కశ్మీర రాజతరంగిణి-20

1
9

[box type=’note’ fontsize=’16’] కశ్మీర్ ప్రాచీన చరిత్ర గురించి అవగాహన కలిగించి, భవిష్యత్తు గురించి ఆలోచనలు కలిగించాలన్న ప్రయత్నంలో భాగంగా నీలమతపురాణం తరువాత అందిస్తున్న జోనరాజు, శ్రీవరుడు, ప్రజ్ఞాభట్టులు కల్హణుడి అడుగుజాడల్లో నడుస్తూ సంస్కృతంలో రచించిన ‘కశ్మీర రాజతరంగిణి’ అనువాదాన్ని తెలుగు పాఠకులకు అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ. [/box]

కేనాపి హేతునా తేన ప్రోక్తమ్ మద్గురుణా న యత్।
తచ్చీశ వర్తినీమ్ వాణిమ్ కరిశ్యామి యథామతి॥
(జైన రాజతరంగిణి 1.1.16)

[dropcap]నా[/dropcap] గురువు (జోనరాజు) ఏవో కారణాల వల్ల చెప్పకుండా వదిలివేసిన సంఘటనలకు నేను స్వరాన్నిస్తాను (ప్రదర్శిస్తాను).

జోనరాజు క్రీ.శ. 1459లో మరణించినట్టుగా భావిస్తున్నారు. జోనరాజు మరణం తరువాత రాజతరంగిణిని అతడి శిష్యుడు శ్రీవరుడు కొనసాగించాడు. కల్హణుడి రాజతరంగిణికి, జోనరాజు రాజతరంగిణికీ ఎంతో తేడా ఉంది. ఈ రెండింటితో పోలిస్తే శ్రీవరుడి రాజతరంగిణి కల్హణుడు, జోనరాజుల రాజతరంగిణిలకు పూర్తిగా భిన్నంగా ఉంటుంది. తరాలు మారటం, సాంఘిక, రాజకీయ, ఆర్థిక, మానసిక వ్యవస్థలలో మార్పులు రావటం, భావ ప్రకటనలో, భాషలో మార్పులు చోటు చేసుకోవటం, ముఖ్యంగా, ప్రస్తుతం మన సమాజంలో మనం ‘appeasement’ అని అంటున్నటువంటి ‘బానిస మనస్తత్వం’ స్థిరపపడటం శ్రీవరుడి రాజతరంగిణిలో గమనించే వీలు చిక్కుతుంది. ఈ ముగ్గురు కవులను రూపాంతరం చెందుతున్న భారతీయ మనస్తత్వానికి ప్రాతినిధ్యం వహిస్తున్నట్టుగా భావిస్తే పూర్తిగా స్వేచ్ఛా స్వతంత్రాలు ప్రదర్శించిన కల్హణుడికీ, పూర్తిగా లొంగిపోయి తనని తాను మరచే ప్రయత్నం చేస్తూ, అధికారానికి దాసోహం అనే బానిస మనస్తత్వం లోనూ వీలయినంత స్వతంత్ర భావాన్ని ప్రకటించే శ్రీవరుడికి నడుమ జోనరాజు వారధిగా నిలుస్తాడు. అటు కల్హణుడి అంత స్వతంత్రుడు కాదు. ఇటు శ్రీవరుడిలా పూర్తిగా, తనని తాను మరచిపోయేంతగా లొంగిపోలేదు. ఈ ఇద్దరి నడుమ రూపాంతరం చెందుతున్న భారతీయ సామాజిక మనస్తత్వానికి ప్రాతినిధ్యం వహిస్తాడు. జోనరాజు ‘లౌక్యం’గా వ్యవహరిస్తే, శ్రీవరుడు పూర్తిగా ‘దాసోహం’ అన్నట్టు వ్యవహరిస్తాడు.

శ్రీవరుడు తన రాజతరంగిణి పేరు ‘జైన రాజతరంగిణి’గా నిర్ణయించాడు. హఠాత్తుగా చూస్తే కశ్మీరులో జైనులు ఎక్కడి నుంచి వచ్చారనిపిస్తుంది. కానీ ఈ ‘జైన’ ఆ ‘జైన’ కాదు. ఇది ‘జైనులాబిదీన్’ లోని ‘జైన’. ఇంగ్లీషులో ‘Zain’. జైనులాబిదీన్ సుల్తానును ఇంగ్లీషులో ‘Zain-ul-abidin’గా రాస్తారు. సంస్కృతంలో ‘Z’ అన్న శబ్దం కోసం ‘జ’ అన్న పదం వాడక తప్పదు. అలా శ్రీవరుడి రాజతరంగిణి ‘జైన రాజతరంగిణి’ అయింది.

శ్రీవరుడు జోనరాజు శిష్యుడు. జోనరాజు మరణం తరువాత శ్రీవరుడు జైనులాబిదీన్ ఆస్థానంలో జోనరాజు స్థానాన్ని ఆక్రమించాడు. శ్రీవరుడు కవి మాత్రమే కాదు, చక్కని సంగీత విద్వాంసుడు, గాయకుడు కూడా. సుల్తాన్ జైనులాబిదీన్ పాలన చివరి దశాబ్దంలో తన రాజతరంగిణి రచనను ఆరంభించాడు శ్రీవరుడు. ఆయన రాజతరంగిణి రచనను కొనసాగించేందుకు ప్రధాన కారణం ‘సుల్తాను ఋణాన్ని కొంచమయినా తీర్చుకోవటం’ కోసం. సుల్తాను గొప్పతనం వల్ల ప్రభావితుడై తానీ రచనను కొనసాగిస్తున్నట్టు ‘జైన రాజతరంగిణి’ ప్రారంభంలోనే చెప్పుకున్నాడు శ్రీవరుడు.

‘సికిందర్ బుత్‍షికన్’ అకృత్యాల వల్ల కశ్మీరు నుండి బ్రాహ్మణులు ప్రాణాలు అరచేత పట్టుకుని పారిపోయారు. అంతవరకూ ఇస్లామీయుల అధికారం ఉన్నా, వారు వ్యవస్థను దెబ్బతీయలేదు. ఇస్లామీయుల ప్రాధాన్యం ఉన్నా, వారు పాలనా వ్యవస్థ ఎలా నడుస్తోందో, అలానే నడవనిచ్చారు. కానీ ‘సికిందర్ బుత్‍షికన్’ కాలంలో సూఫీ మత ప్రబోధకుడు ‘హమదని’ ప్రేరణతో కశ్మీరులో ఇస్లామేతరుల పట్ల వివక్షత తీవ్రస్థాయిని చేరుకుంది. ఇస్లాం రాజ్యంలో ఇస్లామేతరులకు ఎలాంటి హక్కులు, గౌరవాలు ఉండకూడదన్న ఆలోచన అమలులోకి వచ్చింది. దాంతో మరణమో, మతం మారటమో తప్ప మరో గత్యంతరం లేని పరిస్థితులు ఇస్లామేతరులు అనుభవించాల్సి వచ్చింది. దాంతో కీలకమైన పదవులలో ఇస్లామీయులే నియమితులయ్యారు. అంత వరకూ పాలనా వ్యవస్థను సాగిస్తున్న వారంతా ప్రాణాలు, ధర్మం కాపాడుకునేందుకు పారిపోవాల్సి వచ్చింది. అనుభవం లేకపోవటంతో అధికారానికి వచ్చినవారు ‘మత మౌఢ్యం’ ప్రదర్శించటమే ఉత్తమ పాలనగా భావించారు. దాంతో పాలన దెబ్బతింది. కశ్మీరులో అరాచకం చెలరేగింది. ఇలాంటి పరిస్థితులలో జైనులాబిదీన్ అధికారానికి వచ్చాడు.

ఇక్కడ ఒక విషయం మనం ప్రస్తావించుకోవాల్సి ఉంటుంది. భారతదేశ చరిత్ర రచనలో ‘అక్బరు’ గురించి గొప్పగా రాస్తారు. ‘అక్బరు’ తెలియని విద్యార్థి ఉండడు. జైనులాబిదీన్ పేరు ఎవ్వరికీ తెలియదు. రాజతరంగిణి, అదీ జోనరాజు రాజతరంగిణితో పరిచయం ఉన్నవారికి జైనులాబిదీన్ తెలుస్తాడు. కశ్మీర్ చరిత్రను అధ్యయనం చేసేవారికి జైనులాబిదీన్ గురించి తెలుస్తుంది. భారతదేశంలో అధికారం నెరపిన సుల్తానులందరిలోకి అద్వితీయుడు, అత్యుత్తముడు సుల్తాన్ జైనులాబిదీన్ అని నిస్సందేహంగా చెప్పవచ్చు. ఎందుకంటే భారతదేశంలో ఇస్లామీయుల పాలన స్థిరంగా ఉండాలంటే ఇస్లామేతరులతో సత్సంబంధాలుండటం తప్పనిసరి అని అక్బరు కన్నా 150 ఏళ్ళ ముందే గ్రహించి ఆచరించినవాడు జైనులాబిదీన్. అది కూడా తన అధికారం నిలుపుకోవటం కోసం కాదు, ప్రజల సంక్షేమం కోసం. అక్బరు రాజపుత్రులతో కాని ఇతర హిందూ రాజులతో కానీ సత్సంబంధాలు నెరపటంలో ప్రధాన ఉద్దేశం తన పాలనను సుస్థిరం చేయటం. జైనులాబిదీన్‌కు కశ్మీరులో ఎదురు లేదు. ఎలాంటి అస్థిరత్వం లేదు. అయినా ప్రజలకు సవ్యమైన పాలనను ఇవ్వాలంటే అందరూ కలసిమెలసి ఉండక తప్పదని గ్రహించాడు. పరస్పర గౌరవం, సహాయ సహకారాలు తప్పనిసరి అని అర్థం చేసుకుని అమలు పరిచాడు జైనులాబిదీన్. అంటే జైనులాబిదీన్ ‘పరమత సహనం’ పాలసీలో అక్బరులా ‘రాజకీయం’ లేదన్నమాట.

ఇస్లామీయులు, ఇస్లామేతరుల నడుమ సత్సంబంధాలు నెలకొల్పేందుకు అక్బరు ‘దీన్-ఇ-ఇలాహి’ వంటి మధ్యేతర మార్గాన్ని ఎంచుకున్నాడు. జైనులాబిదీన్‍కు తెలిసినంతగా ఇస్లామీయుల మనస్తత్వం అక్బరుకు తెలియదని ఈ విషయం స్పష్టం చేస్తోంది. ఇస్లామీయులు దేన్నైనా సహిస్తారు కానీ ‘మతం ప్రమాదంలో పడుతుంది’ అన్న భావనను సహించరు. అందుకే అక్బరును మనం గొప్పరాజు అని పొగుడుతాం కానీ ఆ కాలం నాటి ఇస్లామీయుల రాతలలో, ముఖ్యంగా ‘బదయుని’ రాతల్లో అక్బరు పట్ల వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తుంది. అక్బరు అవలంబిస్తున్న పరమత సహనం పట్ల నిరసన కనిపిస్తుంది. ‘పరమత సహనం’ ప్రదర్శించే ఏ సుల్తాను అయినా ఈ ‘వ్యతిరేకత’ను అనుభవించక తప్పదు. ప్రజలకు ‘దారా షుకోహ్’ పట్ల అభిమానం ఉన్నా, అతను ‘సూఫీ’ మతానికి ప్రాధాన్యం ఇస్తాడనీ, ఉపనిషత్తులను పర్షియన్ భాషలోకి అనువదించి ఆదరిస్తున్నాడన్న కారణం ఆధారంగా ‘ఇస్లాం ప్రమాదంలో పడింద’ని ప్రచారం చేసి ప్రజలను ‘దారా’కు వ్యతిరేకం చేయగలిగారు. ఔరంగజేబు అధికారాన్ని ప్రజలు స్వీకరించేట్టు చేయగలిగారు. కాబట్టి ‘పరమత సహనం’ ప్రదర్శించే ఏ రాజు అయినా ఈ వ్యతిరేకతకు సిద్ధంగా ఉండాలి. ఈ నిరసన జ్వాలలను తట్టుకోగలగాలి. ఈ విషయంలో జైనులాబిదీన్ అక్బరు కన్నా సమర్థవంతంగా వ్యవహరించాడు. అక్బరు పాలనా కాలం 49 ఏళ్ళు. జైనులాబిదీన్ పాలనా కాలం యాభై ఏళ్ళు. ఈ యాభై ఏళ్ళలో జైనులాబిదీన్ తన తండ్రి పాలనా కాలంలో అస్తవ్యస్తమైన సామాజిక వ్యవస్థను చక్కదిద్దడమే కాదు, కశ్మీరును వదిలిపోయిన ఇస్లామేతరులను కశ్మీరుకి తిరిగి రప్పించి, వారికి భద్రతను కల్పించాడు. వారి విశ్వాసాన్ని చూరగొన్నాడు. అరాచకంగా ఉన్న కశ్మీరుకు స్థిరత్వాన్ని ఇచ్చాడు. అందుకే జోనరాజు రచనలో జైనులాబిదీన్ సుస్థిరత్వానికి ప్రతీకగా నిలుస్తాడు. ప్రపంచం మారిపోయింది. కానీ ఆ మారిన ప్రపంచంలో స్థిరత్వన్ని తీసుకువచ్చాడు జైనులాబిదీన్ అన్న భావన జోనరాజు రచనలో కనిపిస్తుంది. మ్లేచ్ఛులు, తురుష్కుల వల్ల అల్లకల్లోలమైన కశ్మీరుకు స్థిరత్వాన్ని ప్రసాదించిన ‘యవనుడు’ జైనులాబిదీన్ అని రాస్తాడు జోనరాజు.

అహంకారా గదాకారో రాజా ప్రకృతి వృద్ధాయ్।
దర్శనానామ్ సా ధూతూనామ్ ఇవోల్బణమ్ అశీశమత్॥
(జోనరాజు రాజతరంగిణి – 774)

రాజు అహంకారానికి వైద్యుడిలా, ‘పరమతం పట్ల అసహనం’ అనే వ్యాధిని మందు వేసి నిర్మూలించాడు.

‘కలేర్ ధర్మేణ బలినా మత్స్య న్యాయా ప్రవర్తనామ్’

‘చిన్న చేపను పెద్ద చేప తినటమ’నే కలియుగ మత్స్య న్యాయాన్ని నిర్మూలించిన ధర్మ స్వరూపుడు. ఇది జైనులాబిదీన్ గురించి జోనరాజు అభిప్రాయం.

అక్బరును ఆధునిక చరిత్రకారులు గొప్పరాజును చేశారు. అక్బరు ఆస్థాన కవులు గొప్ప రాజును చేశారు. కానీ సమకాలీన పర్షియన్ చరిత్ర రచయితలు అక్బరును మెచ్చలేదు. అబుల్ ఫజల్ రాసిన అక్బరునామా ద్వారా అక్బర్ పాలనను విశ్లేషిస్తారు. అబుల్ ఫజల్ నూ అక్బరునూ విమర్శిస్తూ అబ్దుల్ ఖదీర్ బదాయుని రాసిన తారిఖ్-ఇ-బదాయుని చదివితే ఆకాలంలో సామాజికంగా ఇస్లామీయులనుంచి అక్బరు ఎదుర్కున్న నిరసన స్వరూపం అర్ధమవుతుంది. అబుల్ ఫజల్ అక్బర్ అడుగులకు మడుగులొత్తి పైకివచ్చాడు అని విమర్శిస్తాడు బదాయుని. అక్బరుకు అండగా నిలిచిన హిందూ రాజులు అక్బరుకు విధేయులుగా ఉన్నారు. కానీ ఇతర భారతీయ రాజులు అక్బరును అడుగడుగునా వ్యతిరేకించారు.

జైనులాబిదీన్ దేశ విదేశాల నుంచి పండితులను, విజ్ఞానులను కశ్మీరుకు ఆహ్వానించాడు. లలిత కళలను ఆదరించాడు. ముఖ్యంగా సంస్కృత కావ్యాలను పర్షియన్ భాషలోకి, పర్షియన్ కావ్యాలను సంస్కృతం, కశ్మీరీ భాషలలోకి అనువదింపజేశాడు. ఈ రకంగా ప్రజల నడుమ సాహిత్యం ద్వారా సంస్కృతి పట్ల అవగాహనల ద్వారా సత్సంబంధాలను నెలకొల్పాలని ప్రయత్నించాడు. ఇస్లామేతరులపై అక్రమంగా విధించిన పన్నులను తొలగించాడు. ముఖ్యంగా ‘గోరక్షణ’ నియమ నిబంధనలు ఏర్పాటు చేసి అమలు పరిచాడు. దేవాలయాల నిర్మాణానికి ప్రోత్సాహాన్నిచ్చాడు. కీలకమైన పదవులలో బ్రాహ్మణులను నియమించి, వారికి గౌరవం ఇచ్చి కూడా ఇస్లామీయులలో నిరసన లేకుండా చూసుకున్నాడు. ఇస్లామీయులకు ఒక నీతి, ఇస్లామేతరులకు మరో నీతి అన్నట్టు కాకుండా అందరికీ ఒకే ‘నీతి’ అన్న రీతిలో వ్యవహరించాడు. అక్బరు ఎంత పరమత సహనం ప్రదర్శించినా; ‘ఇస్లామీ యువకులు ఇస్లామేతర స్త్రీలను వివాహమాడవచ్చు, కానీ ఇస్లామీ స్త్రీలు ఇస్లామేతర పురుషులను వివాహమాడకూడద’న్న నియమాన్ని విధించడమే కాకుండా కఠినంగా అమలు పరిచాడు. జైనులాబిదీన్ అలాంటి వివక్షతను చూపలేదు. ఇస్లామీయులు, ఇస్లామేతరుల నడుమ అవగాహనను పెంచి, సామరస్యం నెలకొనేలా చేయాలని ప్రయత్నించాడు. అక్బరు ఎంతగా పరమత సహనం చూపినా అక్బరు ఆస్థానంలో ఒక స్థాయి దాటి ఇస్లామేతరులు ఉన్నత పదవులు పొందేవారు కాదు. జైనులాబిదీన్ ఆస్థానంలో ఉన్నత పదవులన్నీ ఇస్లామేతరులవే. అక్బర్ పరమత సహనంలో ‘రాజకీయం’ ఉంటే, జైనులాబిదీన్ పరమత సహనంలో ‘నిజాయితీ’ ఉంది.

జోనరాజు రాజతరంగిణిలో ఓ సంఘటన ఉంటుంది. కశ్మీరు తిరిగి వచ్చిన ఓ బ్రాహ్మణుడి భూమిని తనదిగా ఓ ఇస్లామీ అధికారి నకిలీ పత్రాన్ని చూపిస్తాడు, తరిమివేస్తాడు. ఆ బ్రాహ్మణుడు జైనులాబిదీన్‍ను ఆశ్రయిస్తాడు. వివరాలను క్షుణ్ణంగా తెలుసుకుంటాడు జైనులాబిదీన్. కాఫిర్ మాటలకు విలువలేదని ఇస్లామీ అధికారి వాదిస్తాడు. అప్పుడు జైనులాబిదీన్ ఆ నకిలీ పత్రాన్ని నీటిలో తడుపుతాడు. దాంతో పైపైన రాసిన నకిలీ రాతలు చెరిగిపోతాయి. అధికారి చేసిన మోసం బహిర్గతమవుతుంది. బ్రాహ్మణుడి భూమిని అతడికి ఇచ్చి, ఆ ఇస్లామీ అధికారిని కఠినంగా శిక్షిస్తాడు జైనులాబిదీన్. ఇందుకు ఎవ్వరిలోనూ ఎలాంటి వ్యతిరేకత, నిరసన వ్యక్తమవకుడా తన తీర్పుకు ఇస్లామీ న్యాయ సూత్రాల నుండి సమర్థనను చూపిస్తాడు. ఈ రకంగా ఇస్లామీయులకు తాము పాలకులు, తామేం చేసినా చెల్లుతుంది అన్న అహంకారాన్ని కలగనీయలేదు జైనులాబిదీన్. ‘అష్టలోకేశ తేజోంశ ధారణాస్యాః లక్షణమ్’ అని అందుకే జోనరాజు జైనులాబిదీన్‍ని పొగిడాడు. అష్టదిక్పాలకుల తేజోలక్షణం కలవాడు జైనులాబిదీన్ అన్నాడు. అక్బరు పాలన గురించి రాస్తూ అబ్రహం ఈర్లీ ‘ది లైవ్స్ అండ్ టైమ్స్ ఆఫ్ గ్రేట్ ముఘల్స్’ అన్న పుస్తకంలో ‘Though racial and religious considerations were important in the middle ages, they were never as important as political considerations. Religion sub-served politics’ (page 145) అని తీర్మానిస్తాడు. జైనులాబిదీన్ గురించి ఇదే మాట అనలేము.

జైనులాబిదీన్ రాజ్యానికి వచ్చినప్పుడు అతని రాజ్యంలో కేవలం పదకొండు ఇస్లామేతర కుటుంబాలుండేవి. వారూ బ్రాహ్మణ పండితులు. ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బితుకు బితుకుమంటూ బ్రతుకుతున్నారు. అతనికి ఎదురు లేదు. రాజ్యమంతా ఇస్లాం మయం. ఎవరికీ భయపడాల్సిన పని లేదు. ఇస్లామేతరులను గౌరవించి, మన్నించాల్సిన పని లేదు. రాజ్యం నిలుపుకోవటం కోసం ఇస్లామేతరుల పట్ల ‘సహనం’ ప్రదర్శించాల్సిన పని లేదు. రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు. సంస్కృతాన్ని ఆదరించాల్సిన అవసరం లేదు. ప్రోత్సహించి, పోషించకుంటే అడిగేవాడు లేడు. అలా అడిగేవాడు లేకుండా సికందర్  బుత్‌షికన్, హమదని, సూహభట్టులు చేశారు. అయినా సరే, జైనులాబిదీన్, ఇస్లామేతరులను కశ్మీరులోకి ఆహ్వానించాడు. వారికి ఉన్నతమైన పదవులు ఇచ్చాడు. సంస్కృత కావ్య రచనను ప్రోత్సహించాడు. సంస్కృత కావ్యాలను పర్షియన్ లోకి అనువదింపజేశాడు. ఇస్లామీయులు, ఇస్లామేతరులు కలిసి మెలిసి ఉండాలని వాంఛించాడు. అందుకు తగ్గ వాతావరణాన్ని తన పాలనా కాలంలో కల్పించాడు. ‘తమకు ఉపయోగం లేని వారితో ఒక వ్యక్తి వ్యవహరించే విధానం అతని వ్యక్తిత్వానికి నిరూపణ’ అంటారు. ఈ కోణంలో చూస్తే భారతదేశాన్ని పాలించిన సుల్తానులలో అత్యుత్తముడు, ఆదర్శప్రాయుడు, అనుసరణీయుడు జైనులాబిదీన్. అతనికి ముందు, అతని తరువాత కశ్మీరును పాలించిన సుల్తానులే కాదు, భారతదేశంలోని ఇతర ప్రాంతాలలో పరమత సహనం ప్రదర్శించిన సుల్తానులుగా పేరు పొందిన వారెవరయినా సుల్తాన్ జైనులాబిదీన్ ముందు దిగదుడుపే. ఎందుకంటే వారు ఎంత సహృదయులయినా అవసరం కొద్దీ పరమత సహనం ప్రదర్శించారు అనే వీలుంది. ఇలాంటి అవసరం లేకున్నా పరమత సహనం ప్రదర్శించిన సహృదయుడు జైనులాబిదీన్. బలవంతులకు జ్ఞానం ఉంటే ఎలా ఉంటుందంటే జైనులాబిదీన్‍ను చూపించవచ్చు. అందుకే జోనరాజు అతడిని అంతగా పొగిడేడు. అతడికి ఆగ్రహం కలిగించకుండా జాగ్రత్తపడ్డాడు. ఎందుకంటే ఎంత సహనం ప్రదర్శించేదయినా విషపు నాగు విషపు నాగే! విషాగ్ని కీలలు ఎంత భయంకరమో జోనరాజు ప్రత్యక్షంగా అనుభవించాడు. శ్రీవరుడు జైనులాబిదీన్ పాలనా కాలంలో జన్మించాడు. విషాగ్ని జ్వాలల వేడి అతనికి తెలియదు. జైనులాబిదీన్ చల్లని పాలనను అనుభవించాడు. అందుకని జోనరాజులో కనబడని సంపూర్ణ విధేయత శ్రీవరుడి ‘జైన రాజతరంగిణి’లో కనిపిస్తుంది.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here