కశ్మీర రాజతరంగిణి-31

3
7

[box type=’note’ fontsize=’16’] కశ్మీర్ ప్రాచీన చరిత్ర గురించి అవగాహన కలిగించి, భవిష్యత్తు గురించి ఆలోచనలు కలిగించాలన్న ప్రయత్నంలో భాగంగా నీలమతపురాణం తరువాత అందిస్తున్న జోనరాజు, శ్రీవరుడు, ప్రజ్ఞాభట్టులు కల్హణుడి అడుగుజాడల్లో నడుస్తూ సంస్కృతంలో రచించిన ‘కశ్మీర రాజతరంగిణి’ అనువాదాన్ని తెలుగు పాఠకులకు అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ. [/box]

శ్రీ గోనంద ముఖైర్ధర్మ సమ్ముఖైరా కలౌః కిల।
కశ్మీర కాశ్యపీ భూపైరపాలీ గుణ శాలిభిః॥
(జోనరాజ రాజతరంగిణి 3)

[dropcap]శ్రీ[/dropcap] గోనందుడు ఇతర గొప్ప ధర్మపరులైన రాజులు కలియుగారంభం నుంచి కశ్మీర సామ్రాజ్యాన్ని పాలించారు.

పార్వతి పరమేశ్వరులు అనురాగంతో చెరి అర్ధ భాగాలు కలిసి ఏకమయ్యారు. వారి మిగతా అర్ధ భాగాలు, కలవలేకపోయాయన్న విచారంతో, ముల్లోకాల ప్రజల ఆరాధనలు అందుకుంటున్నా, అదృశ్యమయ్యాయి. ఏకమైన శివపార్వతులు భక్తులకు సుఖసంతోషాలు ప్రసాదించు గాక, విఘ్ననాయకుడు విఘ్నాలు తొలగిస్తూ అందరికీ ప్రతీ రోజూ ఆనందం పంచుతుండాలి.

ఇది జోనరాజు రాజతరంగిణిని ఆరంభిస్తూ రాసిన తొలి రెండు శ్లోకాలు. తన పూర్వీకులు పాటిస్తున్న సాంప్రదాయాన్ని అనుసరిస్తూ దైవ ప్రార్థనతో రాజతరంగిణి ఆరంభించాడు జోనరాజు. వెంటనే కథలోకి దిగిపోయాడు. రాజతరంగిణిలోలా కశ్మీరు ఆవిర్భావం నుంచి కశ్మీరు చరిత్ర చెప్పకుండా, తిన్నగా కలియుగం నుంచి కశ్మీరును గోనందుడితో సహా అనేక మహారాజులు రాజ్యం చేశారు అంటూ కశ్మీర రాజుల చరిత్ర చెప్పటం ప్రారంభించాడు జోనరాజు. అయితే జోనరాజు రాజతరంగిణిని అనువాదం చేసేప్పుడు ఒక సమస్య వస్తుంది.

‘కల్హణ రాజతరంగిణి’ తెలుగు సాహిత్య ప్రియులకు, కశ్మీరు చరిత్ర పట్ల ఆసక్తి ఉన్నవారికి పరిచయం. సామాన్య పాఠకులకు కానీ, అధిక సంఖ్యాకులకు కానీ అంతగా పరిచయం లేదు. కల్హణ రాజతరంగిణిని ఆంగ్లంలోకి తొలిసారిగా అనువదించిన జగదీశ్ చంద్ర దత్ (1879, 1887) జోనరాజు, శ్రీవరుడు, ప్రజ్ఞాభట్టు, శుకుల రాజతరంగిణిలను కూడా ఆంగ్లంలోకి అనువదించాడు. అది జూలై 1898లో ప్రచురితమయింది. అందరి దృష్టి కల్హణ రాజతరంగిణిపై కేంద్రీకృతమై ఉండడంతో ఇతరుల రాజతరంగిణిని ఎవరూ అంతగా పట్టించుకోలేదు. దాంతో ఇప్పటికీ ఆంగ్లంలో జోనరాజుతో సహా ఇతరుల రాజతరంగిణి అనువాదం అంటే జగదీశ్ చంద్ర దత్ అనువాదమే. ఇతని అనువాదం కాక వాల్టెర్ స్లాజే చేసిన వ్యాఖ్యానాలు ప్రస్తుతూం అందుబాటులోవున్నాయి. హిందీలో ఇతరుల రాజతరంగిణి అనువాదాలు లభిస్తున్నాయి. కానీ అవి కూడా స్వాతంత్ర్య పూర్వం చేసిన అనువాదాలే తప్ప, స్వాతంత్ర్యం సాధించిన తరువాతవి కావు.

తెలుగులో కొచ్చెర్లకోట రామచంద్ర వేంకట కృష్ణారావు రాజతరంగిణిలో ఏడు తరంగాలకు వచనానువాదం చేశారు. కోట వేంకటాచలం గారు కల్హణ రాజతరంగిణి ఆధారంగా కశ్మీరు చరిత్రను, భారతీయ రాజుల కాల నిర్ణయాన్ని చేశారు. వాటి ఆధారంగా విశ్వనాథ సత్యనారాయణ గారు కశ్మీర రాజవంశ నవలలు (6), నేపాళ రాజవంశ నవలలు (5) రాశారు. పిలకా గణపతి శాస్త్రి గారు పది కథలు ఒక నవల రాశారు. పిలకా గణపతి శాస్త్రి గారు కల్హణ రాజతరంగిణిలోని అయిదు తరంగాలను గద్య రూపంలో అనువదించారు. ఎనిమిదవ తరంగం వరకూ లక్ష్మణ చక్రవర్తి అనువదించి ఆ అనువాదాన్ని పూర్తి చేశారు. రెండుచింతల లక్ష్మీనారాయణ శాస్త్రి అత్యద్భుతంగా పద్యాల రూపంలో రాజతరంగిణి ఎనిమిది తరంగాలను అనువదించారు. స్వయంపాకుల వేంకట రమణ శర్మ గారు ‘శ్రీ రాజతరంగిణి’ పేరిట ఏడు తరంగాలను చంపూ కావ్యంగా అనువదించారు. తెలకపల్లి విశ్వనాథ శర్మ గారు మూడు తరంగాలను సవ్యాఖ్యాన సహితంగా గద్య రూపంలోకి అనువదించారు. కస్తూరి మురళీకృష్ణ ‘కల్హణ కశ్మీర రాజతరంగిణి కథలు’ పేరిట 15 కథలలో కల్హణ రాజతరంగిణి లోని ప్రధాన ఘట్టాలను historical fiction రూపంలో రచించారు (నాకు తెలిసి రాజతరంగిణి తెలుగు రూపాలు ఇవి. తెలియనివి ఎవరైనా తెలియజేస్తే, పుస్తక రూపంలో వచ్చేటప్పుడు తెలిపిన వారి పేరు ప్రస్తావిస్తూ వాటిని కూడా ఇక్కడ జత చేస్తాను).

ఈ అనువాదాలు, కథలు, నవలలు అన్నీ కల్హణ రాజతరంగిణికి సంబంధించినవే. ఇతరులు కొనసాగించిన రాజతరంగిణుల గురించి తెలుగులో ప్రస్తావనలు అతి తక్కువ. కస్తూరి మురళీకృష్ణ రచించిన ‘ఉజ్జ్వల భారత మహోజ్జ్వల గాథలు’ అన్న32 historical fiction కథలలో ఒక కథ ‘రాజతరంగిణి రచన కొనసాగించిన జోనరాజు’ అన్న కథ ద్వారా తెలుగు కథల్లో తొలిసారిగా జోనరాజు ప్రస్తావన చేశారు. ఈ కథలో జోనరాజు రాజతరంగిణిని కొనసాగించేందుకు కారణాన్ని చారిత్రక సత్యాల ఆధారంగా వివరించారు.

~ ~

సుల్తాన్ కోరిక విని చిరునవ్వుతో ఆమోదం తెలిపాడు జోనరాజు. “మీరు కోరినట్టు కశ్మీరు రాజుల చరిత్రను కొనసాగిస్తాను. కానీ నాదొక విన్నపం ప్రభూ”

“ఏమిటది?” అడిగాడు సుల్తాన్.

“చరిత్ర మిమ్మల్ని ఎలా గుర్తుపెట్టుకోవాలని ఉంది?”

“అంటే?”

“అంటే, క్రూరుడిగా, ఇస్లామేతరులను హింసించి, నాశనం చేసిన కర్కోటకుడిగా, విగ్రహాలను నాశనం చేసిన వాడిలా భావి తరాలు గుర్తుంచుకోవాలని ఉందా? లేక, సమర్థుడై, పరమత సహనంతో అందరు ప్రజలకూ శాంతియుత జీవనం ప్రసాదించిన గొప్ప రాజులా చరిత్రలో మిగిలిపోవాలని ఉందా?”

“చరిత్ర నన్ను గొప్పవాడిలా, న్యాయబద్ధమైన రాజులా గుర్తుంచుకోవాలి.”

“అలాగయితే… ప్రభూ… ఇస్లామేతరులపై హింస ఆపండి. మందిరాల ధ్వంసం ఆపండి. కశ్మీరు వదిలి పారిపోయిన వారిని పిలిపించండి. బ్రాహ్మణులకు వారి అగ్రహారాలు ఇప్పించండి. ఎవరి ధర్మాన్ని వారు అనుసరించే స్వేచ్ఛను ప్రసాదించండి. అప్పుడు మనస్ఫూర్తిగా మీ గొప్పతనం గురించి రాస్తాను.”

“లేకపోతే…?”

“దోషమంతా మీ సలహాదారులకు అంతగట్టి, మీరు మంచివారేనని రాస్తాను. చివరలో రాజు ఎంత మంచి వాడయినా సేవకుల దోషం నుంచి రాజు తప్పించుకోలేడని రాస్తాను.”

సుల్తాన్ చాలా సేపు ఆలోచించాడు. తరువాత జోనరాజును చూసి నవ్వాడు.

(ఉజ్జ్వల భారత మహోజ్జ్వల గాథలు, పేజి నెం. 196-197)

~ ~

జోనరాజు ఇదే చేశాడు. సుల్తాన్ జైనులాబిదీన్‌ను మనస్ఫూర్తిగా పొగిడేడు. అతని తండ్రి ‘సికిందర్ బుత్‌షికన్’ దోషాలకు మంత్రి సుహాభట్టును దోషిగా నిలిపాడు. తెలుగులో తొలిసారి ‘జోనరాజు’ ఆధారంగా రాసిన historical fiction కథ ఇది. జోనరాజు, శ్రీవరుడు, ప్రజ్ఞాభట్టు, శుకుల రాజతరంగిణి తొలి అనువాదం కూడా ఇదే. కాబట్టి, కశ్మీరు ప్రాచీన చరిత్రతో తెలుగు వారికి అంతగా పరిచయం ఉండదన్న భావనతో జోనరాజు రాజతరంగిణి అనువాదం కన్నా ముందు కల్హణుడి రాజతరంగిణిలో ప్రదర్శితమైన కశ్మీరు చరిత్రను జోనరాజు ఆరంభించిన కాలం నాటి వరకూ టూకీగా ప్రస్తావించుకోవాల్సి ఉంటుంది. జోనరాజు, కలియుగారంభం నుంచి గోనందాదిగా ఉన్న రాజులని ఒకమాటలో కల్హణుడు రచించిన రాజుల చరిత్రను ప్రస్తావించి తిన్నగా సుస్సలుడి కాలం కథ ఆరంభిస్తాడు.

కల్హణుడు మొత్తం 3698 సంవత్సరాల చరిత్రను 7830 శ్లోకాలలో రచించాడు. జోనరాజు 300 సంవత్సరాల చరిత్రను 976 శ్లోకాలలో ప్రదర్శించాడు. శ్రీవరుడు 27 సంవత్సరాల చరిత్రను 2241 శ్లోకాలలో పొందుపరిచాడు. ప్రజ్ఞాభట్టు ‘రాజపతాకావళి’ ప్రతులు లభ్యం కాకపోవటంతో ఆయన ఎన్ని శ్లోకాలు రచించాడో తెలియదు. శుకుడు 25 సంవత్సరాల కశ్మీరు చరిత్రను 398 శ్లోకాలలో రచించాడు. కల్హణుడు కశ్మీరు ఆవిర్భావం నుంచి క్రీ.శ. 1149 వరకు కశ్మీరు చరిత్రను రచించాడు. అంటే, ఆయన రచించిన చరిత్ర అధిక శాత్రం పరిశోధించి తెలుసుకున్నదే. మిగతావారు అధికశాతం తాము అనుభవించినదాన్నే చరిత్ర రూపంలో రచించారు.

జోనరాజు క్రీ.శ. 1398 నుండి 1459 వరకు అంటే 61 ఏళ్ళు జీవించాడు. ఆయన ప్రదర్శించిన 300 ఏళ్ళ చరిత్రలో 61 ఏళ్ళ చరిత్రకు అంటే 20 శాతం సంఘటనలకు ఆయన ప్రత్యక్ష సాక్షి. శ్రీవరుడు 1459 నుండి 1486 వరకూ, ప్రజ్ఞాభట్టు 1486 నుండి 1513 వరకూ, శుకుదు 1613 నుండి 1638 వరకూ కశ్మీరు చరిత్రను తమ రాజతరంగిణిలో పొందుపరిచారు. అంటే వారు ప్రదర్శించిన చరిత్రలో కొంత భాగానికి వారు ప్రత్యక్ష సాక్షులు. మిగతా భాగం వారి జీవిత కాలానికి మరీ దూరం కాదు. కాబట్టి వారు ప్రదర్శించిన చరిత్రను వారి దృక్కోణం నుంచీ అర్థం చేసుకుంటే సరైనది గానే భావించవచ్చు. అందుకే ఆ కాలం నాటి పరిస్థితులను విపులంగా వివరించాల్సి వచ్చింది.

“There is however no reason to disbelieve the correctness of their accounts, irrespective of writer’s views regarding the events narrated.” – (J. C. Dutt, Preface to Jona Raja Rajataragini)

వారి పరిధిలో వారు చరిత్రను నిజాయితీగా, నిర్మొహమాటంగా, నిక్కచ్చిగా రాశారు. కల్హణ రాజతరంగిణి ప్రాధాన్యం తెలిసిందే. కానీ మిగతా రాజతరంగిణి రచనలు కూడా భారతదేశ చరిత్రను అర్థం చేసుకోవడంలో అత్యంత ప్రాధాన్యాన్ని వహిస్తాయి. ఇస్లామీయులు భారతదేశంలో ప్రవేశించిన తరువాత భారతీయ సమాజంలో సంభవించిన అనేక పరిమాణాలకు ప్రత్యక్ష సాక్ష్యాలు ఈ రచనలు. ఇలాంటి రచనలు దేశంలో ఇతర ప్రాంతాలకు సంబంధించినవి లభించకపోవటం వల్ల ఇవి అత్యంత ప్రాధాన్యాన్ని వహిస్తాయి.

జోనరాజు, శ్రీవరుడు, ప్రజ్ఞాబట్టు, శుక వంటి వారంతా సుల్తానుల పాలనా కాలంలోని వారు. సుల్తానుల దయాదాక్షిణ్యాలపై ఆధారపడి బ్రతికినవారు. ముంచెత్తే ఇస్లాం సముద్రం నడుమ బిక్కుబిక్కుమంటూ తమ అస్తిత్వాన్ని కాపాడుకున్న చిన్న చిన్న ద్వీపాల లాంటి వారు. కాబట్టి, వీరి రచనల్లో సుల్తానులను ఆకాశానికి ఎత్తేయటం, పూర్వ రాజుల కన్నా సుల్తానులే గొప్పవారని రాయటం, ఒకోసారి భారతీయ దైవాల కన్నా సుల్తానులే గొప్ప అన్నట్టు రాయటం వంటి విషయాలను అర్థం చేసుకుని చిరునవ్వుతో వాటిని వదిలేయాల్సి ఉంటుంది. అనేక సందర్భాలలో పైకి కనిపిస్తున్న పదాల అర్థాల మాటున దాగిన కవి హృదయావేదనను, అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అంటే, ఈ రాజతరంగిణి రచనలను కేవలం ప్రతిపదార్థ తాత్పర్యాలుగా కాక, అక్షరాల వెనుక ఒదిగిన అర్థాలను గ్రహించే ప్రయత్నం చేయాలన్న మాట. ఈ ప్రయత్నం చేయాలంటే కేవలం ఆయా కవుల కాలం నాటి పరిస్థితులు మాత్రమే పరిగణనలోకి తీసుకుంటే సరిపోదు. గతకాలం చరిత్రను తెలుసుకోవాల్సి ఉంటుంది. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మారుతున్న జీవన విధానం, దాని కనుగుణంగా మారుతున్న వ్యక్తిగత, సామాజిక మనస్తత్వాలు, వంటివి పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది.

పలువురు పండితులు కశ్మీరును భారత్ లోని ఇతర ప్రాంతాలకు భిన్నం అని నిరూపించి, కశ్మీరును ప్రత్యేకంగా నిలపాలని ప్రయత్నించారు, కానీ కశ్మీరు భారత్‍లో అంతర్భాగం. ఇతర ప్రాంతాలలో సంభవిస్తున్న ఏ పరిణామానికీ కశ్మీరు స్పందించకుండా లేదు. ఆ పరిణామాల ప్రభావం కశ్మీరుపై లేకుండా లేదు. కాబట్టి రాజతరంగిణి అనువాదంలో ఈ అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుని వ్యాఖ్యానించుకోవాల్సి ఉంటుంది. అందుకని జోనరాజు రాజతరంగిణి అనువాదం ఆరంభం కన్నా ముందు వీలయినంత టూకీగా కల్హణుడు రాసిన 3698 సంవత్సరాల కశ్మీరు చరిత్రను ప్రస్తావించవలసి ఉంటుంది. అప్పుడు జోనరాజు రాజతరంగిణి రచనలో ఎదుర్కున్న ఇబ్బందులు, అతడి మానసిక స్థితి, అప్పటి సామాజిక స్థితిగతులు వంటి విషయాలను అర్థం చేసుకోవటం సులభం అవుతుంది. అయితే కల్హణుడి రాజతరంగిణి అనువాదాలు తెలుగులో అందుబాటులో ఉన్నా, అవి సాంతం చదివి, జోనరాజును చదవటం ఆరంభించటం కష్టం కాబట్టి కల్హణ రాజతరంగిణిలోని ప్రధానాంశాలను స్పృశిస్తూ ముందుకు సాగాల్సి ఉంటుంది (కల్హణ రాజతరంగిణిని 15 కథలలో ప్రదర్శించిన ‘కల్హణ కశ్మీర రాజతరంగిణి కథలు’ చదివితే కూడా కశ్మీరు ప్రాచీన చరిత్రపై సమగ్రమైన అవగాహన వస్తుంది).

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here