కశ్మీర రాజతరంగిణి-85

0
8

[box type=’note’ fontsize=’16’] కశ్మీర్ ప్రాచీన చరిత్ర గురించి అవగాహన కలిగించి, భవిష్యత్తు గురించి ఆలోచనలు కలిగించాలన్న ప్రయత్నంలో భాగంగా నీలమతపురాణం తరువాత అందిస్తున్న జోనరాజు, శ్రీవరుడు, ప్రజ్ఞాభట్టులు కల్హణుడి అడుగుజాడల్లో నడుస్తూ సంస్కృతంలో రచించిన ‘కశ్మీర రాజతరంగిణి’ అనువాదాన్ని తెలుగు పాఠకులకు అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ. [/box]

పరిణామ మనోజ్ఞత్వం రాజరత్నం త్వయం కృపః।
మాధుర్యాధిక్య ముత్పాకో ద్రాక్షాద్రుమ ఇలాయయౌ॥
(కల్హణ రాజతరంగిణి 8, 2386)

[dropcap]ఒ[/dropcap]కరొకరుగా హత్య చేయించటం ద్వారా, కుట్రల ద్వారా, లంచాల ద్వారా ఇవేవీ పని చేయకపోతే యుద్ధం ద్వారా జయసింహుడు శత్రువుల బెడద తొలగించుకున్నాడు. మల్లార్జునుడిని బంధించారు. జయసింహుడు శత్రువుల బెడద తొలగించుకుని రాజ్యాన్ని సుస్థిరం చేస్తున్న సమయంలో మంత్రులు మాత్రం ప్రజలను హింసించడం, దోచుకోవటం మానలేదు. ఈ సమయంలో చిత్రరథుడనే వాడు అతి క్రూరంగా, ఘోరంగా ప్రవర్తించాడు. అతడిని పదవి నుంచి తొలగించాలని బ్రాహ్మణులు ఉపవాస నిరసన ఆరంభించారు.

కశ్మీరు రాజకీయాలలో బ్రాహ్మణులు క్రియాశీలమైన పాత్ర పోషించటం గమనించవచ్చు. రాజుల ప్రవర్తనను గమనిస్తూ, వారు అన్యాయం చేసినప్పుడు హెచ్చరించటం, తప్పుదారి పట్టినప్పుడు నిరసనలు తెలపటం కనిపిస్తుంది. అయితే, రాజులను సైతం కాళ్ళ బేరానికి తమ నిరసన ద్వారా తేగల శక్తిని వారు రాజకీయాలాటలల్లో దుర్వినియోగం చేయటమూ కనిపిస్తుంది. ఏది ఏమైనా ప్రాచీన కాలంలో బ్రాహ్మణ సమూహాలు కేవలం విజ్ఞానార్జన, దేవాలయాల నిర్వహణ, పూజలు నిర్వహించటాలకు పరిమితం కాలేదనీ,  సామాజిక మనస్సాక్షిగా వ్యవహరించేవారని అర్థమవుతోంది రాజతరంగిణి ద్వారా. అనేక సందర్భాలలో బ్రాహ్మణులు ఏదో ఒక పక్షం వహించి, కత్తి పట్టుకుని యుద్ధాలలో పాల్గొనడం కూడా రాజతరంగిణిలో కనిపిస్తుంది. అంతే కాదు, కత్తి పట్టుకుని కదన రంగంలోకి దూకిన బ్రాహ్మణులను హతమార్చడంలోనూ, వేటాడి చంపటంలోనూ ఎలాంటి తేడాను చూపకపోవటం కనిపిస్తుంది. అంటే, శాస్త్రాధ్యయనం చేస్తూ, విజ్ఞానార్జనలో ఉన్నంతవరకే బ్రాహ్మణుడనే వాడికి గౌరవం అనీ, ఎప్పుడయితే, తన నిర్దుష్ట కర్తవ్యాన్ని విస్మరించి, బ్రాహ్మణులు నిర్దేశితమైన ప్రవర్తనకు వ్యతిరేకంగా వ్యవహరించారో, అప్పుడు వారితోనూ, ఇతరులతో వ్యవహరించినట్లే వ్యవహరించటమూ రాజతరంగిణిలో కనిపిస్తుంది. ఆధునిక సూసైడ్ బాంబర్లు, తీవ్రవాదులలా, బ్రాహ్మణులు వ్యవహరించిన సంఘటన కూడా రాజతరంగిణిలో కనిపిస్తుంది.

చిత్రరథుడిని రాజు పదవి నుంచి తొలగించాలని బ్రాహ్మణులు నిరసన ఆరంభించినా, రాజు వారిని పట్టించుకోలేదు. చిత్రరథుడు బ్రాహ్మణులపై పన్నులు పెంచాడు. నిరసనగా బ్రాహ్మణులు కొందరు తమ శరీరాలను అగ్నికి ఆహుతి చేశారు. ఇదంతా చూస్తున్న పృథ్వీరాజు కొడుకు విజయరాజు దేశం వదిలి వెళ్ళాలనుకున్నాడు. అతడు తన సోదరుడితో రాజు ప్రమేయం లేకుండా మంత్రులు ప్రజలను ఎలా హింసిస్తున్నారో వివరించాడు. అంతేకాదు, ప్రజలను రక్షించటం కోసం ఒక దుష్టుడిని చంపటంలో తప్పు లేదన్నాడు. అవసరమైనప్పుడు దుష్ట సంహారం చేయటంలో దోషం లేదన్నాడు. ఈ శరీరాన్ని త్యాగం చేయడం వల్ల అధిక సంఖ్యలో ప్రజలు సుఖంగా జీవించేట్టుంటే, శరీరాన్ని త్యాగం చేయటం ఉత్కృష్ట కార్యం అన్నాడు. అంతేకాదు, ప్రజలను హింసించేవాడిని ఇలా చంపటం వల్ల, ఇతరులు ప్రజలను హింసించేందుకూ, పీడించేందుకూ భయపడతారని, కాబట్టి ఇలాంటి హింసాత్మక చర్యలో తప్పు లేదనీ అన్నాడు. ఇదంతా విన్న అతని సోదరుడికి చిత్రరథుడిని చంపటం తన కర్తవ్యంగా అనిపించింది. చిత్రరథుడిని హత్య చేయాలని నిశ్చయించుకున్నాడు.

విజయరాజు తన సోదరుడితో జరిపిన చర్చ ఆధునిక హింసాత్మక సిద్ధాంతాలను పోలి ఉండటం గమనార్హం. అధికుల క్షేమం కోసం ఒకడిని చంపటం, ఇతరులు దుశ్చర్యలు చేయాలంటే భయపడేట్టు చేయటం వంటివి సమకాలీన సమాజంలో పలువురు ప్రస్తావించే అంశాలు. హింస జరపటం వల్ల ప్రభుత్వాలను బెదిరించి కోరికలు తీర్చుకోవటం, ఆధునిక సమాజంలో తీవ్రవాదంగా పరిగణిస్తున్నాం. రాజతరంగిణిలో విజయరాజు   చిత్రరథుడిని చంపటం ద్వారా, ప్రజలకు అత్యాచారాల నుంచి విముక్తి సాధించాలని ప్రయత్నించాడు. అతనికి వేరే కోరికలు లేవు. అంతేకాదు, చిత్రరథుడిని చంపి ప్రాణలు కాపాడుకోవాలనీ ప్రయత్నించలేదు. ఇది కూడా రూపాంతరం చెందుతున్న భారతీయ సమాజాన్ని ప్రతిబింబించే అంశం. అంతవరకూ దుష్టులయిన వారిని తొలగించే పద్ధతి వేరు. హత్య చేయడం అన్నది కొత్త పద్ధతి. కిన్నరుడు తన కూతురిపై దుష్టపు దృక్కులు ప్రసరించినప్పుడు నాగు,  రాజుతో సహా కశ్మీరాన్ని నాశనం చేశాడు. ద్వంద్వ యుద్ధంలో దుష్టపు రాజును చంపటం ఉంది. కానీ ఇలా దాడి చేసి చంపటం అన్నది కశ్మీరంలోకి దేశంలోని ఇతర ప్రాంతాల నుంచీ వీస్తున్న మార్పు పవనాల ప్రభావాన్ని సూచిస్తుంది.

తురుష్కుల దాడులలో భారతీయ సమాజం అల్లకల్లోలమవుతోంది. దాడులకు తట్టుకోలేక, తురుష్కులు జరుపుతున్న అత్యాచారాలను సహించలేక ప్రజలు అల్లల్లాడిపోయారు. ఆ సమయంలో దుష్ట తురుష్క నాయకులను దొంగతనంగా, దాడులు చేసి, వారు అప్రమత్తంగా లేనప్పుడు దాడి చేసి చంపటం వంటివి దేశంలో పలు ప్రాంతాలలో సాధారణం అయ్యాయి ఆ కాలంలో. పలువురు సామాజిక అధ్యయనాలలో ఒక గమ్మత్తయిన విషయం ప్రస్తావిస్తారు.

ఆ కాలంలో తురుష్కులు గ్రామాలపై దాడులు చేసి అనేక అకృత్యాలు చేసేవారు. ప్రజలను హింసించేవారు. వారి నుంచి ప్రాణాలు తప్పించుకుని పారిపోయినవారు ప్రతీకారాగ్నితో రగిలిపోయేవారు. తురుష్కులతో బహిరంగంగా దాడులలో గెలిచే శక్తి లేకపోవటంతో, వారు ఒంటరిగా దొరకటం కోసం ఎదురుచూసేవారు. ముఖ్యంగా రాత్రుళ్ళు బహిర్భూమికి వెళ్ళేవారిపై దాడులు చేసి చంపేవారు. ఇది తురుష్కులలో కలవరం కలిగించింది. ఫలితంగా, వారు రాత్రుళ్ళు ఎంత తీవ్రమైన అవసరం పడినా ఒంటరిగా బయటికి వెళ్ళేందుకు భయపడ్డారు. ఈ పరిస్థితి నుంచి తప్పించుకునేందుకు వారి బహిర్భూములను గృహావరణల్లోకి తెచ్చారు. ఇంటి ఆవరణలో విసర్జనశాలలు ఏర్పాటు చేశారు. అయితే ఇక్కడో సమస్య వచ్చింది. ఇలా ఏర్పాటు అయిన విసర్జనశాలలను శుభ్రం చేసేవారు అవసరమయ్యారు. బందీలుగా చిక్కి మతం మారేందుకు ఇష్టపడని వారితో బలవంతంగా వీటిని శుభ్రం చేయించారు. అలా, భారతీయ సమాజంలో మలాన్ని శుభ్రం చేసేవారు ఏర్పడ్డారని కొందరు తీర్మానించారు. అంతకు ముందు ఇలా మలం శుభ్రం చేసేందుకు ప్రత్యేకంగా వ్యక్తుల అవసరం పడలేదు. ఎందుకంటే, శుచీ శుభ్రతలకు అధికంగా ప్రాధాన్యం ఇచ్చే  భారతీయ వ్యవస్థలో ఊరికి దూరంగానో, ప్రవహించే నీటి వద్దనో బహిర్భూములుండేవి. వాటి పేరే ‘బహిర్భూమి’. ఇంట్లో ఉండే వీలే లేదు. ఈ రకంగా విదేశీ దండయాత్రల వల్ల భారతీయ సమాజంలో సంభవించిన మార్పులను గురించి ఎంతో పరిశోధన చేయాల్సి ఉంది. అలాంటి మరో మార్పు, దొంగ దాడులు చేయటం, హత్యలు చేయటం. అంత వరకూ భారతీయ సమాజంలో యుద్ధం జరిపేందుకు పద్ధతులు ఉండేవి. నియమాలు ఉండేవి. కానీ విదేశీ మూకలకు ఇలాంటి పద్ధతులు, నియమాలు లేవు. కాబట్టి, వారిని ఎదుర్కునేందుకు కూడా కొత్త పద్ధతులను అవలంబించాల్సి వచ్చింది. ఫలితంగా అప్రమత్తంగా లేనప్పుడు దాడి చేసి చంపటం ఆరంభమయింది. ఈ మార్పు మనం చరిత్రలో రాణా ప్రతాప్ యుద్ధ పద్ధతిని, శివాజీ అవలంబించిన పద్ధతులని పోల్చి అధ్యయనం చేస్తే స్పష్టంగా తెలుస్తుంది. రాజతరంగిణిలో చిత్రరథుడి హత్య సంఘటన కూడా ఇలాంటి మార్పును ప్రతిబింబిస్తుంది.

చిత్రరథుడిని చంపాలని నిశ్చయించుకున్న బ్రాహ్మణుడు అతడిని వెంబడించాడు. హత్య చేసే అవకాశం కోసం ఎదురుచూశాడు. అయితే, చిత్రరథుడు ఎప్పుడూ సైన్యంతో ఉండేవాడు. అతడి చుట్టూ రక్షణ కవచం ఉండేది. విజయరాజు ఇదంతా గమనించాడు. తాను ప్రాణాన్ని త్యాగం చేయక తప్పదని గ్రహించాడు. ఒక రోజు చిత్రరథుడి చుట్టూ అధికారులుండగా, అతడిపైకి దూకి కత్తితో తలపై గాయం చేశాడు విజయరాజు. చిత్రరథుడిపై దాడి జరగగానే, అంతవరకూ అతడి చుట్టూ ఉన్నవారంతా ప్రాణాలు అరచేత పట్టుకుని పారిపోయారు. చిత్రరథుడు వెంటనే చావలేదు కానీ గాయంతో ఆరేడు నెలలు నరకం అనుభవించి మరణించాడు. రాజభటులు హంతకుడి కోసం వెతుకుతుంటే ‘నేనే హత్య చేశాన’ని చెప్పి రాజభటులతో పోరాడుతూ వీరోచిత మరణం పొందాడు విజయరాజు. మరణించిన అతని వద్ద ‘పరిత్రాణాయా సాధూనాం, వినాశాయ చ దుష్కృతాం/ ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే’ అన్న భగవద్గీత శ్లోకం దొరికింది. అంటే, ధర్మరక్షణ కోసం తానీ హింసకు పాల్పడ్డానని, అది సాత్విక హింస అవుతుందనీ అతని భావం అన్నమాట. భగవద్గీత నుంచి ప్రేరణ పొందాడు విజయరాజు. దీన్నిబట్టి చూస్తే, ఇప్పుడు పలువురు ప్రజలను నమ్మించాలని చూస్తున్నట్టు, బ్రాహ్మణులు ప్రజలను మభ్యపెట్టి, మోసం చేసి పబ్బం గడుపుకుని బొర్రలు పెంచుకుంటూ జీవించేవారు కాదని తెలుస్తుంది. వారు సామాజిక కార్యకలాపలలో చురుకుగా పాల్గొంటూ, అవసరమైనప్పుడు కత్తి పట్టుకునేవారనీ తెలుస్తుంది. అయితే, వారు తమ నిర్దిష్ట కర్తవ్యాలని కాదని మరో కర్తవ్యం స్వీకరించేందుకు ‘ధర్మ సంస్థాపన’ అన్నది మాత్రమే ప్రేరణ అనీ అర్థమవుతుంది.

చిత్రరథుడిపై దాడిని కశ్మీర రాజు చేయించాడన్న అపోహ సర్వత్రా వ్యాపించింది. ఈ పరిస్థితిలో కశ్మీరుపై దాడి చేశాడు కోష్టకుడు. మరోవైపు నుంచి మల్లార్జునుడు మళ్ళీ తన రాజ్యం లాక్కోవాలని యుద్ధానికి వచ్చాడు. లోధనుడు మరో వైపు నుంచి దాడి చేశాడు. ఈ రకంగా మళ్ళీ కశ్మీరు యుద్ధాలతో అల్లకల్లోలం అవుతుందని ప్రజలు భయపడ్డారు. ఎడతెగని యుద్ధాలతో జనజీవితం అల్లకల్లోలమయిపోయింది. శత్రువుల సైన్యం పెద్ద ఎత్తున సరిహద్దుల వద్ద మోహరిస్తుండటం చూసిన ప్రజలు చలికి గడ్డకట్టుకుపోయినట్టు భయంతో గడ్డకట్టుకుపోయారు. అయితే అనుకున్నంత భయంకరంగా సాగలేదు ఈసారి యుద్ధం. మల్లార్జునుడు రాజ సైన్యం చేతికి చిక్కాడు. మల్లార్జునుడిని రాజధానికి పట్టుకు వస్తుంటే ప్రజలు మల్లార్జునుడిపై సానుభూతి కురిపించి, రాజును దూషించారు. ఈ సందర్భంగా కల్హణుడు ప్రజల ప్రవర్తనపై వ్యాఖ్యానిస్తాడు.

కౌరవులు ద్రౌపది వస్త్రాపహరణానికి ప్రయత్నించినప్పుడు కౌరవులను దూషించిన ప్రజలే, భీముడు దుర్యోధనుడిని చంపినప్పుడు భీముడిని దూషించారు. ఏదైనా విషయం లోతుల్లోకి వెళ్ళకుండ పైపైనే తెలుసుకుని,  అప్పటి భావాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకుని ఆవేశకావేశాలు ప్రదర్శించేవారు మామూలు ప్రజలు అంటాడు కల్హణుడు. కానీ పాలకులు, ఇలా తాత్కాలిక ఆవేశకావేశాలకు గురికాకుండా, ముందు వెనుకలు ఆలోచించి, విషయాన్ని లోతుగా విశ్లేషించి, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని శాంతంగా నిర్ణయాలు తీసుకోవాలంటాడు.

కల్హణుడి వ్యాఖ్యలు వింటే సమాకాలీన సమాజం గుర్తుకువస్తుంది. ప్రజల్లో తాత్కాలిక ఆవేశాలు రెచ్చగొట్టినవాడే నాయకుడిగా చలామణీ అవటం చూస్తున్నాం. అందుకే ఒక విషయం గురించి లోతుపాతులు తెలుసుకుని స్పందించే బదులు, ప్రతి ఒక్కరూ ఏది బడితే అది, ఎలా బడితే అలా, నోటికి ఎంత వస్తే అంత, ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యానించటం, రెచ్చగొట్టటం పైనే దృష్టి పెడుతున్నారు నాయకులు అన్నవారు. మీడియా సైతం, ఒక్క క్షణం ఆగి ఆలోచించకుండా, ఎలా ఆవేశాలు రెచ్చగొట్టాలా అన్నట్టే ప్రవర్తిస్తోంది. మేధావులు సైతం ఇందుకు భిన్నం కాదు. ఈ రకంగా సమాజానికి దిశానిర్దేశం చేసి, మంచి చెడులు చెప్పాల్సిన ప్రతి ఒక్కరూ తాత్కాలిక లాభాల లెక్కలు వేసుకుని, ఉచితానుచితాలను విడచి, సమాజంలో విద్వేష బీజాలు నాటుతుంటే, అలాంటి సమాజం భవిష్యత్తును ఊహించాలంటేనే భయం వేస్తుంది. తన వ్యాఖ్యల ద్వారా కల్హణుడు తాత్కాలిక ఆవేశకావేశాలకు లొంగే సామాన్యుడికి, ఆలోచించి చర్యలు తీసుకునే పాలకులకు నడుమ తేడా చూపిస్తున్నాడు. ఈ తేడా చెరిగిపోయిననాడు సామాన్యుడూ, పాలకుడూ ఒకటే అవుతారు. సమాజం అల్లకల్లోలమవుతుంది.

రాజు తనను బందిఖానాలో వేయాలనుకుంటున్నట్టు గ్రహించిన కోష్టకుడు తిరుగుబాటు చేశాడు. తిరుగుబాటును అణచటంలో కులరాజు వీరోచితమైన పోరాటం చేశాడు. కోష్టకుడు దేశం వదిలి పారిపోతాడు. ఈ రకంగా ఎన్నడూ విశ్వాసాన్ని కోల్పోకుండా, రాజ్యాన్ని రక్షిస్తూ, పోరాటాలు చేస్తున్న జయసింహుడు చివరికి శత్రువు అన్నవాడు లేకుండా చేసుకున్నాడు. ప్రజలకు చక్కటి పాలనను అందించాడు. మందిరాలు నిర్మించాడు. అసంపూర్తిగా ఉన్న మందిరాల నిర్మాణాలు పూర్తి చేశాడు. తనకు సహాయం చేసిన శృంగారకుడిని ప్రధానమంత్రిగా నియమించాడు.

ప్రజలంతా జయసింహుడిని దివ్యపురుషుడిగా భావించారు. నిరంతరం శత్రువులతో పోరాటాలు జరిపి ఒకరొకరుగా శత్రువులను మట్టుపెట్టిన జయసింహుడికి మాయాజాలం తెలుసునని నమ్మసాగారు. నిత్యం రాచకార్యాలు నిర్వహిస్తూనే శివపూజ చేసేవాడు. వేద పండితులతో చర్చలు చేసేవాడు. సంగీత, సాహిత్య, ధార్మిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలను ప్రోత్సహించాడు. యుద్ధం వల్ల నాశనం అయిన గ్రామాలను సర్వసుందరంగా సస్యశ్యామలంగా తీర్చిదిద్దాడు. దేశం నలుమూలల నుంచి శిల్పులను రప్పించి అందమైన శిల్పాలతో మందిరాలను గ్రామాలలో నిర్మింపజేశాడు.

ఓ వైపు ధార్మికమైన కార్యాలు నిర్వహిస్తూనే, ఎక్కడెక్కడ ఎవరెవరు విప్లవాలు, తిరుగుబాట్లకు ప్రయత్నిస్తున్నారో, వారిని చంపిస్తూ, అడ్డు తొలగించుకుంటూ ముందుకు సాగాడు జయసింహుడు. ఇన్ని రకాల సత్కార్యాలు చేస్తూ, సద్గుణాలున్న జయసింహుడిలో ఓ ప్రధాన లోపం ఉండి. పాలకులలో ఉండకూడని లోపం అది. కానీ అధికారులలో ఉండే లోపం అది.

జయసింహుడు చెప్పుడు మాటలు వింటాడు. సేవకులు, సహాయకులు ఇచ్చే సలహాలు, సూచనలను పాటిస్తాడు. వారు చెప్పినదాన్నే సత్యంగా భావిస్తాడు తప్ప, విషయాల లోతుల్లోకి వెళ్ళి సత్యాసత్య విచారణ చేయడు. ఇదే సమయానికి దరద పాలకులు శృంగారకుడితో ఒప్పందాలు చేసుకున్నారు. లోహారంపై ఆశతో లోధనుడు, ఇతరులను రెచ్చగొడుతూ కశ్మీరుపై దాడికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. దరదలు, డామరులు కలిసి విప్లవం లేవదీశారు. వారికి లోధనుడు తోడయ్యాడు. వారిపైకి రాజు సైన్యాన్ని పంపాడు. వారు యుద్ధంలో ఓడిపోయారు కానీ, మళ్ళీ గ్రామాలను పరశురామ ప్రీతి చేయటం ఆరంభించారు.

కొన్ని నెలల తరువాత మళ్ళీ జయసింహుడి శత్రువులంతా ఏకమయ్యారు. మళ్ళీ యుద్ధం మొదలయింది. ఈసారి యుద్ధంలో లోధనుడు జయసింహుడి సైన్యానికి బందీగా చిక్కాడు. మిగతావారంతా ఒకరొకరుగా జయసింహుడికి లొంగిపోయారు. జయసింహుడి ప్రతాపంలా  హిమాలయాలు కనిపిస్తున్నాయని కల్హణుడు వ్యాఖ్యానిస్తాడీ సందర్భంలో. ఒక్క భోజుడు మాత్రం జయసింహుడికి చిక్కలేదు. అష్టకష్టాలు పడి, చావు తప్పి కన్ను లొట్టపోయి, ప్రాణాలు అరచేత పట్టుకుని భోజుడు దరద రాజ్యం చేరాడు. అక్కడి రాజు రాజవదనుడితో స్నేహం చేశాడు. డామరులు మళ్ళీ కశ్మీరులో ప్రజలపై దాడులు చేయటం ఆరంభించారు. ఈ అల్లకల్లోలం చూస్తూ మళ్ళీ బ్రాహ్మణులు విప్లవం ఆరంభించారు. ఈసారి వారు జయసింహుడి నుంచి కశ్మీరానికి విముక్తి లభించాలని విప్లవం తెచ్చారు. విజయేశ్వరం విప్లవానికి కేంద్రం అయింది. బ్రాహ్మణులను శాంతింపజేయటానికి జయసింహుడు విజయేశ్వరం బయలుదేరాడు.

(అతి త్వరలో తెలుగులో తొలిసారిగా జోనరాజు రాజతరంగిణి).

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here