కశ్మీర రాజతరంగిణి-4

7
8

[box type=’note’ fontsize=’16’] కశ్మీర్ ప్రాచీన చరిత్ర గురించి అవగాహన కలిగించి, భవిష్యత్తు గురించి ఆలోచనలు కలిగించాలన్న ప్రయత్నంలో భాగంగా నీలమతపురాణం తరువాత అందిస్తున్న జోనరాజు, శ్రీవరుడు, ప్రజ్ఞాభట్టులు కల్హణుడి అడుగుజాడల్లో నడుస్తూ సంస్కృతంలో రచించిన ‘కశ్మీర రాజతరంగిణి’ అనువాదాన్ని తెలుగు పాఠకులకు అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ. [/box]

స్రస్తాంధకారవసనామ్ రజనీపురంద్రీమాలింగత్ ప్రియసుథాసృతిదిక్స్ ఖీలుః।

దూరం మృగాళ శకలామ లతన్మయుఖహాసచ్ఛటాన్చి తముభీ ఖరివాపసన్నె॥

(హరవిజయ-రాజానక రత్నకర)

[dropcap]క[/dropcap]శ్మీరుకు చెందిన అతి ప్రాచీన మహాకావ్యం, ఈ నాటికీ పూర్తిగా లభ్యమవుతున్న ప్రాచీన మహా కావ్యం ‘హరవిజయ’. ఈ కావ్యాన్ని రచించిన మహాకవి రాజానక రత్నాకరుడు. ఆ కావ్యంలోని అత్యంత అద్భుతము, హృద్యము, సృజనాత్మకమయిన వర్ణన ఇది. సుధలు వెదజల్లుతున్న చంద్రుడు రాత్రి అనే యువతిని కౌగిలించుకుంటున్నాడు. ఆమె వస్త్రాలు జారిపోతున్నాయి. ఇది చూసి ఆమె స్నేహితురాళ్ళయిన దిక్కులు చిరునవ్వుతో, తామరతూళ్ల వంటి మృదువైన వదనాలు, వెన్నెల కిరణాలు పడి మెరుస్తూండగా, నిశ్శబ్దంగా పక్కకు తప్పుకున్నారు.

భారతదేశంలో ఇతర ఏ ప్రాంతంలో వెల్లివిరిసిన మహాకావ్యాలలోని అతి సుందరమైన ఏ వర్ణనకూ ఏ మాత్రం తీసిపోని అత్యంత సుందరమైన వర్ణన ఇది. మాఘుడు రచించిన ‘శిశుపాల వధ’ ప్రేరణతో రచించిన మహా కావ్యం ఇది. కథ చాలా చిన్నది. మహాశివుడు అంధకాసురుడిని వధించటం. అంతే. ఈ కథను 4321 శ్లోకాలలో అతి సుందరమైన వర్ణనలతో, అణువణువునా రసం చిప్పిల్లుతూండగా రచించాడీ కావ్యాన్ని రత్నాకరుడు.

రాజతరంగిణిని మహాకావ్యంగా చెప్పుకున్నాడు కల్హణుడు. రాజతరంగిణి రచనలో మహా కావ్య లక్షణాలన్నీ పొందుపరచాడు. తన ముందున్న కవులందరి భుజలపై నిలచి తన కావ్యాన్ని మరింత సుందరంగా విస్తరించాడు కల్హణుడు. గమనిస్తే, కశ్మీరులో సంస్కృత కావ్య రచన సంప్రదాయం ఆరంభం నుంచీ అవిచ్ఛిన్నంగా కొనసాగుతూ కనిపిస్తుంది. స్థానిక భాషలను అణచి సంస్కృతం ప్రధాన భాషగా ఎదగినట్టు ఎలాంటి ఆధారాలు లేవు. నిజానికి సంస్కృతం, కాశ్మీరీ భాష ఒకేసారి ఎదిగినట్టు, కలసి నడచినట్టు ఆధారాలు లభిస్తున్నాయి. కశ్మీరులో ఆరంభం నుంచీ ప్రచలితంలో ఉన్న భాషలు సంస్కృతం, ప్రాకృతం. ఇది సమస్త భారత దేశానికీ వర్తిస్తుంది. అంటే కొండల నడుమ ఉండి, చుట్టు లోయలు ఉండటం వల్ల కశ్శీరు భారతదేశంలో ఇతర ప్రాంతాలతో సంబంధం లేకుండా ఉందని పాశ్చాత్య పండితులు, వారిచే ప్రభావితులు , చేసిన సిద్ధాంతాలకు గండి కొట్టేటటువంటి విషయం ఇది. కశ్మీరు చుట్టు కొండలు, లోయలు ఉన్నా కశ్మీరు భారత దేశంలోని ఇతర ప్రాంతాలన్నింటితో సన్నిహిత సంబంధాలుండటమే కాదు ఇతర ప్రాంతాలలాంటి ప్రాంతమే తప్ప ఎలాంటి ప్రత్యేకం, దూరం కాదని నిరూపించే ఒక ప్రధానాంశం ఇది. సంస్కృతం భారతదేశంలోని ప్రజలందరినీ ఏకత్రితం చేసే అంశం. అందుకు తిరుగులేని నిరూపణ ఇది. గిల్జిత్-బాల్టిస్తాన్, కాశ్మీరు, జమ్ము, లదఖ్, చంబా వంటి ప్రాంతాలలో లభించిన నాణాలు, తాళపత్రాలలోని సంస్కృతం ఈ నిజాన్ని నిరూపిస్తుంది. జువాన్ జాంగ్ సంస్కృతాన్ని language of India అనటం ఈ నిజానికి మరింత బలాన్నిస్తుంది. పరాయి వాడి మాట శక్తిమంతం కదా!

ఎస్.కె.తోష్కానీ ‘ది లిటరరీ హెరిటేజ్ ఆఫ్ కాశ్మీర్’ అనే పుస్తకంలో సంస్కృతం కశ్మీరీ భాషగా రూపు ధరించటంలో ప్రాకృతం మధ్యవర్తిత్వం నెరపిందని తీర్మానించాడు. సంస్కృతం, ప్రాకృతాలను ‘cognate languages’ గా అభివర్ణించాడు. అంటే ఒకే మూలభాషగా కల భాషలు. ఈ రెండు భాషలను ప్రజలు ఒకేసారి ఉపయోగించేవారని నిరూపించాడు. కశ్మీరులోనే కాదు కశ్మీరు సరిహద్దు ప్రాంతాలయిన హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, జమ్ములలో పహారి, పంజాబీ, డోగ్రి భాషలతో కాశ్మీరి భాష, సంస్కృతం భాషలు సహవాసం చేశాయి. స్థానిక భాషలతో ఎలాంటి సంఘర్షణ, అణచివేతలు ఒత్తిళ్లు లేకుండా సంస్కృతం పాలలో నీటిలా కలసిపోవటం సమస్త భారతదేశంలోనే కాదు కశ్మీరులో కూడా కనిపిస్తుంది. ఈ ఉఛ్ఛ సంస్కృత కావ్య సృజనకు వారసుడు కల్హణుడు. అందుకే తనకన్నా ముందుండి దారి చూపి, తన కావ్యం ఉఛ్ఛదశ చేరేందుకు మార్గం సుగమం చేసిన ప్రాచీన కవులను కల్హణుడు రాజతరంగిణిలో పేరు పేరునా ప్రస్తావించాడు. వారి కావ్యాల వివరాలను పొందుపరచాడు.

జయపీడుడి ఆస్థానంలో దామోదర గుప్త అనే కవి ‘కుట్టనీమతం’ అనే వ్యంగ్య, శృంగార ప్రబంధాన్ని రచించాడు. వారణాసికి చెందిన మాలతి అనే వారకాంత సాహసాలు ఈ కావ్యానికి కేంద్రబిందువు. 37 శ్లోకాల స్రగ్ధర ఛందస్సు గ్రంథం ‘స్రగ్థర స్తోత్రం’. దీన్ని రచించింది సర్వజ్ఞమిత్ర. ఈ సర్వజ్ఞమిత్రుడి గురించిన సమాచారం టిబెట్‌కు చెందిన ‘పగ్యమ్-జోన్-సాంగ్’ లో లభిస్తుంది. ఈ గ్రంథం ప్రకారం సర్వజ్ఞమిత్రుడు కశ్మీరుకు చెందిన వాడయినా నలంద విశ్వవిద్యాలయంలో చదువుకున్నాడు. ఇతడిని ‘రాజగురు పండిత భిక్షు శ్రీ జనరక్షిత’ అని, శ్రీమద్ విక్రమాశీల మహా విహారకు చెందినవాడని పొగడటం కనిపిస్తుంది. దీన్ని బట్టి కశ్మీరు నుండి జిజ్ఞాసువులు భారతదేశంలోని ఇతర ప్రాంతాలకు విద్యాభ్యాసం నిమిత్తం వెళ్లే వారని తెలుస్తుంది. కశ్మీరుకు చెందిన పండిత రవిగుప్త, పండిత శాక్యశ్రీభద్ర వంటి వారి ప్రస్తావన కూడా టిబెటన్ల గ్రంథాలలో లభిస్తాయి. ఇవన్నీ చూస్తుంటే ప్రాచీన కాలంలో కశ్మీరు ఏనాడూ భారతదేశంలో ప్రంత్యేకంగా, దూరంగా ఒంటరిగా లేదు, ఎలాంటి సంబంధం లేకుండా లేదని తెలుసుంది.

అవంతి వర్మ (క్రీ.శ.855-84) రాజ్యపాలన కాలంలో మహాకావ్య రచన విజృంభించింది కశ్మీరులో. శంఘుకుడి రచన ‘భువనాభ్యుదయ’ ఈ కాలంలో రచించినదే. కల్హణుడు ఈ రచనను – మమ్మ, ఉత్పలుల నడుమ జరిగిన భీకర సంగ్రామాన్ని వర్ణించే చారిత్రక కావ్యంగా పేర్కొన్నాడు. రాజనక రత్నాకరుడు ఈ కాలంలోని వాడే. ఈయనకు ‘దీపశిఖ కాళిదాసు’, ‘ఆతపత్ర భారవి’, ‘ఘంటా మాఘ’ లాగా ‘తాళరత్నాకర’ అన్న బిరుదు ఉండేది. ఈ కాలంలోనే శివస్వామి ‘కఫినాభ్యుదయ’ అనే మహాకావ్యాన్ని రచించాడు. ఇది అవదాన కథ. బుద్ధ బోధనలు విని ప్రభావితుడయిన ‘లీలావతి సామ్యాజ్యాధీశుడు కఫినుడు’ ధర్మబద్ధంగా పాలన చేయటం ఈ కావ్య కథ. ‘ధ్వని’ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన ఆనందవర్ధనుడు అవంతివర్మ కాలం వాడే. ధ్వన్యాలోకన, అర్జున చరిత, మధుమతాన విజయ వంటి సంస్కృత కావ్యాలు , లీల, ‘హరివిజయ’ వంటి ప్రాకృత కావ్యాలను ఈయన రచించాడు. భారతీయ న్యాయశాస్త్రానికి చెందిన ప్రధాన గ్రంథం ‘న్యాయమంజరీ’ రాసిన జయంతి భట్టు ఆనంద వర్ధనుడి సమకాలీనుడు. రాజు శంకరవర్మ కాలంలో సాంఘిక ధార్మక పరిషత్తులను ప్రతిబింబించే ‘ఆగమాడంబర’ రచించిందీయనే. ఈయన దైవాన్ని ‘గొడ్రాలి సంతానం, మరీచికల జలాలలో స్నానం చేసినవాడు, గగన కుసుమాల్ని శిఖలో ధరించినవాడు, లేడి కొమ్ము ధనస్సును ధరించినవాడి’గా అభివర్ణించాడు. జయంతి భట్టు కుమారుడు అభినందుడు ‘కాదంబరీ కథాసారం’ రచించాడు. క్షేమేంద్రుడు ‘పద్యకాదంబరి’ రచించాడు. ఈ గ్రంథం లభ్యం కావటం లేదు. బిల్హణుడు ‘విక్రమాంకదేవ చరిత్రం’ రచించాడు. దాని ప్రభావంతో ‘జల్హణుడు’ ‘సోమపాలచరిత్ర’ రచించాడు. సోమపాలుడు రాజపురి (రాజౌరి) సేనాని. ఈ ప్రభావంతోనే కల్హణుడు ‘జయసింహాభ్యుదయం’ రచించాడు. ఈ గ్రంథం ఇప్పుడు దొరకటం లేదు. కానీ ఇందులోని భాగాలను రాజతరంగిణిలో పొందుపరిచాడు కల్హణుడు. దీని అర్థం ఏంటంటే,  రాజతరంగిణి రచనకు ముందు కల్హణుడు చదివిన కావ్యాలు, చేసిన రచనలు అన్నీ రాజతరంగిణి రచనకు తయారీ వంటివన్నమాట. బిల్హణుడు రాసిన ‘విక్రమాంక చరిత్ర’ ప్రత్యేకత ఏంటంటే ఈయన చాళుక్యుడి ఆస్థానానికి చెందిన వాడయినా తన రచనలో జన్మభూమి కశ్మీరును వర్ణించాడు. మధుర, బృందావనం, కన్యాకుబ్జం, ప్రయాగ, వారణాసి, దోహల (బుందేల్ ఖండ్), అన్హిలవాద (గుజరాత్), సోమనాధ, రామేశ్వరం, కార్టనీ దేశాలలో తన ప్రయాణాలను వర్ణించాడు.

మంఖుడు రచించిన ‘శ్రీకంఠచరితమ్’ శివుడి గాథను మహాకావ్యంగా మలుస్తుంది. ఈయన తన రచనలో ఆ కాలంలో లాభం, స్వార్థం, మోహం, ఆశ్రితపక్షపాతం వంటి దారుణాలును విమర్శించాడు. తన రచనను పండిత సభలో సమర్పించి మన్ననలను పొందాననీ రాసుకున్నాడు. తన రచనలో ఆ కాలంలో పండిత సభలోని మహా కవుల పేర్లు ప్రస్తావించాడు. వారిలో లోప్తదేవుడు (దీనాక్రందన స్తోత్రం) జల్హణుడు, (సోమపాలచరితమ్), శంభూమహాకవి, (అన్యోక్తిముక్తాలత, రాజేంద్ర కర్ణపూర), కళ్యాణుడు వంటివారున్నారు. కళ్యాణుడు కల్హణుడని నిరూపితమయింది. అంటే కల్హణుడు రాజతరంగిణి రచించటంపై ఇన్ని కావ్యాల ప్రభావం ఉన్నదన్నమాట.

కల్హణుడి రాజతరంగిణి తరువాత కశ్మీరులో వెలువడిన కావ్యాలలో అత్యంత ప్రధానమైనది ‘పృధ్వీరాజ విజయం’. ఇది రచించినది జయాననుడు. షాహబుద్దీన్ ఘోరీ పై పృథ్వీరాజు క్రీ.శ.1193లో సాధించిన విజయం ఈ కావ్య ప్రధానాంశం. ఇంకా జయరధుడు ‘హరచరిత చింతామణి’ రచించాడు.

కావ్య సాహిత్యంకాక ఇంకా శతకాలు, ఇతర సాహిత్య రచనలు కశ్మీరంలో వెల్లివిరిశాయి. బిల్హణుడి ‘చోరపంచశతి'(రాకుమారిని ప్రేమించిన నేరానికి బిల్హణుడికి శిరచ్ఛేదం శిక్ష విధించి జైల్లో పెడతారు. మరణానికి ఎదురుచూస్తూ రాసిన ప్రేమ లేఖల గాథ ఈ చోరపంచశతి.), భల్లటుడి ‘శతకాలు’, ముక్తాకణ చక్రపాలుల గీతాలు, కవితలు, భట్టు నారాయణుడి ‘స్తవచింతామణి’, జగద్ధాత రచన ‘స్తుతిముకుసుమాంజలి’ వంటి రచనలు, బకుడు, ఆనందుడు, అవతారుడు, షాహిబ్ కౌల, గోపాల రాజాననుడు వంటి వారి రచనలతో పాటు షిల్హణుడి ‘శాంతి శతకం’ వంటివి ప్రాచుర్యం పొందిన సంస్కృత రచనలు.

కశ్మీరు సంస్కృత రచలతో వెల్లివిరిసినా ఈనాటికీ దేశమంతా వినిపించే కశ్మీరు కవులు క్షేమేంధ్రుడు, సోమదేవుడు, కల్హణుడు. క్షేమేంద్రుడు, సోమదేవుడి రచనల ప్రభావం కూడా అధికంగా ఉంది. ఇది రాజతరంగిణిలో స్పష్టంగా కనిపస్తుంది. కశ్మీర సాహిత్యం పైనే కాదు ప్రపంచ సాహిత్యం పై కశ్మీరు బౌద్ధ సాహిత్యం చూపిన ప్రభావాన్ని స్మరిస్తూ, సమస్త సాహిత్య ప్రభావం కల్హణుడి రచనలో ఏ రూపంలో ప్రతిఫలించింది, ఏ రకంగా రాజతరంగిణిని ఒక ప్రత్యేక రచనగా కాక సమస్త భారతీయ సాహిత్య ప్రభావ సమ్మిశ్రిత రచనగా, తీరాన్ని తాకి వెనక్కు వస్తున్న అనేక అలల నీటి సమ్మశ్రిత ప్రభావంతో నింగికి ఎగసిన ఉత్కృష్టమైన అలగా గుర్తించాల్సి ఉంటుందో చర్చించుకోవాల్సి ఉంటుంది.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here