కథలో ఓ పేజీ

0
9

[శ్రీ గంగాధర్ వడ్లమన్నాటి రచించిన ‘కథలో ఓ పేజీ’ అనే కథని పాఠకులకి అందిస్తున్నాము.]

[dropcap]ఓ[/dropcap] సారి కథ మొత్తం మళ్ళీ చదివి, ‘బావుంది, ఈ హాస్యకథని ఇంత కన్నా పెంచినా లేదా తగ్గించినా బావుండదు. కథ అందం పోతుంది. పైగా కొసమెరుపు కూడా నే అనుకున్న దానికంటే బాగానే కుదిరింది. ఇక అవీ ఇవీ అని మరీ చాదస్తానికి పోయి ఆలోచించకుండా, ఈ కథని ఈ రోజే పోస్ట్ డబ్బాలో పడేయమని మా ఆవిడతో చెప్పాలి’ అని తనలో తాను అనుకుంటుండగానే, ఫోన్ మోగింది.

ఆ రింగ్ శభ్దo వింటూనే, మొహం కాస్త వికారంగా, విసుగ్గా పెట్టి “ఈ ఫోన్లు ఎప్పుడూ ఇంతే, ఖాళీగా గోళ్ళు గిల్లుకుంటున్నపుడు ఒక్క ఫోన్ కాల్ అంటే ఒక్క ఫోన్ కాల్ రాదు. కానీ ఇలా మంచి పనిలో ఉన్నప్పుడు మాత్రం పోలోమని అదే పనిగా మోగుతుంది ఈ ఫోన్”, అని ఫోన్ చేతిలోకి తీసుకుని చూసి ‘అరె పత్రిక ఎడిటర్ గారు ఫోన్ చేస్తున్నారు’ అనుకుని నాలుక్కరుచుకుని ,ఫోన్ ఎత్తి “సార్ చెప్పండి” అన్నాడు మధు.

“నమస్తే, మీ కథ ఇంకా రాలేదు, అసలే ఈ కథతో మీ యాభై కథలు పూర్తి అవుతున్నాయి కదా మా పత్రికలో. అందుకే మరోసారి గుర్తు చేద్దామని ఇలా ఫోన్ చేశాను. పైగా మీరు కథని పోస్ట్‌లో పంపుతారు కదా, అందుకే ఆలస్యం కాకుండా కథ కాస్త త్వరగా పంపితే మాకూ సౌకర్యంగా ఉంటుందని” నసిగారు ఆ ఎడిటర్ గారు.

“తప్పకుండానండీ, కాకపోతే ఈసారి కథ కొంచెం బాగా రావాలని, ఒకటికి రెండు సార్లు కథ చదివి,  సాపు కాపీ మరోసారి రాశాను. దాంతో ఇలా రెండు రోజులు సమయం ఎక్కువ పట్టింది. నే చెప్పిన ఆ సాపు కాపీ రాయడం కూడా పూర్తి చేసేశాను. ఈరోజే మీ కథ పోస్ట్ డబ్బాలో పడిపోతుంది. రేపు, తప్పితే ఎల్లుoడి కల్లా ఈ కథ మీ చేతుల్లో ఉంటుంది” చెప్పాడు గట్టి భరోసా ఇస్తున్నట్టు.

“సరే, మీరు ఇంత నొక్కి మరీ చెప్పాక ఇక నే ప్రత్యేకంగా మళ్ళీ చెప్పేదేవుంది. సరే పంపేయండి, ఉంటానూ” అంటూ ఫోన్ పెట్టేశారు ఎడిటర్ గారు.

చేతిలో ఉన్న పెన్ను పక్కన పెడుతూ, ఆ పది పేపర్లూ జాగ్రత్తగా లెక్కపెట్టుకుని, “హబ్బా,ఒక్క కథ వ్రాయడానికి ఆపసోపాలు పడి, కిందా మీదా పడి, బుర్ర వేడెక్కేలా కథ గురించి ఒకటికి నాలుగు సార్లు జుట్టు పీక్కుని, బుర్రబద్దలు కొట్టకోవాలి. ఇంతా కష్టపడి రాస్తే, పారితోషకo మాత్రం అంతంత మాత్రమే. ఏం చేస్తాం”, అని కాగితాలని ఎప్పటిలానే కిటికీ పక్కన ఉన్న బల్ల మీద పెట్టి, బెడ్రూం తలుపు గడి తీసి, “లక్ష్మీ, కాఫీ పట్టుకురమ్మని చెప్పి ఎంత సేపైంది. త్వరగా పట్టుకురా” అంటూ మళ్ళీ తలుపు గడి పెట్టేసి, ఒళ్ళు విరుచుకుని, బాత్రూమ్ లోకి వెళ్ళాడు. మొహం కడుక్కుని వచ్చి చూశాడు. ఒక్కసారే గుండె గుభేలుమంది. తన కథ రాసుకున్న పేపర్లు, ఫ్యాన్ గాలికి ఒకటి రెండు కిందపడ్డాయి. వెంటనే తెగ కంగారుగా, వాటిని చేతిలోకి తీసుకుని, ‘హమ్మయ్య’ అనుకుని కిటికీ బయటకి చూశాడు. మళ్ళీ గుండె గుభేలుమంది, “ఓరినాయనో ఎంత పని జరిగింది”, అని ఆందోళనతో చిందులు తోక్కేశాడు. కారణం, ఒక పేపర్ కిటికీ లోంచి బయటకు వెళ్లిపోయింది. చిందులు తొక్కడం ఆపి, కిటికీలోంచి ఆ పేపర్ వంక దీర్ఘంగా చూస్తూ, ‘అరె ఇదేంటి ఈరోజు ఇలా, ఛ ఒక్కసారే గాలి రావడంతో ఎంత పని జరిగింది. తొందరగా వెళ్లకపోతే ఆ కాగితం అక్కడినుండి ఇంకెక్కడికైనా ఎగిరిపోయే ప్రమాదం లేకపోలేదు’ అని తెగ కంగారు పడిపోతూ బయటికి నడిచాడు. కిటికీ బయట పడిన పేపర్‌ని జాగ్రత్తగా చేతిలోకి తీసుకుని, లోనికి వచ్చి అన్నీ వరస పెట్టి లెక్కపెట్టాడు, ఒక కాగితం తక్కువుండడంతో మళ్ళీ గుండె గుభేలుమంది. వెంటనే అటూ ఇటూ చూస్తూ, నేల మీద, తర్వాత కిటికీ లోంచి మరో సారి బయటికి చూశాడు. సంతృప్తి లేకపోవడంతో బయటికి వెళ్ళి కిటికీ లోంచి చూస్తూ ‘బయటపడి ఎటన్నా ఎగిరిపోయిందా ఖర్మ’ అనుకుంటూ మళ్ళీ తన గదిలోకి వచ్చేసాడు. ఏదో తట్టినట్టు ఒక్కసారి కొంచెం వంగి మంచం కింద జాగ్రత్తగా వెతికాడు. అక్కడా ఆ కాగితం లేదు.

నిరాశగా మంచం మీద కూర్చుని ‘పొద్దున నా భార్య చిలక్కి చెప్పినట్టు చెప్పింది, ఈ కాలంలో కూడా ఇంకా కథలు పోస్ట్ చేయడం ఎందుకూ, ఎంచక్కా ఒక మంచి ల్యాప్‌టాప్ కొనుక్కోండి, చక్కగా అందులోనే వ్రాసుకుని, అందులోంచే ఈమెయిల్ చేసేయవచ్చు అంది. కానీ నేనే ఇంకా పాత వాసనలు వదులుకోలేక, వద్దు, చేత్తో పేపర్ మీదనే వ్రాస్తానూ, నాకదే అలవాటు అని ఆమెని నానా మాటలూ అని చిన్నబుచ్చాను. ఆమె ఎంత చెప్పినా వినలేదు, ఆమెతో అనవసరంగా వాదులాడాను,.ఇప్పుడు మళ్ళీ ఆ ఒక్క పేపర్ వ్రాయాలంటే ఏదోలా ఉంది. సమయం కూడా వృథా అవుతుంది. ఈరోజు ఇదైంది, రేపు మరోటి కావొచ్చు. కనుక ఇక ఇలా లాభం లేదు, ఇప్పటికైనా నాలో మార్పు రావాల్సిందే, ల్యాప్‌టాప్ కొనేసి, నా భార్యకి చూపించి సర్‌ప్రైస్ చేస్తాను’ అనుకున్నాడు మనసులో. అనుకున్నదే తడవుగా, తన స్కూటర్ తాళాలు తీసుకుని, “లక్ష్మి, ఇక్కడికే వెళ్లొస్తానూ” అని వెళ్ళి, ల్యాప్‌టాప్ బ్యాగ్‌తో తిరిగి వచ్చాడు. తన రూమ్ లోకి వెళ్ళిపోయి, ‘ఇక ఈ పేపర్లు పోతాయనే భయం లేదు, నా కథ పోస్ట్ చేయడానికి గాను పోస్ట్ ఆఫీసుకి వెళ్ళమని మా ఆవిడని బ్రతిమాలక్కరలేదు’ అనుకున్నాడు మనసులో.

ఇంతలో లక్ష్మి వచ్చి కాఫీ ఇచ్చి, “ఏవండీ బోలెడు పేపర్లు వృథా చేస్తున్నారు. అలానే వాటిని పోస్ట్ చేయడానికి నన్ను పోస్ట్ ఆఫీసుకి వెళ్ళి రమ్మంటున్నారు. ఒక్క ల్యాప్‌టాప్ కొనుక్కుంటే పోతుంది కదా అని పొద్దున మీతో అంటే వినలేదు. పైగా నన్ను నానా మాటలూ అన్నారు. అందుకనే నాకు కోపం వచ్చింది. ఆ కోపంలో, ఇందాక మీరు చూడకుండా కిటికీలోంచి వచ్చి పడిన ఒక పేపర్‌ని, మీరు చూడకుండా నేనే తీసేసాను. మళ్ళీ పాపం అనిపించి ఇప్పుడు ఇచ్చేస్తున్నాను” అని చెప్పి, ఇందాక ఆమె తీసి దాచేసిన పేపర్ ఇచ్చి వెళ్లిపోయింది.

ఏవనాలో తెలియక తెల్ల మొహం వేశాడు మధు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here