రంగుల హేల 26: కరుణించి మమ్మొదిలిపో.. కరోనా!

4
6

[box type=’note’ fontsize=’16’] “ప్రపంచ మానవాళి మొత్తం ఇళ్లలోనే దాక్కుని కంటికి కనిపించని శత్రువుతో యుద్ధం చేస్తోంది” అంటున్నారు అల్లూరి గౌరీ లక్ష్మిరంగుల హేల” కాలమ్‌లో. [/box]

[dropcap]మొ[/dropcap]దట్లో మనమంతా కరోనా వైరస్ గురించి విని “ఏమిటో ఈ జబ్బు పేరు స్టైల్ గా ఉంది. పక్కవాడికి మీటర్ దూరంలో ఉండాలట. షేక్ హాండ్స్ ఇవ్వకూడదట. నమస్కార్ కరోనా అంటున్నారు” అని చెప్పుకుంటూ నవ్వుకున్నాం. ఇంత ప్రమాదం పొంచి ఉందనుకోలేదు. పదేళ్ల కిందట స్వైన్ ఫ్లూ పుణేలో వచ్చిందని కొంతమంది ప్రాణాలు పోయాయని విని భయపడిపోయాం. ఇంకోసారి ఆంథ్రాక్స్ అనీ, ఎబోలా అనీ, సార్స్ అనీ, విన్నాం కానీ ఇలా మన ఇండియాలో మన నట్టింట్లోకి వైరస్ నేరుగా రావడం ఇదే మొదటిసారి. ఏదో ఇంగ్లీష్ సినిమా చూస్తూ, చూస్తూ అందులో పాత్రధారులమైనట్టుంది మన పని.

కరోనా తీవ్రత తెలీకముందు దాన్ని గురించి చూచాయగా విన్న మా పిన్ని కూతురు గొల్లుమంది. “ఏమిటీ! ఎవరూ ఇంట్లోంచి బైటికి వెళ్లకూడదా! నేను ఈసారి పట్టు బట్టి నా అమెరికా కొడుకిచ్చిన లక్ష పెట్టి మంచి మంచి చీరలు కొనుక్కున్నాను. ఇప్పుడు టైలర్ కివ్వకుండా అవన్నీ బీరువాలో పెట్టుకోవాలా? నేను ఏనాడూ కొత్త చీర వారం రోజులు మించి దాచే దాన్ని కాదు” అంటూ. ఇప్పుడు వైరాగ్యం వంటబట్టి “పోన్లే! బతికి బావుంటే కట్టుకుంటాం. లేకపోతే లేదు. ఇప్పుడు వాటిగోడవెందుకులే!” అంటోంది.

వందేళ్ల క్రితం ఇంఫ్లూయెంజా వచ్చి అత్యధిక సంఖ్యలో జనం చనిపోయిన సంగతి చెబుతూ మా సైన్స్ మాస్టారు “అప్పట్లో సైన్స్ అభివృద్ధి చెందలేదు కాబట్టి అలా జరిగింది. అది పురాతన కాలం. ఇది సైన్స్ సంపూర్ణంగా అభివృద్ధి చెందిన కాలం. మన దగ్గరిప్పుడు ప్రతి దానికీ మందుంది. మనం ఎన్నో ప్రాణాంతకమైన జబ్బులకి మందు కనిపెట్టాం. కలరా, మశూచి లాంటి వ్యాధులిప్పుడు లేనే లేవు” అని బల్ల గుద్ది మరీ చెప్పేవారు.

మరి ఇప్పుడేమో హేమాహేమీలైన ప్రపంచ సైంటిస్ట్ మహాశయులు ల్యాబ్‌ల్లో తపస్సుకు కూర్చున్నారట. ఈ సంవత్సరాంతానికల్లా మందు మరియు టీకా వచ్చే సూచనలున్నాయట. “అయ్యా! వరల్డ్ వైడ్‌గా కోట్లకి కోట్లు ఖర్చు చేస్తూ లక్షలకొద్దీ జీతాలు తీసుకుంటూ డాక్టరేట్లు నిత్యం రీసెర్చ్ సెంటర్‌లలో ఏం చేస్తున్నట్టూ?” అని నేను బుగ్గలు నొక్కుకుంటూ అడిగినప్పుడు మా గౌరవ ఫామిలీ డాక్టర్ గారు “అమ్మా! ఒక చెట్టు వేసాక మర్నాడే కాసేస్తుందా చెప్పండి?” అని వాక్రుచ్చారు. మరంచేత కరోనా మందు చెట్టు నాటారన్న శుభవార్త విని నేను పాయసం చేసేసాను, ఏ నాటికైనా ఆ చెట్టుకు కరోనా మందుకాయ కాయక పోతుందా అన్న ఆశతో.

కరోనా మేడం గారి దయ వల్ల అందరికీ ఇప్పుడు జీవితం విలువ తెలిసింది. ఉద్యోగాలు చేసుకుంటూ సంపాదించుకుంటూ అన్ని విధాలుగా సౌఖ్యంగా ఉన్నప్పటికీ, మనకి ఏదో బాధగా ఉండేది ఇంకా ఏదో తక్కువయిందని. ‘ప్రపంచ మానవులారా! ఏకం కండి’ అని కామ్రేడ్లు చెప్పినా మనం వినిపించుకోలేదు. ‘మానవులంతా ఒక్కటే’ అని వేదాంతులు బోధించినా మనకి ఎక్కలేదు. ఇప్పుడు నెత్తి మీద సుత్తితో కొట్టి కరోనా చెప్పింది.

కరోనాకి దేవుడిలాగా రూపమే లేదట. కణమే కాదట. అంచేత దానికి న్యూక్లియస్ కూడా లేదట. అది సొంతంగా ఏమీ హాని చెయ్యదట. మరొక జీవిలో చేరిమాత్రమే చేయగలదట. మాయగా లేదూ! అంతకన్నా గొప్ప సత్యం పంచ భూతాలు,ఇతర ప్రాణికోటి ప్రశాంతంగా ఎప్పట్లాగా ఉంది. కేవలం మానవ కోటి మాత్రమే గజ గజ వణికి ఇంట్లో దూరి తలుపు వేసుకుని ఉంది. ఇది కదా ఐరనీ అంటే.

మొన్నటి వరకూ జనం ఉద్యోగస్తుల్ని వదిలేస్తే ఇళ్లలో ఉండే వారు బహు తక్కువ. కొందరు విమానం, రైల్, బస్సు ప్రయాణాల్లోనూ, ఇంకొంతమంది సినిమా హాల్స్ లోనూ, రెస్టారెంట్లలోనూ, షాపింగ్ మాల్స్ లోనూ , చీరల షాపుల్లోనూ బిజీగా ఉండేవారు. ఇప్పుడంతా ఇళ్లలోనే కుదురుగా కూర్చుని కరోనా రియాలిటీ షోలో పాత్రధారులైపోయారు. అందమైన శార్వరి నామ సంవత్సరం పేరు కాస్తా మరుగునపడి కరోనా నామ స్మరణతో ప్రపంచమే మార్మోగుతోంది

బంధువులొచ్చినప్పుడు వాళ్లతో కలిసి హాయిగా కబుర్లు చెప్పుకుంటూ ఆన్‌లైన్ పార్సిల్స్ అందుకుంటూ సుఖపడ్డ మనం ఖంగు తిన్నాం. యూత్‌కి హోటల్స్, పబ్స్ లేవు. లేట్ నైట్ పార్టీలు లేవు. వాళ్లంతా గెడ్డాలు పెంచి బైటికి పోయి పొల్యూషన్ చేసే వీలు లేక ఇంట్లోనే ఖైదీల్లా మగ్గుతున్నారు. క్రియేటివిటీని చంపుకోలేని వాళ్ళు టిక్ టాక్‌లు చేసి జనాన్ని నవ్విస్తున్నారు.

ఎప్పుడూ చెయ్యని కొత్త కొత్త ప్రయోగాలు వంటింట్లో గ్యాస్ స్టవ్వుల మీద మగాళ్ల చేతుల మీదుగా జరుగుతున్నాయి అదీ విచిత్రం. రోజంతా ఇంట్లో ఉండడం ఎంత ఘోరంగా ఉంటుందో మగాళ్ళకి తెలిసింది. అలాగే మగాళ్లు బైటికి పోకుండా నిత్యం ఇంట్లో తమ వెనకే ఉంటే ఎంత నరకంగా ఉంటుందో ఆడాళ్ళకీ తెలిసింది.

మా మేనత్త కూతుర్ని, ఈ కష్ట కాలంలో ఎలా ఉన్నావని ఫోన్ చేసి పలకరించగానే భోరుమని ఏడ్చింది, “నేను ఓ ఇరవై సీరియళ్లు చూసేదాన్ని రోజూ. ఆ సీరియల్స్ లోని పాత్రలన్నీ నా ప్రపంచంలో నాతో ఉండేవాళ్ళు. నిత్యం వాళ్ళను చూస్తూ ఉండేదాన్ని. ఇప్పుడు వాళ్లంతా ఏమైపోయారో? ఎన్నాళ్లకి కనబడతారో? వాళ్ళ బతుకులేమయ్యాయో! అని నా గుండె తరుక్కుపోతోందే” అంటూ. ఆమె దుఃఖపు వరదకి ఫోన్ కట్ అయ్యింది.

మనమంతా ఇంట్లో కూర్చుని బైటికి పోలేకపోతున్నామని సెల్ఫ్ పీటీలో మగ్గిపోతుండగా ప్రభుత్వాధికారులూ, డాక్టర్లు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, పారిశుధ్య పనివాళ్ళు, మీడియా.. ప్రాణానికి రిస్క్ పెట్టుకుని చేస్తున్న ప్రజా సేవ చూస్తుంటే సిగ్గేస్తోంది. మన జీవిత కాలంలో కరువును వినడమే కానీ స్వయంగా చూడలేదు. ఇదొక మోడరన్ కరువన్న మాట. ఇందులో అందరూ బాధితులే. ఎవరూ సుఖంగా లేరు. మానవజాతి మొత్తం ఖంగు తిని పోయి దిక్కుతోచకుండా చూస్తోంది. నిరంతరం, పిలిస్తే పలకడానికి తీరిక లేకుండా సంపాదన పేరుతో తిరిగే మగవాళ్ళకి పనీ పాటూ లేకుండా పోయింది. ప్రపంచ మానవాళి మొత్తం ఇళ్లలోనే దాక్కుని కంటికి కనిపించని శత్రువుతో యుద్ధం చేస్తోంది.

ఈ కరోనా దేవత తన విశ్వరూపం చూపించి అందరికీ ఒక్కొక్కరికి ఒక్కో రకంగా భగవద్గీత బోధించింది.. మా అత్తయ్య “విశ్వ జనులు అంతా ఒక్కటై ఒకే కారణంపై దుఃఖించడం మానవకోటి ఐకమత్యానికి తార్కాణం. మనిషిని చావుకి భయపెట్టి నేలకి దించింది కరోనా దేవత. ఇక నుంచి మానవులంతా కలిసి మెలిసి బతుకుని ప్లాన్ చేసుకుంటారేమో లే” అని ఆవిడని పొగుడుతోంది.

“నింగి కెగిరిపోదాం. ఆకాశమే మాన హద్దు అంటూ భూమ్మీద దాష్టీకం చేసూ విర్రవీగుతున్న దుష్టమాన కోటికి ఈ కరోనా గుణపాఠములు నేర్పడానికి వచ్చింద”ని అంటున్నాడు మా మావయ్య.

ప్రజలంతా బుద్దిగా జీవిస్తున్నారనీ సత్యయుగం వచ్చేసిందని మా బాబాయ్ ఆనంద పడుతున్నాడు. “మీరంతా కూడా ధ్యానం నేర్చుకుని మీలోకి మీరు ప్రయాణించండి” అనడంతో భయపడి ఆయనకీ మళ్ళీ ఫోన్ చెయ్యడం మానేసాం.

పర్యావరణ సమతుల్యత లోపించడం వల్ల ఇలా జరుగుతోందని మా పిన్ని నమ్మకం. ఇకనైనా జనం ప్రకృతిని ధ్వంసం చేస్తూ స్వార్ధంతో చెలరేగిపోతున్న తమ జీవన విధానాన్ని గురించి పునరాలోచించుకోవాలని మా పిన్ని ఒక సందేశం వాట్సాప్‌లో అందరికీ పంపి కూర్చుంది.

నెలకి రెండు రోజులు సహాయకురాలు రాకపోతే సణుక్కునే మనం ఇప్పుడు “వద్దమ్మా, నువ్వు రావొద్దు. నీ జీతం బ్యాంక్లో వేస్తున్నాం తీసుకో. నువ్వు రెస్ట్ తీసుకో” అంటున్నాం. పనివాళ్ళు చేసే అన్నిపనులూ మనమే చేసుకుంటున్నాం. బీరువాలు తీసే పని లేదు. చీరల్లేవు. నగల్లేవు. అసలు బైటికి పోయే పనే లేదు. ఇల్లు శుభ్రం చేసుకోవడం,వంట చేసుకోవడం, తిని, గిన్నెలు కడుక్కుని బోర్లించుకోవడం ఆనక బంధుమిత్రులకు ఫోన్లు చేసి సామూహికంగా దుఃఖించడం ఇవే పనులు.

మా తెలుగు మాస్టారు ప్రళయం వచ్చినప్పుడు పన్నెండు మంది సూర్యులు వస్తారనీ, భూమి అంతా జలమయమవుతుందనీ ఆ వేడికి, నీటికి ప్రాణి కోటి సమస్తం క్లియర్ అవుతుందనీ అప్పుడు దేవుడు గారు కొత్త కాన్వాస్ మీద బొమ్మలు వేసే చందంగా నూతన సృష్టి జరుపుతాడనీ చెప్పేవారు.

ఇప్పుడీ కరోనా అలా చేస్తుందా అంటే కేవలం మనుషులనే భయపెడుతోంది. మిగిలిన చెట్టూ,చేమా, జంతుజాలం మామూలుగానే ఉన్నాయి. కేవలం మనుషులు మాత్రమే భయపడి ఇంట్లో దాక్కుంటున్నారు. కాబట్టి దేవుడీసారి మనమీదే పగతో ఉన్నట్టున్నాడు. వెరైటీ కోసం కొత్తరకంగా విలయతాండవం చెయ్యమని కరోనా మాడంని పంపి కొంచెం దయతో పూర్తిగా అందరినీ మటాష్ చెయ్యకుండా కొంచెం బాగా భయపెడదాం అనుకుంటున్నాడని నా అనుమానం.

ఇంట్లో సౌఖ్యంగా అన్ని సద్దుకున్న ఆశావాదులు పొల్యూషన్ తగ్గి నక్షత్రాలు బాగా కనబడుతున్నాయనీ, వేడి తగ్గిందనీ మెసేజిలు పెడుతున్నారు. “అంతా మన మంచికే! యువత రాసుకుని, పూసుకుని తిరగడం మానేశారు. చేతులు, కాళ్ళు శుభ్రంగా కడుక్కుంటున్నారు. గొప్ప క్రమశిక్షణ పాటిస్తున్నారు. ఇంట్లో వాళ్లంతా కలిసి మెలిసి గడుపుతున్నారు” అంటూ అవధానులు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. హఠాత్తుగా లాక్‌డౌన్ పెట్టడంతో ఇల్లు వదిలి ఇతర ప్రదేశాల్లో చిక్కుకుని దిక్కుతోచక ఉన్నవాళ్లు దుఃఖంతో, ‘కరోనా రాకుండానే మమ్మల్ని స్వస్థలాలకు పోకుండా చంపుతున్నారే!’ అని వాపోతున్నారు.

ఈ సంవత్సరం అమర్‌నాథ్ యాత్ర ఉండక పోవచ్చని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇంటిని చుట్టుముట్టి నిలబడి తలుపు తీస్తే లోపలికొచ్చేసి మనకి ముక్తి కలిగించడానికి కోవిడ్ -19 అలియాస్ కరోనా వైరస్ సిద్ధంగా ఉండగా, మోక్షం కోసం శ్రమపడి అమర్‌నాథ్ వెళ్ళవలసిన అవసరం ఉందా అని కాబోలు.

వీలయినంత త్వరలో కరోనా విలయదేవత గారు తమ ఆగ్రహాన్ని తగ్గించుకుని ప్రస్తుత దండనకు స్వస్తి చెప్పి మానవ జాతిని కరుణించి ఉగ్రావతారం చాలించి శివైక్యం చెందాలని కోరుకుందాం. స్వస్తి. నేను చేతులు కడుక్కోవడానికి వెళుతున్నా. చదివాకా మీరూ అదే పని చెయ్యండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here