చిరుగులు : “కతరన్”

0
8

మనం సినిమాలు చూసి చూసి కొన్ని అభిప్రాయాలను మోస్తూ వుంటాము. ఒక జంట వార్ధక్యం వరకూ కలిసే వుంటే వాళ్ళ మధ్య ప్రేమ వున్నట్టు. పిల్లల పెళ్ళిళ్ళై పోతే ఇక వారికే చింతా వుండదన్నట్టు. ఇక యష్ చోప్రా, కరన్ జోహార్ సినిమాల్లో లాగా కుటుంబం అంతా అంతాక్షరీలు పాడుకుంటూ, ఒకరి కోసం మరొకరు త్యాగాలు చేస్తూ ఏదో ప్రపంచంలో విహారం చేయిస్తారు. కాని నిజంగా అలాగే వుంటుందా?

“కతరన్” అనే పద్నాలుగు నిముషాల చిత్రంలో ముగ్గురే నటులు. పీయుష్ మిష్రా, అల్కా అమీన్ లు భార్యా భర్తలు. మూడో పాత్ర లాయర్ ది. రాజేందర్ చావ్లా పోషించిన పాత్ర. 35 అయిదేళ్ళ బేంక్ ఉద్యోగం చేసి విరమణ తర్వాత ఇద్దరి మధ్యా గొడవలు ఎక్కువైనాయి. సహనపు హద్దు దాటాక ఇద్దరూ విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకుని లాయర్ దగ్గరికెళ్తారు. కొడుకు, కూతురు. ఇద్దరి పెళ్ళిళ్ళైపోయాయి. కొడుకు అమెరికా లో, కూతురు బెంగళూరులో వుంటారు. ఇద్దరూ ఫోన్లు చేసి తల్లి దండ్రులను సర్ది చెప్పాలని చూస్తారు. కాని వీరు వినే మూడ్ లో లేరు. లాయర్ ముందు ఇద్దరూ తమ మనసులోని మాటలన్నీ బయట పెట్టుకుంటారు. మొదట చిరునవ్వుతో చూస్తున్న లాయర్ చాలా త్వరగానే విషయం అర్థం చేసుకుని, విసుగ్గా, కోపంగా అంటాడు : మీరు విడిపోవడమే మంచిది అని. అతనికి ఇష్టం లేని పెళ్ళి. తండ్రికి భయపడి చేసుకున్నాడు. ఆమె నాలుగో తరగతి మాత్రం చదువుకున్నదని దెప్పుతూ వుంటాడు. వాళ్ళకు పండగొస్తేనే గోధుమ రొట్టె తినే వీలు, అంత బీదరికం అని ఆమె అంటుంది. నా సంపాదనంతా ఏం చేసిందో, దాచుకుందో, రహస్యంగా బేంకి డిపాజిట్లు చేసిందో అని అతను నేరారోపణ చేస్తాడు. తనని దొంగలా చూసినందుకు కోపంగా ఫోన్ విసిరి కొట్టి ఏడుపు అందుకుంటుంది. ఒకసారి ఆమె అతన్ని వదిలి వెళ్ళిపోతే అతను ఉరి తీసుకోబోయాడట, ఫేను విరిగి పడటంతో బతికిపోయాడంటుంది.

అతను రిటైర్ అయ్యే దాకా కూడా దెబ్బలాడుకుంటూనే వున్నారు. అప్పుడంటే పిల్లల పోషణ, పెంచి పెద్ద చేసి పెళ్ళిళ్ళు చెయ్యడం అనే కార్యక్రమాలు వాళ్ళను విడిపోకుండా ఆపాయి. ఇప్పుడు ఇద్దరూ రోజూ ఒకరినొకరు చూసుకుంటూ, దెబ్బలాడుకుంటూ ఇంతవరకు వచ్చారు. అతనిలో మగ అహంకారం, చులకన నిండా వున్నాయి. ఆమెలో సహనం చనిపోయింది. మిగిలిన జీవితం పిల్లల దగ్గర కాకుండా ఏ ఆశ్రమంలోనో ప్రశాంతంగా బతకాలనుకుంటుంది.

వైవాహిక జీవితంలోని ఒక పార్శ్వాన్ని నగ్నంగా చిత్రించాడు దర్శకుడు. అదీ పద్నాలుగు నిముషాల్లోనే. సంభాషణలు ఎక్కువే. కానీ తప్పదు. ముగ్గురి నటనా గొప్పగా వున్నాయి. మొదటి సీన్ లో వొక తులసి మొక్క, పడి విరిగిన గాజు వేజ్, ప్లాస్టిక్ పూలు, ఎడమొహం పెడమొహంగా వున్న దంపతులు. చివరి సీన్ వచ్చేసరికి గాజు సీసాలో అమరిన ప్లాస్టిక్ పూలు, బయట తులసి కోటలో ఎండిన మొక్క.

దర్శకుడు ప్రేం సింఘ్. గుర్తుపెట్టుకోతగ్గ పేరు.

యూట్యూబ్ లో వుంది. తప్పక చూడండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here