కథ కానిది, విలువైనది

3
7

[dropcap]సా[/dropcap]యంత్రం పూట చెట్లకు నీళ్లు పోయడం అంటే చాలా ఇష్టం పూజకు. రఫీ పాటలను ఇంటి చుట్టూ వినిపించేలా బ్లూటూత్ స్పీకర్ సెట్ చేసుకుని ఇంట్లో ఉన్న మొక్కలన్నిటికీ నీళ్లు పోస్తూ ఉండడటం ఆమె రోజువారీ జీవితంలో ఓ చిన్న ఆహ్లాదం. ఇవాళ కూడా పైప్ పట్టుకుని మొక్కలను పలకరిస్తూ ఉంది పూజ. “జో వాదా కియా వో” అన్న పాట వింటూ ఏదో లోకంలో విహరిస్తున్నప్పుడు ఇంట్లో సెల్ మోగడంతో చిరాకనిపించింది. తరువాత చూద్దాంలే అనుకుంటూ అక్కడే పని చేసుకుంటూ ఉండిపోయింది. కాని ఆగకుండా మరోసారి ఆ తరువాత కూడా అదే పనిగా కాల్ వస్తుంటే కాస్త కంగారనిపించింది. ఎవరబ్బా అనుకుని లోపలికి వెళ్లి సెల్ రిసేవ్ చేసుకుంది. అరుణ నుంచి ఫోన్. ఇన్ని సార్లు చేస్తుంది ఏమయింది అనుకుంటూ “హలో చెప్పు అరుణా. ఏంటి సంగతి” అడిగింది పూజ.

“పూజ చాలా ఆర్జెంట్ మాటర్. ఇంట్లోనే కదా ఉన్నావు” అరుణ గొంతులో ఆదుర్దా.

“ఆ ఇంట్లోనే ఉన్నా. ఏమైంది అరుణ” అడిగింది పూజ.

“రమ అక్క తోడికోడలు భవానీ సూసైడ్ అటెంప్ట్ చేసింది. సర్వైవ్ అయింది. కాని ఎవరితో మాట్లాడట్లేదు. ఫామిలీ అంతా టెన్షన్‍లో ఉన్నారు కాని ఆమె మాత్రం నిర్వికారంగా కూర్చుని ఉంది. భయం వేస్తుంది ఆమెను చూస్తుంటే. ఏం చేయాలో తెలియడం లేదు”. కాస్త ఆయాసంతో రొప్పుతూ మాట్లాడుతుంది అరుణ.

“ఎలా అటెంప్ట్ చేసారు” అడిగింది పూజ.

“చీరతో ఫ్యానుకు హాంగ్ చేసుకుంది. లక్కీగా ఆమెను గమనించిన బావగారు మెడ దగ్గర చీరను కోసి ఆమెను క్రిందకు దించారు. మా కజిన్ భాస్కర్‍తో ప్రథమ చికిత్స చేయించారు. నాకు ఓ గంట క్రితం కబురు చేస్తే వచ్చాను. కాని భవానీ ఎవరితో ఏమీ మాట్లాడట్లేదు. ఎవ్వరెన్ని ప్రశ్నలు వేసినా జవాబు చెప్పట్లేదు” చెప్పింది అరుణ

“ఆమెను హస్పిటల్ కు తీసుకువెళ్లాలి కదా అరుణ. అక్కడ కౌన్సలింగ్ కూడా చేస్తారు. అదీ కాక సూసైడ్ అటెంప్ట్ తరువాత 72 గంటల దాకా ఆమె అబ్జర్వేషన్లో ఉండాలి. వెంటనే ఆషా హాస్పిటల్ కు తీసుకు వెళ్లండి” అంది పూజ

“అదేనే ప్రాబ్లం. హాస్పిటల్ లో చేర్పించడానికి ఎవరూ ఇష్టపడట్లేదు. ఇంటి సంగతులు బైటకు తెలుస్తాయి అని భయం. అందుకే నువ్వు గుర్తుకు వచ్చావు. నువ్వు ఇలాంటి వాళ్ళతో మాట్లాడతావు కదా. ఒక్క సారి వచ్చి భవానితో మాట్లాడు. అలా గాజు కళ్ళతో చూస్తున్న ఆమెను చూడాలంటే భయంగా ఉందే” అంది అరుణ.

పూజ ఓ సూసైడ్ హెల్ప్‌లైన్ సెంటర్‌లో వాలంటీర్‌గా పని చేస్తుంది. సైకాలజీ బాక్‍గ్రౌండ్ లేకపోయినా మానసిక సమస్యలున్న వారితో మాట్లాడడానికి వారే ట్రైనింగ్ ఇచ్చి వాలంటీర్లను తీసుకుంటారు. తనకు తెలిసిన వారికి ఏదైనా సమస్య ఉంటే సెంటర్‍కు కాల్ చేయించి, అవసరమైతే సైకియాట్రిక్  హెల్ప్ కోసం వారిని డాక్టర్ల దగ్గరకు పూజ పంపుతూ ఉంటుంది. సూసైడ్ అటెంప్ట్ చేసుకుని బయటపడ్డ వెంటనే అంత తొందరగా ఎవరూ ఓపెన్ అప్ అవరని ఆమెకు తెలుసు. ఆ సమయంలో ఇంటి వారి మధ్య పరాయివాళ్లతో వాళ్లు మాట్లాడడానికి ఇష్టపడరు కూడా.

“అరుణా, ఇప్పుడు మాట్లాడడం వల్ల ప్రయోజనం ఉండదు. ఆమె కూడా ఒక రకమైన షాక్ లోనే ఉంటారు. హాస్పిటల్‍లో చేరిస్తే మంచిది. లేదా ఆమెను ఎవరైనా కనిపెట్టుకుని జాగ్రత్తగా గమనిస్తూ ఉండేలా చూడు. నేను సెంటర్ నుండి ఎవరన్నా వాలంటర్లు వస్తారేమో కనుక్కుని చెబుతాను. ఓ రెండు రోజుల తరువాత ఆమెను సెంటర్‍కు తీసుకువచ్చి సీనియర్ వాలంటీర్లతో మాట్లాడిద్దాం” అంది పూజ.

“వీళ్లకు ఎవరూ ఇంటికి రావడం ఇష్టం లేదు పూజ. భవాని ఇప్పుడు ఇంకెవరితోనన్నా మాట్లాడినా వీరు ఇష్టపడరు. తను చాలా మంచిది పూజా. నాకు ఆమెకు సహాయం చేయాలని ఉంది. కాపలా కాస్తున్నారందరు. వీళ్లిలా ఉంటే ఆమె మరో సారి అటెంప్ట్ చేయదని గ్యారంటీ లేదు. ఇలాంటి పరిస్థితులలో ఏం చేయాలో ఆలోచించి చెప్పు పూజా. ఇక్కడ ఏదో తేడాగా ఉంది. బైటకు విషయం పొక్కకుండా ఉండాలని అంతా ప్రయత్నిస్తున్నారు. భవానీ పై కన్సర్న్ కన్నా ఇంకేవో భయాలున్నాయి వీళ్ళకు. అందుకే నీకు ఫోన్ చేసాను. నువ్వు రెండు సార్లు రమక్క ఇంటికి వచ్చావు కదా. నీవు వచ్చి మాట్లాడితే ఒప్పుకుంటారు. నేను ఒప్పిస్తాను వీళ్ళను. భవానికి ఇప్పుడు హెల్ప్ అవసరం పూజా” ఇంచుమించు ఏడుపు గొంతుతో అంది అరుణ.

అరుణ పెద్దమ్మ కూతురు రమ. ఇద్దరికీ మంచి స్నేహం కూడా. అరుణకు రమ తోడుకోడలు భవాని అంటే మొదటి నుండి ఇష్టం.

“అరుణా. నీకీ సంగతి ఎప్పుడు తెలిసింది” అడిగింది పూజ

“ఓ రెండు గంటల క్రితం అక్క ఫోన్ చేసింది. భవానీ ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడదు. నాతో కాస్త చనువుగా ఉంటుంది. అందుకని ఆమెకు తోడుగా నన్ను ఈ రోజు ఉండమని అడిగారు అక్కా వాళ్లు” అంది అరుణ.

“అరుణ నువ్వు కుదిరితే అక్కడే భవానీ దగ్గర ఈ రాత్రికి ఉండిపో. ఆమెను మాట్లాడించడానికి ప్రయత్నించు. మీ రమక్కతో కూడా నీ పద్ధతిలో మాట్లాడి విషయం కనుక్కునే ప్రయత్నం చేయి. నేను రోజూ నీకు ఫోన్ చేస్తూ ఉంటాను. అవసరం అయితే వస్తాను. ఆదివారం రోజు భవానీని కలుద్దాం. అప్పటికి ఆమె కొంత కోలుకోవచ్చు” అంది పూజ.

“సరే పూజ. నేను ఇక్కడే ఉంటాను. కాని నువ్వు మాత్రం తప్పకుండా ఒక్కసారన్నా భవానితో మాట్లాడాలి. ప్లీజ్” అంటూ ఫోన్ పెట్టేసింది అరుణ.

***

రెండు రోజుల తరువాత అప్పుడే క్లాసు ముగించుకుని లంచ్ చేద్దామని కూర్చున్న పూజకు అరుణ కాల్ చేసింది. “అరుణా, చెప్పు ఏమిటి సంగతి. భవానీ ఎలా ఉన్నారు” అడిగింది పూజ.

“పూజ నీతో మాట్లాడవలసిన విషయాలు చాలా ఉన్నాయి. ఇవాళ సాయంత్రం కలుద్దాం” అరుణ మాటలో అలసట.

“సరే ఇంటికి వచ్చేయ్. కాని నీ గొంతేంటి అలా ఉంది” అడిగింది పూజ.

“నాకేమీ అర్థం కావట్లేదు పూజ. నేను మనుషులను అంచనా వేయలేకపోతున్నాను. చాలా మంచిగా అమాయకంగా కనిపించే వాళ్లలో మరో మనిషి కనిపించినప్పుడు తట్టుకోలేకపోతున్నాను” అంది అరుణ అదే గొంతుతో.

“ఏం జరిగింది అరుణ” అడిగింది పూజ.

“భవానీ గురించే పూజ. రమక్కతో మాట్లాడితే చాలా సంగతులు తెలిసాయి. తట్టుకోలేకపోతున్నాను. భవానీని నేను చాలా ఇష్టపడ్డాను. కాని సంగతంతా తెలిసాక నేనంత కన్సర్న్ ఆమెపై చూపడం అవసరమా అనిపిస్తుంది. ఇవాళ సాయంత్రం ఏ పనులూ పెట్టుకోవద్దు. నేను నీ దగ్గరకు వస్తాను” అంటూ ఫోన్ పెట్టేసింది అరుణ.

అరుణ అంత త్వరగా డిస్టర్బ్ అయే మనిషి కాదు. ఏమై ఉంటుందా అనుకుంటూ పనిలో పడే ప్రయత్నం చేసింది పూజ. సాయంత్రం త్వరగా ఇల్లు  చేరింది. ఇంటి తాళం తీస్తుందో లేదో, అరుణ టూ వీలర్ వచ్చి ఇంటి ముందు అగింది. అరుణ చాలా డిస్టర్బ్డ్ గా కనిపిస్తుంది. అసలు ఈ రోజంతా ఏమీ తిన్నట్టుగా కూడా లేదు.

పూజ వెనుకే ఇంట్లోకి వచ్చిన అరుణ హాలులో దివాన్‌పై వాలిపోయింది. టీ పెట్టడానికి కిచెన్ లోకి వెళ్ళిన పూజ వెనకే తాను వెళుతూ, “ఏమన్నా తినడానికి ఉందా” అడిగింది అరుణ. ప్రొద్దున ఒండిన అన్నం కొంచెం ఉంటే అందులో పెరుగు వేసుకుని తింటున్న అరుణను మౌనంగా చూస్తూ తనకో కప్పు టీ తెచ్చుకుని మిగతాది ఫ్లాస్క్ లో పోసి హాలులో సోఫాలో కూర్చుంది పూజ.

అన్నం తిని వచ్చిన అరుణ వైపు చెప్పమన్నట్లుగా చూసింది పూజ. అరుణ మాట్లాడడం మొదలెట్టింది..

“భవానీ అంటే నాకు చాలా ఇష్టంగా ఉండేది పూజ. భవానీ భర్త రాధాకృష్ణ, బావగారి కన్నా ఆరేళ్లు చిన్నవారు. ఉమ్మడి కుటుంబాలు అంతరించి పోతున్న సమయంలో కలిసి ఒకే ఇంట్లో ఉంటున్న రమక్క వాళ్ల కుటుంబం అంటే మా చుట్టాలలో అందరికీ ఎంతో గౌరవం. బావ సుధాకర్ అంటే అందరికీ ఇష్టం కూడా. రాధాకృష్ణ కొంచెం మెతక. భవాని చాలా అందంగా ఉంటుంది కదా. చిన్నతనంలోనే  తల్లి చనిపోతే ఆమె నాన్నగారు పందొమ్మిదేళ్ళకే భవానిని రాధాకృష్ణ గారికిచ్చి పెళ్ళి జరిపించారు. రాధాకృష్ణ గారు, బావగారు కలిసే రెడీమేడ్ షాప్స్ చూసుకునేవారు. అక్క బావలకు ఇద్దరూ ఆడపిల్లలే కదా. భవానికి శశిధర్ పుట్టినప్పుడు రమక్క ఎంతో సంతోషించింది. తరువాత పుట్టిన లక్ష్మికి ఎనిమిది సంవత్సరాలున్నప్పుడు ఏదో విష జ్వరంతో రాధాకృష్ణ చనిపోయారు. రమక్క బావగార్లే లక్ష్మీ, ఆమె అన్న శశిధర్ భాద్యతలను తీసుకుని వారిని ఇంత వారిని చేసారు. లక్ష్మీ, శశి ఇద్దరికీ తమ పెదనాన్న అంటే చాలా ఇష్టం. రమక్క కూడా తన పిల్లలు సిరి, రాశి లతో సమానంగా వీరిని చూసుకునేది”.

“పుట్టింట్లో తన భాద్యత తీసుకోని అన్నదగ్గర ఉండలేనని, భవానీ కూడా భర్త పోయిన తరువాత ఇక్కడే ఉండిపోయింది. ఆమెకు కావలసినవన్నీ అమరుతున్నాయి. పిల్లల గురించి ఆలోచించవలసిన అవసరం లేదు. బావగారు తీసుకున్న బాధ్యత చిన్నదేమీ కాదు కదా. కాని ఇవాళ రమక్క చెప్పినది వింటే నాకు తల తిరిగిపోయింది.” అంటూ పూజ వైపు చూసింది అరుణ. ఆమె మొహంలో బాధ కోపం కలిసి ఉన్నాయి.

“భవాని కొడుకు శశికి మూడేళ్ళ క్రితం పెళ్ళి అయిపోయింది. బెంగుళూరులో భార్యతో కలిసి ఉంటున్నాడు. కూతురు లక్ష్మి రతన్‌ని ప్రేమించి వివాహం చేసుకుంటానంటే బావగారు అండగా నిలిచారు. రతన్ బిజినెస్ విషయంలో బావ డబ్బు సహాయం కూడా చేశారు. ఈ నెలలో రతన్ లోన్ తీసుకుని ఓ ప్లాట్ కొన్నాడు. అందులోకి వాళ్ళు మారుతున్నారు. కూతురు కొత్త సంసారంలో సహాయంగా ఉండడానికి తల్లిగా భవానీ అక్కడ ఉండడం ఇప్పుడు అవసరం. దానికి ఆమె ఒప్పుకుంది కూడా. కాని మూడు రోజుల క్రితం తాను లక్ష్మి దగ్గరకు వెళ్ళనని, ఇదే ఇంట్లో ఉంటానని ఆమె తెగేసి చెప్పింది. శశి దగ్గరకు కూడా ఇంతకుముందు ఆమె వెళ్ళనని అన్నప్పుడు లక్ష్మీ దగ్గర ఉండడం కోసం కాబోలు అని అందరూ అనుకున్నారు. కాని ఇప్పుడు లక్ష్మి దగ్గరకు కూడా భవానీ వెళ్లననడంతో ఇంట్లో గొడవ జరిగింది.  భవానీ  లక్ష్మి దగ్గరకు వెళ్లి ఉండాలని రమక్క గట్టిగా గొడవ చేసిందంట. దానితో భవాని సూసైడ్ అటెంప్ట్ చేసింది” పూజను చూస్తూ అంది అరుణ.

“ఆమె భర్త జ్ఞాపకాలతో నిండిన ఇల్లని అక్కడే ఉండిపోవాలనుకున్నారేమో” అడిగింది పూజ.

అరుణ పూజ వైపు చూస్తూ “నేను ముందుగా అదే అనుకున్నాను. కాని నిన్న అక్క ద్వారా నాకో నిజం తెలిసింది.” అంది. అరుణ ముఖంలో బాధ కనిపించింది పూజకు.

“రాధాకృష్ణతో భవానీ ఎప్పుడు సఖ్యతగా ఉండేది కాదట. ఆయన మరణించిన తరువాత ఆమె బావగారికి దగ్గరయిందట. వాళ్లిద్దరి సంబంధం రమకు కూడా తెలుసట. పళ్ళ బిగువున బాధను అణిచి పెట్టుకుని ఆమె తన పిల్లలతో పాటు లక్ష్మిని, శశిని ఏ తేడా రాకుండా చూసుకుంది. తన భర్తకి తోడికోడలికి సంబంధం ఉందని తెలిసినా,  శశిని లక్ష్మిని తన పిల్లలతో పాటు పెంచి పెద్ద చేసింది. శశి ఒక్కడే ఇంటికి వారసుడని అతనంటే అక్కకు ప్రాణం. అలాంటి రమక్క గురించి కొంచెం కూడా ఆలోచించకుండా భవానీ బావగారితో సంబంధం కొనసాగించడానికి తన పిల్లల దగ్గరకు వెళ్ళకుండా ఇక్కడే ఉండిపోవాలనుకోవడం తప్పు కదా. రమక్క ఈ సారి గట్టిగా భవానీ లక్ష్మితో వెళ్ళవలసిందే అని పట్టుబడితే ఇదిగో ఇలా ఆత్మహత్యా ప్రయత్నం చేసింది ఆవిడ. ఈ సంగతి స్వయంగా రమక్కే నాకు చెప్పింది. రమక్కకి ఇంత అన్యాయం చేస్తున్న భవానీని నేను ఎంతగా ఇష్టపడేదాన్నో తలచుకుంటే నన్ను నేను క్షమించుకోలేకపోతున్నాను” కోపంతో అరుణ ముఖం ఎర్రబడింది.

“పిల్లలు నలుగురు కూడా రమక్క బాధను చిన్నప్పటి నుండి చూస్తూ పెరిగారట. ఈ కుటుంబ విషయాలు నాకు ఇప్పటి దాకా తెలియదు. రమక్కతో ఎంతో చనువున్న నాకు కూడా ఈ విషయం ఆమె చెప్పలేదంటే తను ఎంత గుట్టు మనిషో చూడు. భవానీని తనతో తీసుకు వెళ్లడం లక్ష్మికి ఇష్టం లేకపోయినా, పెద్దమ్మ కోసం ఆమె ఒప్పుకుందట. “నేను ఇక్కడే ఉంటాను” అని భవానీ భీష్మించుకుని కూర్చుంటే “పెద్దమ్మకు ఎప్పుడు నీ నుండి విముక్తి అంటూ భవానీని లక్ష్మి కడిగేసిందట” ఆ రాత్రే ఆమె చీరతో ఉరిపోసుకుని చచ్చిపోవాలనుకుంది. బావగారు ఆమె గదిలోకి రాత్రిళ్ళు వెళ్లడం మామూలే అని ఆ ఇంట్లో అందరికీ తెలుసు. అలా వెళ్లినప్పుడే అతను భవానీ ఫాన్‍కు వేళాడుతూ ఉండడం గమనించి చివరి క్షణంలో ఆమెను కాపాడారు. అందరికీ ఇంత షాకిచ్చి మరుసటి ఉదయం నుండి భవానీ మౌనంగా ఇంటి పనులు చేసుకుంటూ పోతుంది. ఎంత గట్టి గుండే ఉన్న మనిషో కదా”.

పూజకు ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియలేదు. భవానీని ఆమె రెండు సార్లే కలిసింది. ఎవరితో ఎక్కువగా మాట్లాడకుండా అడిగిన వారికి అన్ని చేసి పెడుతూ మౌనంగా ఇంటి పనంతా చేసుకుంటూ పోయే భవానీలో ఇంత మొండితనం ఉన్నట్లు ఆమెకు ఎప్పుడూ అనిపించలేదు. ఆ ఇంట్లో ఉన్న కాసేపటిలో ఇంటి పెత్తనం అంతా రమదే అని పూజ గమనించింది. లక్ష్మీ, శశిల విషయంలో కూడా అన్నీ  నిర్ణయించేది రమే అన్నది కూడా అర్థం అయింది. రమ పిల్లల పనులన్నీ భవానీ చేయడం పూజ చూసింది. ఓ రోజు పూజ అరుణతో అక్కడకు వెళ్లినప్పుడు రమ పిల్లల చూడిదార్లు ఇస్త్రీ చేస్తూ కనిపించింది భవానీ. మా యింట్లో పని మనిషి ఉండదు. అన్నీ మేమే చేసుకుంటాం అని అప్పుడు గర్వంగా రమ చెప్పడం పూజకు గుర్తు ఉంది. తల వంచుకుని పని చేసుకుంటూ పోయే భవానీ జీవితంలో ఇంత కథ ఉందా? పిల్లలని కూడా వద్దనుకుని ఆ ఇంట్లోనే ఉండిపోవాలని ఆమె అనుకోవడం వెనుక సుధాకర్‌తో  ఆమెకున్న సంబంధం కారణమా? అంటే వారిద్దరి మధ్య ఉన్నది అంత గట్టి బాంధవ్యమా? దీన్ని ప్రేమ అనుకోవాలా?

అలోచనలతో ఉన్న పూజకి అరుణ తనను పిలవడం వినిపించలేదు. అరుణ గట్టిగా “ఏమీ చెప్పవేంటి. ఇన్ని సంవత్సరాలుగా రమకు అన్యాయం జరుగుతూనే ఉంది. ఇప్పుడు కూడా ఆ ఇంటి నుండి నేను వెళ్ళనని భవాని భీష్మించుకుని కూర్చోవడం ఏమన్నా బావుందా. గట్టిగా వెళ్ళమంటే చావడానికి సిద్దపడితే ఇది బ్లాక్‌మెయిల్‌లా అనిపించట్లేదు.” అడిగింది అరుణ.

“ఇంత గొడవలో సుధాకర్ గారు ఏమంటున్నారు” అడిగింది పూజ.

“బావగారంటే అందరికీ చాలా గౌరవం, భయం. అడగకుండానే అందరి అవసరాలు తీరుస్తూ, ప్రతి ఒక్కరి బాధ్యతను నెత్తిన వేసుకుని ఓ నాలుగు గదుల ఇంట్లో ఉండే కుటుంబాన్ని ఈ రోజు డూప్లెక్స్ రేంజ్ కి తీసుకుని వచ్చారు. అందరూ సెటిల్ అయ్యారు. రాశి, సిరి ఇద్దరికీ అమెరికా సంబంధాలు వచ్చాయి. వాళ్లకి ఆస్తికి కొదవ లేదు. లక్ష్మీ లవ్ మారేజ్ చేసుకుంది. ఇష్టపడి ఓ మిడిల్ క్లాస్ అబ్బాయిని వరించింది. అతని బిజినెస్‍కు బావగారు ఓ పది లక్షలు సహాయం చేసారు. శ్యాం కొన్నాళ్లు బిజినెస్ చేస్తానని అంకుల్‍తో షాపుకు వెళ్ళేవాడు. ఇంజనీరింగ్ డిగ్రీతో వచ్చే సాఫ్ట్‌వేర్ జాబ్‍లో టెన్షన్ ఉండదని బావగారు చెప్పడంతో ఉద్యోగం వెతుక్కుని భార్యతో బెంగుళూరు వెళ్ళిపోయాడు. అతనికి ఓ టూ బెడ్రూం ప్లాట్ కొన్నారు బావ. ఇన్ని చేసిన ఆయనను ఎదిరించి ఏం అడగగలరు వీళ్లు? ఏదో జరిగిపోయింది. ఇప్పుడయినా ఈ రిలేషన్‌షిప్ నుండి భవాని తప్పించుకోవచ్చు కదా.” అడిగింది అరుణ.

నిజమే అనిపించింది పూజకు. అయినా ఆపుకోలేక “భవానీ సుధాకర్ గారిని ప్రేమిస్తున్నారేమో” అంది పూజ.

“పూజా దిస్ ఈజ్ అబ్జర్డ్. ఇప్పటిదాకా ఈ విషయం ఆ ఇల్లు దాటి బైటకు రాలేదు. పిల్లలందరూ తలో దిక్కుగా వెళ్లిపోయారు. ఇప్పుడు అదే ఇంట్లో భవానీ ఉండడం ఏం బావుంటుంది. పిల్లల అత్తగారిళ్లల్లో ఈ విషయం తెలుస్తే ఎంత మంది ఇబ్బంది పడాలి. రమక్కకి ఇప్పటికయినా తన సంసారం, తన భర్త తనకు కావాలి అనిపించదా చెప్పు. తన భర్తతో సంబంధం పెట్టుకున్న స్త్రీ పిల్లలను కూడా ఆమె ఎంత ప్రేమగా పెంచి పెద్ద చేసిందో అర్ధం చేసుకో. అన్ని భాద్యతలు తీరిపోయాక భవాని లక్ష్మి దగ్గరకు వెళ్ళడమే కరెక్ట్ కదా”

“పోనీ ఆమెను వేరే ఇంట్లో ఉంచవచ్చు కదా” అంది పూజ.

“ఒకే ఊరిలో అక్క కుటుంబం, లక్ష్మీ కుటుంబం ఉంటూ, వేరే ఇంట్లో భవానీని ఉంచితే చూసేవారికి ఎలా ఉంటుంది చెప్పు? కొడుకు దగ్గరకో, కూతురి దగ్గరకో ఆమె వెళ్లాల్సిన సమయం ఇదే కదా. ఆమె వేరే ఉండి ఆ ఇంటికి బావగారు వెళుతూ వస్తూ ఉంటే విషయం బైటకు పొక్కదా? లక్ష్మీ, శశిల పరిస్థితి ఏంటి చెప్పు. రమక్క త్యాగం గుర్తుకు తెచ్చుకుని అయినా భవానీ ఆ ఇంటి నుండి తప్పుకుంటే ఆమెకు ఆ కుటుంబానికి గౌరవం కదా”. అడిగింది అరుణ.

పూజకు ఏం చెప్పాలో తెలియదు. రమతో ఉన్న చుట్టరికంతో పూజ రమ గురించే ఆలోచిస్తుంది అనిపించింది. కాని అటు పక్కన భవాని మొండితనం కూడా అనవసరం అనే అనిపిస్తుంది. తానీ విషయంలో ఏం చేయగలదో కూడా ఆమెకు అర్థం కావట్లేదు. భవానీ మామూలుగా పనులు చేసుకుంటూ ఇంట్లో తిరుగుతుందని తెలుసుకుని ఇప్పుడు తాను ఇన్వాల్వ్ అయే అవసరం లేదని మాత్రం పూజకు అర్థం అయ్యింది. ఈ పరిస్థితులలో భవానీతో ఆమె మాట్లాడడానికి ఎవరూ ఇష్టపడకపోవచ్చు కూడా.

అరుణ రమక్కకి జరిగుతున్న అన్యాయం గురించి బాధపడుతూనే ఉంది. కొంత టైం గడిస్తే ఈ సమస్యకు ఏదో పరిష్కారం దొరకవచ్చేమో అన్న ఆలోచనను ఆమెలో కలిగించి అరుణను ఓదార్చింది పూజ.

***

ఆదివారం సాయంత్రం రవీంద్రభారతిలో ఓ సాహితీ కార్యక్రమానికి వెళ్ళాలని అనుకున్నారు అరుణ పూజలు. ఊరి నుండి ఏవో పచ్చళ్ళు వచ్చాయని రమక్కకి అవి అందించమని అమ్మ చెప్పిందంటూ ఆదివారం ప్రొద్దున్నే రమ సుధాకర్ల ఇంటికి వెళ్లింది అరుణ. తనను అక్కడికి వచ్చి పిక్ చేసుకొమ్మని పూజతో చెప్పింది. దారిలోనే కదా అని ఒప్పుకుంది పూజ. ట్రాఫిక్ తప్పించుకోవడానికి కాస్త ముందుగానే బయలుదేరి చిక్కడపల్లిలోని సుధాకర్ ఇంటికి వెళ్లింది పూజ.

ఆ ఇంటి చుట్టూ పొందికగా పెంచిన చిన్న తోట పూజకు చాలా ఇష్టం. గేటు తీయగానే  రాధామనోహరం పూలు స్వాగతం పలికాయి. పూజకు ఆ పూలు చూస్తే ఒళ్ళు తెలియదు. ఒక్క క్షణం తానెక్కడున్నానో మరచిపోయి పందిరి దగ్గరకు వెళ్ళింది పూజ. చెట్టు దట్టంగా అల్లుకుని ఉండడంతో అటు వైపు కూర్చున్న భవానీ ఆమెకు కనిపించలేదు. దగ్గరగా వెళ్ళి పూలు పట్టుకోబోయిన ఆమె ఆ పక్కన ఏదో నీడ కనిపిస్తే ఆగిపోయింది. పూజను చూసి కళ్ళు తుడుచుకుంటూ గబ గబా లోపలికి వెళ్లిపోయింది భవానీ. మనిషి చాలా చిక్కిపోయి అస్థిపంజరంగా మారింది. చాలా అందంగా ఉండే ఆమె ఇలా రూపం మారి కనపడడంతో ఆమెను అలాగే చూస్తూ నిల్చుండిపోయింది పూజ.

ఇంతలో లోపలి నుండి సుధాకర్ వచ్చారు. పూజను చూడగానే “అరుణ నీ ప్రెండ్ అనుకుంటా వచ్చింది చూడు” అంటూ పూజను లోపలికి రమ్మని పిలిచారు.

అరుణతో పాటు రమ కూడా నవ్వుతూ బైటకు వచ్చింది. రమ ముఖంలో కొత్త కళ వచ్చినట్లు అనిపించింది. పూజను ఇంట్లోకి ఆహ్వానిస్తూ “అరుణ చెబుతూనే ఉంది నువ్వు వస్తావని. మీ ప్రోగ్రాంకి ఇంకా టైం ఉంది కదా. లైట్‌గా ఏదన్నా స్నాక్ తిని వెళ్ళండి” అంది.

“అబ్బే ఇప్పుడేమీ వద్దు రమ” అన్న పూజతో అరుణ “పర్లేదులే తినే వెళదాం. నాకు ఇవాళ కూడా ఆఫీసుకు వెళ్లవలసిన పని ఉండి ప్రొద్దున హడావిడిగా వెళ్లిపోయాను. రాజా టూర్ వెళ్లారు. మళ్ళి ఇంటికి వెళ్ళి ఒక్కదాని కోసం వంట ఎలాగూ చేయను. ఇక్కడే హెవీగా టిఫెన్ లాగించేద్దాం” అంది.

పూజ మౌనంగా హాలులోకి వెళ్లి కూర్చుంది. లోపలి నుండి భవానీ వస్తుందేమో అని చూసింది. అలికిడి లేదు. అరుణే మంచినీళ్లు తెచ్చి ఇచ్చింది. “టిఫెన్ అయిందా” అంటూ రమ పిలుపుతో లోపల ఏవో కదిలికలు వినిపిస్తున్నాయి. కాసేపయిన తరువాత మౌనంగా రెండు ప్లేట్లల్లో దోసెలు తీసుకుని వచ్చి డైనింగ్ టేబిల్ మీద పెట్టి వెళ్లింది భవాని. ఆమె అక్కడకు రాగానే అరుణ మొహంలో విసుగు, రమ మొహంలో అహం కనిపెట్టింది పూజ. సుధాకర్ మౌనంగా ఏదో పుస్తకంలో తల దూర్చి కూర్చుని ఉన్నారు.

మరో రెండు దోసెలు ఓ స్టీల్ ప్లేటులో వేసి టేబుల్ పై పెట్టడానికి వచ్చిన భవానితో “లక్ష్మి ఎలా ఉందండి” అడిగింది పూజ. “హాపీగా ఉంది. ఆఫీసు కూడా ఇంటికి దగ్గరే కదా ట్రావెలింగ్ సమయం కూడా కలిసి వస్తుంది. ప్రతి రోజు ఫోన్ చేస్తూ ఉంటుంది” జవాబిచ్చింది రమ. కళ్ళు ఎత్తి అభావంగా పూజ వైపు చూసి లోపలికి వెళ్లిపోయింది భవాని. ఆమె ఉన్నంత సేపు అరుణ ఆమె వైపు కన్నెత్తి చూడలేదు.

అందరికీ టీ తీసుకుని వచ్చి మౌనంగా డైనింగ్ టేబుల్ మీద ట్రే పెట్టి వెళ్లిపోయింది భవాని. పక్కనే కూర్చున్న సుధాకర్‌కి ఓ కప్పు చేతికిచ్చింది రమ. పూజకు ఆ ఇంట్లో భవాని ఆంటి పట్ల కుటుంబ సభ్యుల ప్రవర్తన బాధ కలిగించింది. అమెతో మాట్లాడాలనిపించింది. కాని ఏం మాట్లాడాలో తెలియలేదు. అన్యమస్కంగానే వారికి బై చెప్పి రవీంద్రభారతికి బయలుదేరింది అరుణతో.

***

వారం రోజుల తరువాత అర్జెంటుగా ఇంటికి రమ్మని అరుణ నుండి ఫోన్ వచ్చింది పూజకు. “పూజా. భవానీ ప్రొద్దున్నే నా దగ్గరకు వచ్చింది. ఆమెతో మాట్లాడటం ఇష్టం లేకపోయినా తప్పలేదు. ఆమె చెప్పేది వింటుంటే నాకు చాలా అనుమానాలు వస్తున్నాయి. ఒక సారి రాగలవా” అంది అరుణ.

భవానిని ఆ రోజు సుధాకర్ ఇంట్లో చూసినప్పటినుండి పూజకు తనతో మాట్లాడాలనే ఉంది. అందుకే ఆలస్యం చేయకుండా అరుణ ఇంటికి బయలుదేరింది.

అరుణ అత్త మామల పొలం కౌలు విషయాలు చూడడానికి ఆమె భర్త ఊరు వెళ్ళాడు. కూతురు జాను కూడా నాన్నమ్మను చూస్తాననడంతో ఇద్దరూ రెండు రోజులు సెలవులు కలిసి వచ్చాయని గుంటూరు వెళ్లారని అరుణ నిన్నే చెప్పింది. అందుకని భవానితో మాట్లాడటానికి అరుణ ఇల్లే సరయిన చోటు అని పూజకు అనిపించింది. పూజ ఇంట్లోకి వెళ్ళేసరికి హాలులో ఇద్దరూ కూర్చుని కనిపించారు. భవాని మొన్నటికన్నా ఇంకా సన్నబడినట్లు అనిపించింది. మనిషిలో ఏ కోశానా కళా కాంతులు లేవు.

పూజ వస్తుందని భవానికి తెలుసు కాబోలు. లోపలికి వచ్చిన పూజ వైపు అదే నిర్వికారమైన చూపు. అరుణ ఇచ్చిన నీళ్లు తాగి ఇద్దరి వైపు ఓ సారి చూసింది పూజ.

“పూజ. నీకు తెలియని విషయాలేమీ లేవు. లక్ష్మి దగ్గరకు వెళ్లమని భవానికి రమక్క చెబుతూనే ఉంది. కాని భవాని మొండితనం వీడట్లేదు. నేను కూడా చెప్పి చూసాను. అప్పుడు ఏమీ మాట్లాడలేదు. ఇవాళ ప్రొద్దున్నే నా దగ్గరకు వచ్చింది. ఆమె చెప్పింది వింటే అస్సలు నమ్మబుద్ధి అవ్వట్లేదు” అంది అరుణ.

“బావగారితో సంబంధం పెట్టుకుని, ఇప్పుడు తనదేమీ తప్పు లేదని, అన్ని సంగతులు రమక్కకు తెలిసే  జరుగుతున్నాయని అంటుంది. భర్త తోడికోడల మధ్య శారీరిక సంబంధం ఉందని తెలిసి మౌనంగా అన్నీ భరిస్తూ ఉన్న రమక్క దేవత కదా. కాని భవాని మాత్రం తనకే అన్యాయం జరిగిందని, ఇందులో రమక్క ప్రమేయం కూడా ఉందని  చెబుతుంది. అక్కకు అన్యాయం చేస్తూ నా దగ్గరకు వచ్చి అక్క గురించి ఎంత ధైర్యంగా మాట్లాడుతుందో చూడు” అంది అరుణ.

పూజ భవాని దగ్గరగా వెళ్ళి, ఆమె భుజంపై చేయి వేస్తూ “ఏంటీ భవానీ. అసలేం జరిగింది. ఉన్నది ఉన్నట్లు చెప్పు. మేం ఏమన్నా చేయగలమంటే తప్పకుండా చేస్తాం. కాని వివరంగా చెప్పకపోతే విషయాలు ఎవరికీ అర్థం కావు కదా” అంది.

భవాని తల ఎత్తి పూజను అరుణను మార్చి మార్చి చూసింది. “అన్ని చెప్పాలనే అరుణ దగ్గరకు వచ్చాను. నా చిన్న ప్రపంచంలో ఈ రోజు చెప్పుకోవడానికి అరుణ తప్ప నాకు ఇంకెవరూ లేరు. ఇన్నాళ్ళు  నేను భరిస్తున్న నరకం గురించి ఎవరో ఒకరికి తెలియాలి. అందుకే ఇలా వచ్చాను. కాని అరుణ నేను చెప్పేదేది వినట్లేదు” అంది.

“అరుణ పరిస్థితికి కారణం కూడా మీరే కదా భవానీ. మీ దగ్గరకు వచ్చి విషయాలు తెలుసుకోవాలనుకున్నప్పుడు మీరేమీ చెప్పలేదు. తనకు తెలిసిన విషయాలను బట్టి ఆమె ఏదో అవగాహనకు వచ్చింది. ఇప్పుడన్నా అసలు విషయం మీరు చెప్పవచ్చు కదా” అంది పూజ.

భవానీ పూజ వైపు చూస్తూ “నా భర్త చనిపోయినప్పుడు నేను దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నాను. ఆయన నెమ్మదస్థుడే కాని కష్టపడి పని చేసే వారు. అప్పుడు కూడా ఆర్థిక లావాదేవీలన్నీ మామగారు, సుధాకరే చూసేవారు. ఈయనకి పని చేయడం తప్ప మరొకటి తెలిసేది కాదు. ఎంత చాకిరీ చేసినా చేతిలో డబ్బు ఉండేది కాదు. ఏది కావలసి వచ్చినా మామగారిని అడగవలసి వచ్చేది. కొంత సౌకర్యంగా జీవించడానికి నేను కొన్ని సార్లు మామగారితో సుధాకర్‍తో డబ్బు విషయంగా మాట్లాడేదాన్ని.  భర్త చేతకానితనం నా చేత మాట్లాడించేది. పిల్లల భవిష్యత్తు గురించి కూడా భయం వేసేది. డిగ్రీ పూర్తి చెయకుండానే నాకు పెళ్ళి చేసాడు మా నాన్న. అందుకని ఏ ఉద్యోగం చేయలేను. కనీసం వ్యాపారంలో నా వంతుగా ఏదో పని చేస్తూ కొంత ఆర్థిక స్వాతంత్ర్యం సంపాదించాలనుకున్నాను. వ్యాపారానికి సంబంధించి కొన్ని విషయాలు నేర్చుకుంటున్నాను కూడా. అప్పుడప్పుడు షాపుకి వెళ్లేదాన్ని. కౌంటర్‌లో కూర్చోవడం బిజినెస్ గమనించడం చేస్తుంటే ఇంట్లో ఎవరికీ అది నచ్చేది కాదు. అప్పుడే సుధాకర్ అందరూ అనుకున్నంత నిజాయితీ పరుడు కాదని నాకు తెలిసింది. మామగారికి కూడా తెలియకుండా స్థలాలు కొనడం, డబ్బు ఫైనాన్స్‌కి తిప్పడం చేస్తున్నాడని నాకు తెలిసింది.”

“ఈ లోగా మా వారు చనిపోయారు. నా జీవితం తలక్రిందులయింది. పది సంవత్సరాల శశి, ఎనిమిది సంవత్సరాల లక్ష్మి బాధ్యత పూర్తిగా నాది అయింది. పుట్టింటి అండ లేదు. అప్పటికీ ఇంకో ఇల్లు తీసుకుని వెళ్లిపోదామని ప్రయత్నించాను. కాని మామగారు పడనివ్వలేదు. ఇద్దరు అన్నదమ్ముల మధ్య శశి ఒక్కడే  మగపిల్లవాడని, వాడు ఆ ఇంట్లోనే పెరగాలని పట్టు పట్టారు. నాకు అక్కడే ఉండక తప్పలేదు. మామగారు అత్తగార్లు పిల్లల భాద్యత తీసుకున్నారు. నేను ఆ ఇంట్లో ఉంటున్నా పిల్లల పనులన్నీ వారే చేసేవారు. కొన్నాళ్లు నా దుఃఖంలో  నేనుండి వాళ్లను పట్టించుకోలేదు. అప్పటికే వాళ్ళు పెద్దవాళ్లకు మాలిమి అయ్యారు. రాత్రి వాళ్ళ మధ్యనే పడుకునేవారు. అప్పటికీ పిల్లలను దగ్గరకు తీసుకోవాలని నేను ఎంతో ప్రయత్నించాను. నా కొడుకు లేడు, మనవడిలో వాడిని చూసుకుంటున్నాం అనే వారి సెంటిమెంట్ తో నేను మౌనంగా ఊరుకోవలసి వచ్చింది. ఒంటరిగా పడుకుంటున్న నా గదిలోకి సుధాకర్ ఓ రోజు వచ్చి బలవంతంగా నన్ను ఆక్రమించుకున్నాడు. ప్రొద్దున్న వంట గదిలోకి వెళ్లి రమ ముఖం చూడలేకపోయాను. ఏమీ అనలేని పరిస్థితి. అప్పటికే పిల్లలు నా దగ్గర కన్నా వాళ్లందరి దగ్గర చేరిక అయ్యారు. నా అవసరం వారికి లేనట్లే ప్రవర్తించేవాళ్ళు. కాని వాళ్లు నా పిల్లలు, నేను వాళ్ళను చూసుకోవాలి అనుకుంటూ వాళ్ళ కోసం అన్నీ దిగమింగుకూంటూ జీవించడం అలవాటు చేసుకున్నాను”.

“సుధాకర్‌ను నా గదిలోకి రాకుండా చేయాలని చాలా కష్టపడ్డాను. గది లోపల గడి పెట్టుకుని పడుకునేదాన్ని. కాని అర్ధరాత్రి తలుపు గట్టిగా కొట్టేవాడు సుధాకర్. పక్క గదిలో నా పిల్లలు అత్త మామలు, ఎదురు గదిలో రమ వాళ్లకి ఇవి వినిపిస్తూనే ఉండేవి. అయినా ఎవరూ అడ్డుపెట్టేవాళ్లు కాదు. ఓ రోజు ఎంత గట్టిగా తలుపు కొట్టినా నేను తీయలేదు. మరుసటి రోజు మా అత్తగారు వంటింట్లోకి వచ్చి, కొన్ని విషయాలు చూసి చూడనట్లు సర్దుకుపోవాలి. నీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన లేదా. వాడికి రమతో పెద్దగా సుఖం ఎప్పుడూ లేదు. వాడేం చెడ్డవాడు కాదు. నీ పిల్లలకు తండ్రి ప్రేమను పంచుతాడు. రమ కూడా దీనికి అడ్డు చెప్పదు. రెండో కూతురు పుట్టిన తరువాత దానికి సంసారంపై ఆసక్తి పోయింది. గొడవ చేయకుండా సర్దుకుపోతే నీ పిల్లలు ఓ దారిలోకి వస్తారు. వాడికి మాత్రం పిల్లల భాద్యత తీసుకోవాలని ఎందుకు అనిపిస్తుంది? రమకు చేదోడు వాదోడుగా ఉంటే నీ జీవితం గడిచిపోతుంది, అని చెప్పినప్పుడు గుండె పగిలేలా ఏడ్చాను. నాకంటూ ఓ జీవితం ఉండాలని ఆ ఇంట్లోకి చేరినప్పటినుండి నేను చేసిన ప్రయత్నాలకు ఆ రోజుతో గండి పడింది. ఆ రోజు నుండి ఆ ఇంటి గడప దాటలేదు నేను”

“రమకు విషయం అంతా  తెలుసు. ఆమెకు ఇంటి పెద్ద కోడలిగా తన స్థానం ముఖ్యం. భర్త ఆమె చెప్పినట్లు వినాలి. ఆమె పిల్లలు, నా పిల్లలు అందరూ ఆమెను దేవతగానే చూస్తారు. వారందరికీ చాకిరి చేసేది మాత్రం నేను. కాని ఆ ఇంట్లో నా స్థానం మాత్రం పనిమనిషిదే. ఏ శ్రమ పడకుండా రమ ఉమ్మడి సంసారం సాగుతూనే ఉంది. అత్త మామగార్ల వృద్దాప్యంలో సేవలు చేసే మనిషిని నేను. రమకు మాత్రం ముసలివాళ్లను అప్యాయంగా చూసుకున్న కోడలని పేరు. పైగా నా పిల్లలకు తల్లిగా అన్నీ చేస్తుందని, చదువు లేని నేను పిల్లలను తను పెంచినట్లు పెంచలేనని, అందుకని నా పిల్లల భాద్యత కూడా తానే తీసుకుందని ఆమెకు సమాజంలో గౌరవం”.

“అయినా నేను అన్నీ భరించాను. ప్రొద్దున రమ అధికారం, రాత్రిళ్ళూ సుధాకర్ అత్యాచారం. వీటన్నిటి  మధ్య అనాథలుగా ఏ అండ లేకుండా నా పిల్లలు మిగిలిపోకూడదన్న ఆలోచనే నన్ను నడిపించింది. వయసులోకి వస్తున్న నా పిల్లలకు ఆ ఇంట్లో నా స్థానం అర్ధం అయి నేనంటే ఏ విలువ లేకుండా పోయింది. వారికి అంతా పెదనాన్న పెద్దమ్మలే. మా అమ్మకి ఏమీ తెలియదు, పిచ్చి మొద్దు అనే స్థానం నుంచి, పెద్దమ్మకు ఈమె అన్యాయం చేసింది అన్న ఆలోచన వైపుకు తెలివిగా పిల్లలను మరల్చింది రమ. వారి ముందే కన్నీళ్లు పెట్టుకుంటూ సుధాకర్‌తో నా సంబంధం గురించి ప్రస్తావిస్తూ జాలిగా తన పిల్లలను దగ్గరకు తీసుకుంటున్నప్పుడు మగపిల్లవాడైన శశి ఆ ఇద్దరు ఆడపిల్లలకు అన్నగా తను నిలబడాలని, తన తల్లి ఆ పిల్లలకు చేస్తున్న అన్యాయాన్ని తాను సరి చేయాలని నిర్ణయించుకున్నాడు. అప్పటి నుండి వాడికి పెద్దమ్మ, పెద్దమ్మ పిల్లలే లోకం. అమ్మ వాడి దృష్టిలో ఆ సంసారాన్ని దుఖమయం చేస్తున్న స్త్రీ. పెద్దమ్మ త్యాగం ముందు వాడు తనను తాను ఆ దంపతులకు సమర్పించుకున్నాడు.”

“ఇంతా చేసి పెదనాన్నతో వాళ్ళకు వైరం లేదు. నాకు కొన్నాళ్లు ఈ విషయం అర్థం అయ్యేది కాదు. చివరకు తెలిసింది. పెదనాన్నతో వారి అవసరాలు ఉన్నాయి. తన అవసరం వారికి ఉండేటట్లుగా ఆయన కుటుంబ పరిస్థితులను తీర్చిదిద్దుకున్నాడు. పెదనాన్న వాళ్ళ భవిష్యత్తును తీర్చిదిద్దగల సమర్థుడు. వారికి కావలసినవి అన్నీ అమర్చే వ్యక్తి.  ముఖ్యంగా ధనికుడు, సమాజంలో స్థానం ఉన్నవాడు. అతన్ని దూరం చేసుకునే తప్పు వాళ్ళు చేయలేరు. కాని నేను వారికి పనికి రాను. వారి కోపాన్ని, అసహ్యాన్ని ప్రదర్శించడానికి నేను వారికో వస్తువును అయ్యాను. ఇక ఇంటి స్నేహితులకు బంధువులకూ అందరికీ రమ దేవత. మరిది పిల్లలను, అసమర్థురాలయి, ఏ అండ లేని మరదలిని ఇన్ని సంవత్సరాలుగా కాపాడుకొస్తున్న దేవత. శశికి లక్ష్మికి ఆమె మాటే వేదం. తన పిల్లలకు సంబంధించిన ప్రతి విషయాన్ని శశి జీవితాంతం చూసుకుంటూ ఉండేలా వాడిని తనవైపుకు తిప్పుకుని తన బిడ్డలకు అండ ఏర్పరుచుకుంది ఆమె. దాని కోసం సుధాకర్‌తో నా సంబంధాన్ని పదే పదే ప్రస్తావిస్తూ శశిని అపరాధభావంతో ఆ ఇంటికి జీవితాంతం కట్టిపడేసుకుంది.”

“శశి వ్యాపారంలో చొరవ చూపిస్తుంటే అతన్ని ప్రోత్సాహరుస్తూనే మెల్లిగా అతన్ని ఉద్యోగం వైపుకు మళ్లించాడు సుధాకర్. అతను ఏర్పరుచుకున్న అస్తులు, మిగిల్చుకున్న రొక్కం గురించి తెలియకుండా జాగ్రత్తపడడానికి బిజినెస్ కన్నా ఉద్యోగం ఒత్తిడి లేకుండా ఉంటుందని శశిని వ్యాపారానికి దూరం చేసి, తెలివిగా వ్యాపారంపై తన ఏకచక్రాధిపత్యాన్ని సుస్థిరం చేసుకున్నాడు. శశికి లక్ష్మికి అతను ఇస్తుంది అతను సంపాదిస్తున్నదాంట్లో రాధాకృష్ణ వాటాలో పావు వంతు కూడా కాదు. ఈ సంగతి శశి ఎప్పటికీ గ్రహించలేడు.”

“మామగారు, ఆత్తగారు మరణించాక, రమ పిల్లల సేవ కూడా నా బాధ్యతే అయింది. ఆమె పిల్లలిద్దరికీ అన్ని సమయాలలో చాకిరికి నేనే బలి అయ్యాను. కాని నేను చేసిన ఏ పని కూడా ఆ ఇంటికి లెక్కలోకి రానిది.”

“శశి పెళ్ళి విషయంలో అతని ఉద్యోగం విషయంలో ఎక్కడా నా ప్రమేయం లేదు. ఏ పిల్లల కోసం నేను నన్ను నేను పోగొట్టుకుని మిగిలిపోయానో ఆ పిల్లల దృష్టిలో నేను సంసారాన్ని కూల్చే ఆడదాన్ని. శారీరిక సుఖం కోసం ఇంటి యజమానిని బుట్టలో వేసుకున్న పతితను.”

పూజ భవానినే చూస్తూ కూర్చుంది. తన కథ చెబుతున్నంత సేపూ భవాని అదే నిర్వికార భావంతో ఎవరి గురించో చెబుతున్నట్లే రాయిలా కూర్చుని ఉంది. ఆమె కథ వింటున్న అ ఇద్దరి కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నా భవాని కళ్ళల్లో నీటి చెమ్మ లేదు. ఆ కళ్ళు ఎటో చూస్తున్నాయి. పూజకు ఆమెను చూస్తుంటే లోపల నుండి ఓ వణుకు మొదలయ్యింది. ఆమె హృదయంలో భరించరానివేదన అదుపుతప్పి ఉబికిఉబికి వస్తోంది.

“సరే. ఆ ఇంట్లో అంత నరకం అనుభవిస్తున్నావు. మరి లక్ష్మితో ఆ ఇల్లు దాటి పోవచ్చు కదా. ఇదంతా తప్పించుకునే అవకాశం వచ్చినా ఎందుకు ఇక్కడే ఉండాలని  మొండిపట్టు పడుతున్నావు” ప్రశ్నించింది అరుణ. రమ పట్ల అరుణ ప్రేమ ఆమెను కలవర పెడుతుంది. భవాని చెబుతున్నది ఆమెకు నమ్మశక్యంగా లేదు.

“నేను ఇక్కడే ఉంటాననలేదు. లక్ష్మి ఇంటికి వెళ్ళనన్నాను” అంది భవాని

“అదే ఎందుకు. విలువ లేని ఈ ఇంటి నుంచి విముక్తి దొరుకుతుంటే. ఎందుకు ఒద్దంటున్నావు” అనుమానంగా ఆమెనే చూస్తూ అడిగింది అరుణ.

అరుణ కళ్ళల్లోకి సూటిగా చూస్తూ ‘నేను ఇన్నాళ్లు ఈ అవకాశం కోసమే ఆగాను. లక్ష్మి తన ఇంటికి వెళుతుంటే తనతో వెళ్లాలని సిద్దపడ్డాను. కాని” ఆగిపోయింది భవాని

“ఏమయింది భవానీ”. ఈ సారి పూజ ప్రశ్నించింది.

“లక్ష్మి కొత్త కాపురంకి కావలసిన పచ్చళ్లు ఓ రోజంతా కూర్చుని తయారు చేసాను. సీసాల్లో ఆ పచ్చళ్లను సర్ది కిచెన్ అరుగు పై ఆ సీసాలన్నీ ఉంచి నా బట్టలు సర్దుకుందామని గదిలోకి వెళ్ళాను. లక్ష్మి భర్తతో ఏదో షాపింగ్ కని బైటకు వెళ్లింది. అప్పుడే వచ్చినట్లుంది. రమ తను ఇద్దరూ వంట గదిలో చేరి ఆ పచ్చళ్లను ప్యాక్ చేస్తున్నారు. ఎప్పుడయినా వండి పెట్టడం నా పని అయితే వాటిని కావల్సిన వారికి సర్ది పెట్టడం గృహిణిగా రమ పని. రాత్రి పెట్టి ఉంచిన చికెన్ పచ్చడి అలమారలో పెట్టాను. అది తీసి ఇద్దాం అని నేను వంటగదిలోకి వెళ్లాను. అక్కడ పెద్దమ్మతో కబుర్లు  చెబుతున్న లక్ష్మి మాటలు నా చెవిన పడ్డాయి”

గొంతు బొంగురుపోతూ ఉంటే కొంచెం సర్దుకుని చెప్పసాగింది భవాని. “రమ అటు తిరిగి పచ్చడి సీసాలను సర్దుతూ లక్ష్మితో – మీ అమ్మ చిన్నతనంలోనే భర్తను పోగొట్టుకుని అన్ని సుఖాలకు దూరం అయింది. తనకీ అవసరాలు ఉంటాయి కదా మీ పెదనాన్నకు దగ్గరయ్యింది. నేను ఎలాగోలా ఇప్పటి దాకా నెట్టుకొచ్చాను. మీరు నన్ను అర్థం చేసుకుని కుటుంబ పరువు కాపాడారు. కాని నీ సంసారంలో ఈ ఇంట్లో జరిగిన తప్పు అక్కడ జరగకుండా చూసుకోవడం నీ బాధ్యత. కొంచెం తెలివిగా ఉండు లక్ష్మి. నాలాగా అన్యాయం అవద్దు అంటూ చెప్పడం, లక్ష్మి కళ్ళ నీళ్లు చిందిస్తున్న పెద్దమ్మను పట్టుకుని నీకు జరిగిన అన్యాయానికి సారీ పెద్దమ్మా. నాకు ఆమెను తీసుకెళ్ళడం ఇష్టం లేదు. కాని నీ కోసం ఒప్పుకున్నాను. ఒక కంట కనిపెడుతూనే ఉంటాను. ఏదన్నా తేడా వస్తే మాత్రం నీలా సర్దుకుపోను. అమ్మ అయినా సరే పద్ధతి తప్పితే సహించడానికి నేను నీ అంత మంచిదాన్నికాదు పెద్దమ్మా అని పెద్దమ్మను దగ్గరకు తీసుకుని అనునయిస్తుంది. లక్ష్మి నన్ను ఏ దృష్టితో చూస్తుందో అర్థం అయ్యక అరుణా లక్ష్మి ఇంటికి నన్ను వెళ్ళమంటావా?” అంటూ అరుణ కళ్ళల్లోకి సూటిగా చూసింది భవాని.

ఇన్ని సంవత్సరాలుగా భవాని  మొహంలో ఆ కోపం, ఆక్రోశం ఎప్పుడూ చూడని అరుణ ఒక్కసారి నిర్షాంతపోయి ఆమెనే చూస్తూ ఉండిపోయింది. పూజ షాక్ కొట్టినట్లు భవానినే చూస్తుంది.

అరుణ ఫోన్ రింగవడంతో ఉలిక్కిపడ్డారు ఇద్దరు. ఫోన్ వైపు చూసి “రమక్క చేస్తుంది”. అంది అరుణ. భవాని ఆమెతో “డాక్టర్ దగ్గరకు వెళుతున్నానని చెప్పి బయలుదేరాను. భాస్కర్ దగ్గరకు వెళ్లి నీ దగ్గరకు వచ్చాను. నేను ఇక్కడ ఉన్నానని చెప్పు అరుణ” అంది.

భాస్కర్ కూడా ఆ కుటుంబ బంధువే. భవాని సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నప్పుడు వచ్చి చూసి ఆమెకు వైద్యం చేసింది అతనే. అరుణ కాల్ రిసీవ్ చేసుకుని “అక్కా. చెప్పు.. అవును భవాని ఇక్కడే ఉంది. భాస్కర్ దగ్గర కనిపించింది. ఒక్కతే వచ్చిందని నేను ఇంటికి తీసుకుని వచ్చాను. ఇదిగో ఇప్పుడు అక్కడికే బయలుదేరుతున్నాం” అంది.

పూజకు భవానితో ఇంకా మాట్లాడాలనే ఉంది. ఏదో తెలియని ఫీలింగ్ ఆమె మనసుకు ఆక్రమించింది. అరుణ హడావిడి పడిపోతూ బండి కీస్ తీసుకుంటుంది. భవాని కూడా ఇంటికి వెళ్లడానికి లేచింది.

భవాని లేవగానే  మెల్లిగా, స్పష్టంగా  అంది పూజ.

మీ జీవితమంతా మీ కుటుంబంకోసం త్యాగం చేశారు. వాళ్ళకి ఆ గ్రహింపు లేదు. కృతజ్ఞత లేదు. ఇంకా మీరు వారితో వుండాల్సిన అవసరంలేదు. మిమ్మల్ని ఎక్స్‌ప్లాయిట్ చేసేంత కాలం  చేశారు. ఇప్పుడిక మీ దగ్గర దోచుకునేందుకు ఏమీలేదు. మీకూ వారిపై ఎలాంటి ప్రేమలేదు. మీ పిల్లలే మీవారు కానప్పుడు మిమ్మల్ని అసహ్యించుకుని దోచేవారి దగ్గర ఎందుకుంటారు? వారిని వదిలిరండి. మీరు గౌరవంగా ఎలా బ్రతకగలరో ఆలోచిద్దాం. ఇకనైనా మీ బ్రతుకుని మీకు నచ్చిన రీతిలో బ్రతికే  వీలుంది. ఏ బంధాలూ బాధ్యతలు లేవుమీకిప్పుడు.  ఆత్మహత్య ఏ సమస్యకూ పరిష్కారం కాదు.  బహుశా మీకు జీవితం విలువ తెలిసేందుకే మీ ఆత్మహత్య ప్రయత్నం విఫలమయింది. ఆత్మహత్య పిరికితనం.  చివరి క్షణం వరకూ ఎదురునిల్చి పోరాడేవాడే మనిషి. మీ రెండవ ఇన్నింగ్స్ నయినా అర్ధవంతం చేసుకోండి. “

పూజ లేచి నిల్చుని భవానిని చూస్తూ ఉంది. కళ్లెత్తి పూజ వైపు ఓ సారి చూసి వాడిపోయిన చిరునవ్వుతో బైటికి వెళ్తున్న భవాని పూజను కలవర పెడుతుంది. వెళ్తున్న భవాని ఆగి పూజ దగ్గరకు వచ్చింది. పూజను దగ్గరతీసుకుని నుదిటిపై చుంబించింది. ఉబికివస్తున్న కన్నీళ్ళను అదుపులో పెట్టుకుంటూ” మీకు ఏ అవసరమయినా నిర్మొహమాటంగా, అర్ధరాత్రి అపరాత్రి అని చూడకుండా నాకు ఫోన్ చేయడి” అని ఫోను నంబర్ ఆమెకు ఇచ్చింది పూజ.

***

ఓ వారం తరువాత అరుణ దగ్గర నుండి పూజకు ఫోన్.. “పూజా, భవాని  కనబడటంలేదు” చెప్పింది అరుణ కంగారుగా.

పూజకు ఈ వార్త ఎందుకో ఆశ్చర్యం కలిగించలేదు. ఎందుకో భవాని ఆ ఇల్లు వదిలి పారిపోనన్నా పోతుంది, లేక, మళ్ళీ ఆత్మహత్య అయినా చేసుకుంటుందనిపించింది. అందుకే, తను పనిచేసే వాలంటరీ సంస్థ అధికారులతో భవానీ పరిస్థితిని ఎలా మెరుగుపరచాలోనని చర్చిస్తున్నాది. కానీ, భవాని తాననుకున్న దానికన్నా త్వరగా ఇల్లువదలి వెళ్ళింది.

“ఎప్పుడు పారిపోయింది.”

“రాత్రి వీళ్ళకు మొద్దునిద్ర పట్టిందట. తెల్లారి లేచేసరికి ఆలస్యం అయిందట. ఇల్లంతా చిందరవందరగా వుండటంతో భవాని కోసం ఆమె గదికి వెళ్ళారట. ఆమె గదిలోలేదు. ఇల్లంతా వెతికారు. భవాని లేదు. ఎప్పుడూ తనంతట తాను ఇల్లువదలి ఎక్కడికీ వెళ్ళలేదు. అందుకే ఎక్కడికి వెళ్ళుంటుందో, ఎక్కడ వెతకాలో తెలియటంలేదన్నారు. అయితే ఏదో అనుమానం వచ్చి వారు బీరువాలు వెతికారట. బీరువాలోవున్న డబ్బుతోపాటూ నగలు కూడా ఎత్తుకుపోయిందట. అప్పుడు వారికి అర్ధమయింది, రాత్రి వారికి అంత మొద్దు నిద్ర ఎందుకు పట్టిందో. వారికి నిద్ర మాత్రలు ఇచ్చిందట”

“ఇంట్లోంచి బయట అడుగుపెట్టని ఆమెకు నిద్రమాత్రలు ఎక్కడ దొరుకుతాయి” అడుగుతున్న పూజ, తలుపు దగ్గర అలికిడి అవటంతో  ఆగిపోయింది.

వొళ్ళు జలదరించింది. తలుపునుంచి జాలువారుతున్న కాంతి పుంజంలోంచి ఒక ఆకారం నిశ్శబ్దంగా  ఆమె  వైపు నడుస్తూ వస్తోంది.

పూజ రోమాలు నిక్కపొడుచుకున్నాయి.

భవాని దగ్గరకు వచ్చి నవ్వింది.

“నాకూ అదే అర్థం కావటంలేదే. భవానికి నిద్ర మాత్రలు ఎక్కడ ఎలా దొరికివుంటాయి. వాళ్ళింట్లో ఎవ్వరూ నిద్ర మాత్రలు వాడరు. ఎవరికయినా  డబ్బులిచ్చి తెప్పించుకునేందుకు భవాని దగ్గర డబ్బులులేవు.  భవానీకి ఎవ్వరూ తెలియరు”

అరుణ చెప్తూ పోతోంది.

పూజకు మాటలు వినిపిస్తున్నాయి. కానీ అర్ధం కావటంలేదు.

భవానీ దగ్గరకు వచ్చింది. ఆమె ముఖంపై వింత వెలుగుంది. విచిత్రమైన చిరునవ్వు ఆమె పెదవులపై వుంది. ఆమె నెమ్మదిగా ఒక మూట విప్పి టేబిల్ పైన వుంచింది. దానినిండా డబ్బు కట్టలు ఆభరణాలువున్నాయి.

ఆమెవైపు ప్రశ్నార్ధకంగా చూసింది పూజ.

“భవాని  డబ్బులెత్తుకుపోయిందని పోలీసు రిపోర్ట్ ఇవ్వాలనుకుంటున్నారట” చెప్తోంది అరుణ. ఆమె మాటలు ఫోనునుంచి బయటకి వినిపిస్తున్నాయి.

భవాని వైపు చూసింది. చిరునవ్వుతో నా చేతుల్లోంచి ఫోను తీసుకుంది.

“అరుణా” అంది, ఆమెతో ఏదో అనబోతున్న అరుణ మాటలను పట్టించుకోకుండా చెప్పింది.

“పోలీసులదగ్గరకు వెళ్తే వాళ్ళకే ప్రమాదం అని చెప్పు. నిద్రమాత్రలిచ్చి నన్ను చంపాలని చూసినట్టు నిరూపిస్తానని చెప్పు. వాళ్ళిచ్చిన మాత్రల్లో చెరో ఒకటి మాత్రమే వారికిచ్చానని చెప్పు. మిగిలనవన్నీ ఇంట్లోనే నాకే తెలిసిన స్థలంలో దాచాననీ చెప్పు. నేను వాళ్ళ సొమ్ము ఏమీ ఎత్తుకుపోలేదు. నాకు న్యాయంగా రావాల్సిన దాన్లో కొంచెమే తెచ్చాను. ఉమ్మడి వ్యాపారంలో అక్రమంగా కాజేసిని తమ్ముడి వాటాను, తమ్ముడి భార్యకూ, కొడుకు, కూతుళ్ళకూ పంచకుండా ఒక్కడే అనుభవిస్తున్న సంగతి బహిర్గతం చేస్తాననీ, అవసరమైతే కోర్టుకు వెళ్తాననీ చెప్పు. వాళ్ళు మౌనంగా వుంటే నా బ్రతుకు నేను బ్రతుకుతానని చెప్పు. సెలవు..” ఇంకా ఏదో అంటున్న అరుణ మాటలు పట్టించుకోకుండా ఫోను పెట్టేసింది.

“ఈ డబ్బును రెండు   భాగాలు చేసి పిల్లలకు ఇచ్చే బాధ్యతనీదే.  నేను కొత్త జీవితం ఆరంభించేందుకు వచ్చాను. మళ్ళీ ఎవరిమీదా ఆధారపడాలని లేదు. చెప్పండి.. నేను ఎందుకు పనికివస్తాను? ” నవ్వుతూ అడిగింది.

ఆమె చాలా అందంగా కనిపించింది పూజకు. ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం వున్నవారంత అందంగా ఈ సృష్టిలో ఇంకేమీ వుండదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here