కర్ణుడా? అర్జునుడా??

0
11

[శ్రీ రోచిష్మాన్ గారి ‘కర్ణుడా? అర్జునుడా??’ అనే రచనని అందిస్తున్నాము.]

[dropcap]భా[/dropcap]రతంలో కర్ణుడు పాత్ర తెలిసిందే. కర్ణుడు మహాభారతం ప్రకారం దుష్ట చతుష్టయంలో ఒకడు. హిందూత్వంపై దాడిగా పురాణాల్లోని, ఇతిహాసాల్లోని దుష్ట పాత్రలను ఉన్నతమైనవిగా ప్రదర్శించాలనే, ప్రకటించాలనే కుట్రలో భాగమే కర్ణుడు ఉన్నతుడు అని వక్రీకరణ చెయ్యడం. కర్ణుడు ఉన్నతుడు అన్న ఆలోచన ఒక మానసిక రోగం.

1963లో తమిళ్ష్‌లో ‘కర్ణ’ పేరుతో శివాజీ గణేసన్ కర్ణుడుగా నటించిన సినిమా వచ్చింది. ‘కర్ణుడు గొప్పవాడు’ అన్న వక్రీకరణ సినిమాల్లో ఈ సినిమాతోనే మొదలైంది. ఈ కర్ణ సినిమాలో ఎన్.టీ. రామారావు కృష్ణుడుగా చేశారు. ఈ తమిళ్ష్ కర్ణ సినిమా హిందీలో ‘దాన్ వీర్ కర్ణ’ పేరుతో 1963లోనే డబ్ ఐంది. దాన వీర తరువాత శూర చేర్చి ఎన్.టీ. రామారావు ‘దాన వీర శూర కర్ణ’ సినిమా తీశారు. మహాభారతం స్ఫూర్తికి వ్యతిరేకంగా విషయం పరంగా పెనువక్రీకరణ దాన వీర శూర కర్ణ సినిమా. కర్ణుడుగా రామారావు గొప్పగా చేశారు. తమిళ్ష్‌లో కర్ణుడుగా చేసిన శివాజీ గణేసన్ విఫలం అయ్యారు. కర్ణుడు పాత్రను శివాజీ గణేసన్ అర్థం చేసుకోలేక, అందుకోలేక పాత్రౌచిత్య పోషణను చెయ్యలేకపోయారు.

16వ శతాబ్దిలో విల్లి అనే తమిళ్ష్ కవి రాసిన ‘విల్లి బారదం’ కావ్యం తమిళ్ష్ కర్ణ సినిమాకు కొంత మేర ఆధారం. మరణించేడప్పుడు కర్ణుడికి కృష్ణుడు విశ్వరూపం చూపించనట్టుగా ఈ విల్లి బారదంలో ఉంది. ఈ విల్లి బారదంలో కర్ణుడు మేలైన వ్యక్తిగా చిత్రించబడింది. 1950వ దశాబ్దిలో బి.ఎస్. రామయ్య అన్న రచయిత కర్ణుడు నాయకుడుగా తమిళ్ష్‌లో ‘తేరోట్టి మగన్’ (అంటే రథ సారథి కొడుకు అని అర్థం) అన్న నాటకాన్ని రాశారు. సహస్రనామం అన్న నటుడు కర్ణుడుగా చేసిన ఈ నాటకం తమిళ్ష్‌నాట ప్రాచుర్యంలోకి వచ్చింది. ఈ నాటకం కూడా కర్ణుణ్ణి మేలైన వ్యక్తిగానే చిత్రించింది. కర్ణుణ్ణి ఉన్నతుడుగా చిత్రించిన తమిళ్ష్ కర్ణ సినిమాకు విల్లి బారదం కావ్యమూ, తేరోట్టి మగన్ నాటకమూ ఆధారాలు. కర్ణుడు గొప్పవాడు అన్న తప్పుడు భావన ఇప్పుడున్నంతగా 60వ దశాబ్ది వరకూ లేదు.

కర్ణుడు మహోన్నతుడు, అర్జునుడి కన్నా గొప్పవాడు అంటూ గత కొంత కాలంగా వినవస్తున్న వాదనలు సరైనవి కావు. ఆ వాదనలూ, ఆలోచనలూ మానసిక దౌర్బల్యంవల్ల, చింతనా వక్రతవల్ల, చెడగొట్టబడితే చెడిపోయినందువల్ల వచ్చినవే. ఈ వాదనలూ, ఆలోచనలూ హిందూత్వంపై పరోక్షంగా దాడి చెయ్యడానికి కూడా పనికివస్తున్నాయి. కర్ణుడు మంచివాడా? మహాభారతం ప్రకారం కర్ణుడు మంచివాడు కాదు. అర్జునుడు స్థాయి వీరుడు కూడా కాదు కర్ణుడు. విరాట పర్వంలోని ఉత్తర గోగ్రహణం ఘట్టంలో అర్జునుడి ధాటికి తలవంచిన కౌరవ సేనలో కర్ణుడూ ఉన్నాడు. ఇలా మరి కొన్ని సందర్భాల్లోనూ కర్ణుడు కన్నా అర్జునుడు వీరంలో గొప్పగా నిలుస్తాడు. అర్జునుడు తన వీరంతో రాజ్యాలను జయించి అన్న ధర్మరాజు చేతిలో పెట్టాడు. కర్ణుడు రాజ్యాలను జయించి దుర్యోధనుడికి ఇచ్చాడా? లేదు.

కర్ణుడు భీముడి చేతిలో ప్రాణ భిక్షను పొందాడు. కర్ణుడు నకుల, సహదేవులకు కూడా దొరికితే వాళ్లు కర్ణుడికి ప్రాణభిక్ష పెట్టారు. పద్మవ్యూహంలో కర్ణుడు అభిమన్యుణ్ణి దొంగ దెబ్బ తీశాడు. నిండు సభలో ద్రౌపదిని వివస్త్రను చెయ్యాలన్న ఆలోచన కర్ణుడిదే. కర్ణుడు మానసికంగా ఎంత నీచుడో ఈ విషయం తెలియజేస్తుంది. దేవకన్య ఊర్వశి తనను మోహించినా చలించక తిరస్కరించాడు అర్జునుడు. ఆ తిరస్కారంవల్ల తాను శాపగ్రస్తుడవనున్నా అర్జునుడు చలించలేదు. అర్జునుడి ఔన్నత్యానికి ఈ సంఘటన ఒక మచ్చుతునక.

వ్యాస భారతం ప్రకారం కర్ణుడు దానశీలి కాదు; వీర, శూర పదాలకు కర్ణుడు సరైన అభివ్యక్తి కాదు. దాన, వీర, శూర పదాలకు కర్ణుడు సరిగ్గా పొసగే వ్యక్తి కాదు. వ్యాస భారతమో, తిక్కన భారతమో సరిగ్గా చదివితే ఈ సత్యం ప్రతి ఒక్కరికీ అర్థం ఔతుంది. అంతే కాదు దుర్యోధనుడి పతనానికి కర్ణుడు ప్రధానమైన కారణం. దుర్యోధనుడు జన్మతః దుష్టుడు, నీచుడు. మొత్తం కురు రాజ్యం ‘పాండవుల భూమి’. పాండురాజు తన వీరంతో సాధించిన రాజ్యం కురు రాజ్యం. పాండురాజు అంధుడైన తన అన్న ధ్రుతరాష్ట్రుడిపై అభిమానంతో రాజ్యానికి రాజును చేశాడు. నిజానికి అంగ వికలుడైన ధ్రుతరాష్ట్రుడికి రాజుయ్యే అవకాశం లేదు. పాండురాజు ఔదార్యంతో ధ్రుతరాష్ట్రుడు రాజయ్యాడు. ఈ వాస్తవాన్ని జీర్ణించుకోలేక దుష్టుడు దుర్యోధనుడు పాండవులను సహించలేకపోయేవాడు. పాండవులను మట్టు పెట్టె ఆయుధంగానే దుర్యొధనుడు కర్ణుణ్ణి చేరదీశాడు. భారతాన్ని సరిగ్గా చదివితే పలు సందర్భాల్లో కర్ణుడు దుర్యోధనుణ్ణి మరింత చెడగొట్టడం తెలియవస్తుంది. కర్ణుడివల్లే దుర్యోధనుడు చివరికి హతుడయ్యాడు.

అర్జునుడు తపఃశీలి. పరమశివుడుతో తలపడ్డాడు అర్జునుడు. శివుణ్ణి మెప్పించి పాశుపతాస్త్రాన్ని పొందినవాడు అర్జునుడు. అస్త్ర విద్య కోసం అసత్యాలతో పరశురాముడి దగ్గర చేరి భంగపడ్డ వాడు కర్ణుడు. ఈ ఒక్క ఉదంతం చాలు కర్ణుడుకన్నా అర్జునుడు కడు మేలైనవాడు అని అవగతం చేసుకోవడానికి. ముఖ్యంగా అర్జునుడు గొప్ప విద్యార్థి. అర్జునుడు ఎంత గొప్ప విద్యార్థో భగవద్గీత సందర్భంలో తెలియవస్తుంది. తన జిజ్ఞాసతో భగవద్గీత వంటి మహత్తర తత్త్వాన్ని కృష్ణుడి చేత చెప్పించుకున్నాడు. అర్జునుడు విజేత. కర్ణుడు బహూధా విఫలమైనవాడు. కర్ణుడు ఏ సందర్భంలోనూ, ఏ విషయంగానూ విజయం సాధించలేదు.

కర్ణుడు అర్జునుడికన్నా గొప్పవాడు కాడు. కర్ణుడు అర్జునుడికన్నా గొప్పవాడు అనడం, అనుకోవడం తప్పు. కర్ణుడు అర్జునుడుకన్నా గొప్ప అన్న వ్యాధి దక్షిణాదిలో ఎక్కువగా ఉంటుంది. ఉత్తరాది ప్రజల్లో ఈ వ్యాధి పెద్దగా లేదు. దక్షిణాది ప్రజల మనోభావాలు ఎందుకు, ఎలా కలుషితమయ్యాయో ఆలోచించాలి; ఆలోచిద్దాం. మొత్తం మహాభారతంలోని నలుగురు చెడ్డవాళ్లలో కర్ణుడు ఒకడని మహాభారత కర్త చెప్పాడు. కర్ణుడు మంచివాడు అని అనుకోవడం, అనడం, ప్రచారం చెయ్యడం భ్రష్టత్వం. తెలివితో, తెలివిడితో కర్ణుడి విషయంగా మనం భ్రష్టులం కాకుండా సవ్యంగా ఉండాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here