కథల పుస్తకం

0
9

[బాలబాలికల కోసం ‘కథల పుస్తకం’ అనే కథ అందిస్తున్నారు కంచనపల్లి వెంకట కృష్ణారావు.]

[dropcap]“నం[/dropcap]దూ అరుణ్ కిరాణా కొట్టుకి వెళ్ళి అర్థ కిలో బెల్లం కట్టించుకరా” అని డబ్బులు ఇచ్చింది అమ్మ.

“సరేనమ్మా” అని అరుణ్ కొట్టుకి వెళ్ళి అరకిలో బెల్లం ఇవ్వమని చెప్పాడు నందు.

“ఒక్క నిముషం” అంటూ మరొకరికి పది గ్రాముల లవంగాలు కట్టివ్వడానికి ఒక పుస్తకం తీసి అందులోని కాగితం చింపడానికి అరుణ్ ఆ పుస్తకం మీద చెయ్యి వేశాడు.

“ఆగు అన్నా..” అని అరిచాడు నందు.

అరుణ్ నందూ అరుపు విని ఆశ్చర్యపోయాడు!

అసలు విషయం ఏమిటంటే ఆ పుస్తకం ఓ అద్భుత కథల పుస్తకం. అందులోని మంచి బొమ్మలు నందూని ఆకర్షించాయి. అందుకే నందు ఆ పుస్తకాన్ని చింపవద్దని కోరాడు.

“ఎందుకు బాబూ?” అడిగాడు అరుణ్.

“ఆ పుస్తకం కథల పుస్తకం, అదిగాక అందులో చక్కని బొమ్మలు ఉన్నాయి. అటువంటి మంచి పుస్తకం మరలా దొరకక పోవచ్చు. ప్లీజ్ అన్నా, ఆ పుస్తకం నాకివ్వు రెండు రూపాయలు ఇస్తాను” అని పుస్తకం మీద ఎంతో ఇష్టం చూపుతూ అరుణ్‌ని అడిగాడు

పుస్తకం పేజీలు తిప్పి చూసి ‘నిజమే ఇది మంచి పుస్తకం, చింపడమెందుకు’ అనుకుని “బాబూ నిన్న ఎవరో పాత పుస్తకాలతో పాటు దీనిని అమ్మేశారు. నిజమే, ఈ పుస్తకంలో బొమ్మలు కథలు బాగున్నాయి. నాకు పుస్తకాలు చదివే సమయం లేదు. మా ఇంట్లో పుస్తకాలు చదివే పిల్లలు లేరు. నీవేమీ డబ్బులు ఇవ్వనక్కరలేదు. పుస్తకం తీసుకుని చదువుకో, దాచుకో” అంటూ చిరునవ్వుతో పుస్తకాన్ని నందూకి ఇచ్చాడు.

అరుణ్‌కి థాంక్స్ చెప్పి పుస్తకంలోని పేజీలు తిప్పి చూస్తూ నందు ఒక విధమైన ఆనందం పొందాడు. ఈ లోపల బెల్లం తూచి ఒక పేపరు కవర్లో వేసి నందూకి ఇచ్చాడు అరుణ్.

బెల్లానికి డబ్బులు ఇచ్చి పుస్తకం బెల్లం తీసుకుని పరుగున ఇంటికి వెళ్ళి బెల్లం అమ్మకి ఇచ్చి అంగడి నుండి పుస్తకం తెచ్చుకున్నట్టు చెప్పి చూపించాడు నందు.

దాన్ని చూసి, “మంచి పుస్తకమే, కథలు చదువు. చెల్లికి కూడా కథలు చెప్పు” అన్నది అమ్మ.

“అలాగేనమ్మా” అంటూ ఈ వేసవి సెలవుల్లోనే పుస్తకం పూర్తిచేయాలని అనుకున్నాడు నందు.

నందు ఇంటికి మూడిళ్ళ అవతల ఉన్న భరత్ ఇంటికి వెళ్ళి తను సేకరించిన పుస్తకం గురించి చెప్పాడు నందు. భరత్ ఇంట్లోకి వెళ్ళి ఓ మంచి కథల పుస్తకం తెచ్చి చూపించాడు.

“అరే ఇదీ బాగుంది. ఒక పని చేద్దాం, ఈ కథలు చదివి మన స్నేహితులు అంటే కథలంటే ఇష్టం ఉన్న వాళ్ళకి చెబుతాం. మరిన్ని పుస్తకాలు సేకరించి మనం ఓ కథల పుస్తకాల లైబ్రరీ మన ఇళ్ళలోనే పెట్టుకుందాం. ఎలా ఉంది నా ఆలోచన?” అడిగాడు నందు.

“అద్భుతంగా ఉంది. నేను కథలు బాగా చదివి కథలు రాస్తాను” నవ్వుతూ చెప్పాడు భరత్.

వారి సంభాషణ వింటున్న భరత్ నాన్నగారు సంతోషించి, ఆ సాయంత్రమే పుస్తకాలు అమ్మే అంగడికి వెళ్ళి నాలుగు బాలల కథల పుస్తకాలు తెచ్చి భరత్‌కి ఇచ్చారు. అక్కడే ఉన్న నందూ కూడా ఆ పుస్తకాలు చూసి సంతోషించాడు.

ఇద్దరి కళ్ళలో వెలుగు చూసి భరత్ నాన్నగారు ఎంతో సంతోషించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here