కథా సోపానములు-8

1
10

[box type=’note’ fontsize=’16’] డా. బి.వి.ఎన్. స్వామి ‘కథా సోపానములు’ అనే శీర్షికతో అందిస్తున్న వ్యాస పరంపరలోనిది ఈ వ్యాసం. కథకి తగిన ‘స్థలము-కాలము’ ఎంత అవసరమో వివరిస్తుంది. [/box]

స్థలము-కాలము

[dropcap]ఆ[/dropcap]ధునిక కాలంలో “జాతి రాజ్యము” ఏర్పడటము కీలక ఘట్టము. రాజ్యము సరిహద్దులచే నియంత్రించబడి ఉంటుంది. అలా అది ఒక ప్రదేశమునకు పరిమితమై ఉంటుంది. భౌగోళికార్థంలో ప్రదేశము అనేది స్థలము మరియు శీతోష్ణాది వాతావరణముచే కూడి ఉండేది. మనిషి స్థలాతీతుడు, కాలాతీతుడు కాలేడు. సమస్త జీవరాశి స్థల కాలాలలోనే జీవనం సాగిస్తుంటది. స్థల కాలాతీంగా జరిగే సంఘటనలు అరుదు. మానవ జీవన సంఘర్షణల్ని చిత్రించే కథకుడు స్థలకాలాల్ని పట్టించుకోవాలి. ఏ కాలం నాటి పరిస్థితులు ఆ కాలపు జీవితాల్ని, ఏ ప్రదేశపు కట్టుబాట్లు ఆ ప్రదేశపు బతుకుల్ని ప్రభావితం చేస్తాయి. స్థలకాలాలకు లోబడి బతకడం, లేదా ఎదిరించి బతకడం అనేవి ఉంటవి. ఈ రెండు రకాల జీవితాల్ని కూడా సమానంగా స్థల కాలాలు ప్రభావితం చేస్తాయి. కథకుడు రెండు అంశాల్ని కథలో జాగ్రత్తగా నిర్వహించవలసి ఉంటుంది. కాలం అంటే గంటలో సంవత్సరాలో కాదు, కథ జరిగే సమయాన గల సంఘజీవన పరిధి. స్థలం అంటే ప్రదేశం చేత ప్రభావితమైన పాత్రల వ్యక్తిగత, సామూహిక చేతన. ఈ రెంటి గురించి స్పష్టంగా చెబితే కథకు విశ్వసనీయత చేకూరుతుంది. రచయిత కథ చెప్పే క్రమంలో స్థలం పేరు రాయాలి. ఇసుక తుఫాను గురించి కథ రాసినప్పుడు అది ఏ ఎడారిలో జరిగిందో రాస్తే దానికి సంగతత్వం చేకూరుతుంది. అదే విధంగా రచయిత తను ఏ సమయంలో కథ రాస్తున్నాడో ఆ కాల సమస్యను ఎత్తుకొంటాడు. రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో ప్రపంచీకరణ వైపరీత్యాలపై కథ రాయలేడు కదా! రచయిత స్థల కాలాతీతంగా రాయలేడు. తనకు తెలియకుండానే వాటి ఆనవాళ్ళను కథలో పొదుగుతాడు. అలా కథలో రెండింటిని వదలుతాడు. ఒక వేళ తెలిసి వాటిని ఉపయోగించుకుంటే కథ రాణిస్తుంది. ఏ దేశ రచయితలైనా స్థలకాల నిబద్దులే. నెల్లూరు కేశవస్వామి రాసిన “యుగాంతం” అనే కథ తెలంగాణలో మాత్రమే జరుగుతుంది. స్థలకాల భావనకు ఈ కథ మంచి ఉదాహరణ.

స్థలాలు మారవచ్చు. కాలాలు మారవచ్చు. స్థలమొకటే కాని కాలపరిస్థితులు మారవచ్చు. ఇన్ని దశల్లోను మనిషి జీవితం సాగుతుంది. స్థలకాలాతీతంగా ఎవ్వరూ బతకలేరు. ఎక్కడో ఒకచోట స్థలకాలాతీతంగా విశ్వమానవుడిగా ఎవ్వరో ఒకరు ఎదగగలరు. వారి జీవితం కూడా స్థలకాలాలతో ప్రభావితమయ్యే ఉంటుంది. స్థల కాలాలకు అంతటి ప్రాముఖ్యత ఉంది. వర్షాకాలంలో క్రిమికీటకాల సంచారం ఎక్కువ. దానికి సంబంధించిన కథ రాయవచ్చు. అలాగే వేసవి, శీతాకాలాల సమస్యలుంటాయి. వాటిని పట్టుకోవాలి. దృవ ప్రాంత కడగండ్లు ఒక రకం. సముద్ర తీర ఒడిదొడుకులు మరో రకం. వాటి అంతరం తెలిసి చిత్రించాలి. స్థలకాలాల్లో బతికి బట్ట కట్టిన కథలు కొన్ని స్థలకాలాలకు అతీతంగా ఎదిగి ప్రపంచ పాఠకుల మన్ననలు కూడా పొందగలవు. ఇలాంటి కథల్లో మానవోద్వేగాలు, దైవ లీలల ప్రభావాలు మనుషుల్ని పట్టికుదుపుతాయి. మహాభారతంలోని ఎన్నో కథల్ని ఇందుకు ఉదాహరణలుగా తీసుకోవచ్చు.

కథలో మనం చిత్రించే పాత్రల ఆహారవిహారాదులు స్థలకాలాదులను సూచిస్తాయి. తెలంగాణ ప్రాంతం కథలకు పుట్టిల్లు. ఇక్కడ సమస్యలు అధికం. పరిష్కార ప్రయత్నాలు అధికం. పుట్టుకొచ్చిన పోరాటాలు ఎక్కువే. అలా ఈ స్థలం కథలకు వేదిక అయింది. ఆ మేరకు స్థలమే రచయితలకు కథనిచ్చింది. ఇలాంటి ప్రత్యేక కథలు రాసిన రచయితల పేరు, ఆ ప్రాంతంతో ముడిపడి పోతుంది. ఆర్థికమాంద్యం వచ్చిన కాలంలో, కరోనా వైరస్ విజృంభించిన సమయంలో కూడా కథలు వచ్చాయి. మాంద్యం వ్యాధి ఉన్న కాలంలో కథలు వచ్చాయి. కనుక వాటికి ఆ ప్రత్యేకత ఉంది. మాంద్యం, వ్యాధి ఒక్కో స్థలంలో ఒక్కో రీతిన ప్రభావం చూపడం గమనార్హం.

“Nothing can happen nowhere. The local of the happening always colours the happening and often to a degree, shapes it” – ఎలిజబెత్ బోవెన్.

నాటకంలో కనిపించేది పాత్రధారి. వెనకుండి నడిపించేది సూత్రధారి. కథలో కనిపించేవి పాత్రలు, సంఘటనలు. వెనకుండి నడిపించేవి స్థలకాలాదులు. ఈ రెంటిని కలిపి నేపథ్యం అనవచ్చు. స్థలకాలాలు కథకు రంగు, రుచులను ఆపాదిస్తవి. రైతు కథకు గ్రామం, పారిశ్రామిక కార్మికుడి కథకు నగరం నేపథ్యంగా ఉంటవి. స్థలం భౌతిక లక్షణం కలిగి ఉంటుంది. కనుక చిత్రణ సులువు. కాలం అభౌతికమైంది. దీని చిత్రణ కష్టం. కాలాన్ని చిత్రించడమంటే ఆ కాలంలో వచ్చిన పరిణామాల్ని, భావజాలాన్ని చిత్రించడమే. ఏ స్థలంలోనైతే కథ జరుగుతుందో ఆ కథాంశం వ్యక్తం కావడానికి అక్కడి భాష దోహదపడుతుంది. కథల్లో పాత్రోచిత భాష ద్వారా అది సాధ్యమవుతుంది. గతము, వర్తమానము, భవిష్యత్ కాలాల్లో కథనం సంచరించడం ఒక శిల్పరీతి.

ఉదాహరణ

కథలో స్థలకాలాలు ప్రాధాన్యత కూడా ఉంటుంది. బర్మన్ రచయిత డేగన్ ష్వేమ్యార్ కథ “ది ప్రిన్స్ ఆఫ్ ది ప్రిజన్”. ఇందులో కథ చాలా వరకు జైలులో నడుస్తుంది. జైలు పరిసరాలు కథలో కనిపిస్తాయి. నేరం చేసిన ఇద్దరు స్త్రీ పురుషులు జైలుకు వస్తారు. అందులో తల్లితో పాటు కొడుకు కూడా జైలుకు వస్తాడు. జైలు అధికారుల కండ్లుగప్పి కొడుకును బయటకు పంపాల్సిన అవసరం ఆమెకు వస్తుంది. కథంతా జైలు ఆవరణలో నడుస్తుంది. అది వేసవి కాలం. దేశంమతటా మశూచి ప్రబలినట్లే, జైలులో కూడా వ్యాపిస్తుంది. అందరికి టీకాలు వేస్తారు. టీకా వేసిన తన కుమారునికి బాగుకాలేదని, చనిపోయాడనీ, పెద్ద బట్టలో చుట్టిన మైనపు బొమ్మను తన కొడుకు శవంగా చూపించి అధికారులను నమ్మిస్తుంది. చివరకు ఆ బొమ్మను ఖననం చేస్తుంది. వాస్తవంలో తన కుమారుణ్ణి జైలు నుంచి తప్పించి అనుమానం కలగకుండా ప్రవర్తిస్తుంది. ఇందుకు వేసవికాలంలో వచ్చిన మశూచి ఆమెకు ఒక కారణంగా సహాయపడింది. ఇదంతా జైలులో జరగడం వల్ల బయటి ప్రపంచానికి తెలియకుండా పోయింది. అది ఆమెకు అందివచ్చిన అవకాశం. ఇలా స్థలం, కాలం రెండింటి ఐక్యత వల్ల కథ రాణించింది.

(మరోసారి మరో అంశంతో)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here