[box type=’note’ fontsize=’16’] ఉదయం లేస్తే చుట్టూ జరుగుతున్న సంఘటనలు ఒక్కొక్కసారి ఆనందాన్ని, ఇంకొక్కసారి సంభ్రమాన్నీ కలిగిస్తున్నాయని, వాటిని అక్షరమాలికలుగా చేసి సంచిక పాఠకులకు అందిద్దామనే ఆలోచనే ఈ శీర్షికకు నాంది అంటున్నారు ప్రముఖ రచయిత్రి జి.ఎస్. లక్ష్మి. [/box]
[dropcap]ఈ[/dropcap]మధ్య రెండేళ్ళనుంచీ బైటకి వెళ్ళడం తగ్గిపోయి, ఇంట్లో కూర్చుని ఓటిటిలో సినిమాలు చూడడం ఎక్కువైపోయింది. అలా చాలా సినిమాలు చూసీ చూసీ నేనూ మా వదినా ఆ సినిమాల గురించి ఫోనులో గంటల తరబడి మాట్లాడుకునేవాళ్లం. అలా మాట్లాడగా మాట్లాడగా మా కిద్దరికీ కూడా పోనీ మేమే ఒక సినిమా కథ రాసేస్తే ఎలా ఉంటుందీ అన్న ఆలోచన వచ్చింది. అంతే ఆ ఆలోచన వచ్చింది మొదలు ఇంక మా ఇద్దరికీ ప్రతి సంగతీ ఒక సినిమా కథలాగే కనిపించేది.
ఇంకిలా ప్రతి దాన్ని కథలల్లుకోవడం బాగులేదని అసలు ఏ సబ్జెక్ట్ మీద సినిమా కథ రాయాలో చర్చించుకున్నాం.
నేను – మనం హీరో హీరోయిన్లు ఇద్దరూ ఒకే హాస్పిటల్లో పుట్టినట్టు రాసి, అప్పట్నించీ వాళ్ల మధ్య ప్రేమ పెరుగుతున్నట్టు రాస్తే ఎలా ఉంటుందీ..
వదిన – అబ్బే.. అవన్నీ ఇప్పటికే చాలా సినిమాల్లో వచ్చేసేయి. అలా పుట్టినప్పట్నించీ ప్రేమించుకుంటే ఏం బాగుంటుందీ.. హీరో హీరోయిన్లన్నాక సినిమాలో సగం పైగా ఇద్దరూ దెబ్బలాడుకుంటేనే మజా వస్తుంది. అందుకని వాళ్ళిద్దరూ ఒకళ్ళు ఆంధ్రాలోనూ, ఇంకోళ్ళు తెలంగాణాలోనూ పుట్టినట్టు రాసి, ఎవరి ప్రాంతీయాభిమానం వాళ్ళు చూపించుకుంటూ దెబ్బలాడుకుంటుంటే ఆడియన్స్ చూస్తారు.
నేను (భయంగా) – అమ్మో.. రాష్ట్రాల మాటెత్తితే పొలిటికల్‌గా గొడవైపోతుందేమో.. ఎవరైనా మనం చెప్పిన కథలో తప్పు పట్టుకున్నారంటే చీల్చి చెండాడేస్తారు….
వదిన (నవ్వుతూ) – అప్పుడది నెగిటివ్ పబ్లిసిటీ అయి సినిమా హిట్టైపోతుంది.
నేను – అబ్బే.. ఇంకేదైనా చెప్పు వదినా..
వదిన – అయితే విను.. సినిమాలో హీరోయిన్ అడవిలో పెరిగిన పిల్లన్న మాట.. ఆకులూ, కొమ్మలూ లాంటి తక్కువ బట్టలు కట్టే ఛాన్స్ ఉంటుంది కనక సినిమా హిట్టౌతుంది.
నేను – ఛీ.. వదినా.. కాస్త డీసెంట్‌గా ఉండే సబ్జెక్ట్ చెపుదూ..
వదిన – సరే అయితే…సినిమా మొదట్లోనే హీరో సెంట్రల్ జైల్లోంచి బైట కొస్తూ కనిపిస్తాడు.
నేను – అదేంటీ…దొంగ లెవరైనా హీరో లవుతారా..
వదిన – ఎందుకవరూ.. ఈ రోజుల్లో రౌడీలూ, స్మగ్లర్లూ, దొంగలే కదా హీరోలూ. ఆడియన్స్ బాగా రిసీవ్ చేసుకుంటారు. ఎటొచ్చీ కథలో మలుపులు ఎక్కువుండాలి..
నేను – మలుపులా!
వదిన – ఊ.. మలుపులే .. జైల్లోంచి వస్తూ హీరో కనిపిస్తాడా.. నెక్స్ట్ సీన్‌లో అటూ ఇటూ బోట్లు లైనుగా కనిపిస్తున్నా సరే నదిని ఈ గట్టునించి ఆ గట్టుకి హీరో ఈదుకుంటూ వెడతాడు.
నేను – అదేంటీ.. బోట్లుండగా ఈదుకుంటూ వెళ్ళడం ఎందుకూ!
వదిన – హీరో కదా.. అలాగే వెడతాడు.
నేను – చూసినవాళ్ళు నవ్వరూ..
వదిన – ఎందుకు నవ్వుతారూ.. ఆ బోట్లలో అతన్ని ఎక్కించుకోవద్దని విలన్ వాళ్ళకి చెప్పినట్టు మనం తర్వాత చెప్తావన్న మాట.
నేను (ఉత్సాహంగా) – ఓహ్.. తర్వాత్తర్వాతా..
వదిన – అలా ఈదుకుంటూ నదిని దాటిన హీరో అక్కడున్న ఒక ఓ చెట్టుకొమ్మెక్కి కూర్చుంటాడు. అక్కడ కట్.. ఇప్పుడు హీరోయిన్ని చూపిస్తాం..
నేను – హీరోయిన్ ఆ చెట్టు దగ్గరికి వస్తుందా!
వదిన – హీరోయిన్ అక్కడి కెందుకొస్తుంది. ఆ నదిలో ఉన్న బోటు మీంచి ఇంత పొడుగు తుపాకీ పట్టుకుని హీరోని చంపేద్దామని మంచి ఫోజ్ కోసం చూస్తుంటుంది.
నేను – చంపడానికి ఫోజెందుకూ.. సూటిగా గురి పెట్టాలి కానీ..
వదిన – మామూలు జనాలైతే గురి చూసుకుంటారు. కానీ హీరోయిన్ కదా.. అందుకని తుపాకీని తిరగేసి పట్టుకుని ఒక కాలు నీళ్ళలోను మరోకాలు బోటుమీదా వేసి హీరో ఉన్నవైపు కాకుండా వాడికి వ్యతిరేకదిశలో గురి పెడుతుంటుంది.
నేను(హాశ్చర్యంతో) – హా..!
వదిన – ఆగాగు.. అప్పుడే నోరు తెరిచైకు.. అప్పుడు ఆ హీరోయిన్ దగ్గరికి ఒక గుడ్డి, చెవిటి, మూగదైన ముసలమ్మ వస్తుంది.
నేను – అదెవరు!
వదిన – అది ఆ హీరోయిన్ని పెంచిన ఆయా అన్నమాట..
నేను – అలా గుడ్డిదీ, మూగదీ ఎవరినైనా ఎలా పెంచుతుందీ.. ఆడియన్స్ అడగరూ..
వదిన – హేవీ అడగరు.. అలా పెడితేనే హీరోయిన్ మీద ఆడియన్సుకి సానుభూతి పుడుతుంది.
నేను – అది సరే ననుకుందాం. కానీ మరి అలా తుపాకీ తిరగేసి పట్టుకోవడవేంటీ.. హీరో ఉన్నవైపు కాకుండా ఆపోజిట్ సైడ్ గురి పెట్టడవేంటీ.. నాకేం అర్థం కావటం లేదు..
వదిన – అసలు సంగతేంటంటే…అసలు ఆ హీరోయిన్‌కి తుపాకీ ఎలా పట్టుకోవాలో తెలీదు. అందుకని తిరగేసి పట్టుకుంటుంది.
నేను – అక్కడున్న డైరెక్టరో ఎవరో ఎలా పట్టుకోవాలో చెప్పొచ్చుగా..
వదిన – ఊహూ.. చెప్పరు.. అలా హీరోయిన్‌కీ తెలీదనుకుంటూ ఎవరైనా ఏదైనా చెపితే హీరోయిన్ అమ్మకి ఖోపం వచ్చేసి, హీరోయిన్‌ని తీసుకుని సెట్లోంచి వెళ్ళిపోతుంది.
నేను – మరి అలా తిరగేసి పట్టుకుంటే ఆడియన్స్ నవ్వరూ!
వదిన –ఊహు…నవ్వరు.. మామూలుగా పట్టుకుని, సూటిగా గురి పెడితే హీరోయిన్‌కీ మిగిలినవాళ్లకీ తేడా ఇంక ఏవుంటుందీ…సినిమా రిలీజయిన మర్నాటినించీ చూడూ… ఫాన్సందరూ తుపాకీ తిరగేసి పట్టుకునే కనపడతారు.
(వదిన గొంతులో అత్యుత్సాహం) అప్పుడు అక్కడ మనం ఆ తుపాకీ చరిత్ర ఆ ముసల్దాని చేత చెప్పిస్తాం…
నేను – ముసల్ది మూగ దన్నావు కదా!
వదిన – అవునూ.. ముసల్ది పెదాలు కదపడం చూపిస్తాం.. ఆ లిప్ మూవ్‌మెంట్‌ని బట్టి హీరోయిన్ అర్ధం చేసుకుంటుంది. అదంతా మనం బ్యాక్‌గ్రౌండ్‌లో చెప్పిస్తాం.. హీరోయిన్ కళాకౌశలానికి ఆడియన్స్ డంగైపోతారు.
నేను –(ఆత్రంగా) – ఏవిటా చరిత్ర వదినా!
వదిన – పిచ్చి స్వర్ణా.. అసలు పాయింట్ అలా చెప్పేస్తారా ఎవరైనా! సినిమా తీసేవాళ్ళ దగ్గర ఇలా కొంచెమే చెప్పాలి. ఇందులో ఉన్న బ్యాక్‌గ్రౌండంతా ఎవరు సినిమా డబ్బులు పెట్టి తీస్తామని ముందుకొస్తే వాళ్లకి మాత్రమే చెప్పాలి. లేకపోతే మన కథని ఇంకోళ్ళు వాళ్ల పేరు పెట్టుకుని తీసేసుకుంటారు. అందుకని అసలు సస్పెన్స్ దాచిపెట్టి జస్ట్ స్టోరీ లైన్ మాత్రమే చెప్పాలి.
నేను (ఆశ్చర్యంగా) – అవునా!
వదిన – అవును.. ఆ తర్వాత సీన్లో హీరోయిన్ జారిపోతున్న బట్టల్ని సర్దుకుంటూ హీరో ఎక్కిన చెట్టు దగ్గర కొస్తుంది.
నేను – మరిందాక బోటు మీంచి తుపాకీ గురీ అంటూ ఏదో చెప్పేవ్..
వదిన – నువ్వలా లాజికల్‌గా ఆలోచించకూడదు. అచ్చ తెలుగు ప్రేక్షకుల్లాగా సినిమాని అలా ఫాలో ఐపోవాలంతే..
నేను – సర్లే.. వచ్చి ఏం చేస్తుంది.. హీరోని కర్ర పుచ్చుకుని కొడుతుందా!
వదిన – అదిగో.. నువ్వింకా పాత సీన్ దగ్గరే ఉన్నావ్.. సీన్ సీన్‌కీ హీరో పట్ల హీరోయిన్ అభిప్రాయాలు మారిపోతుంటాయి. ఇప్పుడు చేతిలో ఒక ఆకుదొన్నెలో మజ్జిగన్నం పెట్టుకుని హీరో దగ్గరికి వస్తుందన్న మాట..
నేను – ఆకు దొన్నెలో ఎందుకూ! వాళ్ళింట్లో గిన్నెలూ, ప్లేట్లూ లేవా..అయినా ఏ స్వీటో.. పాయసవో తెస్తారు కానీ మజ్జిగన్నం తేవడ వేవిటీ అసహ్యంగా..
వదిన – (గట్టిగా) ప్రశ్న లడగొద్దన్నానా..స్వీట్లూ, పాయసాలూ పట్టుకెళ్ళేది పాతకాలంలో హీరోయిన్లు. ఇప్పటివాళ్ళు చేపల పులుసులూ గట్రా పట్టికెడుతున్నారు. మనకి నాన్ వెజ్ వంటలు తెలీవు కనక చాలా ఆలోచించి మజ్జిగన్నం అన్నాను.
నేను – మజ్జిగన్నానికి అంత ఆలోచనెందుకో..
వదిన – ఎందుకంటే.. ఆ మజ్జిగన్నం హీరోకి పెడుతూ హీరోయిన్ దానిమీద పాట పాడుతుందన్న మాట..
నేను – మజ్జిగన్నం మీద పాటా!
వదిన – అవును.. మజ్జిగన్నం మంచిగుంటది. మజ్జాన్నం తినర బావా.. అంటూ హీరో కొమ్మల అంచుల మీద కూర్చుంటే కిందనుంచి ఆ చెట్టు చుట్టూ తిరుగుతూ, గెంతుతూ హీరోయిన్ పాడుతుంది.
నేను( శంకరాభరణం లో శంకరశాస్త్రిగారిలాగా) – వదినా (అంటూ గట్టిగా అరిచేసేను.) మజ్జాన్న మేవిటి మజ్జాన్నం.. మధ్యాహ్నం అని కదా అనాలి.. ఆ మాత్రం తెలీదూ..!
వదిన – (తీరుబడిగా) తెలీకేం తెల్సు.. కానీ మనం మధ్యాహ్నం అని రాస్తే పలకడం ఆ హీరోయిన్‌కీ తెలీదు.. పాడడం ఆ పాడేవాళ్ళకీ చేతకాదు. ఇప్పటి సినిమాపాటల్లో వింటంలేదూ! కల్లు చెప్పేయి.. పెల్లి చేసుకుందాం అనే పాటలు. అందుకని ఎలాగూ వాళ్ళు పలకలేరని ముందే మజ్జాన్నం అని రాసేసానన్న మాట..
అంతే కాదు.. మజ్జిగన్నం మజ్జాన్నం అంటే ప్రాస కుదుర్తుంది కానీ మజ్జిగన్నం మధ్యాహ్నం అంటే కుదుర్తుందా! తెలుగుపాటకి భాష కన్న ప్రాస ముఖ్యం.. తెల్సుకో..
నేను – హతవిధీ.. నాకేవీ అర్ధం కావటం లేదు.
వదిన – నీకవదు. అందుకే ఎవరైనా సినిమాకథ చెప్పమంటే నా దగ్గరికి పంపించు. సరేనా!
“అలాగే వదినా..” అన్నాను నేను బుధ్ధిగా.
అందువలన యావన్మందికీ తెలియజేయున దేమనగా ఎవరైనా సినిమా తీయదల్చి కథకోసం చూస్తుంటే నా దగ్గరికి రండి. మా వదిన దగ్గర సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ కథ ఒకటి ఉంది.. నేను మిమ్మల్నివదిన దగ్గరికి తీసికెడతాను..
ఇంతకన్న ఓపెన్ ఆఫర్ మీకింకెక్కడా దొరకదు..