కశ్మీర రాజతరంగిణి-55

1
9

[box type=’note’ fontsize=’16’] కశ్మీర్ ప్రాచీన చరిత్ర గురించి అవగాహన కలిగించి, భవిష్యత్తు గురించి ఆలోచనలు కలిగించాలన్న ప్రయత్నంలో భాగంగా నీలమతపురాణం తరువాత అందిస్తున్న జోనరాజు, శ్రీవరుడు, ప్రజ్ఞాభట్టులు కల్హణుడి అడుగుజాడల్లో నడుస్తూ సంస్కృతంలో రచించిన ‘కశ్మీర రాజతరంగిణి’ అనువాదాన్ని తెలుగు పాఠకులకు అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ. [/box]

తేనాన్తే భగవద్గీతాః శృణవాన భావితాత్మనా।
ధ్యాయతా వైష్ణవం ధామ నిరముచ్చత్ జీవితమ్॥
(కల్హణ రాజతరంగిణి V, 125)

[dropcap]అ[/dropcap]వంతివర్మ సుయ్యుడికి సంపూర్ణమైన స్వేచ్ఛనివ్వటంతో సుయ్యుడు కశ్మీరమంతా తిరిగాడు. ప్రతి ప్రాంతంలో నేల లక్షణాలను పరిశీలించాడు. ఆ నేల ఎండటానికి ఎంత సమయం పడుతోందో పరిశీలించాడు. దాన్ని బట్టి ఏ కాలంలో ఎలాంటి పంట వేయాలో, దానికి నీరు ఎప్పుడు ఎంత అవసరం అవుతుందో నిర్ణయించాడు. ఏ గ్రామానికి ఎంత నీరు అవసరమవుతుందో గణించి, నదుల నుండి ఏర్పడిన ఖాళీ స్థలాలలో గ్రామాలు నిర్మించాడు. ఈ రకంగా కశ్మీరం ఎటు చూస్తే అటు పచ్చదనంతో అందంగా అలరారేట్టు చేశాడు. వ్యవసాయం  లాభసాటిగా మార్చాడు. వర్షంపై ఆధారపడ్డ వ్యవసాయాన్ని, వర్షంతో సంబంధం లేనిదిగా మార్చాడు. పంటలు పండటంతో నిత్యావసర వస్తువులు ధరలు తగ్గాయి. ప్రతి ఇంట్లో ధాన్యం పరవళ్లు తొక్కింది.

సుయ్యుడు తన దృష్టిని పశు పక్ష్యాదుల వైపు మళ్లించాడు. పక్షులు అధికంగా కల ప్రాoతాలలో ఇప్పటి సంరక్షణ స్థలాలను పోలే sanctuaries నిర్మించాడు. ఆ ప్రాంతంలో జంతువులు స్వేచ్ఛగా తిరిగేవి. చేపలు కూడా భయం లేకుండా ఉండేవి. పక్షులు భయం లేకుండా ఉండేవి. వలస వచ్చే పక్షులు ఎంతో ధైర్యంగా కశ్మీరు వచ్చి చేరేవి. అవి అయిష్టంగా కశ్మీరు వదలి వెళ్లేవి.

సుయ్యుడి కార్యకలాపాల వల్ల కొత్తగా లభించిన భూములలో పట్టణాలు నిర్మించారు. మందిరాలు నిర్మించారు. ఈ రకంగా అవంతివర్మ పాలన కాలంలో ప్రజలు సుఖపడటంలో సుయ్యుడు ప్రధాన పాత్ర పోషించాడు. అధునిక ఇంజనీయర్లను తలపుకు తెచ్చే రీతిలో, ఆ కాలంలోనే ఎంతో సేవ చేశాడు సుయ్యుడు. ముఖ్యంగా సాంక్చువరీలు ఏర్పాటు చేయటంలో సుయ్యుడు ప్రదర్శించిన దూరదృష్టి అత్యంత ప్రశంసనీయం.

అయితే ఈ ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదు. అవంతివర్మకు చికిత్సలేని వ్యాధి వచ్చింది. దాంతో అవసానకాలం దగ్గర పడిందని గ్రహించిన అవంతివర్మ  జ్యేష్ఠేశ్వర అలయానికి వెళ్లాడు. ఆలయంలోనే నివసిస్తూ భగవద్గీత వింటు సంతృప్తితో, సంతోషంగా మరణాన్ని స్వీకరించాడు.

ఇలా ఒక మహాద్భుతమైన రాజు చరిత్ర సమాప్తమయింది. ఇది దీపం అరిపోయే ముందు ఒక్కసారి ‘గుప్పు’మని అధిక వెలుతురు నిచ్చి తరువాత చీకటిలో ముంచెత్తేదే అని అవంతివర్మ మరణం తరువాత సంభవించిన పరిణామాలు నిరూపిస్తాయి.

అవంతివర్మ మరణంతో అంతవరకూ అణగి ఉన్న ఉత్పలుడి వంశం వారంతా తెరపైకి వచ్చారు. వీరిలో రత్నవర్ధనుడు కష్టపడి అనంతవర్మ కొడుకు శంకరవర్మను రాజుగా సింహాసనంపై నిలిపాడు. కర్లప్ప అనేవాడు అసూయతో, శూరవర్మ కుమారుడు సఖవర్మను యువరాజుగా ప్రకటించే వరకూ నిద్రపోలేదు. శక్తిమంతుడయిన ప్రతి ఒక్కడికి ధనం, పదవులు ఆశలు చూపి తమవైపుకు లాగుకోవాలని ప్రయత్నించారు. కానీ అవంతివర్మకు విధేయులుగా ఉన్న వారెవరూ తాత్కాలిక లాభాల ప్రలోభంలో పడలేదు. చివరికి అతికష్టం మీద యువరాజు సుఖవర్మపై ఆధిక్యం సాధించిన తరువాత శంకరవర్మ ఇతర రాజ్యాలను గెలుచుకునే నెపంతో జైత్రయాత్ర ఆరంభించాడు. దార్వాభిసార, పరిగణ వంటి రాజ్యాలను గెలుచుకున్నాడు. (దార్వాభిసారం అన్నది గుజరాత్‌కు ఉత్తరాన ఉన్న ప్రాంతంగా భావిస్తున్నారు). కశ్మీరులో జన సంఖ్య తక్కువే అయినా శంకరవర్మ సైన్యంలో తొమ్మిది లక్షల  పదాతిదళం, మూడు వందల ఏనుగులు, లక్ష అశ్వదళం ఉండేవి. గూర్జరదేశం గెలిచే ఉద్దేశంతో ముందు ‘త్రిగర్త’పై దాడి చేశాడు శంకరవర్మ. ‘త్రిగర్త’ అంటే ‘కాంగ్రా’. గూర్జరరాజు ‘అలఖునుడి’ని ఓడించాడు. అతడు తన రాజ్యాన్ని కాపాడుకొనేందుకు ‘టక్కదేశా’న్ని శంకరవర్మకు అప్పగించాడు. శరీరాన్ని కాపాడుకునేందుకు చిటికెన వేలును త్యాగం చేశాడు అలఖునుడు. ‘అలఖును’ అన్నది మహమ్మదీయ నామం. అంటే శంకరవర్మకు అలఖునుడు దాసోహం అన్నాడన్నమాట. అలఖునుడికి ఉధ్బండ పురంలో ‘లల్లియషాహి’ ఆశ్రయం ఇచ్చాడు. అంటే ఒక తురష్క రాజుకు ఒక భారతీయ రాజు, మరో భారతీయ రాజు నుండి రక్షణ నిచ్చాడన్నమాట!

ఇలా తలపెట్టిన రాజ్యాలన్నిటినీ జయించిన శంకరవర్మ కశ్మీరం తిరిగివచ్చాడు. ఉత్తర రాజ్యాలకు చెందిన స్వామిరాజు తనయ సుగంధ శంకరవర్మ రాణి. ఆమె అంటే శంకరవర్మకు అత్యంత ప్రీతి. రాణితో కలసి ఆయన శంకరగౌరీశ, సుగంధీశ అన్న నగరాలను నిర్మించాడు. ఇక్కడ కల్హణుడు ఒక గమ్మత్తయిన శ్లోకం రాశాడు.

పరకావ్యేన కవయః పరద్రవ్యేణచేశ్వరాః।
నిర్లోటితేన సృకృతం పుష్లాంత్యద్వతనే క్షణే॥
(కల్హణ రాజతరంగిణి, V.160)

కవులు, రాజులు పూర్వీకుల సంపదలను కొల్లగొట్టటం వల్ల తాము వర్తమానంలో ఉన్నతులు అవుతారు. కవులు పూర్వీకుల సాహిత్యాన్ని కొల్లగొట్టి పేరు సంపాదిస్తారట. రాజులు పూర్వీకులు అందించిన సంపదను కొల్లగొడతారట. ఈ సూత్రాన్ని అనుసరించి శంకరవర్మ తాను నిర్మించిన నగరాలు అత్యుత్తమంగా ఉండాలన్న పట్టుదలతో పరిహసపుర పట్టణాన్ని కొల్లగొట్టి, ఆ ధనంతో తాను నిర్మించిన పట్టణాన్ని అభివృద్ధి చేశాడు . ఏనుగు ఎలాగయితే నీటిలో శుభ్రంగా స్నానం చేసిన తరువాత శరీరం పైన మట్టి పోసుకుని శరీరాన్ని మలినం చేసుకుంటుందో అలాగ, రాజులు కూడా మంచి ఖ్యాతినార్జించిన తరువాత, తమ దుశ్చర్యలవల్ల, లోభత్వం వల్ల తమ ఖ్యాతిని నాశనం చేసుకుని చెడ్డ పేరు సంపాదిస్తారు అంటాడు కల్హణుడు.

శంకరవర్మకు ధనం పిచ్చి పట్టకుని ప్రజలను పీడించి డబ్బులాగటం ఆరంభించాడు. ఆయనకు అలవాటయిన దుర్యసనాల వల్ల డబ్బు కరిగిపోవటం వల్ల దైవానికి చెందిన ఐశ్వర్యాన్ని కూడా కొల్లగొట్టటం ఆరంభించాడు. ఇది జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. శంకరవర్మ దైవానికి చెందిన ఐశ్వర్యాన్ని కొల్లగొట్టాడు తప్ప మందిరాలను ధ్వంసం చేయలేదు. అనేకులు, ఈ శ్లోకాన్ని చూపి భారతీయ రాజులు కూడా దేవాలయాలను వాటి ధనం కోసం ధ్వంసం చేశారని వాదిస్తారు. కానీ శంకరవర్మ దేవాలయాలపై చేయి వేయలేదు. ఆయన దేవాలయాల ఐశ్వర్యంపై కన్ను వేశాడు. దేవాలయాలకు బోలెడన్ని దానాలు వస్తాయి. భూమి రూపంలో ఆభరణాల రూపంలో అదంతా దేవాలయ ధనం. శంకరవర్మ ఇప్పటి కొన్ని రాష్ట్ర ప్రభుత్వాల లాగా ఆ ఐశ్వర్యం కొల్లగొట్టాడు , తప్ప ,  దేవాలయాలను ధ్వంసం చేయలేదు. అయితే ప్రతి చర్యకు ఫలితం ఉన్నట్టే తన దుశ్చర్యల దుష్పలితాన్ని శంకరవర్మ అనుభవించాడు.

శంకరవర్మ తన రాజ్యంలో ధన సంపాదనకు అత్తపతిభాగ, గృహకృత్య అనే రెండు విభాగాలను ఏర్పాటు చేశాడు. వీళ్లు నగరాలను, గ్రామాలను, గృహాలను దోచి రాజుకు ధనాన్ని చేరవేసేవారు. తరువాత తరాల వారు తన రాతలను తప్పుగా అర్థం చేసుకోకుండా కల్హణుడు రాజు మందిరాల ఐశ్వర్యాన్ని ఎలా దోచుకున్నాడో వివరించాడు. మందిరాలలో అగరవత్తులు, గంధం, నూనెతో సహా ఇతరాలు అమ్ముతారు. ఆ అమ్మకాలలో తన వంతు అన్న నెపంతో ఆ ధనాన్నంతా రాజు కాజేసేవాడు. దాదాపుగా 64 మందిరాల పర్యవేక్షణ అన్న పేరిట తన అధికారులను నియమించి, ఆ దేవాలయాల ధనాన్ని దోచుకున్నాడు. మందిరాలకు దానాలుగా ఇచ్చే గ్రామాలలో ధనాన్ని దోచుకున్నాడు. ఆయన ఎక్కడికి వెళ్లినా ప్రజలు తమ వద్ద ఉన్న ధనం, పండించిన ధాన్యం రాజుకు అప్పగించాలి. అలా చేయని వారిని రాజు శిక్షించేవాడు. ఆయన విధించిన పన్నుల వల్ల గ్రామాలు పేదరికంలోకి దిగజారాయి. తన రాజ్యంలో పండితులను, విజ్ఞానవంతులను గౌరవించటం మానేసాడు రాజు.

ఈ సమయంలో ప్రజలు యువరాజు గోపాలవర్మ నీడలో సేద తీరారు. ఆయన ప్రజల బాధలను అర్థం చేసుకుని, వారికి ఉపశమనాన్నిచ్చేవాడు. ప్రజలు పడుతున్న బాధలకు తన తండ్రి కారణం అని గ్రహించాడు. రాజుకు బుద్ధి చెప్పాడు. చక్కటి వేదాంత భావనలతో రాజును హెచ్చరించాడు. రాజు దుశ్చర్యల ఫలితం అతని సంతానం అనుభవిస్తారని హెచ్చరించాడు. గోపాలవర్మ హెచ్చరిక రాజు తన కళ్లు తెరపించింది అంటాడు. ఎలాగయితే జన్మించిన శిశువు తల్లి గర్భంలో తాననుభవించిన వేదనను మరచిపోతాడో అలా తాను సామాన్యుడిగా ఉన్పప్పటి కష్టాలను మరచిపోయి ప్రజలను హింసించానని బాధపడతాడు. అయితే ఇదంతా నటన, వ్యంగ్యం. వ్యంగ్యంతో గోపాలవర్మ సిగ్గుపడేట్టు చేస్తాడు. చివరలో నీకు అధికారం వచ్చినప్పుడు నువ్వు బాగా పాలించు. ప్రజలను బాగా చూసుకో అంటాడు. తన దౌష్ట్యాన్ని పెంచుతాడు. రాజు దౌష్య్టం వల్ల ‘భల్లటుడు’ లాంటి కవులు, పండితులు దుర్భరమైన దారిద్రంలో బ్రతకాల్సి వచ్చిందనీ, క్రూరులు, దుష్టులు ఐశ్వర్యాన్ని, సౌఖ్యాలను అనుభవించారని కల్హణుడు వ్యాఖ్యనిస్తాడు. తనను కష్టపెట్టిన రాజును ప్రజలు శపించారు. వారి శాపాల ఫలమన్నట్టు రాజుకు పుట్టిన సంతానం ఎలాంటి రోగాలు లేకుండా నశించారు.

వంశః శ్రీర్జీవితం దారు నామాపి పృధివీభుజామ్।
క్షణాదేవ క్షయం యాతి ప్రజావిప్రియ వారిణామ్॥
(కల్హణ రాజతరంగిణి, V. 211)

ప్రజలను బాధ పెట్టే రాజుల దుశ్చర్యల వల్ల వారి వంశం, జీవితం, భార్య, అదృష్టం అన్నీ క్షణంలో నాశనమైపోతాయి.

సత్యం ఇది. ఒక వ్యక్తి ఎన్ని దుశ్చర్యలతో అందరినీ బాధపెట్టి తాను సుఖం అనుభవిస్తాడు. కానీ అతడి కుటుంబ సభ్యులను తరతరాలుగా ఏవేవో దురదృష్టాలు పట్టి పీడిస్తాయి. అకాల మరణాలు సంభవిస్తాయి. ఇది ఒకసారి కళ్లు తెరచి మన చుట్టు జరుగుతున్న సంఘటనలను గమనిస్తే చాలు,  కర్మ సిద్ధాంతం ఎంత గొప్పదో, ఎంత సత్యామో సృష్టమవుతుంది. ఆ వంశం భవిష్యత్తు సర్వనాశనం అవుతుంది. పాలకులు ఇది అర్థం చేసుకుని, తమ భవిష్యత్తు తరాల వారి కోసమైనా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ప్రజల సంక్షేమం కోసం పాటుపడాలి. ఇది పాలకులకు మాత్రమే కాదు,  ప్రతి ఒక్క వ్యక్తికీ వర్తిస్తుంది. తన ప్రతి చర్య ప్రభావం తన తరువాత తరాలపై ఉంటుందన్న గ్రహింపుతో వర్తమానంలో వ్యవహరించాల్సి ఉంటుంది. ఒక నిత్య జీవిత సత్యాన్ని గతం ఆధారంగా భవిష్యత్తు తరాలకు ప్రకటిస్తున్నాడు కల్హణుడు. తత్త్వశాస్త్రం సిద్ధాంతంగా చేప్తే  అర్థం కాని వారికి, పురాణ గాథలుగా చెప్తే కూడా అవగాహన కాని వారికి, చరిత్రలోంచి దృష్టాంతాలు చూపిస్తూ ఇలా ఇలా జరిగిందని చేప్తే తప్పని సరిగా అర్థమవుతుంది. భారతీయుల దృష్టిలో చరిత్ర గత వైభవం గురించి పోరాటమో, గతంలోని పొరపాట్ల గురించి వర్తమానంలో ద్వేషాలు పెంచుకోవటమో, అసలు చరిత్ర దాచి తప్పుడు చరిత్ర ప్రచారం ద్వారా జాతిని దెబ్బతీయటమో కాదు. గతం నుంచి పాఠాలు నేర్చుకోవటం, వర్తమానాన్ని తీర్చిదిద్దటం. మానవ జీవిత పరిమాణం  విశ్వంతో పోలిస్తే బహు స్వల్పం. విశ్వంలో నిక్షిప్తమై ఉన్న జీవిత సూత్రాలను గమనించేందుకు అవకాశం బహుస్వల్పం. కాబట్టి కొన్ని వేల సంవత్సరాలుగా మానవ జీవిత పరిణామ క్రమాన్ని అధ్యయనం చేయటం ద్వారా మానవ జీవితాలను నిర్దేశించే సూత్రాలను, సత్యాలను అర్థం చేసుకోవటం ద్వారా తమ జీవితాన్ని సార్థకం చేసుకోవటం మాత్రమే కాక సూత్రాలను, సత్యాలను భవిష్యత్తు తరాలకు అందిచటం ద్వారా వారికీ తమ జీవితాలను సార్థకం చేసుకునే వీలు కల్పించటం చరిత్ర ప్రాధాన్యం. భారతీయ చరిత్ర రచన ప్రాధాన్యం, లక్ష్యం, లక్షణం ఇదే.

ఎన్నెన్నో దుశ్చర్యలు చేస్తూ, ప్రజలను బాధపెట్టి ధనాన్ని ఆర్జించాడు శంకరవర్మ. అతను కట్టిన భవంతులు అతని కళ్లముందే కూలిపోయాయి. ఆయన గొప్పగా   దేవాలయాల ధనం కొల్లగొట్టి నిర్మించిన మహా పట్టణం శిధిలాలు ఉన్నాయి ఇప్పుడు – అంటాడు కల్హణుడు. మానవ స్మృతిలోంచి శంకరవర్మ పేరు తొలగిపోయినట్టు అతని పట్టణం పేరు కూడా తొలగిపోయింది. తన సోదరి సంతానం సుఖరాజు మరణానికి పొరుగుదేశం లోని వారు కారణమయ్యారన్న కారణంతో కోపంతో రాజు శంకరవర్మ మళ్లీ దండయాత్రలు ప్రారంభించాడు. ‘ఇండస్’ నదీ ప్రాంతంలోని రాజ్యాలన్ని గెలుచుకుని కశ్మీరు తిరిగి వస్తూండగా రాజు సైన్యానికి, స్థానికులకూ నడుమ వివాదం చెలరేగింది, యుద్ధం జరిగింది. ఓ బాణం హఠాత్తుగా రాజు మెడకు గుచ్చుకుంది. ఇన్నాళ్లూ తాను చేసిన దుష్కర్మల ఫలితం అనుభవించే సమయం ఆసన్నమయింది.

బాణఘాతంతో రాజు చూపు పోయింది. రాణి అతడిని గుర్తుపట్టలేకపోయింది. అతడి బలహీన కంఠస్వరం ద్వారా అతడిని గుర్తుపట్టి భోరుమంది రాణి. గోపాలవర్మ అప్పటికి ఇంకా చిన్న పిల్లవాడు. రాజ్యం చేసే వయస్సు లేదు (అంత చిన్న వయస్సులోనే రాజుకు బుద్ధి చెప్పేంత పరిణతి సాధించాడన్న మాట గోపాలవర్మ!). గోపాలవర్మను కాపాడతానన్న వాగ్దానం రాణి సుగంధా దేవి నుంచి తీసుకుని తుది శ్వాస విడిచాడు శంకరవర్మ. శ్వాస విడిచే కన్నా ముందు నరకయాతనలు పడ్డాడు. అయితే, రాజు మరణించినట్టు తెలిస్తే శత్రువులు రాజ్యంపై దాడి చేస్తారన్న భయంతో, రాజును పల్లకీలో కూర్చోబెట్టి, దారాలు లాగటం ద్వారా సామంతుల నమస్కారాలు స్మీకరిస్తునట్టు తల, చేతులు కదుపుతూ వారు శంకరవర్మ మరణించిన విషయం దాచి, అతడు బ్రతికి ఉన్న భ్రమ కలిగిస్తూ రాజ్యానికి చేర్చారు. అలా ఆరు రోజులు శత్రురాజ్యంలో ప్రయాణం చేసి కశ్మీరం సురక్షితంగా చేరిన తరువాత రాజు మరణ వార్త ప్రకటించారు. అంత్యక్రియలు చేశారు. కొందరు రాణులు, రాజుకు విధేయులు రాజుతో పాటు ప్రాణాలు వదిలారు. ఈ సంఘటన అధునిక కాలంలో నాయకుడి మరణ వార్తను దాచి, పరిస్థితులను కట్టుదిట్టం చేసి, తరువాత నాయకుడి ఎన్నుకున్న తరువాత మరణ వార్త ప్రకటించే పద్ధతిని గుర్తుకు తెస్తుంది.

శంకరవర్మ మరణంతో ఉత్తమడు, సత్ప్రవర్తన కల గోపాలవర్మ రాజయ్యాడు. అతడి సంరక్షకురాలిగా రాణి సుగంధా దేవి రాజ్యభారం చేపట్టింది.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here