కర్ణుడి భార్యలు – సంతానము

0
7

[box type=’note’ fontsize=’16’] చాలామందికి పెద్దగా తెలియని కర్ణుడి భార్యలు, సంతానం గురించిన వివరాలు ఈ వ్యాసంలో అందిస్తున్నారు అంబడిపూడి శ్యామసుందర రావు. [/box]

[dropcap]భా[/dropcap]రతములో కర్ణుడి పాత్ర చాలా ప్రాధాన్యత ఉన్నపాత్ర. తానూ చనిపోయేంతవరకు లోకానికి కుంతీ పుత్రుడిగా చెప్పుకోలేని దుస్థితి కర్ణుడిది. సూతపుత్రుడిగాను, రాధేయుడిగాను పెరిగాడు. అలాగే ఎంతో శక్తి సంపన్నుడైనప్పటికీ శాపాల వల్ల సాధించిన అస్త్రాలు ఏవి అక్కరకు రాలేదు.

విద్య నేర్చుకోవటానికి పరుశరాముడి దగ్గర అబద్ధము చెప్పినందుకు వచ్చిన ఫలితమే ఆ శాపము. అలాగే తన అస్త్ర విద్య ప్రావీణ్యాన్ని ప్రదర్శించటానికి వెళితే సూతపుత్రుడివి కాబట్టి నీకు అవకాశము లేదు అని పెద్దలచే తిరస్కరించబడ్డ వాడు కర్ణుడు. అటువంటి పరిస్థితిలో పాండవుల మీద ఉన్న ద్వేషముతో కర్ణుడిని అంగరాజ్యానికి రాజుగా దుర్యోధనుడు పట్టాభిషిక్తుడిని చేస్తాడు. అన్ని సందర్భాలలో కర్ణుడు మిత్రధర్మాన్ని పాటించి దుర్యోధనుడికి అండగా ఉండి దుష్ట చతుష్టయములో ఒకడని అపఖ్యాతిని మూట గట్టుకుంటాడు.

కురుక్షేత్ర సంగ్రామము ముందు ఇంద్రుడు మారు వేషములో వచ్చి సహజ కవచకుండలాలను దానముగా తీసుకుంటాడు. సూర్యుడు వద్దని వారించినా దానకర్ణుడిగా పేరుగాంచిన కర్ణుడు కవచ కుండలాలను ఇంద్రునికి దానము ఇస్తాడు.

కురుక్షేత్ర సంగ్రామము ముందు శ్రీ కృష్ణుడు తన జన్మ రహస్యము చెప్పినప్పటికీ స్నేహితుడైన దుర్యోధనుని పక్షము వీడనని చెపుతాడు. అలాగే తల్లి కుంతీ యుద్ధ సమయములో కర్ణుడితో మాట్లాడినప్పుడు కూడా అర్జునుడిని తప్ప మిగిలిన పాండవులను చంపనని మాట ఇస్తాడు. యుద్ధ సమయములో భీష్ముడు అతిరథులు మహారథులుగా పేర్కొంటూ కర్ణుడి ప్రస్తావన తీసుకు రాడు. అస్త్రాలు ఉన్నప్పటికీ ఆ అస్త్రాలు శాపాలవల్ల అక్కరకు రావు కాబట్టి నీకు అతిరథ మహారథ హోదా ఏమి ఇవ్వలేను అని భీష్ముడు అంటే, భీష్ముడి మీద కోపముతో భీష్ముడు నిర్యాణము చెందేవరకు తానూ యుద్దములో పాల్గొనడు.

యుద్దములో ఘటోత్కచుని చంపటానికి అర్జునుడిపై ప్రయోగించటానికి దాచిన అస్త్రాన్ని వాడతాడు. చివరకు రథసారథి శల్యుని సారథ్యము వలన యుద్దములో రథచక్రము భూమిలో కూరుకుపోవటంతో అతనిపై అస్త్రాలను ప్రయోగించటంతో చనిపోతాడు. ఈ విషయాలన్నీ అందరికి తెలిసినవే, కొత్త విషయాలు ఏమి కావు.

ప్రస్తుతము కర్ణుడి కుటుంబము అంటే భార్యలు పిల్లల గురించి తెలుసుకుందాము. ఆ విషయాలు చాలామందికి తెలియవు. వాటికి అంత ప్రాధాన్యత ఇవ్వలేదు. వ్యాస భారతము ప్రకారము కర్ణుడి భార్య పిల్లల గురించి తెలుసుకుందాము.

కర్ణుడికి ఇద్దరు భార్యలు, పదిమంది కొడుకులు ఉన్నారు. వారిలో ఒక్కడు తప్ప మిగిలిన తొమ్మిదిమంది కురుక్షేత్ర సంగ్రామములో చనిపోయినవారే.

కర్ణుడి మొదటి భార్య పేరు వృషాలి. ఈవిడ దుర్యోధనుని రథసారథి అయిన సత్యసేనుడి సోదరి. ఆవిడ మంచి గుణవంతురాలు, సౌశీల్యవతి అవటం వలన కర్ణుడి తండ్రి అధిరథుడు కోరి కర్ణుడికి ఇచ్చి వివాహము చేసాడు. కర్ణుడి మరణము తరువాత ఆవిడ ప్రాణత్యాగము చేసింది. వీరిద్దరికి ఎనిమిది మంది కొడుకులు ఉన్నారు. పెద్ద కొడుకు పేరు వృషసేనుడు.

అర్జునుడు లేనప్పుడు పద్మవ్యూహములో అభిమన్యుడిని చంపిన దానికి ప్రతిగా అర్జునుడు కర్ణుని సమక్షంలో కొడుకైన వృషసేనుడిని వధిస్తానని చెప్పి కర్ణుడి సమక్షంలోనే చంపుతాడు. కర్ణుడు తన కొడుకును కాపాడుకో లేకపోతాడు. రెండవ కొడుకు సుషేనుడు. ఇతనిని యుద్ధములో నకులుడు చంపుతాడు. మూడవ కొడుకైన భానుసేనుడిని నాల్గవ కొడుకైన సత్యసేనుడిని కూడా నకులుడే వదిస్తాడు. ఐదవ కొడుకైన ప్రసేన్ జిత్‌ను సాత్యకి చంపుతాడు. ఆరవ కొడుకైన సత్యసంధుడు అర్జుని చేతిలో మరణిస్తాడు. ఏడవ కొడుకైన శత్రుంజయుడు కూడా అర్జుని చేతిలోనే మరణిస్తాడు.

కురుక్షేత్ర సంగ్రామములో పాల్గొనకుండా తరువాత బ్రతికి ఉన్న కర్ణుడి ఎనిమిదవ కొడుకు వృషకేతు. ఇతను యవనాథ్ రాజు కుమార్తెను వివాహము చేసుకుంటాడు.

యుద్ధము తరువాత ఇతనిని అర్జునుడు దత్తత తీసుకొని విలువిద్యలో తర్ఫీదు ఇస్తాడు. అంతేకాకుండా ఇతను గదాయుద్ధములో కూడా ప్రావీణ్యుడు. దీనికి కారణము భీముని తర్ఫీదు. కానీ ఇతను కూడా అర్జునుడు, చిత్రాగందల కుమారుడైన బభ్రువాహనుడి చేతిలో చనిపోతాడు. కానీ అతనిని అర్జునుడి మరో భార్య అయిన ఉలూపి (నాగకన్య) నాగమణితో తిరిగి బ్రతికిస్తుంది.

కర్ణుడి రెండవ భార్య సుప్రియ, ఈవిడ దుర్యోధనుని భార్య భానుమతికి మంచి స్నేహితురాలు. అందుచేత దుర్యోధనుడు భానుమతిని స్వయంవరంలో వివాహమాడి నప్పుడు భానుమతి కోరిక మీద దుర్యోధనుడు కర్ణుని సుప్రియను వివాహము చేసుకోవలసిందిగా మిత్రుడిని కోరుతాడు. అప్పుడు మొదటి భార్య వృషాలి అంగీకారంతో కర్ణుడు సుప్రియను వివాహమాడుతాడు. కానీ ఈవిడ ప్రస్తావన భారతములో అంతగా లేదు. ఈవిడకు ఇద్దరు కుమారులు. పెద్దవాడు బన సేనుడు. ఇతను భీముని చేతిలో 16 వ రోజు యుద్దములో చనిపోతాడు. రెండవ వాడు ద్విపత. ఇతను కూడా అర్జుని చేతిలో ప్రాణాలను కోల్పోతాడు. వ్యాసుని భారతములో లేకపోయినప్పటికీ ప్రాంతీయ కథనాలలో పద్మావతి, ఉరువి, రీతువతి అనే భార్యల ప్రస్తావన కూడా ఉన్నది. వీరి గురించి వ్యాసుడు ప్రస్తావించలేదు కాబట్టి అంతగా పరిగణలోకి తీసుకోరు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here