కశ్మీరు పర్యటన – కొంచెం తీపి కొంచెం చేదు

8
9

[ఇటీవల కాశ్మీరులో పర్యటించి ఆ అనుభూతులను, అనుభవాలను సంచిక పాఠకులతో పంచుకుంటున్నారు శ్రీ శ్యామ్ కుమార్ చాగల్. కశ్మీర్ రాజకీయ వ్యవహారాలపై రచయిత వెల్లడించిన అభిప్రాయాలు ఆయన వ్యక్తిగతమైనవి.]

[dropcap]కా[/dropcap]శ్మీర్ భూతల స్వర్గం అని చిన్నప్పుడు వినేవాళ్ళం, చదివేవాళ్ళం.

ఎన్నో సంవత్సరాలుగా కాశ్మీర్ వెళ్లి చూద్దామని కోరికగా ఉన్నప్పటికీ అక్కడి పరిస్థితుల మూలంగా వెళ్లలేకపోయాం. ఆర్టికల్ 370 తీసివేసిన తర్వాత పరిస్థితులు చక్కబడ్డాయని అర్థమై 26 ఆగస్టు 2023 నాడు హైదరాబాద్ నుంచి ప్రయాణమై శ్రీనగర్ ఎయిర్‍పోర్ట్‌లో దిగాం. దానికి కారణం నా చిరకాల మిత్రుడు.

ఆ మిత్రుడు తన కుటుంబ సభ్యులతో కలిసి శ్రీనగర్ లోని చెల్లెలి అత్తారింటికి మమ్మల్ని ఆహ్వానించాడు. ఆ విధంగా మేము వారితో కలిసి అక్కడ చూడవలసిన ప్రదేశాలను చూసి ఆనందించడమే కాక వారి బంధువుల ఇళ్లకు వెళ్లి ఆతిథ్యాన్ని పొందాము.

చల్లని వర్షాకాలపు చలిలో హైదరాబాద్ నుంచి బయలుదేరిన మేము శ్రీనగర్‌లో తీక్షణమైన ఎండ తీవ్రతను చవి చూడడం జరిగింది. ఆగస్టు నెల ఇక్కడ వేసవి కాలంలో భాగమట.

హైదరాబాద్ నుండి నేరుగా శ్రీనగర్‌కి వెళ్లే ఇండిగో ఫ్లైట్ ఎక్కాము. అక్కడ తీవ్రవాదుల బెడద ప్రస్తుతం ఎలా ఉందో మాకు తెలీదు. ఇక్కడ మనకు దొరికిన సమాచారం మేరకు అక్కడంతా ప్రశాంతంగా ఉందని భావిస్తూ వెళ్లే ధైర్యం చేసాము. నా మిత్రుడి చెల్లెలి చుట్టాలు శ్రీనగర్ వాళ్ళు కావడంతో అక్కడికి వెళ్ళటానికి నేను ధైర్యం చేసానని చెప్పాలి.

ఫ్లైట్ లోనుండి బయటకు దిగగానే వెచ్చటి వేడిగాలి రివ్వున మొహానికి కొట్టింది. అక్కడున్న వారం రోజుల పాటు మేం తెచ్చుకున్న స్వెటర్లు, మఫ్లర్లు సూటుకేసుల్లో నుండి బయటకు తీయవలసిన అవసరం మరి రాలేదు.

ఎయిర్‌పోర్టు బయట విపరీతమైన జన సందడి కనపడింది. అక్కడినుంచి శ్రీనగర్ పట్టణంకి దాదాపు పది కిలోమీటర్ల దూరం క్యాబ్‌లో ప్రయాణం చేసాం. దారి పొడవునా, ప్రతి 50 గజాలకు ఒకరుగా బిఎస్ఎఫ్ జవానులు చేతుల్లో కార్బన్లు పట్టుకొని, చూపుడు వేలు ట్రిగర్ల మీద పెట్టి కాపలా కాస్తుండటం గమనించాం.

రహదారులన్ని విశాలంగా, వాహనాలతో నిండి ఉన్నాయి. పట్టణం చుట్టూ సుదూరంగా పచ్చని చెట్లతో నిండిన పర్వతాలు కనిపిస్తున్నాయి. ప్రజలందరూ ఎవరి పనుల్లో వారు నిమగ్నమై కనిపించారు. ఒకప్పుడు నిత్యం హ్యాండ్ గ్రైనేడ్స్‌తో, తుపాకులతో టెర్రరిస్టులు చెలరేగిపోయిన పట్టణమేనా ఇది అని ఆశ్చర్యం కలిగింది.

ప్రజలందరూ మంచి శరీర ఛాయతో అందంగా కనిపించారు. పట్టణంలో ఎక్కడా కూడా బహుళ అంతస్తుల బంగాళాలు కానరాలేదు.

శ్రీనగర్ పట్టణానికి కాస్త దూరంలో ఉండే హోటల్లో మాకు ఆతిథ్యం ఇచ్చారు. దేశం నలుమూలల నుండి వచ్చిన వారు మినహా అక్కడ ప్రాంతీయంగా హిందువులు మాకు దాదాపుగా కనపడలేదనే చెప్పాలి.

40 సంవత్సరాల కిందట నేను మొదటిసారిగా కాశ్మీర్ వెళ్ళినప్పుడు స్త్రీలు ఎవరు బురఖాలు ధరించేవారు కాదు. నుదుటన కనిపించే బొట్టును బట్టి ఎవరు హిందూ ఎవరు ముస్లిం అని తెలుసుకున్నాం. ఇప్పుడు దానికి భిన్నంగా చాలావరకు ఇక్కడ స్త్రీలు బురఖాలు ధరించి కనపడ్డారు. ఇంకో రకంగా చెప్పాలంటే అక్కడ ప్రాంతీయంగా నివసించే హిందూ స్త్రీలు ఎవరు మాకు కనపడలేదు.

ప్రజలందరూ ప్రశాంతంగా హాయిగా వుండి వారి వారి పనుల్లో మునిగిపోయి, తీరిక లేకుండా కనపడ్డారు. రోడ్లన్నీ రద్దీగా కిట కిట లాడుతూ ఉన్నాయి. హోటళ్లలో తిండి పదార్థాల ధరలు ఆకాశం అంటుతున్నాయి. అవి దూర ప్రాంతం నుంచి వచ్చే టూరిస్ట్‌ల గురించి అని తెలిసిపోతోంది.. ఇక్కడ లభించే ఏ సౌకర్యానికైనా స్థిరమైన, సరి అయిన ధరలు లేవు. మేము గమనించింది ఏంటంటే ప్రతి దాని ధర దాదాపుగా నాలుగు రెట్లు చెప్పడం జరుగుతుంది. మనం అందులో సగం ధరకు అడగ్గానే సరేనంటూ ఇచ్చేస్తారు. అప్పుడు గానీ మనకర్థం కాదు, మనం ఇంకా తక్కువగా అడగవలసింది అని.

చుట్టూ ఎటు చూసినా ఆకాశాన్ని అంటుకున్నట్లుగా వుండే ఆకు పచ్చని చినారు, దేవదారు వృక్షాలతో నిండిన ఎత్తైన శిఖరాలు కనపడుతున్నాయి. మేము బస చేసిన హోటల్‌లో సౌకర్యాలు బావున్నాయి. అయితే ఇక్కడ మన వంటలు మాత్రం దొరకవు అని అర్థం అయ్యింది. ఆంధ్ర వంటకాలు ఆశించటం మరింత అత్యాశే అయ్యింది.

***

మొదటి రోజు అక్కడి టూర్ ఆపరేటర్ ద్వారా ఫోర్స్ వ్యాన్‌లో గుల్మార్గ్ కు బయలు దేరాం. నేషనల్ హై వే నెంబర్ అరవై అయిదు మీదుగా ప్రయాణం సాగింది. శ్రీనగర్ పట్టణం దాటి వచ్చిన తర్వాత వాతావరణం చల్లగా అనిపించింది. అంటే కాలుష్యపు వేడి ఇక్కడ పట్టణంలో కూడా ఉందన్న మాట. చుట్టూరా పంట పొలాలు, లేత నీలి రంగు ఆకాశం, దూరంగా అక్కడక్కడా మంచుతో కూడిన కొండలు కళ్ళకు విందు చేశాయి.

ఉన్నట్లుండి రోడ్‌కు అడ్డంగా బి.ఎస్.ఎఫ్ జవానులు మెషిన్ గన్‌లు చేత బట్టుకుని, అన్ని వాహనాల్ని రోడ్ పక్కగా చాల సేపు నిలిపేశారు. కిందకు దిగి అక్కడ నిలబడ్డ ఒక జవానుని కారణం ఏమిటని అడిగాను.

“అమరనాథ్ యాత్రీకుల వరస వాహనాలు వస్తున్నాయి. భద్రతా కారణాల వల్ల ఆపాలి.” అని నన్ను నిలువెల్లా చూసి సమాధానం చెప్పాడు.

ఆ విధంగా ఒక గంట తర్వాత మా ప్రయాణం మళ్ళీ కొనసాగింది. గుల్మార్గ్ ఎత్తయిన ప్రదేశం కావటంతో మా వ్యాన్ ప్రయాణిస్తున్న కొలదీ చలి పెరగసాగింది. కొండ చరియల మధ్య నుండీ మా వ్యాన్ పరుగులు తీసింది. దారి పక్కన స్వచ్ఛమైన నీటి సెలయేరులు గలగల మని పెద్ద చప్పుడుతో ప్రవహిస్తున్నాయి. వంపులు తిరిగిన రోడ్ మార్గంలో వందల కొద్దీ యాత్రీకుల వాహనాలు వెళుతూ వున్నాయి.

మార్గమధ్యంలో ప్రతి వంద గజాలకు ఒక మిలిటరీ/బి.ఎస్.ఎఫ్ వాహనం, అందులో పైన పెద్ద మెషీన్ గన్ పట్టుకుని కాపలా కాస్తున్న జవానులు కనిపించారు. ప్రతీ నాలుగు రోడ్ల కూడలి వద్ద బి.ఎస్.ఎఫ్./జే.కె.ఎల్. పోలీసులు టెంట్ వేసుకుని, చుట్టూ ఇసక బస్తాల మధ్య గన్ ట్రిగ్గర్ మీద నుండీ వేలు తీయకుండా నిలబడి వున్నారు.

అప్పుడు గమనించాను, గస్తీ కాస్తున్న ప్రతీ జవాను బులెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకుని చేతిలోని గన్ ట్రిగ్గర్ మీద వేలు తప్పని సరిగా పెట్టి నిలబడ్డారు. ఎవరు కూడా గన్‌ని భుజాలకు వేసుకుని నిలబడటం కనపడలేదు. దాన్ని బట్టి రక్షణ దళాలు ఎంత అప్రమత్తంగా ఉన్నాయో ఊహించవచ్చు.

అప్పుడు మా డ్రైవర్‍ను అడిగాను “ఇప్పుడు పరిస్థితి ఎలా వుంది? ఆర్టికల్ తీసేసి నాలుగు సంవత్సరాలు అయ్యింది కదా.” అని.

“ఒక తరం అనవసరమైన గొడవల్లో ఇరుక్కుని జీవితం నాశనం చేసుకున్నారు. ఇక్కడి యువతరాన్ని తప్పు దోవ పట్టించి వాళ్ళను రెచ్చగొట్టి పాక్ ప్రభుత్వం మాతో ఆటలాడుకుంది, ఇక్కడి పిల్లలకు ఏం తెలుసు?” అన్నాడు.

“అది సరే మరిప్పుడు అంతా బాగున్నట్టే కదా” లోతుగా ప్రశ్నించాను.

దానికి సమాధానం ఇవ్వలేదతడు.

ఇంతలో మా వ్యాన్ గుల్మార్గ్ ఊరిలోకి ప్రవేశించింది. ఆ ఊరికి చుట్టూ చాలా ఎత్తైన కొండలు మొత్తంగా దట్టమైన చెట్లతో నిండిపోయి వున్నాయి. అక్కడ నుండీ మరింత ఎత్తైన ప్రదేశానికి చేరుకోవటానికి గుర్రాలు, చిన్న కార్లకు మాత్రమే ప్రవేశం. చుట్టూ పచ్చిక బయలు, ఎటు చూసినా యాత్రీకులు, హోటల్స్ కనపడుతూ వున్నాయి.

వాతావరణం చల్లగా, మబ్బులు మూసుకుని కాస్త వణికించే చలి గాలి చెవులకు రివ్వున కొడుతూ వుంది. వర్షం వచ్చే సూచనలు కనపడ సాగాయి. ఎందుకైనా మంచిదని పొడవాటి రైన్ కోట్లు అద్దెకు తీసుకున్నాం.

చిన్న కారులో అక్కడనుండి ఇంకాస్త ఎత్తుకి తీసుకెళ్లారు. అక్కడ మా మీద చల్లని వర్షపు మబ్బులు చుట్టేశాయి. మంచు గాలిలో సన్నని నీటి బిందువుల మధ్య గడపటం మాకొక కొత్త అనుభూతి అనే చెప్పాలి. ఆ మబ్బుల మూలంగా దగ్గరలో వున్నదేదీ కనపడలేదు. అలా ఆ మబ్బులు కాసేపు వుండి వెళ్లిపోయాయి. వెంటనే మెత్తని సూర్య కిరణాలు వచ్చేసాయి.

అక్కడ నుండీ పైకి వెళ్ళటానికి రోప్ వే పెట్టారు. కాస్త దూరం ఆ వేలాడే కేబిన్‌లో కూర్చుని ప్రయాణం చేసాము. అక్కడ ఇంకా చలిగా వుంది. చెట్లు చేమ ఏవీ లేవక్కడ. రాతి కొండలు, వాటి మీద ఇంకాస్త ఎత్తులో మంచు కనపడుతోంది. ఆ ప్రదేశమంతా జంటలు, కుటుంబాలు, పిల్లా పాపలతో కోలాహలంగా వుంది. ఆర్థిక సౌలభ్యాన్ని బట్టి ఎన్నుకోవటానికి అన్ని రకాల హోటల్స్ వున్నాయి. రాత్రుళ్ళు అక్కడ ఎవరూ వుండరు. మొత్తం ఖాళీ అయిపోతుంది.

ఎప్పుడు వర్షం వస్తుందో, ఎప్పుడు గాలి మంచు తుఫానులు వస్తాయో తెలీని ప్రదేశం అది. సంవత్సరంలో ఆరు నెలలు మాత్రమే ఈ ప్రదేశానికి సుఖంగా వెళ్ళగలం. అక్కడి ప్రజలకు ఆ సమయంలో మాత్రమే టూరిస్టులనుండీ సంపాదన. మిగతా సమయంలో మంచులో, చలిలో కాలం వెల్లబుచ్చుతూ, అడపా దడపా వచ్చే విదేశీ యాత్రీకుల నుండీ ఎంతో కొంత సంపాదించుకుంటారు. ఇక్కడ చాకొలేట్ తినాలనిపించి తీసుకున్నాను. ధరలు రెండు రెట్లున్నాయి. అయితే అంత పైకి తినుబండారాలు మోసుకు రావడానికి చాలా శ్రమించాల్సి వస్తుందనటంలో సందేహం లేదు.

ఆ ప్రదేశం జీవనానికి అనుకూలంగా లేదు. పైగా అదంతా ప్రభుత్వ భూమి. అందులోను అది అటవీ శాఖా వారి అధీనంలో ఉందని తెలిసింది. అక్కడ పనిచేస్తున్న ఒక ఉద్యోగిని పలకరించి చూసాను. చాలా అసంతృప్తిగా వున్నాడు. అతని అభిప్రాయం ప్రకారం ఆర్టికిల్ తీసేయటంతో త్వరలో వేరే ప్రాంతాల వారొచ్చి వీరి స్థలాలను, ఆస్తులను కొనేస్తారు. దాంతో ప్రాంతీయులకు అన్యాయం జరిగిపోతుంది.

వీరిని ప్రభుత్వం ఒక పథకం ప్రకారం చెడ్డవారిగా చిత్రించింది అంతే గాని అది నిజం కాదుట. వీళ్ళందరూ యాత్రీకులను చాల ప్రేమగా చూసుకుంటారట, ఎవరితో వాళ్లకి తగాదా లేదట. ఈ మిలిటరీ, పారా మిలిటరీ వాళ్ళు అనవసరంగా అక్కడి ప్రజలను నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారట.

“అందరూ మంచివారైతే మరి ఈ తీవ్రవాదులు ఎక్కడనుండి వచ్చారు?” అని ప్రశ్నించాను. “వాళ్ళు కొద్ధి మందే వుంటారు.. అసలు ఇదంతా రాజకీయం” అన్నాడు. మొత్తానికి విషయం దాటేశాడు అనే చెప్పాలి.

సాయంత్రం వరకూ అందరం హాయిగా గడిపి మా హోటల్‌కి తిరుగు ప్రయాణం మొదలెట్టాం.

చిన్నగా వర్షం మొదలయ్యింది. వచ్చేప్పుడు ప్రకృతి అందాలు చూస్తూ మైమరచి పోయాము కానీ ఇప్పుడు గమనిస్తే ఆ కొండ చరియల దారి చాలా ఇరుకుగా ప్రమాదకరంగా వుంది.

డ్రైవర్ ఏ కాస్త ఏమరుపాటుగా వున్నా మా కారు వెళ్లి కింద అగాధం లోకి కూలిపోవడం ఖాయం. ఒక వేపు కొండ రాళ్లు, మరొక వేపు లోతైన లోయ. పైగా రాళ్లు రప్పలతో నిండిన గతుకుల దారి. దానికి తోడు కారు అతి వేగంగా వెళ్తూ వుంది . కాసేపు ప్రాణాలు ఉగ్గబట్టుకున్న మేము ఇహ లాభం లేదనుకుని, అతడిని హెచ్చరించాం.

“అంతా భగవంతుడి చేతుల్లో వుంది, మనం మన ధర్మం నిర్వర్తించాలి” అన్నాడు డ్రైవర్.

దానికి సమాధానంగా “నీ జీవితం ఒక్కటే కాదు, మా ప్రాణాలు కూడా నీ ధర్మంతో జోడిస్తే ఎలా?” అన్నాను నవ్వుతూ.

సరేనంటూ తలూపాడు కానీ వేగం తగ్గించలేదు. బహుశా అతనికది ఎప్పుడూ ఎదురయ్యే అభ్యంతరం అనుకుంటా.

ఆ రోడ్ రద్దీగా వుంది. రెండు మార్లు బిఎస్‌ఫ్ జవానులు కార్లను ఆపి, ఒక మారు పరిశీలించి పంపించారు.

ఈ ఒక్క రోడ్ లోనే ఇంతమంది రక్షణ దళాలు ఉంటే శ్రీనగర్ మొత్తంగా ఎన్ని లక్షల పారా మిలిటరీ దళాలున్నాయో? వాటి ఖర్చు ప్రతీ దినం ఎన్ని కోట్ల రూపాయలో? వారిని చూసినప్పుడల్లా అక్కడి ఉగ్రవాదుల నుండీ పొంచి ఉన్న ప్రమాదం గుర్తొచ్చి కాశ్మీర్ అందాల అనుభూతిలో నుండీ బయటకు నెట్టివేసినట్లుగా అనిపించింది.

అలా వేగంగా కారు నడుపుతుండటంతో అతన్ని మాటల్లో దింపి వేగం తగ్గేలా చేద్దామనే ప్రణాళికతో, డ్రైవర్‌ని మాటల్లో దింపాను. ముందుగా “పెళ్లి అయ్యిందా?” అని ప్రశ్నించేసరికి, నవ్వుతూ ఆనందంగా అవునని సమాధానం ఇచ్చాడు. దాంతో “మరింకే అందుకే నీకు ప్రాణాల మీద భయం లేదు” అని జోక్ చేశాను.

దానికతను వెంటనే “అలాంటిదేమీ లేదు సార్, అసలు పెళ్లి అనేదే ఒక సుమధుర ఘట్టం. అది లేని మగాడి జీవితం వ్యర్థం” అన్నాడు. అంతలో అతని మొబైల్ మ్రోగింది.

అమ్మయ్య ఇప్పుడు వేగం తగ్గిస్తాడని అనుకున్నా. కానీ అతను కారు వేగాన్ని ఏమాత్రం తగ్గించకుండా “చూసారా సార్, భార్య గురించి మాట్లాడగానే తన నుండీ ఫోన్” అని చెప్పి, ఆనందంగా భార్యతో మాట్లాడి ఫోన్ పెట్టేసాడు.

ఎగుడు దిగుడు రహదారి మూలంగా మా కారు ఎగిరి పడసాగింది. కంట్రోల్ తప్పి రోడ్ పక్కనే వున్న లోయ లోకి కూలిపోయి ఏకంగా పైకి వైకుంఠానికి పోతామనే దడ ఎక్కువయ్యింది.

వాచీ చూస్తే రాత్రి ఎనిమిది కావొస్తుంది, కానీ అప్పుడప్పుడే చీకట్లు అలుముకుంటున్నాయి. ఇక్కడ రాత్రి సమయం తక్కువ అని అర్థం అయ్యింది.

చలి కాలం మొత్తం గుల్మార్గ్ మంచుతో కప్పబడిపోతుందట. రహదారులన్నీ మంచుతో మూసుకుపోయి, ప్రతి దినము ప్రభుత్వ వాహనాలు ఆ మంచుని రొడ్డుకిరువైపులకు తోసేస్తారుట. ఆ సమయంలో వస్తే కానీ అసలు కాశ్మీర్ అందం చూడలేమని అన్నారు. కాకపోతే ఆ మైనస్ డిగ్రీల చలిని తట్టుకోవడం చాల ఇబ్బంది అని తెలిసింది, ముఖ్యంగా నడి వయస్కులకు.

త్రోవ పొడవునా ఎక్కడ చూసినా డ్రై ఫ్రూట్స్ దుకాణాలు, పండ్ల దుకాణాలు కనపడ్డాయి. గుల్మార్గ్ వదలి కాస్త దూరం ప్రయాణం చేసిన తర్వాత మిత్రుడి చుట్టాల ఇంటి ముందు ఆగాము. రోడ్ పక్కన కాస్త ఎత్తైన ప్రదేశంలో అందమైన ఇల్లు కనపడింది. మన దగ్గర అలాంటి అందమైన ఇంటి డిజైన్‌లు రిసార్టుల్లో ఉంటాయి.

ఆ ఎత్తు ప్రదేశం చేరుకోవడానికి మట్టి మెట్లు వున్నాయి. ఏ మాత్రం పట్టు జారినా దొర్లుకుంటూ కింద పడటం తప్పదు. మేం ఇబ్బందిగా పైకి ఎక్కాం కానీ ఆ ఇంటి వారందరూ తేలికగా ఎక్కేసారు.

పైన విశాలమైన ప్రదేశంలో ఇల్లు కట్టుకున్నారు. చుట్టూ ఆపిల్, ఆక్రోట్, చెర్రీల చెట్లతో ఇల్లు మరింత అందంగా వుంది.

అక్కడ ప్రతీ ఇంటిలో ఆపిల్ తో బాటు రకరకాల డ్రై ఫ్రూప్ట్స్ చెట్లు పెంచుకుంటున్నారు. బాదం, ఆక్రోట్, చెర్రీ, ఆపిల్ అలాంటి డ్రై ఫ్రూప్ట్స్ అక్కడ వారెవరూ కొని తినాల్సిన అవసరం రాదని చెప్పారు. మనం వేల డబ్బులు తో కొని తినే పండ్లు వారికి పెరడు లోనే లభ్యం అవుతాయి.

చాల ప్రేమగా లోనికి తీసుకెళ్లి, మాకందరికీ కూర్చోవడానికి చక్కని తివాచీలు చూపించారు. వెనక్కి గోడకి వాలుకుని కూర్చోవడానికి మక్మల్ దిండ్లు ఇచ్చారు. లోకెళ్ళి అన్ని గదులు చూస్తే, ఎక్కడా కుర్చీలు, సోఫాలు లేవు. అంతే కాదు పడగ్గదిలో మంచాలు కూడా లేవు.

మాలో కొందరు కింద కూర్చోవడానికి మోకాలి నొప్పి వగైరాలతో ఇబ్బంది పడ్డారు. కానీ విచిత్రమైన విషయం ఏమిటంటే అక్కడ వున్న సభ్యులలో దాదాపు డెబ్భై సంవత్సరాల వయసున్న వారు కూడా ఏ మాత్రం ఇబ్బంది పడకుండా హాయిగా కూర్చుని, సులభంగా పైకి లేచి నిలబడుతున్నారు. గమనించి చూస్తే ఇక్కడ ప్రజలకు నడుములు సన్నగా వుండి, బొజ్జలు ఏమాత్రం లేవు. మంచి డ్రైఫ్రూప్ట్స్, బిస్కెట్స్ మా ముందు పెట్టారు. చక్కని టీ సేవించి అక్కడ నుండీ బయలుదేరాము.

శ్రీనగర్ లోకి ప్రవేశించేసరికి చీకటి పడి లైట్లతో పట్టణం మిలమిల మెరుస్తూ వుంది. ఎక్కడ చూసినా కాశ్మీరీ బట్టలు, శాలువాలు, తివాచీలు అమ్మే దుకాణాలు విరివిగా కనపడ్డాయి. చాలా వాటిల్లోకి వెళ్లి బట్టలు కొందామని ప్రయత్నించాం. అయితే అక్కడ వాటికి మనం సరి అయిన వెల కట్టలేమని అర్థమైంది. మనకు తెలిసిన విద్య ప్రకారం వాటిని మూడవ వంతు ధరలకు బేరం చేసి తీసుకున్నాం. అప్పటికీ అందులో ఏదైనా మోసం ఉందేమోనని భయంతో కొన్నే కొనటం జరిగింది. తీరా హైదరాబాద్‌కి తీసుకొచ్చి చూపిస్తే అవి బాగున్నాయని, ధరలు పరవాలేదు అని తెలిసింది. అప్పుడనిపించింది ఇంకా కొన్ని శాలువాలు తెస్తే బాగుండేదని.

తిరిగి హోటల్‌కి చేరుకొని ఆ రాత్రి అవే రోటీలు, పప్పు దినుసులతో కూడిన కూరలు తిని, కడుపు నింపుకుని నిద్రకుపక్రమించాం. అక్కడి భోజనాలలో పెరుగు పాత్ర తక్కువగా కనపడింది. అక్కడున్నన్ని రోజులు పెరుగన్నం తినే భాగ్యం కరువయ్యింది.

***

మరుసటి రోజు నా స్నేహితుడి చెల్లెలి అత్తారింటికి వెళ్లాం. అది ఆ అమ్మాయి పెళ్ళైన మొదటి సారి కావటంతో అక్కడంతా పెళ్లి వాతావరణం నెల కొని ఉంది. రంగుల సిల్కు బట్టలతో పందిరి, తోరణాలు కట్టారు. పెళ్లి కొడుకు, పెళ్లి కూతురి మీద, వెనకాల వస్తున్న మా అందరి మీద ప్రేమగా చాకోలెట్స్, పూలు చల్లి లోనికి తోడ్కొని వెళ్లారు.

అతిథులందరూ కింద తివాచీల మీద కూర్చోవడం మాత్రం తప్పలేదు. బహుశా అక్కడి ఆచారం అనుకుంటా. ఎక్కడా సోఫాలు గానీ, కుర్చీలు గానీ లేవు. కొత్తగా పెళ్ళైన ఆ జంటకు పూల దండాలు వేసి కూర్చోబెట్టి, మా అందరికీ డ్రై ఫ్రూప్ట్స్, శీతల పానీయాలు, కొన్ని బహుమతులతో కూడిన సంచీలు అందించారు.

ఆ తర్వాత అక్కడి వంటలతో కూడిన భోజనాలు చేసాం. అవి జరిగిన కాసేపటికి, కాశ్మీరీ భాషలో పాటలు, డాన్స్‌లు చేశారు కొందరు అమ్మాయిలు. అవి కాశ్మీరీ భాషలో ఉండటంతో వాటి అర్థం తెలిసి రాలేదు. కొందరు అమ్మాయిలు, బలవంతంగా అతిథులను కూడా వారితో కలిసి డాన్స్ చేయించారు. కొందరు ముసిముసి నవ్వులు నవ్వుకోవడం చూసాను. అవన్నీ మా మీద జోకుల పాటలు అని, పాడి మమ్మల్ని ఆట పట్టించారని ఆ తర్వాత తెలిచ్చింది.

పెళ్లి ఇంటి నుండీ బయటకు వెళ్లి రకరకాల ఆపిల్ తోటలు చూసాం. అప్పుడప్పుడే కాయలు పెద్దగా అవుతున్నాయి. మనం చాలా ధర పెట్టి కొనే మంచి రకపు పళ్ళను అక్కడ కోసుకుని ఫ్రీగా తినేసాం. వాటికి అక్కడ పెద్ద విలువ లేదు.

మార్కెటింగ్ ఎంత ధర అని అక్కడ ప్రశ్నించాను ఒకరిని. మా పళ్ళు అమ్ముడు పోగూడదని, ధరలు రాకుండా చేసి మమ్మల్ని బీదవారిని చెయాలని మోడీ పన్నాగం పన్నాడు. మా లారీలను జమ్మూలో రోజుల తరబడి ఆపేస్తాడు మోడీ అన్నారు. నాకు అది విని నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు.

“అసలు కారణమేంటి, ఎందుకు వీరి పండ్ల లారీలను ఆపుతారు?” అని కాస్త వివరాలు అడిగాను, కానీ వాటికి ఒకటే సమాధానం వచ్చింది. అదే, మోడీ ఆపేస్తున్నాడు అన్నారు కోపంగా.

ఆ ఇంటి ముందున్న రోడ్ మీద కొన్ని పెద్ద వాహనాలు వెళుతున్నాయి. అందులో ఒక మిలిటరీ వ్యాన్ కూడా వుంది. ఇంటిలో కూర్చున్న కొందరు అదుగో మిలిటరీ వ్యాన్ వెళ్తుందని, దాని చప్పుడు గమనించి చెప్పటం మాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. వేరే వాహనాల చప్పుడు తో వీటి ఇంజిన్ చప్పుడు వేరేగా ఉంటుందని అన్నారు. వాటిని యమరాజ్ అంటారట. దాని అర్థం ఏమిటంటే ఎవరో ఒకరిని పట్టుకెళ్ళడానికి మాత్రమే అవి వస్తాయట. మిలిటరీ, బిఎస్‌ఎఫ్ పోలీసులు అక్కడ లేకుంటే వీరి జీవితం హాయిగా ఉంటుందని అన్నారు. మరి అలాగయితే ఈ టెర్రరిస్టుల విషయం ఎలా అని అడిగిన ప్రశ్నకు వారి నుండీ సమాధానం లేదు.

మాంసాహార పదార్థాలు చాలా భయం కొలిపేలా పెద్ద పెద్ద పరిమాణంలో కనపడ్డాయి. మిఠాయి కోట్లు ఎక్కడో ఒకటీ ఆరా తప్పితే కనపడ లేదు. ఆ రోజు పెళ్లి భోజనాలు చేసుకుని మా హోటల్‌కు తిరుగు ప్రయాణం కొనసాగించాం.

దాదాపు రెండు గంటలు ఆ తిరుగు ప్రయాణం కొండాకోనల మధ్య నుండీ సాగింది. హైవేకు చేరుకున్న తర్వాత సాయం సమయంలో టీ సేవించటానికి రోడ్ పక్కనున్న చిన్న టీ కొట్టు ముందు ఆగాము.

వ్యాన్ దిగి చూస్తే ఆ బడ్డి కొట్టు పక్కన ఇద్దరు సి.ఆర్.పి.ఎఫ్. సైనికులు నిలబడి ఉన్నారు. నేను వారితో మాటలు కలిపి చూసాను. ఒకతను బీహార్, మరొకతను బెంగాల్ నుండీ వచ్చారుట. నడి వయసులో ఉన్నారు. వారిలో ప్రశాంతత కనపడలేదు. అందరినీ అనుమానంగా చూస్తూ ఉన్నారు. వారికి కూడా రెండు కప్పుల టీ ఇచ్చాను. పాపం ఎక్కడి నుండో వచ్చి ప్రాణాలు ఫణంగా పెట్టిన ఆ ఇద్దరూ తెగ సంతోష పడిపోయారు. దానికి మాకయిన ఖర్చు ఇరవై రూపాయలు మాత్రమే.

ఒక కిలోమీటర్ దూరంలో వుండే ఊరికి ఒక జవాను సెలవు మీద ఇంటికి వెళ్లిన రాత్రి అతడిని టెర్రరిస్టులు తీసుకెళ్లారని, అతని జాడ తెలీటం లేదని బాధతో చెప్పారు.

బయటకు కనపడటం లేదు కానీ పరిస్థితి అక్కడ బాగు పడటానికి ఇంకా కొద్ది సమయం అవసరమేమో అనిపించింది.

అంతలో వారి పై ఆఫీసర్ వ్యాన్ వస్తుందని సమాచారం రాగానే, ఇక మీరు వెళ్లి పొండి. ఇక్కడ ఎక్కువ సేపు ఉండటానికి అనుమతి లేదని చెప్పారు. పైగా మీకు కూడా ప్రమాదమే అన్నారు. అది వినగానే మేమంతా వ్యాన్ ఎక్కి బయలుదేరాం. ఆ జవానులు ఇద్దరు వ్యాన్ పక్కకు వచ్చి మాలో కొందరికి చేతులు కలిపి నవ్వుతూ టాటా చెప్పారు. వారిని చూస్తే బాధ వేసింది. కుటుంబాలను వదిలి ఇక్కడికి వచ్చి నెల జీతం గురించి టెర్రరిస్టులతో పోరాడుతున్నారు. ఎంత మంది తిరిగి ప్రాణాలతో ఇంటికి వెళతారో?

హోటల్‌కి చేరుకొని అవన్నీ మర్చిపోయి తిని హాయిగా, నిద్ర పోయామందరం.

***

మళ్ళీ ఎప్పటిలాగే మరుసటి రోజు పహల్గావ్‍కు బయలుదేరాం. అసలు పహల్గావ్ చూడకుండా రావద్దు, అదే ముఖ్యంగా చూడవలసిన ప్రదేశం అని చెప్పారందరూ. శ్రీనగర్ పట్టణం దాటగానే మళ్ళీ స్వర్గధామంలా కనిపించే సుందరమైన ఆకుపచ్చని కొండలు, చల్లని గాలులు, వినీలాకాశం. అయితే ఈ దారి పొడవునా మిలిటరీ, బిఎస్‌ఎఫ్ పహారా మరీ ఎక్కువగా వుంది.

దానికి కారణం అది అమర్నాథ్‌కు వెళ్ళే మార్గాలలో ఒకటి అని చెప్పాడు డ్రైవర్. దారి పొడవునా ఆ యాత్రీకుల వాహన శ్రేణి వచ్చినప్పుడల్లా మిగతా వాహనాలను రోడ్ పక్కన ఆపేసి వాటికి దారి ఇచ్చారు. ఆ యాత్రీకుల వాహన శ్రేణికి ముందు, వెనకాల మెషిన్ గన్స్‌తో నిండిన మిలిటరీ రక్షణ కలిగించారు. అది చూస్తుంటే కాస్త చిరాకు, ఆశ్చర్యం కలిగాయి. మన దేశంలో మన ప్రజలు స్వేచ్ఛగా పుణ్యక్షేత్రాలను దర్శించుకోవాలంటే ఇలా ప్రాణాలకు తెగించి, భద్రతా వలయంలో వెళ్లాలన్న మాట. ఇదెక్కడి సెక్యూలర్ రాజ్యం? హిందువులకు సెక్యూరిటీ లేని దేశం. [రక్షణ లేని] సెక్యూలర్ వాదులకు మాత్రం ఇది కనపడదు.

మన దేశ నకిలీ మేధావులు, కుహనా లౌకికవాదులు ఈ రోజు కూడా కాశ్మీర్‍ను భారతదేశం నుండీ విడగొట్టే ప్రయత్నాలు జేస్తున్నారు. వీరిలో దేశభక్తి ఎందుకు కొరవడిందో అర్థం కాదు. మరీ ముఖ్యంగా న్యాయవాదులు ఈ కుట్రదారుల తరఫున వాదిస్తున్నారిప్పటికీ.

స్వర్గం లాంటి ప్రకృతి అందాలతో కూడిన కాశ్మీర్ – ఒక విదేశ శక్తి ఆటలకి, మన చేతగానితనంతో, పూర్తిగా హాయిగా అనుభవించటానికి వీలు లేని భయోత్పాతక ప్రదేశంగా మారిపోయింది.

ప్రస్తుతం రక్షణ దళాల, దేశ నాయకత్వం యొక్క దృఢత్వం కారణంగా ఈ మాత్రం ఇప్పుడు మేము తిరగగలుగుతున్నామని అర్థం అయ్యింది.

మరి కొద్ది దూరం ప్రయాణం చేసాక, అందరినీ కిందకు దింపారు. అక్కడ అమర్నాథ్ యాత్రికులకు ప్రత్యేక సదుపాయాలు, పరీక్షలు జరుపుతున్నారు. వాహనాలను, సామానులను, వ్యక్తులను సునిశితంగా పరిశీలించి పంపించారు.

రోడ్డుకిరువైపులా మంచినీటి కాల్వలు స్వచ్ఛమైన నీటితో గులకరాళ్ల మీద నుండీ గలగలా చప్పుడు చేస్తూ పారుతున్నాయి. వెళ్లి వాటిలో చేతులు తడుపుకున్నాం. వొళ్ళు గడ్డకట్టించేటంతటి ఆ నీటి చల్లదనం మరెక్కడా దొరకదు. చేతిలో తీసుకుని చూస్తే పారే నీరు పూర్తి స్వచ్ఛంగా వుంది.

వేరే హిల్ స్టేషన్‌ల కంటే ఇది పూర్తిగా భిన్నంగా వుండే ప్రాంతం. పొడవాటి దేవదారు వృక్షాలు, రంగు రంగుల పూలతో కళ్ళకు విందు అనే చెప్పాలి.

దూరంగా ఎత్తైన కొండ శిఖరాల అవతల పాకిస్థాన్ ఆక్రమించిన కాశ్మీర్ వుంది. చుట్టూ దట్టమైన కొండలు,వాటి నిండా పెద్ద వృక్షాలు. నిజంగా ఇది భూతల స్వర్గమే అనిపించింది.

ఘంటాఘర్ వద్ద రచయిత

ఆ రోజంతా కాలినడకన తిరుగాడి, మధ్యాహ్నం భోజనానికి బదులు రకరకాల చిరు తిళ్ళు తీసుకున్నాం.

ఇక్కడ చూడవలసిన ప్రదేశాలు చాలా వున్నాయి. అడ్వెంచర్ స్పోర్ట్స్ కూడా బోలెడు. నిజం చెప్పాలంటే అన్నీ చూడాలంటే నాలుగు రోజుల సమయం సరిపోదు.

లాల్‍చౌక్ వద్ద రచయిత
ఎనిమిదవ శతాబ్దపు శంకరగౌరి ఆలయ శిధిలాల వద్ద
ఎనిమిదవ శతాబ్దపు శంకరగౌరి ఆలయ శిధిలాల వద్ద

కానీ అప్పటికే మేమందరం అలసిపోవడం జరిగిపోయింది. తిరిగి హైదరాబాద్‌కు బయలుదేరాం. శ్రీనగర్ ఎయిర్‌పోర్ట్‌లో వెళ్లి టికెట్స్ తీసుకుని, బోర్డింగ్‌కి ఇంకా సమయం ఉండటంతో ఎయిర్‌పోర్ట్‌లో కనపడుతున్న దుకాణాల వేపు అడుగులు వేసాం. చాలా చిన్న ఎయిర్‌పోర్ట్‌ కావడంతో మొత్తంగా పది దుకాణాల కంటే ఎక్కువ లేవు.

అక్కడ చిన్న పుస్తకాల షాప్ నన్ను ఆకర్షించింది. అందులో వెళ్లి చూస్తే, సగానికి పైగా కాశ్మీర్ గురించి వ్రాసిన వివిధ రచయితల పుస్తకాలు కనపడ్డాయి.

నా మాట తీరు చూసిన అక్కడి షాప్ యజమాని నన్ను నా వివరాలు అడిగాడు. తర్వాత కాశ్మీర్ గురించి నా అభిప్రాయం అడిగాడు. ఒక రకంగా నన్ను ఇంటర్వ్యూ చేసినట్లుగా అనిపించింది. పనిలో పనిగా అతడిని నేను కూడా కొన్ని ప్రశ్నలు వేసాను.

ప్రస్తుత పరిస్థితి అతనికి సంతోషంగా లేనట్లుగా అనిపించింది. అతని వయసు ఇరవై అయిదు లోపలే ఉంటుంది. “మాకీ భవనాలు, రోడ్స్, వంతెనలు కాదు ప్రభుత్వ ఉద్యోగాలు కావాలి” అన్నాడు. “మాకు ఇండియా, పాక్ రెండూ వద్దు, స్వాతంత్య్రం కావాలి” అన్నాడు.

“అలా కుదరదు, ప్రతీ వారికి ఇలా ఇస్తే దేశం ముక్కలు అయిపోతుంది కదా” అన్నాను.

“అది మాకు అనవసరం, అప్పుడు నెహ్రు ఒప్పుకున్నాడు, అందుకే మేము ఇండియాతో కలిసాం” అన్నాడు.

“హాయిగా ఉన్నారుగా ఈ రక్తపాతం ఎందుకు?” అని అడిగిన ప్రశ్నకు సమాధానం విని ఆశ్చర్యపోయాను.

“మేమంతా శాంతిగా వున్నాం, మేము శాంతి కాముకులం, చూసారుగా ఇక్కడ ఎంత ప్రశాంతంగా ఉందో? న్యూస్ పేపర్లు, భారత ప్రభుత్వం మా మీద పెద్ద కుట్ర చేస్తూ, మాతో ఆడుకుంటున్నాయి” అన్నాడు.

“మరి ఇంత మంచి వారు మీరయినప్పుడు, అయిదు లక్షల పండిట్ కుటుంబాలు పిల్లా పాపలతో ఇల్లూ వాకిలి, ఆస్తి, అన్నీ వదులుకుని ఎందుకు వెళ్లిపోయారు?” అడిగాను.

“అదంతా ఉత్తిదే, అప్పటి ప్రభుత్వం వారిని భయపెట్టి వెళ్లిపొమ్మని చెప్పింది” అన్నాడు.

అక్కడున్న కాసేపు అలా మాట్లాడుకుని షాప్ బయటకొచ్చి, ఆ మాటలు విని చిరాకేస్తుంటే కాఫీ తాగాను. ఎయిర్‌పోర్ట్‌లో వాళ్ళిచ్చే మామూలు కాఫీకి అంత ధర ఎందుకుంటుందో నాకు అర్థం కానీ విషయం. ఎయిర్‌పోర్ట్‌కు బయలుదేరే ముందే, కడుపు నిండా తిని, వీలయితే రెండు కాఫీలు ఫుల్లుగా కొట్టేసి వెళ్ళటం మంచిదని అనిపించింది. ఆ రకంగా ఒక రకమైన చిన్న దోపిడీ నుండీ మనల్ని మనం కాపాడుకోవచ్చు.

మేమెక్కవల్సిన ఇండిగో ఫ్లైట్ సరిగ్గా సమయానికే రావడంతో సంతోషంగా ఫ్లైట్ ఎక్కి కూర్చున్నాం. అందమైన కాశ్మీర్‌ను వదలి వెళ్లడం కాస్త బాధేసినప్పటికీ స్వంత ఊరికి వెళ్తున్నామనే సంతోషం దానిని కొట్టేసింది.

ఇలా వేసవిలో రావడం కంటే, చలిని భరించడం కష్టమైనప్పటికీ మంచు కురిసే సమయంలో రావడమే ఇంకా ఆనందంగా ఉంటుందనిపించింది.

మళ్ళీ ఎప్పుడు వీలవుతుందో ఈ కాశ్మీర్‍ని చూడటానికి అనే భావం మాత్రం అందరి మనసుల్లో కదలాడిందని చెప్పగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here