కర్నాటక బిద్రీ కళ

0
10

[dropcap]భా[/dropcap]రతదేశం నలుమూలలా ఎటువైపు చూసినా అద్భుతమైన హస్తకళలు, సున్నితమైన చేతి పనులతో తయారైన కళాఖండాలు ఎన్నో కనిపిస్తాయి. వీటి వలన ఆయా కాలాల, ఆయా ప్రదేశాల సంస్కృతి, సంప్రదాయాలు, కళాకారుల నైపుణ్యాలు తెలుస్తాయి. ఆయా ప్రాంతాలలో మాత్రమే దొరికే వస్తువులు, చెట్లు, నేలలు, లోహాలు ఆ సంస్కృతిని ప్రతిబింబిస్తాయి. ఆ కళాత్మక కుండీలు, హుక్కాగొట్టాలు, నిల్వ పెట్టెలు, నగల పెట్టెలు, జంతువుల, మానవుల బొమ్మలు వంటివన్నింటినీ రకరకాలుగా తయారుచేస్తారు. అలాగే కర్నాటక రాష్ట్రంలోని బిద్రీ కళ ప్రముఖమైన లోహకళ. కర్నాటక రాష్ట్రంలోని బీదర్ నగరానికి చెందిన లోహకళ కావటం వల్ల దీనికి ‘బిద్రీ కళ’ అనే పేరు వచ్చింది. ఊరు పేరుతో కళ ప్రసిద్ధి చెందింది. ఈ కళ యొక్క మూలాలు పర్షియా దేశంలోనివి. పర్షియా నుంచి ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ అనే సూపీ వల్ల భారతదేశానికి ఈ కళ వచ్చింది. టర్కిష్, పర్షియన్, అరబిక్ సంస్కృతుల కలయికతో ఏర్పడింది. ఈ బిద్రీ కళ 12వ శతాబ్దంలో ఈ కళ భారతదేశానికి వచ్చిందని చెబుతారు.

14-15 వ శతాబ్దాలలో బీదర్‌ను పరిపాలించిన బహుమనీ సుల్తానుల వలన ఈ కళ అభివృద్ధి చెందింది. బహుమనీ సుల్తానులు తమ రాజ భవనాలను, న్యాయస్థానాలను అలంకరించడానికి అబ్దుల్లా బిన్ కైజర్ అనే ఇరాన్ కళాకారుడిని పిలిపించారు. కైజర్ స్థానిక కళాకారులతో కలిపి పనిచేయడం వల్ల నూతనమైన బిద్రీ కళ రూపొందించబడింది. బీదర్ కోటలోని నేలలు ఈ కళకు ప్రాణం పోస్తాయి. ఆ కోటలోని కొన్ని ప్రదేశాలు సూర్యరశ్మి సోకక నల్లగా మారిపోతాయి. ఆ నేల్లల్లోని మట్టిని తెచ్చి కళాకారులు తాము తయారుచేసిన వస్తువులను నల్లగా మార్చటంతో కొత్త రూపం ఏర్పడింది. అంటే ఇక్కడి నేలల్లోని నైట్రేటుల వలన రాగి అక్సీకరణం చెంది కాపర్ ఆక్సైడ్‌గా మారుతుంది. ఇది నలుపు రంగులో ఉంటుంది. సూర్యరశ్మి పడే నేలల్లోని నైట్రేటులను సూర్య కాంతి విచ్చిన్నం చేయడం వల్ల ఆక్సీకరణం జరగదు. దీని మూలంగానే సూర్యరశ్మి సోకని మట్టిని మాత్రమే కళాకారులు వాడుతారు.

ఈ కళలో జింక్ ఎనబై శాతం మరియు మిగతా ఇరవై శాతం రాగితో కలపబడిన లోహంతో కళాఖండాలు తయారు చేయబడతాయి. వీటిలో ఆముదం మరియు బంకలతో తయారైన మట్టి అచ్చులో కరిగిన లోహాన్ని పోసి ఆరబెడతారు. ఇందులో ఎనిమిది దశల్లో కళా ప్రక్రియ జరుగుతుంది. మౌల్డింగ్ చేయడం, ఉరితో డిజైనును చెక్కడం, సుత్తితో గట్టిగా కొట్టి ఒక రూపాన్ని తీసుకురావడం వంటి ఎన్నో దశలు ఉంటాయి. అమ్మోనియం క్లోరైడుతో బషింగ్ చేయడం మరియు కాపర్ సల్ఫేటు ద్రావణం ద్వారా నలుపు రంగును పొందడం కుడా ఈ బిద్రీ కళ లోని ప్రక్రియలే. చివర్లో మెరిసేందుకు వెండి తీగల్ని, వెండి పలకలను పొదుగుతారు. మెటల్ స్టైలస్ సహాయంతో అధ్బుతమైన లోహకళాకారులు తమకు కావాల్సిన తీగలు, పువ్వులు, పిందెలు వంటివి చెక్కుతారు. లోహకళాకారులు సున్నితమైన భాగాలతో సైతం తమ అపూర్వమైన పనితనాన్ని, ప్రావీణ్యతను చూపిస్తారు. వెండితో పొడవైన తీగలు, పలుచని రేకులుగా తయారుచేసి ఆయా పాత్రల డిజైనింగులో పొదుగుతారు. సాంప్రదాయక బిద్రీ కళకు ఆధునికత తోడై కొత్త కొత్త నమూనాలను డిజైన్లను తయారు చేస్తున్నారు. కర్నాటక రాష్ట్రం బిద్రీ కళను ప్రోత్సహించడంలో రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ చాలా ముందుంది. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ వారు కూడా బిద్రీ కళలో అనేక నూతన ఒరవడులను ప్రవేశపెట్టారు.

అత్యంత సున్నితమైన బిద్రీ కళ  నలుపు రంగు లోహంపై బంగారు వెండి, రాగిని పొదగటంతో పూర్తవుతుంది. మధ్యయుగం లోని రగువాదుల వారసత్వంతో చేతివృత్తుల పనితనాన్ని మెరుగు పరిచింది. ఈ కళ పర్షియన్, టర్కిష్, ఇస్లామిక్ సంస్కృతులతో కలిసినప్పటికీ దాని ప్రత్యేకతలను కోల్పోలేదు. న్యూయార్క్ లోని మెట్రో పాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్‌లో బిద్రీతో తయారైన కుండలున్నాయి. బహుమనీ సుల్తానుల మొదటి రాజధాని గుల్బర్గా, ఆ తర్వాత వారూ అంటే 15వ శతాబ్దంలో బీదర్‌కు మార్చారు. మసీదులు, మండపాలు, తోరణాలు వంటి అనేక ఆకర్షణీయమైన స్మారక చిహ్నాలను బీదర్ కోటలో చూడవచ్చు. వీటి నుంచి మంచి డిజైన్లను తీసుకొని బిద్రీ కళలో కళాకారులు ఉపయోగిస్తున్నారు.

కర్ణాటక ‘బిద్రీకాలె’ అనే పేరుతో కన్నడంలో ఒక పుస్తకం వెలుబడింది. దీనిని ఇండియన్ రాయల్ అకాడమి ఆఫ్ అండ్ కల్చర్ కర్ణాటక ప్రభుత్వ సహాయంతో ముద్రించింది. రెహమాన్ పటేల్ అనే గుల్బరాకు చెందిన కళాకారుడు బిద్రీ కళపై పరిశోధన చేశాడు. ఇతను ఇంటర్నేషనల్ కలెక్షన్ ఆఫ్ బిద్రీ ఆర్ట్ పై డాక్యుమెంటేషన్ తయారుచేసారు. బిద్రీ తయారీ పద్ధతులు, బిద్రీ యొక్క చారిత్రక నేపథ్యం, బిద్రీ కళా సేకరణలు, మ్యూజియంలపై విమర్శనాత్మక సమీక్షలు వంటి పరిశోధన చేసి రికార్డ్ చేశారు. కర్ణాటకలో మాత్రమే కాకుండా హైదరాబాద్, లక్నో, ముర్షిదాబాద్ వంటి చోట్ల కూడా బిద్రీ కళ ఇప్పుడు విలసిల్లుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here