కథ వ్రాయాలి

0
15

[dropcap]నే[/dropcap]దనూరు ప్రాథమిక పాఠశాలలో మహీపతి మాస్టారు కేవలం పాఠాలే కాకుండా పిల్లలకు ఎన్నో నీతి కథలు, సృజన పెంచే కథలు చెప్పేవారు. పిల్లలు ఎంతో ఆసక్తితో ఆ కథలు వినేవారు. వారిలో కిరణ్ పాఠాలు బాగా వినేవాడు కానీ కథలు మటుకు సరిగ్గా వినేవాడు కాదు. ఒక్కొక్కసారి మహీపతి మాస్టారు తాను చెప్పిన కథల్ని రెండు రోజుల తరువాత చెప్పమనే వారు. పిల్లలు ఆ కథలకు తమ సృజనాత్మకతను జోడించి చక్కగా చెప్పేవారు. కానీ కిరణ్ మటుకు అసలు కథ చెప్పేవాడు కాదు. చెప్పినా కథ అర్థం కాకుండా చెప్పేవాడు.

మంచి మాటలు, ఆసక్తి కలిగించే పనులు చేసి కిరణ్‌లో సృజనాత్మకతను బయటకు తేవాలని మహీపతి గారు నిశ్చయించారు.

రెండవరోజు మహీపతిగారు పిల్లలకు కథ చెప్పకుండా పిల్లలకు కొన్ని పత్రికలలోని బొమ్మలు కత్తిరించి ఇచ్చి ఆ బొమ్మల ఆధారంగా వారికి తోచిన కథలు వ్రాసుకుని రమ్మన్నారు. కానీ ఇంట్లో పెద్దలను అడగకూడదని చెప్పారు. పిల్లలు ఎంతో ఉత్సాహంతో ఆ బొమ్మలు తీసుకుని ఇంటికి వెళ్ళి ఆ బొమ్మల ఆధారంగా కథలు వ్రాయసాగారు.

కిరణ్ కూడా ఆ బొమ్మను ఇంటికి తీసుక వెళ్ళి మంచి ఆలోచన రాక బొమ్మను తదేకంగా చూడసాగాడు. ఎంత చూసినా కిరణ్‌కి ఆ బొమ్మ ఆధారంగా కథ ఏ విధంగా వ్రాయాలో తెలియడం లేదు. మరి తను కథ వ్రాసుకుని పోకపోతే మిగతా పిల్లలు వ్రాసుకొస్తే తనకి అవమానం జరుగుతుందని భావించి మనసులోనే బాధ పడసాగాడు.

ఆ బొమ్మను, కిరణ్ ఆవేదన గమనించిన కిరణ్ నాన్నగారు విషయం ఏమిటని అడిగారు.

“ఏంలేదు నాన్నా మాసార్ ఈ బొమ్మను చూసి కథ వ్రాసుకరమ్మన్నారు. “ చెప్పాడు.

పిల్లల్లో సృజనను బయటకు తీసుకవచ్చేందుకు వాళ్ళ మాస్టారు చేసిన మంచి ప్రయోగం అని ఆయనకు అర్థం అయింది.

“చూడు కిరణ్ బొమ్మను చూసి బాగా ఆలోచించు. ఆ బొమ్మలో ఉన్న చెట్లు బండి దూరంగా ఉన్న పాకలు, పొలాలు అంతా పల్లెటూరి వాతావరణం. ఒక రైతు పంట పండించడం, పండిన ధాన్యాన్ని బండిలో వేసుకోవడం లాభానికి అమ్మడం, కొంత వృద్ధాశ్రమానికి ఇవ్వడం వంటివి ఆలోచించి నీవే ఒక కథను సృష్టించు. ఓ మంచి కథను వ్రాసిన తృప్తి నీకు మిగులుతుంది. అదిగాక రేపు క్లాసులో పిల్లందరి ముందు ఆ కథ చదివితే ఎంత బాగుంటుందో ఆలోచించు” అని వివరించారు.

ఆ మాటలు కిరణ్ మీద బాగా పని చేశాయి. వెంటనే తన నోట్ బుక్ తీసి బొమ్మను చూస్తూ కిరణ్ కథ వ్రాశాడు. చదివితే ఎంతో తృప్తినిచ్చింది. అక్కడా మార్పులు చేసి అ చిత్తు ప్రతినుండి వేరే మంచి కాగితంలో కథను వ్రాశాడు.

ఆ కథను నాన్నకు చూపిస్తే ఆయన ఎంతో మెచ్చుకుని బహుమతిగా ఒక నోట్ బుక్ ఇచ్చారు.

మర్నాడు తరగతిలో మాస్టారుకి పిల్లలందరూ కథలు చూపించారు. మాస్టారు అందరినీ మెచ్చుకున్నారు. కిరణ్ కథ కూడా చదివి మెచ్చుకుని పైకి చదవమన్నారు. కిరణ్ ఎంతో ఆసక్తితో కథ చదివాడు.. “సార్, ఇంకో బొమ్మ ఇవ్వండి కథ వ్రాసుకొస్తాను” అని కాంతి నిండిన కళ్ళతో చెప్పాడు.

కిరణ్ ఆసక్తికి మహీపతి మాస్టారు ఎంతో ఆశ్చర్యపోయారు! అందరికీ పెన్నులు బహుమతిగా ఇచ్చి వారిని మరింత ప్రోత్సహించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here