కశ్మీర రాజతరంగిణి-52

3
6

[box type=’note’ fontsize=’16’] కశ్మీర్ ప్రాచీన చరిత్ర గురించి అవగాహన కలిగించి, భవిష్యత్తు గురించి ఆలోచనలు కలిగించాలన్న ప్రయత్నంలో భాగంగా నీలమతపురాణం తరువాత అందిస్తున్న జోనరాజు, శ్రీవరుడు, ప్రజ్ఞాభట్టులు కల్హణుడి అడుగుజాడల్లో నడుస్తూ సంస్కృతంలో రచించిన ‘కశ్మీర రాజతరంగిణి’ అనువాదాన్ని తెలుగు పాఠకులకు అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ. [/box]

గచ్ఛ భద్ర మూయైవ తపస్సాధీయతాం మనః।
సాపాయః క్షణభంగిన్సీ ఏవం ప్రాయా విభూతయః॥
(కల్హణ రాజతరంగిణి IV, 383)

[dropcap]3[/dropcap]5 ఏళ్ల ఏడు నెలల పదకొండు రోజుల పాలన లలితాదిత్యుడిది. అతని తరువాత కువలయాపీడుడు రాజయ్యాడు. కువలయాపీడుడు చక్కగా రాజ్యం చేశాడు. అయితే అతని సోదరుడు కూడా సమాన హోదాను, అధికారాలను అనుభవించటంతో స్వార్ధపరులు ఈ పరిస్థితిని చక్కగా వాడుకున్నారు. ఓ మంత్రి రాజుతో అనుచితంగా ప్రవర్తించాడు. ఇది రాజులో పలు ఆలోచనలు కలిగించింది.

తనతో అనుచితంగా ప్రవర్తించిన మంత్రిని అతని సమర్థకులను చంపి పారేయాలని అనుకున్నాడు రాజు ఆరంభంలో. కానీ ఆవేశం తగ్గిన తరువాత ఆలోచించాడు. ‘అతని మనస్సనే సముద్రంలో ఆలోచన అనే పర్వతంతో మథనం జరిగిన తరువాత క్రోధమనే కాలకూటవిషం ఉద్భవించింది. తరువాత అంతశ్శాంతి అనే అమృతం జనించింది’ అంటాడు కల్హణుడు. ‘ఈ శరీరం కోసం అనుచితమైన పనులు చేసి పాపం మూట కట్టుకుంటాం. కాని ఇక్కడ ఏది శాశ్వతం? ఎలాంటి వారయినా నశిస్తారు. ఎలాంటి జ్ఞాపకాలయినా మరపున పడతాయి. అలాంటి అశాశ్వతమైన దాని కోసం శాశ్వతమైన ధర్మాన్ని వదలకూడదు. జీవులు తాము సమయం చేత వండబడుతున్నామని, సమయం క్షణక్షణానికి మారుతుందని గ్రహించలేరు. అశాశ్వతాన్ని శాశ్వతమని భ్రమపడి ఆరాటపడే మనల్ని చూసి శాశ్వతుడు నవ్వుకుంటాడేమో! మన మూర్ఖత్వం అతనికి హాస్యాస్పదమేమో!’ ఇలా జీవితంలో అశాశ్వతం గురించి ఆలోచించిన రాజు తన రాజ్యాధికారాన్ని త్యజించి, అత్యంత శాంతి పొందుతాడు. రాజ్యం వదలి వెళ్తూ ఆయన సింహాసనం మీద పై శ్లోకం రాసిపెట్టి వెళ్తాడు.

‘మిత్రమా! అరణ్యానికి వెళ్లు. ప్రశాంతంగా తపస్సుపై ధ్యాస పెట్టు. క్షణభంగురమైన ఆనందాలు, సుఖాల ప్రలోభంలో పడకు.’

ఆత్మజ్ఞానం సాధించిన కువలయాపీడుడు ఈనాటికీ ‘శ్రీపర్వతం’ ప్రాంతంలోని నిత్య జీవనం గడికే వారికి కనిపిస్తాడని కల్హణుడు అంటాడు.

ఇదీ లలితాదిత్యుడి తరువాత ఒకటిన్నర సంవత్సర కాలం పాటు రాజ్యం చేసిన కువలయాపీడుడి అత్యద్భుతమైన జీవిత గాథ. ఒక రకంగా చెప్పాలంటే, లలితాదిత్యుడి అత్యద్భుతమైన పాలనకు, ఆ తరువాత వచ్చి దిగజారుడు పాలనకు నడుమ ‘సంధి’ లాంటి వాడు కువలయాపీడుడు. అతడి తరువాత బప్పీయక అన్న పేరుకల వజ్రాదిత్యుడు రాజ్యానికి వచ్చాడు. అతడిని లలితాదిత్యుడు అని కూడా అంటారు. ఈయన కువలయాపీడుడికి పూర్తి వ్యతిరేకం. ఈయనకు ఆడవాళ్ల పిచ్చి. పలు ఆడగుర్రల నడుమ ఉన్న మగ గుర్రం లాంటి వాడాయన అని వ్యాఖ్యానిస్తాడు కల్హణుడు.

విక్రయేణ ప్రయచ్ఛన్య మ్లేచ్ఛేభ్యః పురుషాన్చహున్।
మ్లేచ్ఛోచితామ్ వ్యవష్యతిమ్ ప్రావర్తయ మండలే॥
(కల్హణ రాజతరంగిణి IV, 397)

వజ్రాదిత్యుడు చేసిన దుశ్చేష్టలు కల్హణుడు వివరించలేదు. అతని వ్యభిచార లక్షణం చెప్పిన తరువాత ఈ శ్లోకం రాశాడు కల్హణుడు. వజ్రాదిత్యుడు అంతకు మందు మందిరాలకు ఇచ్చే దానాలను నిలిపివేశాడు. అంతే కాదు, పురుషులను మ్లేచ్ఛులకు అమ్మివేశాడు. ఇంతే కాక మ్లేచ్ఛుల పలు పద్దతులను కశ్మీరంలో ప్రవేశ పెట్టాడు అంటాడు కల్హణుడు. ‘పురుషులను మ్లేచ్ఛులకు అమ్మటం’ అన్నది ఆలోచించవలసిన విషయం. భారతీయులకు బానిస వ్యవస్థ పరిచయం లేదు. కానీ మ్లేచ్ఛులలో మనుషులను అమ్మటం, కొనటం వంటి పద్దతి ప్రాచీన కాలంలో ఉంది. కొందరు హరిశ్చంద్రుడి కథ చూపించి ఆ కాలంలోనే భారతదేశంలో మనుషులను అమ్మటం ఉందని వాదిస్తారు. కానీ హరిశ్చంద్రుడు అనేవాడు నిజంగా ఉన్నాడని ఒప్పుకోనివారు వాళ్ల వాదన కవసరమైనపుడు హరిశ్చంద్రుడి గాథను నిజమైన దానిగా భావిస్తారు. కాబట్టి వారి వాదనలను పక్కన పెట్టి చూస్తే, ఐతరేయ బ్రాహ్మణంలో, మహాభారతం, దేవీ భాగవతం, మార్కండేయ పురాణాలలో హరిశ్చంద్రుడి కథ కనిపిస్తుంది. రామాయణం హరిశ్చంద్రుడిని శ్రీరాముడి పూర్వీకుడు అంటుంది. హరిశ్చంద్ర గాథకు తోడుగా వేదంలో ఉన్న శనశ్శేపుడి కథనం చూపిస్తారు. కానీ, పురుషులను ఈ మ్లేచ్ఛులకు అమ్మటం మ్లేచ్ఛుల పద్ధతి అని కల్హణుడు అనటం ఈ అలవాటు భారతీయులకు ‘కొత్త’ అన్న ఆలోచనను చూపిస్తుంది. పైగా రాజు పురుషులను అమ్ముతున్నది మ్లేచ్ఛులకు అంటే, పురుషులను కొనేది మ్లేచ్ఛులే తప్ప భారతీయులు కాదు అన్న ఆలోచన వస్తుంది. ఏది ఏమైనా భారతీయ సమాజంలో మ్లేచ్ఛ పద్దతులు ప్రవేశించటం ప్రారంభమయింది అన్నది మాత్రం స్పష్టం.

భారతీయ సమాజం గురించి, సామాజిక పరిణామ క్రమం గురించి అధ్యయనం చేసేవారు, వ్యాఖ్యలు చేసేవారు ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. పాశ్చాత్యులు చేసిన తీర్మానాలను గుడ్డిగా నమ్మక మన శాస్త్రాలను, మన గ్రంథాలను మన దృష్టితో చూసి వ్యాఖ్యానించుకోవాల్సి ఉంటుంది.

ఏడేళ్లు రాజ్యం చేసిన తరువాత అధిక లైంగికత వల్ల వచ్చిన వ్యాధితో రాజు మరణించాడు. ఆ తరువాత ‘ప్రజాంతకుడు’ అయిన పృధివ్యాపీడుడు రాజై నాలుగేళ్ల ఒక నెల రాజ్యం చేశాడు. అతడిని బలవంతాన సింహాసనం దింపి అధికారాన్ని చేజిక్కించుకున్న సంగ్రామపీడుడు కేవలం ఏడు రోజులు రాజ్యం చేశాడు. అతని తరువాత జయాపీడుడు రాజ్యానికి వచ్చాడు. జయాపీడుడికి లలితాదిత్యుడు ఆదర్శం. లలితాదిత్యుడి లాగే రాజ్యనికి రాగానే జైత్రయాత్రకు బయలుదేరాడు. ఆయన యుద్ధానికి వెళ్లగానే అతని భార్య  సోదరుడు ‘జజ్జ’ రాజ్యాధికారాన్ని హస్తగతం చేసుకున్నాడు.

ఇది తెలుసుకున్న జయాపీడుడు తన వెంట ఉన్న వారందరినీ వారి వారి రాజ్యాలకు పంపివేశాడు. తాను ఇతర రాజుల రాజ్యాలలో ప్రవేశించాడు. అలా తిరుగుతూ జయంత రాజు పాలనలో ఉన్న నగరంలో ప్రవేశించాడు. కార్తికేయ మందిరంలో నృత్య ప్రదర్శన చూసేందుకు వెళ్లాడు. అతడిని చూసిన నర్తకి కమల ‘ఈయన సాధారణ పురుషుడు కాద’ని అనుకుంది. మారువేషంలో రాజ్యాలు తిరుగుతున్న రాకుమారుడు అనుకుంది. అతడిని  తన మందిరానికి ఆహ్వానించింది. కాని జయాపీడుడు ఆమెను తాకలేదు. తన లక్ష్యసాధనలో రాత్రింబవళ్లు గడిపిన వాడిని ఏ స్త్రీ కూడా ఆకర్షించలేదని ఆమెని తిరస్కరించాడు. ప్రజలను భయభ్రాంతులను చేస్తున్న సింహాన్ని జయాపీడుడు సంహరిస్తాడు. అప్పుడు అతడెవరో అందరికీ తెలుస్తుంది. రాజు జయంతుడు అతడికి తన కూతురినిచ్చి వివాహం చేస్తాడు. సైన్యాన్నిస్తాడు. ఆ సైన్యంతో జయాపీడుడు దారిలో ఉన్న రాజ్యాలు గెలుస్తూ కాశ్మీరం చేరతాడు. జజ్జతో తలపడతాడు.

జజ్జ పాలన వల్ల కష్టపడుతున్న వారందరూ అతడిని వ్యతిరేకిస్తారు. ‘శ్రీదేవ’ అనే చండాల గ్రామానికి చెందిన అతను జజ్జను చంపుతాడు. జయాపీడుడు మళ్లీ  కశ్మీరాన్ని తన  హస్తగతం చేసుకుంటాడు. రాజ్యధికారానికి వచ్చిన జయాపీడుడు చక్కగా పాలిస్తాడు. ప్రజల బాగోగులు చూస్తాడు. ఇతర దేశాల మంచి పండితులను కశ్మీరం రప్పించి విద్యాబోధన చేయిస్తాడు. జయపీడుడు సైతం విజ్ఞానార్జన చేస్తాడు. జయాపీడుడు ‘క్షీరుడు’ అనే అతని వద్ద వ్యాకరణం నేర్చుకుంటాడు. ఈయన పూర్తి పేరు క్షీరస్వామి. ఈయన వ్యాకరణ గ్రంథాలు రాశాడు. అమరకోశంపై వ్యాఖ్యానం రాశాడు. జయాపీడుడు వివిధ ప్రదేశాల నుంచి పండితులను ఏ స్థాయిలో కశ్మీరం రప్పించాడంటే ఇతర ప్రాంతాలలో విద్వత్తు అన్నది కొరవడిందట. బహుశా, ఇతర ప్రాంతాలలో తురుష్కుల ప్రాబల్యం పెరుగుతూండటంతో భారతదేశం నలుమూలల నుంచి ప్రాణాలు అరచేత పట్టుకుని పండితులు కశ్మీరం వచ్చి చేరి ఉంటారు. ఎందుకంటే, ఆ కాలంలో ప్రశాంతంగా ఉన్నది అటు దక్షిణ భారతదేశం, ఇటు కశ్మీరం మాత్రమే!

ఇక్కడ కల్హణుడు జయాపీడుడి ఆస్థానంలోని పండితుల పేర్లు, వారికి నియమించిన అధికార కార్యాలను వివరిస్తాడు. ఈ పండితులంతా నిజంగా ఉన్నట్టు నిర్ధారణ అయింది. కొందరి రచనల వివరాలు లభ్యమయ్యాయి కూడా. మంత్రి శుక్రదంతుడు, ఉద్భటుడు(అలంకారశాస్త్రి) దామోదర గుప్త(కుట్టినీమత), మనోరధ, శంఖదంత, చాతక, సంధిమత వంటి కవులు, పండితులు ఆయన రాజ్యంలో ఉండేవారు. జయాపీడుడు కూడ  మూడు గొప్ప బౌద్ధ విగ్రహాలు ప్రతిష్ఠించాడు. విహారం కట్టించాడు.

రాజ్యంలో ఇలా పలు కట్టడాలు కట్టించి, పవిత్ర స్థలాలు నిర్మించిన రాజ్యాన్ని సుస్థిరం చేసిన తరువాత జయాపీడుడు మళ్లీ పెద్ద సైన్యాన్ని సమీకరించి యుద్ధానికి బయలుదేరాడు. తూర్పు తీరం చేరుకున్నాడు. ఇక్కడికి వచ్చిన జయాపీడుడికి ఆత్మవిశ్వాసం అధికమయింది. మారు వేషంలో తూర్పు తీరంలోని భీమసేనుడి రాజ్యంలో అడుగుపెట్టాడు. అతడిని కశ్మీర రాజుగా గుర్తించిన భీమసేనుడు అతడిని బంధించాడు. అయితే జయాపీడుడు భయపడలేదు. ఆ కాలంలో భీమసేనుడి రాజ్యంలో అంటువ్యాధి వ్యాపించింది. ఆ వ్యాధి సోకిన వారికి మరణం తప్పదు. జయాపీడుడు, ఆ వ్యాధి లక్షణాలు కలిగించే వస్తువులు సేవించాడు. జయాపీడుడికి మరణం తప్పదని రాజు అతడిని రాజ్యం పొలిమేరల కావల పారవేయించాడు. అటు నుంచి నేపాల రాజ్యం చేరాడు. నేపాల రాజు అరముడి  జయాపీడుడితో పోరాడలేదు. రాజ్యం వదలి వెళ్లాడు. ఈ రకంగా జయాపీడుడు కశ్మీర రాజ్యాన్ని విస్తరింపచేశాడు. లలితాదిత్యుడి స్థాయిలో కాకపోయినా తన పరిధిలో లలితాదిత్యుడిని అనుసరించాడు.  తన పేరును వినయాదిత్యుడిగా ప్రకటించుకున్నాడు. వినయాదిత్యుడి పేరున ఆయన ముద్రించిన నాణేలు ఆయన ప్రయాణించిన మార్గమంతా లభ్యమయ్యాయి. ఇప్పటికీ నేపాల ప్రజలు జయాపీడుడిని గుర్తుంచుకున్నారు. అతడి గురించి పలు గాథలు నేపాల్‌లో ప్రచారంలో ఉన్నాయి.

ఇలా జైత్రయాత్ర చేస్తున్న జయాపీడుడు తూర్పు సముద్రంతో కలిసే ఓ నది ఒడ్డున విశ్రమించాడు. ఇంతలో అతనికి నదికి మరో వైపు నేపాల రాజు ‘అరముడి’ పెద్ద సైన్యంతో కనిపించాడు. ముందు వెనుక చూడకుండా జయాపీడుడు నదిలో దిగి, అరముడితో యుద్ధానికి బయాలుదేరాడు. ఇంతలో నది దిశ మారింది. సముద్రం నీరు నదిలోకి ప్రవేశించింది. దాంతో, జయాపీడుడితో సహా అతని సైన్యం కొట్టుకుపోసాగింది. అరముడి సైన్యం వారిపై దాడి చేసి వారిని సంహరించటం ఆరంభించింది. నీటిలో మునిగి కొన ఊపిరితో ఉన్న జయాపీడుడిని అరుముడి సైనికులు బంధించారు. ఇక్కడ కల్హణుడు గమ్మత్తుగా వ్యాఖ్యానిస్తాడు. విధి, మేఘం రెండూ ఎవరికి అదృష్టంలో ఏమి ఇస్తాయో ఎవరూ ఊహించలేరు. విధి అందమైన భవిష్యత్తు చూపించి క్షణంలో నరకంలోకి నెడుతుంది. మేఘం ఎండ వేడినుంచి వర్షించి మురిపించేట్టు చేసి మెరుపుతో పచ్చటి చెట్టును భస్మం చేస్తుంది అంటాడు కల్హణుడు. జయాపీడుడిని ‘కలగండిక’ అనే పెద్ద భవంతిలో బంధిస్తాడు అరముడి. తప్పించుకునే అవకాశంలేని ఆ జైలులో జయాపీడుడు మనసు కరిగే శ్లోకాలు రచించాడు.

ఇక్కడి నుంచి జయాపీడుడు తప్పించుకోవటం ఒక అద్భుతమైన కథ. కశ్మీర రాజ్యంలోని ధనమంతా అరముడికి అప్పగిస్తానని జయాపీడుడు రాజును నమ్మిస్తాడు. ఆ ధనం తీసుకుని, కశ్మీర సైన్యం నదికి మరో వైపు ఉంటుంది.మంత్రి దేవశర్మ ధనం అప్పగించేముందు రాజునుచూడాలంటాడు. రాజును చూసే నెపంతో కాపలావాళ్ళను తప్పిస్తాడు. జైలు కిటికీ నుంచి నదిలోకి దూకి సైన్యాన్ని చేరుకోమంటాడు. రాజు బలహీనుడిగా ఉండటంతో అది సాధ్యం కాదంటాడు. అయితే కాస్సేపు అయిన తరువాత రాజును ఆ గదిలోకి రమ్మంటాడు . కాస్సేపటికి జయాపీడుడు ఆ గదిలోకి వచ్చేసరికి దేవశర్మ  ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయి ఉంటాడు. తన తలపాగాతో శవాన్ని ఒంటిని చుట్టుకుని నదిలో దూకమని సూచనలు రాసిపెడతాడు. రాజు అలాగే చేసి, ఆ శవాన్ని నావ లాగా చేసుకుని నది దాటి తన సైన్యాన్ని చేరతాడు. నేపాళంపై దాడి చేస్తాడు. ఆయన తప్పించుకొన్నట్టు కాపలా వాళ్లకు తెలిసేలోగా, నేపాళాన్ని జయాపీడుడు నాశనం చేశాడని వ్యాఖ్యానిస్తాడు కల్హణుడు.   జైలులో జయాపీడుడికీ, దేవశర్మకు నడుమ జరిగిన సంభాషణలు ఉత్తమంగా ఉంటాయి. ఇద్దరి వ్యక్తిత్వాలలోని ఔన్నత్యాన్ని ప్రస్ఫుటం చేస్తాయి. జయాపీడుడు ధర్మాధికరణ అంటే న్యాయస్థానాన్ని ఏర్పాటు చేశాడు.

జయాపీడుడు కశ్మీరం తిరిగి వచ్చిన తరువాత కల్హణుడు ఒక అద్భుతమైన కథ చెప్తాడు. ఈ కథ ప్రస్తుతం అభూత కల్పనలా తోస్తుంది. కానీ దీనిలో అర్థాలను విశ్లేషించాల్సి ఉంటుంది. తనను ఓ ద్రవిడ మాంత్రికుడు సతాయిస్తున్నడని, అతడి నుంచి తనను, తన రాజ్యాన్ని రక్షిస్తే తామ్ర పర్వతాన్ని చూపిస్తానని రాజుకు కలలో కన్పించి మహాపద్మడునే నాగరాజు చెప్తాడు. జయాపీడుడి అతడిని రక్షిస్తాడు. అప్పుడుతడు తామ్ర పర్వతానికి త్రోవ చూపిస్తాడు. ఆ తామ్ర పర్వతం నుంచి తామ్రాన్ని తవ్వి కోటి నాణేలు ముద్రిస్తాడు జయాపీడుడు. ఎవరైనా తనకన్నా ఎక్కువ నాణేలు ముద్రిస్తే, వారు తనని జయించినట్టు అని ప్రకటిస్తాడు కూడా. ఈ గాథలో మహాపద్ముడికి, జయాపీడుడికి నడుమ సంభాషణలు గొప్పగా ఉంటాయి. అయితే ఇక్కడి నుంచి అనూహ్యమైన రీతిలో జయాపీడుడి ప్రవర్తన మారిపోతుంది. చలికాలం తరువాత ఎండాకాలం వచ్చినట్టు అంత వరకూ జయాపీడుడి పాలనలో సౌఖ్యం అనుభవించిన ప్రజలు ఎండలకు మాడినట్టు కష్టాల పాలయ్యారు. కొందరు దుష్టుల మాటలు వల్ల జయాపీడుడు తప్పుదారి పట్టాడు. “ఐశ్వర్యసాధన కోసం ఇతర రాజులపై దాడి చేయటం ఎందుకు, కశ్మీరంలో ప్రజల నంచీ ధనం దోచుకోవచ్చు కదూ” అన్న ఆలోచనను దుష్టులు రాజుకి ఇచ్చారు. దాంతో రాజు ప్రజలను పీడించి దోచుకోవటం ఆరంభించాడు.

కశ్మీరికాణాముత్పన్నం నిజాజ్ధువ్యవధాయకం।
కాయస్థ వక్ర్త ప్రేక్షిత్వం తతః ప్రభృతి భూభృతామ్॥
(కల్హణ రాజతరంగిణి IV, 623)

ఇప్పటి నుంచీ కశ్మీరంలో రాజ్యపాలన స్వరూపం మారిపోయింది. సేవకులు రాజుల ఆజ్ఞలను పాటించటం పోయి, రాజులు సేవకుల మాటలు వినటం ఆరంభమయింది. తమ ఆజ్ఞలను జారీ చేయటం కాక రాజులు సేవకుల ముఖాల వైపు ఆజ్ఞల కోసం అభిప్రాయాల కోసం చూస్తుండే దుర్దినాలు కశ్మీరుకు దాపురించాయి.

ఇక్కడి నుంచి కశ్మీరు చరిత్ర రూపు రేఖలు మారుతాయి. దిశ, దశలు మారుతాయి.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here