కథకి పట్టాభిషేకం

7
11

[dropcap]క[/dropcap]థకి పండుగ రోజు.

కథకులకు కథలు విందు.

కదలి వచ్చిన కథా రచయితల సమ్మేళనంతో ఈనెల 7వ తేదీన ‘పెదపరిమి’లో పండుగ వాతావరణం నెలకొన్నది.

గుంటూరు కి 20 కి.మీ. దూరం లో పెదపరిమిలో ‘మువ్వా చిన బాపిరెడ్డి మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్’ భవనాల ఆవరణలో ‘కథకి పట్టాభిషేకం’ ఆనందోత్సాహాల మధ్య జరిగింది.

హైదరాబాదుకు చెందిన ములగాల సురేష్ కుమార్ గారు, పప్పు భోగారావు గారు మూడేళ్ల క్రితం – నాటి, నేటి అద్భుతమైన కథలను ఆడియో రూపంలో తీసుకురావడం మొదలుపెట్టారు. మంచి కథను ఎన్నిక చేయడం, సురేష్ ఉపోద్ఘాతం వంటి ముందుమాటలు తయారు చేసి చదవడం, భోగారావు కథను అర్థవంతంగా చదవడం, తర్వాత వారి కుమారుడు వరుణ్ సాంకేతికపరమైన విషయాలు చూడడం జరిగింది. ‘కథా స్రవంతి’ వాట్సాప్ గ్రూప్‌లో ప్రతి రోజూ ఉదయం క్రమం తప్పకుండా కథను ఉంచడం ఒక యజ్ఞం లాగా కొనసాగించారు. కథను ప్రేమించేవారు – చదువుకున్నవారు, చదువురాని నిరక్షరాస్య శ్రోతల వద్దకు కూడా చేరి, ఈ అద్భుతమైన ప్రయత్నాన్ని ఆదరించారు. బిజీ లైఫ్‌లో ఉరుకులు పరుగులు తీసే ఉద్యోగులు వంటి వారు కూడా కారులో వెళ్తూ హాయిగా వినే సౌకర్యానికి అలవాటు పడ్డారు. కథలో సంభాషణలు మరింత రక్తి కట్టడానికి సురేష్, భోగారావు గార్ల కుటుంబ సభ్యులు వరుణ్, దాసరి రవళి, మనుమరాలు, మనవడు కూడా పాలు పంచుకున్నారు. బి.జి.యం. కూడా తోడై మరింత ఆకర్షణీయంగా రూపుదిద్దుకుంది. పాత్రల్లో పరకాయ ప్రవేశం చేసి, భావ యుక్తంగా చదవడం.. కాదు, స్వాభావికంగా సహజంగా మాట్లాడడంతో.. వింటున్న శ్రోతల కళ్ళముందు ఆయా కథా సన్నివేశాలు, పాత్రలు ‘అభినయిస్తున్ళట్లు’ భావించారు. ఆనందించారు. చూస్తుండగానే అక్షరాలా వెయ్యి కథలు పూర్తయిపోయాయి.

ఈ సందర్భంగా ప్రముఖ కవి, కథా రచయిత డా. ఎం.వి. రామిరెడ్డి తను మేనేజింగ్ డైరెక్టర్‌గా, తన తండ్రి పేరిట నెలకొల్పిన ‘మువ్వా చిన బాపిరెడ్డి మెమోరియల్ ట్రస్ట్’ ఆధ్వర్యంలో ఈ కథా ఆడియోల రూపకర్తలకు చిరు సత్కారం చేయ సంకల్పించడంతో పండుగ సంరంభాలు మొదలయ్యాయి. ప్రకటన వెలువరించగానే రెండు తెలుగు రాష్ట్రాల నుండి రచయితలు, కథా ప్రేమికులు వస్తున్నామంటూ తమ పేర్లను పంపారు. వచ్చిన వారందరికీ మంచి పుస్తకాలు ఇచ్చి సత్కరిస్తే, దూర ప్రాంతాల నుండి వచ్చిన వారికీ, మనకు సంతృప్తి అని రామిరెడ్డి అభిప్రాయం వ్యక్తం చేయగానే ‌స్వచ్ఛందంగా తమ పుస్తకాలు పంపారు చాలామంది. ట్రక్కుల్లో వాటిని తరలించాల్సి వచ్చింది. వాటిని జాగ్రత్తగా, అందంగా జూట్ బ్యాగుల్లో సర్ది ఉంచారు.

శనివారం రాత్రికి, ఆదివారం పొద్దుటికి రచయితలు ఉత్సాహంగా తరలివచ్చారు. కాఫీ, టిఫిన్లు తయారుగా ఉన్నాయి.

ఇక్కడ మరో ముఖ్యమైన విషయం చెప్పాలి. ‘రాంకీ ఫౌండేషన్’ ఆధ్వర్యంలో చక్కని నివాస యోగ్యమైన పెద్ద భవనంలో అనేక సేవా కార్యక్రమాలు ఉన్నతస్థాయిలో జరుగుతున్నాయి. 1997 మే 23 న ఎం.వి. రామిరెడ్డి తన మేనమామ ఇంట్లో ఉద్యోగార్థులైన యువతకు శిక్షణ తరగతులు ఉచితంగా ప్రారంభించారు. 45 మందికి తానే ఫీజులు కట్టి డిగ్రీ, పీజీ చదివించారు. సంస్ధకి మంచి పేరుతో పాటు, అభ్యర్థుల సంఖ్యా పెరుగుతోంది. చుట్టు పక్కల గ్రామాల్లో ఇళ్ళు అద్దెకు తీసుకుని నిర్విఘ్నంగా కొనసాగించారు.

400 పైగా మహిళలకు ఉచితంగా కుట్టు శిక్షణ ఇచ్చారు. 2020లో రాంకీ ఫౌండేషన్ వారితో, మరి కొందరు దాతలతో కలిసి ప్రస్తుతం ఉన్న పెద్ద భవనం నిర్మించి, ట్రస్ట్ కార్యనిర్వాహక సభ్యుల సహకారంతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా రామిరెడ్డి గారి మేనమామ శ్రీ వంగా సాంబిరెడ్డి, బాబాయి శ్రీ మువ్వా సాంబిరెడ్డి అక్కడ అన్నీ తామై ఏర్పాట్లు చూస్తున్నారు.

సాఫ్ట్‌వేర్ రంగంలోకి వెళ్ళాలనుకునే వారికి ప్రత్యేక ‘స్కిల్ డెవలప్‌మెంట్’ తరగతులు నిర్వహిస్తున్నారు. ఇప్పటికి 25 మందికి పైగా ఉన్నత స్థాయిలో స్ధిరపడ్డారు. ఐదారుగురు విదేశాల్లో మంచి ఉద్యోగాల్లో ఉన్నారు.

ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో పోలీసు కానిస్టేబుల్, ఎస్సై పోస్టులకు ప్రకటన వెలువడడంతో యువతీ యువకులకు ఉచితంగా శిక్షణ ప్రారంభించబడింది. దిగువ మధ్యతరగతి, పేదరికంలో ఉన్నవారు దూరప్రాంతాల నుండి వచ్చారు. దుస్తులు వంటి ప్రాథమిక అవసరాలు లేని వారికి సైతం అన్నింటినీ సమకూర్చడం జరిగింది.

విశాలమైన గదుల్లో ఏకాగ్రతతో చదువుకుంటున్న విద్యార్థులు, ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో, నిశ్చింతగా ప్రిపేర్ అవుతున్న విద్యార్థినులు, తల్లిదండ్రులను వదిలి వచ్చి, పూర్తి రెసిడెంట్స్‌గా ఇక్కడే ఉంటూ, భవిష్యత్తు పట్ల కోటి ఆశలతో చదువుకుంటున్న వారిని చూస్తే ముచ్చట వేస్తుంది. ముఖ్యంగా చిన్న వయసులోనే వివాహమైన పావని అనే అమ్మాయి తన ఇద్దరు పిల్లల్ని భర్త దగ్గర వదిలివచ్చి, పట్టుదలతో చదువుకుంటోంది. నిష్ణాతులైన అధ్యాపకులు, సాంకేతిక నిపుణులు వచ్చి తరగతులు తీసుకుంటున్నారు. క్లాస్ రూమ్స్, కంప్యూటర్ రూమ్స్, లైబ్రరీలతో శుభ్రంగా, పూర్తిగా ‘చదువుకునే వాతావరణం’ ఇక్కడ ఉంది. పరిశుభ్రమైన భోజనశాల, ఆరోగ్యవంతమైన భోజనం, అదనంగా ప్రొద్దున కోడిగుడ్లు, సాయంత్రం రాగి వంటి చిరుధాన్యాలతో కూడిన స్నాక్స్.

మేము వెళ్ళినప్పుడు రామిరెడ్డి తదితర ట్రస్ట్ సభ్యులు ఆదరంగా ఆహ్వానం పలికితే, ఈ విద్యార్ధులు కలివిడిగా తిరుగుతూ, వచ్చిన అతిథులకు టిఫెన్, భోజనం వడ్డిస్తూ, మా చేతిలోని బ్యాగులు అందుకుంటుంటే ముచ్చటగా అనిపించినా, కాబోయే పోలీసులు అని మొహమాట పడ్డాం.

ఆడియో కథా నిర్వాహకులు, ముఖ్య అతిథులు వేదికపై నుండి ప్రసంగిస్తుంటే శ్రద్ధగా, నిశ్శబ్దంగా ఆలకించారు. పూర్తిగా క్రమశిక్షణతో మెలగుతున్న వారిని చూసి వచ్చిన అతిథులంతా శుభాకాంక్షలు తెలిపారు.

ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ కవి, రచయిత, విమర్శకుడు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డా. పాపినేని శివశంకర్ ప్రముఖుల కథలను వివరంగా విశ్లేషిస్తూ, నేటి సమాజంలో సంభవిస్తున్న అవాంఛనీయ ఘటనలను, వాటి కారణాలను అన్వేషించాల్సిన అవసరాన్ని తెలియజేసారు. ఎవరు ఏ స్థాయికి ఎదిగినా తమ మూలాలను మర్చిపోకూడదని సోదాహరణ పూర్వకంగా చెప్తుంటే ప్రేక్షకులందరూ మంత్రముగ్ధులుగా వింటూ వుండిపోయారు.

ప్రముఖ నాటక రచయిత, అరసం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ వల్లూరు శివప్రసాద్ మాట్లాడుతూ ‘యువతరం కెరీర్ కిచ్చిన ప్రాధాన్యత కేరక్టర్‌కి ఇవ్వడం లేదని, దానివల్ల మానవ సంబంధాలు విచ్ఛిన్నమైపోతున్నాయ’ని అన్నారు. సాహిత్యానికి దూరమవడం వల్లనే మానవీయ విలువలు కోల్పోతున్నారని, వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోడానికి సాహిత్య పఠనం తప్పక అలవాటు చేసుకోవాలన్నారు. దీనికి కథా ప్రక్రియ ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో, ప్రముఖ రచయితల ప్రఖ్యాత కథలను ఇప్పటికి 51 సంపుటాలుగా ప్రచురించి అతి తక్కువ ధరకే అందించడం జరిగిందన్నారు. ‘కథాస్రవంతి’ ఆడియో మిత్ర బృందానికి ఆ సంపుటాలను అందించారు.

సాహో పత్రిక సంపాదకులు ఇందురమణ, బాపు రమణ బాలు సంస్థ అధ్యక్షులు డా. రమణయశస్వి, కథారవళి వాట్సాప్ గ్రూప్ నిర్వహిస్తున్న రామశర్మ, విశాఖ సంస్కృతి పత్రిక నిర్వాహకులు సన్యాసిరావు, ‘కవిత’ సంపాదకులు డా. బండ్ల మాధవరావు, డా. జడా సుబ్బారావు, అనిల్ డ్యానీ, చాగంటి ప్రసాద్, పోతుల కృపాకర్, వుప్పాల కృష్ణమూర్తి, ఎన్.కె. బాబు, మందరపు హైమవతి, రోహిణి వంజారి వంటి ప్రముఖ రచయిత/త్రు లెందరో హాజరయ్యారు.

విచ్చేసిన వారందరినీ రామిరెడ్డి వేదిక మీదకు ఆహ్వానించి జ్ఞాపిక, షాల్‌తో పాటు 26 మంచి పుస్తకాలున్న కిట్‌ను అందించారు.

రాంకీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ ట్రస్ట్ వృద్ధాశ్రమం కూడా నిర్వహిస్తున్నారు. ఎలాంటి సహాయం కోరకుండా వారు కృషి చేస్తున్నా, మనకు చేతనైన సహకారం – ధన, వస్తు, మోరల్ సపోర్ట్ నైనా అందిస్తే సంస్థ మరింత విజయపథం వైపు పయనిస్తుందని అందరూ అనుకున్నారు మనస్పూర్తిగా. మనమూ ఒక బాధ్యతగా స్వీకరించి, యువతరం భవిష్యత్తులో సాధించబోయే విజయాలకు దోహదం చేయాల్సిన నైతిక బాధ్యత ఉంది.

*

ప్రొఫెసర్ సిహెచ్. సుశీలమ్మ

రిటైర్డ్ ప్రిన్సిపాల్

పూర్వ ఉప సంచాలకులు

తెలుగు అకాడమీ, ఏ.పి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here