కాసిని కాళిదాసు చాటువులు

1
8

[box type=’note’ fontsize=’16’] “నా దృష్టిలో కాళిదాసు సంజీవని. ఒక ప్రవాహంగా ఆయన ఒక్కడే. ఇక చాటువుల విషయానికి వస్తే ఇవి ఆశువుగా చెప్పినవి కావడం చేతనూ, కాళిదాసన్న పేరుతో మాత్రమే ఉండటం చేతనూ ఇవి చెప్పింది ఏ కాళిదాసు? అని ప్రశ్నవేసుకోవడం మానేసి వాటిని కావ్యదృష్టితో చూపించే ప్రయత్నమే నేను చేయగలిగింది” అంటున్నారు పరిమి శ్రీరామనాథ్ ఈ వ్యాసంలో. [/box]

                  కశ్చిద్వాచం రచయితుమలం శ్రోతుమేవాపరస్తాం

                  కల్యాణీ తే మతిరుభయథా విస్మయం న స్తనోతి।

                  నహ్యేకస్మిన్నతిశయవతాం సన్నిపాతో గుణానాం

                  ఏకః సూతే కనకముపలస్తత్పరీక్షాక్షమోఽన్యః॥

ఇది నవీనప్రపంచం. నవీనతరజీవనం. వసుంధర  జీవజాలం కంటే మానవమస్తిష్కాన్నే భారంగా భావిస్తోన్న కాలం. సహజంగా ప్రకృతి నియమమైన పరివర్తనాన్ని గుర్తిస్తూ, దానికి అనుగుణంగా జీవితాన్ని కొనసాగించాల్సింది పోయి, ఆ పరివర్తనని  తన చేతుల్లోకి తీసుకుని, దానినే తన ఉనికికి విజయచిహ్నంగా భావిస్తూ మానవుడు ప్రకృతికి ఊపిరాడనివ్వకుండా చేస్తున్నాడు. ఆ క్రమంలో కొద్ది ఉక్కపోత తనకి సోకినా తాళలేకపోతున్నాడు.

ఈ ‘మార్పు’ సాంకేతికంగా సౌలభ్యాలని కలిగించిన మాట వాస్తవమేమో కానీ, మానవ మస్తిష్కాన్ని ఒక ఒప్పుగా కమ్ముకుని అవసరానికి మించి జీవనంలోకి దూసుకునివచ్చి మనిషికున్న గాఢమైన అనుభవాలని ముక్కలు చేసింది. దరిమిలా ఈ విధానం అనుభూతుల నిడివిని నిలువునా కోసివేసింది. ఆనందాన్ని కానీ, ప్రేమని కానీ  గట్టిగా హత్తుకుని నిలబడే స్థాయి నుండి మనిషి మనస్సు జారిపోయింది. జీవితంలో ఎక్కువకాలం ఉండే సంతోషాల వైపు ప్రయత్నమే కనుమరుగయ్యింది. దీని ప్రభావం మన కుటుంబాల పైన, నడవడికలపైనా పడింది. పరిశోధన, ఆవిష్కరణలలోనే ఉండాల్సిన ‘డిస్రప్షన్’ ని మానవుడు పిరికిగా తనలోపలికి లాగుకొన్నాడు. ప్రస్తుతానుభవంలో ఉండలేక, మార్పు వైపుకి ఆత్రుతగా కుత్తుక చాస్తున్నాడు. నిలకడ లేని కోరిక!  ప్రతీక్షణమూ ఏవో కొత్తదనపు ధగధగలు కంటిముందు కనపడి, ఉన్న స్థితిని తేలిక చేస్తున్నాయి. ఈ విచ్ఛిత్తి జీవితాన్ని పోగులు పెడుతోంది. సృష్టి జరిగినా, స్థితిలేక అస్తవ్యస్తమై, ప్రతిరోజూ ఒక మనోప్రళయం! రామాయణంలోని సుందరకాండలో హనుమంతుడు అశోకవనాన్ని నాశనం చేస్తున్నాడన్న వార్త విన్న రావణాసురుడి నేత్రాలలోనుంచి కోపంతో కన్నీళ్లు కారాయట. క్రోధం ఆశించకూడనిదే అయినా, కళ్లనీళ్లు తెప్పించినదంటే ఆ అనుభూతి ఎంత బలీయమైనది! కోపం సంగతి అలా ఉంచితే, మన సంతోషానికైనా దివ్యత్వం ఉందా?! నేటి మానవునికి బలవంతంగా పెదవులని సాగదీసి, మనస్సులోకి నవ్వుని చొప్పించుకోవాలని తాపత్రయం. ఎంతటి దుర్దశ!

‘క్షణే క్షణే యన్నవతాముపైతి తదేవ రూపం రమణీయతాయాః’ అంటాడు మాఘమహాకవి తన కావ్యంలో. ప్రతీక్షణమూ కొత్తరంగు పులుముకోవడమే రమణీయత లక్షణమట. ఆ రమణీయత యేదో అన్ని కళ్లకీ ఒకే రీతిగా కనిపించరాదా? ఒక గ్యాలరీలో ఒక చిత్రపటం ఉందనుకుంటే, దానిని చూసిన ఒక చిత్రకారుడి దృష్టి మూలమూలలలోనూ వాడబడిన వర్ణమిశ్రమాల వివరాల మీద పడుతుంది. ఒక వ్యాపారవేత్త చూపు దానికి కట్టగలిగే లెక్కల మీదకి పోతుంది. అక్కడ పనిచేసేవాడికి అమరిక, శుభ్రత ఇత్యాదుల మీదే ధ్యాస. అదే ఒక భావకుడు ఆ చిత్రపటాన్ని చూశాడా, ఆతని కళ్లు విచ్చుకుంటాయి. తెలివి మొద్దుబారుతుంది. మాట మూగబోతుంది. కదలిక జ్ఞప్తి పోతుంది. జీవితపు బాధలు తెరమరుగవుతాయి. సమాజంలోని స్థాయి పాతాళానికి పడిపోతుంది. శరీరం ఆపాదచూడమూ ఆ దృశ్యంలో తన్మయత్వాన్ని పొందుతుంది. మనస్సు యేవేవో ఆనందలోకాలని కళ్లముందుకి గుంజుకుంటుంది. ఈ భావకుడే ప్రత్యఙ్ముఖుడైన ‘కవి’ అని నా ఊహ. అతనికి మనసే కాగితం. చూపే లేఖిని. జీవితమే కావ్యం. వాచికమైన కవులు శబ్దార్ధాలలోనూ, కీర్తీ పటాటోపాలలోనూ పారాడుతుంటే, భావకుడు ఏదో ఒక వస్తువులో తనని తాను మరచిపోతాడు. అతని రిరంస తీరేది కాదు. భాషకీ, శాస్త్రసిద్ధాంతాలకీ అతడు అతీతం. ఒకవేళ అటువంటి భావకుడే గనుక విద్యావంతుడై తనని తాను వ్యక్తీకరించుకొన్నాడా, ఆ పలుకు శాశ్వతమైన ప్రబంధమవుతుంది. కవిత్వమనే వస్తువు అక్కడ అవతరిస్తుంది. లాక్షణికులు, శాస్త్రజ్ఞులు చెప్పిన సూత్రాలన్నీ అందులో ఎక్కడికక్కడ అమరిపోతాయి. అలంకారాలు వాటంతట అవే వరుసకడతాయి. పాత్రౌచిత్యాలు తలలు వంచుతాయి. అటువంటి కవుల లెక్కలో చిటికెనవేలు మీదకి ఎక్కి దిగనన్నవాడు కాళిదాసు.

కవి అని పేరుంచుకున్న ప్రతివ్యక్తీ చెప్పినది కవిత్వమని అనలేం. దానికీ పరీక్ష కావాలి. ఒక సహృదయుడి అనుభూతితో ఆ కవిత సరిపోలాలి. ఆ విషయాన్నే పై చాటువులో చెప్పాడు కాళిదాసు. ఏ విధంగా అయితే బంగారం పుట్టుకకి ఒక రాయి, పరీక్షకి ఇంకొక రాయి ఉన్నాయో అలాగే పదాలని వ్రాయడానికి ఒకడు చాలు. కానీ వాటి అర్హత చెప్పడానికి ఇంకొకడు కావాలి. ఆ ఇంకొకడు రసజ్ఞుడై ఉండాలి. ఒక కవి కవిత్వం చెబుతూండగా ఒక శ్రోత విన్నప్పుడు అక్కడ సంభవించేది శబ్దాల ప్రసారం కాదు. అనుభూతి ప్రసారం. పదాలు అర్ధమయినట్లు అనుభూతి అర్ధమవడానికి కొలమానమేమైనా ఉందా? అర్ధాన్ని విడమర్చినట్లు అనుభవాన్ని విడమర్చడం సాధ్యమయ్యే పని కాదు కదా! దానికి ఎవరి హృదయమే వారికి ప్రమాణం. ‘మానవజీవితం కష్టనష్టాల సుడిగుండాలతో నిండి ఉంటుంది’ అని ఒకరంటే, అది విన్నవాడికి పూర్తిగా అవగతమవడానికి జీవితంలోని ఆటుపోట్లూ, నది లేదా సముద్రంలోని సుడిగుండాలూ రెండూ తెలిసి ఉండాలి.  ఆ రెండు అనుభవాలూ అతని ఊహలో గట్టిగా ముద్రించుకుపోయి ఉండాలి. అది లేనివాడికి కవిత్వాన్ని చెప్పినా నోరు మర లాగా కదులుతూ యేవో పదాలు గాలిలో తేలియాడుతాయే తప్ప మనసుకి అంటవు. అందుచేతనే ‘ ఇతరకర్మఫలాని యదృచ్ఛయా విలిఖ తాని సహే చతురాననఅరసికేషు కవిత్వ నివేదనం శిరసి మా లిఖ మా లిఖ మా లిఖ అని ఈ కవే బ్రహ్మదేవుడితో మొర పెట్టుకొన్నాడు. ఆ ప్రార్ధనలోని అంతరార్ధం రసికత్వం లేనివాడు కవిత్వం వింటే తనని కసురుతాడనో, అవతలకి పొమ్మని గెంటివేస్తాడనో కాదు. అసలు కవిత్వపు ప్రయోజనమే సిద్ధించదని.

 కాళిదాసు అన్న మనిషి భారతజాతిమీద చూపించిన ప్రభావం అంతా ఇంతా కాదు. వాల్మీకి కావ్యమనే ప్రక్రియకి శ్రీకారం చుట్టి, దివ్యత్వమున్న మనుషులని చూపిస్తే, మలినంలేని శుభ్రమైన మానవప్రవృత్తులలోని దివ్యత్వాన్ని కాళిదాసు తన కావ్యాల ద్వారా చూపించాడు. ఈయన కవిత సాధారణంగా కవులు చేప్పే కవిత్వపు స్థాయిని దాటి సంస్కృతిలోనే ఒక అంతర్భాగం అయ్యే స్థాయికి చేరుకుంది.

విద్య అనేది మనిషి ఎదుగుదలకి తోడుపడాలి. అటువంటి విద్య మనకి చెప్పిన విధానాన్ని బట్టి వాఙ్మయాన్ని మూడు రకాలుగా విడగొట్టారు మన పెద్దలు – వేదము, పురాణము, కావ్యము అని. వీటి ప్రయోజనం ఉద్ధరణే అయినా చెప్పే తీరు వేరు. వేదం యొక్క మాట ప్రభుసమ్మితం. అంటే ఒక రాజు ప్రజలను శాసించే విధంగా ఉంటుంది. పురాణం ఒక మిత్రుడు చెప్పినట్లు కథలతో, చరిత్రతో ఉదాహరణలు చూపిస్తూ స్నేహసమ్మితంగా బోధ చేస్తే, కావ్యం ఒక స్త్రీ పరోక్షమైన విధంగా నెపం ఇంకొకరిమీద పెట్టి చెప్పినట్లు కాంతాసమ్మితంగా మనతో మాట్లాడుతుంది. ఈ మూడూ రావడానికి మానవ ప్రవృత్తిలోని వైరుధ్యమే కారణం. ఎవరి అహంకారం వారి దగ్గర పుష్కలంగా ఉన్నపుడు వేదపురాణాల ప్రభావం కన్నా కావ్యపు ముద్ర ఎక్కువగా ఉంటుంది. వేదమనే లక్ష్యం వైపుకి పురాణాల ద్వారా వ్యాసపరాశరాదులు మార్గాన్ని నిర్మిస్తే, ఆ మార్గం లోని గోతులూ గొప్పులూ, రాళ్లూ రప్పలూ ఏరి, తిన్ననైన రహదారిని కావ్యం రూపంలో వాల్మీకి నిర్మించాడు. ఆ మార్గంపైన తన కవిత్వమనే పూబాట ని కాళిదాసు ఏర్పరిచాడు. ఆ మార్గాన్ని తొక్కే ప్రతీ ఒక్కడూ భారతీయవాఙ్మయనిర్మాతలకి ఋణపడేవాడే.

పండితలోకంలో కాళిదాసుని పొగడనివాడు లేడు. ఆయన కవిత్వపు గాలి సోకి మనోహరంగా స్తుతి చేసిన వారు చాలా మంది ఉన్నారు.  వారిలో దండి ఉన్నాడు, బాణుడున్నాడు. రాజశేఖరుడు, శోడ్ఢలుడు మొదలుగా మల్లినాథసూరి వరకూ ఇబ్బడిముబ్బడిగా ఉన్నారు. ఈ పొగడ్తలు చాలా ప్రసిద్ధి చెందినవి. వాటిలో ఉదాహరణకు ఒకటి చూపుతాను –

కాళిదాసకవితా నవం వయః మాహిషం దధి సశర్కరం పయః।

ఏణమాంసమబలా చ కోమలా సంభవంతు మమ జన్మ జన్మని॥

ఒకడంటున్నాడు, ‘కాళిదాసు కవిత, మంచి యవ్వనం, గేదె పెరుగు, పంచదార పాలు, జింక మాంసం, కోమలమైన స్త్రీ – ఇవి నాకు ప్రతీ జన్మలోనూ కలుగుగాక’ అని.  మహాకవులైన దండి, రాజశేఖరుడు చేసిన పొగడ్తలు దీని ముందు ఎందుకూ కొరగావు. దానికి కారణం ఈ శ్లోకం చెప్పిన వాడు పండితుడో, విద్యావంతుడో కాదు. ఫక్తు సామాన్యుడు. లౌకికుడు. సగటు మనిషి. ఆశాజీవి. అంటే కాళిదాసు కవితాకన్యక పుస్తకాలలోనుంచి మనిషి జీవితంలోకి వచ్చింది. బాధలబండరాళ్లని మోస్తూ, జీవితంమీద, ప్రపంచం మీద వెగటుతో బాధ భరించడమే శరణ్యమన్న మనిషి గాయాల వీపుపైన సుతారంగా వెన్న రాసింది. ఒడిలోకి తలని తీసుకుని ప్రేమగా నిమిరింది. ధైర్యవచనాలు చెప్పి జీవితపు కొమ్మకి ఆశాలతని అంటుకట్టింది. ఎక్కడో సుదూరలోకాల్లోకి ఐపూపత్తా లేకుండా దొర్లిపోయిన కావ్యానందాన్ని భూమిమీదకి పట్టుకొచ్చింది.  ఈ మహోపకారానికి ఎంతని విలువ కట్టగలం?

కాళిదాసు మీద సుప్రసిద్ధమైన ఒక లోకోక్తి –  ఉపమా కాళిదాసస్య అని. ఇది లాక్షణికమైన పొగడ్త కాదు. ఆ మహాకవి వేరే శబ్ద, అర్ధ అలంకారాలను వాడలేదా? ఆ ప్రయోగాలలో ఔన్నత్యం, ఔచిత్యం దెబ్బతిన్నాయా? లేదే! పోలిక కాళిదాసుకధీన అనడంలో ఆతని కవిత యొక్క విలక్షణత్వం ఉంది. ఆ మహానుభావుడి వ్యక్తిత్వం, సమర్ధతా ఉన్నాయి. సాధారణంగా వచనానికీ, కవిత్వానికీ కొన్ని తేడాలున్నాయి. అందులో ప్రధానమైనది సంక్షేపత్వం. వచనంలో వందమాటలలో చెప్పగలిగిన దానిని కవి కేవలం పదిమాటలలో భావానికి నష్టం కలుగకుండా చెబుతాడు. రెండు, సాధారణంగా వచనరచన లక్షణం వాస్తవాన్ని ప్రతిపాదించేదిగా ఉంటే, కవిత్వపు లక్ష్యం రమణీయమైన ఊహ చేయడంలోనో, లేదా కంటికి కనపడని ఒక అందమైన భావాన్ని బయటపెట్టడంలోనో ఉంటుంది. ఈ ఊహాజనితమైన భావాలు మామూలుగా మింగుడుపడని విషయాలని కరక్కాయ రసాన్ని తేనెతో కలిపి ఇచ్చినట్లు తీయగా అందిస్తాయి. ఈ తేనెని రసమనీ, అలంకారమనీ, ధ్వని అనీ, పాకమనీ రకరకాల పేర్లతో పిలిచారు మన పెద్దలు. అసలు ఆ తీపి ఏమిటి అన్న ప్రశ్నకి ఒకే ఒక సమాధానం లేదు. పైగా ఇన్నిన్ని పేర్లు. ఆ పేర్లకు కూడా ఎవరికి తోచినట్లు నిర్వచనాలూ పుట్టుకొచ్చాయి. ఇంతమంది మహాకవులూ, ఇన్ని కావ్యాలూ, ఇంత కవిత్వమూ, ఇన్ని లాక్షణికగ్రంథాలూ , శాస్త్రజ్ఞులూ ఉండి కూడా కవిత్వంలోని తీపికి ఒకటే నిర్వచనం లభించలేదంటే వాళ్లు అసమర్ధులు అని కాదు అర్ధం. అది అనుభవైకవేద్యమని. ఎవరికి వారు రుచి చూడవలసిందే. చూసి తెలుసుకోవలసిందే.  శబ్దమో, అర్ధమో – తీయగా సృష్టించబడినప్పుడు, భాషతో ఒక జీవికి పుట్టుకనుంచే ఉండే అనుబంధం చేత అది మనస్సుకి హత్తుకుంటుంది. ఆ హత్తుకునేది ఏది? కేవలం ఊహో, కల్పనో కాదు. వాటిద్వారా ఒక సత్యం దగ్గరగా రావాలి. ఆ సత్యం మనం కనుగొనలేకపోయిందో లేదా అందుకోవాల్సినదో అయి ఉండాలి. అది లేని కల్పనలూ, ఊహలూ విపరీతభావనలే కానీ, ప్రయోజనకారులు కావు. ఇది ప్రస్తుతం తెలుగులో తయారవుతున్న కొందరు కొత్తకవులలో నన్ను బాధిస్తున్న అంశం. వీరి దగ్గర మిగతాకవులకి మించిన పదసంపద ఉంది. కొత్తకొత్త ఊహలూ అనేకం ఉన్నాయి. అవన్నీ గుదిగుచ్చబడి ఒక కవితగా వెలికి వచ్చినప్పుడు ఉద్దేశించిన విషయమో లేదా ధారో గిజగిజ తన్నుకుంటాయి. వీరిది నియమం లేని అధికారం. పద్యాన్ని తెలుగువారు అందుకే వదిలేశారు కాబోలు!

అదలా ఉంచితే, కాళిదాసు మానవజీవితాన్ని విపరీతభావాలలోకి మార్పిడి చెయ్యడానికి ఉపమని వాడుకోలేదు.  కవితాలోకపు రసగంగనే మానవజీవితంలోకి వొలకబోశాడు. ఈ తర్జుమాకి ఆయన పోలికలని వాడుకున్న తీరు అనన్యసామాన్యం.

భట్టుకవులని కవులలో ఒక రకంవారున్నారు. వీరు నోరు తెరిస్తే పొగడ్తలు కవిత్వరూపంలో వెల్లువకడతాయి. ఏ జమీందారు పంచనో చేరడం, ఆయన సంతోషంలో ఉన్నప్పుడు నువ్వు ఇంద్రుడివీ, చంద్రుడివీ అంటూ ఘణఘణమనే సంస్కృతసమాసాలతో ఏవో చెప్పడం, పదోపరకో పుచ్చుకోవడం వీరిపని. ఇదెందుకు చెబుతున్నానంటే, ఇలాంటి వారి గురించి విన్నప్పుడు ఏవగింపు కలుగుతుంది కానీ, నేటి కాలంలో సంగీత సాహిత్యాలు ప్రధానంగా ఇందుకోసమే వాడుకోబడుతున్నాయి. కవిత్వం పరిపుష్టం కావడానికి అది దేని చుట్టూ అల్లుకుని ఉందో ఆ వస్తువు తగినదై ఉండాలి. అది లేనపుడు ఆర్భాటంగా కవిత్వపు సృష్టి జరిగినా,  అది విలువలేనిది అయిపోతుంది. కవిత్వం కలలప్రపంచమనీ, కవిత్వమంటే ఆసక్తి ఉన్నవాడు వాస్తవానికి ఆమడ దూరంలో ఉంటాడనీ, ఊహాలోకాలలోబ్రతుకుతాడనీ కొంతమంది ‘వాస్తవికులు’ నమ్ముతారు. నిజానికి ముందున్న వాస్తవానికి మసిపూసి మారేడుకాయని చేసి మనలను ఎక్కడికో త్రోసివెయ్యడం కవిత్వపు లక్షణం కాదు. ఊహలనే తీసుకునిరావడం ద్వారా వాస్తవప్రపంచపుటెత్తులు పెంచడం. దాని ప్రాధాన్యత పెంచడం. జీవితపు బరువునీ, విలువనీ పెంచడం.

గచ్ఛతి పురశ్శరీరం ధావతి పశ్చాదసంస్తుతం చేతః।

చీనాంశుకమివ కేతోః ప్రతివాతం నీయమానస్య ॥

అని అభిజ్ఞానశాకుంతలంలో ఒక శ్లోకం. దుష్యంతుడు శకుంతలని విడిచిపెట్టి రథం మీద వెళుతున్నాడు. రథం ముందుకు వెడుతోంది. రథంలో ఉన్న ఆయన కూడా కదులుతున్నాడు. కానీ ఆయన మనసు మాత్రం గాలికి వెనుకకి ఎగురుతున్న రథం పైన  జెండాలాగా వెనుకకే వెళుతున్నది అని దీని అర్ధం.

ఈ శ్లోకాన్ని చదివిన రాజుగారొకరు సభతీర్చి, తన ఆస్థానం లోని కవిని ఈ శ్లోకంలోని పోలికని మార్చమని అడిగారట. ఆ కవి సాహిత్యాన్ని ఔపోశన పట్టడంతో పాటుగా, సంస్కారమున్నవాడు. వెంటనే తడుముకోకుండా, ‘అయ్యా, కాళిదాసు పోలికల దగ్గరకి వెళ్లడు, పోలికే ఆయన్ను వరించింది. ఇంత ఔచిత్యవంతంగా వేరే పోలికతో దీనిని మార్చడం వీలుకాద’న్నాడు. కొంతకాలమైనాక ఆ ఆస్థానంలోకి వాదానికి ఒక కవీ, పండితుడూ వచ్చాడు. అక్కడి పండితులు కొంతమందిని ఓడించాడు. రాజుగారు ఈయనకీ అదే సమస్య ఇవ్వగా, ఆ పండితుడు వారం రోజులు గడువడిగాడు. రాజుగారు ‘సరే’నన్నాడు. సకల మర్యాదలతోటి ఆతిథ్యం అందుతోంది. రోజులు గడుస్తున్నాయి. ఎంత జుట్టు పీక్కున్నా అంతకు మించిన అందమైన ఉపమానం ఆయనగారికి తట్టలేదు. చివరిరోజు సభలో ‘ఈ చిక్కుముడిని నేను విప్పలే’నన్నాడు. రాజుగారు నవ్వి, ‘దీనిని మా కవిగారెప్పుడో సాధించా’రన్నారు. ‘ఎలా’ అని ఆ పండితుడు ప్రశ్నించగా, రాజుగారు,  ‘ఈ శ్లోకంలో ఉన్న పోలికని మించిన పోలిక లేదని చెప్పడానికి నీకు వారం రోజులు పట్టింది, మా కవిగారు తత్క్షణమే చెప్పా’రన్నారట!

ఆ శ్లోకంలోని వస్తువు – దుష్యంతుడు అయిష్టంగా ప్రియురాలిని విడిచి వెళ్లవలసి రావడం. సన్నివేశంలో ఉన్నవారు – నాయిక, నాయకుడు, అడవి, రథము, మిగిలిన వారు.  దాన్ని వర్ణించేటప్పుడు ప్రకృతి మూగబోయిందనో, నాయకుడి కాలు కదలలేకపోయిందనో, నాయిక కలువ రేకులలాంటి కళ్లతో ఏడ్చిందనో చెప్పకూడదా? లేదా హృదయవేదనతో వాళ్లు విడివడ్డారని ఒక్కముక్కలో తేల్చకూడదా? అక్కడ అత్యంత అప్రధానమైన వస్తువులలో రథం మీది జెండా ఒకటి. దానిమీదకి ఈ మహాకవి దృష్టి పడి, దాని స్వాభావాన్ని పోలికలా పట్టుకొచ్చి ముడివేయగానే  దుష్యంతహృదయపు బరువు చదువరి మనస్సులో త్రివిక్రముడిలా ఎదిగిపోయింది. ఇక్కడ ఆయన చేసిన పని, దుష్యంతహృదయాన్ని తీసుకుని ఆ పోలికలో కలిపి, ఆ పోలికని ఎక్కువ చేయడం కాదు. ఆ పోలికనే పట్టుకొచ్చి, వస్తువుతో కలిపి దానిని పదింతలు చేయడం. కాళిదాసుని మించిన మనస్త్వత్వవేత్త, కవితాశాస్త్రజ్ఞుడు మరొకడు లేడు. అసలు మన పూర్వకవుల ప్రయాస అంతా జీవితాన్ని కవితామయం ఎలా చేయాలనే.

కాళిదాసు రచనలని నేను అప్పజెప్పక్కరలేదు కదా.

రఘువంశం, కుమారసంభవం, మేఘసందేశం, అభిజ్ఞానశాకుంతలం, మాళవికాగ్నిమిత్రమ్, విక్రమోర్వశీయమ్, ఋతుసంహారం – ఇవి భారతదేశమంతటా వ్యాపించి ప్రసిద్ధిలో ఉన్నవి. అయితే, ఈ జాబితా అక్కడితో ఆగలేదు. జ్యోతిర్విదాభరణం, శృంగార తిలకం, నలోదయం, ఘటకర్పరకావ్యం, దుర్ఘటకావ్యం, పుష్పబాణవిలాసం, ఉత్తరకాలామృతం, రథాంగదూతం, శాంతిసారనాటకం, చిద్గగన చంద్రిక, ప్రహసనం, హిరణ్యనాభచంపువు మొదలుగా తొంభై పైనకృతులు  ఆ మహాకవి పేరుమీద ఉన్నాయి. ఇంత సారస్వతాన్ని భాషామాత పాదలపై పెట్టిన తాను మాత్రం తన పుట్టుపూర్వోత్తరాలను ఎక్కడా బయటపెట్టలేదు. వీటన్నింటినీ ఒకరే వ్రాయ వీలులేదని తెలుస్తూ ఉన్నా, వారి కాలాలపైన, నివసితస్థలాలపైన, రచించిన కృతులపైనా భిన్నభిన్న మతాలు వ్యాప్తిలో ఉన్నాయి. ఎక్కువమంది నమ్మే అంశం కాళిదాసులు ముగ్గురని.

ఏకోఽపి జీయతే హన్త కాళిదాసో న కేనచిత్।

శృంగారే లలితోద్గారే కాళిదాసత్రయీ కిము? ॥

అని రాజశేఖరుడన్నట్లు కనపడుతుంది. ఈ త్రయీ అన్న పదం కాళిదాసు అన్న పేరుమోసినవారు ముగ్గురున్నారన్న ఉద్దేశ్యంతో వాడబడిందా లేక కాళిదాసు రచనాత్రయాన్ని ఉద్దేశిస్తూ అనబడిందా అన్నది సందేహాస్పదం. అది అలా ఉంచితే, మొదటి కాళిదాసు గుప్తులరాజైన రెండవ చంద్రగుప్తుడి ఆస్థానమందున్నాడనీ, ఇప్పుడు ప్రసిద్ధిచెందిన నాటకత్రయం అతడే వ్రాశాడనీ అంటారు. ఇతని పేరు మాతృగుప్తుడట. ప్రాకృతమహాకావ్యమైన సేతుబంధమూ ఈ మహానుభావుని రచనే అనే వాదం ఉంది. ఇది కల్పితమో, సత్యమో అన్న తర్జనభర్జన పక్కనపెడితే, మాతృగుప్తుడన్న పేరుమీద ఒక కవి విడిగా మనకి కనిపిస్తున్నాడు. ఇతడు హర్షవిక్రమాదిత్యుని ఆస్థానంలో కవిగా ఉండి, ఆయన ఆజ్ఞమీద అప్పటి కాశ్మీరప్రాంతాన్ని ఏలాడట. ఇతని పేరుమీద కొన్ని చాటువులు విడిగా దొరుకుతున్నాయి.

శీతేనోద్ధృషితస్య మాషశిమివచ్చింతార్ణవే మజ్జతః

శాన్తాగ్నిం స్ఫుటితాధరస్య ధమతః క్షుతాక్షామకంఠస్య మే।

నిద్రా కాప్యవమానితేవ దయితా సంత్యజ్య దూరం గతా

సత్పాత్రప్రతిపాదితేవ వసుధా న క్షీయతే శర్వరీ ॥

మనోహరమైన వర్ణన ఇది. చలిలో నా రోమాలు నిక్కబొడుచుకోగా మినుముగింజలాగా వణుకుతూ బాధలనే సంద్రంలో మునిగి, ఆకలితో కరువుగొన్న కంఠంతో,  పగిలిన పెదవులతో, చల్లారిపోయిన వేడిమిని పుట్టించుకోడానికి వేగంగా గాలిని బైటికి ఊదుతూ అవస్థపడుతుంటే, నేనేదో అవమానించినట్లుగా నిద్ర అనే నా ప్రియురాలు నన్ను విడిచిపెట్టి దూరంగా వెళ్లింది.  నాకు తగిన శాస్తి జరిగిందన్నట్లుగా భూమి ఉంది. రాత్రి అయితే అసలు తరగడమే లేదు అని దీని భావం. ఇటువంటి వర్ణన సాహితీజగత్తులోనే అరుదు. అత్యంత అపురూపమైన శ్లోకమిది. ఆ కాశ్మీరంలో ఈయన చలికాలంలో ఎప్పుడో ఇబ్బంది పడుంటాడు. అంత అనుభూతి చెందకుంటే గానీ ఇంత అందంగా వ్రాయలేరు.  పగిలిన పెదవులని వర్ణించడం ఈ శ్లోకానికి మరింత వన్నెలద్దింది. ఎంత అందమైన ధార ఇది! ఉద్ధృషణమంటే వెంట్రుకలు నిటారుగా నిలబడటం. మాషశిమి అంటే మినుము గింజ. స్ఫుటితమంటే పగిలిందని. ఇతడు కాళిదాసు అయినా కాకపోయినా, మహాకవే అని నిర్ణయం చేయడానికి ఈ శ్లోకం చాలు.

ఇతని పేరు మీద దొరుకుతూన్న ఇంకో శ్లోకం –

నాఽయం నిశాముఖసరోరుహరాజహంసః

కీరీకపోలతలకాన్తతనుః శశాంకః।

ఆభాతి నాథ తదిదం దివి-దుగ్ధసింధు-

డిండీర-పిండ-పరిపాండు-యశస్త్వదీయమ్॥

రాజా!  కీరి (ఆడచిలుక?) యొక్క చెక్కిలి లాంటి మనోహరమైన దేహం కలిగిన ఆ చంద్రుడు నాకు రాత్రి అనే సరోరుహంలో విహరించే రాజహంస లాగా కనిపించడంలేదు. ఆకాశంలో పాలసముద్రం యొక్క నురుగు ముద్దలాగా తెల్లనైన నీ యశస్సే ఆ రూపంగా ప్రకాశిస్తున్నది అని దీని భావం. ఇది అందమైన పదాలతోటి కూర్చిన చాటువు. యశస్సుని తెలుపుతో పోల్చడం కవిసమయం. కనుక తెల్లనైన చంద్రుడ్ని తన రాజు యొక్క కీర్తిగా ఉత్ప్రేక్షించడమన్నమాట. చివరి రెండు పాదాలలో మనోజ్ఞమైన సమాసం. ఒకసారి పైకి చదివితే ఆ కూర్పులోని నేర్పుని పట్టుకోవచ్చు. ఇది  చంద్రగుప్తుడితో చేసిన సల్లాపమో ఏమో!

ఇక రెండవ కాళిదాసు ఉజ్జయిని ప్రభువైన శకకర్త విక్రమార్కచక్రవర్తి ఆస్థానమందున్నవాడు. ఇతని అసలు పేరు మేధారుద్రుడట. ఇతడు రఘువంశ, కుమారసంభవ, మేఘసందేశాలనీ, జ్యోతిర్విదాభరణాన్ని వ్రాశాడని చెబుతున్నారు. ఈ మేధారుద్రుడి పేరు మీద ఒక చాటువు విడిగా మనకి కనిపిస్తుంది –

యదాలోకం కుర్వన్ భ్రమతి రవిరశ్రాన్త తురగః

సదాలోకాన్ ధత్తే యదగణిత బాధా వసుమతీ ।

న సంబంధః కింతు ప్రకృతిరియమేవం హి మహతాం

యదేతే లోకానాం పరహితసుఖైకాంత రసికాః ॥

ఇది ఉదాత్తలక్షణాన్ని ప్రతిపాదిస్తూ అల్లినది. గుర్రాలని పరిగెత్తిస్తూ, అలుపూ సొలుపూ లేకుండా భానుడు లోకాల చుట్టూ తిరుగుతున్నాడు. లెక్కలేనంత బాధ ఉన్నా భూమి ఎప్పుడూ లోకాలని ధరిస్తుంది. కానీ వీరికి వాటితో సంబంధమేమిటీ? పరహితంలో సుఖాన్ని వెతుక్కునే మహాత్ముల స్వభావమే అంత అని దీనర్ధం.

ఈరకంగా విడిగా చాటువులు దొరకడం మూలంగా నాకు తోచే విషయం – కాళిదాసు అనేది నేటి భారతరత్నకి మల్లే పరమోత్కృష్టమైన గౌరవమై ఉండాలి. ఆ బిరుదు మళ్లీ అంతటి మహాకవికి అందుతూ ఉండి ఉండాలి. ఈ శ్లోకాలు ఆయా కవులకి పేరు రాకమునుపువి అయి ఉండాలి. మేధారుద్రుడి తరువాత మళ్లీ ఆ బిరుదు మోసినది భోజరాజు ఆస్థాన కవి అయిన కాళిదాసు. అతనిది వేరే కథ. ఆతని పేరు పద్మగుప్తుడు. నవసాహసాంకచరితమని ఈ మహాకవి రాసిన కృతి. పరిమళకాళిదాసని ఈతని బిరుదు. ఈతని జీవితం రచనలలో కన్నా, భోజుని సాంగత్యంలో రసానందాన్ని అనుభవిస్తూ సాగిపోయింది. వీరిద్దరివీ ఎన్ని కథలు! ఎన్నెన్ని చాటువులు! సరస్వతీదేవి అనుగ్రహమంటూ ఒకటి లేకపోతే అటువంటి జీవితం చేతికొస్తుందా?

కృతులని విభజించడంలో కాస్త తికమక సాధ్యమైనా, ఈ కవుల విభజన కాస్త ఉచితంగానే ఉందని అనిపిస్తుంది. కామాక్షీదేవి అనుగ్రహంతో మాటని పొంది ఐదువందల రత్నాలవంటి శ్లోకాలు ఆశువుగా చెప్పిన మూకశంకరులకి కాళిదాసని ఒక శిష్యుడున్నాడట! ఆతనికి కొన్ని రచనల్ని అప్పగిస్తున్నారు. అక్బరు కాలంలో గోవిందభట్టని ఒక కవి ఉండేవాడు. అతడికి అకబరీయ కాళిదాసని పేరు. ఇతడి కృతులు – అకబరీవిలాసం, బిరుదావళి, రామచంద్రయశఃప్రబంధం, స్తుతిమాలిక అనేవి. తరువాత కాళిదాసులు లేరా అంటే అభినవకాళిదాసులు పదుల సంఖ్యలో ఉన్నారు. వారి రచనలూ భాషాభామ కొత్త కొత్త రూపాలని చూపించేవిగానే ఉన్నాయి. మన జాతి గొప్పదనం – ఈ అభినవకాళిదాసులలో తెలుగువారే ఎక్కువ. వారందరి పాండిత్యస్ఫోరకంగా ఒక ఉదారహణ చెప్పాలంటే నడిమింటి సర్వమంగళేశ్వర శాస్త్రిగారు.  18వ శతాబ్దంలో ఉన్నవాడు. ఒకసారి ఈయన యాత్ర చేస్తూ తమిళదేశంలోని ఆనందతాండవపురమనే అగ్రహారానికి వెళ్లాడు. ఆ ద్రవిడగృహంలో అందరూ భోజనానికి కూర్చున్నారు. ఆయింటి ఇల్లాలు వడ్డన చేస్తూ నెయ్యి అభిఘరించింది. దాన్ని చూసి ఈయన ఆశువుగా చెప్పిన శ్లోకమిది –

ఆనందతాండవపురే ద్రవిడస్య గేహే

చిత్రం వసిష్ఠవనితాసమమాజ్యపాత్రమ్।

విద్యుల్లతేవ పరినృత్యతి తత్ర దర్వీ

ధారాం విలోకయతి కశ్చన యోగసిద్ధః ॥

ఆనందతాండవపురంలోని ద్రవిడుల ఇంట్లో నెయ్యి గిన్నె అరుధంతీ నక్షత్రం వలె మినుకు మినుకు మన్నంత చిన్నగా ఉందట. అందులోని గరిటే ఇంకా చిన్నగా మెరుపు తీగ లాగా కదులుతున్నదట. ఆ గరిటేలోనుంచి విస్తరిలోకి పడుతున్న నేతిధారనైతే యే యోగసిద్ధుడో కానీ చూడలేడట! ఈయన జీవితమంతా ఇలాంటి చమత్కారభరితమైన కవిత్వాన్ని చెప్పాడు. ఈరోజుకీ సంస్కృతం చదువుకునేవారు ఉపయోగించే శబ్దమంజరి, సమాసకుసుమావళి ఈయన కృతులే.

కాళిదాసుని ఒక వ్యక్తిగా భారతీయులు ఏనాడో మర్చిపోయారు. ఆయన కవితాపుంభావరూపం. ఆయన పేరు మనసులో మెదలగానే ఆనందంతో కళ్లు మూసుకునే వాళ్లు ఇప్పటికీ ఉన్నారు. ఎప్పటికీ ఉంటారు. ఏదో ప్రసంగవశంగా చెప్పానే కానీ, ఈ చారిత్రకవిభజన ఆయన యొక్క కావ్యాస్వాదనకి అడ్డుకాకూడదు. నా దృష్టిలో కాళిదాసు సంజీవని. ఒక ప్రవాహంగా ఆయన ఒక్కడే. ఇక చాటువుల విషయానికి వస్తే ఇవి ఆశువుగా చెప్పినవి కావడం చేతనూ, కాళిదాసన్న పేరుతో మాత్రమే ఉండటం చేతనూ ఇవి చెప్పింది ఏ కాళిదాసు? అని ప్రశ్నవేసుకోవడం మానేసి వాటిని కావ్యదృష్టితో చూపించే ప్రయత్నమే నేను చేయగలిగింది.

కాళిదాసు ఉపమతో పాటుగా మిగిలిన అలంకారాలనీ సమర్ధవంతంగా పోషించాడని అన్నాం కదా. ఈ  చాటువు చూడండి –

ఆయాతి యాతి పునరేవ జలం ప్రయాతి

పద్మాంకురాణి విచినోతి ధునోతి పక్షౌ ।

ఉన్మత్తవద్భ్రమతి కూజతి ముక్తకంఠః

కాంతావియోగవిధురో నిశి చక్రవాకః ॥

రాత్రి సమయంలో తన జత నుంచి దూరమైన చక్రవాక పక్షి ఎడబాటుతో కుదురుగా ఉండలేకపోతున్నదట. ఒకసారి ఇటు వస్తూంది, ఒక సారి అటు వెళుతోంది. ఒకసారి కొలనులోకి దిగుతోంది. అక్కడి పద్మాల మొగ్గలని పరీక్షిస్తోంది. ఒకసారి తన రెక్కలని విదిలిస్తోంది. పిచ్చిపట్టినట్లుగా అక్కడక్కడే తచ్చాడుతోంది. ఒక్కసారిగా ఉన్నట్లుండి కేక పెడుతోంది.

ఈ శ్లోకంలో కవి ప్రతిభ ఏక్కడుంది? ఊహ లేదు, వర్ణనలో విస్తృతి లేదు, వ్యక్తీకరణలో కొత్తదనం లేదు, శబ్దాలలో అందమూ, వింతా లేవు. ఇంత పేలవంగా ఉన్న రచన మహాకవి చేశాడని డీలా పడనక్కరలేదు. నా దృష్టిలో రసజ్ఞులలోనూ స్థాయిలు ఉన్నాయి. ఒక విషయాన్ని ఉన్నదున్నట్లు చెప్పడం చేతనే ఒక వ్యక్తి మనస్సు కావలసిన తన్మయత్వాన్ని పొందితే అతనిది అత్యున్నత స్థాయి. ఒక పోలికనో, ఊహనో జోడించిగానీ, లేదా భాషలో కొంత జిగి చేర్చి గానీ చెప్పవలసి వస్తే అతనిది మధ్యమ స్థాయి. ఈ రెండూ కూడా చప్పగా అనిపిస్తే అతనిది అధమమైన స్థాయి. స్వభావోక్తి ఏ మహాభావకుడికో గానీ రుచి ఇవ్వదు. అసలు కాపట్యం గానీ, కల్తీ గానీ లేని చోటులలో స్వభావాన్ని చెబితే చాలదా? అడ్డమైన వర్ణనలతో నింపాలా !? కవి స్థాయి రసజ్ఞుడికన్నా ఒక అంగుళం ఎక్కువే కనుక, మహాకవులకీ స్వభావోక్తి మహోద్రేకాన్ని కలిగిస్తుంది. ఇక్కడ ఇంకో విషయం ప్రస్తావించాలి. కవులు సున్నితహృదయులు. సంస్కారజనితంగా అబ్బిన తన్మయత్వంలో మాట్లాడుతుంటారు. కాపట్యం ఉన్న వస్తువుల దగ్గరకి, అవెంత ఉన్నతమైనవయినా సరే, సహజంగానే వెళ్లలేరు. అందుచేతనే ప్రతీ కవికీ ప్రకృతి మీద మమకారం ఎక్కువగా ఉంటుంది. మానవజీవితానికి వచ్చేసరికి ప్రేమ, శృంగారం, విరహం, పరాక్రమం, విద్య, ఉన్నతి ఇలాంటివే గొప్ప గొప్ప కవుల వర్ణనలలో కనిపిస్తాయి. నిర్మలమైన వస్తువేదైనా సరే, దానిని రవి కాంచలేకపోయినా, కవి కాంచగలడు. అప్పటికి, ఒక మహాకవి చేసిన వర్ణనకి ఇది మలినమా అమలినమా అన్న ప్రశ్నలేదు. హృదయధర్మం ఉన్న కవి చేసిన శృంగారవర్ణన అయినా ఇంతే. ఈ విషయం మీద కాసేపాగి మాట్లాడతాను. ప్రస్తుతానికి ఒక స్త్రీ చూపుని వర్ణిస్తూ కాళిదాసు చెప్పిన ఈ చాటువు చూడండి.

క్రమసరలితకంఠప్రక్రమోల్లాసితోరః

తరలితవలిరేఖాసూత్రసర్వాంగమస్యాః।

స్థితమతిచిరముచ్చైరగ్రపాదాంగులీభిః

కరకలితసఖీకం మాం దిదృక్షోః స్మరామి॥

ఒక స్త్రీ సఖీజనమధ్యంలో ఉంది. కాళిదాసు ఆ మార్గంగుండా వెళుతున్నాడు. ఆమెకి ఇతనిని చూడాలని ఆశ. ఆ గుంపులో మిగిలిన తలలు అడ్డుపడుతున్నాయి. ఆతని రూపుని పట్టుకుందామని తన కంఠాన్ని కుదిరినంతమేరకు మెల్లగా సాగదీస్తున్నదట. ఆ క్రమంలో ఆమె హృదయభాగం ముందుకువస్తున్నదట. అయినా దృష్టి కుదరక, పాదాల వ్రేళ్లమీద నిలబడిందట. ఊనిక కోసం స్నేహితురాళ్ల చేతులని పట్టుకున్నదట. అంత అవస్థపడి తనకేసి చూడాలని కోరికతో ఉన్న ఆ అమ్మాయిని స్మరిస్తున్నానంటున్నాడు కాళిదాసు. ఆమె చూపుకేమో గానీ ఆమె చూపుని ఒడిసి పట్టిన ఒక మహాకవి చూపు ఈ శ్లోకం. ఆ మానిని చూపుని ఇంతందంగా చూపించిన ఈ వృత్తం పేరు మాలిని.

ఒక గిరిజన యువతి పైన ఈ కవి చెప్పిన చాటువు ఇది –

దివాపి జలదోదయాదుపచితాన్ధకారచ్ఛటా

జటాలితతటీమిమాం విశతి విస్మరన్తీ భయమ్।

తమాలతరుమండితావటనిరస్తభానుద్యుతిం

ధృతాభిసరణవ్రతా శబరసుందరీ కన్దరీమ్॥

అది నదీతీరప్రాంతం. పట్టపగలు. అయినా ఆకాశమంతా మబ్బులు పట్టడం చేత చీకటి జడలు కట్టి నాట్యమాడుతోంది. అంత చీకటిలోనూ ఏ కొంచెమైనా సూర్యుని కాంతి పడే అవకాశం లేకుండా చీకటి చెట్లు అడ్డు పడుతున్నాయి. ఇంకా చూపుని తక్కువ చేసే కొండ గుహ. అటువంటి భయానకమైన ప్రాంతానికి ఒక ఆటవికజాతి స్త్రీ ఏమాత్రమూ భయం లేకుండా వెళుతున్నదట! కారణం నేను చెప్పేదేముంది?

ఈ శ్లోకంలోని అందం భావంతో పాటుగా పదాల విరుపులో ఉంది. ఈ వృత్తం పేరు పృథ్వీ. తక్కువ రచనలు చేయబడిన వృత్తాలలో ఇది ఒకటి. అందులో కాళిదాసు పట్టుకున్న లయ అమోఘం. ‘జటాలిత’ – జడలు కట్టిన. ఇది అపురూపమైన ప్రయోగం. ‘ధృత అభిసరణ వ్రతా’ – ముందుకు కదలడమే వ్రతంగా కలిగినది అనడంలో ఆమె మనస్సంకల్పం, నిర్భయత్వం ద్యోతకమవుతున్నాయి. మొదటి సమాసంలో ‘ట’కారావృత్తి. సుందరీ , కందరీ –  సొగసైన అనుప్రాస.

మనసుని కరిగించేలా ఉన్న ఇంకొక యువతి పరిస్థితి చూడండి –

న వక్తి ప్రేమార్ద్రం న ఖలు పరిరంభం రచయతి

స్థితౌ తస్యాం తస్యాం కరకమలలీలాం న సహతే ।

స్మితజ్యోత్స్నాకాంతం ముఖమభిముఖం నైవ కురుతే

తథాప్యంతఃప్రీతిం వపుషి పులకోస్యాః కథయతి.

ఆమె ముగ్ధ. దగ్గరికి ప్రియుడు వచ్చాడు. కానీ ఆమెకి అతనిపైన అలక. దానిచేత అతనితో ప్రేమగా మనస్సుని ఉల్లసింపచేసే మాటలు మాట్లాడడం లేదట. కౌగిలి ఇవ్వటం లేదట. ముట్టుకోడానికి ప్రయత్నిస్తే చేతిని గెంటివేస్తున్నదట. వెన్నెలతో సమానమైన నవ్వుతోటి ఉన్న ముఖాన్నైనా ప్రియుడివైపుకి చూపించక పెడముఖంగా కూర్చున్నదట. అయినా ఆమె శరీరంపై రేగిన పులకలు మనస్సులో ప్రియుడిపై ఉన్న ఆమె ప్రీతిని చెబుతున్నాయట!

చిన్న శ్లోకాలలో పెద్దవర్ణనలు చేయడంలో ఈ కవి సిద్ధహస్తుడన్నది తెలిసిన విషయమే కదా. నిరుపమానమైన ఈ ఉత్ప్రేక్షని చూడండి –

పినష్టీవ తరంగాగ్రైరర్ణవః ఫేనచందనమ్।

తదాదాయ కరైరిందుర్లింపతీవ దిగంగనామ్ ॥

రాత్రి సమయం అయింది. పున్నమి చంద్రుడు తళతళలాడుతున్నాడు. వెన్నెలలు లోకమంతా పరుచుకుని ఉన్నాయి. ఆ ప్రకృతి ఎలా ఉందీ అంటే, సముద్రం తన తరంగాలనే చేతుల చేత నురుగనే చందనాన్ని ముద్దలా మర్దిస్తున్నదా అన్నట్లున్నదట. ఆ తెల్లచందనాన్ని చంద్రుడు తీసుకుని దిక్కు అనే స్త్రీకి పూస్తున్నట్లున్నదట. ఏమి కల్పనాబలం, అదీ ఇంత చిన్న శ్లోకంలో! కాళిదాసు చేసిన ఈ ఊహని ముచ్చటపడి అప్పయదీక్షితులు తన కువలయానందంలోకి తీసుకున్నారు.

హృదయవిదారకమైన ఇంకో చాటువు –

ప్రియాయాం స్వైరాయామతికఠినగర్భాలసతయా

కిరాతే చాకర్ణం ధృతధనుషి ధావత్యనుపదమ్।

ప్రియాప్రేమప్రాణప్రతిభయవశాకూతవికలో

మృగః పశ్చాదాలోకయతి చ ముహుర్యాతి చ ముహుః॥

ఒక జింకల జంట ఉంది. మగజింక నుంచి ఆడజింక వేరుపడింది. ఇంతలో ఒక వేటకాడు విల్లెక్కుపెట్టి ఆడజింక వెనుక పడ్డాడు. ఈ మగజింక ప్రాణభయంతో అక్కడ ఉండనూ లేక, ప్రియురాలిపై చూపు మరల్చుకోనూ లేక పెనుగులాడుతూ మళ్లీ మళ్లీ వెనుకకి చూస్తూ మళ్లీ మళ్లీ ముందుకు వెడుతున్నదట!

ఈ అపురూపమైన శ్లోకానికి కాస్త విస్తారంగా వ్యాఖ్య చేస్తాను. తెరతీయగానే ఒక జింకల జంట. అందులో మగజింకకి ఆడజింక అంటే వల్లమాలిన ప్రేమ. అది చెప్పడం కోసమే ‘ప్రియాయాం’ అన్న ప్రయోగం.  ఆ ఆడజింక ఎటువంటిది? స్వైర – తనకి తానుగా స్వేచ్ఛగా విహరించే స్వభావం ఉన్నది. ఆ విహారంలో ఆనందాన్ని పొందేది. ఆ అంశాన్ని చెప్పింది మొదటి పాదం. రెండవపాదంలో ప్రతినాయకుడి ప్రవేశం – కిరాతుడు. అతడెటువంటివాడు? చెవి వరకూ ఎక్కుపెట్టిన బాణంతో తరుముతున్నవాడు. పరిగెత్తించడం ఒక పద్ధతి. అందులోనూ ఎక్కుపెట్టిన బాణాన్ని దించడంలేదంటే దృఢచిత్తుడన్నమాట. దానికి కారణం – అతికఠినగర్భాలసత. అతికఠినమైన కడుపు కదలని స్థితి. ఆకలి. దానిని మించిన ఉత్ప్రేరకమేముంటుంది? తరుముతున్నాడు. ఆడజింక పరిగెడుతోంది. ఆపద వచ్చినా, దాని మనసులో సందిగ్ధత లేదు. ప్రాణభయమే ఉంది. అసలు పెనుగులాట మగజింకది. దానికి కారణం – ప్రియురాలిమీద ప్రేమ,  ప్రాణాలు పోతాయన్న భయం. ఈ రెండింటికీ ఒకే సమయంలో వశమయిపోవడం. ఆ వశత్వం వల్ల ఏర్పడిన ఆకూత – అభిప్రాయం చేత వికలము – కలవరపాటు. ఈ నరకాన్ని చెప్పేది మూడవపాదం. అదీ ఏకసమాసం. ఎటుపోవాలో అన్న సందిగ్ధత ఉన్నా, ఆ సందిగ్ధతలో లోపం లేదు అన్నట్లుగా. ఆ కలవరపాటులో మగజింక ఏం చేసింది? ఆ ప్రవర్తన కదా ఈ శ్లోకానికి గుండె! ముహుః పశ్చాదాలోకయతి – మళ్లీ వెనక్కు చూస్తోంది. ముహుర్యాతి – మళ్లీ ముందుకు వెళుతోంది. ఇక్కడ ‘ముహుః’ అన్న పదం రెండు సార్లు వాడటంలో ఉన్న లోతు ఆ మగజింక చూపుని చదివేవాడి మనసులో ఎంత అవసరమో అంత బలంగా ముద్రింపజేస్తుంది. అసలు ఈ శ్లోకానికి కథానాయకుడు మగజింక. దాని దృష్టినుంచే కదా శ్లోకం రచించబడింది! దాని ప్రసక్తి నాలుగవ పాదంలో మొదటి పదం వరకూ లేదు. అదికూడా, ముందు మూడవపాదంలో అది పడిన అవస్థని వర్ణించిన తరువాత, దాని ప్రవర్తనకి ముందు ఆ పేరుని తీసుకురావడం మరింత ఔచిత్యంగా ఉంది. నాలుగవ పాదంలో రెండు  ‘చ’కారాలు గణాలని పూరించడం కోసం వ్రాయబడినవి కావు. ‘చ’ అంటే ‘కూడా’ అన్న అర్ధంలో రెండు పనులూ మగజింక చేస్తోందనీ, అది కూడా సమానప్రాధాన్యతతో ఊగిసలాడుతూ చేస్తోందనీ చెప్పడం. ఈ శ్లోకంలో ఆడజింక పాత్ర పరిధి ఏమిటీ? మగజింకకి ఆడజింక ప్రియురాలని అన్నాడే కానీ, ఆడజింక ప్రేమని ఎక్కడా చెప్పలేదు.  ఆడజింకకి కూడా మగజింకకున్నంత ప్రేమ ఉండి ఉంటే, అది ‘స్వైర’ అయ్యేదే కాదు. ఇక్కడ కిరాతుడి ఆకలిలో కష్టం ఉంది. ఆడజింక చావులోనూ కష్టం ఉంది. ఆ రెండూ పాశవికమైనవి. మగజింక మనసు పాశవికంగా కలిగే ప్రాణభయంతో పాటు ప్రేమని కలుపుకోవడమనే కారణంచేత వాటిని అధిగమించి ప్రాధాన్యతని సంతరించుకుంది.

కాళిదాసు పేరుమీద కనిపిస్తున్న ఇంకొక శ్లోకం –

భృంగాలీ కంఠమాలా వికచకమలినీధూలిభిర్ధూసరాంగాః

ప్రోదంచచ్చంద్రకల్పాలఘుతరలహరీశీకరాసారలాలాః।

అంకాదంకం వ్రజంతో వికచకుముదినీమల్లికామాలతీనాం

మోదంతే మందమందం మలయగిరిదరీగర్భతో వాతపోతాః॥

తుమ్మెదల గుంపు కంఠమాలకాగా వికసించిన తామరపూవుల పుప్పొడులతో బూడిదరంగు పులుముకొని, చంద్రసంబంధంగా ఎగసిపడుతున్న పెద్ద అలల తుంపరల జల్లులు లాలాజలంలా కుదురుకోగా,  వికసించిన తెల్లకలువలూ, మల్లెలూ, జాజితీగలూ – ఈ పూవుల యొక్క ఒక ఒడి నుంచి ఇంకొక ఒడిలోకి చేరుతూ, మెల్లమెల్లగా మలయపర్వతసానువులలోని పిల్లవాయువులు ఆనందిస్తున్నాయట.

పిల్లవాయువులు నిజంగా పిల్లలే అని సమర్ధిస్తున్నాడు కవి. పిల్లలు ఆడుకుంటే ఒంటినిండా బుడిద అంటుకుంటుంది కదా. ఈ పిల్లలకి అలా వికసించిన తామరపుష్పాల పుప్పొడులు అంటుకున్నాయట. ఆయాసంతో పిల్లల నోళ్లలోనుంచి కారే చొంగలాగా పిల్లగాలులకి కాసారపు అలల తుంపరలు అంటుతున్నాయట. పూవులని తాకడం కాదు – వారి ఒడిలోకి ముద్దుకొద్దీ చేరుతున్నాయట అవి. అంకాదంకం – ఒక ఒడి నుంచి ఇంకొక ఒడిలోకి. ఒకే చోట కుదురుకోలేని పిల్లల స్థితి.  వాటిని ఆ పూలు గోముగా ఎత్తుకుంటున్నాయన్నమాట. మందమందం – మెలిమెల్లిగా. ఆటని ఆపమంటే ‘ఇంకొక ఐదే ఐదు నిముషాలు’ అని సమాధానమిచ్చే పిల్లల మనస్తత్వం.

ఈ రచనలో భావరమణీయత ఉన్నా, భాషలో మహాకవి పట్టు లేదు. ‘వికచ’ అన్న పదం పునరుక్తి కావడం ఒకటి, కమలినీ, కుముదినీ పదాలని ఒకేసారి ఉపయోగించడం చేత ఇవి సాయం వాయువులా లేక పగలు వీచే వాయువులా అన్న సందిగ్ధతకి తావియ్యడం రెండు, అలాగే పద్మాలు, కలువలు ఇత్యాది పుష్పాలు ఉన్న కాసారంలో ఒక మాదిరిగా మాత్రమే ఉండటానికి సాధ్యమయ్యే అలలని ‘ప్రోదంచత్’ అనీ, ‘అలఘుతర’ అనీ పెద్దవి చేసి చూపించడం మూడు.  నీటి తుంపరలని లాలాజలంతో పోల్చడం కాస్త ఎబ్బెట్టు గా ఉండటం నాలుగు. ఈ కారణాల చేత ఇది ఎవరో కవి వ్రాసిందే కానీ మహాకవి వ్రాసింది అయి ఉండదు. ఎవరి శ్లోకానికో కాళిదాసు పేరు అంటించి ఉంటారు.

వేణీ విడమ్బయతి మత్తమధువ్రతాలీ

మంగీకరోతి గుణమైన్దవమాస్యమస్యాః ।

బాహూ మృణాలలతికాశ్రియమాశ్రయేతే

పుంఖానుపుంఖయతి కామశరాన్ కటాక్షః॥

ఆమె జడ మదించిన తుమ్మెదల గుంపుని అనుకరిస్తోంది.  ముఖము చంద్రుడి గుణాన్ని అంగీకరిస్తోంది. బాహువులు తామరతూడుల శోభని ఆశ్రయిస్తున్నాయి. కడగంటి చూపు మన్మథశర పరంపరలని వెనువెంట సంధిస్తోంది.

కవిత్వంలోని పరోక్షత్వలక్షణానికి ఈ శ్లోకం ఉదాహరణ. తుమ్మెదల గుంపుకీ జడకీ సంబంధం నలుపు. చంద్రుడికీ, ముఖానికీ సంబంధం గుండ్రంగా ఉండటం, తెల్లగా ఉండటం, కాంతివంతంగా ఉండటం. బాహువులు తామరతూడులని ఆశ్రయిస్తున్నాయంటే సుకుమారంగా ఉన్నాయనీ, సన్నగా ఉన్నాయనీ చెప్పడం. పుంఖానుపుంఖయతి – ఇది మంచి క్రియాపదం. ఒకదాని వెంటనే ఇంకొకటి నిరంతరంగా సంధించడం అన్న అర్ధంలో.

ఏతాని నిస్సహతనోరసమంజసాని

శూన్యం మనః పిశునయన్తి గతాగతాని।

ఏతే చ తీరతరవః ప్రథయంతి తాప-

మాలంబితోజ్ఝితతరుగ్లపితైః ప్రవాలైః॥

ఒక వనిత విరహంతో కుస్తీలు పడుతోంది. శరీరం అధీనంలో లేదు. ఏ పని చేస్తున్నా ఆ పనికి ముందు ఆలోచనగానీ, తరువాతి ప్రయోజనం మీద దృష్టిగానీ లేవు. అటువంటి స్థితిలో తన అవస్థని తానే చెప్పుకుంటోంది – ఈ శరీరం ఎటుపడితే అటు వెళ్లడాలు ఖాళీ అయిన నా మనసుని చూపిస్తున్నాయి. ఈ తీరంలో చెట్లున్నాయే, అవి కూడా  తమ నుంచి విడివడిన చివురుటాకులచేత తాపాన్నే తెలియజేస్తున్నాయి అని.

పై శ్లోకంలోని విరహిణి పరిస్థితికి ఆమె మనఃస్థితి కారణం. ఆమెది ‘నిస్సహతనుః’. తన శరీరాన్ని తానే సహించలేనితనం. పోనీ అది చేసే పనులైనా సక్రమంగా ఉన్నాయా అంటే, అవి కూడా ‘అసమంజసాని’- సమంజసంగా లేవు. గతాగతాని అంటే రాకపోకలు. అమె ఎక్కడో తీరంలో ఉంది. అటూ ఇటూ పచార్లు చేస్తోంది. అది యే శిశిరరాత్రో అయి ఉంటుంది. చెట్లచుట్టూ రాలిపడ్డ ఆకులు ఉన్నాయి. ఆ సన్నివేశమూ ఆమెకి తాపాన్నే తెలియజేస్తోంది. మనసులో  ఒకటుంటే బయట మరొకటి కనిపిస్తుందా? ఆమె మనసునిండా ప్రియుడ్ని కలుసుకోవాలనే తలపు నిండి ఉంది. తదనుగుణంగానే శరీరమూ, చుట్టూ ప్రపంచమూ పట్టుతప్పినట్టు కనిపించి, తాపాన్నే సూచిస్తున్నాయన్నమాట.

వవురేవ మలయమరుతో జగురేవ పికాః పరారి చ పరుచ్చ ।

ఉత్కంఠాభరతరలం సఖి మానసమైషమః కిమిదమ్॥

అప్పుడే యుక్తవయస్సులోని వచ్చిన ఒక అమ్మాయి తన స్నేహితురాలితో అంటున్న మాటలివి.  సఖీ! ఈ చలచల్లని మలయపవనాలు నిరుడూ, అంతకు ముందుటేడూ కూడా వీచాయి. కోకిల కూడా ఎప్పటినుండో పాడుతూనే ఉన్నది. అప్పుడు నా మనసు మామూలుగానే ఉంది.  కానీ ఈ యేడు ఉత్కంఠ, చంచలత్వమూ పొటమరిస్తున్నాయి. ఇదేమి వింత? అని.

వ్యాసుడు తన రచనారాశిని పురాణమని ఎందుకన్నాడు? పురాణం – పురాఽపి నవీనమ్. పాతదైనా కొత్తది గనుక. ఆ కథలు జరిగి కొన్ని వేల లక్షల ఏండ్లు గడిచినా, వాడి వాస్తవికత ఇప్పటికీ ఎప్పటికీ సరిపోతూనే ఉంటుంది గనుక. ఎందుకు సరిపోవాలి అన్న దానికి కారణం జీవుడి మనస్సు, అందులో కలిగే అనుభవాలు.

ఆకలి, ప్రేమ, నిద్ర, తృప్తి, ఆశ, శ్రమ, నొప్పి, చికాకు, ఉక్కపోత, అలుపు, జుగుప్స, దయ, నిర్లిప్తత, లొంగుబాటు, పోరాడడం, గర్వం, చిన్నచూపు, ఊహించడం, ఎదగడం, జారిపోవడం, నవ్వు, ఏడుపు  – ఇలాంటి వందల అనుభూతులు ప్రతీ ఒక్కడికీ ఎన్ని వందల సార్లు పునరావృతమై జరుగుతున్నా ఏ మనిషికైనా విసుగు తెప్పించిన దాఖలా ఉందా? వాటి ఉనికి ఈనాటిది కాదు. కానీ అవి ఎప్పటికీ కొత్తవే. నా దృష్టిలో ఇవే పురాణాలు. ఎప్పటికీ యౌవనంతో మనిషి మెదడులో బతికే చిరంజీవులు. మనస్సు తీరు ఎంత విచిత్రమైనది! తల్లితండులూ, తాతముత్తాతలూ లెక్కలేనన్ని సార్లు చూసిన అవే విషయాలని మళ్లీ చూస్తానంటుంది. తిరిగిన దారులే అయినా మళ్లీ తిరగాలంటుంది. పొందిన అనుభూతులనే మళ్లీ పొందాలంటుంది. ముందుటేడు వీచిన చల్లగాలికీ, ఈయేడు గాలికీ తేడా ఏమైనా చెప్పగలమా? కోకిల పాడే పాట మాత్రం మార్పుని పొందిందా? నిన్న విచ్చిన మల్లెమొగ్గకీ, నేడు విచ్చుకున్న మల్లెమొగ్గకీ లక్షణాలలో తేడాలు చూపించగలమా? అవి ఎప్పుడూ ఉండేవే.  మనసులోని మార్పు మాత్రమే కొత్తగా జనించేది.

పరారి – నిరుడుకి ముందున్న సంవత్సరం. పరుత్ – క్రిందటేడాది. ఐషమ – గడుస్తున్న సంవత్సరం. తరలమంటే కదులుతూ ప్రకాశించేది.

మెలకువలోఉన్న మనిషికి శారీరకంగా దగ్గరైనవి మైథునం, ఆహారం – ఈ రెండే. క్షుద్భావం కడుపులోనూ, మైథునభావం మనసులోనూ ఉన్నంతకాలం వాటికి పవిత్రతాపవిత్రతలు అంటుకోవు. ఎప్పుడైతే మైథునభావం శరీరం మీదకీ, క్షుద్భావం మెదడులోకీ పాకుతాయో అప్పుడు మనిషికి తెలియకుండానే ఊబకాయం వస్తుంది. మనస్సుని అత్యంతదృఢంగా అంటిపట్టుకోగల సుకుమారమైన వస్తువు కావటం చేతనే శృంగారాన్ని రసరాజమని పిలిచారు మనవాళ్లు. మనసుని ఇచ్చిన ప్రియుడో, ప్రియురాలో దగ్గర గా గానీ, దూరంగా గానీ ఉన్నప్పటి కంటే గొప్పగా మనలో మనం బతికేదెప్పుడు? మనకి మనం తెలిసేదెప్పుడు? వయసుతోనూ అంతస్థుతోనూ సంబంధమే లేని ఈ ఉనికి కంటే ఉదాత్తమైనది మనిషికి ఏముంది? విరహంకన్నా, ప్రేమకన్నా మనిషికి దగ్గరగా వచ్చేది అన్యమైన వస్తువుని చూపించగలమా? అయితే దురదృష్టం కొద్దీ మనకి

 శృంగారం ఒక రసంగా ఎప్పుడో చచ్చిపోయింది. ఈ కాలంలో ప్రతీఒక్కరి మెదడులోనూ నిరంతరం యెవరివో కొందరి శరీరాల ముద్రలు తిష్ఠ వేసుకుని ఉంటాయి. ప్రేమకీ, విరహానికీ, అనుకరణకీ, సుఖానుభూతికీ అవే కొలమానాలు. అవి అయినప్పుడో లేదా వాటిలాగా ఉన్నప్పుడో మాత్రమే ప్రేమ కలిగేది, ఊహలు అల్లేది, కలిసి బ్రతకాలని అనిపించేది, కబుర్లు చెప్పాలనిపించేది, చూడాలనిపించేది, ఆకర్షణ కలిగేది. లేకపోతే జీవితమే కోల్పోయినట్లు, దొరకవలసిందేదో దొరకనట్లు బాధ, కోపం, అశాంతి.  అవి ఆడే అబద్ధపు నాటకాన్ని చూసి గింగిరాలు తిరుగుతూ బతికే అగత్యం. నా దేశపు యువతకి ఈ రంగురంగుల సంకెళ్ల నుంచి విముక్తి ఎప్పుడో!

ఈ చూపుతోటే రసమయమైన భారతీయసాహిత్యాన్ని చదివి అర్ధం చేసుకోలేని వాళ్లు కాళిదాసుని చదివి  దిగజార్చడానికి ప్రయత్నిస్తుంటారు.

అకృశం నితంబభాగే క్షామం మధ్యే సమున్నతం కుచయోః ।

అత్యాయతం నయనయోర్మమ జీవితమేతదాయాతి ॥

అన్న శ్లోకం మాళవికాగ్నిమిత్రం లోనిది. రాజు తనవైపుగా వస్తూ ఉన్న నాయికని చూస్తూ వర్ణిస్తాడు – అదిగో, బలమైన నితంబభాగం కలిగిందీ, సన్ననైన నడుము కలిగిందీ, ఎత్తైన స్తనములు కలిగినదీ, వెడల్పాటి కన్నులు కలిగినదీ అయిన నా జీవితమే వస్తోంది చూడు అని దీని భావం. అంగాంగవర్ణన చేసేవాడు అయితే ఒక స్త్రీని చూసి నా జీవితమే వస్తోంది అని అనగలడా? అటువంటి హృదయం లేని కవి ఆ రచన చెయ్యగలడా? శృంగారపరమైన వర్ణనలు మాత్రమే ఉంటే అది వేరు. తత్వమో?! వేదాల యొక్క, ఉపనిషత్తులయొక్క దైవీరహస్యాలని శ్లోకాలలోకి పట్టుకొచ్చిన మహానుభావుడు ఈయన కాదా? పేజీలకు పేజీలు వ్యాఖ్య చేయాల్సిన ‘వాగర్థావివ’ వంటి చిన్ని శ్లోకమైనా, ‘యా సృష్టిః స్రష్టురాద్యా’, ‘ఏకైశ్వర్యే స్థితోపి’ వంటి పెద్ద శ్లోకాలైనా వ్రాయగలిగిన దమ్మూ, ధైర్యం ఉన్నవారెవరు? దీపశిఖనీ, జెండాకొయ్యనీ, మానదండాన్నీ, తెల్లజుట్టునీ, నల్లమబ్బునీ ఇలా ఎన్నెన్నో వస్తువులని కవితామయం చేసి కవితకనర్హం ఏదీ కాదని మొదటి నిరూపణ చేసింది ఈ పుణ్యమూర్తే కదా.

కాళిదాసు ఎంత లౌకికుడో అంత పారమార్ధికుడు. ఎంత శృంగారో అంత సన్యాసి. ఎంత సుఖాసక్తుడో అంత విరాగి.  భోగాన్ని వర్ణించి మనసుని ఎన్ని ఒంపులు తిప్పగలడో, వేదాంతాన్ని చూపించి అంత నిదానమూ చేయగలడు. మన అనుభూతులని తన చేతులలోకి తీసుకుని, వాటిని మనకి తెలిసిన పదాలలోనే ఇరికించి ముందుకి పెట్టి మనలని లౌకికమైన లోతులలోకి నెట్టనూగలడు.  అలాగే ఎవరికీ అందని తత్వరహస్యాలని పదాలలోకి దింపి, అవే మనసులని మోక్షధామాల వైపుకి బలంగా విసిరివేయనూగలడు. ఇంత విలక్షణత ఉన్న కవి కనుకనే ఎవరికీ చిక్కడు. అంతుపట్టడు. కుతర్కం చేత ఏదో ఒక రాటికి కట్టాలన్న ప్రయత్నాలకి దొరకడు. అయితే ఆత్మోన్నతి అన్న భవనపు వాకిలి ముందు పడకకుర్చీలో కూర్చుని, తాంబూలచర్వణం చేస్తూ తన కావ్యాల ద్వారా ఆ ఇంటి గుమ్మాలు, కిటికీలూ, పొడుగూ వెడల్పులూ, సౌకర్యాలూ, తిరిగే తీరుతెన్నులు వంటివాటిని గురించి  తీయగా వివరించగల గురువు మాత్రం కాగలడు.

*

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here