కర్ర పుల్లల కళకళలు

0
11

[డా. కందేపి రాణీప్రసాద్ గారి ‘కర్ర పుల్లల కళకళలు’ అనే రచనని అందిస్తున్నాము.]

[dropcap]చె[/dropcap]ట్ల యొక్క భాగాలతో నేను బొమ్మలు చేస్తున్నానని తెలుసుకదా! ఈ రోజు కొమ్మలతో బొమ్మలు చేద్దాం. చెట్టులో ప్రధాన భాగం కాండం. కాండానికి కొమ్మలు, కొమ్మలకు పిల్ల కొమ్మలు పుట్టుకొస్తాయి. కొమ్మలంటే పెద్ద పెద్ద కొమ్మలు కాకుండా నేను చిన్న చిన్న కొమ్మలతో బొమ్మలు, అలంకారాలు చేశాను. చిన్న కొమ్మలంటే నేను కుండీలలో పెంచే చిన్న చిన్న మొక్కల భాగాలన్నమాట. బంతి, చామంతి, మల్లె, మందారం, కనకాంబరం వంటి పూల చెట్లను, దోసకాయ, సొరకాయ, వంకాయ, బెండకాయ వంటి కూరగాయల చెట్లను బొమ్మల్లో ఉపయోగించాను. తులసి కొమ్మలు, గొంగూర కొమ్మలు, రెమ్మలు అందుబాటులో ఉన్నవన్నీ వాడాను. ఇంకా పెద్ద పెద్ద వృక్షాల యొక్క రాలి పోయిన పుల్లల్ని కూడా వాడుకున్నాను. పెద్ద చెట్లలో ఎండిపోయి రాలిపోయిన కొమ్మలు అకులు, కాయలు ఏరుకుని తెచ్చుకుంటాను. తను గూడు కట్టుకోవడానికి పక్షులు పుల్లా పుడకా ఏరుకొచ్చుకున్నట్లుగా నేను బొమ్మల కోసం ఎండు పుల్లలు ఏరుకొచ్చాను. ఎండు పుల్లలు అనాలా? కొమ్మలనాలా? రెమ్ములనాలా? ఏది ఏమైనా గానీ ఈ పుల్లలతో పుడకలతో బొమ్మలు చేశాను చూడండి.

హైదరాబాద్‌లో మా ఇంటి వెనక పార్కు ఉంటుంది. పార్కుకు చుట్టూతా కాగితం పూల చెట్లు పెట్టారు. అది విపరీతంగా పెరిగి పార్కునూ, రోడ్డునూ మూసేశాయి. దాంతో మునిసిపాలిటీ వాళ్ళు కొట్టేయటంతో చెట్లన్నీ ఎండిపోయి నేలకూలాయి. ఎండు కొమ్మల్ని నేను విరుచుకుని వచ్చాను. కాగితం పూలకు చిన్న చిన్న ముళ్ళు కూడా ఉంటాయి. పూర్వపు రోజుల్లో వ్యవసాయదారులు ఎండిన చెట్లును కొట్టి ఇంటికి ప్రహరీ గోడగా నాటుకునేవారు. ఇంకా ఎండు చెట్లు మిగిలితే పొయ్యిలోకి వoట చెరుకుగా వాడేవారు. ఇప్పుడు అందరి ఇళ్ళలో గ్యాస్ స్టవ్ కాబట్టి అలాంటి చెట్ల వ్యర్థాలన్నీ వృథాగా పోతున్నాయి. నేను కొమ్మల్ని విరుచుకొచ్చినపుడు సగం పచ్చిగా ఉన్నాయి. ఈ పుల్లల్ని ఇంకొన్ని రోజూలు ఎండబెట్టాను. పూర్తిగా ఎండిపోయాక రంగులు వేయడం మొదలు పెట్టాను. ఒక్కోక్క పుల్లకు ఒక్కొక్క రంగును వేశాను రంగురంగుల పుల్లలు తయారయాయి. ఈ పుల్లలన్నీ కట్టగా కట్టి ఒక ప్లవర్ వేజ్ లో పెట్టాను. చాలా అందంగా కనిపించాయి. ఈ పుల్లలకు సీరియల్ బల్బులను చుట్టాను. రంగు రంగుల లైట్లుతో అందంగా ప్లవర్ వేజ్ లో ఎండు పుల్లలు మెరిసి పోతున్నాయి. వాటిని చూసి నేను మురిసి పోతున్నాను.

ఇంట్లోకి తెచ్చుకున్న ఆవాలను గాలించేటప్పుడు అడుగున కొన్ని మిగిలిపోతే వాటిని కుండీలో పారబోస్తాను. కొన్ని రోజులకు ఆవాల చెట్లు మొలుస్తాయి. కళ్ళకు మిరుమిట్లు గొలిపే పసుపురంగు పూలతో అందరినీ అలరిస్తాయి నేను అరకులోయ వెళ్ళినపుడు కొండల్లో సూర్యోదయం చూడటానికి వెళ్ళాము. ఆ కొండవాలులో కను చూపుమేర పసుపు రంగు పుప్పొడి రాలినట్లుగా ప్రకృతి చిత్రం ఎంతందంగా ఉన్నదో అక్కడ పొటోలు తీసి టెచ్చుకుని పసుపు రంగుకు ఆనవాలుగా రంగుల చార్టులను తయారుచేశాను. మేము కూడా ఆ చెట్లలో దూరి చాలా ఫొటోలు తీసుకున్నాము. సరే ఇంతకీ మా ఇంటి కుండీల్లో ఆవాల చెట్లు మొలిచాయి కదా! పూలను కళ్ళతో బోలెడు ఫోటోలు తీసేశాక చెట్టు నిండా కాయలయిపోయాయి. చెట్టు కొమ్మలు తెల్లగా ఉంటాయి. కాయల్లో నుంచి ఆవాలు తీసేశాక చెట్టును నలక్కుండా దాచాను. ఇది చూడటానికి ఎంతో అందంగా కనిపించాయి. వీటి. మధ్యలో గులాబీ పూలను అతికించాను. నిజాం గులాబీలు కాదులే, పింక్ పేపర్ గులాబీబు చేసి ఈ చెట్లకు అతికితే సర్వి చెట్లలా కనిపించాయి. చెట్ల రొమ్మలన్నింటినీ కట్టగా కట్టాను. పంచ లోహాలతో చేసిన మెటల్ ప్లవర్ వేజ్‌లో పెట్టాను. ఇది తయారుచేసి పదేళ్ళయినా పాడైపోలేదు. మా కంప్యూటర్ టేబుల్ పై అందంగా కనిపిస్తోంది.

కానుగ, మర్రి, రావి వంటి పెద్ద చెట్లు రోడ్డు పక్కన బాటసారులకు నీడనిస్తుంటాయి. ఆయా చెట్ల కింద ఆకులు, పుల్లలు పుడకలు ఎండిపోయి పడిపోతుంటాయి. నేను సిరిసిల్ల, కరీంనగర్ వెళ్ళే దారిలో చాలా పుల్లలు ఏరుకొచ్చాను. నేను బెంగూళూరు వెళ్ళాక క్రాఫ్ట్స్ షాపులో పుల్లలు కట్టగట్టి అమ్ముతున్నారు. హోమంలోకి కట్టె పుల్లలు అమ్మినట్లు కొయ్యపుల్లలు అమ్ముతున్నారు. బహుశా వాటికి వార్నిష్ వేసి ఉండవచ్చు. నేను మాత్రం మరీ సన్నపుల్లలే కాకుండా కొంచెం లావుపాటి పుల్లల్ని కూడా తెచ్చుకున్నాను. ఈ పుల్లలన్నిటినీ సీతాకోకచిలుక ఆకారంలోకి తీసుకు వచ్చాను. మొదట రంగులు వేయాలనుకున్నాను కానీ అలా సహజంగా ఉంటేనే బాగుంటుందనిపించింది! కర్ర పుల్లల సీతాకోక చిలక అందంగా ఉంది.

ఒకసారి ఘుట్‌కేసర్ వైపు మా అబ్బాయి పరిక్ష రాయటానికి వెళ్ళాడు. నేను కూడా వాడితో వెళ్ళాను. కొత్త ప్రదేశాలకు వెళ్ళాలని నాకిష్టం. చూడటం కన్నా పుల్లలు, కాయలు, పువ్వులు వంటివి తెంపు కొచ్చేటందుకోసం వెళ్తాను. వారిలో ఆముదం చెట్లు కనిపించాయి. గుత్తుల గుత్తుల కాయలున్నాయి. వాటిని కోసుకొని కారులో వేసుకుని తెచ్చాను మా చిన్నపుడు ఆముదం విత్తనాలు దాచుకునే వాళ్ళం. ఆ విత్తనాలకు చుక్కల చుక్కల డిజైను ఉటుందని అది దాచేదాన్ని. అది గుర్తొచ్చి బొమ్మలు చేద్దామని తెచ్చాను. కానీ ఇంకా బొమ్మగా మారలేదు.

ఏ చెట్టు కొమ్మలో గుర్తులేదు గానీ నాలుగు కొమ్మలు తెచ్చి నలుపు రంగును వేశాను. ఈ కొమ్మలకు పూలు అతికించుకోవాలి. టిష్యూ పేపర్‌ను తీసుకొని గుండ్రంగా నలిపేసి అక్కడక్కడా కొమ్మలకు అతికేయవచ్చు. ఇంకా మంచి ఐడియా చెప్పనా! మూతికి వేసుకున్న లిప్ స్టిక్‌ను టిష్యూతో తుడిచేసి కొమ్మలకు అతికితే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు తెలుపు రంగు క్రష్ పేపర్‌తో పూలు చేశాను. ఆ పూలను కొమ్మ నిండా అతికించాను. ఇలా ఎండిన కొమ్మలు కూడా పూలతో కళకళలాడతాయి.

మా ఇంట్లో టేకు, గన్నేరు వంటి చెట్లతో పాటుగా హరిత హరంలో వచ్చిన చెట్లూ బాగా పెరిగాయి. నేను ప్రేమగా పెంచుకున్న వేపచెట్టూ ఉన్నది. వేపచెట్టును ఎప్పుడూ కరెంటు తీగలకు అడ్డు వస్తుందని కొట్టేస్తూ ఉంటారు. ఈ వేపచెట్టు గురించి ఒక వ్యాసమే రాశాను. అందులోని కొమ్మలు రెండు తీసుకొని లైటింగ్ ల్యాంప్స్ తగిలిద్దామని ప్రయత్నం చేశాను. రెండు కొమ్మల్ని తిరగేసిన ‘వి’ ఆకారంలో మేకు కొట్టించి పెట్టాను. మధ్యలో ఒక కొక్కెం పెట్టి చైను వేయించాను. ఈ కొమ్మల కింది భాగంలో కూడా కొక్కెలు పెట్టించాను. ఇంట్లో ఉన్న హంగింగ్ పూల కుండీలను వాటికి వేలాడేశాను. అలాగే దీపావళికి తగిలించే ల్యాంపుల్ని సైతం వీటికి తగిలిస్తే చాలా అందంగా ఉన్నది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here