కశ్మీర రాజతరంగిణి-42

2
7

[box type=’note’ fontsize=’16’] కశ్మీర్ ప్రాచీన చరిత్ర గురించి అవగాహన కలిగించి, భవిష్యత్తు గురించి ఆలోచనలు కలిగించాలన్న ప్రయత్నంలో భాగంగా నీలమతపురాణం తరువాత అందిస్తున్న జోనరాజు, శ్రీవరుడు, ప్రజ్ఞాభట్టులు కల్హణుడి అడుగుజాడల్లో నడుస్తూ సంస్కృతంలో రచించిన ‘కశ్మీర రాజతరంగిణి’ అనువాదాన్ని తెలుగు పాఠకులకు అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ. [/box]

[dropcap]ఇ[/dropcap]క్కడి నుండి మూడో తరంగం ఆరంభమవుతుంది.

కల్యాణినా ప్రాణివధే తేన రాష్ట్రాన్నివారితే।
నిష్టాపం ప్రాపితా వృత్తం స్వకోశాత్సానివాదయః॥
(కశ్మీర రాజతరంగిణి – III.6)

దేశైక దేశాల్లోర్నాశ్నన్ముః ప్రాప్తస్తస్యా పితుర్గురుః।
స్తున్వా తద్భాషయా ప్రోక్తో లోస్తోన్వాస్తూపకార్లకృత॥
(కశ్మీర రాజతరంగిణి – III.10)

రాజ్యం మేఘవాహనుడికి అప్పగించి, తాను పూజించే శివలింగాన్ని చేబూని  సంధిమతి అడవుల్లోకి వెళ్ళిపోవడంతో రెండవ తరంగం  పూర్తవుతుంది. సంధిమతి లాంటి రాజు గురించి, అతడు ఆధ్యాత్మిక భావనతో, నిర్మోహంగా, ఎలాంటి ఐశ్వర్యలోభానికి, అధికార దాహానికి తావివ్వకుండా రాజ్యం చేసి, అంతే నిర్మోహంగా రాజ్యాన్ని మరొక రాజుకు అప్పగించి వెళ్ళిపోవటమనే అద్భుతం కేవలం భారతీయ ధర్మంలోనే సాధ్యం.

అన్యేధుః ప్రకృతీః సర్వాః సంనిపత్య సభాన్తరే।
తాభ్యః ప్రత్యర్పన్నాసమివ రాజ్యం సురక్షితమ్॥
(కశ్మీర రాజతరంగిణి – III.15)

మరుసటి రోజు, ప్రజలందరినీ సమావేశపరిచి, నిండు సభలో అందరి సమక్షంలో, బహిరంగంగా, భద్రంగా రక్షించిన నిధిని దాని యజమానికి తిరిగి అప్పగించినట్టు రాజ్యాన్ని ప్రజలకు అప్పగించాడు సంధిమతి.

‘భద్రంగా రక్షిస్తూ కాపాడిన నిధిని యజమానికి తిరిగి అప్పగించినట్టు…’ అద్భుతమైన వర్ణన. రాజు ప్రజల సంరక్షకుడు. ప్రజా సేవకుడు మాత్రమే. ప్రజలపై అధికారి కాడు. యజమాని కాడు. ఎవరైనా అలా భావిస్తే అది వారి అవగాహనా లోపం. అహంకారం నిండిన దృష్టి దోషం. అంటే, భారతీయ ధర్మంలో రాజ్యాధికారం వంశపారంపర్యంగా అందటం కూడా వ్యక్తికి బాధ్యతే. దాన్లో గొప్ప లేదు. ఈ భావన గ్రహించని మూర్ఖులు రాజులమని విర్రవీగుతారు. అసలు నిజం తెలిసిన వారు తాము ప్రజాసేవకులము మాత్రమే అని గుర్తించి తమ కర్తవ్యాన్ని నిర్వహిస్తారు.

సంధిమతి జీవితం గురించి నిజానికి దేశంలోని ప్రతి పౌరుడికీ తెలియాల్సిన అవసరం ఉంది. ఎంతటి మహోన్నత వ్యక్తులు, ఈ దేశంలో ఈ ధర్మంలో జన్మించి తమ  జీవితాలను భావితరాలకు మార్గదర్శకంగా నిలిపారో తెలుసుకోవాల్సి ఉంది. ఇలాంటి వారి అద్భుత గాథలు భావితరాల కోసం పొందుపరిచి అందించిన కల్హణుడి లాంటి మహాకవులను తలచుకుంటూ, ఒక ఉత్తమ ఆదర్శాన్ని గ్రహించాల్సి ఉంది. కానీ మన సంస్కృతి, మన ధర్మం, మన జీవన విధానాల గురించి ఇతరుల అభిప్రాయాలను ప్రామాణికంగా తీసుకుని, న్యూనతా భావం ఏర్పర్చుకోవటం వల్ల, ఆదర్శంగా నిలుపుకోవాల్సిన వాళ్ళంతా అదృశ్యమై, పరదేశీయులు ఆదర్శమై నిలుస్తున్నారు. మనల్ని మనం విస్మరించి పరాయికరణం చెందుతున్నాం, వేష భాషల్లోనే కాదు, మానసికంగా కూడా!

సంధిమతి తరువాత మేఘవాహనుడు రాజ్యానికి రావటంతో మూడవ తరంగం ఆరంభమవుతుంది.

మేఘవాహనుడు గాంధారంలో ఉంటున్న కశ్మీర రాజ వంశానికి చెందినవాడు. అతడు ప్రాగ్జోతిష్పురం రాకుమారిని స్వయంవరంలో వివాహమాడుతాడు. సంధిమతికి ప్రత్యామ్నాయం వెతుకుతున్నప్పుడు వారి దృష్టి గాంధారంలో ఉన్న మేఘవాహనుడిపై పడింది. మేఘవాహనుడిని కశ్మీరం ఆహ్వానించారు. అతడు తన భార్య అమృతప్రభతో కలిసి కశ్మీర రాజ్యభారం స్వీకరించాడు.

మేఘవాహనుడు ఉత్తముడు. సకల ప్రాణులను ప్రేమించేవాడు. సకల ప్రాణులపై ప్రేమ కురిపించటంలో బోధిసత్వుని మించిపోయాడు. అధికారానికి వస్తూనే ‘జంతు హింస’ను నిషేధించాడు. ఈ విషయం రాజ్యమంతా చాటింపు వేయించాడు.

రాజు ప్రజల జీవితాలపై ప్రభావం చూపే నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ నిర్ణయం వల్ల కలిగే పరిణామాలను గ్రహించి, వాటికి ప్రతిక్రియలు చేపట్టాలి. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం నిర్ణయాలను ప్రతిపక్షాలు పరిశీలిస్తాయి. హెచ్చరిస్తాయి. కానీ రాచరికంలో రాజు మనస్సాక్షి తప్ప రాజును హెచ్చరించే వ్యవస్థ మరొకటి లేదు. ఏ రాజయితే ప్రజల కష్టనష్టాలను పట్టించుకుని, ఒక వ్యవస్థను మార్చే సమయంలో నష్టపోయేవారికి ప్రత్యామ్నాయం సూచిస్తాడో ఆ రాజు మనస్సాక్షి ఉన్నవాడు. అసలైన ప్రజాపాలకుడు అతడు. అతడి పట్ల ప్రజలలో నిరసన వ్యక్తం కాదు.

జంతుబలులను, జీవహింసను నిషేధించిన మేఘవాహనుడికి తెలుసు, మాంసం కొట్టేవారందరి జీవిక ప్రమాదంలో పడుతుందని.  బలులిచ్చి, పలురకాల క్రతులు నిర్వహించే వారి జీవిక ప్రమాదంలో పడుతుందని. కొన్నేళ్ళుగా, తరాలుగా ఆచరిస్తున్న వాటిని నిషేధించటం నిరసనకు కారణం అవుతుందని.  రాజాజ్ఞ వల్ల తమ జీవిక పోయిందని వారు నిరసనలు, ధర్నాలు చేయాల్సిన అవసరం లేకుండా రాజు, వారి జీవిక కోసం అవసరమైన ధనాన్ని తన కోశాగారం నుంచి అందే ఏర్పాట్లు చేశాడు.  జంతుబలులను నిషేధించడం వల్ల క్రతువులు నిర్వహించే వారి నిరసనను అరికట్టేందుకు నెయ్యితో చేసిన జంతువులను అర్పించే పద్ధతి ఆరంభమయింది. అంటే జంతుబలులను నిషేధించినా ప్రజలు అలవాటయిన క్రతువులను నిర్వహించేందుకు ప్రత్యామ్నాయాన్నీ ఏర్పాటు చేశాడన్నమాట. ఇది, ప్రతిబంధకం ఎదురయినప్పుడు, తాత్కాలికంగా వంగి ప్రతిబంధకం చుట్టూ ప్రవహిస్తూ, నెమ్మదిగా దాన్ని కోసేసి తనలో కలుపుకుని పోయే భారతీయ ధర్మం లక్షణాన్ని చూపిస్తుంది.  ప్రజాస్వామ్యంలో ప్రజలు నిరసనలు, ధర్నాలు చేస్తారు, తమ సమస్యలను ప్రభుత్వానికి తెలిపేందుకు. రాచరికంలో అలాంటి అవకాశం లేదు. కానీ, ప్రజలు ఎలాంటి నిరసన తెలపకముందే, వారి సమస్యను గ్రహించి మేఘవాహనుడు, వారి జీవికకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేశాడు. ఇప్పటి భాషలో చెప్పాలంటే రాచరికమయినా, ప్రజాస్వామ్య ప్రభుత్వాల కన్నా most responsive Government మేఘవాహనుడిది అనవచ్చు. ఇలాంటి రాజులు రాజ్యం ఏలారు కాబట్టే, భారతదేశంలో రాజుల వ్యతిరేక ఉద్యమాలు, తిరుగుబాట్లు, విప్లవాలు అరుదుగా జరిగేవి. ఈ నిజాన్ని కప్పిపుచ్చి, ‘భారతీయులు దేన్నయినా తలవంచి స్వీకరిస్తారు. కర్మ సిద్ధాంతం వారిని నిర్వీర్యులను చేసింది’ అని దుర్వ్యాఖ్యానాలు చేస్తారు కొందరు.

మేఘవాహనుడు, అతని భార్య అమృతప్రభలు దేశంలో దేవాలయాలు, విహారాలు నిర్మిస్తూ పోయారు. అమృతప్రభ, విదేశాల నుంచి వచ్చే బౌద్ధ భిక్షువుల కోసం ఓ విహారాన్ని ప్రత్యేకంగా నిర్మింపచేసింది. ఆమె తండ్రి గురువు, ‘లోహ్’ నుంచి వచ్చిన ‘స్తున్పా’,  ‘లో-స్తోన్పా’ అనే స్థూపాన్ని నిర్మింపచేశాడు.

ఇది అత్యంత ఆసక్తి కలిగించే విషయం. మేఘవాహనుడి భార్య అమృతప్రభ ప్రాగ్జోతిష్పురం రాకుమారి. ఆమె తండ్రి గురువు ‘లోహ్’కి చెందినవాడు. కొందరు చరిత్ర రచయితలు ‘లోహ్’ అనగానే ‘లేహ్’ అని నిర్ధారించారు. కానీ ‘లేహ్’కి చెందినవాడయితే ప్రాగ్జోతిష్పురం రాజు గురువు అవటం అంతగా కుదరదు. రాహుల్ సాంకృత్యాయన్ ‘టిబెట్’ భాషలో ‘స్తోన్పా’ అంటే గురువు అని, ఈ పదం బుద్ధుడిని సూచించేందుకు వాడతారని నిర్ధారించాడు. దాంతో ఈ ‘లోహ్’ టిబెట్‌కి చెందిన ప్రాంతంగా గుర్తించారు. ‘లోన్పా’ అన్నది వ్యక్తి పేరు కాక ‘గురువు’ అన్న సంబోధనగా భావిస్తున్నారు.

ఇది మరింత ఆసక్తికరమైన విషయం. అస్సాం రాజుకు టిబెట్ గురువు! ఆ కాలంలో అస్సాం, టిబెట్‍ల నడుమ సత్సంబంధాలుండేవి. ప్రాచీన కాలం నుంచి అస్సాం మాత్రమే కాదు, కశ్మీరు కూడా ఇతర ప్రాంతాలతో సత్సంబంధాలు కలిగి ఉండేదనడానికి ఇది నిదర్శనం. చరిత్రకారులు నమ్మించాలని ప్రయత్నిస్తున్నట్టు, కశ్మీరు ఇతర ప్రాంతాలతో సంబంధం లేకుండా ప్రత్యేకంగా నిలిచిందనటానికి ఆధారాలు లేవు. కానీ ఆ భావన ప్రచారంలోకి వచ్చింది. కానీ, రాజతరంగిణిని, ఇతర ఆధారాలను గమనిస్తే కశ్మీరు ఏనాడు పత్యేకంగా, ఒంటరిగా లేదు. భారతదేశంలోని ఇతర ప్రాంతాలతో సంబంధం కలిగి ఉంటూ తాను ప్రభావితమయింది, ఇతర ప్రాంతాలను ప్రభావితం చేసింది.

రాజతరంగిణిలో మూడవ భాగంలోని 12వ శ్లోకం మరో ఆసక్తికరమైన విషయం చెప్తుంది. మేఘవాహనుడి మరో భార్య ‘యూక దేవి’ ఓ గొప్ప విహారాన్ని కట్టించింది. ఆ విహారంలో రెండు భాగాలుండేవి. ఒక విభాగంలో  బుద్ధుడి బోధనలను తు.చ. తప్పకుండా పాటించే బ్రహ్మచారి శ్రమణులుండేవారు. మరో భాగంలో నిందార్హులైన ప్రవర్తన కల భిక్షువులు, వారి భార్యా పిల్లలతో, పశువులతో ఉండేవారు. అంటే, బౌద్ధంలో భిక్షుక వ్యవస్థతో పాటు సాంసారిక వ్యవస్థ కూడా సహజీవనం చేసే పరిస్థితి వచ్చిందన్న మాట. ఒకే విహారంలో రెండు భాగాలు, ఒక భాగంలో నియమాలను పాటించేవారు, మరో భాగంలో నియమోల్లంఘన చేసినవారు జీవించటం ఈ భావనను కలిగిస్తుంది. బౌద్ధం, మన పుస్తకాలలో చదువుకుంటున్న విధంగానే కాక, ఇలా ఎన్నో మార్పులను చెందిందని అనిపిస్తుంది.

ఇక్కడ మేఘవాహనుడికి సంబంధించి కొన్ని అద్భుతమైన గాథలు చెప్తాడు కల్హణుడు. వీటన్నిటినీ కట్టుకథలుగా, నమ్మదగనివిగా కొట్టేస్తారు చరిత్ర రచయితలు. కానీ ఇతర గ్రంథాలో ఇలాంటి కథలనే ప్రామాణికంగా తీసుకుని భారతీయ ధర్మాన్ని విమర్శించేందుకు, జీవన విధానాన్ని తూలనాడి సమాజంలో విచ్ఛిన్నకరమైన భావనలను వెదజల్లేందుకు వాడతారు.

మేఘవాహనుడు తన గుర్రం మీద విహరిస్తున్న సమయంలో ‘దొంగ’, ‘దొంగ’ అన్న కేకలు వినిపించాయి. అతడు గుర్రం ఆపి ‘దొంగను పట్టుకోండి’ అని ఆజ్ఞాపించాడు. వెంటనే అరుపులు ఆగిపోయాయి. కానీ దొంగలని ఎవరూ పట్టుకురాలేదు. అలా రెండు మూడు మార్లు జరిగిన తరువాత రాజు ‘దొంగను పట్టుకోండి’ అని అక్కడే ఆగాడు. అప్పుడు కొందరు మహిళలు రాజు దగ్గరకు వచ్చి అసలు విషయం చెప్పారు.

నాగులు ఆకాశంలో మేఘాలుగా మారి, ఆకాశాన్ని కప్పినప్పుడు, రైతులు వారు కురిపించే వడగళ్ళ వానలకు తమ  పంటలు నాశనమవుతాయని ‘దొంగలు, దొంగలు’ అని అరిచారు. వారి అరుపులు విని రాజు ‘దొంగలను పట్టుకోండి’ అనగానే రాజు భయంతో నాగులు స్వచ్ఛందంగా సంకెళ్ళు విధించుకుని నేలపై పడిపోయారు. ‘తమ భర్తలకు విముక్తిని ప్రసాదించమ’ని ఆ మహిళలు, అంటే నాగుల భార్యలు మేఘవాహనుడిని వేడుకుంటారు. మేఘవాహనుడు నాగులకు స్వేచ్ఛను ప్రసాదించాడు. నాగులు, వారి భార్యలతో మేఘవాహనుడి స్తుతించి రాజ్యం వదిలి  మానవులకు దూరంగా వెళ్ళారు.

ఈ కథ వినగానే కల్పన అనిపిస్తుంది. రాజతరంగిణిలో ఈ భాగం ‘చరిత్ర కాదు’ అనిపిస్తుంది. కానీ ఇలాంటి ఇతర గాథలకు అన్వయించిన సూత్రాలను, ప్రామాణికాలనే ఈ గాథకూ అన్వయిస్తే ఆనాటి సామాజిక పరిస్థితుల స్వరూపం అవగాహనకు వస్తుంది.

కశ్మీరు ఆవిర్భవించిన తొలి దినాలలో మానవులకు, నాగులకు నడుమ ఒప్పందం జరిగింది. ‘నీలమత పురాణం’ ఈ విషయాన్ని ప్రధానంగా చెప్తుంది. తరువాత ఈ ఒప్పందం భగ్నమయిన సమయంలో చంద్రదేవుడు మళ్ళీ నీలుడిని పూజించి, మెప్పించి, మళ్ళీ నీలమత పురాణంలో చెప్పిన పద్ధతులను పాటించడం ఆరంభించాడు. కాలక్రమేణా మళ్ళీ ప్రజలు ఆ పద్ధతులను విస్మరించారు. మేఘవాహనుడి కాలం వచ్చేసరికి బౌద్ధం అమలవుతోంది. జినదేవుడి సూత్రాలు పాటించటం రాజాజ్ఞ అయింది. బలులు నిషేధించారు. ‘జీవహింస’ అమలు ఆగిపోయింది. దాంతో నాగులకు బలులు అందటం లేదు. పూజలు జరగటం లేదు. కాబట్టి నాగులు మళ్ళీ వర్షాలు కురిపించటం, పిడుగులు, వడగళ్ళతో పంటలను నాశనం చేయటం ప్రారంభించారు. అయితే మేఘవాహనుడు శక్తిమంతుడు, సమర్థుడు. అతడు నాగులను అణచివేశాడు. బంధించాడు. వారి ఆధిక్యాన్ని తొలగించాడు. దాంతో నాగులు రాజు శరణువేడి, క్షమ పొంది, రాజ్యం విడిచిపోయారు. అంటే, అంతవరకూ మనుషులకూ, నాగులకూ మధ్య ఉన్న బంధం సంపూర్ణంగా తెగిపోయింది. మనుషులు, నాగులు వేరయ్యారు. ఈ గాథ జనజీవనానికి  నాగులు దూరంగా వెళ్ళిపోవటం, నాగులపై మానవుల ఆధిక్యాన్ని సూచిస్తుంది.

మరో కోణం లోంచి చూస్తే కల్హణుడు ప్రతీకాత్మకంగా బౌద్ధులకూ, నాగులకూ నడుమ జరిగిన ఘర్షణనూ, నాగులు పరాజితులై, రాజ్యం వదిలిపోవటమో, బౌద్ధులై పోవటమో సూచిస్తున్నట్టు తోస్తోంది. కల్హణుడు మౌలికంగా బౌద్ధ పక్షపాతి. రాజతరంగిణి రచనలో బౌద్ధం పట్ల అతని అభిమానం పలు సందర్భాలలో ద్యోతకమవుతుంది. కాబట్టి, నాగులకూ, బౌద్ధులకూ నడుమ సంఘర్షణ జరగటం, బౌద్ధులు నాగులను అణచటం అన్న సత్యాన్ని, ప్రచారంలో ఉన్న ఈ గాథ ద్వారా ప్రదర్శించాడు. ఇది మేఘవాహనుడి గొప్పతనాన్ని సూచిస్తుంది. అతడు ‘బంధించండి’ అనగానే ‘స్వచ్ఛందంగా నాగులు బంధితులై పడిపోవటం’ వారి సంపూర్ణ పరాజయాన్ని, మేఘవాహనుడి సంపూర్ణ ఆధిక్యాన్ని సూచిస్తుంది. పరోక్షంగా ప్రాచీన సమాజంలోని సమతౌల్యాన్ని బౌద్ధం దెబ్బతీయటం , అప్పటి సంస్కృతి, సాంప్రదాయాలను   బౌద్ధం అణచివేయటాన్ని సూచిస్తుంది. మేఘవాహనుడి పాలనా కాలం కశ్మీరు రూపాంతరం చెందటాన్ని సూచిస్తుంది. మేఘవాహనుడు సనాతన ధర్మానుయాయి. కాని జిన బోధనల ప్రభావితుడు. జీవహింస వ్యతిరేకి. అతని భార్య బౌద్ధానుయాయి. అతను అగ్రహారాలు నిర్మించాడు. ఆమె విహారాలు నిర్మించింది. ఇంతకన్నా సహజీవనానికి గొప్ప ఉదాహరణ అవసరం లేదు. ఈ గాథలో భారతీయ ధర్మం పరిస్థితులకు అనుగుణంగా మారటం  కూడా తెలుస్తుంది. రాజు జంతుబలులు నిషేధించగానే, జంతుబలి బదులు నెయ్యితో చేసిన జంతువులను ప్రసాదంగా ఇవ్వటం ఆరంభమయింది. ఇలా తమని తాము మార్చుకోలేని నాగులు రాజ్యం వదిలి వెళ్ళాల్సి వచ్చింది. భారతీయ ధర్మంలోని ఈ ‘adaptability’ దానిని ఈనాటికీ చిరంజీవిగా నిలుపుతోంది.

కశ్మీరుపై సంపూర్ణ ఆధిక్యం సాధించిన మేఘవాహనుడు ఇతర దేశాలవైపు దృష్టి సారించాడు.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here