కథా సోపానములు-13

0
11

[box type=’note’ fontsize=’16’] డా. బి.వి.ఎన్. స్వామి ‘కథా సోపానములు’ అనే శీర్షికతో అందిస్తున్న వ్యాస పరంపరలోనిది ఈ వ్యాసం. కథకి తగిన ‘శైలి’ ఎంత అవసరమో వివరిస్తుంది. [/box]

శైలి

[dropcap]శై[/dropcap]లి-ఆంగ్లంలో స్టైల్. నిత్యవాడకంలో ఈ పదాన్ని చాలా సార్లు ఉపయోగిస్తుంటాము. “ఏం స్టెల్ రా వాంది!” “మస్తు స్టైల్ గా ఉంటది” ఇలాంటి మాటలు వినపడతుంటాయి. ఈ మాటల అర్థం ఏదైనా అందులో ఒక అంతరార్థం ఉంది. అది ఆయా వ్యక్తుల ప్రత్యేకత. నడక, మాట, పని, ఆలోచన, కట్టు-బొట్టు, తిండి-తిప్పలు ఇలా అన్నిట్లో ఒక వ్యక్తి పాటించే విధానం, అతనికి పదిమందిలో ప్రత్యేకతను తెచ్చి పెడుతుంది. దాన్నే అతని శైలిగా చెప్పవచ్చు. ప్రతి మనిషికి తనదైన ఒక ప్రత్యేకత ఉంటుంది. కొందరిలో అది భౌతికంగా కనిపిస్తుంది. మరికొందరిలో అది వ్యవహారంలో కనిపిస్తుంది. మొత్తానికి అందరికి శైలి అనేదొకటి ఉంటుంది. ఇది కుటుంబం, పరిసరం వల్ల ఏర్పడుతుంది. మంచి శైలి కలిగి ఉంటే పేరుకొస్తాడు. లేకుంటే లేదు. ప్రతి రచయితా తనదైన రచనా శైలిని కలిగి ఉంటాడు. దాన్ని అతడు ఎప్పటికప్పుడు పుటం పెట్టుకోవాలి.

కొందరి వాక్యాలు సూటిగా, చిన్నవిగా ఉంటవి. మరికొందరు అందుకు భిన్నం. కామాలు, ఫుల్ స్టాప్లు, ఇన్వర్టెడ్ కామాలు, ఆశ్చర్యార్థకాలు, సంబోధనాత్మకాలు, సంభాషణలు మొత్తంగా చెప్పాలంటే పంక్చుయేషన్స్! అన్నీ కూడా శైలి కిందికే వస్తాయి. చిన్న చిన్న పేరాలుగా విభజించి రాయడం శైలి కిందికే వస్తుంది. రచనలో మొదటి నుండి చివరి వరకు సాగే వాక్యరచనా పద్దతి శైలి. రచయిత శైలి ద్వారానే గుర్తింపులోకి వస్తాడు. వస్తువు సామాజికము. శైలి వ్యక్తిగతము. ప్రతి రచయితకు తనదైన వాక్య నిర్మాణ పద్ధతి ఉంటుంది. అదే అతని శైలిగా చెప్పవచ్చు. రచన వద్దకు వచ్చే సరికి చాలా మంది శైలి ఒకే రకంగా కనిపిస్తుంది. భిన్నశైలి ఉన్న రచయిత రాణిస్తాడు. అతడు సొంత గొంతుక, ముద్ర కలిగి ఉంటాడు.

వస్తు, శిల్పాలకు ప్రాణం పోసేది శైలి. స్పష్టంగా, సంక్లిష్టంగా, సరళంగా ఉన్న వాక్య రచన అలరిస్తుంది. పాఠకుణ్ణి ప్రభావితం చేసి చదివిస్తుంది. మంచి కాలక్షేపం కావాలన్నా, మనిషిని కార్యోన్ముఖుణ్ణి చేయాలన్నా అది శైలితోనే సాధ్యం, మాటల కూర్పు, సక్రమమైన భాష, మంచి శైలికి సహాయకారులు. అడ్డదిడ్డ వాక్యం హానిచేస్తుంది. అది చెడ్డశైలిగా మిగులుతుంది. మాటల గారడీవల్ల మంత్రముగ్ధులవుతారు. పదచిత్రాల వల్ల ఆకర్షితులవుతారు. వీటికన్న అర్థం చేయించగలిగే వాక్యం మిన్న. ఇవన్నిటిని ఉపయోగించి పాఠకుణ్ణి తనతో ఏకీభవింప చేసుకోగలిగే రచయిత శైలి గొప్పది. ఇలాంటి రచయితలు కొద్దిమందే ఉంటారు. కథలో వస్తువుకు ఎంత ప్రాధాన్యం ఉందో, దాన్ని పాఠకుడికి అందించే శైలికి కూడా అంతే ప్రాధాన్యం ఉంది. పలుకుబడులు, సామెతలు, యాసభాషలు, నుడికారాలు, శైలికి తోడ్పడుతాయి. వాడి, వేడి, చురుకు, కరుకు ఉన్నవాక్యం చలంది. అది ఆయన శైలి. వాక్యం నిడివి, సరళత, సూటిదనం, గాంభీర్యం లాంటి లక్షణాల్ని కలిగి ఉండాలి. వాటిని సందర్భోచితంగా కథలో వాడగలగాలి. శబ్దం మీద సాధికారత శ్రీశ్రీ శైలి. “పదండి ముందుకు పదండి తోసుకు” అని చదివితే పరిగెత్తాలనిపిస్తుంది. అది శైలీ ప్రభావం. చలానిది కూడా ఇలాంటి శైలే. చలం వస్తువును ఒప్పుకోనివారు, శైలి గొప్పతనాన్ని ఒప్పుకున్నారు. ఉపమాలంకారం రావిశాస్త్రి శైలి విశిష్టత. హాస్యము, వ్యంగ్యము శైలీ మార్గాలు. కథలోని ప్రతీ చోట సందర్భానికి తగినట్లు శైలీ విన్యాసాన్ని ప్రదర్శించవచ్చు. గ్రాంథిక, ప్రామాణిక, మాండలికాలు ఆయా కాల, ప్రాంత వస్తు స్వభావాల్ని బట్టి కథల్లో కొలువు దీరుతాయి. మనిషికి లక్షణమున్నట్లు, రచనకు శైలి ఉంటుంది. శైలి కథనంలో భాగంగా ఉంటుంది. అలా ఉండి పాఠకుడికి ఒక “ఫీల్”ను అందిస్తుంది.

యుక్తమైన స్థలాల్లో యుక్తమైన మాటలుండాలనడమే శైలి యొక్క యదార్థమైన నిర్వచనం” – జోనథన్ స్విఫ్ట్

భాష ద్వారా కనిపించే భౌతిక సౌందర్యం శైలి. కథలో ఉపయోగించే భాషా పద్దతి శైలి. ఒక ముస్లిం తన మతస్థుడితో ఉర్దూలో మాట్లాడుతాడు. మరొక మతస్థుడితో ఉర్దూలో మాట్లాడడు. ఈ రెండు సన్నివేశాల్ని చిత్రించే కథకుడు ఆయా సందర్భానికి తగిన భాషను వాడాలి. అదే యువకుడు తన భార్యతో మాట్లాడే విధం వేరుగా ఉంటుంది. అతడు కోపంగా ఉన్నప్పుడు ఒక రకంగా, విషాదంలో మరోరకంగా, సంభ్రమాశ్చర్యాలలో ఒక తీరు, ఇలా మనిషి ఒక్కో సందర్భంలో వేరు వేరుగా మాట్లాడుతూ, వ్యవహరిస్తాడు. ఆ మాటలు, వ్యవహారం, రచనలో శైలిగా పిలువబడుతాయి. రచయిత ప్రతిభకు శైలి గీటురాయి. డొంక తిరుగుడుగా చెప్పడం కూడా ఒక శైలి, కానీ అది మంచిది కాదు. ఎంత సరళంగా, సూటిగా, క్లుప్తంగా వాక్యం రాస్తే అంత మంచిది. ప్రవాహసదృశ్యంగా, ప్రత్యేక లక్ష్యంతో ఉండేశైలిని అలవరచుకోవాలి. ఇది చెబితే, చదివితే, వింటే రాదు. సాధన చేస్తే మాత్రమే అబ్బుతుంది.

చాలా తక్కువ మంది రచయితలలో శైలి ఒక ముద్రగా భాసిస్తుంది. మిగతా వారి రచనలో పూసలలో దారంలా ఉంటుంది. అక్షరాలను ఆటాడించడం, శబ్దంతో చాకిరి చేయించడం అందరికీ సాధ్యం కాదు. పలుకుబడులలోని విరుపులను దృశ్యమానం చేయడం, పదాలతో సంగీతాన్ని వినిపిచండం కొందరికే సాధ్యం. ఇదంతా శైలీ విన్యాసం. మనిషి తన లక్షణాన్ని మార్చుకోవడం సులభం కాదు. ఒక వేళ మార్చుకొని ఉన్నత లక్షణాల్ని అలవరచుకొన్నచో గొప్పవాడు అవుతాడు. అట్లే రచయిత అభ్యాసముతో తన శైలిని మెరుగుపరుచుకోవచ్చు. పదాల ఎంపిక, పదబంధాల పొందిక, రెండు వాక్యాల మధ్య కూర్పు, వాక్య సరళి, స్వరం, అలంకారాలు, పదలయ, తూగు ఇవన్నీ శైలీ కిందికి వస్తాయి. ముందే చెప్పుకున్నట్లు వైయక్తిక ప్రభావాల్ని బట్టి “శైలి” ఏర్పడుతుంది. సమయసందర్భాలు, అభిరుచులు, అలవాట్లు, సంస్కారాలను బట్టి శైలులు ఏర్పడతాయి. కథలకు కూడా ఈ రీతి వర్తిస్తుంది.

(మరోసారి మరో అంశంతో)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here