కశ్మీర రాజతరంగిణి-2

3
8

[box type=’note’ fontsize=’16’] కశ్మీర్ ప్రాచీన చరిత్ర గురించి అవగాహన కలిగించి, భవిష్యత్తు గురించి ఆలోచనలు కలిగించాలన్న ప్రయత్నంలో భాగంగా నీలమతపురాణం తరువాత అందిస్తున్న జోనరాజు, శ్రీవరుడు, ప్రజ్ఞాభట్టులు కల్హణుడి అడుగుజాడల్లో నడుస్తూ సంస్కృతంలో రచించిన ‘కశ్మీర రాజతరంగిణి‘ అనువాదాన్ని తెలుగు పాఠకులకు అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ. [/box]

పూర్వైర్బద్ధమ్ కథా వస్తు మయి భూయో నిబధ్నామి
ప్రయోజనమాకర్ణ్య వైముఖ్యమ్ నోచితమ్ సతామ్
(కల్హణ రాజతరంగిణి, 8)

ఈ ప్రపంచంలో ఏ విషయమైనా  మనకు అర్థమవడంలో ప్రధాన పాత్ర పోషించేది దృష్టి. మనం ఏ దృష్టితో చూస్తే ప్రపంచం అలా కనిపిస్తుంది. అయితే దృష్టిని బుద్ధి నిర్దేశిస్తుంది. బుద్ధిపై మనసు ప్రభావం ఉంటుంది. మనసులో కలిగే భావాలపై వ్యక్తి వ్యక్తిత్వం, సంస్కారం, మానసిక స్థితి, వివేచన వంటి పలు అంశాల ప్రభావం ఉంటుంది. మనసేది చూడాలనుకుంటుందో బుద్ధి దాన్ని చూపిస్తుంది. కన్ను దాన్ని చూస్తుంది. అంటే మనం చూస్తున్న ప్రతీదాన్ని ‘నిజం’ అనుకునే వీలు లేదు. కంటికి కనబడుతున్న ప్రతీదాన్నీ నిజంగా నిర్ధారించే వీలు లేదు. ఒకే వస్తువు ‘దృష్టి’ని బట్టి ఒకో వ్యక్తికి ఒకో రకంగా కనిపిస్తుంది. ఒకో రకంగా అర్థమవుతుంది. ఉన్నది చంద్రుడు ఒక్కడే. ఒకరికి ‘మామ’ అయితే, మరొకరికి బాధలు చెప్పుకునే స్నేహితుడు. ఒకరికి విరహ వేదనను రగిలించే అసూయా పరుడయితే, మరొకరికి వెక్కిరించి హేళన చేసే దుష్టుడు. ఒకరికి సేద తీర్చే సన్నిహితుడయితే మరొకరికి మంటలు రగిలించే తుంటరి. ఒకరికి కాలు తెగిన ఒంటె అయితే, మరొకరికి ప్రేయసి వదనం. ఒకరికి సుందరమైన వెన్నెల చిలికే సుధాకరుడయితే, మరొకరికి నిర్జీవమైన బాసాల్ట్ రాళ్ళ సమూహం. ఇలా ఎవరెవరి దృష్టి వారికి ప్రపంచం కనిపించే రీతిని నిర్దేశిస్తుంది. అంటే ఏదైనా ఒక అంశం పై ఒకరి అభిప్రాయాన్ని వెంటనే ‘నిజం’గా ఆమోదించటం కుదరదు అన్నమాట. దాన్ని నిజంగా ఆమోదించే కన్నా ముందు ఆ అభిప్రాయం వెనుక ఉన్న ‘దృష్టి’ని, దాన్ని ప్రభావితం చేసే బుద్ధిని, దాన్ని నిర్దేశించే మనసును గ్రహించాల్సి ఉంటుంది.

కల్హణుడు రాజతరంగిణి రచనను క్రీ.శ. 1148లో ప్రారంభించి క్రీ.శ.1150 సంవత్సరంలో పూర్తి చేశాడన్నది అధికులు అది నిజంగా ఆమోదిస్తున్నారు. రాజతరంగిణి 8 అధ్యాయాల కావ్యం. ప్రతి అధ్యాయాన్ని ‘తరంగం’ అంటారు. అంటే రాజతరంగిణి ఎనిమిది తరంగాల కావ్యం అన్నమాట. రాజతరంగిణి గురించి పాశ్చాత్యులకు పర్షియన్ అనువాదాల ద్వారా తెలిసింది. సుల్తాన్ జైనులాబ్దిన్‌కు రాజతరంగిణి కావ్యం గురించి తెలియగానే దాన్ని పర్షియా భాషలోకి అనువదించమని ఆజ్ఞాపించాడు. అలా ముల్లా అహ్మద్ ద్వారా  ‘బహ్ర్-ఉల్-అస్మార్’ (కథాసాగరం)గా రాజతరంగిణి పర్షియన్ భాషలోకి అనువాదితమయింది. క్రీ.శ. 1586 లో కశ్మీరు అక్బర్ పాదుషా వశమయింది. ఆయనకు పర్షియన్ భాషలోని రాజతరంగిణికి బహుమతిగా ఇచ్చారు. ఆయన పర్షియా భాషలోని రాజతరంగిణి విని ముగ్ధుడయ్యాడు.  (అక్బర్ విన్న రాజతరంగిణి కల్హణుడు  రాసిన రాజతరంగిణి ఒక్కటే కాదని , రత్నగిరి  పండిత, పద్మ మెహర్, క్షేమేంద్ర వంటి వారి రచనలతో కూడిన రాజతరంగిణి అని పలువురి అభిప్రాయం. ఎందుకంటే ఈ గ్రంధాలన్నిటినీ జైనులాబ్దీన్ పెర్షియన్ భాషలోకి అనువదింపచేశాడు) అయితే అనువాదం అసంపూర్ణం అనీ, అంత గొప్పగా లేదని భావించి ‘అబ్దుల్ ఖాదిర్ అల్ బదౌనీ’ అనే ఆస్థాన చరిత్రకారుడిని రాజతరంగిణిని అనువదించమని క్రీ.శ. 1594లో ఆదేశించాడు.

అల్ బదౌనీ మాటల్లోనే చెప్పాలంటే – “పాదుషా నన్ను తన శయన మందిరంలోకి పిలిచాడు. ఆయన మంచం దగ్గర నిలిచి రాత్రంతా పర్షియన్ రాజతరంగిణి లోని రాజుల గాథలు వినిపించేవాడిని ఆయన కోరికపై. ‘బహ్ర్-ఉల్-అస్మార్’ లో పర్షియన్ భాష ప్రాచీనం అయి ఇప్పుడెవరూ అంతగా వాడకపోవటంతో సామాన్యులకు అర్థమయ్యే సరళమైన పర్షియన్ భాషలోకి రాజతరంగిణిని అనువదించమని, అనువాదాన్ని తనకు వినిపించమని పాదుషా కోరాడు. నేను అతని ఆజ్ఞను శిరసావహించాను” అని రాశాడు. అలా అల్ బదౌనీ రాజతరంగిణిని అనువదించాడు. ‘ఐన్-ఇ-అక్బరీ’ గ్రంథంలో తన అనువాదం నుంచి కొన్ని భాగాలు పొందుపరిచాడు. ఐన్ -ఇ-అక్బారి లో అల్ బదౌని పొందుపరచిన రాజతరంగిణి పలు పెర్షియన్ రాజతరంగిణిల అసంకలనం. కశ్మీరు రాజవంశానికి చెందిన ‘హైదర్ మాలిక్’ రాజతరంగిణి సంక్షిప్త అనువాదాన్ని పర్షియన్ భాషలో ప్రచురించాడు. ఈయన తన అనువాదాన్ని క్రీ.శ. 1617లో జహంగీర్ పాలనలో పన్నెండవ ఏట ఆరంభించినట్టు రాసుకున్నాడు. క్రీ.శ, పదిహేడు, పద్దెనిమి, పంతొమ్మిదవ శతాబ్దాలలో బహారిస్తాన్-ఇ-షాహి( 1614), తారీఖ్-ఇ-కశ్మీర్(1618-21), వాఖియాత్-ఇ-కశ్మీర్(1747), తారీఖ్-ఇ-హసన్(1885) వంటి గ్రంథాలలో ప్రస్తావనద్వారా రాజతరంగిణి జ్ఞాపకాలు సజీవంగావుంది.

ఫ్రెంచి దేశానికి చెందిన ‘ఫ్రాంకోయిస్ బెర్నియర్’ క్రీ.శ. 1664లో హైదర్ మాలిక్ అనువాదాన్ని ఫ్రెంచి భాషలోకి తర్జుమా చేశాడు. ప్రస్తుతం బెర్నియర్ అనువాదం అలభ్యం. ఓ వందేళ్ళ తరువాత మిషనరీ ‘లెపీరె టైఫిన్థాల్’ అనే ఆయన తన గ్రంథంలో హైదర్ మాలిక్ అనువాదం ఆధారంగా కశ్మీరు రాజుల పరంపరను ప్రస్తావించాడు.

ప్రస్తుతం బెర్నియర్ అనువాదం అలభ్యం. ఓ వందేళ్ళ తరువాత మిషనరీ ‘లెపీరె టైఫిన్థాల్’ అనే ఆయన తన గ్రంథంలో హైదర్ మాలిక్ అనువాదం ఆధారంగా కశ్మీరు రాజుల పరంపరను ప్రస్తావించాడు. బ్రిటీష్ వారికి రాజతరంగిణి గురించి, ఫ్రాంకొఇస్ గ్లాడ్విన్ చేసిన ఐన్-ఎ-అక్బారి ఆంగ్లానువాదం ద్వారా పరిచయమయింది.

19వ శతాబ్దారంభంలో ‘విలియమ్ జోన్స్’ దృష్టికి రాజతరంగిణి వచ్చింది. అప్పటికి కశ్మీరు సిక్కుల ఆధీనంలోకి వచ్చింది. మహారాజా రంజిత్‍సింగ్ అనుమతితో రాజతరంగిణి సంస్కృత ప్రతిని సంపాదించి 1835లో ‘ఏసియాటిక్ సొసైటీ’ రాజతరంగిణిని ప్రచురించింది. 1825లో హెచ్.హెచ్. విల్సన్ రాజతరంగిణి మొదటి ఆరు తరంగాల ఆధారంగా ‘కశ్మీరు హిందూ చరిత్ర’ అంటూ వ్యాసం రాశాడు. ఈయన రాజతరంగిణి గురించి ” the only sanscrit composition yet discovered, to which the title of History, can with any propriety be applied”  అన్నాడు. అప్పటినుంచీ రాజతరంగిణి కావ్యంగా కాదు, చరిత్ర గ్రంధంలా అర్ధమవసాగింది.   ఈ రకంగా రాజతరంగిణి బ్రిటీష్ పాలకుల దృష్టిని ఆకర్షించింది.

ఏసియాటిక్ సొసైటీ ప్రచురించిన ప్రతి శారదా లిపి నుంచి దేవనాగరి లిపి లోకి మార్చినది. దాంతో పలు దోషాలు దొర్లాయి. దీనికి తోడు ఈ రాజతరంగిణిని అనువదించింది బెంగాలీ సంస్కృత పండితులు. వీరికి కశ్మీరం గురించి సరిగ్గా తెలియదు. దాంతో సరిగ్గా అర్థంకాని కల్హణుడు వాడిన, కశ్మీరుకు ప్రత్యేకమైన పదాలను వీరు తమ బుద్ధికి తగ్గట్టు మార్చి అనువదించారు. 1852లో ఎ. ట్రోట్టర్ అనే ఆయన ఈ ఏసియాటిక్ సొసైటీ ప్రతిని ఫ్రెంచి భాషలోకి అనువదించి ప్రచురించాడు. జనరల్ ఎ. కన్నింగామ్ కశ్మీరులో లభించిన నాణేలు, ఇతర అంశాలను పరిశీలించి రాజతరంగిణిలోని రాజులు పాలించిన తేదీలను అంచనా వేశాడు. రాజతరంగిణిలో ప్రస్తావించిన మందిరాలను, కట్టడాలను గుర్తించాడు.

1875లో ప్రొఫెసర్ ‘బుహ్లర్’ కశ్మీరులో సంస్కృత రాతప్రతుల కోసం విస్తృతంగా వెతికాదు. నీలమత పురాణాన్ని వెతికి తెచ్చింది ఈయననే. నీలమత పురాణంతో సహా ఇతర ప్రాచీన కశ్మీరీ సంస్కృత గ్రంథాల ఆధారంగా రాజతరంగిణిని విశ్లేషించవచ్చన్న ఆలోచనకు నాందీ ప్రస్తావన చేసింది ఈయననే. రాజతరంగిణి పలు ప్రతులను సేకరించాడు. రాజతరంగిణి విశ్లేషణకు సూత్రాలు ఏర్పరిచాడు. రాజతరంగిణిని ఎలా అనువదించాలో కూడా మొదటి 107 శ్లోకాలను అనువదించి చూపాడు. అంతేకాదు, “A new attempt to translate and to explain Rajatarangini and to use its contents for the history of India, ought to be made” అని సూచించాడు. రాజతరంగిణి ఆధారంగా ప్రాచీన భారత చరిత్రను నిర్మించే ప్రయత్నానికి మార్గం సూచించింది ప్రొఫెసర్ బుహ్లర్.

ఇ. హుల్జ్ అనే ఆయన రాజతరంగిణిలోని మొదటి మూడు తరంగాల ఆధారంగా కొన్ని వ్యాసాలు రచించాడు. ఇవి రాజతరంగిణి పట్ల యూరోపియన్ పండితుల ఆసక్తిని పెంచాయి.

యూరోపియన్ పండితులు రాజతరంగిణి గురించి పలు పరిశోధనలు చేస్తున్న సమయంలో ‘యోగేష్ చాదర్ దత్’ రాజతరంగిణిని ఆంగ్లంలోకి అనువదించాడు.  ఈయన తన అనువాదాన్ని పాశ్చాత్య ఓండితుల ఆలోచనలకనుగుణంగా , రాజతరంగిణిని ఒక చరిత్రలా అనువదించాడు. పౌరాణిక గాథలను, అద్భుతంగా అనిపించే కథలను, అలౌకిక శక్తుల ప్రస్తావన ఉన్న కథలను వదిలేశాడీయన తన అనువాదంలో. ఈ పుస్తకాన్ని సమీక్షిస్తూ, అతని సోదరుడు ఆర్ సీ దత్ , సోదరుడు వదిలేసిన గాథలన్నిటినీ ప్రస్తావించాడు. అంటే, ఆ కాలంలోనే పాశ్చాత్యుల అభిప్రాయాలకు తగ్గట్టుగా మన ప్రాచీన సాహిత్యాన్ని ప్రదర్శించేవారికీ, ఆత్మగౌరవంతో మన ప్రాచీన సాహిత్యాన్ని మన దృష్టితో చూసి విశ్లేషించాలనేవరికీ నడుమ సంఘర్షణ ఆరంభమయిందన్నమాట. రాజతరంగిణి కేవలం చరిత్ర మాత్రమేకాదు సాంస్కృతికి, ధార్మిక అంశాల విశ్లేషణకూ ఉపయోగపడుతుందన్నది జాతీయవాదుల దృష్టిగా మన్ననలోకివచ్చింది.  కల్హణ రాజతరంగిణితో సంతృప్తి పడక ఈయన జోనరాజు, శ్రీవరుడు, ప్రజ్ఞాభట్టు లు రచించిన రాజతరంగిణిని కూడా ఆంగ్లంలోకి అనువదించాడు. 1879-1887 ప్రాంతాలలో ఈయన రాజతరంగిణిల అనువాదం ప్రచురితమయింది. ఈయన 1835లో ప్రచురితమైన రాజతరంగిణిని ఆధారం చేసుకోవటం వల్ల, ప్రామాణికం కాని గ్రంథాన్ని అనువదించాడని యూరోపియన్ పండితులు ఈయన అనువాదాన్ని కొట్టిపడేశారు. అయితే ఒక విదేశీయుడి పరిశోధనకూ, భారతీయుడి పరిశోధనకు చాలా తేడా ఉంటుందని యోగేష్ చాదర్ దత్ నిర్మొహమాటంగా ఒప్పుకున్నాడు. విదేశీయులకు దొరికినన్ని సౌకర్యాలు భారతీయులకు ఉండవని, వారి అంత విస్తృతంగా పర్యటనలు చేయటం, అవసరమైతే ప్రభుత్వ యంత్రాంగం సహాయం తీసుకోవటం తమకు కుదరదనీ, అందువల్ల తమ పరిశోధనల నాణ్యత దెబ్బ తింటుందనీ వాపోయాడాయన.

1888లో శంకర పాండురంగ పండితుడు ప్రాకృత కావ్యం వాక్పతి రాసిన ‘గౌడవాహో’ను వెలుగులోకి తెచ్చాడు. కన్నౌజ్ రాజు యశోవర్మ, కవి వాక్పతిల ప్రస్తావన రాజతరంగిణిలో ఉండటంతో కశ్మీరు రాజులకు భారతదేశంలోని ఇతర ప్రాంతాలతో ఉన్న సంబంధాల విషయం చర్చలోకి వచ్చింది. రాజతరంగిణి పై అందరి ఆసక్తి పెరిగింది. 1892 ప్రాంతంలో పండిత్ దుర్గా ప్రసాద్ రాజతరంగిణి అనువాదాన్ని ప్రచురించాడు. ఇదే సమయంలో ‘ఏరియల్ స్టెయిన్’ కశ్మీరులో విస్తృతంగా పరిశోధనలు చేసి రాజతరంగిణి ప్రతులను సంపాదించి, పోల్చి, ప్రామాణికమనదగ్గ రాజతరంగిణి సంస్కృత ప్రతిని తయారు చేశాడు. రాజతరంగిణిని ఆంగ్లంలోకి అనువదించాడు. 1900 సంవత్సరంలో ప్రచురితమైన ఈయన అనువాదం, సంస్కృత రాజతరంగిణి ప్రతులనే ఈనాటికీ ప్రామాణికంగా భావిస్తున్నారు. ఏరియల్ స్టెయిన్ రాజతరంగిణిని ప్రాచీన భారతీయ రచనలన్నింటిలోకీ చరిత్ర రచనగా పరిగణించదగ్గ ఏకైక గ్రంథంగా నిర్ధారించాడు. కల్హణుడిని ‘భారత చరిత్ర పిత’గా అభివర్ణించాడు.

1935లో రంజిత్ సీతారామ్ పండిత్, మామగారు, మోతీలాల్ నెహ్రూకు (ఆర్ ఎస్ పండితుడు విజయలక్ష్మీ పండిత్ భర్త) ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ, దేశ స్వాతంత్ర్య పోరాటం సమయంలో జైలులో ఉన్నప్పుడు కల్హణ రాజతరంగిణిని ఆంగ్లంలోకి అనువదించాడు. స్టెయిన్ అనువాదంతో కాదు, దృష్టితో విభేదిస్తూ, ఈయన “The distinguished explorer and scholar Sir A. Stein made a deep study of Kalhana’s work but his method of translation does not give an adequate conception of the work as a literary composition to readers unable to study the original. Further his main interest in the chronicle was archaeological and topographical and he omitted to translate verses which according to him are in “Kavya style” and which “contain rhetoric descriptions or didactic matter of a wholly conventional type, practically unconnected with the narrative proper.” Thus an account of a soiree with singing and dancing at the court of Srinagar by artistes who were “Untouchables” has been omitted and among other omissions are strictures on the vices of ruling class” అని విమర్శించి తన అనువాదంలో ఎ.స్టెయిన్ వదిలిన శ్లోకాలను కూడా చేర్చాడు. ఇక్కడే దృష్టి ప్రసక్తి వస్తుంది.

‘కల్హణుడి రాజతరంగిణి’ని గొప్ప చరిత్రగా పాశ్చాత్యులు పొగడి ఆదరిస్తే ఆనందమే. కానీ ప్రాచీన భారతీయ రచనలలో కల్హణుడి రాజతరంగిణి ఒక్కటే ‘చరిత్ర’ రచనగా ఎంచదగ్గదని, మిగతావన్నీ చరిత్ర రచనగా పరిగణించటానికి పనికిరావని అనటం అభ్యంతరకరమే కాదు, అన్యాయం, అవమానకరం కూడా. ఇందులో ఒక మొత్తం నాగరికతను చులకన చేయటం ఉంది. తాను గెలిచి బానిసను చేసుకున్న జాతి ఆత్మగౌరవం తల ఎత్తకుండా ఆత్మన్యూనతా కూపంలోకి తొక్కి వేయడం అనే ప్రయత్నం ఉంది. అయితే 20వ శతాబ్దంలో పరాయి పాలనలో ఉన్నప్పుడే కాదు, స్వాతంత్ర్యం పొందిన డెబ్భయి ఏళ్ళ తరువాత 21వ శతాబ్దంలోనూ భారతీయ చరిత్రకారులు, పండితులు పాశ్చాత్యుల తీర్మానాలకు ఆమోదం తెలుపుతూ వాటినే వల్లె వేస్తుండటం ఒక జాతి మేధావుల ఆత్మవిశ్వాసరాహిత్యం, ఆత్మన్యూనతా భావానికి దర్పణం పడుతుంది. బానిసత్వం భౌతికంగా వదిలినా, వదలని మానసిక బానిసత్వాన్ని ప్రస్ఫుటం చేస్తుంది. ఏ ఎల్ బాషాం, రాజతరంగిణిని చరిత్ర గ్రంథంలా పరిగణించాలన్నాడు. ఆర్ సీ మజుందార్, స్తెయిన్, అభిప్రాయం ” the rhetoric and didactic parts of the Rajatarangini which are in kavya style are unconnected with the narrative proper, which is historical”  ను బలపరుస్తూ ” his (కల్హణ) method is very defective due to the inclusion of mythical or legendary kings. This shows a blind faith in the Epics and Puranas, a belief in withcraft and magic, explanation of events as due to the influence of fate rather than to any rational cause, a general didactic tendency inspired by Hindu views of karma, and mere display of poetical and rhetorical skill ”  అన్నాడు. రోమిల్లా థాపర్ సైతం అని కొట్టిపారేసింది. వీరికి అభ్యంతరం కవి, పురాణాలనూ, జానపద గాథలనూ నమ్మటం, వాటికి ప్రాధాన్యం ఇవ్వటం. రోమిల్లా థాపర్ అయితే, మొదటి మూడు తరంగాలలో అభూతకల్పనలను నమ్మిన కవి, చివరి తరంగాలకు వచ్చేసరికి చరిత్ర గురించిన అవగాహనలో పరిణతి సాధించాడని రసింది. అంటే పురాణ గథలను నమ్మటం, మూర్ఖత్వం, వాటిని నమ్మకపోవటం పరిణతి అన్నమాట.

కశ్మీరు కొండల నడుమ ఉండటం వల్ల భారతదేశంలోని ఇతర ప్రాంతాలతో సంబంధ బాంధవ్యాలు అంతగా లేవని, అందువల్లనే రాజతరంగిణి వంటి రచన కశ్మీరులో ఉద్భవించిందని వ్యాఖ్యానిస్తారు కొందరు. కశ్మీరు భారత్‌లో భాగం కాదని, అతి ప్రత్యేకం అని చూపించే ప్రయత్నాలకు రాజతరంగిణిని ఒక ఆయుధంలా వాడే ప్రయత్నాలివి అని రాజతరంగిణిని పరిశీలిస్తే స్పష్టంగా తెలుస్తుంది. రాజతరంగిణి లోతుల్లోకి వెళ్ళే ముందు చర్చించాల్సిన ప్రధానమైన అంశాలలో ఇది ముఖ్యమైనది. ఏ రకంగా రాజతరంగిణి, ప్రాచీన భారతీయ రచనలలో కెల్లా ప్రత్యేకం? ఎందుకని రాజతరంగిణి చరిత్ర అయింది? ఎందుకని ఇతర భారతీయ రచనలు చరిత్ర కాకుండా పోయాయి?  భారతీయులు తమ పురాణాలను నమ్మటం, కర్మ సిద్ధాంతాన్ని నమ్మటం నేరమా? నమ్మితే వారి రచనలు పనికిరాకుండా పోతాయా? పరిశీలించాల్సి ఉంటుంది.

నిజానికి ఈ విషయంలో ఎలాంటి చర్చలకు, వాదోపవాదాలకు, సందేహాలు సమాధానాల వివాదాలకు తావు లేదు. రాజతరంగిణి రచన ఆరంభంలోనే కల్హణుడు ‘ప్రాచీనులు అభివర్ణించిన కథ విషయాలే నేను తిరిగి రాస్తున్నాను’ అని కుండ బద్దలు కొట్టి చెప్పాడు. ఇతరులు రాసిన వాటినే తిరిగి రాస్తున్నానని పెదవి విరవవద్దని, తమ రచన ప్రయోజనాన్ని తెలుసుకోకుండానే తన ‘కావ్యం’ నుంచి విముఖం కాకూడడని ఎనిమిదవ శ్లోకంలోనే పాఠకుడిని అభ్యర్థిస్తున్నాడు కల్హణుడు. కల్హణుడు ‘ఇంతకు ముందు ఇతరులు రాసిన వాటినే తిరిగి చెప్తున్నాను’ అని స్పష్టం చేసిన తరువాత ఇతర రచనలు పనికిరానివీ, కల్హణుడి రచన ఒక్కటే పనికి వచ్చేది అనటం ఆలోచించాల్సిన విషయం. వెనక్కు తిరిగివస్తున్న అల ముందుకు దూసుకువస్తున్న అలకు ఊపునివ్వటం ద్వారా అల తీరాన్ని బలంగా తాకితే, బలంగా తాకిన అలనే పనికివచ్చింది అనటం ఎంత అన్యాయమో, అంత అన్యాయం ఇది. పూర్వీకుల భుజాన ఎక్కి దూరం చూడగలిగిన వాడిని గొప్పవాడనీ, ఎవరి భుజాలపై ఎక్కి చూశాడో ఆ భుజాలు అనవసరం అని అనటం ఎంత దౌష్ట్యమో, అంత దౌష్ట్యం ఇది. ఆ అల లేకపోతే ఈ అల లేదు. ఆ భుజాలు లేకపోతే ఈ దూర దర్శనం సంభవం కాదు. రసం, అలంకారం, ఛందస్సు వంటి కావ్యలక్షణాలతో రాజతరంగిణిని రచించానని ఈ కవి స్పష్టంగా చెప్పిన తరువాత అది కావ్యం కాదు, చరిత్ర మాత్రమే అనటం, నిర్ధారించటం, ఆమోదించటం, ప్రచారం కావటం గురించి చర్చించాల్సి ఉంటుంది.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here