కశ్మీర రాజతరంగిణి-83

0
8

[box type=’note’ fontsize=’16’] కశ్మీర్ ప్రాచీన చరిత్ర గురించి అవగాహన కలిగించి, భవిష్యత్తు గురించి ఆలోచనలు కలిగించాలన్న ప్రయత్నంలో భాగంగా నీలమతపురాణం తరువాత అందిస్తున్న జోనరాజు, శ్రీవరుడు, ప్రజ్ఞాభట్టులు కల్హణుడి అడుగుజాడల్లో నడుస్తూ సంస్కృతంలో రచించిన ‘కశ్మీర రాజతరంగిణి’ అనువాదాన్ని తెలుగు పాఠకులకు అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ. [/box]

కర్తుం పదవ్యాం యోగ్యానామయోగ్యన్ప్రభవేన్న కః।
తేషాం గుణై స్తాన్యం యోక్తుం న శక్యం కారణైరపి॥
(కల్హణ రాజతరంగిణి 8, 1637)

[dropcap]అ[/dropcap]ధికారం సాధించిన జయసింహుడు కశ్మీరు వ్యవహారాలను చక్కదిద్దాలని ప్రయత్నించాడు. కొంత వరకూ ప్రజలలో విశ్వాసాన్ని కలిగించగలిగాడు. శాంతి భద్రతలనివ్వగలిగాడు. ప్రజలు రాజును గౌరవిస్తూ సంతోషంగా ఉండగలిగారు. కానీ అధికారం కోసం జరిగిన పోరు వల్ల అధికారుల మనస్సులకు కలిగిన గాయాలు కానీ భయాలు కానీ తగ్గలేదు. జయసింహుడు అధికంగా లక్ష్మకుడిపై ఆధారపడ్డాడు. లక్ష్మకుడికి వీరుడు సుజ్జిని చూస్తే భయం. అందుకని ఎలాగయినా సుజ్జిని దెబ్బతీయాలని లక్ష్మకుడు ప్రయత్నాలు ఆరంభించాడు. మరోవైపు వైపు జయసింహుడి విజయాన్ని సహించలేని వారు భిక్షుకుడిని కశ్మీరు సింహాసనాన్ని దక్కించుకోవాలని ఆహ్వానించారు.

ఇంతలో జయసింహుడు ‘లూతా’ వ్యాధిగ్రస్థుడయ్యాడు. ఇదొక రకమైన చర్మ వ్యాధి. చర్మమంతా పొక్కులు వచ్చాయి. వ్యాధి తగ్గుతుందన్న సూచనలు లేవు. సరైన రాజు లేకపోతే మళ్ళీ అధికారం కోసం పోరు కశ్మీరును అల్లకల్లోలం చేస్తుందని సుజ్జి గ్రహించాడు. అందుకని, రాజు ప్రాణాలతో ఉన్నప్పుడే రాజు కొడుకు అయిదేళ్ల పిల్లవాడిని సింహాసనంపై కూర్చోపెట్టాలని ఆలోచించాడు. ఇందువల్ల తరువాత రాజు ఎవరు అన్న ప్రశ్న ఉత్పన్నం కాదు. అధికారం కోసం పోరు జరగదు అని భావించాడు సుజ్జి.

సుజ్జి పట్ల రాజుకు ఉన్న సద్భావనను తొలగించాలని ప్రయత్నిస్తున్న లక్ష్మకుడికి అవకాశం దొరికింది. సుజ్జి రాజద్రోహానికి పాల్పడుతున్నాడని రాజును నమ్మించాడు. ఈ సందర్భంగా చెప్పుడు మాటలు వినే రాజుల బలహీనతను కల్హణుడు విమర్శిస్తాడు. ఇతర విషయాల్లో ఎంతో తెలివిగా ఉండే రాజులు కూడా దుష్టుల చెప్పుడు మాటల ప్రభావంలో పడతారు. తాము దెబ్బతింటారు. తమపై ఆధారపడి ఉన్న ప్రజల సుఖశాంతులను నాశనం చేస్తారని అంటాడు కల్హణుడు.

లక్ష్మకుడి మాటలను నమ్మిన జయసింహుడు, సుజ్జిని అధికారం నుంచి తొలగించాడు. రాజు విశ్వాసాన్ని కోల్పోయిన సుజ్జి మనసు విరిగిపోతుంది. అతను కాశీ యాత్రకు బయలుదేరుతాడు. గంగా స్నానం చేయాలని తహతహలాడతాడు. సుజ్జి దేశం వదిలిపోవటంతో లక్ష్మకుడికి పెద్ద అడ్డు తొలగి పోయినట్లవుతుంది. తనకు నమ్మకస్థులు, తనకు కావల్సిన వారిని కీలకమైన స్థానాలలో నియమిస్తాడు. సుజ్జి లాంటి శక్తిమంతుడు, సమర్థవంతుడిని తొలగించి, చేతకానివారిని, పనికిరానివారిని ఆ స్థానంలో నియమించాడు. ఈ సందర్భంగా – చేతకానివారిని ఒక ప్రాధాన్యం కల స్థాయిలో నియమించవచ్చు, అది సులభం. కానీ వారిలో సమర్థతను చేకూర్చటం మాత్రం కుదరదు అంటాడు కల్హణుడు.  గంధం పూయవలసిన తన శరీరంపై శివుడు బూడిద జల్లుకుంటాడు. కానీ ఎంత ప్రయత్నించినా బూడిదకు గంధం పరిమళాన్ని తేలేడు శివుడు. అలాగే అర్హత లేనివాడిని, చేతకానివాడిని ఉన్నత పదవిలో నియమించవచ్చు కానీ, సమర్థతను అతడికి నేర్పలేరు అంటాడు. ఇందువల్ల పాలన దెబ్బతింటుంది. సమర్థవంతుడిని కోల్పోవడం ఒక నేరం అయితే, ఆ సమర్థవంతుడు శత్రువులతో చేరితే అది తప్పించుకోలేని ప్రమాదం అవుతుంది.

రాజు ద్వారా పదవీచ్యుతుడయి గంగానది స్నానానికి వెళ్తున్న సుజ్జిని జయసింహుడికి వ్యతిరేకిగా చేయాలని జయసింహుడి శత్రువులు ప్రయత్నించారు. వారి ప్రయత్నాలు సఫలమయ్యాయి. సోమపాలుడిని కశ్మీర రాజు చేస్తానని ప్రకటించాడు సుజ్జి. కానీ జయసింహుడి దౌత్యం పని చేసి, చివరి క్షణంలో సోమపాలుడు సుజ్జి పట్ల ఉదాసీనంగా ప్రవర్తించాడు. దాంతో ఇక కశ్మీరంలో తనకు స్థానం లేదని గ్రహించిన సుజ్జి మళ్ళీ ‘గంగ’ బాట పట్టాడు. ఈసారి అతనిని భిక్షుచారుడి వైపు వారు భిక్షుకుడి వైపు తిప్పుకున్నారు. గంగలో సుస్సలుడి అస్థికలు కలిపిన తరువాత భిక్షుకుడి తరఫున పోరాడుతానని వాగ్దానం చేసి సుజ్జి గంగ వైపు ప్రయాణమయ్యాడు.

సుజ్జి తిరిగి వచ్చేవరకూ కశ్మీరుపై దాడిని వాయిదా వేయాలనుకున్నాడు భిక్షుచారుడు. కానీ డామరులకు జయసింహుడికి నడుమ భేదాభిప్రాయాలు పొడచూపాయని తెలియగానే ఆగలేకపోయాడు. ఇదే కశ్మీరుపై దాడికి సరైన సమయమని భావించాడు. కశ్మీరులో ప్రవేశించాడు. డామరులందరినీ తన వైపు తిప్పుకున్నాడు. సుజ్జి కశ్మీరుకి తిరిగి వస్తూనే సింహాసనం తనకు దక్కుతుందని కలలు కనడం ఆరంభించాడు. కానీ సుజ్జి శత్రువులతో చేతులు కలిపితే జరిగే నష్టం అర్థం చేసుకున్న జయసింహుడు దౌత్యం ద్వారా సుజ్జిని తన వైపుకు తిప్పుకున్నాడు. సుజ్జి జయసింహుడికి మద్దతు తెలపగానే భిక్షుచారుడి పైకి సైన్యాన్ని పంపాడు జయసింహుడు. ఘోరమైన యుద్ధం జరిగింది. రక్తం కారుతూ మొండేల నుండి తెగి పడే తలలు, చెట్ల నుండి రాలి పడుతున్న తేనెతుట్టెల్లాగా ఉన్నాయంటాడు కల్హణుడు.

ఘోరంగా జరుగుతున్న యుద్ధంలో శౌర్య ప్రదర్శన వల్ల విజయం సంభవించదని గ్రహించిన లక్ష్మకుడు, భిక్షుచారుడికి మద్దతుగా నిలిచిన ఖాసా రాజుకు పలురకాల ఆశలు చూపించి జయసింహుడి వైపుకు మార్చాడు. ఇలా ఒకరొకరుగా భిక్షుచారుడి సమర్థకులు జయసింహుడి వైపుకు మళ్ళారు. దాంతో భిక్షుచారుడి ఓటమి తథ్యమయింది.

ప్రాణాలు కాపాడుకునేందుకు పారిపోయే అవకాశం లభించినా, భిక్షుచారుడు వీర మరణం పొందాలనే నిశ్చయించాడు. తనను చంపేందుకు వచ్చే హంతకుల కోసం ఎదురుచూస్తూ పాచికలతో ఆడసాగాడు. తనని చంపేందుకు వచ్చిన హంతకులతో భిక్షుచారుడు, అతని అనుచరులు వీరోచితంగా పోరాడారు. చివరికి శత్రువులు విసురుతున్న రాళ్ళు శరీరాన్ని గాయాల పాలు చేయగా, బాణాలు శరీరాన్ని చీల్చి ముక్కలు చేయగా, భిక్షుచారుడు నేలకొరిగాడు. భిక్షుచారుడి శరీరం నేలపై పడగానే భూమి కంపించిందట. అయితే అదే సమయానికి అంత వరకూ భిక్షుచారుడి భయంతో కంపిస్తున్న శత్రువుల కంపన మాత్రం ఆగిపోయిందంటాడు కల్హణుడు.

భిక్షుచారుడి తలను రాజు జయసింహుడి ముందు పెట్టినప్పుడు జయసింహుడు గర్వించలేదు. సంతోషించలేదు. గొప్పలు చెప్పుకోలేదు. ‘ఉత్కర్షుడి నుంచి ఇప్పటి దాకా కశ్మీరులో ఏ ఒక్క రాజు కూడా సహజ మరణం పొందలేదు’ అని బాధ పడ్దాడు. సగౌరవంగా భిక్షుచారుడి అంత్యక్రియలు జరిపించాడు.

ఆ రోజు రాత్రి అతడికి నిద్ర పట్టలేదు. జయసింహుడి మనసులో క్షణభంగురమైన మానవ జీవితంలోని వ్యర్థత్వం తాలూకు భావనలు కలవరం కలిగించాయి.

కశ్మీరు యుద్ధాలతో అల్లకల్లోలం అవటంలో ప్రధాన పాత్ర పోషించిన భిక్షుచారుడి మరణంతో కశ్మీరులో యుద్ధం అంతరించి, శాంతి నెలకొంటుందని అందరూ ఆశించారు. ఇంకో వెయ్యేళ్ళ వరకూ కశ్మీరు ప్రశాంతంగా ఉంటుందని భావించారు. అయితే, విధి చర్యలు అనూహ్యమైనవి అంటాడు కల్హణుడు. వేడితో గడ్డిని కాలుస్తుంది, ఆ వెంటనే వర్షాన్ని పంపిస్తుంది. ఒక కష్టమైన పని సాధించానని నిట్టూర్చేలోగా, అంత కన్నా కష్టమయిన పని వచ్చి పడుతుంది. అలా ఒక్క రాత్రి కశ్మీరు ప్రజలంతా ఇక తమ కష్టాలు గట్టెక్కాయని సంతోషంగా, ప్రశాంతంగా గడిపారు. తెల్లారేసరికి నిశ్శబ్దంగా ఓ వార్తాహరుడు ఓ సందేశాన్ని మోసుకుని వచ్చాడు.  కశ్మీరుకు కొత్త కష్టాలను తెచ్చిపెట్టాడు.

భిక్షుచారుడు మరణించిన రోజే, సల్హణుడి సోదరుడు లోధనను లోహారలో రాజుగా ప్రకటించారు. అంతవరకు జైలులో ఉన్న లోధన, అతని ఐదుగురు బంధువులు జైలు నుంచి తప్పించుకుని ‘లోహార’ రాజ్యాన్ని హస్తగతం చేసుకున్నారు. వారి లక్ష్యం కశ్మీరు సింహాసనం!

వార్త తెలిసిన జయసింహుడు ఎలాంటి ప్రతిస్పందనను చూపలేదు. ఈ సందర్భంగా కల్హణుడు జయసింహుడిని పొగుడుతాడు. జయసింహుడిలా పుట్టి  ఇంకా పేరు కూడా పెట్టనప్పటి నుంచీ ఒకదాని వెంట ఒకటిగా ఇన్ని కష్టాలు అనుభవించిన రాజు మరొకడు లేడని వ్యాఖ్యానిస్తాడు. చివరికి శ్రీరామచంద్రుడు కూడా ఇన్ని కష్టాలు అనుభవించలేదంటాడు కల్హణుడు.

జయసింహుడి గొప్పతనం ఖజానా మీద, సైనికుల మీద, ఇతర భౌతిక అంశాల మీద ఆధారపడి లేదని నిరూపించాలని విధి కంకణం కట్టుకున్నదని అంటాడు కల్హణుడు. ఖజానా ఖాళీగా ఉండి, ప్రజల జీవితాలు అల్లకల్లోలంగా ఉండి, దేశమంతా అశాంతితో ఉన్న సమయంలోనే అత్యద్భుతాలు సాధించిన జయసింహుడు, పరిస్థితులన్నీ అనుకూలంగా ఉండి ఉంటే, ఇంకెన్ని అద్భుతాలు సాధించేవాడో అంటాడు కల్హణుడు.

వార్త తెలిసిన తరువాత లోహారంలోని తిరుగుబాటును అణచివేసేందుకు సైన్యాన్ని పంపాడు జయసింహుడు. వీలయినంత హింస, నష్టాలు జరగకుండా, కోట బలహీనతల ఆధారంగా విజయం సాధించమని ఆజ్ఞలు జారీ చేశాడు జయసింహుడు. లోహారను గెలుచుకొనేందుకు రిల్హణుడిని పంపాడు జయసింహుడు.

మళ్ళీ కశ్మీరులో కుట్రలు, కుతంత్రాలు ప్రారంభమయ్యాయి. పైకి జయసింహుడికి మద్దతు నిస్తున్నట్లే నటిస్తూ, రహస్యంగా తిరుగుబాటుదార్లతో మంతనాలు మొదలయ్యాయి. ఆరంభం నుంచి కశ్మీరు సింహాసనంపై కన్నేసిన సోమపాలుడు, మళ్ళీ తిరుగుబాటుదారులతో చేతులు కలిపాడు.

దౌత్యం వల్ల రాజుకు మద్దతునిచ్చిన సుజ్జి తనకు వాగ్దానం చేసిన ధనం అందకపోవటంతో జయసింహుడి శత్రువులతో చేతులు కలిపాడు. సుజ్జి పైకి సోమపాలుడికి, లోధనకు సహాయం చేస్తున్నట్టే కనిపిస్తూ తనవైన ప్రత్యేక కుట్రలు ప్రారంభించాడు.

ఒక్క రాత్రి ప్రశాంతంగా నిద్రించిన కశ్మీరు ప్రజలు మళ్ళా ఆరంభమయిన ఈ సమరాలను, కుట్రలను చూసి నిర్ఘాంతపోయారు. నిరాశలోకి దిగజారేరు. అయితే, రాజుకు వ్యతిరేకంగా పోరాడుతున్న వారిలో కూడా అభిప్రాయ భేదాలు త్వరలోనే బహిర్గతమయ్యాయి. ఎవరికివారు తమ తమ స్వార్థాల కోసం చేతులు కలిపి ఐకమత్యం ప్రదర్శించినా, అంతరంగంలోని దుష్టపుటాలోచనలు వారి పైపై ఐకమత్యాన్ని దెబ్బతీస్తాయి.

ప్రస్తుత రాజకీయాల్లో కూడా ఇలాంటి ప్రవర్తనను మనం గమనించవచ్చు. ప్రభుత్వ పక్షాన్ని ఓడించాలని ప్రతిపక్షాలన్నీ ఏకమవుతాయి. కానీ ప్రతిపక్షం లోని ప్రతి పక్షంలో ఎవరికి వారికే అధికారంపై ఆశ ఉంటుంది. దాంతో వారి నడుమ ఐకమత్యం పైపై మాటలే అవుతుంది. అంతర్గతంగా ఒకరినొకరు దెబ్బ తీసుకుంటారు. ఆనాడు కశ్మీరులో పరిస్థితి కూడా ఇలాంటిదే.

తాను అడిగిన ధనం ఇవ్వలేదని సోమపాలుడు, లోధనపై అలిగాడు. సోమపాలుడు అడిగిన ధనం ఇచ్చేకన్నా, జయసింహుడికి కప్పం చెల్లించటమే లాభసాటి అని లోధనుడు అనుకున్నాడు. ఈ రకంగా పైకి ఇద్దరూ జయసింహుడి వ్యతిరేకతను ప్రదర్శిస్తున్నా, ఎవరికి వారే జయసింహుడితో స్నేహమే లాభకరం అని అనుకోసాగారు. సోమపాలుడు యుద్ధానికి సిద్ధమవుతున్న సుజ్జిని వారించాడు. కానీ సుజ్జి మాత్రం కశ్మీరు సేనలపై దాడులను ఆపలేదు.

మంచు కురియటం వల్ల వెనక్కు మళ్ళిన కశ్మీరు సేనలపై సుజ్జి విరుచుకు పడ్డాడు. తమపై దాడి జరుగుతుందన్న ఆలోచన లేకుండా అప్రమత్తంగా ఉన్న కశ్మీరు సేనలను ఊచకోత కోశాడు సుజ్జి. కశ్మీరు సేనలు ఆయుధాలు వదలి ప్రాణాలు అరచేత పట్టుకుని పారిపోయాయి. ఈ గోలలో సుజ్జి సైనికులు లక్ష్మకుడిని బందీగా చేశారు. లక్ష్మకుడు బందీగా చిక్కటంతో కశ్మీరు తనకు లభించినంతగా సంబరపడిపోయాడు సోమపాలుడు.

మళ్ళీ కశ్మీరంలో మరణించిన వారి బంధువుల ఏడుపులు ప్రతిధ్వనించాయి. కశ్మీర ప్రజలు తిండి లేక అల్లల్లాడిపోతూ హాహాకారాలు చేస్తుంటే లోహార రాజ్యం ఐశ్వర్యంతో కళకళలాడింది.

సుజ్జి పరాక్రమ ప్రదర్శనతో కశ్మీర సేనలను తరిమికొడుతున్నా, జయసింహుడు బెదరలేదు. పరాక్రమంతో సాధించలేనిది  కుట్ర ద్వారా సాధించాలని ప్రయత్నించాడు. లోహార రాజవంశానికి చెందిన మల్లికార్జునుడిదే లోహార సింహాసనం కాబట్టి లోధనను గద్దె దించి మల్లికార్జునుడిని లోహార రాజుగా నిలపాలని రహస్యంగా కుట్రలు ప్రారంభించాడు. ఇది తెలిసి లోధన, మల్లికార్జునుడిని అతని సమర్థకులను కారాగారంలో బంధించాడు. కానీ, లోధన యుద్ధంలో నిమగ్నమై ఉన్నప్పుడు కారాగారం నుంచి తప్పించుకున్న మల్లికార్జునుడి అనుచరులు, మల్లికార్జునుడిని లోహారానికి రాజుగా ప్రకటించారు. సింహాసనంపై కూర్చుండబెట్టారు. దాంతో ఎంత హఠాత్తుగా లోధన లోహారానికి రాజయ్యాడో, అంతే హఠాత్తుగా అతడు రాజ్యాన్ని కోల్పోయాడు. సుజ్జి దయాదాక్షిణాలపై ఆధారపడ్డాడు.

లోహార రాజ్యాధికారం సంపాదించిన మల్లికార్జునుడు, లోహార రాజ్య ఖజానాను చూసి ఆశ్చర్యపోయాడు. ఆ ధనమంతా ప్రజలను పీడించి సుస్సలుడు సంపాదించినది. అంత ధనం చూసి మల్లికార్జునుడి మనసు చెదిరిపోయింది.  సుఖలాలసలో విచ్చలవిడిగా ధనం ఖర్చు పెట్టటం ఆరంభించాడు.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here