కశ్మీర రాజతరంగిణి-25

3
9

[box type=’note’ fontsize=’16’] కశ్మీర్ ప్రాచీన చరిత్ర గురించి అవగాహన కలిగించి, భవిష్యత్తు గురించి ఆలోచనలు కలిగించాలన్న ప్రయత్నంలో భాగంగా నీలమతపురాణం తరువాత అందిస్తున్న జోనరాజు, శ్రీవరుడు, ప్రజ్ఞాభట్టులు కల్హణుడి అడుగుజాడల్లో నడుస్తూ సంస్కృతంలో రచించిన ‘కశ్మీర రాజతరంగిణి’ అనువాదాన్ని తెలుగు పాఠకులకు అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ. [/box]

ప్రణామ్య విఘ్నౌఘ హరమ్ గణేశామ్ త్రిధాత్వ రూపామ్ అపి భారతీమ్ తామ్।
విరచ్యతే యావనశాస్త్ర బద్ధ కథా మయా నిర్జర భాషయేయమ్॥
(కథా కౌతుకమ్ 1.2)

[dropcap]ప[/dropcap]ర్షియా కావ్యాన్ని సంస్కృతంలోకి స్వేచ్ఛానువాదం చేస్తూ శ్రీవరుడు అనేక విషయాలు చెప్పకుండా చెప్పాడు. శ్రీవరుడి మానసిక వ్యవస్థను అతని రచన ద్వారా పరిశీలిస్తే కశ్మీరు సామాజిక, మానసిక చరిత్రను ఊహించే వీలుంటుంది.

ఏ పర్షియన్ రచన అయినా వారిదైవ ప్రార్థనతో ప్రారంభమవుతుంది. వారి దైవం తప్ప మరో దైవం లేదన్న ప్రకటనతో ప్రారంభమవుతుంది. భారతీయ కావ్యాలు కవి ఇష్టదైవ ప్రార్థనతో ఆరంభమవుతాయి. రాజతరంగిణిని శ్రీవరుడు అర్ధనారీశ్వరుడి ప్రార్థనతో ఆరంభించాడు. కానీ ‘కథా కౌతుకమ్’ను అటు విఘ్నేశ్వరుడు, ఇటు సరస్వతి వందనతో ప్రారంభించాడు. వినాయకుడు విఘ్నాలు తొలగించేందుకు, సరస్వతీదేవి వాగ్దేవి. భాష ప్రమాదంలో ఉంది. భాషను పరిరక్షించుకోవాలి. అందుకు.

ఒక భాషను సజీవంగా నిలపటంలో సృజనాత్మక రచనలు అత్యంత ప్రాధాన్యం వహిస్తాయి. భాష గొప్పతనాన్ని వివరిస్తూ, భాష ఎంత ప్రాచీనమో తెలుపుతూ, భాష ఏయే ప్రాంతాలలో విస్తరించిందో వివరిస్తూ ఎన్ని వేల వ్యాసాలు రాసినా ఫలితం ఉండదు. ఒక కమ్మని గీతం, ఒక చక్కని వ్యాసం, ఒక ఉల్లాసం కలిగించే రచన చాలు, ప్రజలకు భాష పట్ల ఆసక్తి కలిగించేందుకు. అందుకే సృజనాత్మక రచనలు వెల్లివెరిసినంత కాలం ఏ భాష అయినా ఉచ్చస్థాయిలో ఉంటుంది. ఎప్పుడైతే సృజనాత్మక రచనల స్థానాన్ని కాల్పనికేతర రచనలు, చర్చలు, వాద వివాదాలు ఆక్రమిస్తాయో, అప్పుడది మట్టి, బురదతో నిండి చివరి దశలో ఉన్న నదీ ప్రవాహ దశకు చేరుకుంటుంది. కాబట్టి భాషను సజీవంగా ఉంచాలంటే ప్రజలను ఆకర్షించి, ప్రజల నాల్కలపై నడయాడే సృజనాత్మక కావ్యాల సృజన తప్పనిసరి.

శ్రీవరుడి కాలంలో సంస్కృతం వాడకంపై అప్రకటిత నిషేధం ఉంది. పర్షియా భాషకే ప్రాధాన్యం. కానీ సంస్కృతం పూర్తిగా అంతరించలేదు. కానీ పలు పర్షియన్ పదాలు వాడకంలోకి వచ్చాయి. రికార్డులు గతంలో సంస్కృతంలో ఉండేవి. ఇప్పుడు సంస్కృతం, పర్షియన్ భాషల సమ్మిశ్రమయ్యాయి. కానీ నెమ్మదిగా సంస్కృతం ప్రాధాన్యం తగ్గుతోంది. ఎంత కాలం సంస్కృతం సజీవంగా ఉంటుందో ఊహించలేని పరిస్థితి. రాజాశ్రయం ఉన్నంతకాలమే సంస్కృతం నిలిచి ఉంటుందని శ్రీవరుడికి తెలుసు. ఎందుకంటే 14వ శతాబ్దారంభం నుంచి కశ్మీరులో మార్పులు వేగవంతమయ్యాయి. 14వ శతాబ్దారంభంలో కశ్మీరులోకి పర్షియా, మధ్య ఆసియా నుంచి పలువురు ఇస్లామీయులు, మత ప్రవక్తలు అడుగుపెట్టటంతో సామాజికంగా, సాంస్కృతికంగానే కాదు, సంఖ్యాపరంగా కూడా పెను మార్పులు చోటు చేసుకున్నాయి. అంతవరకు భారతీయులు అధికంగా ఉండేవారు. సనాతన ధర్మానుయాయులు, బౌద్ధులు, జైనులు మాత్రమే ఉండే కశ్మీరులో సుల్తానులు అధికారానికి వచ్చినప్పటి నుంచీ ఇస్లామీయుల సంఖ్య అధికం కావటం వేగవంతమైంది. ‘సికిందర్ బుత్‌షికన్’ కాలంలో జరిగిన బలవంతపు మతమార్పిళ్ళు, బెదిరింపులు, అణచివేతలు వంటి చర్యల వల్ల మతం మారినవారు, పన్నులు కట్టలేక , బాధలు భరించలేక మతం మారిన వారితో కశ్మీరులో ఇస్లామీయుల సంఖ్య వేగంగా పెరిగింది. దీనికి తోడు ప్రాణాలు అరచేత పట్టుకుని తమ ధర్మం రక్షించుకోవటం కోసం పెద్ద ఎత్తున ఇస్లామేతరులు కశ్మీరు వదిలి వెళ్ళటంతో కూడా ఇస్లామీయుల ఆధిక్యం పెరిగింది. జైనులాబిదీన్ కాలంలో, కశ్మీరు వదిలి వెళ్ళీన వారు కొందరు తిరిగి వచ్చినా, ఇలా వచ్చిన కుటుంబాలు అధికంగా బ్రాహ్మణులు. దాంతో భారతీయ ధర్మానుయాయులంటే కశ్మీరులో బ్రాహ్మణులు మాత్రమే అన్న అభిప్రాయం స్థిరపడింది. మిగతా వారంతా మతం మారిపోయినా బ్రాహ్మణులు మాత్రమే తమ ధర్మాన్ని పట్టుకుని వేళ్ళాడుతూ సజీవంగా నిలుపుతున్నారు. వీరు ప్రభుత్వ ఉద్యోగాలలో ఉండటంతో రాజు అండదండలుంటాయి. వీరు తమతో పాటు తమ సంస్కృతిని, ధర్మాన్ని, భాషను సజీవంగా నిలుపుతున్నారు. దాంతో ఇస్లామీ మత ప్రవక్తల దృష్టి వీరిని మతం మార్చటం వైపు మళ్ళింది. ఎందుకంటే, ఒక బ్రాహ్మణుడు భారతీయ ధర్మం వదిలితే ఒక ‘గురుకులం’ భారతీయ ధర్మాన్ని వదిలినట్టే. కాలక్రమేణా బ్రాహ్మణులలో పర్షియన్ భాషను నేర్చుకుని, ప్రభుత్వోద్యోగాలలో చేరే కార్కున్‌లు, ఇందుకు భిన్నంగా సంస్కృతాన్ని నేర్చుకుని, ప్రభుత్వోద్యోగాలలో చేరకుండా స్వతంత్రంగా బ్రతికే ‘భాష్యభట్టు’లుగా రెండు వర్గాలు ఏర్పడ్డాయి. అయినా బ్రాహ్మణులు అనేకులు ఇస్లాం స్వీకరించారు. ఇస్లాం స్వీకరించినా వారి పాత ధర్మం గుర్తులు అయిన కౌల్, భట్, మాంటు, గనీ, రైనా, పండిత్ వంటి ఇంటి పేర్లను వారు వదులుకోలేదు. దార్, మగ్రే, రాథోర్, ధాకోర్, నాయక్, లోన్, చాక్ వంటి ఇంటి పేర్లున్న వారు మతం మారిన క్షత్రియులు. అంటే, అగ్రవర్ణాల వారి దౌర్జన్యాలకి తిరుగుబాటుగా అణచివేతకు గురయిన అల్పవర్ణాలవారు స్వచ్ఛందంగా ఇస్లాం స్వీకరించారని ఇప్పుడు ఏదయితే ప్రచారం విస్తృతంగా సాగుతోందో దానికి ఎలాంటి ఆధారాలు లేకపోగా, అగ్రవర్ణాలవారు సైతం పెద్ద సంఖ్యలో ప్రాణాలు కాపాడుకునేందుకో, గత్యంతరం లేకనో తప్పనిసరి పరిస్థితులలో మతం మారటం, ఆధునిక సమాజంలో జరుగుతున్న ప్రచారం అనృతం అని నిరూపిస్తుంది. పైగా ఇలా తప్పనిసరి పరిస్థితులలో గత్యంతరం లేక మతం మారినవారు, అన్ని ఒత్తిళ్ళను తట్టుకుంటూ తమ ధర్మాన్ని కాపాడుకుంటున్న వారిపై జరిపినన్ని ఘోరమైన అత్యాచారాలు అసలు ఇస్లామీయులు కూడా జరపలేదు. ఇందుకు కారణం తమ ధర్మాన్ని సంరక్షించుకోలేని అశక్తత, కష్టాలకు లొంగి స్వధర్మాన్ని పరిత్యజించిన తమ మానసిక దౌర్బల్యం, ‘స్వధర్మే నిధనం శ్రేయః’ అన్నట్టు ప్రవర్తిస్తున్న వారిపై క్రోధంగా, ద్వేషంగా మారటమే.

ఇలాంటి పరిస్థితులలో సంస్కృత భాషను సజీవంగా నిలపటం కోసం శ్రీవరుడు చేసిన చిన్ని ప్రయత్నమే ‘కథా కౌతుకమ్’ రచన. ఇందులో సరస్వతీదేవిని ప్రార్థిస్తూ ‘త్రిధర్మ రూపాం’ అన్నాడు. ఆ త్రిధర్మాలు శ్రద్ధ, జ్ఞానం, వివేకం. ఈ మూడు ధర్మాల స్వరూపం అయిన సరస్వతిని ప్రార్థిస్తూ ‘యవన శాస్త్ర బద్ధ కథ’ను అనువదిస్తున్నానని చెప్పాడు. ‘యవన శాస్త్రం’ అన్న పదాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ‘శాస్త్రం’ అంటే  ఇప్పుడు మనకు ఒక అర్థం స్ఫురిస్తుంది. కానీ శ్రీవరుడు ‘యవన శాస్త్రం’ అన్న పదంలో ‘శాస్త్రం’ను వాడిన అర్థం వేరు. ‘యూసుఫ్ ఏ జులైఖా’ ప్రేమ కథ. కానీ ఈ ప్రేమ కథలో ముల్లా జామి ఆధ్యాత్మికత, శృంగారంతో పాటుగా పర్షియన్లకు సంబంధించిన పలు శాస్త్రీయ అంశాలను సందర్భానుసారంగా పొందుపరిచాడు. ఇక్కడ ‘యవన శాస్త్రం’ అంటే ‘యవనులు ఏర్పరచిన నియమాలు’ అని అర్థం చేసుకోవాలి. ‘యవన శాస్త్రం’ అంటే యవనుల శాస్త్రీయ నియమాల ఆధారంగా రచించిన కావ్యం. దాన్ని సంస్కృత కావ్య రచన నియమాలను పాటిస్తూ రచించాడన్న మాట శ్రీవరుడు. అందుకని ‘యవన శాస్త్ర బద్ధ’ కావ్యం అన్నాడు. ఇక్కడ శాస్త్రం అంటే మనం అర్థం చేసుకుంటున్న శాస్త్రం కాకుండా యవనుల సంస్కృతి, సంప్రదాయలు, సిద్ధాంతాలను ప్రదర్శించే కావ్యంగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇస్లామీయుల శాస్త్రాలతో కూడిన కావ్యం అన్న మాట. కానీ తాను ఏ భాషలోకి తర్జుమా చేస్తున్నాడో ఆ భాషను సూచించేందుకు వాడిన పదాన్ని ప్రత్యేకంగా గమనించాల్సి ఉంటుంది. సంస్కృతాన్ని శ్రీవరుడు ‘నిర్జర భాష’ అన్నాడు. అంటే ముసలితనం లేనిది, వయసు లేనిది, అంతం లేనిది. అనంత కాలం సజీవంగా ఉండేది. వయసుతో సంబంధం లేనిది. వయసు ప్రభావం లేనిది. నిత్య యవ్వన భాష. ఇది శ్రీవరుడు సంస్కృతం చిరంజీవి అని, సతతం సజీవంగా ఉంటుదన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసిన విధానం. అంటే ఎలాగయితే జోనరాజు ‘పృథ్వీరాజ విజయం’ కావ్యంపై వ్యాఖ్యానం రచిస్తూ, పృథ్వీరాజ విజయాన్ని ఇస్లామీయులపై భారతీయులు విజయాన్ని సాధించగలరని ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే సాధనంగా వాడేడో, అలాగే పర్షియన్ కావ్యాన్ని సంస్కృత భాషలోకి అనువదించటం ద్వారా శ్రీవరుడు భారతీయ సంస్కృతి, తాత్వికతలను సామాన్యులకు చేరవేసే ప్రయత్నం చేశాడు. మరో వైపు భాషను సజీవంగా ఉంచే ప్రయత్నం చేశాడు. ‘యవన శాస్త్ర బద్ధ కథ’ను నిర్జర భాషలోకి అనువదిస్తూ భారతీయ శాస్త్రాలను తన కావ్యం ద్వారా ప్రచారం లోకి తెచ్చే ప్రయత్నం చేశాడు శ్రీవరుడు.

ఇక్కడ మనం అప్రస్తుతమైనా ఒక అత్యంత ప్రధానమైన విషయాన్ని స్పృశించాల్సి ఉంటుంది. ఏ సమాజంలోనయినా సృజనాత్మక రచయితలు అత్యంత కీలకమైన పాత్రను సమాజానికి దిశానిర్దేశనం చేయటంలో పోషిస్తారు. భారతీయ సమాజంలో సమకాలీన సామాజిక పరిస్థితుల ఆధారంగా పురాణాలను పునః సృజించే వ్యవస్థ ఉంది. సమకాలీన సమాజంలోని సందేహాలకు సమాధానాలు, సమస్యలకు పరిష్కారాలు సూచిస్తూ సమాజగతిని నిర్దేశిస్తూ, మార్గ నిర్దేశనం చేసే రీతిలో ఏ కాలం వారు ఆ కాలానికి తగ్గట్టుగా రామాయణ, భారతాలను రచించటం ద్వారా భారతీయ ధర్మం సజీవ నదిలా ప్రవహిస్తూండటంలో తోడ్పడ్డారు. సమాజాన్ని ఉత్తేజితం చేశారు. సాహిత్యాన్ని ఒక ఆయుధంలా వాడేరు. దారిదివ్వెలా వాడేరు.

జోనరాజు, శ్రీవరుడు లాంటి వారి ప్రయత్నాల వల్ల క్రీ.శ. 14వ శతాబ్దంలో కశ్మీరు సంపుర్ణంగా ఇస్లాంమయమయినా, 16వ శతాబ్దం వరకూ సంస్కృతంలో రచనలు కొనసాగాయి. పద్దెనిమిదో శతాబ్దంలోనూ స్థలపురాణాలు సంస్కృతంలో వెలువడ్డాయి. రాజాశ్రయం లేకున్నా, పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా సృజనాత్మక రచయితలు కంకణ బద్ధులయితే భాషను సజీవంగా నిలపగలరనటానికి కశ్మీరులో సంస్కృత కావ్య రచయితల కృషి తిరుగులేని నిదర్శనం. కథా కౌతుకాన్ని అనువదించటంలో శ్రీవరుడు అవలంబించిన పద్ధతి, చేసిన చమత్కారాలు తమ ధర్మాన్ని సజీవంగా నిలుపుకోవటం కోసం జరిపే పోరాటంలో ప్రధాన భాగం ‘భాష’ను సజీవంగా నిలుపుకోవటం అని స్పష్టం చేస్తాయి.

క్రమేణ యేన భౌతార్దో ముల్లాజ్యామేన వర్ణీతః।
తేనైన హి మయా సోయామ్ శ్లోకేనాద్య నిరూప్యతే॥
(కథా కౌతుకమ్ 1.3)

‘ముల్లాజ్యామేన’ అంటే ‘ముల్లా జామీ’. ముల్లా జామీ పర్షియన్ భాషలో ఎలాంటి అర్థంతో పదాలను వాడేడో అదే పద్ధతిలో శ్లోకాలలో అర్థాన్ని నిరూపించాను. ముల్లాజామి వాడిన పదాల అర్థాన్ని అలాగే శ్లోకాల రూపంలో రచించి పొందుపరిచానని చెప్పుకున్నాడు శ్రీవరుడు. కానీ శ్రీవరుడు అలాగే అనువాదం చేయలేదు. పర్షియన్ సంస్కృతిని భారతీయ సంస్కృతితో ముడిపెట్టి ముల్లా జామీ రచించిన ‘యూసుఫ్ జులైఖా’ ప్రేమగాథను సంపూర్ణంగా భారతీయీకరణం చేశాడు. ఇక్కడే ఇస్లామీయుల సంపర్కంతో భారతీయ సమాజంలో , సాహిత్యంలో , మానసిక వ్యవస్థలో, ఆలోచనావిధానంలో వచ్చిన మార్పులను ఊహించేవీలు ఈ రచన కల్పిస్తుంది.

‘ముల్లా జామీ’ కావ్యం ప్రధానంగా సూఫీతత్వాన్ని బోధిస్తుంది. దైవాన్ని, ప్రేమతో ముడిపెడుతుంది. ప్రేమించటం మోక్షానికి దారి అని చూపిస్తుంది. ఒక పద్ధతి ప్రకారం మనం సమాజంలో విస్తృతంగా ప్రచారం చేసి మెదళ్ళలో జొప్పించటం వల్ల ఈ భావన ఇప్పుడు మనకు కొత్తగా అనిపించదు కానీ, ఆ కాలంలో భారతీయ సమాజానికి ఇది వినూత్నమైన భావన. ఈ భావనను సంస్కృత శ్లోక రూపంలో ప్రదర్శిస్తూ భారతీయ సమాజానికి అర్థమయ్యే రీతిలో ప్రదర్శించి అన్వయించాల్సి ఉంటుంది.  అక్కడి సమాజాన్ని ఇక్కడి సమాజంపై ఆరోపించి, ఇక్కడి సమాజానికి అర్థమయ్యే రీతిలో వివరించాల్సి ఉంటుంది. ‘కథా కౌతుకమ్’లో శ్రీవరుడు ప్రేయసీ ప్రియుల నడుమ భౌతిక ప్రేమకు దైవత్వాన్ని ఆపాదించి, దాన్ని ఆధ్యాత్మిక ప్రేమగా అందించిన విధానం గమనిస్తే పర్షియన్ ప్రేమ కావ్యాల ప్రభావంతో, సూఫీ సిద్ధాంతాల ప్రభావంతో భారతీయ సమాజంలో చెలరేగిన సంఘర్షణ స్వరూపం, ఆ పై ఆ సంఘర్షణను పరిష్కరించి కొత్త రూపం ధరించిన విధానాన్ని ఊహించే వీలు చిక్కుతుంది. భారతీయ సమాజంలో రాధాకృష్ణుల ప్రేమ, రాసలీలలు ఎలా మన సమాజంలో విస్తృతమయ్యాయో, రతీమన్మథులు ధర్మబద్ధమైన ప్రేమకు కాక లైంగిక ప్రేమకు ప్రతీకలయ్యారో, ఏ రకంగా ఆధునిక సమాజంలొ ప్రేమభావనలోని ఆధ్యాత్మికత అదృశ్యమై, లైంగికతకు పెద్ద పీట లభిస్తోందో అర్థం చేసుకునే వీలు చిక్కుతుంది. అంతవరకు సంస్కృతంలో కవులు సృజించిన కావ్యాలను, కశ్మీరులో శ్రీవరుడు, అతని ప్రభావంతో పర్షియన్ కావ్యాలను సంస్కృతంలోకి సృజించిన కావ్యాలను పరిశీలిస్తే, సృజనాత్మక కవులు తమ కావ్యాలలో సమాజం రూపాంతరం చెందటాన్ని ప్రదర్శిస్తూ, ఎలా తమ ధర్మాన్ని సజీవంగా ఉంచేందుకు సృజనాత్మక సాహిత్యాన్ని వాడుకున్నారో తెలుస్తుంది.

పర్షియన్ లోని యూసుఫ్, సంస్కృతంలో ‘యశోబా’ అయ్యాడు, జులైఖా ‘జోలేఖ’ అయ్యింది. జోలేఖ అందమయినది. ఆమె యశోబా గురించి కలలు కంటూంటుంది. కాని ఆమె యశోబాని ప్రేమించటం అతని సోదరులలో అసూయ కలిగిస్తుంది. అతడిని ఎడారిలో పారేస్తారు. చనిపోయాడని అనుకుంటారు. ఎడారిలో ప్రయాణిస్తున్న వ్యాపారులు అతడిని రక్షిస్తారు. అతని అందం చూస్తూ ఈజిప్టు అందాన్ని గుర్తుకు తెచ్చుకుంటారు. కానీ యశోబా వారికి దైవం సౌందర్యం గురించి చెప్తూంటాడు. అతడిని వారు బానిసను చేసుకుంటారు. అతడిని జోలేఖ ప్రేమిస్తుంది. అతడు దైవం మీద ప్రేమ బోధిస్తాడు. దాంతో ఆమె అతడిని జైలులో పారేయిస్తుంది. కలలను విశ్లేషించి చెప్పటంలో అతని నైపుణ్యం వల్ల అతడిని విడుదల చేస్తారు. అతడు తన కుటుంబంతో కలుస్తాడు. ఈలోగా జోలేఖ దైవం వైపు మళ్ళుతుంది. దైవానికి పూర్తిగా తనని తాను అర్పించుకుంటుంది. ఆమె యవ్వనవతి అవుతుంది. యశోబాతో కలుస్తుంది. టూకీగా ఇది యూసుఫ్ జులైఖాల ప్రేమగాథ.

పర్షియన్ గాథలోని దైవ సంబంధిత విషయాలన్నిటినీ శైవ సంబంధిత అంశాలుగా రూపొందించాడు శ్రీవరుడు. చివరి అధ్యాయం మొత్తం శివభక్తిని పెంపొందించే శివస్తుతి. యవన కావ్య నిర్మాణ శాస్త్రాన్ని భారతీయ కావ్య నిర్మాణ శాస్త్రంతో ముడిపెట్టి నూతన రచన సంవిధానాన్ని రూపొందించాడు శ్రీవరుడు. ముల్లా జామి తన కావ్యంలో స్వర్గంలోని పుష్పాన్ని చూపించటం ద్వారా తనలోని ఆశ అనే మొగ్గను వికసింప చేయమంటాడు.

ఇస్లామీయుల స్వర్గ భావన వేరు, భారతీయుల స్వర్గ భావన వేరు. దాంతో శ్రీవరుడు ‘స్వర్గం’ అనే పదం వాడే బదులు ‘తదుతృక్నేప్సితమ్ ఫలమ్’ అని వాడేడు. ‘ప్రసాద మధునా’ అన్నాడు. ఆశ అనే మొగ్గను చిగురింపజేస్తూ శుభప్రదమైన ఫలాన్ని ప్రసాదించమన్నాడు. ముల్లా జామి ‘ఇలాహి’ అన్న చోట శ్రీవరుడు ‘ప్రభూ’ అన్నాడు. ముల్లా జామి ‘రూఆజె-యె జూవిద్’ అంటూ స్వర్గ భావనను ప్రదర్శిస్తే, అలాంటి భావనతో పరిచయం లేని శ్రీవరుడు ‘ఫలం’ అన్నాడు. సమస్త మానవ జీవన ఫలం ‘మోక్షం’. మోక్షం ఇమ్మన్నాడు శ్రీవరుడు. ‘స్వర్గం’ అంటే అప్పటి సమాజంలో మోక్షమని భావన. రంభ, ఊర్వశి, మేనకల స్వర్గం కాదు.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here