కశ్మీర రాజతరంగిణి-1

12
10

[box type=’note’ fontsize=’16’] కశ్మీర్ ప్రాచీన చరిత్ర గురించి అవగాహన కలిగించి, భవిష్యత్తు గురించి ఆలోచనలు కలిగించాలన్న ప్రయత్నంలో భాగంగా నీలమతపురాణం తరువాత అందిస్తున్న జోనరాజు, శ్రీవరుడు, ప్రజ్ఞాభట్టులు కల్హణుడి   అడుగుజాడల్లో నడుస్తూ సంస్కృతంలో రచించిన ‘కశ్మీర రాజతరంగిణి‘ అనువాదాన్ని తెలుగు పాఠకులకు అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ. [/box]

ఓం స్వస్తి శ్రీ గణేశాయ నమః

భూషా భోగి ప్రణారత్నరోచిః సిచయ చారవే।
నమః ప్రలీన ముక్తాయ హర కల్పమహీరుహే॥
(కల్హణ రాజతరంగిణి)

సిద్ధేయత్ర సతి త్రపాకులమివ స్పర్థాభిలాషాహతే –
రంతార్ధిమే  వహతి త్రిలోకమహితం శేషం నిజార్ధద్వయమ్।
స్నేహైకి భవదాశయభవ యద్యజాయావాం జ్జీవ గాఢమ్ మిల –
హ్దేహార్ధర్మ ద్వయమస్తు తద్భగవతోః సద్భావసకర్మమ్ పత్తయో॥
(జోనరాజు రాజతరంగిణి)

[dropcap]స[/dropcap]ముద్రంలో అలలు నిరంతరం వస్తుంటాయి. అలలకు అలుపు లేదు. అలలు నిరంతరం వస్తున్నా, తీరాన్ని తాకుతున్నా ప్రతి అల మరో అలకు భిన్నం. ఏ ఒక్క అల మరో అలలా ఉండదు. జాగ్రత్తగా పరిశీలిస్తే ఏ అలకు ఆ అల ప్రత్యేకం. మానవ జీవితం మానవ సమాజం కూడా అంతే. ఒక అల అనేక నీటి అణువుల సమూహం. ఒక సమాజం అనేక మానవుల సమూహం. ఎలాగయితే అలలు నిరంతరం ఎగసెగసి పడుతుంటాయో, మానవ సమాజం కూడా అలల్లాగా ఎగసి పడుతూనే ఉంటుంది. పైకి ఒకే రకంగా కనిపిస్తూన్నా ఏ అలకు ఆ అల ప్రత్యేకం అయినట్టు, మానవ సమాజాలు కూడా అంతే. ఏ సమాజానికి ఆ సమాజం ప్రత్యేకం. ఏ కాలానికి ఆ సమాజం ప్రత్యేకం. అంతే కాదు, ఎగసి పడి ఒక అల తీరాన్ని తాకే సమయంలోనే వెనుక నుంచి మరో అల నీటిని పోగేసుకుని పరుగులిడుతూ వస్తుంది. తీరాన్ని తాకి వెనక్కు మళ్లుతున్న అల, ఎగసి పడుతూ ముందుకు దూసుకువస్తున్న అలతో కలుస్తుంది. రెంటి కలయిక నిర్మాణాత్మకం అయితే ఏర్పడే అల రెట్టించిన శక్తితో తీరాన్ని తాకుతుంది. రెంటి కలయిక నిర్మాణాత్మకం కాకపోతే రెట్టించిన ఉత్సాహంతో దూసుకువస్తున్న అల నీరసించిపోతుంది. శక్తిని కోల్పోతుంది. తీరం చేరటమే గగనమైపోతుంది. ఇది జగతి రీతి. తీరాన్ని తాకి వెనక్కు తిరిగే అల గతం. పూర్వీకులు. దూసుకు వచ్చే అల కొత్త తరం. ఈ కొత్త తరం తన గతంతో, పూర్వీకులతో నిర్మాణాత్మకంగా కలిస్తే, నవతరం శక్తి పుంజుకుని ముందుకు ఎగసి పడుతుంది. అనూహ్యమైన ఎత్తుకు ఎగస్తుంది. అలాకాక, పాత తరాన్ని కాదని, పూర్వీకులను లెక్కచేయకపోతే అనుకున్నంత ఎత్తు ఎదగదు. శక్తి పుంజుకోదు. ఎంతో ఎత్తు ఎగస్తుందనుకున్న తరం ఆశలను నిరాశగా మారుస్తుంది. ఇది జగతి రీతి.

భారతీయ ధర్మం ఈ జగతి రీతిని గ్రహించింది. అందుకే తరాల నుడుమ అంతరాలను పూడుస్తూ ఒక తరానికి మరొక తరాన్ని చేరువ చేస్తూ మానవ జాతి ఒక అవిచ్ఛిన్న ధార, నిరంతరం ప్రవాహం అన్న ఆలోచనను కలిగించే రీతిలో రూపొందింది. దాంతో ఒక తరం తమ విజ్ఞానాన్ని, జీవన విధానాన్ని, తాము సాధించిన విజయాలను మరొక తరానికి అందిస్తుంది. మానవ తరం తమ ముందు తరం అందించిన దాన్ని స్వీకరిస్తూ, దాన్లోని మంచిని గ్రహించి, సరిపోనిదాన్ని విస్మరించి, తన ప్రత్యేక పద్ధతిని రూపొందించుకుని ముందుకు సాగుతుంది. అందుకే ఒక తరం సాధించిన విజ్ఞానం, ప్రగతి వంటివి తరువాత తరానికి మౌఖికంగా అందించే అత్యద్భుతమైన వ్యవస్థ రూపొందింది. ఈ వ్యవస్థ ఫలితమే ప్రపంచంలో ఏ నాగరికతలో లేని విధంగా అద్యంతాలు లేని రీతిలో వేదాలు ఈనాటికీ సజీవంగా అందుతున్నాయి. కొన్ని వేల ఏళ్ళ క్రితం వేదాలను  ఏ రీతిలో, ఎలా పలికారో, ఈ నాటికీ అదే రీతిలో అలాగే పలుకుతున్నది  ప్రతి తరం. భవిష్యత్తులోనూ అలాగే పలుకుతాయి తరాలు.

అయితే, సజీవ నది ఎల్లప్పూడూ ఒంటరిది కాదు. ఒకే రీతి ప్రవహించదు. అనేక ఉపనదులు కలుస్తుంటాయి. ప్రవహించే ప్రాంతపు భౌగోళిక స్వరూపాన్ని బట్టి ప్రవాహ స్వరూపం, గతి మారుతుంటాయి. అలా మార్చుకు ప్రయాణించినది సజీవనదిలా నిలుస్తుంది. భారతీయ ధర్మం అదే రీతిలో అనేక ఉపనదులను కలుపుకుంటూ, రూపం మార్చుకుంటూ, తనని తాను పునర్నిర్వచించుకుంటూ ముందుకు సాగుతోంది. అయితే ఏయే దారుల్లో ప్రయాణించినా, ఎన్నెన్ని ఉపనదులను తనలో కలుపుకున్నా, ఎన్నెన్ని కొత్త రూపాలు ధరిస్తూ, ఎన్నెన్ని మార్లు పునర్నిర్వచించుకుంటూ నిత్యనూతనంగా ప్రవహిస్తూన్నా తన మౌలిక లక్షణాన్ని కోల్పోలేదు భారతీయ ధర్మం. ఇందుకు ప్రధాన కారణం ఒక తరం నుండి మరో తరానికి విజ్ఞానం అందే లక్షణం. ఒక దీపం మరో దీపాన్ని వెలిగిస్తూ జగతిని వెలుగుమయం చేసినట్టు విజ్ఞాన విషయ పరంపర తరం నుంచి తరానికి అందుతూ వచ్చే వ్యవస్థ భారతీయ ధర్మాన్ని సజీవంగా నిలుపుతోంది. వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు విజ్ఞానాన్ని, ధర్మాన్ని, చరిత్రనూ తరతరాలుగా సజీవంగా అందిస్తున్నాయి. ముఖ్యంగా పురాణాలలో తరతరాల చరిత్రను పొందుపరిచి అందించటం కనిపిస్తుంది. గత సమాజాల జీవన పద్ధతులు, వారు సాధించిన విజయాలు, వారి పొరపాట్లు అత్యంత సృజనాత్మకంగా తరువాత తరాలకు పాఠాలు అందిస్తూనే తమ గత వైభవాన్ని, అవిశ్రాంతంగా తరంగాల రూపంలో సాగుతూ వస్తున్న వంశ పరంపరలను రాజుల చరిత్రను అందిస్తూ వస్తున్నాయి. భావితరాలకు ధర్మం బోధిస్తూ, మంచి చెడ్డల స్వరూపాలను బోధిస్తూ, వారి తరాన్ని తీర్చిదిద్దుకునే గుణపాఠాలు నేర్పిస్తూనే ఉన్నాయి. సాధించిన అత్యద్భుతమైన ఔన్నత్యాన్ని ఆదర్శంగా నిలుపుతూ, ఆ ఆదర్శ సాధనకు మార్గాలను సూచిస్తూ వస్తున్నాయి. ఇలాంటి వ్యవస్థ సజీవంగా నిలుస్తూ, తన బాధ్యతను సక్రమంగా నిర్వహించటంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నది వాక్కు.

‘వాక్కు’ సరస్వతి. వాక్కును సూచించేది అక్షరం. వాక్కును సజీవంగా నిలిపేది అక్షరం. శబ్దం గాలిలో కలిసిపోతుంది. గాలిలో కలిసిపోయే శబ్దానికి అమరత్వాన్ని ఆపాదిస్తుంది అక్షరం. అందుకే అక్షరాల ద్వారా ‘వాక్కు’ను తరతరాలకు సజీవంగా అందించేది  సాహిత్యం అయింది. సరస్వతీ స్వరూపం అయింది. అందుకే భారతీయ వ్యవస్థలో సృజనాత్మక కళాకారులకు అంత ప్రాధాన్యం. తమ బాధ్యతను గుర్తెరిగిన కళాకారులు సృజించిన కళ ఒక తరం నుండి మరో తరానికి అందుతూ సమాజాల అభివృద్ధిలో తోడ్పడుతుంది. పురాణాలయినా, కావ్యాలయినా, ప్రబంధాలయినా ఈనాటి కథలు, నవలలు అయినా ప్రధాన లక్ష్యం ఇదే. ఈ లక్ష్యం గ్రహించిన కళాకారుడి సృజన భావి తరాలను ప్రభావితం చేస్తుంది. సమాజ పురోగతికి తోడ్పడుతుంది. ఇందుకు అత్యద్భుతమైన ఉదాహరణ కశ్మీరుకు చెందిన కవి కల్హణుడు. అతని సృజన రాజతరంగిణి.  తరంగిణి అంటే తరంగాలు ఉన్న నీరు, నది. కళణుడు, కాలగమనంలో వచ్చీపోయే రాజులను, సమాజాలను తరంగాలుగా, కాల ప్రవాహాన్ని తరంగిణిగా చెప్తూ రాజులచరిత్రను ఒక ప్రవాహంతో పోల్చాడు. కాలప్రవాహంలో   ఎగసిపడే అలల్లాంటి కశ్మీర రాజుల ప్రవాహం అన్నమాట రాజతరంగిణి. కల్హణ రాజతరంగిణి ప్రేరణతో కశ్మీర రాజ చరిత్రను అక్షర బద్ధం చేసి కశ్మీరు అవిచ్చిన్న చరిత్రను భావి తరాలకు అందించే కర్తవ్యాన్ని కొనసాగించినవారు జోనరాజు, శ్రీవరుడు, ప్రజ్ఞాభట్టులు.

ఒక దీపం మరో దీపాన్ని వెలిగించటం ద్వారా జగతి వెలుగుమయం అయ్యేందుకు దోహద పడినట్టు కల్హణుడు రచించిన ‘రాజతరంగిణి’ సంస్కృత పండితులకే కాదు, పర్షియన్ కవులకూ ప్రేరణాత్మకంగా నిలచింది. వారు రాజతరంగిణిని పర్షియన్ భాషలోకి అనువదించటమే కాదు, కశ్మీరు పూర్తిగా ఇస్లాం మయం అయి కశ్మీరీ, సంస్కృత భాషల ప్రాధాన్యం తగ్గిన తరువాత కూడా రాజతరంగిణి లాంటి కాశ్మీరీ చరిత్రను రచిస్తూ వచ్చారు.  కల్హణుడు తన రచనను క్రీశ 1148-50 నడుమ రచించాడని చరిత్ర పరిశోధకులు భావిస్తున్నారు. అప్పటి కశ్మీరు పరిస్థితులను గమనిస్తే, రాజతరంగిణి రచనకు కల్హణుడుకి ప్రేరణ భారతీయ సాంప్రదాయిక పురాణాలతోపాటూ. పెర్షియన్ రచన షాహ్ నామా నుంచి కూడా లభించి వుండవచ్చని భావిస్తున్నారు.  షాహ్ నామా క్రీశ 10వ శతాబ్దంలో (977-1010) రచించాడంటారు. కల్హణుడు  రాజతరంగిణి రచించేనాటికి కశ్మీరంలోకి తురుష్కులు ప్రవేశించారు. అంతకుముందుకూడా పెర్షియన్లు గాంధారం గుండా కశ్మీరు చేరారు. దాంతో పెర్షియన్ పండితులనుంచి కల్హణుడు  షాహ్నామా గురించి వినివుండవచ్చనీ , ఆ ప్రేరణకు పౌరాణిక సాంప్రదాయాన్ని, సంస్కృత కావ్య రచనా సాంప్రదాయాన్నీ జోడించి విశిష్టమూ, మార్గదర్శకమూ అయిన రీతిలో రాజతరంగిణి రచించాడన్న అభిప్రాయం వినిపిస్తుంది.  అయితే, కల్హణుడు జీవించినటువంటి అల్లకల్లోల కాలము, అప్పుడప్పుడే రచించిన షాహ్ నామా కశ్మీరును చేరటము, కల్హణుడు  షాహ్ నామా గురించి విని ప్రభావితుడవటం అంత నమ్మశక్యం,  సంభవము కాదని, భారత దేశంలో ఉత్తమమయినవన్నిటికీ ప్రేరణ బయటనుంచే వచ్చిందని నిరూపించాలన్న విదేశీపండితుల తపనను ఇది  నిరూపిస్తుందని ఈ వాదనను కొట్టివేస్తారు. ఈ రకంగా కల్హణుడితో ఆరంభమయిన కశ్మీరు చరిత్ర  రచన నేటి వరకూ అవిచ్ఛిన్నంగా అందుతూ వస్తోంది. కల్హణుడికి రాజతరంగిణి రచనకు ప్రేరణ పురాణాల నుంచి లభించింది. పురాణాల ద్వారా అందుతున్న విజ్ఞానాన్ని, విషయ పరిజ్ఞానాన్ని కశ్మీరుకు అన్వయిస్తూ రాజుల పరంపరను వారి జీవితాలను వివరిస్తూ, భావి తరాలకు గుణపాఠాలు నేర్పేందుకు, వారు ముందు మంచిని ఆదర్శంగా నిలిపి, చెడు వల్ల తరతరాలు అనుభవించే  దుష్పలితాల పాఠాలను నిలపాలన్న ఉద్దేశంతో రాజతరంగిణిని కల్హణుడు రచించాడు.

కల్హణ రాజతరంగణి ద్వారా అమరులయిన రాజులు, వారి చరిత్రలతో పాటు సమకాలీన చరిత్రను సజీవంగా అందించాలన్న ఆలోచన జోనరాజు, శ్రీవరుడు, ప్రజ్ఞాభట్టు వంటి కవులు రాజతరంగిణి కావ్యాన్ని కొనసాగించేందుకు ప్రేరణగా నిలిచింది. ఇక్కడే ఒక సమాజాన్ని భవిష్యత్తు తరాల ముందు సజీవంగా నిలిపి మంచి చెడుల స్వరూపం విప్పి చెప్తూ, విచక్షణను నేర్పాలన్న భారతీయ సాహిత్య సృజన లక్ష్యం స్పష్టమవుతుంది.

పురాణాల నుంచి ప్రేరణ పొంది, కల్హణుడు, తనదైన స్వంత పద్ధతిలో రాజతరంగిణి రచనకు శ్రీకారం చుట్టాడు. ఒక కొత్త పద్ధతికి మార్గం చూపించాడు. నిజానికి కల్హణుడు పురాణాలు చూపిన మార్గాన్ని అనుసరించాడు. పురాణాలు దేవీ దేవతల గాథలను, మానవ రాజ వంశావళుల ఆధారంగా వివరించాయి. కల్హణుడు మానవ రాజ వంశావళుల గాథలను, కశ్మీరు సమాజ కథతో ముడి పెట్టి రచించాడు.

నిజానికి రాజుల ఆస్థానంలో కవులు, రాజవంశ చరిత్రతో పాటు తాము ఏ రాజు ఆస్థానంలో ఉన్నారో ఆ రాజు చరిత్రను రచించటం ఒక సంప్రదాయం. తాము రచించే కావ్యాలలో ఆ రాజు వంశ చరిత్రను, గొప్పతనాన్ని ప్రశంసిస్తూ రాయటం ఒక సంప్రదాయం. ‘జోగేష్ చందర్ దత్’ అనే పండితుడు పురాణాల ఆధారంగా భారతీయ ప్రాచీన చరిత్రను పునర్నిర్మించాడు. తెలుగులో కోట వెంకటాచలంగారు పురాణాలలో పొందుపరిచిన అంశాల ఆధారంగా భారతీయ చరిత్రను, రాజవంశావళిని రచించి పలు అత్యద్భుతమైన పరిశోధనాత్మక పుస్తకాల రూపంలో అందించారు. పాశ్చాత్యులు సైతం పురాణాలలోని పలు విషయాల ద్వారా భారతదేశ చరిత్రను అర్ధం చేసుకునే ప్రయత్నాలు చేశారు. కానీ పలు కారణాల వల్ల పురాణాలలో పొందుపరిచి ఉన్న చారిత్రక అంశాలను వారు సత్యాలుగా గుర్తేంచేందుకు ఇష్టపడలేదు. భారతీయులకు చారిత్రక స్పృహ లేదని, వారు చరిత్రను కావ్యాల్లా, కాల్పనిక రచనలా సృజిస్తారని కొట్టి పారేశారు. అలాంటి వారి గొంతుల్లో పచ్చి వెలక్కాయలా నిలుస్తుంది కల్హణ కశ్మీర రాజతరంగిణి.

కల్హణుడు ఏ రాజాశ్రయం పొందినవాడు కాదు. ఏ రాజు అతనికి మడులు, మాన్యాలు ఇచ్చి తమ వంశాల గొప్పతనం రాయమని అడగలేదు. ఎలాగయితే వాల్మీకి ఎలాంటి ప్రలోభాలు, ఆశలు, ఆశ్రయాలు లేకుండా భావితరాలకు శ్రీరామ చంద్రుడి మహోన్నత వ్యక్తిత్వాన్ని, గాథను అందించాలన్న లక్ష్యంతో రామాయణం రచించాడో, అలాగే అలాంటి లక్ష్యంతో కల్హణుడు రాజతరంగిణిని రచించాడు. నిర్మోహంగా, నిర్మోహమాటంగా, నిజాయితీతో, నిక్కచ్చిగా, నిర్భీతితో, నిబద్ధతతో రాజతరంగిణిని రచించాడు కల్హణుడు. తెలిసింది తెలిసినట్టు రాశాడు. తెలియనిది తెలియనదని చెప్పాడు. సమాచార సేకరణ కోసం కశ్మీరులోనే కాదు, భారత దేశంలో పలు ప్రాంతాలలో విస్తృతంగా పర్యటించాడు. శాసనాలు, పత్రాలు, నాణాలు, శిలా ఫలకాలు పరిశీలించాడు. వాటిలోని అంశాలను సేకరించాడు. అంతకు ముందున్న గ్రంథాలను పరిశీలించాడు. పోల్చి చూశాడు. విచక్షణ నుపయోగించి వాటి మంచి చెడ్డలను విశ్లేషించాడు. క్షీరనీర న్యాయం పాటిస్తూ రాజతరంగిణిని రచించాడు. ఒక వాల్మీకి రామాయణం రచించినట్టు, ఒక పోతన భాగవతం రచించినట్టు,  తులసీదాసు రామయణం రాసినట్టు నిర్మోహంగా, అంకిత భావంతో , ఎలాంటి ప్రతిఫలాపేక్ష లేకుండా , లక్ష్యబధ్దంగా రాజతరంగిణిని సృజించాడు. భావితరాలకు ప్రేరణగా నిలిచాడు. భారతీయ సంప్రదాయ తరంగ శృంగం పై నిలచి భావి తరంగాలకు ఊపు నిచ్చాడు. మార్గదర్శిగా మన్ననలందుకున్నాడు.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here