపడటం లేదు. దేవసేనకేమో ఈ ఊసే పట్టదు.

***

రామారావుకు స్ట్రోకు వచ్చిన తర్వాత కనీసం కొన్నాళ్లైనా ఇంట్లోనే వుండి విశ్రాంతి తీసుకొమ్మని సత్యం గొడవపెట్టాడు. సత్యవతీ అదే గట్టిగా చెప్పింది. వాళ్ల మాట కాదనలేక రామారావు ఇంట్లనే వుండిపోయాడు. కాని కాలక్షేపమేం లేదు. రోజు అతి కష్టం మీద గడుస్తున్నది. కాళ్లూ చేతులూ కట్టేసినట్లుగా ఫీలవుతున్నాడు. పేపరు చదివి పక్కన పెట్టేశాడు. అవసరమైన ఫోన్లు చేసుకున్నాడు. పుస్తకాలు చదివే అలవాటు పెద్దగా లేదు. ఆస్తి పంపకాల విషయమే ఆలోచిస్తున్నాడు. సత్యాన్ని జగత్‌నూ దగ్గర కూర్చో బెట్టుకుని అంతా వివరంగా మాట్లాడాలనుకుంటున్నాడు.

“మా మామగారు అలాగే అంటారు. మీరిప్పుడప్పుడే అలాంటి ఆలోచనలు పెట్టుకోకండి” అంటున్నాడు సత్యం.

జగత్ ఏం మాట్లాడటంలేదు. అంతా తండ్రి నిర్ణయానికే వదిలేశాడు. అన్ని విధాలా ఆలోచించి తను రెండు కుటుంబాలకూ సమన్యాయం చేసే శక్తి తండ్రికి పూర్తిగా వుందని జగత్‌కు నమ్మకం. లోకంతో పాటే మనమూ. ఉన్నదేదో పంచి ఇస్తే మంచిదన్న ఉద్దేశానికి సత్యవతీ వచ్చింది.

“ఎప్పుడైనా వాళ్లకి ఇచ్చేదే. పంపకాలంటూ జరిగితే సుధారాణి వేరు పోతానంటుంది. నీకు తెలియంది ఏముంది? మన ఉద్దేశాలు వేరు. పిల్లల ఉద్దేశాలు వేరుగా వుంటున్నాయి. అదే నాకు నచ్చటం లేదు” అన్నాడు రామారావు.

“మీ కొకటి చూపించాలి” అంటూ సత్యవతి పెద్ద లెటర్ పాడ్ సైజులో వున్న నోట్ బుక్ నొకదానిని తీసుకుని వచ్చిది. దాన్ని పట్టుకుని ముసి ముసి నవ్వులు నవ్వుకుంటూ “మీరూ చూడండి” అంటూ రామారావు చేతిలో పెట్టింది.

“ఏమిటిది?”

“ఏమిటా? మన సాహాన, మోహనలు అమెరికా నుంచి మొన్న వాళ్లమ్మ కిచ్చి పంపారు. వాళ్ల చేతుల్తో వాళ్లేసిన బొమ్మలు. మన విషయాలన్నీ ఎప్పుడూ వాళ్లమ్మ చెప్తుంటే విని గుర్తు పెట్టుకున్నారు. అలా, గుర్తు పెట్టకున్న విషయాలను బొమ్మలుగా గీశారు. మన విషయాలే కాదు, దొండపాడు తాతయ్యా, నాయనమ్మల గురించి, దేవసేనా, వాళ్ల పిల్లలు గురించీ అన్నీ గీశారు. నేను కోడళ్లూ చూశాం. మీరు చూడండి. వాళ్ల చిన్న చేతుల్తో ఎంత చక్కటి బొమ్మలు వేశారో. ముద్దొస్తున్నాయి” అంది మురిపెంగా.

మనవరాళ్లు గీసిన బొమ్మలనగానే కళ్లజోడు తీసి లుంగీ కొసలు పెట్టి అద్దాలను తుడిచి మరీ చూడటం మొదలు పెట్టాడు

‘సత్తెనపల్లి తాతగారు’ అంటూ హెడ్డింగ్ కింద బొమ్మ గీశారు. వంకరటింకర్లు లేకుండా నీట్‌గా పెన్సిల్ తోనే వేశారు. ఆ బొమ్మలో రామారావు కళ్లజోడు కాస్త కిందకు జారుతున్నట్లుగా వున్నది. చేతులు వెనక్కు పెట్టుకుని ఆలోచిస్తూ నిలబడటం రామారావు కలవాటే. అదే మేనరిజాన్ని వాళ్లు బొమ్మ గీశారు. తన పోలికలు బాగా తెలుస్తున్నాయి. ఎంత బాగా గీశారు తన బొమ్మ అనుకుని, మురిసిపోతూ మరో పేజి తిప్పాడు. ‘సత్తెనపల్లి అమ్మమ్మ’ అంటూ హెడ్డింగ్ పెట్టారు. నడుమున ఎడమ చెయ్యి మణికట్టు మడిచి పెట్టుకుని నవ్వుతూ నిలబడి వున్నది. అచ్చంగా సత్యవతి అలానే నిలబడుతుంది. సత్యవతి వేలు ముడి, ముడిలో పువ్వును కూడా మర్చిపోకుండా వేశారు.

“నా బొమ్మ ఎంత బాగా గీశారోనండీ. నిజంగా నాకలాగే నిలబడే అలవాటుందిగా” అన్నది పెద్దగా నవ్వుతూ సత్యవతి.

ఆ తర్వాత పెదమామ బొమ్మ. ప్యాటూ, షర్టూ వేసుకున్నాడు. మెడలో భుజాలను, తాకుతూ వేసుకున్న పై పంచ. పై పంచకు అంచులు దిద్దారు. జగత్ నమస్కారం చేస్తున్నాడు. చిరునవ్వులు చిందించే జగత్ ఎదుట కొంత మంది మనుషుల చిన్న చిన్న బొమ్మలు గీశారు. “రాజకీయాలలో తిరుగుతున్నాడని అలా గీశారన్నమాట” అన్నాడు రామారావు నవ్వుకుంటూ.

ఆ తర్వాత పెద్దత్త బొమ్మ. చేతిలో గరిట పట్టుకుని పొయ్యి మీదున్న గిన్నెలో దెన్నో కలియబెడుతున్నది. వంటింట్లో వున్న సామాన్లు కూడా జాగ్రత్తగా గీశారు. వంటింట్లో వంట చేస్తున్నదన్న మాట. నింజగానే శశిరేఖ ఎక్కువ భాగం వంట తనే చేస్తూ వరలక్ష్మి చేత కొన్ని చేయిస్తూ వుంటుంది.

ఆ తర్వాత బొమ్మ పెద్ద మామ పిల్లలది. శశాంక్, శైలజల బొమ్మలు రెండూ పక్కపక్కన గీశారు. వాళ్లిద్దరూ నేల మాద కూర్చుని చుట్టూ పుస్తకాలు, పెన్సిళ్లు పేర్చుకుని తమ పుస్తకాల సంచిలోకి చూసుకుంటున్నారు. పిల్లలు వంగి కూర్చునే విధం బాగా గీశారు. శైలజ కూర్చున్న విధం మరీ బాగుంది.

తరువాత చిన్న మామ బొమ్మ. ఒక ఫ్యాక్టరీ బొమ్మగీశారు. ఫ్యాక్టరీ లోపల మిషన్లు. ఆ మిషన్ల మధ్య తిరుగుతున్నట్లుగా గీశారు. అంటే మిల్లులు చూసుకుంటున్నాడని కాబోలు. వీళ్ల దుంపలు తెగ. ఎవరికి తగ్గ బొమ్మ వాళ్లకు గీశారు అనుకున్నాడు రామారావు మరోసారి.

తర్వాతది చిన్నత్త బొమ్మ. అద్దంలో చూసుకుంటూ ముఖానికి క్రీమ్ రాసుకుంటున్నది. అంటే మేకప్ వేసుకుంటుంద్న మాట.

“ఈ బొమ్మ చూసి నాకైతే నవ్వు వచ్చింది, సుధ మాత్రం ఉడుక్కున్నది.”

“అంతెక్కువగా నేను మేకప్‌లు చేసుకునే దానిలాగా కనపడ్డానా? సత్తెనపల్లిలో మేకప్ వేసుకుని ఎక్కడకు పోవాలంట? ఓ పార్టీనా? ఓ ఫంక్షనా? ఎప్పుడూ ఇంట్లో పడివుండటమేగా? అని మూతి విరుస్తూ సణుక్కున్నదండీ” అన్నది సత్యవతి.

“ఏ సందర్భ మొచ్చినా పుల్లవిరుపు మాటలనకుండా వుండదుగా. ఆ అమ్మాయి స్వభావాన్ని, చిన్నవాళ్లైనా సోహన, మోహనలు బాగా కనిపెట్టారు” అన్నాడు రామారావు.

ఆ తర్వాత రామ్, కృష్ణల బొమ్మలున్నాయి. ఓ చేత్తో చాక్లెట్ బార్ తింటూ మడి కాళ్ల మీద కూర్చుని వున్నాడొకడు. వాడు మరో చేత్తో క్రాపు సవిరించుకుంటున్నాడు. మరొకడేమో చేత్తో బిస్కట్ పాకెట్ పట్టుకుని వున్నాడు. మరో చెత్తో చెంప గోక్కుంటున్నాడు.

చివరగా వరలక్ష్మి బొమ్మ వేశారు. చీర పైకెత్తి బొడ్లో దోపుకున్నది. కాళ్లు పైకెత్తి దొడ్లో కరివేపాకు కోస్తున్నది. జారిపోయే వేలుముడి. వేలుముడి మీద నుంచి వేలాడే వెంట్రుకలు మెడ మీద పడుతున్నయి. కరివేపాకు కోసే చేతులకు గాజులు కూడా వేసి చాలా సహజంగా బొమ్మ గీశారు. అక్కడితో పుస్తకంలో సగం పేజీలు నిండాయి.

ఆ తర్వాత ఆంటీ అండ్ అంకుల్ అని హెడ్డింగ్ పెట్టారు. ఆంటీ అని వ్రాసి వున్నదాని కింద క్లాస్ రూమ్ గీశారు. క్లాసులో అబ్బాయిలు, అమ్మాయిలు కూర్చుని వున్నారు. దేవసేన గోడ వైపుకు తిరిగి నిలబడి వున్నది. గోడ దగ్గరున్న స్క్రీన్ మీద ఇంగ్లీషులో వ్రాసి వున్న పంక్తులు. వాటి వంక వేలు చూపిస్తూ దేవసేన ఏదో చెప్తున్నది. ఇంజనీరింగ్ కాలేజ్ క్లాస్ రూమ్. క్లాస్‌లో విద్యార్థులు. పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇస్తున్నట్లుగా దేవసేన బొమ్మను రూపు కట్టించారు.

ఆ తర్వాత అంకుల్ బొమ్మ. అంకుల్ మెడలో స్టెతస్కోప్ పెట్టుకుని ఎదురుగా వున్న పేషెంట్ ఛాతీ మీద వుంచి చూస్తున్నాడు. పేషెంట్ బొమ్మ నిజంగా నీరసంగానూ అచ్చం రోగం వచ్చిన వాడి బొమ్మలాగే గీశారు.

చూసే కొందికే చూడాలనిపించేటట్లుగా వున్నాయే వీళ్ల బొమ్మలు అని మరోసారి అనుకున్నాడు రామారావు.

ఆ తర్వాతిది కిరణ్ బొమ్మ. కిరణ్ పళ్లలో కింది పెదవిని అదిమిపెట్టి చేతిలో వున్న పలుగుతో నేలను తవ్వుతున్నాడు. వెనక నుంచి పెద్ద వాళ్లు ఇక చాలు ఇక చాలు అంటున్నారు. ఆ తర్వాతిది ప్రణవి బొమ్మ. కాగితాలు, పుల్లలు పోగుచేసి చిన్న గుట్ట పెర్చింది. చేతిలో అగ్గిపెట్టె అగ్గిపుల్ల తీసి వెలిగించి ఆ పుల్లల్ని అంటించాలని చూస్తున్నది. వెనక నుంచి పెద్ద వాళ్లు ఆగు ఆగు అంటున్నారు. ఆఖరున మమ్మీ డాడీ అని హెడ్డింగ్ పెట్టారు.

బాగా మంచు కమ్మినప్రాంతం. ఆ ముంచు మధ్య నుండే కారును డ్రైవ్ చేస్తున్నది. ప్రియంవద కాబోలు. డ్రైవింగ్ సీట్లో వున్న ప్రియంవదను అస్పష్టంగా చూపించారు. అమెరికాలోని మంచులో కారేసుకుని ప్రియంవద ఆఫీసుకెడుతున్నట్లుగా గీశారు.

ఆ తర్వాతది వాళ్ల డాడీ బొమ్మ. లాప్‌టాప్ మందు సీరియస్‌గా కూర్చుని వున్నారు. ఏదో తీవ్రంగా ఆలోచిస్తున్నట్లుగా నుదిటి మీద సన్నని గీతలు గీశారు. వీళ్లు మంచి చిత్రకారులవుతారనిపించింది. చూచినకొద్దీ చూడాలనిపించేటట్లుగా వున్నాయి బొమ్మలన్నీ. వీటిని అలా పడేయకుండా లామినేషన్ చేయించాలా? ఫ్రేములు కట్టి భద్రపరచాలా? అన్న ఆలోచనలో పడ్డాడు రామారావు.

“వాళ్లమ్మ ఇండియా వస్తుంటే జాగ్రత్తగా ఇచ్చి పంపారు. అది చూస్తుంటే మన మనసులకు నిజంగా చాలా సంతోషం కలిగింది. జగత్‌కూ, సత్యానికీ కూడా చూపించు. వాళ్లూ సంతోషపడతారు. సాయంకాలమే మనం అమెరికా ఫోన్ చేసి సాహనతోనూ, మోహనతోనూ మాట్లాడదాం సత్యవతీ. ఈ సారి వాళ్లకు వేసవి శెలవులివ్వగానే తప్పకుండా ఇండియా రమ్మని గట్టిగా చెబ్దాం” అన్నాడు రామారావు.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here