కశ్మీర రాజతరంగిణి-34

0
7

[box type=’note’ fontsize=’16’] కశ్మీర్ ప్రాచీన చరిత్ర గురించి అవగాహన కలిగించి, భవిష్యత్తు గురించి ఆలోచనలు కలిగించాలన్న ప్రయత్నంలో భాగంగా నీలమతపురాణం తరువాత అందిస్తున్న జోనరాజు, శ్రీవరుడు, ప్రజ్ఞాభట్టులు కల్హణుడి అడుగుజాడల్లో నడుస్తూ సంస్కృతంలో రచించిన ‘కశ్మీర రాజతరంగిణి’ అనువాదాన్ని తెలుగు పాఠకులకు అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ. [/box]

యస్య దివ్యప్రభావస్త్య కథాః శృపపథం గతాః।
ఆశ్చర్యాచార్యతామ్ యాన్తి నియంతం ద్యుషదామపి॥

(కల్హణ రాజతరంగిణి – 1.109)

[dropcap]జ[/dropcap]లౌకుడు దివ్య ప్రభావశాలి. అతడి కథలు, అతడి సాహస గాథలు, పవిత్ర గాథలు దేవతలనయినా ఆశ్చర్యచకితులను చేస్తాయి.

దేవతలకే ఆశ్చర్యం కలిగించే గాథలు, పాశ్చాత్యులకు ఆశ్చర్యంతో పాటు అపనమ్మకం కలిగించడంలో ఆశ్చర్యం లేదు. అశోకుడి కాలగణన వారికి సరిపోలేదు. కశ్మీర అశోకుడు వేరు అని ఒప్పుకుంటే, ఎంతో కష్టపడి అలెగ్జాండర్‍ను చంద్రగుప్తుడితో జతపరిచి భారతీయ చరిత్రను యూరోపియన్ చరిత్రతో పోల్చి తేదీలు నిర్ణయించిన చరిత్రను మొత్తం కొట్టి పారేయాల్సి ఉంటుంది. అందుకని ముందుగా కల్హణుడు అంతా అభూత కల్పనలను, శాస్త్రీయత లేని అంశాలను విశ్వసించి చరిత్రగా పరిగణించి రాశాడు కాబట్టి రాజతరంగిణి మొదటి మూడు భాగాలను చరిత్రగా పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని తీర్మానించారు.

‘జలౌకుడు దేవేంద్రుడు’ అంటాడు కల్హణుడు. అయితే కల్హణుడు ఈ విషయాలను తాను కల్పించలేదు. తనకు ముందు వారు రాసిన గ్రంథాలను పరిగణనలోకి తీసుకుని వాటిలోని అంశాలను తనదైన రీతిలో ప్రకటించాడు. ఆయన దగ్గర వస్తువులను బంగారంగా మార్చే పరసవేది లాంటిది ఉండేది. దాంతో ఈ బ్రహ్మాండాన్ని బంగారంతో నింపేయగల శక్తి ఉండేది జలౌకుడికి. ఆయనకు జలస్తంభన విద్య వచ్చు. ఆ విద్య ప్రభావంతో నాగులుండే సరస్సులోకి ప్రవేశించాడు. నాగకన్యకల యవ్వనాన్ని కొల్లగొట్టాడు.

ఇక్కడ కశ్మీరులో ముందు నుంచీ ఉంటున్న నాగులతో సత్సంబంధాలు నెరపటం కనిపిస్తుంది. కశ్మీరులోకి బౌద్ధులు అడుగుపెట్టినప్పటి నుంచీ, వారు ముందుగా నాగులతో ఘర్షణ పడాల్సి వచ్చింది. మ్లేచ్ఛులను నిర్మూలించడంలో మొదటి అడుగుగా జలౌకుడు నాగులతో సత్సంబంధాలు ఏర్పాటు చేసుకున్నాడు. తరువాత మ్లేచ్ఛులను తరిమివేశాడు. ఆ తరువాత బౌద్ధుల ఆగడాలకు అడ్డుకట్ట వేశాడు. ఆయన రోజూ విజయేశుడు, నందీశుడు, జ్యేష్ఠేశుడు అన్న దేవతలను అర్పించటం నియమంగా పెట్టుకున్నాడు. అతడు ఈ ప్రయాణాలన్నీ నిర్ణీత సమయంలో చేసేందుకు వీలుగా ఒక నాగుడు జలౌకుడిని తన భుజస్కందాల మీద మోసుకుని పోయేవాడు.

నాగులకు కశ్మీర రాజులకు ఉన్న సత్సంబంధాలను ఈ ఉదంతం నిరూపిస్తుంది. మనుషులు, నాగులు పరస్పర సహాయ సహకారాలలో జీవిస్తూండేవారని అర్థమవుతోంది.

జిత్యేర్వీం కన్యాకుబ్జాద్యాం తత్రత్వం స న్యవేశయత్।
చతుర్వర్ణ్య నిజే దేశే ధర్మ్యాశ్చ వ్యవహారిణః॥

(కల్హణ రాజతరంగిణి – 1.117)

కన్యాకుబ్జం తదితర ప్రాంతాలను గెలుచుకున్న జలౌకుడు, ఆయా ప్రాంతాలలోని నాలుగు వర్ణాల వ్యవస్థతో పాటు ధర్మమూర్తులను, తెలివైన వారిని, న్యాయమూర్తులను కశ్మీరులో స్థిరపరిచాడు.

కడలి మొలనూలుగా కల ధరిత్రినంతా జయించిన జలౌకుడి ధాటికి మ్లేచ్ఛులు తట్టుకోలేకపోయారు. ఉఝటడింబ మన్న స్థలంలో మ్లేచ్ఛులు సంపూర్ణంగా పరాజితులై పలాయితులయ్యారు.

ఈ జలౌకుడి విజయాలను చదువుతుంటే ప్రాచీన కాలం నుంచి కూడా కశ్మీర రాజులు జైత్రయాత్రలు చేయటం గమనించవచ్చు. జరాసంధుడి కాలంలో కశ్మీర రాజు మధురపై దండెత్తి వెళ్ళాడు. ఇప్పుడు జలౌకుడు మ్లేచ్ఛులను తరిమి, కన్యాకుబ్జం (ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్ లోని ఓ నగరం, ఒకప్పటి కాలంలో పెద్ద రాజ్యం) వరకూ జైత్రయాత్ర చేశాడు. ఈ రకంగా చూసినా ఏనాడు కశ్మీరం, భారతదేశంలోని ఇతర ప్రాంతాలతో సంబంధం లేకుండా లేదన్నది స్పష్టమవుతుంది. అంతేకాదు, చరిత్ర పుస్తకాలలో క్రీ.పూ. 1200 నుండి ఆరువందల కాలం నాటి పురావస్తువులు ఈ ప్రాంతంలో దొరికాయి. మహాభారతం, రామాయణాలలో కన్యాకుబ్జం ప్రస్తక్తి ఉంది. కానీ కన్యాకుబ్జాన్ని కశ్మీర రాజు జలౌకుడు గెలుచుకున్నాడనీ, ఇక్కడి నుంచి నాలుగు వర్ణాలకు చెందిన ఉత్తములను కశ్మీరుకు తీసుకువెళ్ళీ అక్కడ స్థిరపరిచాడన్న విషయం ప్రస్తావించరు. జలౌకుడు తరిమివేసిన మ్లేచ్ఛులెవరు అన్న విషయంలో ఏకాభిప్రాయం లేదు. వేదభ్రష్టులందరూ మ్లేచ్ఛులే. సరైన ఉచ్చారణ లేని వారు మ్లేచ్ఛులు. దాంతో కొందరు గ్రీకులే జలౌకుడు తరిమిన యవనులు అని భావిస్తే, ఇంకొందరు బౌద్ధులనే మ్లేచ్ఛులుగా భావించారని తీర్మానించారు. ఈ విషయంలో కల్హణుడు ఎలాంటి వివరాలను అందించలేదు. ‘మ్లేచ్ఛులు’ అని వదిలేశాడు.

అయితే జలౌకుడు కన్యాకుబ్జను గెలుచుకుని ఆ ప్రాంతం నుండి ఉత్తములను కశ్మీరు తీసుకువెళ్ళటం ఒక విచిత్రమైన సమస్యను లేవనెత్తుతుంది. కన్యాకుబ్జం చరిత్రను క్రీ.పూ. 1200 నుంచి ప్రారంభిస్తారు. ఇక్కడ ప్రాచీన మానవుడి ఆనవాళ్ళు క్రీ.పూ. 1200 నుంచి లభిస్తున్నాయంటారు. కన్నౌజ్ చరిత్ర క్రీ.శ. 8వ శతాబ్ది నుంచి ఉచ్చస్థాయికి చేరిందంటారు. కానీ రాజతరంగిణిలోని కల్హణుడి తేదీలను పరిగణనలోకి తీసుకుంటే కన్యాకుబ్జం చరిత్ర క్రీ.పూ. 1200 కన్నా ముందుకు వెళ్తుంది. ప్రాచీన మానవుడు కాదు, ఆ కాలానికి అభివృద్ధి చెందిన నాగరికత వెల్లివిరుస్తున్నదనీ తెలుస్తుంది. సంప్రదాయ చరిత్ర పరంగా చూస్తే భారతదేశం నలుమూలల నుండీ పలు రాజ్యాధీశులు తమ సామ్రాజ్యాలకు కన్యాకుబ్జం నుండి పండితులను, న్యాయాధీశులను పిలిపించుకున్నారు. వారిని గౌరవించి వారికి నివాసం కల్పించారు. కశ్మీరులోనూ ఇదే జరిగింది. అయితే కనౌజ్ పరిసర ప్రాంతాలలో పురావస్తు తవ్వకాలు జరగలేదు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఆర్. ఎస్. పండిత్ ‘Archeology may yet reveal that it (Kanyakubja) was the centre of civilization like that of Mohenjodaro, much older than the Aryan’ అంటారు. అంటే, క్రీ.పూ. 1200 సంవత్సరాలకు ఏ కన్యాకుబ్జ పరిసర ప్రాంతాలలో పురాతన మానవుల ఆనవాళ్ళు లభించాయంటున్నామో, పరిశోధిస్తే ఆ కాలానికి అతి గొప్ప నాగరికత విలసిల్లుతోందన్న ఆలోచన కశ్మీర రాజతరంగిణి కలిగిస్తోంది. ఇదే నిజమైతే, కన్నౌజ్ ప్రాంతం ఇంకా ప్రాచీన చరిత్ర కలిగి ఉన్నది అవుతుంది. మొత్తం భారతదేశ చరిత్రను కొత్తగా రాయాల్సి ఉంటుంది. పాత చరిత్రను పారవేయాల్సి ఉంటుంది. ఈ దిశగా పరిశోధనలు జరగాల్సి ఉంది.

ఆ కాలం నాటి immigration కూ, social engineering కూ ఇదొక చక్కని ఉదాహరణ కన్యాకుబ్జం నుంచి జలౌకుడు ఉత్తములకు కశ్మీరులో నివాసం కల్పించటం. ఎందుకంటే, కన్యాకుబ్జం గెలిచిన తరువాత జలౌకుడు కశ్మీరు పాలనలో సంస్కరణలు ఆరంభించాడు.

కర్మస్థానాని ధర్మ్యాణి తేనాష్ఠాదశ మేర్వతా।
తతః ప్రభృతి భూపేన కృతా యౌధిష్ఠిరీ స్థితిః॥

(కల్హణ రాజతరంగిణి – 1.120)

ఈ శ్లోకానికి ముందు శ్లోకాలలో, కశ్మీరంలో రాజ్యపాలన వ్యవస్థ అంతగా అభివృద్ధి చెందిన రాజ్యాల స్థాయిలో లేదని, మామూలు రాజ్యాలలో ఉన్నట్ట్లు పాలన ఏడు విభాగాలలో ఉన్నతాధికారులతో ఉండేదని వ్యాఖ్యానిస్తాడు కల్హణుడు. ఆ ఉన్నతాధికారులు ధర్మాధక్షుడు, ధనాధక్షుడు, కోశాధ్యక్షుడు, సేనాధిపతి, దూత, పురోహితుడు, జ్యోతిశ్శాస్త్రవేత్త అన్నవి ఏడు విభాగాలు. వీటిని 18 విభాగాలుగా విస్తరింపజేశాడు జలౌకుడు. ఆ తరువాత యుధిష్ఠిరుడు పాలనా పద్ధతినీ, రాజ్యాంగాన్నీ కశ్మీరంలో అమలు పరిచాడు. జలౌకుడు అమలు పరిచిన పద్దెనిమిది విభాగాల ఉన్నతాధికారుల వ్యవస్థ గురించి మహాభారతంలో ఉంది. ఎందుకంటే ఇది ధర్మరాజు అమలుపరచిన వ్యవస్థనే కాబట్టి. రామాయణంలో ఉంది. రఘువంశంలో కూడా ఉంది. ఆ 18 పాలనా విభాగాలు – మంత్రి, పురోహితుడు, యువరాజు, సేనాపతి, ద్వారపాలుడు, అంతర్వేషికుడు, కారాగారాధిపతి, ద్రవ్య సంచయ కర్త, సన్నిధాత్ర, ప్రాదేస్త, నగరాధ్యక్ష, కార్యనిర్మాణ, ధర్మాధ్యక్ష, సభాధ్యక్ష, దండపాల, దుర్గపాల, రాష్ట్రాంతపాల, అటవీపాలుడు.

ఈ 18 ఉన్నతాధికారుల వ్యవస్థతో ధర్మరాజు అమలు పరిచిన రాజ్యాంగ వ్యవస్థను జలౌకుడు కశ్మీరులో అమలుపరచటం ప్రారంభించాడు. తాను సంపాదించిన ధనంతో నిండిన ఖజానాలను ‘వారబల’, ఇతర ప్రాంతాలలో అగ్రహారాల నిర్మాణం చేశాడు. నందిపురాణం విన్నప్పటి నుండి ప్రతీ రోజూ సోదర తీర్థంలో స్నానం చేసి నందీశుడిని అర్పించేవాడు జలౌకుడు. శ్రీనగరంలో జ్యేష్ఠరుద్రుడిని ప్రతిష్ఠించాడు. కానీ నంది క్షేత్రంలో ఉన్నట్టు ‘సోదర’ తీర్థం ఇక్కడ లేదని గమనించాడు. ఓరోజు రాజ్య వ్యవహారాలలో పడి సోదర తీర్థంలో స్నానం చేయటం ఆలస్యం అయింది. దాంతో ఆ సోదర తీర్థం చేరాలని త్వరపడుతూంటే – సోదర తీర్థానికి సోదర తీర్థం ఆయన పాదాల దగ్గరే ఏర్పడింది. జలౌకుడి జీవితంలో మరో అద్భుతమైన సంఘటన ఉంది.

కోబోధిసత్త్వే య భద్రే మాం కౌత్సీతి జగాద్‌తామ్॥
(కల్హణ రాజతరంగిణి – 1.135)

ఒకరోజు జలౌకుడు ‘విజయేశ్వర తీర్థం’ వెళ్తుంటే దారి పక్కన ఓ భిక్షగత్తె కనబడింది.

ఆమె ఆకలి తీరుస్తానని జలౌకుడు వాగ్దానం చేశాడు.

జలౌకుడు వాగ్దానం చేయటంతోటే, ఆ ముసలామె వేషం వదిలి నిజరూప దర్శనం ఇచ్చింది. ఆమె ఓ రాక్షసిగా మారిపోయింది. మానవ మాంసం కావాలని కోరింది. అప్పుడు జలౌకుడు, ప్రాణిహింస చేసేందుకు ఇష్టపడడు. తన మాంసాన్ని సేవించి ఆకలి తీర్చుకోమంటాడు.

అప్పుడు ఆ రాక్షసి “నువ్వు నిజంగా బోధిసత్త్వుడివే. ఉత్తమ నడవడి వల్లనే నీవంత గొప్ప వాడివయ్యారు. సకల ఐశ్వర్యాలు అనుభవిస్తున్నావు” అంటుంది. జలౌకుడికి బోధిసత్త్వుడు ఎవరో తెలియదు. అప్పుడు అడుగుతాడు, “నన్ను బోధిసత్త్వుడని పొగుడుతున్నావు. ఎవరీ బోధిసత్త్వుడు?” అని అడిగాడు.

 ఈ కథలో ఓ ముసలామె రాక్షసిలా మారటం వంటివి అభూత కల్పనల్లా, అవాస్తవాలుగా చాలామందికి తోచవచ్చు. కానీ ఇలాంటి అనేక అభూత కల్పనలుగా కొట్టివేసే కథల ఆధారంగానే భారతీయ ధర్మాన్ని, చరిత్రను, సంస్కృతిని బోనులో నిలబెట్టి, తీర్పులు ఇస్తారు. అలాంటి సమయంలో ఇవన్నీ అభూత కల్పనలు అన్న ఆలోచన రాదు. అవాస్తవాలు అన్న స్పృహ ఉండదు. కాబట్టి, ఎంత అభూత కల్పనలా, అవాస్తవంలా తోస్తున్నా ఈ కథ ద్వారా మనకి ఏం తెలుస్తోందని ఆగి ఆలోచించాల్సి ఉంటుంది.

జలౌకుడి తండ్రి అశోకుడు. అశోకుడు ‘జినశాసనం’ స్వీకరించినవాడు. కానీ దేవాలయాలు నిర్మింపచేశాడు. దేశం మ్లేచ్ఛాక్రాంతం అవుతుంటే ‘భూతేశుడి’ని (శివుడిని) ప్రార్థించి, వారి నిర్మూలనం చేసె సంతానాన్ని కోరాడు. ఆ సంతానం అయిన జలౌకుడు మ్లేచ్ఛ నిర్మూలనం చేశాడు. అప్పుడు అతడిని సంహరించటం కోసం ఒక రాక్షసి వచ్చింది. అతడి భూతదయని చూసి ‘నువ్వు బోధిసత్త్వుడివి’ అంది. ఆమె అన్న మాటలు జలౌకుడికి అర్థం కాలేదు. ‘బోధిసత్త్వుడెవరు?’ అని అడిగాడు.

జలౌకుడు అడిగిన ఈ ప్రశ్న కశ్మీరు అశోకుడు స్వీకరించిన జినమతం బౌద్ధం కాదేమో అన్న సందేహాన్ని కలిగిస్తుంది. అశోకుడు మ్లేచ్ఛులుగా భావించినవారు బౌద్ధులేమో నన్న అనుమానం తరువాత ఆ రాక్షసి అన్న మాటలు కలిగిస్తాయి.

అహం హ్యుద్ధా పితా బౌద్ధైః క్రోధాద్వి ప్రకృతైస్త్యయా।
(కల్హణ రాజతరంగిణి – 1.136)

‘నువ్వు అపకారం చేసిన బౌద్ధులు నీపై కోపంతో నన్ను ప్రేరేపించారు’.

జలౌకుడు తన నిద్రకు భంగం అయిందని ఓ విహారాన్ని నాశనం చేయిస్తాడు. దాంతో అతనిపై కోపంతో బౌద్ధులు లోకాలోక పర్వతపార్శ్వంపై నివసిస్తున్న తామస శక్తిని జలౌకుడికి అపకారం చేసేందుకు పంపిస్తారు. అయితే సకల ప్రాణులపై దయగల బోధిసత్త్వులు జలౌకుడు విహారాన్ని పునర్నిర్మిస్తే అతడిని సంహరించవద్దంటారు. జలౌకుడు వాగ్దానం చేస్తాడు. ‘కృత్స్యాశ్రమం’ అనే విహారం నిర్మిస్తాడు. కృత్సాదేవిని ప్రతిష్ఠిస్తాడు.

దీనిపై వ్యాఖ్యానిస్తూ ఆర్. ఎస్. పండిత్ ‘This is an illustration of the persecution of the Buddhists’ అని తీర్మానిస్తారు. జలౌకుడికి బోధిసత్త్వుడు అంటే ఎవరో తెలియదు. అలాంటివాడు పనికట్టుకుని బౌద్ధులను హింసిస్తాడని తీర్మానించటం పొరపాటు. ఇలా తీర్మానించటం వల్ల బౌద్ధులు తమకు నచ్చనివారిపై తామసిక శక్తులను ప్రయోగించేవారన్న విషయం మరుగున పడుతుంది. బహుశా, తామసిక శక్తులను ఆశ్రయించటం వల్ల వారిని మ్లేచ్ఛులుగా భావించి వ్యతిరేక చర్యలు చేపట్టారేమోనన్న ఆలోచన కూడా పక్కదారి పడుతుంది. ఇదే కథపై వ్యాఖ్యానిస్తూ Stein ‘It was probably a local legend attaching to the Krtyasrama Vihara and bears on unmistakably Buddhist coloring’ అని వ్యాఖ్యానించాడు. అంటే ఒకే సంఘటన ఒకరికి ‘బౌద్ధుల దృక్కోణంలో వారి అభిప్రాయం ప్రకారం చెప్పిన కథ’గా అనిపిస్తే, మరొకరికి ‘బౌద్ధులపై కశ్మీరరాజు జరిపిన అత్యాచారాలకు దృష్టాంతం’గా అనిపించింది. భారతీయ గాథలను విశ్లేషించడంలో వ్యక్తుల కళ్ళకు గంతలు, వారు వేసుకున్న రంగుటద్దాలు ప్రధాన పాత్ర పోషించాయి. ఏ ఆలోచన ప్రచారం పొందుతుంది, ఏది స్థిరపడుతుంది అన్నది ఆ ఆలోచనను ప్రతిపాదించిన వ్యక్తికి ఉన్న బలగం, శక్తి, ప్రభావం వంటి విషయాలపై ఆధారపడి ఉంటుంది. ఇంతకీ కృత్స్య అన్నది ఒక తామసిక శక్తి. దానికీ దేవాలయం కట్టించాడు జలౌకుడు. అలాంటి జలౌకుడు బౌద్ధులను హింసించాడని చరిత్ర రచయితలు తీర్మానించటం, అభూతకల్పనల్లోకే అభూతకల్పన.

ఈ కథను జాగ్రత్తగా గమనిస్తే, కశ్మీర రాజు అశోకుడు స్వీకరించింది బౌద్ధం కాదన్నది స్పష్టమవుతోంది. అతడు బౌద్ధాన్ని స్వీకరిస్తే, అతడి కొడుక్కు కనీసం బోధిసత్త్వుడు ఎవరో తెలియని పరిస్థితి ఉండదు. అలాంటి పరిస్థితి ఉందంటే అర్థం అసలు ‘బౌద్ధం’ అన్నదేమిటో కూడా సరిగా తెలియని పరిస్థితులలో పెరిగాడు జలౌకుడు అని. ఇక అతనికి నిద్రాభంగం అయిందని ఆరామాన్ని నేలమట్టం చేయించాడంటే అర్థం బౌద్ధంపై ద్వేషం అని నిర్ధారించే వీలు లేదు. రాజు, వారి తూర్యారావాలపై నిషేధం ప్రకటించి ఉండవచ్చు. వారు ఉల్లంఘించి ఉండవచ్చు. లేదా, రాజుకి నిద్రాభంగం అయి నిజంగానే కోపం వచ్చి ఆరామాన్ని ధ్వంసం చేయమని ఆజ్ఞాపించి ఉండవచ్చు. ఆ కాలంలో రాజాజ్ఞ వేదవాక్కు. లౌకికపుటాలోచనలు, మనోభావాల ప్రసక్తి లేదు. రాజుకి నిద్రాభంగం అయింది. కారణం ఆరామం. చేయండి ధ్వంసం అని ఉండవచ్చు కోపంతో. అందుకే బౌద్ధులు కోపం పూని, క్రోధంతో తామస శక్తిని ప్రయోగించటం చూస్తే బౌద్ధులంటే రాజుకు మంచి అభిప్రాయం ఉండకపోవటం, ప్రజలు బౌద్ధాన్ని తిరస్కరించటం అర్థం అవుతుంది. నాగులు రాజును ఆదరించటం కూడా బోధపడుతుంది. అంతేకాదు, తమ సిద్ధాంతాన్ని నమ్మని రాజును నశింపచేసేందుకు బౌద్ధులు తామసిక శక్తుల ప్రయోగానికీ వెనుదీయలేదనీ తెలుస్తుంది. ఈ కోణంలో చూస్తే, తమ మతం నమ్మని రాజును దెబ్బతీసేందుకు బౌద్ధులు యవనులతో, ఇతర విదేశీ శక్తులతో చేతులు కలపినట్టున్న సంఘటనలు ఆబద్ధం కావనిపిస్తుంది. అంతేకాదు, మహమ్మదీయులు భారతదేశంపై దాడి చేసినప్పుడు సరిహద్దు ప్రాంతాలలోని బౌద్ధులు వారికి స్వాగతం పలకటమూ అర్ధమవుతుంది.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here