కశ్మీర రాజతరంగిణి-32

3
7

[box type=’note’ fontsize=’16’] కశ్మీర్ ప్రాచీన చరిత్ర గురించి అవగాహన కలిగించి, భవిష్యత్తు గురించి ఆలోచనలు కలిగించాలన్న ప్రయత్నంలో భాగంగా నీలమతపురాణం తరువాత అందిస్తున్న జోనరాజు, శ్రీవరుడు, ప్రజ్ఞాభట్టులు కల్హణుడి అడుగుజాడల్లో నడుస్తూ సంస్కృతంలో రచించిన ‘కశ్మీర రాజతరంగిణి’ అనువాదాన్ని తెలుగు పాఠకులకు అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ. [/box]

అష్ట షష్ట్యాధి కామబ్ద శత్ద్వా వింశతిం నృపాః।
అపీ పలం స్తే కశ్మీరాన్ గోనందాద్యాః కలౌయుగే॥
భారతం ద్వాపరాన్తే భూద్వార్తయేతి విమోదితాః।
కేచిదేతామ్ మృషాతేషామ్ కాల సంఖ్యాం ప్రచక్రిదే॥
(కల్హణ రాజతరంగిణి, 48-49)

[dropcap]మ[/dropcap]హాభారత యుద్ధం ద్వాపరాంతంలో జరిగిందని కొందరు పొరపాటుగా భావిస్తారు. గోనందుడు, ఇతర రాజులు కశ్మీరును కలియుగంలో 2268 ఏళ్ళు పాలించారు.

కల్హణుడు రాజతరంగిణి ఆరంభంలో శివపార్వతులను ధ్యానిస్తాడు. గతాన్ని సజీవంగా భవిష్యత్తు తరాలకు అందించగలిగే కవుల ప్రజ్ఞను అభినందిస్తాడు. కవులకు దివ్యదృష్టి ఉంటుందని వ్యాఖ్యానిస్తాడు. కశ్మీరు ఆవిర్భావాన్ని వివరిస్తాడు. కశ్మీరు ప్రాశస్త్యాన్ని, పవిత్రతను వర్ణిస్తాడు. ఇకపై రాజతరంగిణి రచన ఆరంభిస్తాడు.

భారతీయులకు చారిత్రక స్పృహ లేదనేవారు ప్రతి కావ్యంలో, ప్రతి గ్రంథంలో తమ రచనా కాలాన్ని విధిగా ప్రస్తావించే సాంప్రదాయాన్ని గమనించాలి. ఆ సాంప్రదాయాన్ని అనుసరించి కల్హణుడు కశ్మీరు ఆవిర్భావం నుంచి కథ చెప్పడం ఆరంభించాడు. కలియుగం నుంచి కాలగణన ప్రారంభించాడు. కలియుగంలో 2268 ఏళ్ళు గోనందుడు, ఇతర రాజులు కశ్మీరును పాలించారని చెప్తాడు. కల్హణుడు ఎంత ప్రయత్నించినా 52 మంది రాజుల వివరాలు లభించలేదు. ఇతర గ్రంథాల నుండి, ఏయే గ్రంథం నుండి ఎంతమంది రాజుల వివరాలను తాను గ్రహించాడో కూడా చెప్తాడు. అలా నీలమత పురాణం నుంచి నలుగురు, పార్థివావళి నుంచి ఎనిమిది మంది, ఛవిల్లకారుడి నుండి అయిదుగురి పేర్లు గ్రహించడంతో అసలు వివరాలు తెలియని రాజులు 35 మందిగా మిగిలారని అంటాడు.

ఇక్కడ మహాభారత యుద్ధం ద్వాపరాంతంలో జరిగిందని పలువురు పొరపాటుగా భావిస్తారని కల్హణుడు అనటం, ఆ కాలం నుంచే పురాణాల కాలగణన విషయంలో భేదాభిప్రాయాలు ఉండేవని తెలుస్తుంది. అయితే ఈ వాదవివాదాలు మనకు అప్రస్తుతం కాబట్టి కల్హణుడి కాలగణనను అనుసరిస్తూ వీలయినంత సంక్షిప్తంగా కల్హణుడి రాజతరంగిణిలోని ప్రధానాంశాలను ప్రస్తావిస్తూ ముందుకు సాగాల్సి ఉంటుంది.

కలియుగంలో 653 ఏళ్ళ సమయంలో భూమిపై కౌరవులు, పాండవులు జీవించారు. ప్రసుత్తం లౌకికాబ్దంలో 24వ సంవత్సరం నడుస్తోంది. శక సంవత్సరం ప్రకారం 1070 సంవత్సరాలు గడిచాయి. మూడవ గోనందుడి కాలం నుంచి 2330 సంవత్సరాల కాలం గడించింది. కాబట్టి తనకు దొరకని 52 రాజుల పాలనా కాలం 1266 సంవత్సరాలని కల్హణుడు నిర్ణయించాడు. ఇలా నిర్ణయించడానికి ఋజువుగా వరహామిహిరుడి ‘బృహత్సంహిత’ నుంచి శ్లోకాన్ని ఉదాహరణగా చూపించాడు.

ధర్మరాజు రాజ్యం చేస్తున్న కాలంలో సప్తర్షులు మఖా నక్షత్రంలో ఉన్నారు. శక సంవత్సర గణన ప్రారంభానికి ముందు 2526 సంవత్సరాల ముందు ధర్మరాజు పాలన భూమిపై ఉండేది.

ఈ శ్లోకం ఆధారంగా కల్హణుడు చేసిన కాలగణన సరైనదేనని పండితులు నిర్ణయించారు. ‘రాజతరంగిణి’పై సాధికారికంగా ప్రామాణికమైన గ్రంథం రచించిన ఎం.ఎ. స్టెయిన్ కూడా కల్హణుడి గణన సరైనదేనని తీర్పునిచ్చాడు.

శక సంవత్సరంలో గడిచిన సంవత్సరాలు 1070, కలియుగం సంవత్సరాలు 3179. మొత్తం 4249 సంవత్సరాలు. గోనందుడి నుండి యుధిష్టరుడి వరకూ కాలం 2268 సంవత్సరాలు,  రెండవ తరంగం నుంచి ఎనిమిదవ తరంగం వరకూ రాజుల పాలనా కాలం 1328 సంవత్సరాలు. కలియుగంలో గోనందుడి పాలనా కాలం 653 సంవత్సరాలు. మొత్తం 4249 సంవత్సరాలు.

పాశ్చాత్యులు కల్హణుడి లెక్కలను ఆమోదించారు. కల్హణుడు వరాహమిహిరుడు ఖగోళశాస్త్రం ఆధారంగా చూపిన లెక్కలను నమ్మి, ఆ లెక్కల ఆధారంగా కాలాన్ని గణించాడు. పాశ్చాత్యుల ప్రభావంతో మన శాస్త్రాలపై మనం నమ్మకం కోల్పోయాం. జ్యోతిషం పనికిరానిదని నిశ్చయించుకున్నాం. గ్రహాల గతులు, ఖగోళ లెక్కలు అన్నీ అశాస్త్రీయం అని వాటిపై బురద జల్లుతున్నాం. గ్రహాలపైకి బురద విసరటం ఎంత వైజ్ఞానికమో, అంత గొప్పగా మనల్ని మనం విజ్ఞానవంతులనుకుని, ఇతరులంతా అజ్ఞానులని వారిని విజ్ఞానవంతులుగా చేయాలని తహతహలాడుతున్నాం. కుండెడు పాలను కూడా ఒక చుక్క విషం వ్యర్థం చేస్తుందన్న దానిలోని సత్యాన్ని విస్మరిస్తూ మనదైన విజ్ఞానాన్ని కోల్పోతున్నాం. కోట వెంకటాచలం గారు ‘బృహత్సంహిత’ లోని ఈ శ్లోకం ఆధారంగా మహాభారత యుద్ధకాల నిర్ణయం, కశ్మీర చరిత్ర కాల నిర్ణయం చేశారు.

ఇక నుంచి కశ్మీరు చరిత్ర ఆరంభమవుతుంది.

శ్రీకృష్ణుడికి జరాసంధుడికి వైరం. జరాసంధుడు మధురానగరిని ముట్టడించటానికి ససైన్యంగా వెళ్తూ, స్నేహితుడైన గోనంద మహారాజుని సహాయంగా రమ్మంటాడు. గోనందుడు పెద్ద సైన్యం తీసుకుని మధురానగరి ముట్టడిలో పాల్గొంటాడు. కశ్మీర, యాదవ సైన్యాల నడుమ ఘోరమైన పోరు జరుగుతుంది. తన సైన్యం చెల్లాచెదురవటం గమనించిన బలరాముడు గోనందుడితో తలపడతాడు. ఇద్దరి మధ్య పోరు ఘోరంగా సాగుతుంది. గెలుపు ఎవరిదో అన్న ఉత్కంఠ కలుగుతుంది. అయితే అనేక శస్త్రఘాతాలతో కశ్మీర రాజు శరీరం ఛిన్నాభిన్నమవుతుంది. ఆయన మరణిస్తాడు.

కృష్ణుడున్నాడా? జరాసంధుడు ఉన్నాడా? ఇదంతా కట్టుకథ అనేవారికి నమస్కరిస్తూ కల్హణుడు వెలుగు పరిచినంత మేర దర్శిస్తూ ముందుకు సాగుదాం. కవులు బ్రహ్మ సమానులు. గడిచిపోయిన కాలాన్ని కళ్ళ ఎదుట సాక్షాత్కరింప చేయగల మాంత్రికులు. కల్హణుడు గడిచిన చరిత్రను కళ్ళముందు సాక్షాత్కరింప చేస్తున్నాడు.

గోనందుడి మరణంతో అతని కుమారుడు దామోదరుడు రాజయ్యాడు. తన తండ్రి యాదవుల చేతిలో మరణించటం మరిచిపోలేక, యాదవుల్తో వైరం పూనుతాడు దామోదరుడు. గాంధార రాజకుమారి స్వయంవరం ప్రకటితమవుతుంది. ఆ స్వయంవరానికి యాదవులు వస్తున్నారని తెలిసి వారితో యుద్ధానికి బయలుదేరుతాడు. యాదవులతో పోరాడుతాడు. ఆ పోరాటంలో శ్రీకృష్ణుడి చక్రఘాతంతో ప్రాణాలు కోల్పోతాడు. అప్పుడు కశ్మీరాన్ని ఆక్రమించమన్న వారి సలహాను పెడచెవిన పెట్టి శ్రీకృష్ణుడు, గర్భవతి అయిన రాణి యశోవతికి పట్టాభిషేకం జరిపిస్తాడు. ధర్మానికి పెద్ద పీట వేస్తాడు. ఈ గాథ ఆధారంగా విశ్వనాథ ‘యశోవతి’ అన్న నవల రచించారు.

ఈ సమయంలో కల్హణుడు కృష్ణుడితో ఓ శ్లోకం చెప్పిస్తాడు:

కశ్మీరాః పార్వతీ తత్ర రాజాజ్ఞేయో హరాంశజః।
వా వజ్ఞేయస్య దుష్టోపి విదుషా భూతి మిచ్ఛతా॥

కశ్మీరం పార్వతీమాత. కశ్మీర రాజు శివుని అంశం వల్ల జన్మించిన వాడు. అందువల్ల సుఖసంతోషాలతో జీవించాలనుకున్న వారెవరయినా, కశ్మీర రాజును అవమానించ కూడదు.

ఇదీ ఈ శ్లోకం తాత్పర్యం. భారతీయ ధర్మం ఔన్నత్యాన్ని, జీవన విధానంలోని గొప్పతనాన్ని స్పష్టం చేస్తుందీ సంఘటన. తనపై అకారణ వైరాన్ని పూని యుద్ధానికి వచ్చిన శత్రువుపై కోపం, ద్వేషం లేకుండా అతడిని యుద్ధ ధర్మంగా సంహరించినా, అతడి రాజ్యానికి వారసుడు లేకున్నా, అతని భార్యకు రాజ్యం కట్టబెట్టే ఔన్నత్యం ఒక్క భారతదేశానిదే. ప్రపంచంలో ఏ ఇతర దేశంలో కనీసం కట్టుకథగానయినా ఇంత ఉత్తమ గాథలు లభించవు. వారు కలలో కూడా ఊహించని నిస్వార్థ, నిర్మోహ సాత్వికత ఇది.

ఈ సంఘటన ఆధారంగా కస్తూరి మురళీకృష్ణ రచించిన ‘కల్హణ కశ్మీర రాజతరంగిణి కథలు’లో ‘కశ్మీరాః పార్వతీ’ అన్న కథ సృజితమయింది. కృష్ణ ద్వేషాన్ని ఒక స్థాయిలో ధర్మద్వేషంగా, మరో స్థాయిలో భారతదేశ ద్వేషంగా, ప్రతీకాత్మకంగా ప్రదర్శిస్తూ, చివరికి కృష్ణుడి విజయం ధర్మ విజయంగా భావించేట్టు రచించిన కథ ఇది. [అయితే అరస విరస కురస నీరస నోరస రచనలకే పెద్ద పీట వేసే రసవిహీనులు, రస అజ్ఞానులయిన తెలుగు సాహిత్య విమర్శకులకు, సాహిత్య పెద్దలుగా చలామణీ అవుతున్నవారికీ ఇలాంటివి తెలియకపోవటం, అర్థం కాకపోవటంలో ఆశ్చర్యం లేదు. గుడ్డివాడికి ఎంత ప్రయత్నించినా వెలుతురు కనబడదు కదా!]

భారతదేశంలో కశ్మీరు ప్రాధాన్యాన్ని ప్రదర్శించటమే కాక, భారతీయ సమాజంలో కశ్మీరుకున్న ప్రత్యేక పవిత్ర భావనను నిరూపిస్తుందీ సంఘటన. అంతే కాదు, ఓడిన రాజుల తల తీయించటం; రాణులను, ఇతర స్త్రీలను బానిసలుగా అమ్మేయటం; సేవకులుగా చేయటం; మతాలు మార్చటం వంటివి భారతీయ ధర్మానికి తెలియనివి అన్న విషయాన్ని స్పష్టం చేస్తుందీ సంఘటన. ద్వేష రహితమైన ‘సాత్విక హింస’ సిద్ధాంతానికి అతి చక్కని నిరూపణ ఈ ఘటన. భారతదేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించాల్సిన సంఘటన ఇది. అయితే మనల్ని మనం తిట్టుకుని, కించపరుచుకోవటమే గొప్ప అనుకునే మనకు ఇంత గొప్ప పూర్వీకులు, గొప్ప చరిత్ర ఉండటం వాటి దురదృష్టం. కర్మ. మనమేం చేయలేం.

యశోవతి తన కొడుకుకు గోనందుడని నామకరణం చేసింది. మహా భారత సంగ్రామం కురుక్షేత్రంలో జరిగిన సమయానికి గోనందుడు ఇంకా బాలుడు. యశోవతి అతని పేర రాజ్యం చేస్తోంది. కాబట్టి కౌరవులు కానీ, పాండవులు కానీ కాశ్మీర రాజును యుద్ధంలో సహాయం అభ్యర్థించలేదు. అందుకని కురుక్షేత్ర యుద్ధంలో కశ్మీరం పాల్గొనలేదు (చూ. నీలమత పురాణం).

గోనందుడి తరువాత 35 రాజుల వివరాలు లభించకపోవడంతో వారు విస్మృతిలో పడిపోయారు. ఈ సందర్భంగా కల్హణుడు ‘ఆ రాజులు ఎంతటి దురదృష్టవంతులో కదా, వారిని సజీవంగా నిలిపే ఒక్క కవి కూడా లేడు’ అంటాడు.

గోనందుడి తరువాత, వివరాలు తెలియని 35 రాజులు, వారి తరువాత లవుడు, ఉమేశుడు, ఖగేంద్రుడు, సురేంద్రుడు వంటి వారు కశ్మీరాన్ని పాలించారు. వీరు చేసిన పుణ్యకార్యాలు, కట్టించిన కట్టడాలు, నిర్మించిన మందిరాల వివరాలు కల్హణుడు పొందుపరిచాడు. సురేంద్రుడికి సంతానం లేకపోవడంతో వేరే వంశానికి చెందిన గోధరుడు రాజ్యభారం స్వీకరించాడు.

గోధరుడి తరువాత జనకుడు, భూదేవేంద్రుడు కశ్మీరాన్ని పాలించారు. భూదేవేంద్రుడికి సంతానం లేదు. అతని తరువాత అశోకుడు కశ్మీరాధిపతి అయ్యాడు. అశోకుడి తాత శకుని. అంటే శకుని పెద్ద తండ్రి, తండ్రి కుమారుడు అశోకుడు. అశోకుడు బౌద్ధం స్వీకరించాడు. శ్రీనగరం నిర్మింపజేశాడు. విజయేశుడి దేవాలయం ప్రాకారం శిథిలమయితే, శిలామయమైన ప్రాకారాన్ని నిర్మింప చేశాడు. అశోకేశ్వరాలయం నిర్మింప చేశాడు. ఆ సమయంలోనే దేశంలో మ్లేచ్ఛులు ప్రవేశించారు. పలు ప్రాంతాలను ఆక్రమించారు. వారిని నిర్మూలించే సంతానం కోసం తీవ్రమైన తపస్సు చేశాడు. ఫలితంగా ‘జలౌకసుడు’ అన్న పుత్రుడు కలిగాడు.

ఇక్కడి వరకు రాజతరంగిణిలో ఎవరికీ ఎలాంటి వివాదాలూ రాలేదు. ఇక్కడి నుంచి వాదవివాదాలు ఆరంభమవుతాయి. ఎందుకంటే, కశ్మీరును పాలించిన అశోకుడిని, భారతదేశ చరిత్రలో భౌద్ధాన్ని ప్రపంచమంతా విస్తరింప చేసిన అశోకుడిగా చరిత్రకారులు భావిస్తారు. కానీ, ఈ అశోకుడు వేరే, మౌర్య అశోకుడు వేరే అని కొందరు పండితులు భావిస్తారు. అయితే ఈ వివాదాలను స్పృశించే ముందు ఈ నడుమ రాజతరంగిణిలో కల్హణుడు పొందుపరిచిన కొన్ని అద్భుతమైన సంఘటనలను ప్రస్తావించుకోవాల్సి ఉంటుంది.

ఇంతవరకు కల్హణుడు ప్రస్తావించిన రాజులంతా మంచివారు. ప్రజలను చక్కగా చూసుకున్నారు. చెడు వ్యసనాల ప్రస్తావన లేదు. ప్రజల్ను పీడించిన కథలు లేవు. రాజులు అగ్రహారాలు కట్టించారు. నగరాలు కట్టించారు. మందిరాలు నిర్మింప చేశారు. రాజులు నగరాలతో పాటు ప్రజలకు ఇళ్ళు నిర్మించి ఇచ్చేవారు. అంటే ఇప్పటిలాగ కాక, నగరాలను పద్ధతి ప్రకారం నిర్మించేవారన్న మాట. ఎవరి ఇళ్ళు వాళ్ళు కట్టుకోవటం కాక, రాజు ప్రజల ఇళ్ళ నిర్మాణంలో సహాయం చేసేవాడన్న మాట. ఎవరెవరి వృత్తిని బట్టి, స్థాయిని బట్టి వారి నివాసాలు నిర్ణయమయ్యేవన్న మాట. ప్రణాళిక బద్ధంగా నిర్మాణాలు సాగేవి. ‘లవ’ అనే రాజు 84 లక్షల రాతి గృహాలు నిర్మింప చేసి ‘లౌలార’ మనే నగరాన్ని స్థాపించాడు. రాజు బ్రాహ్మణులకు ‘లెదారి’లో ‘లెవార’మనే అగ్రహారాన్ని దానం చేశాడు. ‘లెదారి’ అన్నది ప్రస్తుతం ‘పహల్గావ్’ వద్ద ఉన్నదని గుర్తించారు.

అన్నిటికన్నా జాగ్రత్తగా గమనించవలసిన మరొక అంశం, కృష్ణుడు కశ్మీరును పార్వతితో పోల్చి చెప్పిన శ్లోకం తరువాత శ్లోకం.

పుంసాం నిగౌరవా భోజ్యే ఇవయా స్త్రీ జనే దృశః।
ప్రజానం మాతరం తస్తామ పశ్యాన్దేవతా మివ॥
(కల్హణ రాజతరంగిణి, 73)

స్త్రీని చులకనగా, భోగవస్తువుగా చూసే పురుషులు, యశోవతి రాణిని దేవతలా గౌరవించారు. ఆమెను దేవతలా భావించారు.

ఇది శ్రీకృష్ణుడి ప్రభావం. ఇదీ భారతీయ ధర్మం ప్రభావం.

శ్రీకృష్ణుడిని రాసలీలకు, రాధ ప్రేమకు పరిమితం చేశారు తప్ప శ్రీకృష్ణుడి మాటల ప్రభావం ఆనాటి సమాజంపై ఎలా ఉండేదో విశ్లేషించలేదు. పదహారు వేల గోపికలతో రాసక్రీడ చేసే శ్రీకృష్ణుడు కశ్మీరును పార్వతితో పోల్చి, కశ్మీరుపై చెడు దృక్కులు ప్రసరించకూడదని చెప్పాడు. గర్భవతి అయిన రాణిని సింహాసనంపై కూర్చుండబెట్టాడు. అతని మాటలు విన్న పురుషులంతా రాణిని పవిత్రంగా, దేవతలా భావించారు. ఆమె పాలనని అంగీకరించారు. ఆమె కూడా రాజ్యం కోసం ఆశ పడలేదు. అధికారం కోసం అర్రులు సాచలేదు. తన కర్తవ్యం తను నిర్వహించింది. కొడుకుని పెంచి పెద్దవాడిని చేసి రాజ్యం అప్పగించింది. అంతవరకూ రాజ్యాన్ని సంరక్షించింది. ఇలాంటి అత్యద్భుతమైన వ్యక్తిత్వం, నిస్వార్థ కర్తవ్య పరాయణత్వం ఒక్క భారతీయ ధర్మంలోనే కనబడుతుంది.

ఇది కల్హణుడు ప్రదర్శించిన కశ్మీరం ఇది . ప్రాచీన భారతదేశం ఇది .

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here