కశ్మీర రాజతరంగిణి-30

6
8

[box type=’note’ fontsize=’16’] కశ్మీర్ ప్రాచీన చరిత్ర గురించి అవగాహన కలిగించి, భవిష్యత్తు గురించి ఆలోచనలు కలిగించాలన్న ప్రయత్నంలో భాగంగా నీలమతపురాణం తరువాత అందిస్తున్న జోనరాజు, శ్రీవరుడు, ప్రజ్ఞాభట్టులు కల్హణుడి అడుగుజాడల్లో నడుస్తూ సంస్కృతంలో రచించిన ‘కశ్మీర రాజతరంగిణి’ అనువాదాన్ని తెలుగు పాఠకులకు అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ. [/box]

యత్ర యత్ర మనస్తస్తీర్, మనస్త్యతైవ ధారయేత్।
తత్ర పర్యాంద స్వరూపమ్ సంపర్వర్తతే॥
(అభినవ గుప్తుడి శివజ్ఞాన ఉపనిషత్తు లేక విజ్ఞాన భైరవ తంత్ర)

[dropcap]ప[/dropcap]ర్షియన్‍ల ‘ఇష్క్’ను ‘రాగ’గా అనువదించేందుకు కశ్మీర శైవం అత్యంత సులభమైన ప్రాతిపదికను అందిస్తుంది. భారతీయ ధర్మంలో ప్రేమ అంటే భగవంతుడిపై ప్రేమనే. మామూలు భౌతిక విషయాలపై ప్రేమ భగవంతుడిపై ప్రేమగా పరిణామం చెందటం కుదరని పని. ఎందుకంటే భౌతికమైనది ఏదైనా పరిమితులు కలది, నశ్వరమైనది. తప్పుదారి పట్టించేది. సరైన విజ్ఞానాన్ని ఇవ్వలేనిది. అందుకనే భారతీయ ధర్మంలో ‘అసతోమా సద్గమయా, తమసోమా జ్యోతిర్గమయ’ అన్న శాంతి మంత్రం అత్యంత ప్రాధాన్యం వహిస్తుంది. కనబడే అబద్ధం నుంచి కనబడని సత్యం వైపు ప్రయాణం, చీకటి నుంచి వెలుతురు వైపు ప్రయాణం, నశ్వరం నుంచి అనశ్వరం వైపు ప్రయాణం – ఇదీ భారతీయ ధర్మం. విగ్రహారాధన వెనుక తత్త్వం కూడ ఇదే. కనబడే విగ్రహం నుంచి కనబడని అనంతం గ్రహించడం లక్ష్యం. అయితే ఈ తత్త్వం లేని మతాలలో, రూపం లేని దాన్ని ధ్యానించటం ప్రధానం. కానీ నామరూపాత్మకమైన మానవ భౌతిక ప్రపంచంలో అందరికీ కనబడని దాన్ని, రూపం లేని దాన్ని ధ్యానించటం కుదరదు. అలాంటివారు భౌతిక ప్రపంచంలోనే కూరుకుపోతారు. గాఢమైన తపననే భగవదారాధన అనుకుంటారు. తీవ్రమైన సంకుచితత్వానికి గురవుతారు. అందుకని భారతీయ ధర్మం భౌతిక ప్రపంచంలో, దేని పట్ల ఆకర్షణ ఉన్నా, కోరిక ఉన్నా, అది అనర్థదాయకమని, ఆధ్యాత్మిక ఎదుగుదలకు ప్రతిబంధకమని నిర్ద్వందంగా ప్రకటిస్తుంది. ఇలాంటి ధర్మం ‘స్త్రీ’ సౌందర్యాన్ని, స్త్రీ పై ప్రేమని భగవంతుడి ప్రేమతో సమానం చేసి లేదా అంతకన్నా ఎక్కువ చేసే ‘ఇష్క్’ అన్న ఆలోచనతో సహజీవనం చేయాల్సి వస్తే స్పందించిన విధానానికి, శ్రీవరుడు ‘ఇష్క్’ను ‘రాగ’కు సమానార్థకంగా భావించటంలో తెలుస్తుంది.

దేశంలో ఇతర ప్రాంతాలలో స్త్రీ పై ప్రేమను భగవంతుడిపై ప్రేమకు ప్రతీకగా, రహదారిగా భావించటానికి స్పందన పలు కథల వల్ల తెలుస్తుంది. ‘విశాల నేత్రాలు’ ఇందుకు చక్కని ఉదాహరణ. నశ్వరమైన సౌందర్యం కాదు, శాశ్వతము, అనంతమూ అయిన సౌందర్యం వైపు దృష్టి మరల్చటం వైపు సమాజం దృష్టిని సారించిందన్న మాట. ఇలాంటి కథలు భారతీయ వాఙ్మయంలో అంతకు ముందు లేవు. ఎంత సౌందర్యవతి అయినా స్త్రీని తిరస్కరించటానికే ప్రాధాన్యం. స్త్రీ సౌందర్యానికి లొంగితే ఎంతటి తపస్వి అయినా భ్రష్టు పట్టే గాథలున్నాయి. కానీ స్త్రీ పై ప్రేమను భగవదారాధనగా మరల్చే ‘విశాల నేత్రాలు’ వంటి కథలు గానీ, స్త్రీ పొందు కోసం వరదలో నదిని దాటి, పామును తాడనుకుని పైకి ఎగబ్రాకి ప్రేయసిని చేరే వెర్రి ప్రేమ ఒక్క మాటతో భగవంతుడి సౌందర్యారాధనగా మారి ‘రామచరిత్ మానస్’గా రూపుదిద్దుకోవటం, సమకాలీన సామాజిక పరిస్థితుల కనుగుణంగా భారతీయ ధర్మం నూతన గాథలను సృజించటం, పరిస్థితులకు తగ్గట్టు మారటాన్ని సూచిస్తుంది. ఇదే సమయానికి రాధాకృష్ణుల ప్రేమ ఆధ్యాత్మిక స్థాయిని చేరుకోవటం, ‘రాసలీల’ ఆధ్యాత్మిక కేళీ విలాసంగా బోధ పడటం వంటి పరిణామాలూ సమాజంలో చోటు చేసుకున్నాయి. ఇదంతా ‘ఇష్క్’ను భారతీయ సమాజం తనలో కలిపేసుకుని, తన కనువుగా మార్చుకోవటంలో భాగమే.

దేశంలోని ఇతర ప్రాంతాలలో ‘ఇష్క్’, ‘ప్రేమ’గా, భగవదారాధనకు స్త్రీ ప్రేమ తొలిమెట్టుగా, ‘భక్తి’, ‘ప్రేమ’ సమానార్థకాలుగా రూపొందుతున్న తరుణంలో కశ్మీరంలో శ్రీవరుడు వంటి వారు ‘ఇష్క్’ను కశ్మీరీ శైవ సిద్ధాంతం ప్రకారం ‘రాగ’కు సమానార్థకం చేశారు. ‘కథా కౌతుకమ్’కు పరిచయ శ్లోకాలలో శ్రీవరుడు సృష్టి ఆవిర్భవానికి శివుడిలో కలిగిన ‘రాగ’ భావన కారణం అన్నాడు.

నాస్తిలోకే పరం కించి శ్చితురాగం వినా పరమ్।
తత ఏవహి వైరాగ్యం జాయతే సుఖదం పునః॥
(కథా కౌతుకమ్, 49)

పరమాత్ముడిపై ప్రేమ (రాగ) తప్ప ప్రపంచంలో మరేమీ లేదు. అదే వైరాగ్యానికి దారి తీస్తుంది. అదే పరమానందాన్నిస్తుంది.

చిత్తాసక్తి వశివైవ స స్వయం భగవాచ్ఛివః।
శక్తయైవ సహ సంగస్య సర్వమేత దవాసృజత్॥
(కథా కౌతుకమ్, 50)

ఆకర్షణలను నియంత్రణలో ఉంచుకుని భగవంతుడిపై ప్రేమ భావనను నిలిపి అంటే ప్రేమనే శివుడిగా భావించాలి. శివుడు శక్తితో కలిసి ఈ సృష్టిని సృజించాడు. ‘కథా కౌతుకమ్’ అనువాదంలో ముల్లా జామి ప్రకారం సృష్టి ఆవిర్భావాన్ని అనువదించాల్సి వస్తుంది. అందుకని ఆరంభంలో, అనువాదానికి ‘ముందుమాట’ లాంటి పరిచయంలోనే శ్రీవరుడు శివుడు ప్రేమతో శక్తితో కలిసి సృష్టి చేశాడని ప్రకటించాడు. ప్రకృతి, పురుషుల్లా శివపార్వతులు సృష్టికి కారణమని, ఈ సృష్టి సర్వం ప్రేమ వల్ల అని ప్రకటించాడు. అయితే శ్రీవరుడు వాడిన పదం ‘రాగ’, ‘ప్రేమ’ కాదు. ఇప్పుడు మనం ‘ప్రేమ’ అని అనువదించుకుంటున్నాం కానీ ‘రాగ’, ప్రేమ కాదు. ‘రాగ’ అన్నది Passion. ‘రాగ’ అంటే ‘ఇష్టం’, ‘అభిరుచి’. ఇది భౌతిక భావన. సృష్టి ఒక వికారం. ఒక అసమతౌల్య స్థితి. ఆ వికారానికి కారణం ‘రాగ’ భావన. అంటే, ‘రాగ’ అన్నది ఒక వికారమే. దాన్ని నియంత్రించాలి. దాన్ని అధిగమించాలి. పర్షియన్ గాథలో దైవం లైలా రూపంలో వస్తేనే మజ్నూ కళ్ళు తెరిచి చూస్తాడు. లేకపోతే దైవాన్ని కూడా పట్టించుకోడు. భారతీయ ధర్మంలో అశాశ్వతమైన సౌందర్యం వదిలి, శాశ్వతమైన, అనంతమైన సౌందర్యం వైపు మళ్ళటం ఉంది. ఇది ధర్మం. చివరికి ఈ స్త్రీ ప్రేమ పైని వ్యామోహంలోని అనౌచిత్యాన్ని తెలిపి, అనర్థాన్ని అడ్డుకునేందుకు కర్తవ్యానికి పెద్ద పీట వేశారు. తల్లిదండ్రులకు సేవ చేస్తుంటే, భగవంతుడు వచ్చి పిలిచినా, ‘ఆగు’ అనే కర్తవ్య పరాయణతకు పెద్ద పీట వేసింది సమాజం. భగవంతుడు కూడా అతడి కర్తవ్య పాలనకు మురిసి అక్కడే నిలిచాడు. విఠలుడయ్యాడు. ఇది ‘ఇష్క్’కు భారతీయ సమాజ స్పందన. శ్రీవరుడికి ‘ఇష్క్’ను ‘రాగ’గా అనువదించేందుకు ‘విజ్ఞన భైరవ తంత్ర’ వంటి అభినవగుప్తుడి రచనలు దారి చూపించాయి.

కశ్మీరీ శైవం ప్రకారం సృష్టికి శివుడు కారణం. కానీ సృష్టి ఒక వికారం. భారతీయ ధర్మం ప్రకారం సృష్టికి ‘సిసృక్ష’ (కోరిక) కారణం. అంటే కశ్మీర శైవం ‘రాగ’ కారణం అంటుంది. అంటే సృష్టి భగవంతుడి అసలు రూపానికి భిన్నమయినది. అసమతౌల్యమయినది. ఇది అజ్ఞానం. ఈ అజ్ఞానం వల్ల జీవుడు తాను వేరు, శివుడు వేరు అనుకుంటాడు. కానీ అజ్ఞానం తొలగితే సత్యం గ్రహింపుకు వస్తుంది. శివైక్యం సిద్ధిస్తుంది. అజ్ఞానం తొలగాలంటే ‘యోగ’ సాధన అవసరం. ఈ యోగ సాధన ‘తంత్రం’ కూడా శివుడు బోధించాడు. తనకు ఏ విషయం ఆనందం కలిగిస్తుందో యోగి, ఆ విషయంపై దృష్టిని కేంద్రీకరించాలి. ఎందుకంటే ఆనందమే శివుడు. సౌందర్యమే శివుడు. సత్యం శివం సుందరం. ఈ శ్లోకం ఆధారంగా ఏది ఆనందం కలిగిస్తే దానిపై దృష్టి కేంద్రీకరించాలి. దాన్ని ధ్యానించాలి. దానిపై ఆకర్షణను, తీవ్రమైన వాంఛను పెంచుకోవాలి. శివైక్యానికి అది మార్గం కావాలి. అయితే భౌతికమైన దేదైనా ఆధ్యాత్మికపు ఎదుగుదలలో ప్రతిబంధకమే. కాబట్టి ఈ వాంఛను, కోరికను నియంత్రించుకోవాలి. అది అదుపులోకి రావటంతోటే శివైక్య లక్ష్య సాధనలో సోపానారోహణం వేగవంతమవుతుంది. శివుడు సైతం కామదేవుడి ప్రభావానికి గురయ్యాడు. కామదేవుడిని భస్మం చేశాడు. ‘కశ్మీరీ శైవ తంత్ర’లో ఈ తీవ్రమైన వాంఛకు, కోరికకు సమానార్థకం ‘రాగ’. రాగ మనస్సుపై, మెదడుపై ప్రభావం చూపిస్తుంది. ప్రపంచం మనకు ఎలా కనిపిస్తుందో నిర్దేశిస్తుంది. ఎంతగా అంటే, లైలానే భగవంతుడు అనేంతగా! ఈ ‘రాగ’ భావనను వెన్నంటి తీవ్రస్థాయికి చేరి, ఈ తీవ్రమైన భావన ఎక్కడ ఆరంభమయింది, ఎలా ఆరంభమయిందో శోధిస్తే ఈ రాగ భావన భగవంతుడి ‘పరిమిత శక్తి’ మాత్రమే అని అర్థమవుతుంది. ఎందుకంటే ఈ సృష్టి సర్వం భగవంతుడి అపరిమిత శక్తిలో సహస్రాంశం మాత్రమే. సృష్టి రూపంలో ద్యోతకమయ్యేది పరిమిత శక్తి మాత్రమే. ఈ పరిమితమైన శక్తిలో ‘రాగ’ అన్నది ఒక అంశం మాత్రమే. ఇది భగవంతుడి ‘ఇచ్ఛాశక్తి’ . ఇది గ్రహించిన మానవుడు తన ‘ఇచ్ఛాశక్తి’ని జాగృతం చేసి ‘రాగ’ భావనను రూపాంతరం చెందించాలి, ఆధ్యాత్మిక భావనగా. శివగాథలలో శివుడు జూదంపై, సురాపానంపైన తన ‘రాగ’ భావనను, ప్రపంచంలోని ‘భయ’ భావనను అధిగమించే భావనగా రూపాంతరం చెందించిన గాథలున్నాయి. కశ్మీరంలో ప్రచారంలో ఉన్న బౌద్ధంలో కూడా ‘రాగ’ భావన క్లేశ కారణం. విముక్తి మార్గానికి ప్రతిబంధకం. ఇది శ్రీవరుడికి తెలుసు. ఒక వ్యక్తిపై ప్రేమ ఆధ్యాత్మిక భావనగా రూపాంతరం చెందటం అన్నది మామూలు భౌతిక ప్రపంచంలో సాధ్యం కాదు. దిగజార్చేది దైవ భావన కాదు. ఆధ్యాత్మిక పథంలో పురోగమింపజేసేది దైవ భావన. కాబట్టి ‘ఇష్క్’ను అత్యున్నత ఆధ్యాత్మిక భావనగా ప్రదర్శించటం శ్రీవరుడికి ఆమోదయోగ్యం కాదు. కానీ ‘అనువాదం’ అన్నప్పుడు మూల రచయిత భావనకు భిన్నంగా ప్రదర్శించకూడదు. అందుకని, శ్రీవరుడు ‘రాగ’ అన్న పదాన్ని ఎంచుకున్నాడు. ‘రాగ’ అన్న పదం పైపైన చూస్తే తీవ్రమైన వాంఛ. శివ భావనతో చూస్తే, శివుడిని చేరుకునేందుకు ఒక మెట్టు. ‘ఇష్క్’ అన్న భావనను ‘రాగ’గా అనువదించటం వల్ల శ్రీవరుడు భావితరాలకు హెచ్చరిక చేస్తున్నాడన్న మాట. భౌతిక ప్రేమ భావనను సర్వస్వంగా భావించకూడదని సున్నితంగా సూచిస్తున్నాడన్న మాట. కానీ పలు కారణాల వల్ల కాలక్రమేణా భారతీయ సమాజం శ్రీవరుడి హెచ్చరికను పట్టించుకోలేదు. శ్రీవరుడే కాదు, మధ్యయుగంలోని మహాత్ములెందరో చేసిన సూచనలను, హెచ్చరికలను విస్మరించింది. ‘భక్తి’ అన్న పదం క్రిందకు తోసేసింది. దాంతో ప్రస్తుతం మన సమాజాన్ని ‘ప్రేమ’ ఒక ‘వైరస్’లా పట్టి పీడిస్తోంది. జీవితాలను నాశనం చేస్తోంది. ఇదంతా ఊహించినట్టే కాబోలు, ఆ కాలంలోని కవులు, మేధావులు, తత్త్వవేత్తలు ‘ఇష్క్’కు ఆధ్యాత్మిక రంగు పూయాలని ప్రయత్నించారు.

‘కథా కౌతుకమ్’ అనువాదం అందుకే అత్యంత ప్రాధాన్యం వహిస్తుంది. సంస్కృత సాహిత్య చరిత్రలో ‘కథా కౌతుకమ్’ పలు విభిన్నమైన కోణాలలో భారతీయ సమాజాన్ని, తాత్త్విక చింతనను, మానసిక వ్యవస్థను, చరిత్రను తెలుసుకునే వీలు కల్పిస్తుంది. ‘హిస్టరీ ఆఫ్ ఇండియన్ లిటరేచర్, మూడవ భాగం’లో ఎం. వింటర్నిజ్, కథా కౌతుకం is an ‘amalgamation of the Hebrew story, Persian romantic ballad and the Indian Siva cult’ అని అన్నాడు. కానీ ఇస్లాం ప్రభావంతో భారతీయ ధర్మం రూపురేఖలను తీర్చిదిద్దుకునే విధానాన్ని ప్రదర్శించిన రచనగా అర్థం చేసుకోలేదు. ఈ దృష్టిలో ‘కథా కౌతుకమ్’ను ఇంతవరకూ ఎవరూ అధ్యయనం చేయలేదు.

‘కథా కౌతుకమ్’ రచన తరువాత కశ్మీరు చరిత్ర నుంచి శ్రీవరుడు అదృశ్యం అయిపోతాడు. అతడివి కానీ, అతని వారసులవి కానీ ఎలాంటి వివరాలు లభించలేదు. ఆనవాళ్ళు లేవు. అతని మరణం గురించి తెలియదు. కనీసం ఎప్పుడు మరణించాడో కూడా తెలియదు. అతని వారసులు కశ్మీరు వదిలి దేశంలోని ఇతర ప్రాంతాలలో స్థిరపడ్డారో, లేక కశ్మీరులోనే ఉండి తమ ధర్మాన్ని నిలుపుకున్నారో, మతం మారిపోయరో కూడా తెలియదు. శ్రీవరుడి కాలం తరువాత కశ్మీరు రాజకీయంగా అల్లకల్లోలమైంది. ఇస్లామీయులలోనే వారి నమ్మకాల ఆధారంగా, వారి పద్ధతుల ఆధారంగా అధికారం కోసం పోరు సాగింది. కశ్మీరుకు చెందిన ఇస్లామీయులకు, ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చిన ఇస్లామీయులకు నడుమ అధికారం కోసం పోరు సాగింది. ఈ పోరులో అఫ్ఘన్లు ప్రవేశించారు. ‘చాక్’లు దూరారు. వీరందరి నడుమ భారతీయులు నలిగారు.

ఈ అల్లకల్లోల సమయంలో ప్రజ్ఞాభట్టు నాలుగవ రాజతరంగిణి ‘రాజావళిపతాక’ను రచించాడు. శ్రీవరుడి రాజతరంగిణి క్రీ.శ.1459 నుండి క్రీ.శ. 1486 వరకూ కశ్మీరు చరిత్రను ప్రదర్శిస్తుంది. ప్రజ్ఞాభట్టు తన రాజతరంగిణి కొనసాగింపును క్రీ.శ.1486 నుండి క్రీ.శ. 1513 వరకూ కొనసాగించాడు. ప్రజ్ఞాభట్టు గురించి ఏమీ తెలియదు. చివరికి అతను రచించిన ‘రాజావళిపతాక’ కూడా లభ్యం కావటం లేదు. అతడు రాజతరంగిణిని కొనసాగించాడన్న విషయం కూడా అతడి శిష్యుడు ‘శుకుడి’ వల్ల తెలిసింది.

ప్రజ్ఞాభట్టు ‘రాజావళిపతాక’ను ఎక్కడ ఆపాడో, అక్కడి నుంచి దాన్ని అతని శిష్యుడు ‘శుకుడు’ కొనసాగించాడు. క్రీ.శ. 1513 నుండి క్రీ.శ. 1582 వరకూ కశ్మీర చరిత్ర రచనను కొనసాగించాడు. శుకుడు తన ‘రాజావళిపతాక’ కొనసాగింపు ఆరంభంలో ప్రజ్ఞాభట్టు రాసిన రాజుల చరిత్ర సారాన్ని పొందుపరిచాడు. దానివల్ల ప్రజ్ఞాభట్టు రాజతరంగిణిని కొనసాగించాడని తెలుస్తోంది. కొందరు పండితులు ప్రజ్ఞాభట్టు, శుకుడు కలిసి రాజతరంగిణిని కొనసాగించారని భావిస్తారు. ఏది ఏమైనా కశ్మీరు ఆవిర్భావం నుంచి కశ్మీరు చరిత్రను ప్రదర్శించే రాజతరంగిణి రచన క్రీ.శ. 1582 వరకూ కొనసాగింది. క్రీ.శ. 1582లో మొఘలు సుల్తాన్ అక్బరు కశ్మీరులో దాల్ సరస్సులో నౌకా విహార వర్ణనతో ‘రాజతరంగిణి’ రచన సంపూర్ణమవుతుంది. ఆ తరువాత పర్షియన్ చరిత్రకారులు, మొఘల్ చరిత్రకారులు కశ్మీరు చరిత్రను రచించారు. కానీ కశ్మీరు స్వతంత్ర రాజ్యంగా కాక, మొఘలుల పాలనలోని ఓ విభాగంగా మాత్రమే కొనసాగింది. తన ప్రత్యేకతను కోల్పోయింది.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here