కశ్మీర రాజతరంగిణి-76

2
7

[box type=’note’ fontsize=’16’] కశ్మీర్ ప్రాచీన చరిత్ర గురించి అవగాహన కలిగించి, భవిష్యత్తు గురించి ఆలోచనలు కలిగించాలన్న ప్రయత్నంలో భాగంగా నీలమతపురాణం తరువాత అందిస్తున్న జోనరాజు, శ్రీవరుడు, ప్రజ్ఞాభట్టులు కల్హణుడి అడుగుజాడల్లో నడుస్తూ సంస్కృతంలో రచించిన ‘కశ్మీర రాజతరంగిణి’ అనువాదాన్ని తెలుగు పాఠకులకు అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ. [/box]

ఇత్యంతే బహుమాన హ్యాత్పరిభవః సర్వస్య సామాన్యవత్తత్కో నామ
భువేన్మమనహామితి ధ్యాయన్ధృతాహం క్రియః॥
(కల్హణ రాజతరంగిణి 8, 335)

[dropcap]సు[/dropcap]స్సలుడికి జయసింహుడన్న కొడుకు కలగటంతో సోదరుల నడుమ విభేదాలు మాసిపోయాయి. సోదరుడికి కొడుకు పుట్టిన తరువాత ఉచ్ఛలుడు యుద్ధంలో విజయం సాధించటంతో ఉచ్ఛలుడికి జయసింహుడంటే అభిమానం ఏర్పడింది. అతడి పాదానికి ఉన్న మచ్చ ఉచ్ఛలుడికి నచ్చింది. జయసింహుడిపై ప్రేమతో సుస్సలుడితో వైరం మరిచిపోయాడు. అప్పుడతడికి భవిష్యత్తు అర్థమైంది. పిల్లవాడి దృష్టిలో చెడ్డవాడిగా ఉండకూడదని పుణ్యం సంపాదించటానికి మఠాలు కట్టించాడు. ఓ కల్పవృక్షంలా ఎవరు ఏది కోరితే దాన్ని ఇచ్చేశాడు. ఆవులు, మణులు, బంగారం, ధనధాన్యాలు ప్రజలకు దానాలు చేస్తూ దూర దేశాలలో ఉన్న రాజులు ఆశ్చర్యపడేలా వారికి అతి విలువైన, ఖరీదైన బహుమానాలు పంపించాడు. వాటిని చూసి విదేశాల రాజులు ఆశ్చర్యపోయారు. అయితే రాజు పూర్వజన్మలో చేసుకున్న ఏదో పాపం వల్ల అతను కట్టించిన మఠాలు, మందిరాలు అంత ప్రశస్తి పొందలేదు. అయితే ఉచ్ఛలుడిని చంపాలని అనుకుంటున్న వారి సంఖ్య పెరుగుతూ వచ్చింది తప్ప తగ్గలేదు.

ఓ సారి ఉచ్ఛలుడు కంబలేశ్వర గ్రామంలో పర్యటిస్తున్నప్పుడు, అక్కడ, దగ్గరలోనే నివసిస్తున్న చండాలురు, వీరు దొంగలు, రాజును చుట్టుముట్టారు. ఆ సమయంలో రాజు వెంట ఉన్న సైన్యం సంఖ్య కూడా తక్కువే.  వారు ఉచ్ఛలుడి తేజస్సును చూసి అతడిని చంపలేకపోయారు. కానీ వారు రాజు వెళ్ళే దారిని మూసేయటంతో, ఉచ్ఛలుడు తన అనుచరులతో మరో దారిలో ప్రయాణించాల్సి వచ్చింది. పరిచితం కాని దారిలో ప్రయాణించాల్సి రావటంతో వారు దారి తప్పారు.

ఎలా విస్తరించిందో కానీ ఉచ్ఛలుడు మరణించాడన్న వార్త కార్చిచ్చులా  కశ్మీరమంతా విస్తరించింది. ఆ సమయంలో శ్రీనగరానికి అధికారి ‘చడ్డ’ అనేవాడు. అతను ‘రడ్డ’ అనేవాడి సోదరుడు. నగరంలోని అశాంతిని అణచి, పరిస్థితిని అదుపులోకి తెచ్చిన తరువాత వారు తదుపరి కార్యం గురించి ఆలోచించారు. ప్రతి ఒక్కరిలో తానే రాజవ్వాలనే కోరిక జనించింది. పైగా వారు యశస్కరుడి వంశానికి చెందిన వారవటంతో రాజ్యానికి తామే అర్హులం అని ‘చడ్డ’, ‘రడ్డ’లు భావించారు. వారి బంధు మిత్రులు వారికి మద్దతు తెలిపారు. దాంతో మంచి నడవడి, పద్ధతి, ఉచితానుచితాలు అన్నవి మరచిపోయి తాను రాజపుత్రుడిలా వ్యవహరిస్తూ అందరినీ దూషించటం ఆరంభించాడు ‘సడ్డ’. ‘చడ్డ’ కు కూడా సింహాసనంపై ఆశ ఉండడంతో పరిస్థితి జటిలమయింది. ఈలోగా, రాజు సజీవుడై ఉన్నాడన్న వార్త తెలిసింది. దాంతో సింహాసనంపై వారి ఆశలు అడుగంటాయి.

రాజధానికి వచ్చిన ఉచ్ఛలుడు రాజ్యాన్ని కబళిద్దామని ఆలోచించిన వారినీ, వారికి మద్దతుగా నిలిచిన వారందరినీ అణచివేశాడు. ముఖ్యంగా అధికార యంత్రాంగం (bureaucracy) లో భాగంగా ఉన్న కాయస్థులందరినీ క్రూరంగా శిక్షించాడు. ‘సడ్డ’ని కూడా పదవి నుంచి తొలగించాడు. ఇలా ఉద్యోగాలు కోల్పోయిన వారంతా ‘రడ్డ’. ‘సడ్డ’ లను విప్లవానికి ప్రేరేపించారు. ఎట్టి పరిస్థితులలో రాజును సంహరించటం తప్పనిసరి అని నిశ్చయించి, సమయం కోసం ఎదురు చూడసాగారు. ఈలోగా రాజు వల్ల అవమానం పొందిన వారిని, దూషణలకు గురైన వారినీ అందరినీ తమవైపు ఆకర్షించారు. రాజును చంపేందుకు హంతకులు, ఆయుధాలను దాచుకుని, రాజును వెంబడించేవారు నీడలా. ఉచ్ఛలుడికి తన మరో పత్ని ‘బిజ్జల’పై వ్యామోహం పెరిగింది. ఆమె పొందు కోసం తపించేవాడు.

రాజు ఇలా బిజ్జల వ్యామోహంలో కొట్టుమిట్టులాడుతూ ఉండగా, రాజవ్యతిరేకులు రాజును హత్య చేసేందుకు అనువైన సమయం కోసం ఎదురు చూస్తూ అనుక్షణం పొంచి ఉండగా, ఉచ్ఛలుడు వైభవంగా తన కూతురి పెళ్ళి చేశాడు. పెళ్ళి అయిన తరువాత ఖజానా నింపేందుకు తంత్రినులకు ఇచ్చే ధనాన్ని ఆపేశాడు. రాజుకు అండగా నిలిచి, యుద్ధంలో సుస్సలుడిని ఓడించిన భోగసేనుడిని కూడా రాజు దూరం చేసుకున్నాడు. ఇతడు కూడా శత్రు కూటమిలో చేరిపోయాడు.

ఇక్కడ కల్హణుడు గమ్మత్తయిన శ్లోకం రాశాడు.

ఎవరెవరినయితే రాజు అవమానపరిచాడో, ఎవరెవరికి సింహాసనంపై ఆశ ఉన్నదో, ఎవరెవరు ఒక జట్టుగా ఏర్పడ్డారో, రాజు ఎవరెవరి ఉద్యోగాలు పీకించాడో, జీతం అందించటం మానేశాడో వారందరికీ రాజు దేశ బహిష్కారం శిక్ష విధించలేదు. బహుశా రాజుకు యమలోకంపై ఆశ మెండుగా ఉన్నదేమో! అంటాడు కల్హణుడు. ఇలాంటి వారిని రాజ్యం బయటకు వెడలనడవపడం వల్ల, కారాగారంలో ఉంచటం వల్ల, రాజుకు ప్రమాదం ఉండేది కాదు. రాజు ఇంకా ఎక్కువ కాలం జీవించి ఉండేవాడన్నది కల్హణుడి భావన.

భోగసేనుడిని తమతో కలుపుకున్నారు కానీ ‘సడ్డ’కు, ‘రడ్డ’కు అతడు రాజుకు విధేయుడన్న అనుమానం పోలేదు. రాజును చంపాలన్న తమ ఆలోచనను ఎక్కడ భోగసేనుడు రాజుకు చెప్పేస్తాడోనన్న భయం పట్టుకుంది వారికి. అందుకని ఆ రాత్రే రాజును చంపాలని నిశ్చయించుకున్నారు.

నిజానికి రాజుకు హత్య కుట్రను వివరించాలని భోగసేనుడు ప్రయత్నించాడు. కానీ రాజు అతని మాటలు వినలేదు. “నువ్వేం చెప్పినా పీకేసిన నీ పదవి నీకు తిరిగి ఇవ్వను” అన్నాడు. అతని మాట వినలేదు. మృత్యువు తలపై నాట్యమాడుతున్న వాడిని ఎవరెంత ప్రయత్నించినా రక్షించలేరు.

తంత్రినులు ఆ రాత్రి ఆయుధాలతో రాజభవనం ప్రవేశించారు. “మేము ఎవరిని కొడతామో, మీరూ వారినే కొట్టండి” అని చండాలురకు చెప్పి వారినీ రాజభవనానికి తీసుకువచ్చారు.

ఇకపై జరిగిన దాన్ని కల్హణుడు కళ్ళకు కట్టినట్టు వర్ణించాడు. ఓ సినిమా స్క్రిప్టులా ఉంటుందీ వర్ణన.

‘బిజ్జల’ అంతఃపురానికి వెళ్ళాలని ఆతృతతో ఉచ్ఛలుడు తయారయ్యాడు. రెట్టింపవుతున్న కోరికతో  నడుస్తున్న రాజు  దారిలో దీపాలు వెలిగిస్తున్నారు సేవకులు. అతను భవంతి మధ్యకు చేరేసరికి దీపాలు వెలిగించేవారు తగ్గిపోయారు. సడ్డ ఆ భవంతి తలుపులు మూశాడు. మిగతా వారు కూడా అన్ని ద్వారాలు మూసి ఆయుధాలతో రాజును చుట్టుముట్టారు.

నడుస్తున్న రాజును ఆపేందుకు ఒకడు రాజు ముందు మోకరిల్లి ఏదో సమస్యను విన్నవిస్తున్నట్టు నటించాడు. వెనుక నుంచి తేజ అనే బ్రాహ్మణుడు రాజును జుట్టు పట్టి లాగి కత్తితో పొడిచాడు.

‘మోసం, మోసం’ అని అరుస్తూ ఉచ్ఛలుడు జుట్టును తేజ చేతుల్లోంచి విడిపించుకున్నాడు. పళ్ళతో తన కత్తిని ఒర నుంచి లాగాడు. ఈలోగా సర్పాలు మేరు పర్వత శిఖరంలోకి చొచ్చుకు వెళ్ళినట్టు పలు కత్తులు రాజు శరీరంలోకి ప్రవేశించాయి. రాజుపై దాడి జరగగానే అతడిని వెన్నంటి ఉన్న సేవకుడు పారిపోయాడు. రాజు చిన్న బొమ్మ లాంటి కత్తిని తీశాడు. అతడి ప్రేవులు వ్రేలాడుతున్నా, పూలు తురుముకున్న జుట్టును ముడి వేసుకున్నాడు. పెద్దగా అరిచి, తేజ తలను మెండెం నుంచి వేరు చేశాడు. వెనుక నుంచి దాడి చేయబోతున్న రడ్డను పొడిచాడు. సింహంలా అరుస్తూ సడ్డను చీల్చాడు. కవచం ధరించిన ఓ సైనికుడిని చంపాడు. దాంతో అందరూ వెనుకడుగు వేశారు. అవకాశం చిక్కగానే పారిపోవాలని ప్రయత్నించాడు రాజు. కానీ తలుపులు వేసి ఉన్నాయి. తలుపుల బయట భటులు కాపలా ఉన్నారు. వారికి లోపల జరుగుతున్నది తెలియదు.

ఉచ్ఛలుడు మరో తలుపు వైపు పరుగులిడుతుంటే “ఎటు పోతున్నావు” అంటూ చడ్డ రాజును కత్తితో పలుమార్లు పొడిచాడు. అప్పుడు రాజు గోడపైన బొమ్మలు గీస్తూ ముఖం తిప్పుకున్న భోగసేనుడిని చూశాడు.

“ఓ భోగసేనా! ఉట్టిగా చూస్తూ నిలబడతావేం?” అనడిగాడు. భోగసేనుడు అస్పష్టంగా ఏదో అన్నాడు.

‘రయ్య వట్ట’ అనే దీపాలు వెలిగించేవాడు రాజును రక్షించాలని వచ్చాడు. కానీ కత్తి దెబ్బకు పడిపోయాడు. ఇంకా రాజుకు సహాయంగా వచ్చినవారిని పేర్లతో సహా ప్రస్తావిస్తాడు కల్హణుడు. రాజును ఆ స్థితిలో వదిలి పారిపోయిన వారి గురించీ చెప్తాడు.

చివరికి రాజు మెట్లెక్కి పారిపోవాలని చూస్తే, చండాలురు కాళ్ళు పట్టి రాజును లాగి నేలపై పారేశారు. రాజును రక్షించేందుకు ‘శృంగార’ అనే కాయస్థు, తన శరీరాన్ని రాజు శరీరానికి అడ్డంగా పెట్టాడు. అతడి శరీరాన్ని ముక్కలుగా నరికేశారు. చివరికి అందరూ కలిసి ఒకేసారి నేలపై పడి ఉన్న ఉచ్ఛలుడిపై దాడి చేశారు. వారి ఆయుధాలు కాళీమాత రాజుకు అర్పించిన నీరాజనాలుగా అందించిన నీలి కలువల మాలలాగా అనిపించాయి. అయితే ఉచ్ఛలుడు నిజంగా మరణించాడో, లేక నటిస్తున్నాడో అన్న అనుమానంతో ‘సడ్డ’ రాజును దూషిస్తూ అతని మెడను కత్తిరించాడు. రాజు చేతి వ్రేళ్ళను కోసి, వ్రేళ్లకు ఉన్న ఉంగరాలను కాజేశాడు. రాజు ఎలాగ తన శత్రువులపై జాలి చూపించలేదో అలాగే అతని శత్రువులు కూడా అతనిపై జాలి చూపించలేదు. ఈ సందర్భంగా ఒక గొప్ప శ్లోకం రాశాడు కల్హణుడు.

ముల్లోకాలను గెలిచిన లంకాధీశుడు చివరికి కోతుల బారిన పడి సర్వం కోల్పోయి నశించాడు. కురు రాజు, ఎన్నో సౌఖ్యాలు అనుభవించిన దుర్యోధనుడి తలను చివరికి కాలితో తన్నారు. కాబట్టి ఎవరెంత గొప్పవారయితే, ఆ అహంకారంతో ఎంతగా విర్రవీగితే వారు అంత నీచమైన అంతం పొందుతారు.

కల్హణుడు ఇంత విపులంగా ఉచ్ఛలుడి హత్యను వర్ణించగలగటానికి కారణం కల్హణుడు ఆ కాలంలో జీవించి ఉండటమే. ఓ రకంగా అతని కళ్ళముందే ఈ సంఘటనలు జరిగాయి. ఎలాగయితే, ఓ సంఘటన గురించి అది జరిగిన కాలంలో ‘ఇలా జరిగింది’, ‘అలా జరిగింది’ అని చెప్పుకుంటారో, కల్హణుడు అవన్నీ విని ఉంటాడు. కల్హణుడి తండ్రి చంపకుడు హర్షుడి ఆస్థానంలో ఉన్నత స్థానంలో ఉన్నాడు. హర్షుడి చివరి దశలో అతడిని వదిలి వెళ్లాడు. రాజాస్థానంలో అతడికి పలుకుబడి ఉండే ఉంటుంది. కాబట్టి రాజభవనంలో జరిగే విషయాలు ఎవరో ఒకరు చంపకుడికి, కల్హణుడికి పూస గుచ్చినట్టు చెప్తూనే ఉంటారు. అందుకే కల్హణుడు ఒక సినిమా దృశ్యాన్ని వర్ణించినట్టు వర్ణించాడు. కల్హణుడి ప్రతి పదంలో ఆవేదన కనిపిస్తూంటుంది. శివాంశజుడయిన కశ్మీర రాజుకు ఎలాంటి స్థితి వచ్చిందన్న బాధ తెలుస్తూంటుంది.  భవిష్యత్తు పట్ల భయం, ఆలోచనలతో ఉక్కిరి బిక్కిరి అయి ఉంటాడు. రాజును ఇలా వేటాడి చంపటం భారతీయ జీవన విధానంలో లేదు. రాజును దైవంలా భావించేవారు. రాజు ఎలాంటి క్రూరుడయినా భరించేవారు. పుష్యమిత్రుడి లాంటి సంఘటనలు అప్పుడొకటి, జరిగినా ఇంత ఘోరంగా రాజును వేటాడి వేటాడి చంపటం ఎప్పుడూ లేదు.  ఇదంతా మ్లేచ్ఛ సంపర్క ప్రభావం అని కల్హణుడు గ్రహించాడు. అందుకే కశ్మీరు జీవన విధానంలో, ఆలోచనల్లో, సాంఘికంగా, మానసికంగా, ధార్మికంగా వస్తున్న మార్పులను విపులంగా వర్ణించాడు. భావితరాలు కశ్మీరు రూపాంతరం చెందిన విధానాన్ని అర్థం చేసుకుని పైన ఉన్న తొడుగులను తొలగించుకుని తమ అసలు రూపం గ్రహిస్తారన్నది కల్హణుడి ఆశ! రాజును చంపినట్లు కానీ, అతడిని అనాథలా దహనం చేసినట్టు కానీ ఎవ్వరికీ తెలియదు. “అతను హఠాత్తుగా అందరి దృష్టి నుంచి అదృశ్యమై పోయాడు” అంటాడు కల్హణుడు. మరణించే నాటికి ఉచ్ఛలుడి వయసు 41 సంవత్సరాలు. అది 1112వ సంవత్సరం.

ఒళ్ళంతా చిందిన రక్తంతో, కత్తి చేత పట్టుకున్న ‘రడ్డ’ కశ్మీర సింహాసనాన్ని – స్మశానంలో భేతాళుడిలా – అధిరోహించాడు. అయితే, తెల్లవారేసరికి ప్రజలకు జరిగినదంతా తెలిసింది. రాజుకు విధేయులుగా ఉన్నవారు, ఉచ్ఛలుడికి జరిగిన అన్యాయాన్ని సహించలేకపోయారు. ఉచ్ఛలుడిని అన్యాయంగా హత్య చేసిన వారందరినీ వెతికి వెతికి వేటాడడం ఆరంభించారు. ప్రజలు కూడా అందిన దానితో రాజద్రోహులను హింసించసాగారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటుంది. ప్రజలు తిరగబడటం….ఉచ్చలుడు గొప్ప రాజు కాదు. కానీ, రాజును అమానుషంగా హత్య చేయటం, సిమ్హాసనం కోసం ఆశపడి, నీతి తప్పటం ప్రజలు హర్షించలేకపోయారు. దాంతో తెల్లారేసరికి తిరగబడ్డారు. అక్రమంగా రాజ్యాధికారాన్ని సాధించినవాడి పనిపట్టారు. కశ్మీరులో పలు సందర్భాలలో ఇది గమనించవచ్చు. ప్రజలు నిర్మొహమాటంగా నిరసనను వ్యక్తపరచటం, తమకు కావాల్సినవాడిని రాజుగా పొందటం గతంలో పలుమార్లు జరిగింది. అయితే, రాను రాను ప్రజలలో ఈ పోరాటపటిమ, స్వేఛ్ఛా ప్రవర్తన తగ్గటమూ ఇతర రాజతరగిణిలలో తెలుస్తుంది. రడ్డ ఆయుధం ధరించి రణరంగంలోకి ఉరికాడు. తనను వ్యతిరేకిస్తున్న వారిపై విరుచుకుపడ్డాడు. అయితే అందరి ఆవేశాన్ని రాజద్రోహుల వైపు మళ్ళించి ప్రేరేపిస్తూ ‘గర్గ’ అనేవాడు రాజద్రోహులపై విరుచుకుపడ్డాడు. ‘గర్గ’ ఒక్కడే దాదాపుగా శ్రీనగరం నుంచి రాజద్రోహులను హంతకులను తరిమివేశాడు. దాంతో ఒక్క రాత్రితో ‘రడ్డ’ పాలన అంతమయింది. ఈ సందర్భంగా కల్హణుడు మరో చక్కటి శ్లోకం రాశాడు.

అడవికి నిప్పు పెట్టటం ద్వారా, పులికి ఎరను వేయటం ద్వారా  పులులను, ఇతర జంతువులను సంహరిస్తారు. కానీ వారు భూచలనాలలో చిక్కుకుని మరణిస్తారు. ఇలా అందరూ ఏదో ఓ రూపంలో మరణం అనే లోయలోకి దూకుతూనే ఉంటారు. ‘నేను చంపాను’, ‘నేను చచ్చాను’ నడుమ తేడా కొద్ది సేపే!

రాజద్రోహులనయితే తరిమేశాడు కానీ సింహాసనంపై ఎవరిని కూర్చోపెట్టాలో ‘గర్గ’కు తెలియదు. సుస్సలుడికి కబురు పంపాడు. రాజద్రోహులు పారిపోయిన తరువాత ప్రజలకు ఉచ్ఛలుడు గుర్తుకు వచ్చాడు. అప్పుడు ప్రజలు పెద్ద ఎత్తున ఉచ్ఛలుడి కోసం రోదించటం ప్రారంభించారు. రాణులిద్దరూ సహగమనం చేశారు.

ఈ సందర్భంగా కల్హణుడు రాసిన ఓ శ్లోకం ఆలోచనలు కలిగిస్తుంది.

రాణి సహగమనం చేసేందుకు చితి ఎక్కుతుంటే, కొందరు ఆమె చుట్టూ చేరి, ఆమెను ఆపుతారు. వారు ఆమెను ఆపింది సహగమనం చేయటం నుంచి కాదు. ఆమెను ఆపి, ఆమె ఒంటిపై నున్న విలువైన ఆభరణాలను తొలుచుకుని వెళ్తారు.

ఇది చదువుతుంటే ఒళ్ళు గగుర్పొడుస్తుంది!

ఎలాంటి సమాజం ఎలా అయిపోయింది!

ఇప్పుడు మనం ఇలాంటి విషయం గురించి జోకులు చదువుతూంటాం. చచ్చేవాడిని సెల్ఫీ కోసం ఆపి, ఆ తరువాత భోరుమనటం లాంటివి. కానీ ఇక్కడ కశ్మీరీ ప్రజలు, రాజు మరణించినందుకు విలపిస్తూ, రాజును హత్య చేసిన వారికి తగిన రీతిలో బుద్ధి చెప్పినవారు, చితి పైకెక్కబోతున్న వ్యక్తి నుంచి విలువైన ఆభరణాలు వొలుచుకోవటం ఎంతటి దయనీయమైన, దిగజారుడు స్థితి!

రాజవంశం నుంచి సరైన వారసుడు లేడు కాబట్టి ‘గర్గ’ను సింహాసనంపై కూర్చోమని ప్రజలు అభ్యర్థించినా, ‘గర్గ’ వినడు. చివరికి మల్లరాజు కొడుకులు, నవ మంధంలో తల దాచుకున్న సల్హణ, లోధనలను రాజవంశీయులుగా గుర్తిస్తారు. సల్హణుడిని సింహాసనంపై కూర్చోబెడతాడు గర్గ.

సల్హణుడు రాజు అవుతూనే, అంతవరకూ రాజద్రోహం చేసిన వారు, కుట్రలు చేసిన వారు, మోసగాళ్ళూ, అందరూ సల్హణుడి చుట్టూ చేరుతారు. అలా సల్హణుడు రాజయ్యాడు.

ఒక్క రాత్రి పగలులో కశ్మీరు ముగ్గురు రాజులను చూసింది. రాత్రి ఉచ్ఛలుడిని చంపి, ‘రడ్డ’ సింహాసనంపై కూర్చున్నాడు. పగలు కల్లా ప్రజలు తిరగబడి ‘రడ్డ’ను చంపి సల్హణుడిని సింహాసనంపై కూర్చోబెట్టారు. కొందరు తమ జీవితకాలంలో ఒక్కరాజు కన్నా ఎక్కువ మంది రాజులను చూడటం అరుదు. అలాంటిది ఒక్క రాత్రి పగలులో ముగ్గురు రాజులు మారటం అనూహ్యమైన విషయం. ఏ దేశానికయినా ఒక్క రాజు స్థిరంగా ఎక్కువ కాలం పాలించటం అభివృద్ధికి దారి తీస్తుంది. కానీ పూటకో రాజు మారటం అనర్థదాయకం. సమాజాన్ని అల్లకల్లోలం చేస్తుంది. సామాజిక  జీవనాన్ని దిగజారుస్తుంది. శాంత్రి భద్రతలను దెబ్బతీసి ప్రజలలో అభద్రతా భావాన్ని పెంచుతుంది.

ఒక రోజు గడిచిన తరువాత సుస్సలుడికి సోదరుడి హత్య వార్త తెలిసింది. ముందు రోదించాడు. తరువాత ఆగ్రహోదగ్రుడయ్యాడు. ‘చలో శ్రీనగర్’ అన్నాడు.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here