కశ్మీర రాజతరంగిణి-5

4
11

[box type=’note’ fontsize=’16’] కశ్మీర్ ప్రాచీన చరిత్ర గురించి అవగాహన కలిగించి, భవిష్యత్తు గురించి ఆలోచనలు కలిగించాలన్న ప్రయత్నంలో భాగంగా నీలమతపురాణం తరువాత అందిస్తున్న జోనరాజు, శ్రీవరుడు, ప్రజ్ఞాభట్టులు కల్హణుడి అడుగుజాడల్లో నడుస్తూ సంస్కృతంలో రచించిన ‘కశ్మీర రాజతరంగిణి’ అనువాదాన్ని తెలుగు పాఠకులకు అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ. [/box]

[dropcap]క[/dropcap]శ్మీరు ఆరంభంలో సతీసరోవరం నీట మునిగి ఉండేది. గరుడుడి నుండి రక్షణ పొందేందుకు నాగులు విష్ణువును ప్రార్థించాయి. విష్ణువు ప్రసన్నుడయ్యాడు. ‘సతీ సరోవరం’ పార్వతి స్వరూపం, కాబట్టి వెళ్ళి ఆ సరస్సులో ఉండమన్నాడు. అక్కడ ఉంటే గరుడుడు ఏమీ చేయలేడు, రక్షణ ఉంటుందన్నాడు. నాగులు ‘సతీ సరోవరం’ చేరాయి. సతీదేవి ఆ సరోవరానికి అప్పుడప్పుడూ వస్తూంటుంది. అలా ఓ సారి సతీదేవిని చూసిన రాక్షసుడు మోహించాడు. అతడి రేతస్సు పతనమై సరోవరంలో పడింది. నాగులు ఆ రేతస్సును భద్రపరిచారు. జీవం పోశారు. ఫలితంగా జలోద్భవుడనే రాక్షసుడు ఉద్భవించాడు. వాడు బ్రహ్మదేవుడి నుంచి నీటిలో ఉన్నంత వరకూ తనకు ఎవరి చేతిలో చావు లేకుండా వరం పొందాడు. ఆ వర గర్వంతో అందరినీ పీక్కుతినటం ఆరంభించాడు జలోద్భవుడు.

నాగుల రాజు నీలుడు తమకు జలోద్భవుడి నుంచి విముక్తిని ప్రసాదించమని కశ్యపుడిని ప్రార్థించాడు. కశ్యపుడు విష్ణువును ప్రార్థించాడు. శివుడు, విష్ణువు కలిసి సతీ సరోవరం నుంచి నీటిని వెడల నడిపారు. నీటి ఆచ్ఛాదన లేకపోవటంతో బలహీనుడయిన జలోద్భవుడిని విష్ణువు సంహరించాడు. అలా నీట మునిగిన భూభాగం కశ్యపుడి వలన మానవ నివాసయోగ్యం అయి కశ్మీరు అన్న పేరుతో చలామణీ అవుతోంది. గమనిస్తే ఆవిర్భావం నుంచి ఈనాటి వరకూ అదే పేరుతో చలామణీలో ఉన్న అరుదైన ప్రాంతం కశ్మీరు.

ఇలా ఏర్పడిన కశ్మీరులో నాగులతో పాటు నివసించేందుకు మనుషులు వచ్చారు. పిశాచాలు వచ్చాయి. అంతా కలిసి సహజీవనం సాగించారు. తమతో కలిసి ఉండేందుకు చేయాల్సిన పనులను నీలుడు మానవులకు చెప్పాడు. దాన్ని ‘నీలమతం’ అంటారు. నీలమత పురాణం ఈ విషయాలనే చెప్తుంది. అప్పటి నుంచీ కశ్మీరులో మానవులు నాగులను పద్ధతి ప్రకారం పూజించటం ప్రారంభించారు. అందుకే కశ్మీరులో అంతా నాగమయం. శేష్‌నాగ్, అనంత్‌నాగ్ ఇలా కశ్మీరులో ప్రతీ సరోవరం ఓ నాగుతో సంబంధం కలిగి ఉంటుంది. కశ్మీరులోని ఒకో జలాశయం ఒకో ప్రత్యేకమైన నాగుతో సంబంధం కలిగివుంటుంది. ఆ సరోవరంలో ఆ నాగు నివసిస్తాడని ప్రజల నమ్మకం.

కొందరు చరిత్రకారులు కశ్మీరులో ఆరంభంలో నాగుల మతం ఉండేదని, తరువాత హిందూ ధర్మం ప్రవేశించిందని చెప్తారు. హిందూ ధర్మంలోని కుల వైరుధ్యాలు, మూర్ఖ పద్ధతుల వల్ల ప్రజలు తార్కికము, పూజా పద్ధతుల రహితము, విజ్ఞానవంతము అయిన  బౌద్ధం వైపు ఆకర్షితులయ్యారని తీర్మానిస్తారు. బౌద్ధం కశ్మీరులో ప్రవేశించటంతోటే కశ్మీరులో ఉద్విగ్నతలు పెరిగాయని రాస్తారు. ప్రజలు బౌద్ధాన్ని పెద్ద ఎత్తున స్వాగతించారని, చివరికి హిందూ ధర్మం తన ఆధిక్యతను నిరూపించుకుని 13వ శతాబ్దానికల్లా  బౌద్ధాన్ని పూర్తిగా అణచివేసిందని నిర్ణయిస్తారు.

అయితే, నీలమత పురాణం కానీ, రాజ తరంగిణి కానీ పైపైన పరిశీలించినా ఒక విషయం స్పష్టమవుతుంది. కశ్మీరులో ఆరంభం నుంచి నాగులు ఉన్నారు. కానీ నాగులు ప్రార్థించింది శివుడిని, విష్ణువును, బ్రహ్మను. వారిని రక్షించింది కశ్యపుడు. అంటే ఆరంభంలో నాగులు, నాగమతం ఉండేదని, హిందువులు వచ్చి తమ ధర్మాన్ని స్థాపించారని అనటం అసత్యం . నాగులకు ప్రత్యేక మతం లేదు. వారూ హైందవ ధర్మాన్ని అనుసరించేవారే. కాబట్టి ఈ నాగులు కశ్మీరంలో ఉన్నప్పటి నుంచీ కశ్మీరంలో ఉన్నది హైందవ ధర్మమే! కశ్మీరులో నిండి ఉన్న సరోవరం ‘సతీ సరోవరం’. ఎక్కడా ‘నాగుల మతం’ అన్న ప్రత్యేక భావన ఆరంభం నుంచీ లేదు. ఎందుకంటే నాగులు కూడా హిందూ సంప్రదాయంలోని వారే. కద్రువ సంతతి నాగులు. వారు కశ్మీరులో తమతో సహజీవనం చేసేందుకు వచ్చిన మానవులను తమను పూజించమన్నారు. ‘నీలమత పురాణం’ పరిశీలిస్తే ప్రజలు నాగులను మాత్రమే కాదు, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులతో సహా పిశాచాలను కూడా పూజించేవారని అర్థమవుతుంది. ఇదంతా కలిపితే హిందూ ధర్మం. అంటే నాగుల పూజ ఓ ప్రత్యేక మతం కాదు. హిందూ ధర్మమనే మహానదిలో ఓ పాయ లాంటింది. అంటే నాగపూజ కూడా హిందూ ధర్మంలో భాగమే తప్ప ప్రత్యేక మతం కాదు. అంటే, బౌద్ధం కశ్మీరంలో ప్రవేశించే నాటికి కశ్మీరంలో నాగమతం అంటూ, హిందూ ధర్మం అంటూ వేర్వేరు లేవు. ఉన్నది ఒక్కటే హిందూ ధర్మం. కశ్మీరు ఆవిర్భావం నుంచి బౌద్ధం ప్రవేశించేవరకూ కొనసాగుతోంది హిందూ ధర్మమే!

కశ్మీరంలోకి బౌద్ధం ఎప్పుడు, ఎలా ప్రవేశించిందన్న విషయంలో పలు భిన్నాభిప్రాయాలున్నాయి. అశోకుడు బౌద్ధం స్వీకరించిన తరువాత దేశం నలుమూలలకూ బౌద్ధమత ప్రచారం కోసం బౌద్ధ భిక్షువులను పంపించాడు. అలా పంపిన బౌద్ధ భిక్షువుల ద్వారా కశ్మీరంలో బౌద్ధం అడుగుపెట్టిందని కొందరి అభిప్రాయం. దీనికి తోడు రాజతరంగిణిలో అశోకుడనే రాజు ప్రసక్తి వస్తుంది. ఈయన బౌద్ధ ధర్మాన్ని కశ్మీరులో ప్రచారం చేసినవాడు. అనేక ఆరామాలు కట్టించాడు. దాంతో చరిత్రకారులు మనకు తెలిసిన అశోకుడే కశ్మీరులో బౌద్ధాన్ని ప్రవేశపెట్టిన అశోకుడని తీర్మానించారు. రాజతరంగిణిలోని అశోకుడి కాలంతో అశోకుడి కాలాన్ని జతపరిచారు.

శ్రీలంకకు చెందిన ‘మహా వంశ’ గ్రంథం ప్రకారం అశోకుడి కన్నా ముందు నుంచే కశ్మీరంలో బౌద్ధం ఉంది. మధ్యాంతికుడు అనే పరివ్రాజకుడు కశ్మీరులో బౌద్ధాన్ని ప్రవేశపెట్టాడు. ఈయన యక్ష పండిత అనే ‘నాగు’ను బౌద్ధమతంలోకి మార్చాడు. అలా కశ్మీరంలో బౌద్ధం అడుగుపెట్టింది. మధ్యాంతికుడు బౌద్ధ ధర్మాన్ని ‘ఆనందుడి’ నుంచి స్వీకరించాడు.

ఏడవ శతాబ్దంలో కశ్మీరులో పర్యటించిన హుయాన్ త్సాంగ్ తన అనుభవాలలో కశ్మీరులో బౌద్ధం గురించి రాశాడు. కశ్మీరు ఆరంభంలో డ్రాగన్ సరస్సు నీటితో నిండి ఉండేదని, కశ్మీరుని నాగుల నుంచి మధ్యంతికుదు రక్షించాడని రాశాడు. ఈయన కశ్మీరులో 500 అర్హతులను స్థిరపరిచాడనీ రాశాడు. ఇక్కడ గమనించాల్సిందేంటంటే, కశ్మీరును నాగుల నుంచి మధ్యంతికుడు రక్షించాడు. ఒకే సంఘటన దృక్కోణం మారిపోతే కనిపించే విధానం, అర్థం అయ్యే పద్ధతి మారిపోతుంది.

కశ్మీరులో కొన్ని వేల ఏళ్ళ నుంచి స్థిరపడి ఉన్నారు నాగులు. వారి పద్ధతులు వారివి. రాజతరంగిణిలో ప్రజలను నాగులు హింసిస్తున్నట్టు ఎక్కడా లేదు. కానీ మధ్యాంతికుడు వచ్చి కశ్మీరును నాగుల నుంచి రక్షించాడని చైనా యాత్రికుడు రాస్తాడు. దాన్ని ప్రామాణికంగా తీసుకుని మన చరిత్రను మనం విశ్లేషించుకుంటాం.

‘బస్టన్’ అనే టిబెట్‍కి చెందిన పండితుడు 14వ శతాబ్దంలో బౌద్ధల చరిత్రను రాశాడు. ఈయన ప్రకారం మధ్యాంతికుడు కశ్మీరంలో అడుగుపెట్టేసరికి కశ్మీరంలో నాగుల రాజ్యం సాగుతోంది. వారు మధ్యాంతికుడిని పలు ఇబ్బందులు పెట్టారు. కానీ మధ్యాంతికుడు వారు పెట్టిన కష్టాలన్నిటినీ తట్టుకున్నాడు. చివరికి నాగులను అణచివేశాడు. కశ్మీరులో బౌద్ధాన్ని స్థిరపరిచాడు.

భారతదేశంలో లభించే బౌద్ధ గ్రంథాల ప్రకారం బుద్ధుడు మరణ సమయంలో ఆనందుడికి మధ్యాంతికుడి గురించి చెప్పాడు. బుద్ధుడి మరణం తరువాత జరిగిన బౌద్ధుల సమావేశంలో మహాకశ్యపుడు ఆనందుడిని బుద్ధుడి బోధనలను గుర్తు తెచ్చుకుని చెప్పమంటాడు. ప్రతి పరివ్రాజకుడు తన నిర్వాణం కోసం స్వయంగా కృషి చేయాలని చెప్పాడు ఆనందుడు. అతడు మధ్యాంతికుడిని కశ్మీరుకు, గాంధారానికి పంపుతాడు. కశ్మీరులో అతను బౌద్ధాన్ని స్థాపిస్తాడు. అంతే కాదు, కశ్మీరులో కుంకుమపువ్వు సాగు కూడా మధ్యాంతికుడే ప్రవేశపెట్టాడంటారు. ఇంతే కాక, దేశంలో ఇతర ప్రాంతాలవారికి కశ్మీరులో నివాసం కల్పించిందీ మధ్యాంతికుడే అంటారు. ఇప్పటి భాషలో చెప్పాలంటే, ఇతర ప్రాంతాల వారిని కశ్మీరుకు రప్పించి నివాసం ఇవ్వటం వల్ల మధ్యాంతికుడు ‘demographic change’ సాధించాడన్న మాట. నాగుల సంఖ్యను తగ్గించి బౌద్ధుల సంఖ్యను పెంచాడన్న మాట.

1851లో బ్రిటీష్ ఆర్కియాలజిస్టు అలెగ్జాండర్ కన్నింగామ్ సాంచిలోని బౌద్ధ అవశేషాల త్రవ్వకాలు ప్రారంభించాదు. అంతకుముందు 1848లో ఆయన కశ్మీరులోను త్రవ్వకాలు జరిపాడు. తాను కనుగొన్న విషయాలను 1854లో ‘మధ్య భారతంలో బౌద్ధ కట్టడాలు’ అన్న వ్యాసంలో వెలువరించాడు. తవ్వకాలలో దొరికిన అవశేషాల వల్ల మహాకశ్యపుడు, ఆనందుడు, మధ్యాంతికుడు వంటి వారు నిజంగానే ఉండేవారని నిరూపితమయింది. అంటే బౌద్ధుల గ్రంథాలలో ఉన్న విషయాలు సత్యమేనని నిర్ధారణ అయింది. అక్కడ కొన్ని చితాభస్మాలు దొరికాయి. వాటిల్లో కశ్మీరులో బౌద్ధాన్ని ప్రవేశపెట్టిన వ్యక్తి ఎముకలు ఉన్నాయని నిర్ధారణ అయింది.

త్రవ్వకాలలో దొరికిన శిల్పాలలో ఒక అమ్మయి బొమ్మ కశ్మీరీ అమ్మాయిది. ఆమె వేసుకున్న చెవి రింగులు, తలపై ధరించిన వస్త్రాల తీరును బట్టి ఆమె కశ్మీరుకు చెందినది అని నిర్ధారించారు. మరో శిల్పంలో నదిలో పడవలో ప్రయాణిస్తున్న వారున్నారు. ఈ బొమ్మ ఏం చెప్తున్నదో అన్న విషయంలో ఏకాభిప్రాయం లేదు. వాటిల్లో ఒక గాథ ఏమిటంటే, మరణ సమయంలో ఆనందుడు గంగానదిలో ఓ పడవ ఎక్కుతాడు. తన మరణం తరువాత తన శరీరం కోసం ఎవ్వరూ కొట్టుకోకూడని అతని ఆలోచన. అయితే అజాత శత్రు ఆనందుడి పార్థివ దేహం కావాలంటాడు. లిచ్ఛవి రాజు కూడా అదే కోరతాడు. ఈ సమయంలో ఓ ఋషి తన అయిదు వందల మంది శిష్యులతో ఆనందుడి దగ్గరకు వచ్చి పడవలో చోటు అడుగుతాడు. ఈ సంఘటనను ఆనందుడికి బుద్ధుడు ముందే చెప్తాడు. ఆనందుడు వారిని పడవలోకి ఆహ్వానిస్తాడు. ఆ ఋషికి ‘మధ్యాంతికుడు’ అని పేరు పెడతాడు. ఆనందుడు ఆ ఋషిని తన అనుచరులతో కశ్మీరు, గాంధారాలలో బౌద్ధ ప్రచారం చేయమంటాడు. ఆనందుడు మరణిస్తాడు. మధ్యాంతికుడు కశ్మీరు చేరి ‘సర్వాస్తివాద’ బౌద్ధ ప్రచారం చేస్తాడు.

హుయాన్ త్సాంగ్ చెప్పిన గాథ ప్రకారం ఈ పడవలో సర్వస్తివాద బౌద్ధులు ఉన్నారు. వీరు మధురకు చెందినవారు. అశోకుడు వీరిని బౌద్ధం ప్రచారం చేసిన నేరానికి గంగలో ముంచేయాలనుకున్నాడు. కానీ ఈ పరివ్రాజకులు తమ మాయ శక్తితో పడవతో ఎగిరి కశ్మీరం చేరుకున్నారు. అశోకుడు తన తప్పు గ్రహించి వారిని వెనక్కు రమ్మంటాడు. వారు రారు. దాంతో అశోకుడు  కశ్మీరంలో వారి బౌద్ధ మత ప్రచారానికి పెద్ద ఎత్తున సహాయం చేస్తాడు.

ఇలా కశ్మీరంలో బౌద్ధ ప్రవేశం గురించి బౌద్ధ గ్రంథాలు ‘మధ్యాంతికుడి’ గురించి చెప్తాయి. కానీ రాజతరంగిణిలో అశోకుడి ప్రసక్తి వచ్చింది కాబట్టి అశోకుడే కశ్మీరంలో బౌద్ధం ప్రవేశపెట్టాడని చరిత్రకారులంటారు. అయితే రాజతరంగిణిలో అశోకుడి తాత, కొడుకుల పేర్లు మనకు తెలిసిన అశోకుడి తాత, కొడుకుల పేర్లతో సరిపోవు. అయినా సరే, ఆ అశోకుడే ఈ అశోకుడు అంటారు చరిత్రకారులు. ఈ విషయం గురించి చర్చను, భవిష్యత్తు వ్యాసాలకు వాయిదా వేసి ప్రస్తుతం మన దృష్టిని బౌద్ధం వల్ల కశ్మీరంలో వెల్లివిరిసిన సాహిత్యం వైపు మళ్ళిద్దాం.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here