కష్టానికి కొలమానం

4
12

[dropcap]”అ[/dropcap]నా… నిన్న పేపర్‌లా చూస్తిని మధ్యప్రదేశ్ లాని మేరేనా జిల్లాకి చేరిండే వివేక్ శర్మ (24) అనే చిన్నోడు తనని వూరికి పంపీలేదని కోపములా ‘నాదేశ్వరీ అమ్మ’ దేవస్థానము ముంద్ర నాలికని కోసుకొనిసినంటా, వానికేమైనా బుద్ధి వుందా? దేశమంతా ‘లాక్‌డౌన్’ చేసిండారనే గేణము లేదా? దేశములాని చిన్నోళ్ళంతా ఇట్లే చేస్తా వుండారానా?” అంటా రేగితిని.

“నీకి దేశములాని నీ అట్లా చిన్నోళ్ళకి ఏడేవున్నా నక్కేకి నాకేకి (తినడానికి) నడుస్తుందిరా. కాని ఆ చిన్నోడు వలస కూలి. పని చేస్తే కడుపుకు అంత కూడు, లేకుంటే బీడు. అట్లా బతుకు వానిది. ఇంట్లానైనా వున్నింటే పూటకి అంత కూడు చిక్కేది. ఈ లాక్‌డౌన్ నింకా అదీ లేకుండా పోయ. ఇంగ వాని గోడు పట్టించుకొనేది ఎవురు? దాన్నింకానే ఇట్ల చేసిండాడనుకొంటా, అయినా వాని ఎన్నము (మనసు) ఎంత రోసింటే అట్ల చేసేకి అయితుంది. మన దేశములాని కోటానుకోట్ల వలస కూలీల వేదనికి నిదర్శనం రా ఈ సంఘటన” అనే అన్న.

‘ఓ… వీనిది శానా పెద్ద సమాచారము కదప్పా! ఇది తెలుసుకోకుండా నోటికి వచ్చింది అనిస్తినే’ అని మనసులానే అనుకొంటా “ఇట్లా వాళ్లకంతా సర్కారు వాళ్లు శానా వసతులు చేసిండారని టీవీలా చూపిస్తా వుండారు కదనా” అంట్ని.

“రేయ్! బుక్కులాని వంకాయి చారుకు అవుతుందా? ఇది కూడా అట్లేరా.”

“అయితే వాన్ని ఆ దేవుడే కాపాడుతాడు లేనా”

“ఎవర్రా దేవుడు? ఏడరా దేవుడు? దేవుడు వుండేది జీవుడులా. వాన్ని కాపాడాల్సింది జీవుడేరా…”

“అయినా మన పెద్దోళ్లు గుడిలా రాయి బొమ్మలు పెట్టింది ఆ రాయి బొమ్మలు దేవుడని కాదురా, ఆ రాయిలా కూడా దేవుని చూడాలనిరా, ఇంత పెద్ద కళాచారములా పుట్టి పెరిగిన మనము చేస్తా వుండేదేమి? కనీసం మనిషిని మనిషిగా చూస్తా లేదు. దీన్నింకానే మన సమాజములా శానా చీలికలు. రాయి పని, మన్ను పని, మాను పని అని ఎన్ని పనులు సచ్చే గంటా చేసినా పేదోడు పేదవానిగానే వుండాడు. పదవి వుండేవాడు పెద్దోడు అవుతా వుండాడు” అంటా బేజారు పడే అన్న.

అన్న మాటలు యిని నాకి అదో మాద్రిగా అయిపోయ. ఏమి చేస్తే వీళ్ల బతుకులు బాగుపడతాయని ఏచన చేస్తిని. కానీ నా బుర్రకి తట్టలే. ఇదే మాట అన్నని అడిగితిని.

“చేయాల్సింది శానా వుందిరా, దాని కన్నా ముంద్ర మనుషులంతా ఒగటే అని మంచి ఎన్నము (మనసు) మన అందరికి రావాలరా. అట్లే కూలీ, నాలి, కర్షక, కార్మికుల కష్టానికి కొలమానం కనిపెట్టాలరా, ఆ కొలమానంతోనే దేశ జనాల కష్టాన్ని కొలవాలరా. అబుడే ఎవడి కష్టానికి తగిన ఫలితం వాడికి అందుతుందిరా” అని పాయ అన్న.

అవును అన్న చెప్పింది నిజమే.

కష్టానికి కొలమానం కనిపెట్టాలా…

***

ఎన్నము = మనసు

ఏచన = యోచన

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here