కశ్మీర రాజతరంగిణి-60

4
7

[box type=’note’ fontsize=’16’] కశ్మీర్ ప్రాచీన చరిత్ర గురించి అవగాహన కలిగించి, భవిష్యత్తు గురించి ఆలోచనలు కలిగించాలన్న ప్రయత్నంలో భాగంగా నీలమతపురాణం తరువాత అందిస్తున్న జోనరాజు, శ్రీవరుడు, ప్రజ్ఞాభట్టులు కల్హణుడి అడుగుజాడల్లో నడుస్తూ సంస్కృతంలో రచించిన ‘కశ్మీర రాజతరంగిణి’ అనువాదాన్ని తెలుగు పాఠకులకు అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ. [/box]

దుర్గుణామ్ లోహరాదీనాం శాస్తా శతమఖోపమః।
నృపతిః సింహరాజాస్తస్మై స్వాం తనయాం దదౌ॥
(కల్హణ రాజతరంగిణి 6, 176)

[dropcap]పె[/dropcap]ళ్ళిళ్ళు స్వర్గంలో జరుగుతాయంటారు. రాజతరంగిణిలో రాజుల చరిత్రలు తెలుసుకుంటుంటే ‘విధి’,  భూమి అనే వేదికపై మానవ జీవితాల నాటకాలను రచించటం తెలుస్తుంది. అప్రధానంగా అనిపించే సంఘటన చరిత్రను మలుపు తిప్పే ప్రధానమైన సంఘటనగా తరువాత నిరూపితమవటం తెలుస్తుంది. ఎంతో ప్రధానం అనుకున్నవి అంత ప్రభావం చూపకుండా తేలిపోవటం కనిపిస్తుంది. అందుకే అంటారు ‘విధి’ని మించిన గొప్ప ‘స్క్రిప్టు రచయిత’ మరొకరు లేరని.

క్షేమగుప్తుడు లోహారరాజు సింహరాజు కూతురిని వివాహామాడేడు. ఇది ఎంతో మామూలుగా అనిపించే శ్లోకం. సాధారణంగా జరిగే విషయం. రాజులు రాకుమారినే వివాహమాడటం సర్వసాధారణం. కానీ క్షేమగుప్తుడి విషయంలో ఇది కశ్మీరు చరిత్రను మలుపు తిప్పే అపూర్వమైన సంఘటనగా పరిణమించింది. క్షేమగుప్తుడు వివాహమాడింది భీమరాజు మనువరాలు దిద్ధాదేవిని.

‘దిద్ధా’ అంటే సోదరి అని అర్థం. ‘అక్క’ను గౌరవంగా పిలిచే పదం ఇది. ఈనాటికీ కశ్మీరీ పండితులలో ఈ పదం వాడుకలో వుంది. ‘దిద్ద’, ‘డిద్ద’ అన్న పేరుతోనే ప్రసిద్ధి పొందింది దిద్దాదేవి. ఆంగ్లంలో ‘D’ అనే అక్షరం వల్ల దిద్దాదేవి, డిద్దాదేవిగా చలామణీలోకి వచ్చింది. దిద్దాదేవి అమాయకురాలు, అందమైనది. క్షేమగుప్తుడు సంపూర్ణంగా దిద్దాదేవి దాసుడయ్యాడు. ఎంతగా అంటే ప్రజలు రాజుని దిద్దక్షేముడని పిలిచేంతగా! దిద్ద తరువాత రాజు అంతగా ఇష్టపడింది నక్కల వేట. ఆయన నేర్చిన యుద్ధ ప్రక్రియలన్నీ నక్కలను వేటాడడంలో ప్రదర్శించి అభాసు పాలయ్యేవాడు రాజు. అలా ఓ సారి నక్కలను వేటాడుతూంటే ఓ నక్క నోట్లోంచి మంటలు రావడం చూశాడు. భయభ్రాంతుడయ్యాడు. ఫలితంగా రోగగ్రస్థుడయ్యాడు. మరణించాడు. పిల్లవాడైన అభిమన్యుడిని రాజసింహాసనంపై కూర్చోబెట్టి దిద్ద పాలనను ఆరంభించింది. అప్పుడు దిద్ద అసలు వ్యక్తిత్వం బహిర్గతమయింది. ఆమె లోని క్రౌర్యం, నైచ్యం, రాజకీయ చతురత, అసూయా ద్వేషాలు సర్వం ప్రకటితమయ్యాయి. అంతకు ముందు క్షేమగుప్తుడి నీడలో ఒదిగిన దిద్దాదేవికీ ఇప్పటి దిద్దాదేవికీ పోలికలే కనిపించవు. అందుకే దిద్దాదేవి అటు చరిత్ర రచయితలనూ, ఇటు సృజనాత్మక రచయితలనూ ఆకర్షించింది. ఆశిష్ కౌల్ ‘దిద్ద – ది వారియర్ క్వీన్’ అన్న నవలను రాశారు. అది హిందీలోనూ ఉంది. దేవికా రంగాచారి ‘క్వీన్ ఆఫ్ ఐస్’ అన్న పుస్తకం రాసింది. తెలుగులో పిలకా గణపతిశాస్త్రి గారు దిద్దాదేవి జీవితం ఆధారంగా కథ రాశారు. కస్తూరి మురళీకృష్ణ కశ్మీర రాజతరంగిణి కథలలో ‘కశ్మీర రాణి దిద్దాదేవి’ అన్న కథ రాశారు. కాల్పనికేతర రచనలు పలు వెలువడ్డాయి దిద్దా జీవితం ఆధారంగా. ఆమె ఎందుకని ఇంతగా అందరినీ ఆకర్షించిందంటే ఆధునిక రాజకీయ నాయకులకు  ఎత్తులకు పై ఎత్తులు, కుట్రలు, కుత్రంత్రాలు, దిగజారుడుతనంతో పాటు పట్టుదల, మొండితనం, అనుకున్నది సాధించే నేర్పు వంటి అనేకవిషయాల్లో పాఠాలునేర్పుతుంది దిద్దాదేవి జీవితం.

క్షేమగుప్తుడి మరణం తరువాత పిల్లవాడు అభిమన్యుడిని రాజుగా నిలిపి రాజ్యం చేయటం ఆరంభించిన దిద్దాదేవి బహుశా అభద్రతా భావానికి లోనయి ఉంటుంది. దిద్దాదేవి ఘటికురాలు. ఆమెకు ప్రధానమంత్రి ఫల్గుణుడు అంటే పడదు. ఎందుకంటే, అతడు తన కూతురితో క్షేమగుప్తుడి వివాహం జరిపించాడు. దాంతో అతడికి రాజ్యంపై కన్నుందని దిద్దాదేవి ఊహించింది. పైగా క్షేమగుప్తుడు మరణించినప్పుడు ఇతర రాణులు సహగమనం చేస్తుంటే, ఆమె తొందరపాటుతో తానూ సహగమనం చేస్తానని ప్రకటించింది. కానీ ఆమెకు సహగమనం ఇష్టం లేదు. సహగమనం చేయమని ఫల్గుణుడు ప్రోత్సహించాడు. ఆ సమయంలో ఉత్తముడు ‘నరవాహనుడు’ ఆమెకు  అండగా నిలిచి సహగమనం బెడద నుంచి తప్పించాడు. అప్పటి నుంచీ ఆమె ఫల్గుణుడంటే మాత్సర్యం పెంచుకుంది. నరవాహనుడి పట్ల అభిమానాన్ని పెంచుకుంది. అయితే రాజ్యాన్ని తన పట్టులోకి తెచ్చుకోవడం కోసం కాబోలు,  ఆమె, కీలకమైన పదవులలో ఉన్నవారూ, శక్తిమంతులయిన వారందరికీ తన శయ్యలో స్థానం కల్పించింది. ఈ రకంగా తన ‘శక్తి’ ప్రదర్శనతో తన అధికారాన్ని పదిలం చేసుకుంటున్న దిద్దారాణికి ఫల్గుణుడి పైన రక్కుడు అనేవాడు చాడీలు చెప్పాడు. దీనికి తోడు క్షేమగుప్తుడి మరణం తరువాత రాజ్యంలో అత్యంత శక్తిమంతుడయిన ఫల్గుణుడంటే అందరికీ భయంతో కూడిన అసూయ కలగటంతో వారు అతడు రాజ్యాన్ని కబళించాలని చూస్తున్నాడని రాణికి చెప్తూ ఆమెని అతనికి వ్యతిరేకం చేశారు. దాంతో రాణి ఫల్గుణుడితోనే కాదు, అందరితో క్రూరంగా వ్యవహరించటం ఆరంభించింది. తన  అభద్రతా భావాన్ని అధికార ప్రదర్శనతో అణచివేయాలని ప్రయత్నించింది.

ఫల్గుణుడికి రాణి తనకు వ్యతిరేకంగా ఉన్నదని అర్థమయింది. దాంతో క్షేమగుప్తుడి అస్థికలు కలిపేందుకు వెళ్తున్న క్షేమగుప్తుడి మరో కొడుకు కర్దమరాజుతో వెళ్ళి ‘పర్ణోత్సం’లో తన సైనికులతో కొన్నాళ్ళున్నాడు. అటు నుంచి ‘కాష్టవాత’కు ప్రయాణమయ్యాడు. అతడు సైన్యం సమీకరిస్తున్నాడని అందరూ రాణికి లేనిపోనివి నూరిపోయడంతో రాణి ఫల్గుణుడిని చంపేందుకు హంతకులను పంపించింది. ఇది తెలిసి ఫల్గుణుడు మరింత బాధ పడ్డాడు. అయితే కశ్మీరు సైన్యం నుంచి పలువురు వీరులు వచ్చి ఫల్గుణుడితో చేతులు కలిపారు. వారందరితో కలిసి పెద్ద సైన్యం అయింది. వారందరినీ వెంట తీసుకుని ఫల్గుణుడు కశ్మీరం తిరుగుముఖం పట్టాడు. ఫల్గుణుడు తనపై దాడికి వస్తున్నాడని  దిద్దారాణి భయపడింది. కానీ ఫల్గుణుడు వరాహదేవుడి పాదాల వద్ద తన కరవాలాన్ని ఉంచి, ‘ఇకపై కత్తి పట్టన’ని ప్రతిజ్ఞ చేశాడు. దాంతో దిద్దారాణికి పెద్ద బెడద వదిలింది.

యోగక్షేమౌ చింతయంతి క్షేమగుప్త ధూరపి।
అనిహం ప్రజా జాగర స్వయం కంటకపాటనే॥
(కల్హణ రాజతరంగిణి 6, 210)

రాత్రింబవళ్ళు తన దారిలో ఉన్న ముళ్ళను తొలగించటం గురించి ఆలోచిస్తు రాణి విశ్రాంతి అన్నది మరిచిపోయింది. ఫల్గుణుడికి రాజ్యంపై ఆసక్తి లేదని నిరూపితమయ్యాక, రాణి తన మార్గంలో ఉన్న ముళ్ళను తొలగించి తన అధికారాన్ని సుస్థిరం చేసుకునే ప్రయత్నాలు ఆరంభించింది.

రాజ్యం కోసం తాపత్రయపడ్డ పర్వగుప్తుడి కుమార్తెలకు మహిముడు, పాటలుడు అన్న కొడుకులుండేవారు. వారిద్దరికీ సింహాసనంపై కన్నుంది. వారు రాణిని బలహీనురాలిగా భావించి, ఇతర శక్తిమంతులయిన పెద్దలతో కలిసి కుట్రలు పన్నటం తెలుసుకున్న రాణి వారిని రాజభవనం నుండి వెళ్ళగొట్టింది. వారిలో మహిముడు తమ మామ అయిన శక్తిసేనుడి ఇంట్లో తలదాచుకున్నాడు. అతడిని అప్పగించమని రాణి భటులను పంపితే శక్తిసేనుడు తిరస్కరించటమే కాదు, అనేక ఇతర శక్తిమంతులయిన వారిని కూడదీసుకుని తిరుగుబాటు బావుటా ఎగురవేశాడు. దాంతో ఒకరొకరుగా అందరూ దిద్దాదేవిని వదిలి మహిముడి పక్షం చేరటం ఆరంభించారు. యుద్ధానికి సిద్ధమై వారు గొప్ప సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ సమయంలో ఒక్క నరవాహనుడు మాత్రమే ఆమె వైపు నిలబడ్డాడు. పెద్ద సైన్యంతో మహిముడు పద్మస్వామి దేవాలయం చేరుకున్నాడు.

ఇది దిద్దాదేవికి అతి క్లిష్టము, కీలకము అయిన దశ. ఒక వ్యక్తి అధికారం అందరూ అతడి మాట వినటంపై ఆధారపడి ఉంటుంది. ఎప్పుడయితే ఎవరయినా అతడి మాటను వ్యతిరేకిస్తారో, ఆ వ్యతిరేకించిన వాడిని అణచివేయటమో, అదుపులోకి తీసుకోవటమో చేయకపోతే – ఆ వ్యక్తి అధికారంపై అనుమానాలు మొదలవుతాయి. అది అతని అధికారం చేజారిపోవటానికి నాందీ ప్రస్తావన అవుతుంది. కుటుంబ స్థాయి నుంచి సామ్రాజ్యం స్థాయి వరకూ ఇది సత్యం. తండ్రి కుటుంబ యజమాని. తండ్రి మాట అతని భార్య, పిల్లలు విన్నంత వరకే అతనికి గౌరవం. ఏ ఒక్కరు వ్యతిరేకించినా, ఎదిరించి నిలబడినా అతని గౌరవభంగం అవుతుంది. ఇది అధికారులకు, రాజులకు కూడా వర్తిస్తుంది. అందుకే ఆజ్ఞలు జారీ చేసేటప్పుడు అన్ని కోణాల నుంచి ఆలోచించి ఆజ్ఞలను ప్రకటించాలి. లేని పక్షంలో అభాసుపాలయ్యే అవకాశం ఉంటుంది.

రాణి దిద్దాదేవి తన వ్యతిరేకులను అణచివేయాలనుకుంది. వారికి  రాజభవన బహిష్కారం విధించింది. వారికి ఎవరూ ఆశ్రయమివ్వకూడదంది. అలా ఆశ్రయం ఇచ్చినవారిని శిక్షించకపోతే ఆమె అధికారం నిలవదు. కానీ ఆశ్రయం ఇచ్చినవారు శక్తిమంతులయితే ఆమె అధికారమే ప్రమాదంలో పడుతుంది. ఇది రాణి దిద్దాదేవి అర్థం చేసుకుంది. అయితే ఇప్పుడు వెనుకడుగు వేసే వీలు లేదు. ముందుకు వెళ్ళి శత్రువుల అపార సేనావాహినితో తల పడటమో, లేక, తోక ముడిచి ప్రాణాలు దక్కించుకుని పారిపోవటమో తప్ప మరో గత్యంతరం లేని పరిస్థితి రాణి దిద్దాదేవిది. ఇక్కడే వ్యక్తి వ్యక్తిత్వం తెలిసేది. రాణి దిద్దాదేవి వ్యక్తిత్వం ప్రస్ఫుటం అవటం మాత్రమే కాదు, ఆమె ఒక శక్తిగా ఎదగటం కూడా ఇక్కడి నుంచే ఆరంభమయింది.

రాణి యుద్ధం చేయాలనే నిశ్చయించుకుంది. ముందుగా తన కొడుకు, పిల్లవాడు అయిన అభిమన్యుడిని శూరమఠానికి పంపింది. అక్కడ పిల్లవాడు భద్రంగా ఉంటాడని నిర్ధారించుకున్న తరువాత ఆమె ఇప్పుడీ సంకట పరిస్థితి నుంచి ఎలా బయటపడాలో ఆలోచన ప్రారంభించింది. ఇది గమనించాల్సిన విషయం. ఆమె మహిళ. అందరి దృష్టిలో అబల. కానీ ఆమె తాను ‘అబలను’ అనుకోలేదు. అధికారం పురుషుడి హక్కు అనుకోలేదు. అయితే ముందుగా ‘తల్లి’లా ఆలోచించింది. పిల్లవాడిని భద్రమైన స్థలానికి చేర్చింది. ఒక ‘రాణి’లా కాదు, ఒక ‘రాజు’లా ఆలోచించింది. ఇదీ ‘ఆత్మవిశ్వాసం’, ‘ఆత్మగౌరవం’ అంటే. తాను ఎంచుకున్న బాధ్యతను సంపూర్ణంగా నిర్వహించేందుకు సిద్ధమయింది. ఇక్కడ ‘రాణి’, ‘రాజు’ పదాలను ‘లింగ’ సూచిత పదాలుగా అర్థం చేసుకోకూడదు. అవి బాధ్యతను సూచించే పదాలుగా అర్థం చేసుకోవాలి. ఆమె ‘రాజు’ బాధ్యతను చేపట్టింది. ‘రాజు’ లానే బాధ్యతలు నిర్వహించింది. భారతీయ మహిళను ‘వంటింటి కుందేలు’ అని, భారతీయ ధర్మాంలోనే మహిళను అణచివేసే గుణం ఉందని దుర్వ్యాఖ్యలు చేసేవారంతా గమనించాల్సిన అంశం ఇది. భారతీయ మహిళ ఏనాడూ వంటింటి కుందేలు కాదు. ఆమె చేపట్టిన బాధ్యతను సక్రమంగా నిర్వహించటం తప్ప మరో దృష్టి లేని అత్యుత్తమ వ్యక్తిత్వం భారతీయ మహిళది. ఇంటి బాధ్యత అయినా, రాజ్యం బాధ్యత అయినా స్వీకరిస్తే నూటికి నూరు పాళ్ళు నిజాయితీగా నిర్వహిస్తుంది. రాణి యశోవతి అయినా, రాణి సుగంధా దేవి అయినా, రాణి నరేంద్ర ప్రభ అయినా, రాణి దిద్దాదేవి అయినా తమ బాధ్యతలను సంపూర్ణంగా నిర్వహించారు. తమ ధర్మాన్ని నిజాయితీగా పాటించారు. తమ బాధ్యత నెరవేర్చటం కోసం ఎంతటి సాహసానికైనా సిద్ధపడ్డారు.

దిద్దారాణి పరిస్థితిని సమీక్షించింది. మహిముడి వైపు ఉన్న వారందరూ తనపై వ్యతిరేకత వల్లనో, మహిముడిపై అభిమానం, విశ్వాసాలుండటం వల్లనో అతడిని సమర్థిస్తున్నవారు కాదని గ్రహించింది. ధనాశ, అధికార దాహం తప్ప వారికి మహిముడి పట్ల ఎలాంటి ప్రేమ లేదని అర్థం చేసుకుంది. వారు మహిముడి నుంచి ఏమి ఆశిస్తున్నారో, వారికి తాను అదే అందిస్తే వారు తనకి విధేయులుగా ఉంటారని, మహిముడికి బదులు తనకే మధ్దతునిస్తారనీ గ్రహించింది. క్షణాలలో మహిముడి తరఫున ఉన్నవారందరినీ తన వైపు తిప్పుకుంది. రాజు అవ్వాల్సిన మహిముడిని పరలోక సామ్రాజ్యానికి పంపించింది. ఈ సందర్భంగా కల్హణుడు అత్యద్భుతమైన శ్లోకాలు రచించాడు. ఆ కాలానికే  కాదు, ఈ కాలానికీ వర్తిస్తాయి ఈ శ్లోకాలు. ఎందుకంటే, ఆనాడు రాణి దిద్దాదేవి చూపిన మార్గాన్నే ఈనాటి ప్రజాప్రతినిధులూ, ప్రపంచవ్యాప్తంగా   రాజకీయ నాయకులూ అనుసరిస్తున్నారు.

గోష్పదోల్లంఘనే యస్యాః శక్తిర్నాజ్ఞాయి కేనచిత్।
వాయుపుత్రాయితం పంగ్వా తయా సంఘాబ్ధి లంఘనే॥
~
యత్సంగ్రహో రత్న మహౌషధీనాం సర్వ వ్యసావసానమ్।
త్యాగేన తథ్యస్య భవేన్నమోస్తు చిత్ర ప్రభవాయ ధనాయ॥
~
ఉత్కోచవాన్యనాదానే ప్యుచ్ఛాం ధ్యాయన్త్యుపక్రియామ్।
దిద్దా యశోధిరాభిచ్యః కంపనాది సమార్పయత్॥
(కల్హణ రాజతరంగిణి 6, 226, 227, 228)

రాణి దిద్దాదేవి వికలాంగురాలు. ఆమె ఒక ఆవు పాదముద్రిక కూడా దాటలేదని అందరూ హేళన చేసేవారు. అలాంటిది, ఆమె, హనుమంతుడు సముద్రాన్ని లంఘించి దాటినట్టు, శత్రుసేన అనే సముద్రాన్ని సులభంగా దాటుతుందని ఎవరూ ఊహించలేదు. కానీ ఆమె హనుమంతుడిలా శత్రు సముద్రాన్ని లంఘించి దాటింది. ధనానికి అమోఘమైన శక్తి ఉంది. ధనO  దానంగానో, బహుమతి గానో ఇస్తే, అభరణాలు, విలువైన వస్తువులు సేకరించిన దానికన్నా ఎక్కువ లాభం వస్తుంది. సమస్యలు అదృశ్యమయిపోతాయి. అమూల్యమైన వస్తువులు కూకూడబెట్టటం కన్నా వాటిని వేరే వారికి అర్పిస్తే సమస్యలన్నీ తొలగిపోతాయంటున్నాడు కల్హణుడు. అందుకే ధనానిది అత్యద్భుతమైన శక్తి అంటున్నాడు. లంచాలివ్వటం, ధనం అర్పించటం కన్నా గౌరవం కల అధికారం కట్టబెట్టటం లాభకరం అని గ్రహించిన రాణి యశోధరుడితో సహా, పలువురికి అధికారాలు అప్పజెప్పింది.

అంటే ధనం కోరో, అధికారం కోరో, పదవులు కోరో మహిముడికి మద్దతు తెలిపిన వారందరినీ ఒకరొకరిగా ధనం ఇచ్చో, పదవులు ఇచ్చో, అధికారం అందించో  తన వైపుకి లాగేసుకుందన్న మాట రాణి. చివరికి ఎట్టి పరిస్థితుల్లోనూ  మహిముడికే మద్దతు అని ప్రతిజ్ఞ పట్టిన బ్రాహ్మణ కుటుంబాలకు కూడా స్థలాలు దానం చేసి, బంగారం అర్పించి తన వైపుకి తిప్పుకుంది రాణి. వీటికీ లొంగని వారికి తన శరీరాన్ని ఎర చూపింది. సంకీర్ణ ప్రభుత్వాలకు మద్దతు సాధించి, సుస్థిరం చేసుకోవటంలో, ప్రతిపక్షాల్లో వారిని తన వైపుకి ఆకర్షితుల్ని చేయటంలో రాణి దిద్దాదేవి మార్గదర్శకత్వం నెరపింది. ఇంతే కాదు, ఆధునికులకు రాణి ఇలా ఎన్నో  అత్యద్భుతమైన రాజకీయ పాఠాలు నేర్పుతుంది.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here