కథా సోపానములు-6

13
10

[box type=’note’ fontsize=’16’] డా. బి.వి.ఎన్. స్వామి ‘కథా సోపానములు’ అనే శీర్షికతో అందిస్తున్న వ్యాస పరంపరలోనిది ఈ వ్యాసం. కథకి తగిన ‘వర్ణనలు’ ఎంత అవసరమో వివరిస్తుంది. [/box]

పాత్రలు

[dropcap]ప్ర[/dropcap]పంచంలో మనుషులు అంతటా ఉన్నారు. ఒకరిని పోలిన వారు మరొకరు ఉండడం అరుదు. కవలలు ఇందుకు మినహాయింపు. మనిషి రంగు, రూపులపై ప్రదేశ ప్రభావము ఉంటుంది. శరీరాకృతి కూడా ఒక్కలా ఉండదు. అనేక వ్యత్యాసాలు మనుషుల రూపురేఖల్లో కనపడుతాయి. మనిషి బహురూపులోడు. ఇది గుణానికి కూడా వర్తిస్తుంది. పుట్టుకతో వచ్చిన గుణం పుడకలతోనే పోతది అంటారు. పుట్టుకతో వచ్చిన గుణంతో పాటు ఎదుగుతున్న సమాజం నుండి అందిపుచ్చుకున్న గుణాలు మనిషిలో తిష్ట వేస్తాయి. కనుక మనిషిని అంచనావేయడం బ్రహ్మకష్టం. సముద్ర లోతుల్ని, శిఖరాల అంచుల్ని తాకవచ్చు, కాని మనిషి లోతులను కనుక్కోవడం కష్టం. రంగులు మార్చడం, పూట గడపటం అనేవి ఆధునిక జీవితానికి సంక్లిష్టతను చేకూర్చాయి. అభివృద్ధి చెందే క్రమంలో మనిషి చేసే చర్యలు, వాటి ఫలితాలు మనిషిలో గుణాత్మక మార్పులకు శ్రీకారం చుట్టాయి. కాలంతో పాటు సమస్యలతో సహజీవనం చేసే మనిషి. తనను తాను పుటం పెట్టుకుంటూ శారీరక, మానసిక మార్పులకు గురి అవుతున్నాడు. అత్యున్నత చట్టసభలు చేసే చట్టాలు, ఉన్నత న్యాయస్థానాలిచ్చే తీర్పులు సమాజగమనాన్ని కొత్తరీతుల్లో నడిపిస్తున్నాయి. ఇవి అంతిమంగా మనిషి వ్యక్తిత్వ నిర్మాణాన్ని తీర్చిదిద్దుతున్నవి. ఇవన్నీ కూడా మనిషి ప్రవర్తనలో కనిపిస్తాయి. “లోకోభిన్నరుచిః” అంటారు. “పుఱ్ఱెకో బుద్ధి జిహ్వకో రుచి” అంటారు. అంతిమంగా తెలిసేదేమిటంటే ప్రతి మనిషి ఒక యూనిక్. అలాంటి మనిషి, కథలో ఒకపాత్రగా మసలుతాడు. మనుషులు ఎన్ని రకాలుగా ఉంటరో పాత్రలు అన్ని రకాలు. జీవితంలో ఒక మనిషిని ఇష్టపడడం, పడకపోవడం అనేది సాధారణం. కథా విజయానికి పాత్రల ఎన్నిక ఐచ్చికం. పాత్రలు కథా గమనానికి చోదకశక్తులు. నాటకీయత పండించడంలో, సంభాషణల్ని పరిగెత్తించడం లోను పాత్రలు గణనీయమైన పాత్ర పోషిస్తాయి. పాత్రలు లేని కథలు కూడా ఉంటాయి. కేవలం కథనంలో కూడా పరోక్షంగా పాత్ర గోచరిస్తూ ఉంటుంది. ఆ మాటకొస్తే కథకుడు కూడా పాత్రనే. ఎందుకంటే ప్రతీ కథ, పాఠకుడితో చేసే సంభాషణే. మానవ జీవిత చిత్రణను ప్రధానం చేసుకున్న కథ మనిషి లేకుండా నడవదు. కనుక కథలో పాత్రలు అత్యంత విశిష్టమైనవి. మనుషులే కాదు పశు పక్ష్యాదులు, నిర్జీవ పదార్థాలు కూడా పాత్రలు కావచ్చు.

కథ చెప్పడానికి ఏ విషయాన్నయితే ఎన్నుకుంటామో, దానికి మాత్రమే చెందిన వ్యక్తులను పాత్రలుగా తీసుకోవాలి. విషయానికి సంబంధంలేని పాత్రలను ప్రవేశపెట్టకూడదు. కథ చెప్పే క్రమంలో మనకు ఇష్టమైన వ్యక్తులను పాత్రలుగా ప్రవేశపెడితే కథ పలచబడుతుంది. అనివార్యమైన పాత్రలను మాత్రమే ఆమోదించాలి. కథలోకి అనుమతించిన పాత్రల సమస్త విశేషాల్ని ఏకరువు పెట్టకూడదు. కథా గమనానికి ఉపయోగపడే విశేషాల్ని మాత్రమే పాత్ర నుండి తీసుకోవాలి. కథలో భాగంగా పాత్రల పరిచయం, వాటి ప్రవర్తనల ద్వారానో, మాటల ద్వారానో జరగాలి. కథకుడు పూనుకొని పరిచయం చేస్తే ఎబ్బెట్టుగా ఉంటుంది. జరిగినట్లుగా కాకుండా కల్పించి రాయడమే కథకు ప్రధానం. సమాజ పరిణామాల్ని తెలిసిన రచయిత, ఆ పరిణామాల వెనకగల, శక్తులను పాత్రలుగా ఎంచుకోగలడు. అట్లా ఎంచుకొని రాయడం సహజ పద్ధతి. ఈ పద్ధతి వల్ల ఎంచుకున్న పాత్రలతో కథ పటిష్టంగా రూపొందుతుంది. దీనికి కథకుడి సృజనశక్తి తోడవ్వాలి. భిన్న ప్రయోజనాలు గల పాత్రల మధ్య కథ పుట్టడం సులభం. నడవడం సహజం. చెప్పదలచుకున్న విషయం పాఠకుడికి చేరే అవకాశం మెండుగా ఉంటుంది.

కథలో ఎన్ని పాత్రలు ఉండాలో, ఎలాంటి పాత్రలు ఉండలో కథా వస్తువు నిర్ణయిస్తుంది. పాత్ర ద్వారా వస్తువు పాఠకునికి చేరుతుంది. పాత్రల సంఘర్షణ వల్ల కూడా కథకుని సందేశం పాఠకుని వరకు వెళుతుంది. సామాజిక చలనాల పట్ల అవగాహన కలిగిన కథకుని పాత్రలు కృత్రిమంగా సంచరించవు. అవి సహజంగా, సమాజంలో సంచరించినట్లు, కథలో కూడా తిరగాడుతవి. పాత్రల కార్యాచరణ వల్ల కథ క్లైమాక్స్‌కి చేరుతుంది. ఆ క్రమంలో కొన్ని పాత్రలు పతన దిశకు వెళ్లవచ్చు. మరికొన్ని పాత్రల వికసన జరగవచ్చు. పాత్రలు తక్కువగా ఉన్న కథలో బిగువు సడలదు. పాత్ర చిత్రణ ఆయా పాత్రోద్దేశాలకు అనుగుణంగా జరగాలి. ఏ ఒక్క పాత్రపైనో కథకుడు అభిమానం చూపితే కథ అభాసుపాలు అవుతుంది. పాత్ర చిత్రణ, పాత్ర ఎన్నిక, పాత్ర నిర్వహణ, సక్రమంగా ఉంటే కథ రాణిస్తుంది. కథకుని సామర్థ్యం వీటన్నిటి వల్ల తెలుస్తుంది. పాత్ర నిజాయితీని కథకుడు వాచ్యం చేయకూడదు. పాత్ర ప్రవర్తన ఆధారంగా పాఠకుడు తెలుసుకునేలా చిత్రించాలి.

కథ అంటే జీవితశకల చిత్రణ. అంత తక్కువ వ్యవధిలో పాత్రలు మార్పుకు గురి అవుతవా అనే సందేహం రావచ్చు. మొదటే అనుకున్నట్లు ఆధునిక జీవన సంక్లిష్టత మనిషిలో త్వరత్వరగా మార్పును తెస్తుంది. ‘క్షణక్షణముల్ జవరాండ్ర చిత్తముల్” అన్నాడు కవి. దానికి బదులుగా “మనుషుల చిత్తముల్” అంటే అతిశయోక్తి కాదు. పాత్రలో వచ్చే మార్పును కథా పరంగా చూపించాలి. మన సమాజంలో “నాకు ఎవ్వరితో సంబంధం లేదు, దేనితో సంబంధం లేదు.” అనే ధోరణిలో వ్యక్తులు జీవిస్తుంటారు. తాము అన్నిటికి అతీతులమన్నట్లు వ్యవహరిస్తుంటారు. ఇలాంటి వారిని కథా సాహిత్యంలో ‘వ్యక్తిగత పాత్రలు’ అని వ్యవహరిస్తారు. ఇందుకు భిన్నంగా ఏదో ఒక గుంపుకు ప్రాతినిథ్యం వహిస్తున్నట్లుగా, నాయకుడిగా చలామణి అయ్యేవాళ్లంటారు. వాళ్ళను ‘ప్రాతినిథ్య పాత్రలు’ అని పిలుస్తారు. ఈ రెండూ కాక వ్యక్తిగత రాగద్వేషాలకు అతీతంగా గుంపు భావజాలానికి చెందకుండా, విశ్వమానవ విలువలను ఆచరిస్తూ ప్రేమ, ద్వేషం, దయ లాంటి భావోద్రేకాలకు పట్టం గట్టే పాత్రలుంటాయి. వాటిని ‘విశ్వజనీన పాత్రలు’ అంటారు.

“పాత్రలు-వీళ్ళెక్కడి నుంచి వస్తారంటే-యెక్కణ్ణించయినా రావొచ్చు. తనలోంచి యిరుగు పొరుగులోంచి, పుస్తకాల్లోంచి, ఆలోచనల్లోంచి యెక్కణ్ణించి వొచ్చినా ఫరవాలేదు. ఐతే వాళ్ళు తన అనుభూతి లోంచి రక్తమాంసాల జీవులుగా ప్రాణం పోసుకొని రావాలి.

అలాంటి పాత్రలు వీలైనంత వరకు ఇతివృత్తానికి అనుగుణంగా వుండేలా ప్రయత్నించాలి. కానీ పాత్రలు మాట్లాడితే భావాలకి ప్రతిధ్వనులుగా ఉండకూడదు. అలా వుండకుండానే వాళ్ళ చేత నేర్పుగా, నంగనాచిగా, మాయగా, భావాలనూ ప్రయోజనాలను సాధించు కోవాలి. అదీ సాహిత్య శిల్పపు జాణతనవూ సొగసూ” – వడ్డెర చండీదాస్.

పాత్రను కథకుడే పరిచయం చేస్తే అది ప్రత్యక్ష పద్ధతి. ఇది హర్షణీయం కాదు. కథలో భాగంగా రకరకాల పద్ధతులలో పరోక్ష చిత్రణ చేయాలి. సంభాషణల ద్వారా సాగే చిత్రణను. ‘నాటకీయ పద్ధతి’ అంటారు. ఇది అనుసరించ దగినది. పాత్రలకు పేరు పెట్టడం కూడా అసిధార వ్రతం లాంటిదే. కథలో పాత్ర గుణం ఎలా ఉంటదో రచయితకు తెలిసే ఉంటుంది. అందుకు అనుగుణంగా పాత్రకు పేరు పెట్టడం ఒక పద్ధతి. ఉదా: కన్యాశుల్కంలో ‘అగ్నిహోత్రావధాన్లు’ పేరుకు తగ్గట్టే అతడు కోపంతో మండుతుంటాడు. కొందరు ఏమి ఆలోచించకుండా పేరు పెడుతుంటరు. అదొక పద్ధతి. ఒక వేళ రచయిత ముందే క్యారక్టర్‌ను ఊహించి దానికి తగిన పేరు పెట్టి, ఆ మేరకు చిత్రించడంలో సక్సెస్ కాకపోతే అలాంటి పేరు పెట్టి నిష్ఫలం. ‘చంద్రవదన’ అని పేరు పెట్టి కురూపి వర్ణన చేసినా, ‘సౌజన్య’ అని పేరు పెట్టి పిసినారిగా చిత్రించినా పేర్లు అభాసు పాలుకాక తప్పదు. పాఠకునితో కథ చదివించడానికి అనేక జాగ్రత్తలు తీసుకోవాలి. అందులో పాత్రకు పేరు పెట్టడం ఒకటి. పేర్లు లేకుండా కూడా కథలు రాయవచ్చు. మనం పెట్టే పేర్లు వ్యక్తులను, కులాలను, వర్గాలను మొత్తంగా ఎవరిని తక్కువ చేసేవిగా ఉండవద్దు.

ఉదాహరణ

కథల్లో పాత్రల ప్రాముఖ్యత తెలిసిందే. మారని పాత్రలు, మారిన పాత్రలు అని రెండు రకాలు. రష్యన్ రచయిత గోంచారోవ్ కథకు తెలుగు అనువాదం ‘ఆబ్లమోవ్’. రష్యన్ భూస్వామ్య వర్గ లక్షణానికి ప్రతీకగా ఆబ్లమోవ్ పాత్రను చిత్రించాడు. రష్యన్ భూస్వాముల్లో ‘అబ్లమోవిజం’ పాలు ఎక్కువంటారు సామాజిక శాస్త్రజ్ఞులు. అన్ని పనులూ సేవకులు, సెర్ఫ్‌లు చేసి పెడతారు. తిని పడుకోవడమే అయ్యగారి పని. ఇలాంటి నిష్క్రియాపరత్వానికి పరాకాష్ట ‘ఆబ్లమోవ్’. ఓ పట్టాన పడక దిగడు. ఆయన జీవితంలో ఎన్నో ఎగుడు దిగుడులు తారసపడుతవి. కాని తాను మారడు. తనను ప్రేమించిన స్త్రీకి బదులివ్వడు. అదే స్త్రీని తాను పెళ్ళి చేసుకోదలచినపుడు ఆమె ఆబ్లమోవ్ మిత్రుణ్ణి పెళ్ళి చేసుకుంటది. అయినా ఉలకడు పలకడు. అప్పుల్లో మోసాల్లో కూరుకు పోయినా పనిచేయడు. సేవకురాలిని పెళ్ళి చేసుకుంటడు. కొడుకును కంటడు. ఈ సందర్భంగా పిలిచిన వాళ్ళింటికి వెళ్ళడు. ప్రయాణమంటే బద్దకం. చలనం జీవ స్వభావం. చలనం ఇష్టంలేని ఆబ్లమోవ్ శరీరం ఒకనాడు కదలడం మానేస్తుంది. అలా పుట్టిన నాటి నుండి చనిపోయేవరకు ఏ మాత్రం మార్పులేని వ్యక్తిగా ఆబ్లమోవ్ బతుకుతాడు. ఇతడు ‘మారని పాత్ర’కు ఒక నమూనా.

అమెరికన్ రచయిత్రి పెర్ల్.ఎస్.బక్. ఈమె రాసిన కథ తెలుగు అనువాదం తెలియవు. కాని ఆమె యుద్ధకాలంలో బ్రతికింది. జపాన్ వాళ్ళు చైనాపై విరుచుకు పడుతున్న రోజులవి. వాంగ్ చైనా దేశస్థురాలు. ఆమెకు ప్రేమ తప్ప మరొకటి తెలియదు.

ఆమె భర్త నదిని మరమ్మతు చేసే సమయంలో కాలుజారి కళ్ళ ముందే కొట్టుకపోతాడు. ఆ నదికి దగ్గరగా మనవడితో కలిసి ఆ రాత్రి కూర్చుంటుంది. ఇంతలో జపాన్ వారు బాంబులు వేయడం, ఊళ్లోకి రావడం, వాళ్ళను చూసి మనవడు, మనుమరాలు, ఊరి జనం అంతా పరుగులు తీస్తారు. కదలలేని ముసలమ్మ అక్కడే ఉండిపోతుంది. అదే సమయంలో ఆమె ముందే ఒక విమానం కూలుతుంది. అందులో నుండి ఒక యువకుడు చాలా దెబ్బలతో ఈమె ముందు పడతాడు. ఆమె జాలితలచి ఆ యువకుడికి కట్టుకట్టి సపర్యలు చేస్తుంది. తిండి పెడుతుంది. మాతృమూర్తిలా సేవచేస్తుంది. ఆ సమయంలో అటుగా వచ్చిన చైనా సైనికులు “వీడు జపానువాడు, మన శత్రువు. మన ఊరును మనల్ని నాశనం చేయడానికి ఇంకా జపాను సైనికులు వస్తున్నరు. మేం వెళ్ళుతున్నం. ఊరంతా ఖాళీ అయింది” అని అంటారు. మెల్లగా లేచింది. కట్ట ఎక్కింది. నీటి మట్టం బాగా పెరిగి ఉంది. గేటు తెరవడం తనకు తెలుసనుకుంది. జపాన్ సైన్యం తన ఊరికి దగ్గరగా వచ్చింది. కట్టపైనుండి ఊర్లో చూస్తే ఒక్కడూ కనిపించలేదు. తను ఏం చెయ్యగలదో ఆలోచించింది. గేట్లు తెరిస్తే జపాన్ సైన్యం జలసమాధి కాక తప్పదు అని నిర్ణయించుకున్నాక వాళ్ళను దగ్గరగా రానిచ్చి గేట్లు తెరిచింది. ముసలితనాన తన ఊరుకు తను చేయగలిగిన ఉపకారమని తలచి చేసిన పని అది.

జపాన్ యువకుడని తెలియక ముందు, చేరదీసిన వాంగ్ తెలిసాక జపాన్ సైన్యాన్నే అంతం చేసింది. మారిన పాత్రకు వాంగ్ ఉదాహరణ.

(మరోసారి మరో అంశంతో)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here