కశ్మీర రాజతరంగిణి-63

1
7

[box type=’note’ fontsize=’16’] కశ్మీర్ ప్రాచీన చరిత్ర గురించి అవగాహన కలిగించి, భవిష్యత్తు గురించి ఆలోచనలు కలిగించాలన్న ప్రయత్నంలో భాగంగా నీలమతపురాణం తరువాత అందిస్తున్న జోనరాజు, శ్రీవరుడు, ప్రజ్ఞాభట్టులు కల్హణుడి అడుగుజాడల్లో నడుస్తూ సంస్కృతంలో రచించిన ‘కశ్మీర రాజతరంగిణి’ అనువాదాన్ని తెలుగు పాఠకులకు అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ. [/box]

అవతారం తురుష్కాణామ్ దత్త్వారేషే మహీతలౌ।
ప్రాప్త భంగ స్తతస్తుంగః స్వదేశం ప్రావిశచ్ఛనైః॥
(కల్హణ రాజతరంగిణి 7, 70)

[dropcap]రా[/dropcap]జతరంగిణి ఏడవ తరంగం నుంచీ కశ్మీరు చరిత్ర అనూహ్యమైన మలుపులు తిరుగుతూ స్వధర్మంతో సంబంధం తెంచుకుని పరధర్మపు కరాళ దంష్ట్రలలో చిక్కుకుని సంపూర్ణంగా రూపాంతరం చెందేందుకు పరుగులిడటం కనిపిస్తుంది. గతంతో సంపూర్ణంగా సంబంధం తెంచుకుని సంపూర్ణంగా రూపాంతరం చెందేందుకు సిద్ధమవటం కనిపిస్తుంది. ముంచుకొస్తున్న పెను మార్పుల గురించి ఏ మాత్రం అవగాహన, ఆలోచన లేని కశ్మీరులో రాజ్యాధికారం కోసం శక్తిమంతులు కుట్రలు, కుతంత్రాలు చేస్తూ, తమలో తాము పోరాడుతూ రాజ్యాన్ని బలహీనం చేయటం కనిపిస్తుంది. స్వయంగా తన చేత్తో వడ్డించిన విస్తరిని శత్రువుకు అందించేందుకు మార్గం సుగమం చేయటం తెలుస్తుంది.

తెలిసో తెలియకో ఒక రాజు ఒకరిని చేరదీస్తాడు… అతడికి ప్రాధాన్యం ఇస్తాడు. అతడు ఏకు మేకై కూర్చుంటాడు. రాజ్య చరిత్రను నిర్ణయాత్మకంగా నిర్దేశిస్తాడతడు. కశ్మీరులో దిద్దారాణి తుంగుడిపై మరులుగొని అతడికి ప్రాధాన్యం ఇచ్చింది. అందరికీ అధికారిగా అత్యంత శక్తివంతమైన స్థానం ఇచ్చింది. రాణి దిద్దాదేవి మరణం తరువాత అధికారానికి వచ్చిన సంగ్రామ సింహుడి మెడ చుట్టూ గుదిబండ అయ్యాడు తుంగుడు. రాణి మరణంతో  తుంగుడి ఉచ్చదశ పోయి దుర్దశ ప్రారంభమవుతుందని ఆశించిన వారి ఆశలను నిరాశలు చేస్తూ తుంగుడు సంగ్రామ సింహుడి రాజ్యంలోనూ సర్వశక్తిమంతుడయ్యాడు. తుంగుడికి ప్రత్యామ్నాయంగా మరో తెలివైనవాడు లభించకపోవడంతో తుంగుడిపై ఆధారపడక తప్పలేదు సంగ్రామ సింహుడికి. అయితే, తుంగుడు సర్వశక్తిమంతుడవటంతో అన్ని బాధ్యతలు అతనిపై పెట్టి సంగ్రామ సింహుడు విలాసాలకు అలవాటు పడ్డాడు.

తుంగుడి అధికారానికి గండి కొట్టాలన్న ప్రయత్నాలు కశ్మీరను బలహీనం చేశాయి. రాజ్యాన్ని అల్లకల్లోలం చేసి తుంగుడు చేతకానివాడని నిరూపించాలని బ్రాహ్మణులంతా కలసి పరిహాసపురం వద్ద సమావేశమయ్యారు. తుంగుడి పట్ల అసంతృప్తితో ఉన్న మంత్రులు బ్రాహ్మణులతో చేతులు కలిపారు. రాజ్యం అల్లకల్లోలం అవటంతో పరిస్థితి చక్కదిద్ది బ్రాహ్మణులను శాంతింపజేయాలని రాజు ప్రయత్నించాడు. చివరికి తుంగుడికి దేశ బహిష్కరణ విధించేందుకు రాజు ఒప్పుకున్నాడు. ఒక కోరికకు రాజు ఒప్పుకోగానే వారు తమ కోరికలు పెంచటం ఆరంభించారు. ఇక్కడ కల్హణుడు రాజును లొంగదీయటంతో సంతృప్తి పడకుండా, లొంగిన రాజును వంగదీయాలని మరిన్ని కోరికలు కోరుతున్న బ్రాహ్మణులకు ‘శఠబుద్ధి’ అన్న పదం వాడతాడు. కల్హణుడు బ్రాహ్మణుల గొప్పతనం భావితరాలకు సజీవంగా అందించేందుకు రాజతరంగిణి రచించాడని దుర్వ్యాఖ్యానం చేసే ఆధునిక మేధావులు ఇది గమనించాలి. కల్హణుడు నిజాయితీగా, నిష్పాక్షికంగా, రాజతరంగిణి రచించాడని పదే పదే చెప్పాల్సిన దుస్థితి కల్పించినందుకు వారు సిగ్గుపడాలి.

ఈ సందర్భంలో కశ్మీరు చరిత్ర ద్వారా మరో గుణపాఠం పాలకులకు అందుతుంది. పాలకుడి ఏదో ఓ చర్య పట్ల ప్రజలలో నిరసన వ్యక్తమవటం సర్వసాధారణం. నిజానికి అందరినీ సంతృప్తిపరచడం ఎవరికీ సాధ్యం కాదు. కాబట్టి పాలకుడు/అధికారి అన్నవాడు ఏ విషయంలో ఎవరు నిరసన ప్రదర్శిస్తున్నారు, వారి నిరసననలో నిజాయితీ ఎంత వంటి విషయాలను పరిగణించి తగు చర్యలు తీసుకోవాలి.  నిరసనకు సక్రమమయిన కారణంవుండి నిజాయితీ వున్నవారు వారి కోరిక తీరటంతో సంతృప్తి పడతారు.  నిజాయితీలేక కేవలం పాలకులను ఇబ్బంది పెట్టేందుకో, తమ బలాన్ని నిరూపించేందుకో నిరసనచేసేవారు , వారి నిరసనను తగ్గించటంలో పాలకుడు బలహీనుడిగా కనిపిస్తే, అది నిరసనకారుల విశ్వాసాన్ని పెంచుతుంది. వారు, ఒక్క కోరికతో సంతృప్తి పడరు. కోరికలు కోరుతూ ‘నిరసన’ అస్త్రం చూపి బెదిరిస్తూనే ఉంటారు. వీరి వల్ల పాలకుడి బలహీనత గమనించిన ఇతరులు కూడా ‘నిరసన’ అస్త్రాలు బయటకు తీస్తారు. కాబట్టి ‘నిరసన’లను తగ్గించటం కోసం పాలకులు అన్ని కోరికలకు ఒప్పుకుంటూ పోతే, అది పాలకుడి పట్ల చులకన భావం కలిగిస్తుంది. అందుకే అధికారాన్ని ‘ముళ్ళ కిరీటం’ అంటారు. ‘ముందు నుయ్యి వెనుక గొయ్యి’ లాంటి స్థితి ఇది. కాబట్టి అధికారాన్ని ఆహ్వానించేవారు ‘విచక్షణ’కు ప్రాధాన్యం ఇవ్వాలి ఉంటుంది. ఎంతవరకూ మొండిగా వుండాలి, ఎంత కాలం సాగదీయాలి, ఎక్కడ వెనకడుగువేయాలి వంటి నిర్ణయాల విషయంలో ఎంతో జాగరూకత ప్రదర్శించాల్సివుంటుంది.

రాజు అధికారాన్ని తుంగుడికి అప్పజెప్పి హాయిగా ఉన్నాడు. తుంగుడిని వ్యతిరేకించే నిరసనను తప్పుదోవ పట్టించి, మళ్ళీ తుంగుడు అధికారాన్ని నిలుపుకున్నాడు. అతను మాంసం, కట్టెలు, తోలు సంచీలు, కంబళ్ళు అమ్మి జీవనం సాగించే భద్రేశ్వరుడు అనేవాడిని దగ్గరతీసి ధర్మాధికారిగా నియమించాడు.

కశ్మీరు చరిత్రలో కొట్టొచ్చినట్టు కనబడే మరో అంశం, అధికారం అందుకునేందుకు ‘జన్మ’ ప్రతిబంధకం కాకపోవటం. భారతీయ సమాజం అన్యాయమైందనీ, వేల ఏళ్ళ నుంచీ అణచివేస్తోందనీ సమకాలీన సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టేవారు తెలుసుకోవాల్సిన విషయం ఇది. కశ్మీరు భారతీయ సమాజాన్ని సూక్ష్మంలో ప్రదర్శిస్తుంది. కశ్మీరులో బ్రాహ్మణులకు గౌరవం ఉన్నా, వారికి గౌరవం వారి పాండిత్యం వల్ల, విజ్ఞానం వల్ల, సత్ప్రవర్తన వల్ల తప్ప కేవలం బ్రాహ్మణుడయినందువల్ల కాదు. అలాగే ‘జన్మ’ ఒక వ్యక్తి ఉన్నతస్థాయికి చేరటానికి, అధికారం అందుకోటానికి, సమాజంలో గౌరవం పొందటానికి ప్రతిబంధకం అవడం కనిపించదు. భుయ్యుడు గాథ మనం చూశాం. ‘తుంగుడు’ గేదెలను మేపేవాడు. ఇప్పుడు భద్రేశ్వరుడు మాంసం, తోలు సంచీలు అమ్మేవాడు. వారికి ఉన్నత స్థానాలు అప్పగించటం పట్ల సమాజంలో నిరసన కలగలేదు. ఉచ్చస్థాయికి చేరినవారు సత్ప్రవర్తన ప్రదర్శిస్తే ప్రజలు బ్రహ్మరథం పట్టారు. దుష్ప్రవర్తనను ఎదిరించారు. ఇది బ్రాహ్మణులకు కూడా వర్తిస్తుంది.

తుంగుడిని ఎలాగయినా ఇరుకున పెట్టాలని బ్రాహ్మణులు శతవిధాలా ప్రయత్నించారు. చివరికి తుంగుడి భవనం దగ్గర ఓ బ్రాహ్మణుడి శవం దొరికితే, తుంగుడి అత్యాచారం వల్ల చనిపోయాడని ఆరోపించి, తుంగుడి భవనంలోనే శవదహనం చేస్తామని పట్టుబట్టి తుంగుడి భవనం వైపు దూసుకుపోయారు.

ఇది చదువుతుంటే ప్రస్తుత సమాజంలో సంభవిస్తున్న అనేక పరిణామాలు గుర్తొస్తాయి. ఎక్కడో ఏవో వ్యక్తిగత కారణాల వల్ల ఒక హత్య సంభవిస్తే, దానికి కులం రంగు పులిమి, మతం రంగు పులిమి, ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని జరిపే ప్రయత్నాలు గుర్తుకొస్తాయి. ఒక చోట జరిగిన దాడిని దేశం మొత్తానికి ఆపాదించి, ‘దేశంలో బ్రతకటం కష్టం’ అన్నట్టు వ్యాఖ్యానిస్తూ ప్రభుత్వాన్ని దెబ్బ తీసే ప్రయత్నాలతో దేశ ప్రతిష్ఠను సైతం దిగజార్చేందుకు సిద్ధపడటం గుర్తొస్తుంది. ప్రతి చిన్న విషయాన్ని ప్రాణాంతకం చేయటం, ప్రతి నిర్ణయాన్ని తప్పుగా ప్రచారం చేసి వ్యతిరేకించి అల్లకల్లోలం చేయటం ఈనాడూ కనిపిస్తుంది. ఆ కాలంలోనూ, ఈ ‘నిరసన’ అధికార సాధన కోసం తప్ప ప్రజల అభ్యున్నతి కోసం కాదు. కానీ ఈ నిరసనలు అల్లర్ల వల్ల అధికారం దక్కుతుందో, లేదో కానీ, దేశం మాత్రం బలహీనపడుతుంది. దేశ ప్రతిష్ఠ దిగజారుతుంది. కశ్మీరులో ఆనాడు అదే జరిగింది. చరిత్ర ద్వారా పాఠాలు నేర్చుకోవటం ఇందుకే. అందుకే భారతీయుల దృష్టిలో చరిత్ర తేదీలు, రాజుల పేర్లు, పోరాటాలు, విజయాలు, ఓటములు కావు. చరిత్ర పఠనం ద్వారా వ్యక్తికి వ్యక్తిత్వం ఏర్పడాలి. సమాజానికి విచక్షణ రావాలి. గతాన్ని అర్థం చేసుకుని వర్తమానాన్ని తీర్చిదిద్దడం ద్వారా భవిష్యత్తుకు బంగారు బాట నిర్మించాలి. కల్హణ రాజతరంగిణి రచన ప్రధానోద్దేశం ఇదే.

భద్రేశ్వరుడు అధికారి అవటంతో, తుంగుడిని ఇరుకున పెట్టిన బ్రాహ్మణ సమూహాలకే కాదు, బ్రాహ్మణులందరికీ గడ్డు దినాలు ప్రాప్తించాయి. ఇది కూడా సమాజంలో సాధారణంగా జరిగేదే. నాథూరాం గాడ్సే మహాత్మాగాంధీని హత్య చేయటంతో, మహారాష్ట్రలో బ్రాహ్మణులందరిపై అత్యాచారాలు చెలరేగాయి. ఇందిరాగాంధీని చంపింది ‘సిక్కు’ కావటంతో, ఢిల్లీలో సిక్కులపై మారణకాండ చెలరేగింది. అంటే ఒకరి పొరపాటు, సమూహానికి హానికారకమవుతుందన్న మాట. తుంగుడిని వ్యతిరేకించిన బ్రాహ్మణ సమూహంలో అధికులు తుంగుడిని చంపాలన్న ప్రయత్నాలలో హతమయ్యారు. కానీ తుంగుడి విశ్వాశపాత్రుడు భద్రేశ్వరుడి కసి బ్రాహ్మణులందరిపైనా ప్రసరించింది.

ఇంతవరకూ సంగ్రామ రాజుని మనం కల్హణుడి దృష్టితోనే చూశాం. రాజ్యాధికారాన్ని తుంగుడికి అప్పచెప్పి, హాయిగా విలాసాల్లో మునిగి తేలుతున్న వాడిలా కనిపిస్తాడు సంగ్రాముడు. ఇప్పుడు కశ్మీరుకి ఆవలి నుంచి సంగ్రాముడిని పరిశీలిస్తే సంగ్రాముడిలో గొప్ప రాజు కనిపిస్తాడు. భవిష్యత్తు పట్ల ఆలోచన కలిగిన ధర్మభక్తుడు కనిపిస్తాడు.

కశ్మీరులో అధికారం కోసం, తుంగుడి అధికారాన్ని తగ్గించటం కోసం నిరసనలు జరుగుతూ అల్లకల్లోలం జరుగుతున్న సమయంలో మహమ్మద్ గజనీ ప్రతి సంవత్సరం భారతదేశంపై దాడి చేస్తూ, దోపిడీలు చేస్తూ వస్తున్నాడు. అయితే మహమ్మద్ గజనీ దాడులను కాబూల్ ప్రాంతంపై అధికారం కల ‘హిందుషాహి’ వంశం రాజులు సమర్థవంతంగా అడ్డుకట్ట వేస్తూ వస్తున్నారు. దాదాపుగా 350 ఏళ్ళు ఈ ‘హిందూషాహి’ వంశం రాజులు ముంచుకొస్తున్న ఇస్లాం ప్రవాహానికి ‘అడ్డు’గా నిలబడ్డారు. ఈ వంశానికి చెందిన ‘జయపాలుడు’ మరణించే నాటికి ‘షాహి’ రాజులు  ఇంకా ఎంతో కాలం మహమ్మదీయుల ధాటికి తట్టుకుని నిలబడలేరని అర్థం అయింది. ‘భీమదేవ షాహి’ శక్తిమంతుడయిన రాజు. ఈయన మహమ్మదీయ సేనలను అడుగు ముందుకు కదపనీయలేదు. ఈయన కూతురే దిద్దాదేవి.

దిద్దాదేవి కశ్మీరు రాణి అవటంతో షాహి రాజులకూ, కశ్మీరుకూ నడుమ సంబంధాలు మరింత గట్టిపడ్డాయి. ఆనందపాలుడి హయాంలో గజనీ ‘షాహి’ రాజ్యాన్ని కొల్లగొట్టినా, ముందుకు రాలేకపోయాడు. క్రీ.శ. 1013లో ఆనందపాలుడు మరణించటంతో త్రిలోచనపాలుడు షాహి రాజయ్యాడు. తండ్రితో కలిసి గజనీకి వ్యతిరేకంగా యుద్ధాలలో పాల్గొన్నాడు కాబట్టి త్రిలోచనపాలుడు గజనీ దాడిని ఊహించి అప్రమత్తంగానే ఉన్నాడు. సంగ్రాముడు దిద్దారాణి మనుమడు. అంటే  త్రిలోచనుడికి బంధువు. దాంతో కశ్మీరుతో సంబంధాలు కొనసాగాయి. త్రిలోచనుడు తన కూతురిని తుంగుడికిచ్చి వివాహం చేశాడు. అంటే సంబంధాలు దృఢతరం అయ్యాయి. అందుకే గజనీ మళ్ళీ సరిహద్దుల దగ్గరకు వస్తున్నాడనగానే త్రిలోచనపాలుడు సంగ్రాముడిని సహాయం అభ్యర్థించాడు. సంగ్రాముడు వెంటనే రాజపుత్ర, సామంత సేనాపతులను, సకలపరివారాన్నీ, చతురంగబలాలను ఇచ్చి  తుంగుడిని షాహి రాజులకు సహాయంగా పంపాడు. సంగ్రాముడిని భారతదేశం గుర్తుంచుకునేది ఈ దూరదృష్టి చర్య వల్లనే. భారతీయ రాజులలో ఐకమత్యం లేదని, వారిలో వారు పోరాడుతూ శత్రు సైన్యంతో పోరాడక, సులభంగా లొంగిపోయారన్న అపోహ చరిత్ర రచనల్లో కనిపిస్తుంది. కానీ చరిత్రను పరిశీలిస్తే, ఇది నిజం కాదని తెలుస్తుంది.  అడుగడుగునా భారతీయ రాజులు పరస్పరం సహాయం చేసుకుంటూ సమష్టిగా శత్రువులను ఎదుర్కొనటం కనిపిస్తుంది.

పెద్ద సైన్యంతో వచ్చిన తుంగుడు, గజనీని ఖైబరు కనుమల వద్ద షాహి షైన్య నిలువరింపజేసిందని తెలుసుకుని, ఇక అతను దాటి రాలేడనుకుని వెనక్కు తిరిగి వెళ్ళిపోయాడు. కానీ మహమ్మద్ గజనీ ఖైబరు కనుమలు దాటి వచ్చాడు.

గజనీతో పోరాడి అతడి రాకను ఆలస్యం చేసేందుకు త్రిలోచనపాలుడు తన కొడుకు భీమపాలుడిని పంపాడు. తాను మరింత సైన్య సహాయం కోసం కశ్మీరు ప్రయాణమయ్యాడు. భీమపాలుడు నెలపైగా గజనీని కనుమల వద్ద ఆపేశాడు. మహమ్మద్ గజనీ సేనలకు  తీవ్రమైన నష్టం కలిగించాడు. మహమ్మద్‌తో పాటు యుద్ధాన్ని ప్రత్యక్షంగా దర్శించిన ‘ఉత్బీ’ (Utbi) రాసిన ‘తారిఖ్-ఇ-బదౌని’లో త్రిలోచనపాలుడితో, సంగ్రాముడితో గజనీ యుద్ధాన్ని కళ్ళకు కట్టినట్టు వర్ణించాడు.

గజనీని ఎంతో కాలం నిలువరించలేనని గ్రహించిన భీమపాలుడు సేనను రెండు భాగాలు చేసి ఒక బాగం గజనీతో తీవ్రంగా పోరాటం చేస్తుండగా, రెండో భాగం రాజధాని ‘నందనం’ రక్షణ కోసం వెనక్కి మళ్ళేట్టు చేశాడు. కొన్నాళ్ళకి ‘నందనం’ కూడా గజనీ వశమయిన తరువాత గజనీ, త్రిలోచనపాలుడిని అనుసరిస్తూ, కశ్మీరుపై దాడికి వెళ్ళాడు. మళ్ళీ సంగ్రాముడు తుంగుడిని త్రిలోచనపాలుడికి మద్దతుగా పంపాడు. త్రిలోచనపాలుడికి గజనీ యుద్ధ పద్ధతి తెలుసు. కాబట్టి గజనీతో తిన్నగా తలపడకుండా, అతడిని లోపలికి రానిచ్చి, చుట్టుముట్టి దాడి చేయాలని ప్రణాళికను తుంగుడికి బోధించాడు త్రిలోచనపాలుడు. అయితే తుంగుడు త్రిలోచనపాలుడి మాట వినలేదు. గర్వంతో తిన్నగా గజనీపై దాడికి వెళ్ళాడు. ఇక్కడే భారతీయుల బలహీనత తెలిసేది.

విదేశీ ముష్కరుల దాడుల్లో భారతీయులు ఓడిపోయింది శక్తి, పౌరుషాలు లేక కాదు. యుద్ధ నైపుణ్యం లేక కాదు. ప్రణాళికలు లేక కాదు. శత్రువు శక్తిని అంచనా వేయలేకపోవటం వల్ల కాదు. శత్రువు బలవంతుడవటం వల్ల కాదు. భారతీయులు విదేశీ ముష్కరులతో పరాజయం పొందటంలో ప్రధాన పాత్ర పోషించినది ‘అహంకారం’ , వ్యక్తుల అహంకారం. భారతీయ వీరులు ‘సమష్టి’గా కాక ‘వ్యక్తిగత అహంకారం’ కోసం పోరాటం జరపటం వల్ల శత్రువు కన్నా శక్తిమంతులయి ఉండి కూడా, విజయం సాధించగలిగే సత్తా ఉండి కూడా, విజయం అంచులకు చేరుకుని కూడా పరాజయం పాలయ్యారు. త్రిలోచనపాలుడు తన యుద్ధ ప్రణాళిక వల్ల గజనీని లోపలికు లాక్కొచ్చాడు. అడుగడుగునా పోరాటం చేస్తూ గజనీ సైన్యాన్ని నష్టపరిచాడు, చికాకు పరిచాడు. అదే పద్ధతి కనుక తుంగుడు కూడా అమలుపరిచి ఉంటే ‘గజనీ’ పరాజయం సంపూర్ణం అయి ఉండేది. కానీ తుంగుడు అహంకారంతో గజనీపై దాడి చేశాడు.  గజనీ కన్నా ముందు శత్రు సైనికుల బలాబలాలు తెలుసుకునేంది వచ్చిన తురుష్క సేనాపతి హమ్మీరుడి (కొందరు చరిత్ర రచయితలు హమ్మీరుడంటే గజనీయే అంటారు.అంటే తౌహీ నది వద్ద తుంగుడు గజనీ సేనలనే వోడించాడన్నమాట) సైన్యంతో తుంగుడు తలపడ్డాడు. తౌహీనది వద్ద అతి వీరోచితమైన పోరాటం జరిపి తురుష్క సేనను చీల్చిచెండాడు. చరిత్రలో తౌహీ నది యుద్ధాన్ని పెర్షియన్ రచయితలు గొప్పగా వర్ణించారు. వారు తుంగుడిపై ప్రశంసలు కురిపించారు. ఈ గెలుపుతో తుంగుడికి గర్వం హెచ్చింది. అప్పటికే అడ్డూ అదుపూ లేని తుంగుడికి ఉన్మాదంవంటి అహంకారం కలిగింది. గజనీ వచ్చేవరకూ తమకు అనువయిన ఆ స్థలంలోనే ఎదురుచూద్దామన్న త్రిలోచనపాలుడి మాటను పట్టించుకోలేదు. మితిమీరిన ఆత్మవిశ్వాసంతో ముందుకు దూకాడు.

తాను పంపిన సేన పరాజయం పాలయిందని తురుష్క సేనాపతి మరింత సేనను పంపాడు. వారిని లోనికి రానివ్వక తుంగుడు తిన్నగా ఎదుర్కున్నాడు. షాహి సేన అత్యద్భుతమయిన పోరాట పతిమను ప్రదర్శించింది. ఎంత వీరోచితంగా పోరాడినా విజయం హమ్మీరుడి(గజనీ) దయింది. చెల్లచెదరవుతున్న సైన్యంలో గజబలాన్ని కాపాడుకుని యుద్ధరంగం వదలివెళ్ళాడు త్రిలోచనపాలుడు. కశ్మీరు సైన్యం చెల్లా చెదురవటంతో గజనీ సైన్యం ఉత్సాహం పెరిగింది. త్రిలోచనపాలుడు రాజ్యం కోల్పోయిన రాజయ్యాడు. అతని వెంట  సైన్యం ఉంది. ఖజానా ఉంది. రాజ్యం లేదు. ఇలా మూర్ఖత్వం వల్ల ఓటమి పాలయి తిరుగు ప్రయాణం పట్టిన తుంగుడిని గురించి కల్హణుడు “భూమిపై తురుష్కాధిపత్యం నెలకొల్పేందుకు వీలు నిచ్చిన తుంగుడు మెల్లిగా కశ్మీరం వచ్చి చేరాడు” అంటాడు. తుంగుడు కనక అహంకారం వదలి అనుభవజ్ఞుడయిన త్రిలోచనపాలుడి మాట విని పద్ధతి ప్రకారం యుద్ధం చేసివుంటే దేశ చరిత్ర మరో రకంగా వుండేది. ఎందుకంటే, యుద్ధంలో ఒక దశలో లోహఘాట్‌లో మహమ్మద్ గజనీ చిక్కుకుపోయాడు. సంగ్రాముడి కశ్మీర సేన కోట ద్వారాలను చేదించి కోటలోకి ప్రవేశించింది. కానీ, చావుతప్పి కన్నులొట్టబోయిన రీతిలో గజనీ ప్రాణాలతో తప్పించుకున్నాడు. తౌహీ నది వద్ద జరిగిన పోరాటం గజనీని ఎంతగా భయపెట్తిందంటే ప్రతి సంవత్సరం భారత్‌పై యుద్ధానికి వస్తానన్న గజనీ, మళ్ళీ ఆరు సంవత్సరాల తరువాతనే భారత్ వైపు కన్నెత్తి చూసే ధైర్యం చేశాడు. అంటేనే అర్థం చేసుకోవచ్చు షాహి సైన్యం, కశ్మీర సైన్యం ఎంతగా గజనీని కలవరపరిచాయో. తరువాత దాడుల్లోకూడా గజనీ లోహఘాట్‌ను దాటి ముందుకు రాలేకపోయాడు.  కాబట్టి భారతీయులు తురుష్కసేనలకు లొంగిపోవటం కేవలం వ్యక్తుల అహంకారాలవల్ల, దురదృష్టం వల్ల తప్ప భారతీయ రాజుల అనైకమత్యంవల్ల కాదు, భారతీయుల పోరాట పటిమ లోపం, నైపుణ్య లేమి వల్ల కాదు.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here