కశ్మీర రాజతరంగిణి-3

7
8

[box type=’note’ fontsize=’16’] కశ్మీర్ ప్రాచీన చరిత్ర గురించి అవగాహన కలిగించి, భవిష్యత్తు గురించి ఆలోచనలు కలిగించాలన్న ప్రయత్నంలో భాగంగా నీలమతపురాణం తరువాత అందిస్తున్న జోనరాజు, శ్రీవరుడు, ప్రజ్ఞాభట్టులు కల్హణుడి అడుగుజాడల్లో నడుస్తూ సంస్కృతంలో రచించిన ‘కశ్మీర రాజతరంగిణి’ అనువాదాన్ని తెలుగు పాఠకులకు అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ. [/box]

విస్తీర్ణా ప్రథమే గ్రంథాః స్మృత్యై సంక్షిప్తతో వః।

సువ్రతస్య ప్రబంధేన ఛిన్నా రాజకథాశ్రయాః॥

యా ప్రధమాగమన్నైతి సాపి వాచ్య ప్రకాశనే।

పాటవం దృష్ట వైదుష్య తీవ్రా సువ్రత భారతీ॥

కేనాప్యన వధానేన కవికర్మణి సప్యతి।

అంశోపి నాస్తి నిర్దోషః క్షేమేంద్రస్య నృపావళీ॥

దృగ్గోచరం పూర్వాసూరి గ్రంథా రాజకథాశ్రయః।

మమత్వేకాదశ గతా మతం నీలపురాణోపి॥

ఈ ప్రపంచంలో ఏదీ హఠాత్తుగా జరగదు. కారణం లేకుండా కార్యం ఉండదు. ప్రతి ఘటనకు పూర్వాపరాలు ఉంటాయి. అలాగే ఏ వ్యక్తి కూడా హఠాత్తుగా ఏదో కొత్తది సాధించడు. అలా సాధించినట్టు కనిపించినా జాగ్రత్తగా పరిశీలిస్తే దానికి కారణాలు, పునాది, కొన్ని తరాల ప్రయత్నము, తపన వంటి విషయాలు తెలుస్తాయి. కల్హణుడు ఆరంభంలోనే తాను తన పూర్వీకులు చెప్పిన గాథలనే మళ్ళీ చెప్తున్నానని చెప్పాడు. తాను ప్రాచీన చరిత్ర కథనాలలోని పొరపాట్లు సరిచేస్తూ తెలుసుకొన్న కొత్త విషయాలు జత చేస్తూ రచిస్తున్నానని చెప్పుకున్నాడు.

అంటే ప్రాచీన చరిత్ర కథనాలు విభిన్నమైనవి అనేకం ఉన్నాయి. వాటన్నిటినీ పరిశీలించి, పోల్చి, వాటిల్లోని దోషాలు పరిష్కరించి, అన్నిటినీ క్రోడీకరించి, తనకు కొత్తగా తెలిసిన విషయాలు జోడించి రాజతరంగిణిని రచిస్తున్నాడన్న మాట కల్హణుడు. ముందుగా తనకు ముందు వారు చేసిన చరిత్ర రచనలలో తాను గమనించిన దోషాలను చెప్తున్నాడు కల్హణుడు.

‘సువ్రతుడు’ తన ప్రబంధంలో విస్తృతంగా ఉండి, ముక్కలు ముక్కలుగా ఉన్న ప్రాచీన రాజుల చరిత్రను సంక్షిప్తంగా రచించాడు. పుస్తకానికి మంచి ప్రాచుర్యం వచ్చింది. కానీ అతను పాండిత్య ప్రదర్శన విపరీతంగా చేశాడు. అందువల్ల అర్థం మరుగున పడింది. స్పష్టంగా లేదు. క్షేమేంద్రుడు రాసిన ‘నృపావళి’ లో దోషరహితం కానిదేదీలేదు. పురాతన విద్వాంసులు రాసిన పదకొండు గ్రంథాలు, నీలముని చెప్పిన నీలమత పురాణం కూడా కల్హణుడు పరిశీలించాడు. అన్నిటినీ పరిగణనలోకి తీసుకున్న తరువాత, రాజతరంగిణి రచనకు ఉపక్రమించాడు. పూర్వ గ్రంథాలలో తాను గమనించిన దోషాలను కల్హణుడు చులకన భావంతో చెప్పటం లేదు. ప్రతి రచయితకూ తనదైన ప్రత్యేక రచనా శైలి ఉంటుంది. అది ఆ కాలంలో ప్రజలను రంజింప చేయవచ్చు. కానీ అదే శైలి తరువాత కాలానికి చెల్లకపోవచ్చు. అంత మాత్రాన ఆయన ప్రదర్శించిన అంశాలు పనికి రానివి కావు. క్షీరనీర న్యాయం పాటించి పైపైని పటాటోపాలను విస్మరించి, ప్రధానమైన అంశాన్ని స్వీకరించాలి. దీన్లో దోషాలు ఎత్తి చూపటం, విమర్శించటం, చులకన చేయటం లేదు. పనికి రానివి అని కొట్టివేయటం లేదు. జిజ్ఞాస ఉంది. ప్రాచీన చరిత్రను సరైన రీతిలో అందించాలన్న పట్టుదల ఉంది, తపన ఉంది. అంటే కల్హణుడి కన్నా ముందు భారతదేశ సాహిత్యంలో ‘చరిత్ర రచన లేదు’ అనటం, చరిత్రను అర్థం చేసుకునేందుకు అవి పనికిరానివి అనటం మూర్ఖత్వమే కాదు, అహంకారం, అన్యాయం కూడా… ఎందుకంటే, వీరు పనికిరావి అని కొట్టిపారేస్తున్న గ్రంథాలే , వీరు అద్భుతం అని పొగడుతున్న రాజతరంగిణికి ముడిసరకు. తనకు ముందు సువ్రతుడు, క్షేమేంద్రుడితో సహా ఇంకా పదకొండు చరిత్ర గ్రంథాలు లేకపోతే కల్హణుడి రాజతరంగిణి సంభవమయ్యేదే కాదు. తీరాన్ని తాకిన అల వెనక్కి వస్తూ, ముందుకు దూసుకు వస్తున్న అలకు ఊపునిచ్చి మరింత ఎత్తుకు ఎగసేట్టు చేయటానికి అతి చక్కని ఉదాహరణ కల్హణుడి రాజతరంగిణి రచన. అలాంటి రచనను ఇతర రచనల నుంచి వేరు చేసి ప్రత్యేకంగా చూపిస్తూ, మిగతావాటిని విసర్జించటం దుర్మార్గం. ఈ దుర్మార్గం భారతీయ ప్రాచీన వాఙ్మయం విషయంలో పాశ్చాత్య పండితులు నెరపారు. ఈ సందర్భంలో కల్హణ రాజతరంగిణి అలలపై ఆడుకునే కన్నా ముందు, ఒక్కసారి కశ్మీరంలో సంస్కృత కావ్యాలను స్మరించాల్సి ఉంటుంది. ఎన్నెన్ని అలలు తీరాన్ని తాకి వెనక్కి వెళ్తూ కల్హణుడనే అలను నూతన ఎత్తులకు చేర్చాయో తెలుసుకోవాల్సి ఉంటుంది.

భారతదేశాన్ని ఏక సూత్రంతో బంధించింది భారతీయ ధర్మం అయితే, ఆ భారతీయ ధర్మాన్ని ప్రజలకు చేరువ చేసింది సంస్కృతం. మరో రకంగా చెప్పాలంటే ప్రజల నాల్కలపై సంస్కృతం నడయాడినంత కాలం ఎన్నెన్నో విభేదాల నడుమ కూడా ప్రజల మనస్సులు ఒకటిగానే ఉన్నాయి. కాశ్మీరం ఇందుకు భిన్నం కాదు.

కాశ్మీరంలో కావ్య సృజనకర్తలు అనగానే క్షేమేంద్రుడు, కల్హణుడు, మంఖుడు వంటి పేర్లు వినిపిస్తాయి. కల్హణ రాజతరంగిణిని కొనసాగించిన జోనరాజు, శ్రీవరుడు, ప్రజ్ఞాభట్టు, కాశి వంటి వారి పేర్లు ఆయా అంశాలపై ఆసక్తి కలవారికి మాత్రమే తెలుస్తాయి. కానీ కశ్మీరు సంస్కృత వాఙ్మయ చరిత్రను పరిశీలిస్తే కాశ్మీరంలో విలసిల్లినంతగా కావ్య రచన భారతదేశంలో మరే ప్రాంతంలోనూ లేదని అర్థమవుతుంది. అంతే కాదు 11-12 వ శతాబ్దం నుంచి దేశమంతా ఒక ఉద్యమంలా ప్రాంతీయ భాషలలో రచనలు ఆరంభమయ్యాయి. సంస్కృతం  వెనుకబడి ప్రాంతీయ భాషలు తెరపైకి వచ్చి స్థిరపడ్డాయి. కానీ కాశ్మీరంలో, అక్బర్ కాశ్మీరును గెలుచుకున్న తరువాతనే సంస్కృత కావ్య రచన వెనుకబడింది. 18వ శతాబ్దంలో కూడా సంస్కృత రచనలు వచ్చాయి. మరాఠీలోకి భగవద్గీత, తెలుగులోకి భారతం అనువాదమయిన సమయంలోనే దాదాపుగా కల్హణుడు రాజతరంగిణిని సంస్కృతంలో రచించాడు. అప్పటికి తురుష్కులు కశ్మీరులో ప్రవేశించారు. కానీ కాళ్లూనుకోలేదు. జోనరాజు, శ్రీకరుడు సంస్కృతంలో రాజతరంగిణి రచించేటప్పటికి కశ్మీరుపై సుల్తానులు పట్టు బిగించారు. వారు సుల్తాన్ జైనులాబ్దీన్ అదేశం ప్రకారం రాజతరంగిణిని రచనను కొనసాగించారు. ప్రజ్ఞాభట్టు, శుకుడు రాజతరంగిణిని కొనసాగించేనాటికి అక్బరు కాశ్మీరును సాధించాడు. క్రీ.శ. 1589లో రాజతరంగిణికి స్వస్తి పలికే సమయానికి అక్బరు దాల్ సరస్సులో పడవ విహరణోత్సవం జరుపుతున్నాడు. అంటే, భారతదేశం అంతా మహమ్మదీయులు అధిక్యాన్ని వ్యతిరేకిస్తూ ప్రాచీన వాఙ్మయాన్ని ప్రాంతీయ భాషలలోకి అనువదిస్తూ స్వధర్మాన్ని సజీవంగా ఉంచే నిశ్శబ్ద పోరాటాన్ని సాగిస్తున్న సమయంలో, కాశ్మీరులో సంస్కృత భాషలో రచనలు సాగుతూ ధర్మాన్ని సజీవంగా నిలిపే ప్రయత్నాలు సాగుతున్నాయన్నమాట. కాశ్మీరులోని పవిత్ర స్థలాల స్థల మహత్యాల గురించీ స్థల పురాణ, పర్యాటక గ్రంథాలు సంస్కృతంలో రచించటం ద్వారా సంప్రదాయాన్ని సజీవంగా ఉంచే పరమద్భుతమైన నిశ్శబ్ద సాంస్కృతిక, ధార్మిక పోరాటం కశ్మీరంలో కొనసాగుతునే ఉందన్నమాట. అవిశ్రాంత సాంస్కృతిక, ధార్మిక పోరాటంలో దారిదివ్వె లాంటి మార్గదర్శక రచన రాజతరింగిణి. ఒక కీలకమైన సమయంలో కల్హణుడు రాజతరంగిణి రచన చేయటం వల్ల కాశ్మీరుకి చెందిన అత్యద్భుతమైన సంస్కృత వాఙ్మయం గురించి, కవుల గురించి మనకు వివరాలు అందుతున్నాయి. ఈనాడు వారి గ్రంథాలు లభ్యం కాకపోయినా, వారి రచనలు, ఆనాటి సమాజంపై వారి రచనల ప్రభావం విషయాలు తెలుస్తున్నాయి. ఈ రకంగా చూస్తే మన ప్రాచీన కావ్యాలలో పుర్వకవుల స్తుతి, కుకవుల నింద  వంటి విషయాలు; తాము ఒక బృహత్తరమైన ప్రాచీన పరంపరకు వారసులమని కవులు భవిష్యత్తు తరాలకు గుర్తు చేయడం అనిపిస్తుంది. ఆనాటి సాహిత్య సమాజపరిస్థితిని, మానిసికవ్యవస్థను భావితరాలకు అందించటంలో భాగం అనిపిస్తుంది. ఈ రకంగా వారు తమ ప్రాచీనులను స్మరించటమే కాదు భవిష్యత్తు తరాలకు వారి స్మృతిని అందిస్తున్నారు.

క్షేమేంద్రుడు, వల్లభదేవుల రచనలు ద్వారా భర్తృమంధి లేక మంధి అనే కవి గురించి తెలుస్తుంది. ఈయన మాతృగుప్తుడనే రాజు కశ్మీరును పాలిస్తున్నప్పుడు ఆయన దగ్గర ఉండేవాడు. భర్తృమంధుడు రచించిన ‘హయగ్రీవ వధ’ అనే కావ్యం విపరీతమైన ప్రజాదరణ పొందింది. స్వయానా కవి అయిన మాతృగుప్తుడు సైతం ఇతడిని ఆదరించి, అభిమానించి, గౌరవించేవాడని తెలుస్తుంది. సముద్రగుప్త చక్రవర్తి రచించిన శ్రీకృష్ణ చరితములో మాతృగుప్తుడి ప్రసక్తివస్తుంది. ఈ మాతృగుప్తుడు దారిద్ర్యమనుభవిస్తూ, దానినుంచి విముక్తికోసం ఉజ్జయిని ప్రభువు, విక్రమార్క బిరుదాంకితుడయిన హర్షవర్దనుడినిచేరతాడు. కానీ రాజభటులు లోనికి పోనీయరు. అలాంటి పరిస్థితిలో, ఒకరోజు ద్వారపాలకుడు నిద్రలోవున్నప్పుడు రాజుకు తనకవితను బిగ్గరగాపాడి వినిపిస్తాడు. ఆ శ్లోకం విని ముగ్ధుడయిన రాజు ఇతడిని ఆదరిస్తాడు. అదే సమయంలో కశ్మీరరాజు హిరణ్యుడు మరణిస్తాడు. అతడు సంతాన రహితుడు. అప్పుడు హర్షవర్దనుడు, మాతృగుప్తుడిని కశ్మీరుకి రాజుగా పంపిస్తాడు. అలా కవి మాతృగుప్తుడు కశ్మీరు రాజవుతాడు. రాజతరంగిణి కూడా ఈ కథను చెప్తుంది. కశ్మీరుకు భారత్ లోని ఇతర భాగాలతో సంబంధంలేదన్న వ్యాఖ్య అబద్ధం అని నిరూపిస్తాడు మాతృగుప్తుడు.

కశ్మీరు రాజులు కూడా పండితులు, లలిత కళలకు ప్రాధాన్యం ఇచ్చి ఆదరించినవారు. మాతృగుప్తుడు జయాపీడుడు, హర్షుడు వంటి వారు సంస్కృత కావ్య రచన చేసిన రాజులలో ప్రథమస్థానంలో ఉంటారు. జయాపీడుడు విద్వాంసులతో ప్రసంగిస్తూ వారితోనే కాలక్షేపం చేసేవాడని కల్హణుడు రాశాడు. అతడు భారతదేశం నలుమూలల నుంచి విద్వాంసులను, కవి పండితులను కశ్మీరం రప్పించి వారికి అత్యధిక గౌరవం ఇచ్చేవాడు. థక్కియుడనే విద్వాంసుడికి ఎంతో గౌరవం ఇచ్చాడట. ‘కుట్టనీ మతం’ రచించిన దామోదర గుప్తకవి రాజనీతి మంత్రుల కధిపతి. అతని సభలో మహారథుడు, శంఖదంతుడు, చటకుడు, సంధిమంతుడు వంటి మహా కవులు ఉండేవారు.

ఇలా పలువురు కశ్మరు రాజులు పండితులను , కవులను ఆదరించారు. అందుకే బుల్హర్ “కశ్మీరులో కుంకుమపువ్వు ఎంత విరివిగా లభిస్తుందో కవిత్వం కూడా అంత విస్తృతంగా వెల్లివిరుస్తుంది” అని వ్యాఖ్యానించాడు.

కశ్మీరుకు చెందిన అతి ప్రాచీన సంస్కృత రచన నీలముని రచించిన నీలమత పురాణం. అయితే నీలమత పురాణం కావ్యం కాదు. కాశ్మీరుకు చెందిన అతి ప్రాచీన కావ్యం భూమకుడు రచించిన ‘అర్జున రావణీయం’. ఇది భట్టికావ్యంను అనుసరించి రాసిన కావ్యంగా భావిస్తున్నారు. భట్టి కావ్యం ఆరవ శతాబ్దికి చెందినది. దీనిని ‘భట్టి’ రచించాడు. తాను శ్రీధరుడి కొడుకు నరేంద్రుడి రాజ్యంలో ఈ కావ్యం రచించాని చెప్పుకున్నాడు. ఈ కావ్యం రాముడి గాథను చెప్తూ పాణిని వ్యాకరణ సూత్రాలను సులభంగా బోధిస్తుంది. దీన్ని మహా కావ్యం, శాస్త్ర కావ్యం అంటారు. ఇది విద్యార్ధులకు పాఠ్య పుస్తకంలా ఉపయోగించే వారని ఊహిస్తున్నారు. ఎందుకంటే భట్టికావ్య పఠనం వల్ల సంస్కృత వ్యాకరణం సులభంగా బోధపడుతుంది. ఈ కావ్య ప్రభావం జావాకు చెందిన అతి ప్రాచీన రామాయణ కావ్యం ‘కాకావిన్ రామాయణ’పై కనిపిస్తుంది. ‘అర్జున రావణీయం’ ప్రధానంగా కార్తవీర్యార్జునుడికి రావణుడికి నడుమ జరిగిన యుద్ధగాథ. 1500 శ్లోకాల కావ్యం. ఈ కావ్యం రావణ – కార్తవీర్యార్జున పోరాటాలను వర్ణిస్తూనే పాణిని వ్యాకరణ విశేషాలను సులభంగా వివరిస్తుంది. కాళిదాసు కుమార సంభవాన్ని అనుసరిస్తు ఉద్భటుడు ‘కుమార సంభవ’ కావ్యాన్ని రచించాడు. ఉద్భటుడనే ఈ మహాకవికి కశ్మీరరాజు జయపీడుడు రోజుకు లక్ష నాణేల వేతనం ఇచ్చేవాడట! కాళిదాసు కుమార సంభవం ప్రేరణతో రచించినా ఉద్భటుడు ప్రకృతి వర్ణనలలో తాను దర్శిస్తున్న కశ్మీరునే వర్ణించాడు. అయితే ఈయన కావ్యంలో కేవలం 95 శ్లోకాలే ప్రస్తుతం లభిస్తున్నాయి. అవి కూడా, ఈ ఉద్భటుడు రచించిన అలంకార గ్రంథం ‘కావ్యాలంకార సారసంగ్రహ’లో అలంకారాల ప్రయోగానికి ఉదాహరణగా ఆయన తాను రచించిన 95 శ్లోకాలను చూపించటం  వల్ల లభిస్తున్నాయి.

క్రీ.శ.319లో కశ్మీరులో రాజు తుంజీనుడి ఆస్థానంలో మహాకవి చంద్రుడు ఉండేవాడని తెలుస్తుంది. ఆ కాలంలో ఆయన రచించిన సంస్కృత నాటకాలను కశ్మీరు ప్రజలు విరగబడి చూసేవారట. ఆయన నాటికలేవీ ఇప్పుడు లభ్యం కావటం లేదు కానీ అతడిని మెచ్చుకుంటూ అభినవ గుప్తుడు తన రచనలో ఉదహరించిన కొన్ని కొన్ని వాక్యాలు లభిస్తున్నాయి. వాటిల్లో ప్రధానమైనది ‘న ముగ్ధే ప్రత్యేతు ప్రభవతి గతః కాలహరిణాః’. ‘కాలం ఒకసారి వెళ్లిపోతే తిరిగి రాదు’.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here