కశ్మీర రాజతరంగిణి-51

5
9

[box type=’note’ fontsize=’16’] కశ్మీర్ ప్రాచీన చరిత్ర గురించి అవగాహన కలిగించి, భవిష్యత్తు గురించి ఆలోచనలు కలిగించాలన్న ప్రయత్నంలో భాగంగా నీలమతపురాణం తరువాత అందిస్తున్న జోనరాజు, శ్రీవరుడు, ప్రజ్ఞాభట్టులు కల్హణుడి అడుగుజాడల్లో నడుస్తూ సంస్కృతంలో రచించిన ‘కశ్మీర రాజతరంగిణి’ అనువాదాన్ని తెలుగు పాఠకులకు అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ. [/box]

[dropcap]”నా[/dropcap] సామ్రాజ్యాన్ని సుస్థిరం చేసుకున్న తరువాత సామ్రాజ్యాధినేతకు అవసరమైతే సహాయంగా నా సేనలను పంపేందుకు ఈ స్నేహితుడు సిద్ధంగా ఉన్నాడు. నా వద్ద మూడు రకాల దళాలున్నాయి. గజ, తురగ, పదాతి దళాలు. తిబ్బత్తు సేనలు అయిదు వ్యాపార మార్గాలపై ఆధిపత్యం సాధించి కశ్మీర రాజును, మధ్య దేశపు రాజను ఇబ్బంది పెడుతుంటే  తిబ్బెత్తు రాజుతో మేమిద్దరమూ కలసి పోరాడి విజయం సాధించాము. ఇప్పుడు మీ సైన్యం ‘పాలూరు’ వద్దకు వస్తే, మీకు అవసరమైన సామాగ్రిని అందచేసే బాధ్యత మాది. మా రాజ్యంలో మహాపద్మ సరస్సు (ఇపుడు వూలూరు సరస్సు) ఉంది. అక్కడ మీ సైన్యం స్థావరం ఏర్పరుచుకోవచ్చు.”

‘జిన్ టూంగ్ షూ’ అనే చైనీ చరిత్ర రచయిత రాసిన పత్రాలలో లలితాదిత్యుడు చైనా రాజుకు రాసిన ఈ లేఖ ఉంది. ఈ లేఖను ఆధారం చేసుకుని కల్హణుడు రాజతరంగిణిలో ప్రస్తావించిన అంశాలతో పోలిస్తే, ఇంకా ఆ సమయంలో భారత దేశాలోని ఇతర సాహిత్యం; పర్షియన్లు, తిబ్బత్తు వారి రచనలతో కలపి చూస్తే లలితాదిత్యుడి అమోఘమైన సైనిక విజయాలు, ఉత్తమ వ్యక్తిత్వం గురించి ఒక అవగాహన ఏర్పడుతుంది.

లలితాదిత్యుడు సామ్రాజ్యానికి వచ్చినప్పుడు హిందూకుష్ పర్వత ప్రాంతాలలో కశ్మీరు కాక కపీష (కాబుల్), జబులిస్తానంద్‌లు ఇతర శక్తివంతమైన సామ్రాజ్యాలు. కపీష, జబులిస్తానంద్‌లు తుర్కుల ఆధిపత్యంలో ఉన్నా, ఆ ప్రాంతాలలో హిందువులు, బౌద్ధులు అధికంగా ఉండేవారు. ఈ మూడు సామ్రాజ్యాలు చైనాతో సత్సబంధాలు కలిగి ఉండేవి. కపీష, జబులిస్తానంద్‌లకు తిబ్బత్తు నుంచి ప్రమాదం ఉండేది. ఈ రెండు కనుక తిబ్బత్తుకు వశమయితే కశ్మీరుకు ప్రమాదం. పైగా ఇవి వ్యాపార మార్గాలపై పట్టు సాధించేందుకు అనువుగా ఉంటాయి. ఆ కాలంలో అయినా, ఈ కాలంలో అయినా వ్యాపార మార్గాలపై పట్టు అత్యంత ప్రాధాన్యం వహిస్తుంది. కాబట్టి ఈ ప్రాంతం తిబ్బత్తు వశం కాకపోవటం భారత కాశ్మీరుకే కాదు, చైనాకు కూడా అవసరమే. లలితాదిత్యుడు రాజ్యానికి వచ్చేసరికి ఇదొక సమస్య కశ్మీరు రాజు పరిష్కరించవలసింది.

ఇంతకన్నా ప్రధాన సమస్య అరబ్బుల నుంచి ఎదుర్కోవల్సి వచ్చింది. ఖలీఫా ఓమర్ ఓ ఫర్మానా జారీ చేశాడు. దాని ప్రకారం హిందూ, బౌద్ధ రాజులంతా మతం మారిపోవాలి. లేకపోతే వారి మనుగడకే ప్రమాదం అని హెచ్చరించాడు. దాంతో సింధు పరిసర ప్రాంతాలలోని రాజులంతా తమ ధర్మం విడిచి ఇస్లాం స్వీకరించారు. దాహిర్ రాజు సంతానం జయసింహుడు సైతం ‘హుల్లి షాహ’ అయిపోయాడు. గతంలో ఈయన కశ్మీరులో కొన్నాళ్లు తలదాచుకున్నాడు. గాంధారం, ముల్తాన్, ఫఖ్తూనిస్తాన్ రాజులు సైతం ఇస్లాం స్వీకరించి తమ రాజ్యధికారాన్ని నిలుపుకున్నారు. అరబ్బులు వ్యాపార మార్గాలపై పట్టు బిగించారు.

ఇదే ఫర్మానా భారతదేశం లోని ఇతర రాజులకు అందింది. కశ్మీరు రాజు, కన్నౌజ్ రాజులకు ఇది ఆగ్రహం కలిగించింది. ఇంతలో సింధు గవర్నర్‍గా వచ్చిన ‘జునాయిద్-అల్-ముద్రి’ ఒకటొకటిగా సింధు రాజ్యాలను ఆక్రమించుకోసాగాడు. రాజ్యాధికారం నిలుపుకోవటం కోసం మతం మారిన వారి రాజ్యాలను ముందుగా తన అధికారంలోకి తెచ్చుకున్నాడాయన. తల వంచి, మతం మారి, కప్పం బుద్ధిగా కడుతున్న ఒకప్పటి జయసింహుడు ప్రస్తుతం ‘హుల్లి షాహ’ను కూడా హతమార్చాడు.

ఈ పరిణామాలు కశ్మీర రాజు లలితాదిత్యుడికి కలవరం కలిగించాయి. ఎందుకంటే అరబ్బులు కశ్మీరు సరిహద్దు వరకు వచ్చేశారు. దాంతో లలితాదిత్యుడు ఇతర రాజులను ‘జునాయిద్’కు కప్పం కట్టవద్దని, ఎదిరించమని ప్రోత్సహించాడు. గతంలో జయసింహునికి ఆశ్రయం ఇచ్చినందుకు  కశ్మీరుపై అరబ్బులకు కన్నెర్రగా ఉంది. ఇప్పుడు అరబ్బులపై తిరుగుబాటుకు ఇతర రాజులను ప్రోత్సహించటం అగ్నికి ఆజ్యం తోడయినట్టుయింది. జునాయిద్ లలితాదిత్యుడినీ బెదిరించాడు. మతం మారి కప్పం కట్టమన్న బెదిరింపు కశ్మీరుకు అందింది. దాంతో లలితాదిత్యుడు శక్తివంతుడయిన రాజు యశోవర్మతో చేతులు కలిపాడు. ఇతర రాజులందరినీ కూడ గట్టుకుని సమైక్య భారత సైన్యాన్ని ఏర్పాటు చేశాడు. అరబ్బులను ఎదుర్కొన్నాడు. భారత రాజుల సమిష్టి సేనల తాకిడి దూసుకు వస్తున్న జునాయిద్ సేనలకు అడ్డుకట్ట వేసింది. అల్ బాలాధురి ఈ యుద్ధాన్ని ప్రస్తావించాడు కానీ ఫలితం విషయంలో మౌనంగా ఉండపోయాడు. ఒకోసారి మౌనం చెప్పినన్ని సత్యాలు మాటలు కూడా చెప్పవు. పర్షియన్ చరిత్ర రచయితలు తమ విజయాల గురించి గొప్పగా రాస్తారు. కానీ శత్రు  విజయాన్ని ప్రస్తావించరు. మౌనంగా ఉండి మాట దాటేస్తారు. ఈ యుద్ధం గురించి కూడా మౌనం వహించటం అరబ్బుల పరాజయాన్ని సూచిస్తుంది. ఈ విషయమై భారతీయ రాజుల శాసనాలు లభిస్తున్నాయి. కానీ పర్షియన్లు, అరబ్బులు మౌనం వహించారు. ఈ యుద్ధ ఫలితంగా కేవలం దౌవల్ తప్ప మిగతా ప్రాంతాలన్నీ అరబ్బుల పట్టు నుంచి తప్పిపోయాయి. ఇదే ఊపులో లలితాదిత్యుడు తోఖరిస్తాన్, దరదులపై విజయం సాధించాడు. గిల్జిత్ గుండా వెళ్లే అయిదు వ్యాపార దారులను అరబ్బుల పట్టు నుంచి తప్పించాడు. అయితే అరబ్బులు కానీ తిబ్బత్తు వారు కానీ మళ్లీ ఈ దారుల పై పట్టు బిగించే వీలుంది. కాబట్టి ఈ ప్రాంతాలలో సైతం కాపలా తప్పనిసరి. కాబట్టి ఈ దారులకు రక్షణగా చైనా సైనికులను పంపించాలని వారికి అవసరమైన సహాయం తాను అందిస్తానని లలితాదిత్యుడు చైనా రాజుకు లేఖ రాశాడు. యశోవర్మ కూడా చైనాకు తన దూత ‘సింహగుప్త’  ను పంపాడు. ఈ సమయంలో కొరియాకు చెందిన భిక్కు హికో (Hyecho) కశ్మీరు పర్యటించాడు. ఆయన ఈ ప్రాంతాలన్ని కశ్మీర రాజు అధీనంలో ఉన్నాయని రాశాడు. ‘చాచ్‌నామా’ లో కూడా తురాన్, మన్‌రాన్ ప్రాంతాలు కశ్మీరుకు లొంగిపోయాయని ఉంది. అంటే అరబ్బులను తరిమిన లలితాదిత్యుడు దరదులు, చిత్రత పర్వత ప్రాంతాలలోని తెగల వారిని అణచివేసి తిబ్బత్తు సరిహద్దులను కట్టుదిట్టం చేశాడు. ‘ప్రజ్ఞావిక్రమ్’గా ప్రసిద్ధి పొందిన ‘హికో’ భారత్ పర్యటించినప్పుడు ఆయన బోలుర్ మేజర్ (బలిస్తా), బోలూర్ మైనర్ (గిల్జిత్), షాంగ్ హంగ్ (జియెషి) ప్రాంతాలు తిబ్బత్తు అధీనంలో ఉన్నాయని రాశాడు. ఇవన్నీ కశ్మీరు తిబ్బత్తు సరిహద్దు ప్రాంతాలు. వీటన్నింటినీ తరువాత లలితాదిత్యుడు గెలిచి కశ్మీరును సుస్థిరం చేశాడు. లలితాదిత్యుడు యశోవర్మల చేతిలో చావు దెబ్బలు తిన్న జునాయిద్ భారదేశంలోని ఇతర ప్రాంతాలపైకి మళ్ళాడు. బప్పారావత్, నాగభటుడు, పులకేశి కలసికట్టుగా పోరాడి తమపైకి దాడికి వచ్చిన జునాయిద్ సేనలను తరిమికొట్టారు.  లలితాదిత్యుడు, యశోవర్మ సంయుక్త సేనలతో చావు దెబ్బలు తిని దారి మళ్ళి మేవార్ వైపు మళ్లాడు జునాయిద్. అపుడే త్రివేణి సంగమ శక్తి లాంటి సేనలు జునాయిద్ సేనలను చావు దెబ్బకొట్టాయి. ఓ వైపు లలితాదిత్యుడు, యశోవర్మ సేనలు, మరో వైపు త్రివేణి  సంగమ సేనలు  తాకిడి తట్టుకోలేక అరబ్బు సేనలు భారత్ విడిచి పారిపోయాయి. ఈ విషయం ప్రస్తావిస్తూ చాచ్‌నామాలో ‘అరబ్బులకు తల దాచుకునే స్థలం లేద’ని రాశారు. ఆ తరువాత మూడు వందల ఏళ్ల వరకూ అరబ్బు సేనలు భారత్  వైపు కన్నెత్తి చూడలేదు. (చూ. తురుష్క సేలను తరిమి కొట్టిన భారత త్రివేణి సంగమ శక్తి – ఉజ్జ్వల భారత మహోజ్జ్వల గాథలు) అంటే భారత దేశాన్ని తురుష్క సేనల తాకిడి నుంచి కాపాడటంతో లలితాదిత్యుడు ప్రధాన పాత్ర పోషించాడన్న మాట.

యశోవర్మ, లలితాదిత్యుడు అరబ్బులతో కలసి పోరాడేరు. ఇద్దరూ శక్తివంతులయిన రాజులు. ఇద్దరూ దిగ్విజయం సాధించారు. చైనా రాజుతో ఇద్దరూ సత్సంబంధాలు నెరపారు. అంటే ఇద్దరు సమాన ధీశాలులు. అహంకారాలు నెలకోనటం సహజం. ఒక ఒరలో రెండు కత్తులు ఇమడవు. దాంతో యశోవర్మకు లలితాదిత్యుడికి నడుమ విభేదాలు పొడచూపాయి. కారణం ఇదీ అని స్పష్టగా తెలియదు, కానీ ఇద్దరి నడుమ భేదాభిప్రాయాలు వచ్చాయి. కశ్మీరు నుంచి లలితాదిత్యుడు సైన్యం తీసుకుని యశోవర్మపై దాడి చేశాడు. యశోవర్మను ఓడించాడు.

యశోవర్మ విజయ పరంపరల గురించి వాక్పతి రాసిన ‘గౌడవాహో’ ద్వారా, కొరియా భిక్కు ‘హికో’ ద్వారా తెలుస్తుంది. ‘హికో’ ప్రకారం కశ్మీరు రాజు నిరంతరం పోరాటాలు చేస్తూ సామ్రాజ్యాన్ని విస్తరిస్తుండేవాడు. యశోవర్మ పేరు చెప్తే దయ్యాలు కూడా గడగడ వణికేవని రాస్తాడు వాక్పతి. దయ్యాలు పదం పారసీలకు ప్రతీక. అయితే ‘గౌడవాహో’ కావ్యంలో వాక్పతి యశోవర్మ గెలుపులను వర్ణించాడు. కాని గౌడరాజుపై యశోవర్మ విజయాన్ని సరిగ్గా వర్ణించలేదు. ఎందుకంటే వాక్పతి గౌడరాజు వద్ద ఉండేవాడు. గౌడరాజును హతమార్చి యశోవర్మ వాక్పతిని జైలులో బంధించాడు. యశోవర్మ మెప్పు పొందేందుకు వాక్పతి యశోవర్మను పొగడతూ ‘గౌడవాహో’ కావ్యం ఆరంభించాడు. కాని తన ఒకప్పటి రాజు మరణం  రచించలేకపోయాడు. అయితే ‘గౌడవాహో’ కావ్యం అసంపూర్ణంగా మిగిలిపోయింది. కారణం, యశోవర్మ లలితాదిత్యులకు చెడటంతో లలితాదిత్యుడు యశోవర్మపై దాడి చేశాడు. ఓడించాడు. జైలు నుండి బయటపడటం కోసం, యశోవర్మ మెప్పు పొందటం కోసం వాక్పతి, యశోవర్మను పొగడుతూ ‘గౌడవాహో’ ఆరంభించాడు. కాని అది పూర్తయ్యేలోగా లలితాదిత్యుడు యశోవర్మను ఓడించాడు. దాంతో ‘గౌడవాహో’ రచన ఆగిపోయింది. ఇక యశోవర్మను పొగడటం వల్ల లాభం లేదు. లలితాదిత్యుడిని పొగడలేడు. దీన్ని బట్టి కూడ లలితాదిత్యుడు విజయం నిర్ణయమవుతుంది.

యశోవర్మ ఓడిపోవటంతో మగథ, గౌడ, వంగ రాజ్యాలు లలితాదిత్యుడికి లొంగిపోయాయి. తరువాత కళింగులను గెలిచాడు.

కర్ణాటక రాణి ‘రత్త’ లలితాదిత్యుడికి దాసోహం అంది. ఈమె రాష్ట్రకూట రాజు ఇంద్రుడి భార్య ‘భావనాగ’గా భావిస్తున్నారు. భావనాగ చాళుక్య రాజు కూతురు. ఇంద్రుడు ఆమెను ప్రేమించి అపహరించి తెచ్చి పెళ్లి చేసుకున్నాడు. ఇంద్రుడి మరణం తరువాత భావనాగ తన కుమారుడు ‘దంతిదుర్గ’ను తొడపై కూర్చోపెట్టుకుని రాజ్యం చేసింది. అయితే ఆమె భర్త సోదరుడు ‘కృష్ణ’ రాజ్యం అపహరించాలని ప్రయత్నించాడు. అప్పుడామె లలితాదిత్యుడి సహాయం కోరింది. ఆమె సహాయం కోరడంతో  లలితాదిత్యుడు కర్ణాటక వేపుకు మళ్లాడు. జీవిగుప్త, యశోవర్మలు కూడా అతడికి సహాయంగా వచ్చారు. ఆమెకు సహాయానికి వెళ్తున్న లలితాదిత్యుడి మార్గం చాళుక్య రాజులు సుగమం చేశారు. అయితే పలువురు,  కర్ణాటకలో ఉన్న రాణి కాశ్మీరు రాజును సహాయం కోరటం ఏమిటని ప్రశ్నిస్తారు. కర్ణాటక నుంచి తమిళనాడు వెళ్లాడు లలితాదిత్యుడు,  కల్హణుడి ప్రకారం. అటునుంచి సప్తకొంకణ గెలిచాడు. ద్వారక గెలిచాడు. లాట్ రాజ్యాన్ని, ఉజ్జయనిని గెలుచుకున్నాడు. అయితే లలితాదిత్యుడు ఇంతటితో ఆగలేదు. ‘అన్ని దిక్కుల రాజులను గెలిచిన లలితాదిత్యుడు ఉత్తరం వైపు మళ్లాడ’ని కల్హణుడు రాశాడు.

లలితాదిత్యుడు కాంభోజాన్ని గెలిచాడు. ఇంతలో తిబ్బత్తు సేనలు కాశ్మీరు సరిహద్దుల వద్ద అలజడి సృష్టిస్తున్నాయని తెలియటంతో లలితాదిత్యుడు దృష్టి ఆ వైపు మళ్లించాడు. గిల్జిత్, లదాఖ్ లను గెలిచి ‘జోజి లా పాస్’ వరకూ తన సామ్రాజ్యాన్ని విస్తరించాడు. ప్రతి పోరాటంలో లలితాదిత్యుడు విజయం సాధించాడు. ఇంతలో హఠాత్తుగా లలితాదిత్యుడు స్త్రీ రాజ్యం ప్రాగ్జోతిష్పురం వైపు మళ్లాడు.

‘స్త్రీ రాజ్యం’ ఏమిటి అన్నది ఇంత వరకు తేలలేదు. ఇది ఒక ఊహారాజ్యం అని కొందరు కొట్టి పారేస్తారు. ప్రాగ్జోతిష్పురం కామరూప రాజధాని. కామరూపం అంటే ప్రస్తుతం అస్సాం. ప్రాగ్జోతిష్పురం గౌహతి.

‘స్త్రీ రాజ్యం’ ఊహా రాజ్యం అని అంటారు కాని యువాన్ చాంగ్ తన భారత పర్యటనలో “బ్రహ్మపుత్ర నదికి ఉత్తరాన మంచు పర్వతాల నడుమ సువర్ణ గోత్ర సామ్రాజ్యం ఉంది. ఇదంతా బంగారమే. ఈ రాజ్యాన్ని మహిళలే పాలిస్తారు” అని రాశాడు. సువర్ణగోత్ర ప్రాంతం ప్రస్తుతం ‘గరెవాల్ కుమావోన్’ ప్రాంతంగా గుర్తిస్తున్నారు. గరెవాల్ రాజులకు నదీ తీరంలో దొరికే బంగారం ప్రధాన ఆదాయం. అందుకే ఆ రాజ్యం ‘సువర్ణగోత్ర’ అయింది. యువాన్ చాంగ్ ప్రకారం ప్రస్తుతం బలుచిస్తాన్‌లో ఉన్న ‘లంకారా’ కూడా మాతృస్వామ్య రాజ్యమే. అంటే ‘స్త్రీరాజ్యం’,  మనం ప్రస్తుతం గుర్తించలేకున్నా ,  అంత ఊహారాజ్యం కాదనిపిస్తుంది. లలితాదిత్యుడు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ ప్రాంతాలను గెలిచాడు. గరెవాల్ కుమావోన్ ప్రాంతం ఇక్కడిదే. సువర్ణగోత్ర ఇక్కడిదే. కాబట్టి ఇక్కడెక్కడో స్త్రీ రాజ్యం ఉండి ఉండేదని చరిత్ర కారులు భావిస్తున్నారు. లలితాదిత్యుడు విస్తరింపచేసిన కశ్మీరు సామ్రాజ్యాన్ని పరిగణలోకి తీసుకుని పరిశీలిస్తే దాదాపుగా భారతదేశం అంతట తన సామ్రాజ్యాన్ని విస్తరింప చేసిన తొలి రాజుగా లలితాదిత్యుడుని పరిగణించ వచ్చనిపిస్తుంది. ఇంత విశాలమైన సామ్రాజ్యం అంతకు ముందు ఏ రాజుకీ లేదు. ఆయన గాంధారం దాటి తన సామ్రాజ్యాన్ని విస్తరింప చేశాడని గమనిస్తే ‘అఖండ భారతం’ అన్న ఆలోచనకు అతని సామ్రాజ్యం అద్దం పడుతుందని స్పష్టమవుతుంది.

లలితాదిత్యుడు తన ఉత్తరంలో సూచించిన విధంగా చైనా తన సైన్యాన్ని మహా పద్మ సరస్సు వద్ద రక్షణ ఉంచలేదు. దాంతో మళ్లీ తిబ్బత్తు సమస్య తలఎత్తింది. చైనా రాజు ‘కావో హెన్ని’ అనే సైన్యాధికారిని యుద్ధానికి పంపేడు. వారికి సహాయంగా లలితాదిత్యుడి సేనలు తిబ్బత్తు వారి ప్రయాణ మార్గాలను ధ్వంసం చేశాయి. కాని చైనా సేనలు ఆ ప్రాంతానికి కాపలాగా నిలవలేదు. అందుకే తోఖరిస్తాన్ దూత చైనా రాజు సహాయం అడిగినప్పుడు, చైనా రాజు కశ్మీరు సహాయం అడిగినప్పుడు లలితాదిత్యుడు గతంలోలాగా ఎలాంటి షరతులు లేకుండా సహాయనికి ముందుకు పోలేదు. బోలెడంత బెట్టు చేసి బేరాలు చేసి సహాయం చేసేందుకు లలితాదిత్యుడు సిద్ధమయ్యాడు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటుంది. తిబ్బత్తుకు చెందిన ప్రాంతమయిన లడాఖ్‌ను లలితాదిత్యుడు ఆక్రమమించినా తిబ్బత్తు వారు కశ్మీరు వైపు కన్నెత్తి చూడలేదు. కానీ మాట మాటకీ చైనాతో యుద్ధానికి సిద్ధపడుతూన్నారు. దీన్ని బట్టి ఆనాటి కశ్మీర సైన్యం ఎంత శక్తివంతమైనదో, చైనా అంటే తిబ్బత్తుకు ఎంత చులకనో అర్థం చేసుకోవచ్చు. అలాంటి శక్తివంతమైన కశ్మీరు రాజు చైనా చక్రవర్తికి సామంతరాజు అని కొందరు చరిత్రకారులు నొక్కిచెప్తుంటారు.

రాజ్యానికి వచ్చినప్పటి నుంచి యుద్ధాలు చేస్తున్న లలితాదిత్యుడు అరేడేళ్లు కశ్మీరంలోనే ఉండి కశ్మీరు పాలన వ్యవస్థను పటిష్ట పరిచాడు. అత్యద్భుతమైన కట్టడాలు నిర్మించాడు.

కల్హణుడు ఇలా కశ్మీరులో ప్రశాంతంగా ఉన్న సమయంలో తిబ్బత్తులు, అరబ్బులు కలసి చైనా వారిని ఓడించారు. తిబ్బత్తు రాజు కశ్మీరు నుంచి పలువురు పండితులను తిబ్బత్తు ఆహ్వనించి గౌరవించాడు. కానీ ‘తారిమ్ లోయ’ ప్రాంతంపై చైనా వారి పట్టుపోవటం, చైనా అంతర్గత కలహాలతో సతమతమవుటం, తోఖరిస్తాన్‌పై అరబ్బుల బెడద పెరగటంతో లలితాదిత్యుడు మళ్లీ కశ్మీరు వదలి యుద్ధం చెయాల్సి వచ్చింది. ఇది అంతవరకూ ఏ భారతీయుడు తలపెట్టని ప్రాంతాల కోసం యుద్ధం. అంత వరకూ ‘కష్గర్’ వరకే లలితాదిత్యుడి సేనలు ప్రయాణించాయి. ఉత్తరాపథ జైత్రయాత్ర ఆరంభించాడు లలితాదిత్యుడు.

అనన్యా ప్రోక్తపృధివీ సమాలోచన కౌతుకీ।
అపాదం ప్రవివేశాధి పునరేవోత్తరాపథమ్॥
(కల్హణ రాజతరంగిణి, IV, 337)

ఇంతవరకూ ఎవరూ దర్శించని అపారమైన ఉత్తరాపథం లోకి లలితాదిత్యుడు ప్రవేశించాడు. ఉత్తరాపథం అంటే హిమాలయాలు దాటిన తరువాత ఉన్న తారిమ్ లోయ, లఖ్లమకాన్ ఎడారి, ఖోటాన్, కష్గర్, యార్కండ్, నియా, అక్సు, కుఛ్ఛా, తుర్ఖాన్, గావోచాంగ్ వంటి ప్రాంతాలు. ప్రస్తుతం ఇది చైనా ‘జిన్ జియాంగ్’ ప్రాంతం. యుద్ధాలతో విజయం సాధిస్తున్న రాజుని వెనక్కురమ్మని కశ్మీరు నుంచి దూత వచ్చినప్పుడు లలితాదిత్యుడు.

ఇత్యోదిశతి వః స్వామీ కోయమ్ మోహో భవాదృశామ్।
క్షామిమామ్ మే ప్రవిష్ఠస్య ప్రతీక్షధ్యే యదాగమమ్॥
(కల్హణ రాజతరంగిణి, IV, 341)

“ఈ ప్రాంతంలో అడుగు పెట్టిన నేనే తిరిగి రావాలని మీకు వ్యామోహం అనవసరం. ఒకదాని తరువాత మరొకటిగా విజయాలు సాధిస్తున్న నేను రాజ్యానికి తిరిగి వచ్చి ఏం చేయాలి? ప్రయాణం ఆరంభించిన నదులు ముందుకు సాగుతాయి, సముద్రం చేరేవరకూ ” అని వాళ్లకి పాలనలో కిటుకులు చెప్పి, పెద్దవాడిని రాజుగా నిలపమని ముందుకు సాగిపోతాడు లలితాదిత్యుడు. ఇలాంటి రాజులు ధరాతలంలో ఎక్కడా కనపడరు. భారతదేశానికే  ప్రత్యేకం ఇలాంటి మహానుభావులు.

ఆ తరువాత లలితాదిత్యుడి  మరణం ఒక మిస్టరీ. ఆయన ఇరాన్తో  పోరాటంలో ఓడి నిప్పుల్లో దూకి ప్రాణత్యాగం చేశారని కొందరంటారు. మంచు కురియటం వల్ల మరణించాడని కొందరంటారు. ఆయన అన్నీ వదలి అరణ్యంలో ప్రాణాలు విడిచాడని కొందరంటారు. కల్హణుడు కూడా ‘వారిలా చెప్తారు, వీరిలా చెప్తార’ని అంటాడు తప్ప స్పష్టంగా చెప్పడు. మంచు కురిసి లలితాదిత్యుడు మరణించిన అరణ్య ప్రాంతం ఇరాన్  గా భావిస్తున్నారు.

అత్యద్భుతాని కృత్సాని శృతాన్యస్య యథాకిల।
విపత్తిరపి భూయాభర్తుస్త ధైవాత్యద్భుతా శృతా॥
(కల్హణ రాజతరంగిణి, IV, 370)

ఎలాగయితే లలితాదిత్యుడు సాధించిన కార్యాలు అత్యద్భుతాలో, అలాగే అతని మరణం కూడా ఒక అద్భుతం అంటూ లలితాదిత్యుడి గాథను ముగిస్తాడు కల్హణుడు. ఏ భారతీయ రాజుకు లేనంత విసృత సామ్రాజ్యాన్ని సాధించిన మహాద్భుతమైన రాజు లలితాదిత్యుడికి నమస్కారం అర్పించి ముందుకు సాగాల్సి ఉంటుంది.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here