కశ్మీర రాజతరంగిణి-50

6
8

[box type=’note’ fontsize=’16’] కశ్మీర్ ప్రాచీన చరిత్ర గురించి అవగాహన కలిగించి, భవిష్యత్తు గురించి ఆలోచనలు కలిగించాలన్న ప్రయత్నంలో భాగంగా నీలమతపురాణం తరువాత అందిస్తున్న జోనరాజు, శ్రీవరుడు, ప్రజ్ఞాభట్టులు కల్హణుడి అడుగుజాడల్లో నడుస్తూ సంస్కృతంలో రచించిన ‘కశ్మీర రాజతరంగిణి’ అనువాదాన్ని తెలుగు పాఠకులకు అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ. [/box]

కరం పూర్వదిశో గృహ్ణాన్ ప్రతాపానల సంనిధౌ।
అంతర్వేద్యా మహారాజః స్వకీర్త్యుష్ణీ భోః ద్బభౌ॥
(కల్హణ రాజతరంగిణి IV – 132)

[dropcap]ముం[/dropcap]దుగా రాజతరంగిణిలో కల్పణుడు సేకరించి అందించిన లలితాదిత్యుడి చరిత్రను తెలుసుకుందాం.

లలితాదిత్యుడు రాజ్యనికి వస్తూనే జైత్రయాత్ర ఆరంభించాడు.

అతని కీర్తి కిరణాల సుగంధంలో జంబూద్వీపమనే గజాన్ని అలంకరించాడట లలితాదిత్యుడు.

ఇతర రాజులందరూ అతనికి శరణు అనటంతో లలితాదిత్యుడు యుద్ధంలో ఆగ్రహం ప్రదర్శించటం మానేశాడట.

అతని యుద్ధ భేరీ ధ్వనులు వింటుంటే ప్రజలు భయంతో పారిపోయేవారట. సూర్యుడు భూమి పైన తిరుగుతున్నట్టు, రాజు జీవితమంతా యుద్ధ యాత్రలతో గడచిపోయింది. గంగా జమున నడుమ ఉన్న ప్రాంతాలు రాజుకు లొంగి కప్పాలు కట్టాయి. గాధపురం గెలుచుకున్నాడు. యశోవర్మను ఓడించి కన్యాకుజ్జను వశపరచుకున్నాడు. వారిద్దరి నడుమ శాంతి ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందంలో యశోవర్మ పేరు ముందు రాయటం నచ్చని లలితాదిత్యుడు ఒప్పందం రద్దు చేసి యుద్ధంలో యశోవర్మను ఓడించాడు. భవభూతి, వాక్పతి వంటి కవులు కల యశోవర్మ లలితాదిత్యుని పొగుడుతూ కవితలు చెప్పాల్సి వచ్చింది. యమున నుంచి కౌశీక నది వరకు కల కన్యాకుబ్జం లలితాదిత్యుడి పరమయింది. అలా యశోవర్మను జయించిన లలితాదిత్యుడు తూర్పు వైపు సముద్రం చేరుకున్నాడు. కళింగ దేశం గెలుచుకున్నాడు. గౌడ దేశంలో లభించిన ఏనుగులు సముద్రతీరం వెంబడి నడుస్తూంటే సముద్రపుటలల్లాగా అనిపించాయి ఏనుగు తొండాలు. కర్ణాటక ప్రజలు లలితాదిత్యుడికి ఆహ్వానం పలికారు. అంటే, కర్ణాటకను కూడా గెలుచుకున్నడన్నమాట లలితాదిత్యుడు. కర్ణాటక రాణి ‘రత్తో’ శక్తివంతమైన రాణి. ఆమె సైతం లలితాదిత్యడికి దాసోహం అంది. లలితాదిత్యుడి అద్దం లాంటి కాళ్ల గోళ్లలో తన ప్రతిబింబం చూసుకున్నదట ఆమె. కావేరీ నది తీరంలో లలితాదిత్యుడి సేనలు కొబ్బరి నీళ్లు తాగుతూ చెట్ల నీడన విశ్రమించాయట.  సముద్రంలోని ద్వీపాలపై పాదాలుంచి సముద్రం ఓ చిన్న నది అయినట్టు అటూ ఇటూ తిరిగాడట లలితాదిత్యుడు. కొంకణి ప్రాతం కూడా లలితాదిత్యుడు తన వంశం చేసుకున్నాడు. ద్వారక కూడా లలితాదిత్యుడికి దాసోహం అంది. వింధ్య పర్వతం లలితాదిత్యుడికి తలవంచింది. అవంతిని కూడా గెలుచుకున్న తరువాత అతని సేనలు ఉత్తరం వైపు మళ్లాయి. కాంభోజ, తూహ్‌ఖారాలను గెలిచాడు. ముమ్మణిని మూడు మార్లు ఓడించాడు. లలితాదిత్యుడు దాడికి వస్తున్నాడని తెలిసిన భౌట్టుల కంగారు, వారి తెల్లగా పాలిపోయినట్టుండే ముఖాలలో కనబడిందట. దారదులను జయించాడు. ప్రోగ్జోతిషం అతడి వశమయింది. ఎడారి ప్రాంతాలు అతని పరమయ్యాయి. శ్రీరాజ్యం, ఉత్తర కురు వంటి రాజ్యాలను జయించి దిగ్విజయుడై కాశ్మీరులో అడుగిడాడు లలితాదిత్యుడు. లలితాదిత్యుడికి దోసోహం అని నిరూపించేందుకు తుర్కులు చేతులు వెనక్కి కట్టుకొని తల సగం గొరిగించుకున్నారు. దక్షిణాది ప్రజలు తోకను ధరించేట్టు చేశాడు లలితాదిత్యుడు, వారు తక్కువ స్థాయి జంతువులని నిరూపించేందుకు.

ఇలా లలితాదిత్యుడు సాధించిన విజయాలను ఒక దాని వెంట మరొకటి వర్ణిస్తూ పొగుడుతాడు కల్హణుడు. ఆపై లలితాదిత్యుడు నిర్మించిన మందిరాలు, విహారాలు, పురాలు వంటి వివరాలను అందిస్తాడు.

దిగంతాల వరకు తన సామ్రాజ్యాన్ని విస్తరింప చేయాలని నిర్ణయించుకున్న ప్రాంతంలో ‘సునిశ్చితపురం’ నిర్మించాడు. విజయం సాధించి గర్వించిన స్థలంలో విష్ణువుకు అంకితం చేస్తూ ‘దర్పితపురాన్ని’ నిర్మించాడు. ఫలాలు స్వీకరించిన స్థలం ‘ఫలపురం’ అయింది. పర్ణాలు అందుకున్న ప్రాంతం ‘పర్ణోత్స’ అయింది. ఆయన ఆటలు ఆడిన స్థలంలో ‘క్రీడారామం’ అనే అరామం నిర్మించాడు. ఒక అయస్కాంతం పైకి, మరో అయస్కాంతం క్రిందకు సమాన బలంతో లాగుతుంటే ఎలాంటి ఆధారం లేకుండా నిలచే ‘నృహరి’ విగ్రహాన్ని ‘శ్రీరాజ్యం’లో నిలిపాడు. అయితే, రాజు జైత్రయాత్రలో ఉండగా, రాజు పేరు మీద ‘లలితాదిత్యపురం’ నిర్మించిన వ్యక్తి రాజు ఆగ్రహానికి గురయ్యాడు. నిర్మాణాలు దైవం పేరున ఉండాలి తప్ప మనుష్యుల పేర్లపై ఉండరాదన్నది రాజు ఆగ్రహానికి కారణం. అయితే ఆ లలితాదిత్యపురంలో సుర్యభగవానుడికి కన్యాకుబ్జం, ఇతర గ్రామాలను అర్చించాడు. ‘హుష్కపురం’లో ‘ముక్తస్వామి’ మందిరాన్ని, ఒక పరమాద్భుతమయిన విహారాన్ని స్తూపంతో సహా నిర్మింపచేశాడు.

సోఖాండితాశ్మ ప్రాకారం ప్రాసాదాంతర్య్వదత్త చ।
మార్తాండాస్యద్భుతం దాతా ద్రాక్షా స్ఫీతం చ పత్తనమ్॥
(కల్హణ రాజతరంగిణి IV – 192)

మార్తండ మందిరం అనే అద్భుతమైన మందిరాన్ని లలితాదిత్యుడు నిర్మించాడు. అతి పెద్ద రాతి గోడలతో, విశాలమైన ప్రాసాదాలతో, ద్రాక్షతోటలతో మార్తండ నగరం విలసిల్లింది.

మార్తండ మందిరం శిధిలాలు ప్రస్తుతం మనకు లభిస్తున్నాయి. హంపి శిథిలాలను చూస్తే ఎలాంటి అనిర్వచనీయమైన భావన కలుగుతుందో, గర్వం, విషాదం, అద్భుతం, అలౌకికానందం, ఆశ్చర్యం, అవమానం, నిస్సహాయత్వం వంటి భావాల మిశ్రమ భావన కలుగుతుందో, మార్తండ మందిరం చూస్తుంటే అలాంటి భావన కలుగుతుంది. ‘మార్తండ తీర్థం’ మందిరానికి దగ్గరలోనే ఉంటుంది. నీలమతపురాణంలో మార్తండ మందిర వర్ణన ఉంటుంది. ఈ తీర్థంలో కశ్యపుడి భార్య అదితి, ‘మృతాండం’ – జీవం లేని అండం నుంచి తన పదమూడవ సంతానంగా ‘సూర్యుడి’కి జన్మనిచ్చింది. సూర్యుడికి చెందిన అతి పవిత్ర స్థలాల్లో ఈ తీర్థం ప్రధమమైనది. ఆరంభంలో పాశ్చాత్య చరిత్ర రచయితలు మందిరాన్ని రణాదిత్యుడు నిర్మించాడని, ప్రాసాదాలు మాత్రం లలితాదిత్యుడు నిర్మించాడని భావించారు. ‘బుత్ షికన్’గా ప్రసిద్ధి పొందిన సుల్తాన్ సికిందర్ మార్తండ మందిరాన్ని ధ్వసం చేశాడు. ఈ విషయం జోనరాజు రాజతరంగిణి ద్వారా తెలుస్తోంది.

ఇలాంటి అద్భుతమైన కట్టడాల శిధిలాలు చూస్తున్నప్పుడు అసలు వీటిని పని కట్టుకుని, కసికసిగా ధ్వంసం చేసిన మనుషులు ఎలాంటి వారో, ఎలాంటి పరిస్థితులు, నమ్మకాలు అలాంటి కసిని, క్రౌర్యాన్ని, దాష్టికాన్ని, రాక్షసత్వాన్ని మనుషుల స్వభావంలో భాగం చేసి  పవిత్ర కర్తవ్యంలా భావిచేట్టు చేస్తాయో అన్న భావన కలుగుతుంది. తమ నమ్మకంపై ఇలాంటి ఘోరమైన రాక్షస దాడులు జరుగుతుంటే అనాటి సమాజంలో కలిగిన కలవరం, మానసికంగా కలిగిన వేదన, భయాందోళనలు తలచుకుంటేనే గుండె చెదిరిపోతుంది. తమ పవిత్ర స్థలాలపై పడిన ఒక్కోదెబ్బ వారి హృదయాలను ఎన్నెన్ని ముక్కలుగా విరిచిందో ఊహించాలంటేనే భయం వేస్తుంది. అలాంటి స్థితి నుంచి, మళ్లీ ఆత్మవిశ్వాసం సాధించి, ఆత్మగౌరవాన్ని నిలుపుకుని చెదిరిన శకలాల ఆధారంగా వినూత్న కట్టడలను నిలిపిన భారతీయుల ఆత్మవిశ్వాసానికి జోహార్లు అర్పించాలనిపిస్తుంది. హంపి, మార్తాండ మందిరంతో సహా ఇలాంటి అనేక శకలాలు భారతీయులపై జరిగిన భయంకరమైన దాడి, అతి తీవ్రమైన రాక్షస స్థాయి అత్యాచారాలకు మౌన సాక్షులు.

లలితాదిత్యుడు నిర్మించిన ఇలాంటి అనేక అద్భుతమైన మందిరాలు, విహారాలు, నగరాలు వివరాలు ఇస్తాడు కల్హణుడు (ఈ వివరాలు పిలకా గణపతిశాస్త్రి రాజతరంగిణి అనువాదంలో లభిస్తాయి).

రీతిప్రస్థ సహస్రైస్తు తేన తాలిద్భిదేవ సః।
వ్యోమవ్యాపివపుః శ్రీమాన్ బృహద్ బుద్ధో వ్యధీయత్॥
(కల్హణ రాజతరంగిణి IV – 203)

వెయ్యి ప్రశస్తల ఇత్తడితో, ఆకాశం తాకేంతటి బుద్ధ విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు లలితాదిత్యుడు.

ఇది ఒక్క భారతీయ సమాజంలోనే సాధ్యం. ఓ పక్క రాజు తన పేరుతో తన అనుమతి లేకుండా నగరం నిర్మించిన వాడిని శిక్షించాడు. దేవాలయాలు అతి గొప్పవి నిర్మిస్తూపోయాడు. ఇంకా పెద్ద విహారాలు, చైత్యాలు నిర్మించాడు. నేల తాకని నృహరి విగ్రహాన్ని నిర్మిస్తే, మరో వైపు ఆకాశాన్ని తాకే బుద్ధుడి విగ్రహాన్ని నిర్మించాడు. ఈ ప్రపంచ వ్యాప్తంగా పరమత సహనానికి పరమ అద్భుతమైన నిర్వచనం భారతదేశం, భారతీయ సమాజం, భారతీయ ధర్మం. అలాంటి సంస్కృతిని, అలాంటి ధర్మాన్ని ఈనాడు ఆ ధర్మానుయాయులలో దారి తప్పిన వారు, మతి గతి తప్పిన వారు అసహనానికి మారు పేరుగా నిలపాలని ప్రయత్నించటం శోచనీయం.

రాజతరంగిణిలో ఏడవ తరంగంలో తురుష్క హర్షుడు  ఈ బృహత్ బౌద్ధ విగ్రహాన్ని దోచుకోవాలని వస్తే కల్హణుడి తండ్రి విగ్రహాన్ని కౌగలించుకుని అడ్డపడి రాజును ఆ దుష్కార్యం నుంచి తప్పించిన సంఘటన ఉంది. ఇలాంటి అతి గొప్ప సంఘటన, పరమత సహనానికి, సకల అలోచనలను ఆహ్వనించే తత్వానికి, దైవ భావనలో భేదాలు లేవని నిరూపించే తత్వానికి ప్రతీకగా నిలచే సంఘటనలు ఒక్క భారతదేశంలోనే సంభవం. ఈ బౌద్ధ విగ్రహాన్ని ఇస్లామీయులు తరువాత ముక్కలు చేశారు. ఆ అసహన గాథ చెప్పే బాధ్యత రాజతరంగిణిని కొనసాగించిన వారిపై పడింది.

రాజే కాదు రాణులు, మంత్రులు, ఉన్నత స్థానాలలో ఉన్న వారు అందరూ రాజును అనుసరిస్తూ అనేక మందిరాలు, చైత్రాలు, విహారాలు, నగరాలు నిర్మించారు. లలితాదిత్యుడు ఎంతటి అనుచితమైన కోరిక కోరినా  దాన్ని ఇంద్రుడు తీర్చేవాడని చెప్పే కథ ఉంటుంది. దానికి పూర్వజన్మలో లలితాదిత్యుడు చేసిన పుణ్యం కారణం. అలా లలితాదిత్యుడు బంజరు భూముల్లోనూ నందనవనం లాంటి నగరాలు నిర్మింపచేశాడు, దేశంలో ఆకలి, దాహం అన్న మాట వినబడకుండా చేశాడు. ఆయన ‘సహస్రభక్త’ అనే పండుగను ఆరంభించాడు.  ఆ పండుగ రోజు లక్ష ఒకటి సంఖ్యలో ఆహారం అందించేవారు దక్షిణతో సహా.

ఈ సందర్భంలో లలితాదిత్యుడు గురించి ఓ అద్భుతమైన గాధను పొందుపరచాడు కల్హణుడు.

కశ్మీరు నుంచి మూడు నెలల ప్రయాణం దూరంలో ఉన్న రాజ్యంపై దాడికి వెళ్తాడు లలితాదిత్యుడు. దారిలో అతడికి ఒళ్లంతా గాయాలతో కొన ఊపిరితో ఉన్న వ్యక్తి కలుస్తాడు. అతడిపై జాలి పడి చికిత్స చేయించి విషయం అడుగుతాడు లలితాదిత్యుడు. అతడు లలితాదిత్యుడు ఏ రాజ్యం పై దాడికి వెళ్తున్నాడో ఆ రాజ్యానికి మంత్రి. లలితాదిత్యుడికి లొంగిపోయి రక్తపాతాన్ని పరిహరించమన్న సలహా ఇచ్చినందుకు రాజు అతడిని ఇలా శిక్షించి వదిలేశాడు. తనని రక్షించిన లలితాదిత్యుడికి విధేయుడిగా ఉంటానని ప్రకటించి అతడు లలితాదిత్యుడు దాడికి వెళ్తున్న రాజ్యానికి దగ్గరి త్రోవ చూపిస్తానంటాడు. ఆ త్రోవలో వెళ్తే నెలన్నర లోగా శత్రురాజ్యం చేరవచ్చని, అనూహ్యంగా దాడి చేయవచ్చని చేప్తాడు. లలితాదిత్యుడు అతడిని అనుసరిస్తాడు. అయితే ఎంత కాలం ప్రయాణించినా ఎడారి తరగదు. చివరికి ఒక్క నీటి చుక్క లేక సైన్యం అల్లల్లాడిపోతుంటుంది. అప్పుడు ఆ వ్యక్తి తన అసలు రూపం ప్రదర్శిస్తాడు. తాను అడింది నాటకం అని, లలితాదిత్యుడిని దారి మళ్ళించి, ఎడారిలో నీటి చుక్క దొరకక చచ్చిపోయేట్టు చేయటం ద్వారా తన రాజ్యాన్ని సురక్షితం చేసేందుకు వేసిన పథకం ఇది అని చెప్తాడా వ్యక్తి.

అతని మాటలు విన్న లలితాదిత్యుడు అతడి రాజ్యభక్తిని ప్రశంసిస్తాడు. లలితాదిత్యుడు  కోరగానే  ఎడారిలో నీరు ఉద్భవిస్తుంది. సైన్యం ప్రాణాలు నిలుస్తాయి. ఆ వ్యక్తితో పాటు అతని రాజు యమపురికి పోతారు. ఇదీ కథ. ఆ తరువాత లలితాదిత్యుడు తన రాజ్యంలో ఏ ప్రాంతంలోనూ నీటి కటకట లేకుండా చూస్తాడు. ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే, తనని మోసం చేసి, తప్పుదారి పట్టించి, తనను, తన సైన్యాన్ని మాయోపాయంతో మట్టుపెట్టాలని చూసిన వాడిపై లలితాదిత్యుడు క్రోధం ప్రదర్శించడు. ఆవేశంతో పళ్లు పటపట కొరికి నిన్ను… అంటూ వేలు చూపి బెదిరించడు.

అమాత్య తవ కృత్యేన ప్రీత్యాః స్వామి హితైషిణాః।
(కల్హణ రాజతరంగిణి IV – 297)

‘ఓ మంత్రీ నీవు స్వామి హితం కోరి చేసిన ఈ పని మాకు సంతోషం కలిగిస్తోంది.’ ఇవీ మోసపోయి, తన ప్రాణాలు, సైన్యం ప్రాణాలు ప్రమాదంలో వేసేసిన వ్యక్తితో మహారాజు లలితాదిత్యుడు అన్న మాటలు. ఇది ఒక్క భారతీయ ధర్మంలోనే సాధ్యం.

లలితాదిత్యుడు మామూలు రాజు కాదు. సమస్త భారతదేశంపై ఆధిపత్యం స్థాపించినవాడు. మూడు సముద్రాలపై అధికారం కలవాడు. అలాంటి రాజు తనని మోసం చేసిన వాడితోనూ అతని స్వామి భక్తిని చూసి దాన్ని మెచ్చుకుంటున్నాడు. ఇంతటి గొప్ప వ్యక్తిత్వం కల రాజులు భారదేశ చరిత్రలో కోకొల్లలు. కానీ భారతదేశ చరిత్రలో గొప్ప రాజులు అనగానే అశోకుడు, అక్బరు మాత్రమే గుర్తుకువస్తారు. మహా అయితే అతి కష్టం మీద గుప్తులను కూడా ఈ జాబితాలో చేరుస్తారు. సమస్త భారతదేశాన్ని తన ఛత్రఛాయ క్రింద తెచ్చిన తొలి రాజు ‘మహమ్మద్ బీన్ తుగ్లక్’ అంటారు. కాని ఇంతకు ముందు మిహిరకులుడు, రణాదిత్యుడు, ఇప్పుడు లలితాదిత్యుడు సమస్త భారతంలోని ముఖ్యమైన రాజ్యాలను తమ విశాలమైన సామ్రాజ్యంలో భాగం చేసుకున్నవారు. వీరి గురించి అంతగా ప్రస్తావనలు రాకపోవటం, వీరిని అతి గొప్ప రాజులుగా పరిగణించకపోవటం అన్యాయం. ఈనాటికీ అశోకుడు, అక్బరు పేర్లే ప్రస్తావనకు వస్తున్నాయి. ‘ఇది ఇంకానా? ఇక చెల్లదు’. అంటూ భారతీయులు తమ చరిత్రను తెలుసుకుని తమ దృక్కోణంలో తమ చరిత్రను రచించుకోవాల్సిన అవసరం కల్హణుడి రాజతరంగిణి మరింత స్పష్టం చేస్తుంది.

కల్హణుడు నిష్పాక్షిక చరిత్ర రచయిత. లలితాదిత్యుడి గొప్పతనమే కాదు అతని లోపాలను ప్రదర్శించే గాథలు రాజతరంగిణిలో పొందుపరచాడు కల్హణుడు. ఓ సారి లలితాదిత్యుడు మద్యం మత్తులో ఉన్నాడు. అతడి దృష్టి పరిహాసపురంపై పడింది. దాని వైభవం చూస్తున్న లలితాదిత్యుడి మనస్సులో అసూయ జనించింది. తను నిర్మించిన నగరాన్ని పరిహాసం చేస్తున్నట్టు వైభవంతో వెలిగిపోతున్న పరిహాసపురాన్ని కాల్చివేసి బూడిద చేయమని మద్యం మత్తులో రాజు ఆజ్ఞాపించాడు. అతడి మంత్రులు రాజు చెప్పినట్టు చేయలేదు. పరిహాసపురం వైపున ఉన్న కొన్ని చెట్లను తగుల బెట్టారు. మద్యం మత్తులో – పైకి ఎగస్తున్న మంటలు, పొగను చూసిన లలితాదిత్యుడికి తన చేసిన పని లోని దౌష్ట్యం అర్థమయింది. విచారించటం ప్రారంభించాడు. తనని తాను నిందించుకోవటం ప్రారంభించాడు. రాజును ఆ స్థితిలో చూసిన మంత్రులు నిజం చెప్తారు. దాంతో పెద్ద నేర భావం తొలగిన లలితాదిత్యుడు మంత్రులకు బహుమతులు ఇచ్చాడు. ఇకపై తాను తాగిన మత్తులో ఇచ్చే ఆదేశాలన్ని పాటిచవద్దని ఆజ్ఞ ఇచ్చాడు.

ఇంతే కాదు, లలితాదిత్యుడు మరో దోషం చేసాడంటాడు కల్హణుడు. అది, గౌడరాజు(బెంగాలు రాజు)ను ‘త్రిగ్రామి’ వద్ద హత్య చేయించటం. గౌడ రాజును చంపనని లలితాదిత్యుడు పరిహాస కేశవుడిపై ప్రతిజ్ఞ చేస్తాడు. అయినా సరే అతడిని చంపించాడు. కల్హణుడు ఆ కథ కూడా చెప్తాడు.

శారదాదేవి దర్శనం కోసం కశ్మీరు వస్తాడు గౌడరాజు, అతని అనుచరులతో. వారికి ఎలాంటి హాని కలగదని పరిహాస కేశవుడిపై ఆన పెడతాడు లలితాదిత్యుడు. గౌడరాజు వెంట వచ్చిన సేనలు అతని అనుచరులు, రాజుకు విధేయులైన వీరులు. వారు పరిహాస మందిరాన్ని చుట్టుముడతారు. వారి దురుద్దేశాన్ని గ్రహించిన పరిహాసపురం మందిరం పూజారులు ద్వారాలు బంధించి వారిని లోపలకు రానీయరు. ఈలోగా వారు రామస్వామి విగ్రహమే పరిహస కేశవుడి విగ్రహం అనుకుని దాన్ని ధ్వంసం చేస్తారు. ఇంతలో కశ్మీర సేనలు అక్కడికి చేరుకుంటాయి. గౌడరాజు సేనలను మట్టుపెడతాయి. గౌడరాజును చంపేస్తాయి. ఈ సంఘటనను వర్ణిస్తూ కల్హణుడు, కశ్మీరు శత్రువులయిన గౌడ సైనికుల విధేయతను, శౌర్యాన్ని పొగుడుతాడు. రాజుకు హాని చేయనని మాట ఇచ్చి తప్పిన లలితాదిత్యుడిని తప్పు పడతాడు.  ఈ గొడవలో రాజుకు ఇష్టమైన పరిహాస కేశవుడు భద్రంగా ఉండటం రామస్వామి మందిరం త్యాగం వల్ల అంటాడు. ఈనాటికీ (కల్హణుడి కాలం నాటికి) రామస్వామి మందిరం శూన్యంగానే ఉందని వ్యాఖ్యానిస్తాడు.

అలా ముప్ఫయి ఆరు సంవత్సరాల ఏడు నెలల పదకొండు రోజులు రాజ్యం చేసి లలితాదిత్యుడు స్వచ్ఛందంగా రాజ్యం వదిలేస్తాడు. తన తరువాత ఎవరిని రాజుగా నియమించాలో చెప్పి వెళ్లిపోతాడు. లలితాదిత్యుడి మరణం పై పలురకాల గాథలున్నాయని చెప్పి కొన్ని కథలను చెప్తాడు కల్హణుడు.

కొందరు ఆయన ఆర్యుణక అనే రాజ్యంలో మంచులో మరణించాడంటారు. కొందరు ఆయన అగ్నిలో ఆత్మార్పణ చేసుకున్నాడంటారు. కొందరు ఆయన ఉత్తర దేశాలకు వెళ్లాడంటారు. కానీ ఆయన జీవితం లాగే ఆయన మరణం కూడా అద్భుతమైనది అంటారు. ఒక అద్భుతమైన శ్లోకం రాస్తాడు కల్హణుడు. ఆకాశంలో సూర్యుడు అస్తమించినపుడు కొందరు సూర్యుడు సముద్రంలో దాక్కున్నాడంటారు. కొందరు అగ్నిలో ప్రవేశించాడంటారు. కొందరు వేరే లోకాలకి వెళ్లాడంటారు అని వ్యాఖ్యానిస్తాడు.

లలితాదిత్యుడు తరువాత కమలాదేవి తనయుడు కువలయాపీడుడు రాజ్యానికి వస్తాడు.

లలితాదిత్యుడి గురించి కల్హణుడు రాజతరంగిణిలో ఉన్న సమాచారం సారాంశం ఇది. కల్హణుడు చెప్పిన గాథలన్నిటినీ అమోదించక పోయినా, మిగిలినవే అద్భుతంగా ఉంటాయి. లలితాదిత్యుడి గొప్పతనాన్ని ప్రస్ఫుటం చేస్తాయి. ఇంత గొప్ప రాజు పాలించిన కశ్మీరం ఎంత అదృష్టవంతురాలు అనిపిస్తుంది. భారతీయ ధర్మం ఎంతటి ఉన్నత వ్యక్తిత్వం కలవారిని సృజించిందన్న గర్వం కలుగుతుంది. కల్హణుడు ఇచ్చిన సమాచారాన్ని గ్రహిస్తూ లలితాదిత్యుడి గురించి ఇతరులు, అంటే పర్షియన్లు, చైనీయులు, తిబ్బత్తు గ్రంధాలలో ఉన్న సమాచారం  పోలుస్తూ విశ్లేషిస్తే లలితాదిత్యుడు మరింత ఎత్తుకు ఎదుగుతాడు. భారతీయ రాజులలో అత్యుత్తముడిలా, హిమాలయ శిఖరంలా నిలుస్తాడు.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here